Site icon Sanchika

తల్లివి నీవే తండ్రివి నీవే!-14

[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]

నారాయణనే నమక్కే

మహాభారతంలో అత్యంత కీలక ఘట్టమని అందరూ భ్రమసే యద్ధఘట్టం ముగిసింది. తదనంతర పరిణామాలు అన్నీ ముగిశాయి. కర్మకాణ్డలు, ఇతర కార్యక్రమాలు సక్రమంగా నిర్వహింపబడ్డాయి పాండవులు, శ్రీకృష్ణ భగవానుని ఆధ్వర్యంలో.

పాండుకుమారులు ధృతరాష్ట్ర గాంధారిలను తమతో తీసుకుని వెళ్ళారు. ధృతరాష్ట్రుని కౌగిలి నుంచీ భీముడు తప్పించుకున్నాడు కన్నయ్య అనుగ్రహ ప్రసాదంగా. ఆపైన వాసుదేవుడు గాంధారీ దేవి శాపాన్ని సహించాడు. ఆమె పాతివ్రత్యమే ఆమెకాశక్తినిచ్చిందని భగవానువాచ.

ఈ విషయాలన్నీ భీష్మునికి తెలుస్తూనే ఉన్నాయి. అన్నీ సహించగలిగాడు కానీ, రెండు విషయాలు గాంగేయునికి జీవితాన్ని ముగించాలని కోరిక బలపడేలా చేశాయి.

దాదాపు నూట అరవై సంవత్సరాల క్రితం జరిగిన ఆణ్డాళ్-భగవల్లీల సమయంలో వచ్చిన సూచన ప్రకారం తాను ఉత్తరాయణం వచ్చేదాకా ఆగాలి. అది శిక్షా లేక వరమా అన్నది ఇప్పటికీ తనకు అర్థం కాని విషయమే. కానీ, భీముని ధృతరాష్ట్రుడు చంపాలనుకోవటం భీష్ముని తీవ్రంగా కలచివేసింది. అది ఆయనను మరింత కుంగదీసింది. ఇక గాంధారి శ్రీకృష్ణుని శపించటం అనేది ఊహకందేదే కానీ, సహించరాని ఘట్టం.

కలియుగం, దాని లక్షణాలు/ప్రభావాలు గట్టిగా చొచ్చుకుని వచ్చేస్తున్నాయి. ధర్మం కోసం నిలబడ్డ స్వయం భగవానుడే, ఎంత ఆయన లీల అయినా, ఆయన సంకల్పం అయినా సరే.. ధర్మానికి నిలబడ్డవారికే ప్రథమ శిక్ష అని భావించాడు. 196 సంవత్సరాల పైబడిన జీవితంలో సంతోషాలకన్నా విషాదాలే ఎక్కువ. అయినా ఆ వాసుదేవుడిచ్చిన మానసిక శక్తి తనను నిలిచి ఉండేలా చేసింది. అంతుతెలియని వేదనకన్నా అంతం తెలిసిన ప్రయాణం కాస్త నయం. ఆ రకంగా వాసుదేవ కృష్ణభగవానుడు తనకు వరమిచ్చాడనే అనుకోవాలి.

కానీ, ఇక ఈ జీవితానికి స్వస్తి చెప్పాల్సిన సమయం వచ్చింది. ఆ క్షణమే సంకల్పించుకన్నాడు. మరి రాబోయే ఎనిమిది దినములలో తనకు తండ్రి ద్వారా లభించిన ఇచ్ఛామరణాన్ని వాడాలని. తెలియకుండా తల వాలింది. నిద్రాదేవి ఒడిలోకి తీసుకున్నది.

తన తల్లి గంగాదేవి కనిపించింది. ఏదో ఆలాపన. ఏవేవో చిత్రాలు కనుల ముందు కదలాడుతున్నాయి. ఏవేవో ఆలోచనలు. మంచీ చెడు. రెండూ ఉండకూడదు. జ్ఞాపకాల జాడలు.

జీవితమంతా కళ్ళ ముందు కదలాడింది. ద్రౌపది గుర్తుకు వచ్చింది. ఆమెకు జరిగిన అన్యాయం గుర్తుకు వచ్చింది. దానికి పడిన శిక్షే కదా దుర్యోధనాదులకు. ఒక మహాసాధ్విని నిండు సభలో పరాభవించిన విధానానికే కదా వారికి ఆ శిక్ష? ఇప్పటికీ తనకు గుర్తే. వికర్ణుడి ధర్మబద్ధమైన అభ్యంతరాన్ని గుర్తుంచుకున్న భీముడు అతనితో తలపడ్డప్పుడు తనతో తలపడవద్దని హెచ్చరిస్తాడు ప్రేమ పూర్వకంగా. యుద్ధ ధర్మాన్ని అనుసరించి వికర్ణుడు భీముని ఎదుర్కొంటాడు. వికర్ణుడిని నిహతుని చేశాక భీముడు అనుభవించిన వేదన తనకు తెలుసు.

అన్ని తెలిసీ ధృతరాష్ట్రుడు భీముని చంపబూనాడు. అన్ని తెలిసీ గాంధారి స్వయం భగవానుని వంశాన్ని అంతం కావాలని శపించింది. ఎంత అన్యాయం!! ఎంత అధర్మం!!!

ఇందుకు ఫలితం అనుభవించకుండా ఉంటారా?

ఆలోచనలు. మరిన్ని ఆలోచనలు. ఇంతలో ద్రౌపది ఆక్రందన. తాతా మీరైనా చెప్పండి. ద్వాపరంలోనే ఇన్ని ఘోరాలు జరుగుతుంటే.. ఇక కలియుగంలో?

ఆలోచింటానికే వెన్ను జలదరించింది. కృష్ణా! వాసుదేవా! జనార్దనా! అంటూ మేల్కొన్నాడు ఒక్కసారిగా. శస్త్రాలలో ఇరుక్కున్న శరీరం బాధతో విలవిలలాడింది. ఒక్కసారిగా కాలంలో వెనక్కు వెళ్ళాడు.

ఏదో గానం వినిపిస్తోంది.

అద్భుతమైన గానం. తన జీవితంలో వేరెప్పుడూ విననంత మధుర స్వరం. వేకువఝాము కావచ్చిందని గ్రహించాడు భీష్మ పితామహుడు. నూట అరవై సంవత్సరాల క్రిందటి శాంతనవుడు అడవిలో శబ్దభేది ప్రయోగింపబూనుతున్నాడు.

అప్పుడు పలికింది అంపశయ్య మీద ఉన్న భీష్ముని నోట..

నారాయణనే నమక్కే!

ఆ గానంలో వింటున్న అక్షరాలను ఙ్ఞప్తికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

మార్గళి త్తిఙ్గళ్ మది నిఱైన్ద నన్నాళాల్
నీరాడ ప్పోదువీర్, పోదుమినో నేరిழைయీర్
శీర్ మల్గుమ్ ఆయ్ ప్పాడి శెల్వచ్చిరు మీర్ కాళ్
కూర్వేల్ కొழுన్దొళిలన్ నన్దగోపన్ కుమరన్
ఏరార్ న్ద కణ్ణి యశోదై యిళంశింగమ్
కార్మేనిచ్చఙ్గణ్ కదిర్మదియం బోల్ ముగత్తాన్
నారాయణనే నమక్కే పఱైతరువాన్
పారోర్ పుగళప్పడిన్దేలో రెమ్బావాయ్
నారాయణనే నమక్కే పఱైతరువాన్

పెద్దగా అన్నాడు. ఆ శ్యమన్త పఞ్చకంలో.

“నామ స్మరణ,” అని సమాధానం వచ్చింది. ఆ స్వరాలను గుర్తించాడు. గానం ఆణ్డాళ్ ట! భూదేవి అంశ ట! భవిష్యత్ లో ఇంకొక నూరు సంవత్సరాల తరువాత కథ ట! ఆమెది. అయోనిజ ట! తులసి వనంలో దొరుకుతుంద ట!

ఆఙ్ఞ నారాయణుడైన శ్రీకృష్ణడిదే! ఆనాడు తన నోటిలో పలుకబడబోయి ఆగిన స్తోత్రం!

చుట్టూ చూశాడు. ఆకసంలో నక్షత్రాలు. చుట్టూ యుద్ధ భూమి. మధ్యలో ఎన్నో లోకాలు. తన మీదా తన చుట్టూ ఎన్నో జీవులు. జీవరాశులు. చరాచర జగత్! గోచరాచర జగత్!

అతి కష్టం మీద బాణాలతో నిండిన చేతులు జోడించి నారాయణుని స్మరంచి, ఆణ్డాళ్ కు ఆరోజు చెప్పని క్షమాపణ చెప్పుకుని, పలికినాడు శాన్తనవుడు..

విశ్వమ్!!

బదులుగా వినవచ్చింది సమాధానం.

“ఎనిమిది దినములు గాంగేయా! ఇప్పుడే కాదు. ఈ లోగా విశ్వానికే కట్టుబడు.”

కట్టుబడ్డాడు.

విశ్వమ్!
విశ్వమ్!
విశ్వమ్!
విశ్వమ్!
విశ్వమ్!
విశ్వమ్!
విశ్వమ్!
విశ్వమ్!

నామస్మరణ తనను సాంత్వన పరచింది. మనసు పరిశుభ్రమైనది.

ఈ నామాన్ని తొల్దొలుత దర్శించిన చతుర్ముఖ బ్రహ్మ గారి పెదవుల మీద ఒక చిన్న చిర్నగవు. సరస్వతీ దేవి కళ్ళలో కుతూహలం. ధ్యానంలో ఉన్న శివుడు కళ్ళు తెరచాడు. పార్వతి జాగరూకమైనది. ఋషి గణాలలో ఆతృత మొదలైంది. ఎప్పుడెప్పుడా ఆ క్షణాలని.

నామ స్మరణ గొప్పతనం తెలసిన అన్నమాచార్యులు నాలుగు సహస్రాబ్దుల తరువాత ఇలా గానం చేశాడు.

అన్నిటికి నిదె పరమౌషధము
వెన్నుని నామము విమలౌషధము // పల్లవి //
చిత్త శాంతికిని శ్రీపతి నామమె
హత్తిన నిజ దివ్యౌషధము
మొత్తపు బంధ విమోచనంబునకు
చిత్తజ గురుడే సిద్ధౌషధము // అన్నిటికి //
పరిపరి విధముల భవరోగములకు
హరి పాద జలమె యౌషధము
దురిత కర్మముల దొలగించుటకును
మురహరు పూజే ముఖ్యౌషధము // అన్నిటికి //
ఇల నిహ పరముల నిందిరా విభుని
నలరి భజింపుటె యౌషధము
కలిగిన శ్రీ వేంకటపతి శరణమె
నిలిచిన మాకిది నిత్యౌషధము // అన్నిటికి //

మహాభారతంలో 18 పర్వాలు ఉన్నాయి. కథ భీష్మునిది. కథానాయకుడు వాసుదేవ కృష్ణుడు. కథనం నడిచేది దాయాదుల తగవుగా కౌరవ పాండవుల గురించి. ఆ కథ ముగిసింది.

కానీ అసలైన మహాభారతం మొదలయ్యేది ఇక్కడే. శాంత్యనుశాసనిక పర్వాలు. మహాభారత సారం.

ఎనిమిది రోజులు గడిచాయి. శ్రీకృష్ణ భగవానుడు తన కాంక్ష తీర్చే క్షణం రానే వచ్చింది. సప్తర్షులు సహా మహామహర్షి గణం అరుదెంచింది. దేవతా గణాలు ఆకసం నుంచీ ఎదురు చూస్తున్నాయి అసలైన క్షణం కోసం. ఆదిదంపదులు కైలాసం నుంచీ చెవులు రిక్కించారు.

సాక్షాత్ పరమేశ్వరుడు, స్వయం భగవానుడైన అయిన శ్రీకృష్ణుని ఆగమనం. స్వామిని కాంచిన కనులే కనులు భీష్మునికి.

స్తుతించాడు.

ఇతి మతిరుపకల్పితా వితృష్ణా
భగవతి సాత్వతపుంగవే విభూమ్ని।
స్వసుఖముపగతే క్వచిద్విహర్తుం
ప్రకృతిముపేయుషి యద్భవప్రవాహః ॥ 1 ॥
త్రిభువనకమనం తమాలవర్ణం
రవికరగౌరవరాంబరం దధానే।
వపురలకకులావృతాననాబ్జం
విజయసఖే రతిరస్తు మేఽనవద్యా ॥ 2 ॥
యుధి తురగరజోవిధూమ్రవిష్వక్
కచలులితశ్రమవార్యలంకృతాస్యే।
మమ నిశితశరైర్విభిద్యమాన
త్వచి విలసత్కవచేఽస్తు కృష్ణ ఆత్మా ॥ 3 ॥
సపది సఖివచో నిశమ్య మధ్యే
నిజపరయోర్బలయో రథం నివేశ్య।
స్థితవతి పరసైనికాయురక్ష్ణా
హృతవతి పార్థసఖే రతిర్మమాస్తు ॥ 4 ॥
వ్యవహిత పృథనాముఖం నిరీక్ష్య
స్వజనవధాద్విముఖస్య దోషబుద్ధ్యా।
కుమతిమహరదాత్మవిద్యయా య-
-శ్చరణరతిః పరమస్య తస్య మేఽస్తు ॥ 5 ॥
స్వనిగమమపహాయ మత్ప్రతిజ్ఞాం
ఋతమధికర్తుమవప్లుతో రథస్థః।
ధృతరథచరణోఽభ్యయాచ్చలద్గుః
హరిరివ హంతుమిభం గతోత్తరీయః ॥ 6 ॥
శితవిశిఖహతో విశీర్ణదంశః
క్షతజపరిప్లుత ఆతతాయినో మే।
ప్రసభమభిససార మద్వధార్థం
స భవతు మే భగవాన్ గతిర్ముకుందః ॥ 7 ॥
విజయరథకుటుంబ ఆత్తతోత్రే
ధృతహయరశ్మిని తచ్ఛ్రియేక్షణీయే।
భగవతి రతిరస్తు మే ముమూర్షోః
యమిహ నిరీక్ష్య హతాః గతాః సరూపమ్ ॥ 8 ॥
లలిత గతి విలాస వల్గుహాస
ప్రణయ నిరీక్షణ కల్పితోరుమానాః।
కృతమనుకృతవత్య ఉన్మదాంధాః
ప్రకృతిమగన్ కిల యస్య గోపవధ్వః ॥ 9 ॥
మునిగణనృపవర్యసంకులేఽన్తః
సదసి యుధిష్ఠిరరాజసూయ ఏషామ్।
అర్హణముపపేద ఈక్షణీయో
మమ దృశిగోచర ఏష ఆవిరాత్మా ॥ 10 ॥
తమిమమహమజం శరీరభాజాం
హృది హృది ధిష్టితమాత్మకల్పితానామ్।
ప్రతిదృశమివ నైకధాఽర్కమేకం
సమధిగతోఽస్మి విధూతభేదమోహః ॥ 11 ॥

శ్రీమద్భాగవతంలోని ప్రథమ స్కంధంలో 9వ అధ్యాయం 32వ శ్లోకం నుంచీ ప్రారంభమై, 42వ శ్లోకం వరకూ ఉంటుంది. 11 అత్యద్భుతమైన భక్తి, వైరాగ్య భావనలు కలిగించే శ్లోకాలు. చిక్కటి వేదాన్తం. దీని అర్థ తాత్పర్యాలు సమయానుసారం ముందు ముందు చూద్దాం.

ఈ స్తోత్రం తరువాత భీష్ముడు ధర్మజునికి అనేక బోధలు చేస్తాడు. వాటిసారమే వేదవ్యాసుని భారత రచనకు పునాదులు. ఆ బోధ కోసమే ఈ మహాభారతం. ఆ పైన జరిగే కథంతా మహాభారతానికి అనుబంధ కథ అనుకోవాలి. Appendix.

అర్జునుడి సఖుడు, తమాలవర్ణంలో నిగినిగలాడే ఆరోగ్యకరమైన దేహంలో ఈ భూమి మీద ఉన్న జీవులను ఉద్ధరించేందుకు వచ్చిన వాడు, ముల్లోకాలనూ తన రూపంతోను, చాతుర్యంతోను ఆకర్షించేవాడు, మెరుస్తున్న పసుపు వర్ణం దుస్తులు ధరించిన వాడు, పద్మం వంటి ముఖారవిందం ఉన్నవాడు, శరీరానికి గంధం పూసుకుని ఉన్నవాడు,

ఈతని పైన నా దృష్టి నిలుచుగాక. దీనినే భక్త పోతన ఈ విధంగా తెలుగులో అంతే అందంగా అందించారు.

మ.
త్రిజగన్మోహన నీలకాంతిఁ దను వుద్దీపింపఁ, బ్రాభాత నీ
రజబంధుప్రభమైన చేలము పయిన్ రంజిల్ల, నీలాలక
వ్రజ సంయుక్త ముఖారవింద మతిసేవ్యంబై విజృంభింప, మా
విజయుం జేరెడు వన్నెలాఁడు మది నావేశించు నెల్లప్పుడున్.

పద విభజన, ప్రతిపదార్థము-

త్రి = మూడు;
జగత్ = లోకములను;
మోహన = మోహింప చేయగల;
నీల = నీలమైన;
కాంతిన్ = కాంతితో;
తనువు = శరీరము;
ఉద్దీపింపన్ = బాగా ప్రకాశిస్తుండగ;
ప్రాభాత = ఉదయ కాలపు;
నీరజ = పద్మములకు;
బంధు = బంధువు, సూర్యుని;
ప్రభము = కాంతి కలది;
ఐన = అయిన;
చేలము = వస్త్రము;
పయిన్ = పైన;
రంజిల్లన్ = ఎఱ్ఱగా ప్రకాశిస్తుండగ;
నీల = నల్లని;
అలక = ముంగురుల యొక్క;
వ్రజ = సమూహముతో;
సంయుక్త = కూడిన;
ముఖ = ముఖము అనే;
అరవిందము = పద్మము;
అతి = మిక్కిలి;
సేవ్యంబు = సేవింపదగినది;
ఐ = అయి;
విజృంభింపన్ = చెలరేగుతూ;
మా = మా యొక్క;
విజయున్ = అర్జునుని;
చేరెడు = చేరి యుండు;
వన్నెలాఁడు = విలాసవంతుడు;
మదిన్ = మనస్సును;
ఆవేశించున్ = ప్రవేశించును గాక;
ఎల్లప్పుడున్ = ఎల్లప్పుడూ.

తాత్పర్యమిప్పుడు అవగతమే!

అయినా భీష్మునికి ముక్తి కలిగే సమయం రాలేదు. ఎందుకు?

యుధి తురగరజోవిధూమ్రవిష్వక్
కచలులితశ్రమవార్యలంకృతాస్యే।
మమ నిశితశరైర్విభిద్యమాన
త్వచి విలసత్కవచేఽస్తు కృష్ణ ఆత్మా

అని పలికిన పలుకులు భీష్ముని ఇంకా ఈ భూమికే కట్టుబడేలా చేశాయి. కారణం?

యుద్ధంలో రథం నడుపుతున్నప్పుడు రేగిన దుమ్ము అంటిన ముంగురులు చెమట పట్టిన నుదుటన అతుక్కుని బూడిద వర్ణంలో శోభిస్తున్నాయి. కానీ వీటన్నిటినీ మరింత శోభ కలిగిస్తున్నది మాత్రం యుద్ధ సమయంలో నేను వేసిన బాణాలు తగిలి అయిన గాయాలు. వీటన్నిటినీ ఆస్వాదించి ఆనందిస్తున్న శ్రీకృష్ణుడు నన్ను రక్షించుకాక!

మమకారం వదిలినట్లుంది కలియుగం ప్రభావం తెలిసి. అందుకే ధృతరాష్ట్రుడు, గాంధారి చేసిన పనులకు శిక్ష పడాలని అనుకున్న క్షణాన. కానీ అహంకారం పూర్తిగా వదలలేదు. ద్వైత భావన. నేను వేసిన బాణాలు.

అద్వైత స్థితికి చేరాలి. అప్పుడే కైవల్యం.

రెండు శివ సహస్రనామాలు చెప్పాడు. యుధిష్ఠిరునికి చేసిన ఉపదేశాలలో ఉన్న సారం తాను కూడా గ్రహించటం ద్వారా దానినీ విడిచాడు. చివరికి ధర్మరాజు అడిగిన ప్రశ్నకు సౌలభ్యానికి పరాకాష్ట, ముక్తికి సులభోపాయం అయిన నామ స్మరణను గురించి సమాధానమిస్తూ భూజనులకు చేసిన సేవ శ్రీవిష్ణు సహస్రనామం రూపంలో శోభిల్లింది. అదే ఆయనకు ముక్తిని ప్రసాదించింది. అద్వైత విశిష్టాద్వైత తత్వం అప్పటికి భీష్ముని వంటబట్టింది.

ఇక పలికించాడు దేవకీనన్దనుడు, వాసుదేవుడు, యశోద ముద్దుబిడ్డడు, నన్దనన్నదనుడు, నరసఖుడైన నారాయణుడు.

నారాయణనే నమక్కే!

విశ్వమ్!
విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః।
భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః ॥ 1 ॥

శ్రీవిష్ణు సహస్రనామం వి తో మొదలౌతుంది.

వ కారం అమృత బీజం.

భీష్ముడు వసువు. ముక్కోటి దేవతలలో ఒకడు. కోటి అనగా గణము. అంటే మూడు గణాలుగా ఉన్న దేవతలు – ద్వాదశాదిత్యులు – ఏకాదశ రుద్రులు, అష్ట వసువులు. చివరగా అశ్వినీ దేవతలు. 33. కనుక అమృత బీజంతో శుద్ధి అయ్యేలా చేశాడు విశ్వమనే నామ స్మరణ ద్వారా భగవానుడు. వసువుగా చేయవలసిన పనులు ముగిశాక మోక్షం.

ఇకారం శక్తి బీజం. తక్కిన స్తోత్రం లోని సహస్ర నామాలు దర్శించటానికి కావలసిన శక్తిని ఇచ్చేందుకు.

ఇలా వి తో మొదలైన శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రం లో రెండవ ప్రథమాక్షరం భూ.

॥భూః॥

ఈ విధంగా తన విభూతిని ప్రదర్శించాడు శ్రీమహావిష్ణువు.

ఇక మనం సహస్రనామములలో ప్రవేశించాము.

(సశేషం)

Exit mobile version