[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]
మురిపాల కడలి
క్షీరోదన్వత్ప్రదేశే శుచిమణివిలసత్సైకతేర్మౌక్తికానాం
మాలాకౢప్తాసనస్థః స్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగః।
శుభ్రైరభ్రైరదభ్రైరుపరివిరచితైర్ముక్తపీయూష వర్షైః
ఆనందీ నః పునీయాదరినలినగదా శఙ్ఖపాణిర్ముకుందః॥
పాలకడలిలో శంఖ చక్ర గదా పద్మములు ధరించిన వాడు.
ఈ మాట మనకు మామూలుగా తెలిసిన విషయం. కానీ, ఇక్కడ మనకు ఒక సంపూర్ణ స్వరూపం ఆవిష్కృతం చేస్తుందీ శ్లోకం. చుట్టుప్రక్కలున్న వాతావరణాన్ని, ఆ యా ఆయుధాలు ఎలా ఉన్నాయి? ఎలా ప్రకాశిస్తున్నాయి, ఎలాంటి రంగులలో శోభిస్తున్నాయి? ఏవి వేటితో చేయబడి ఉన్నాయి? లేదా మనకు అలా తోచేలా చేయబడ్డాయి? ఇలా.. ప్రతి అంశాన్నీ కళ్ళకు కట్టినట్లు వివరణ ఉంది. అందువల్ల, వీలైనంతగా ఆ విశ్వశక్తిని మనం మూర్తీకరణ చేసుకుని మనోఫలకంపై మీద నిలుపుకునేందుకు సహకరిస్తున్నాయి ఇందులోని అక్షరాలు. అవి అక్షరమై మన శ్రద్ధావికాసాలు తరుగకండా ఉండేందుకు సహకరిస్తాయి.
క్షీరసాగరం. అదే పాల సముద్రం. స్వచ్ఛమైన తెల్లని తెలుపు. సత్వగుణానికి చిహ్నం. బలసంవృద్ధికి సూచిక.
ఆ క్షీర సాగరతీరం. తెల్లటి స్వచ్ఛమైన ఇసుక. అక్కడ ఏ పాదముద్రలు ఉండవు. ఏ రకమైన నాచు ఉండదు. పట్టుకుంటే జారిపోయేంతటి సన్నని రజను లాంటి ఇసుక. కానీ, ఈ ఇసుక మీదకు అక్కడ వారెవరి ధ్యాసా వెళ్ళదు. అందరి దృష్టీ ఆ విశ్వశక్తి స్వరూపం లేదా అస్వరూపం మీదే. సగుణ సాకార/నిర్గుణ నిరాకార.
అత్యంత ప్రకాశవంతమైన రత్నాల్ని ఆ ఇసుక తిన్నెల మీద, ఆ స్వచ్ఛమైన తెల్లటి ఇసుకు కిందా, అక్కడక్కడా వెదజల్లినట్లుగా ఉన్నాయి. స్వచ్ఛమైన మనసున్న పాపాయి ఎవరన్నా ఆడుకునేందుకు, ఆ రత్నాలను ఏరుకుని మరల కొంత సేపటికి అక్కడే తిరిగి వదిలేసి తన గూడుకు చేరేందుకు అనువుగా ఉన్నాయవి. ఆ గూడే వైకుణ్ఠధామం. శాన్తవనం. ప్రశాన్తజీవనం.
అక్కడ క్షీరసాగరం నుంచీ వచ్చిన ముత్యాలతో చేయబడిన హారాలతో సింగారింపబడిన ఉచితాసనమందు శుద్ధస్ఫటికవర్ణ కాంతులీనుతున్న ముత్యముల వంటి అవయవ సంపద కల్గి తెల్లటి మేఘములు కురిపించే అమృతధారలవంటి వర్ణము కలిగిన శఙ్ఖచక్రగదా పద్మములను ధరించిన ముకుందుడు మమ్ము పవిత్రులను చేయుగాక!
ఎవరా ముకుందుడు?
ముకుం దదాతి ఇది ముకున్దః. ముకుందుడు. ముకుమ్ అంటే మోక్షము అని అర్థము, దదాతి అంటే ఇచ్చచున్నాడు. మోక్షమిచ్చువాడు అని అర్థము.
మోక్షం పొందాలంటే మనం అంత స్వచ్ఛతను పొందాలి. పాపాలే కాదు, పుణ్యాలు కూడా నశించాలి. అది కేవలం ఈ క్షీరోదన్వత్.. ఆ స్వరూపాన్ని ధరించగలిగిన వాడికే (ఆ శక్తికే) సాధ్యం.
Visualisation అని మనందరం వింటుంటాము. ఆ విజువలైజేషన్ అనే ప్రక్రియకు పతాకస్థాయి ఉదాహరణలు ఈ శ్లోకాలు. శ్రద్ధగా చదివితే ఆ వైకుణ్ఠ ధామానికి మనసు అలా వెళ్ళి వస్తుంది. కళ్ళముందు ఆ దృశ్యం అలా కనిపిస్తింది. అది ఒక పట్టాన చెదిరి పోదు.
అలాంటి శ్లోకమే పరాశర భట్టర్ కూడా ఆనతిచ్చి ఆయన ధన్యులై మనలను కూడా ధన్యులను చేశారు. పైగా పద పొందిక కూడా ఇంతే రమ్యంగా ఉండటమే కాదు. ఇంతే శబ్ద సౌందర్యాన్ని చూపుతుంది.
సప్త ప్రకార మధ్యే సరసిజముకులోద్భాసమానే విమానే
కావేరీమధ్యదేశే మృదుతర ఫణిరాట్ భోగ పర్యఙ్కభాగే।
నిద్రాముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వవిన్యస్తహస్తమ్
పద్మధాత్రీ కరాభ్యాం పరిచితచరణం రఙ్గరాజం భజేహమ్॥
శ్రీరఙ్గనాథుడు. ఆయన చరణాలను మనం ఆశ్రయిస్తున్నాం. ఆయన ఎక్కడ ఉన్నాడు? సప్తప్రాకారాల మధ్య ఉన్నాడు. అవి ఎక్కడ ఉన్నాయి? కావేరీ నది మధ్యభాగాన ఒక చిన్న ద్వీపంలో. ఆ ప్రాకారాల మీద ఉన్న గోపురాలు/విమానం (శ్రీరంగ విమానం) సరసిజములైన, ముకులితమైన పద్మాల రూపంలో (విచ్చుకోని తామరలు) ఉన్నాయి.
అక్కడ ఆ స్వామి అత్యంత మృదువైన పాన్పు మీద శయన భంగిమలో ఉన్నాడు. అంత మృదువైన ఆ పాన్పు ఎవరయ్యా అంటే కాల స్వరూపుడైన ఆదిశేషుడు. ఆయన కుడి చేయి ఆయన శిరస్సు క్రింద ఒక ఆధారంలా, ఎడమ చేయి ఆయన పాదయపద్మాలను ఆశ్రయించమని మనకు సూచిస్తూ ఉన్నాయి. ఆయన ఒక చేతిలో పద్మం ఉంది. లేదా.. ఆయన పాదములనాశ్రయించమని సూచిస్తున్న హస్తం పద్మం వలె ఎర్రగా ఆరోగ్యవంతంగా కనిపిస్తోంది.
ఈ వివరాలు మొత్తాన్నీ, కళ్ళకు కట్టినట్లు మనకు వివరిస్తారు భట్టరు గారు. అలాంటి స్వామిని మన మనోసీమలో సాక్షాత్కరింపజేసుకుని, మన భక్తితో పట్టి ఉంచాలి.
ఆయన ఇంకా ఎలా ఉన్నాడు అని శ్రీ రఙ్గనాథ స్తోత్రంలో భట్టర్ వివరించారు. ఆ కావేరీ మధ్యదేశంలో ఉన్న ఆ శ్రీరంగం సాక్షాత్ వైకుణ్ఠానికి ఈ భూమి మీద ఒక నమూనా (replica) లాగా ఉంటుంది.
కస్తూరీ కలితోర్థ్వపుణ్డ్ర తిలకం కర్ణాన్తలోలేక్షణమ్
ముగ్ధస్మేర మనోహరాధరదలమ్ ముక్తాకిరీటోజ్జ్వలమ్।
పశ్యన్మానస పశ్యతోహరరుచః పర్యాయపఙ్కేరుహమ్
శ్రీరఙ్గాధిపతేః కదా ను వదనం సేవేయ భూయోఽప్యహమ్॥
ఆయన స్వరూప వైలక్షణాన్ని, అనన్త సౌన్దర్యాన్ని, ఆయన భోగాన్ని, దానికి తగిన విధంగా ఆయన ఉండే/నడుచుకునే లక్షణాన్ని, వాటి ఆన్తర్యాన్ని.. వీటన్నిటినీ వివరించే శ్లోకం. వ్యాస మహర్షి అందించిన శ్లోకము యొక్క స్థాయికి ఏ విధంగానూ తీసిపోదు.
ధ్యానంలో మరో శ్లోకం.
భూః పాదౌ యస్య నాభిర్వియదసురనిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే
కర్ణావాశాః శిరో ద్యౌర్ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధిః।
అంతఃస్థం యస్య విశ్వం సురనరఖగగోభోగిగంధర్వదైత్యైః
చిత్రం రంరమ్యతే తం త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి॥
దీని గురించి సందర్భం వచ్చినప్పుడు చూద్దాము. చాలా అద్భుతమైన అక్షర సంపదే కాదు. ఎన్నో విశేషాలను అందిస్తుందా శ్లోకం.
చాలా సందర్భాలలో చాలామంది చెప్తుంటారు. ఈ పాట వింటే మనసంతా తేలికగా అవుతుంది. సంతోషం కలుగుతుంది. ఒకరకమైన చైతన్యం వస్తుంది. హాయిగా అనిపిస్తుంది అని. దానికోసం ఆ పాట అర్థం కానవసరం లేదు. భాష వచ్చి ఉండనవసరం లేదు. క్రమంగా అలా ఆ పాటనో గేయాన్నో మన భాషాసంస్కృతులకు చెందనిది అయినా దాన్ని మనం తెలియకుండానే స్వంతం చేసుకుంటాము.
కానీ, సంస్కృత భాషలో ఒక విశేషం ఉంది. మనకంటే (భారతీయులకు) సంస్కృతం మొదటి నుంచీ ఏదోక విధంగా వాడుకలోనే ఉంది. అసలు ఆ భాష ఉంది అని తెలియని వ్యక్తికి ఆ భాషలో శ్లోకాలను వినిపిస్తే, ఆ పద సౌందర్యానికి కట్టుబడతాడు. వినగా వినగా తనకు తెలియకుండానే ఆ భాషలోని భావాన్ని, ఆ పదాలకర్థాన్ని గ్రహించగలుగుతాడు.
ఈ లక్షణం మిగిలిన భాషలకు ఉండవచ్చు కానీ, సంస్కృతమంత ఎక్కువస్థాయిలో కాదు. అది మంచో చెడో మనం గ్రహించేంత ఆ భాషలో ఆ సందర్భంలో వాడిన పదాలను లేదా శబ్దాలను బట్టీ మనం పట్టుకోలేము.
చిన్న ఉదాహరణ.
The Ketchup Song – Aserejé అని మొదలయ్యే ఈ పాటను చాలామంది ఒక meaningless gibberish entertainment కింద కొట్టేస్తారు. సరదాగా విని ఊరుకునే పాటగా చూస్తారు.
ఇది 2002లో పెను సంచలనం సృష్టించిన స్పానిష్ పాప్ సాంగ్. లాస్ కెచప్ అనే పాప్ గ్రూప్ వారి మొదటి స్టూడియో ఆల్బమ్, Hijas del Tomate, లో ప్రఖ్యాత సింగిల్. హైహస్ డెల్ టొమటే అంటే daughters of tomato అని.
ఈ పాట వింటున్నప్పుడు బాగా హషారుగా అనిపించినా, దీన్ని పదే పదే వినేవారిని దురదృష్టం వెంటాడుతుందని ఒక రూమర్ వచ్చింది. ఆ రూమర్‌లో నిజానిజాలు నమ్మే వారిని బట్టీ ఉన్నా, ఇక్కడ ప్రధానంగా ఆ పాటను వ్యతిరకించేవారు అనే మాట ఏంటంటే అందులో కొన్ని పదాలు సాతానును ప్రేరేపించేవిగా ఉన్నాయని. ఆ విషయాన్ని గ్రహించగలిగేవారు గ్రహించినా, మిగిలిన వారికి అది తెలియదు. ఏదో అమాయకమైన సరదా పాట అనే అనుకుంటారు.
అదే ఒక సంస్కృత శ్లోకాన్నో, స్తోత్రాన్నో, మన్త్రాన్నో వినగా వినగా దానిలో ఉన్న దైవత్వాన్ని క్రమంగా తెలుసుకోగలుగుతారు. లేదా ఆ పదాలలో లేదా అక్షర సమూహంలో ఉన్న హాయినైనా పట్టుకోగలరు.
॥ఓమ్॥
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం।
లక్ష్మీకాంతం కమలనయనం యోగిభిర్ధ్యానగమ్యం
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం॥
ఇందులో ఉన్న పాఠాన్తరాన్ని గురించి చర్చించాల్సిన సందర్భం వేరే ఉంది కనుక ఇక్కడికి ధ్యానం ముగిసింది. ఇక సహస్రనామముల గురించి తెలుసుకుందాము.
హరిః ఓమ్!
(సశేషం)