[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]
తద్భవ
జితం జితం తేఽజిత యజ్ఞభావనా
త్రయీం తనూం స్వాం పరిధున్వతే నమః।
యద్రోమగర్తేషు నిలిల్యురధ్వరాః
తస్మై నమః కారణసూకరాయ తే॥
శ్రీ వరాహ స్వామి గురించి శ్రీమద్భాగవతంలో తృతీయ స్కంధంలో 13వ అధ్యాయంలో ఉన్నది.
రక్షణ కొరకు వచ్చిన మొట్టమొదటి అవతారం ఈ వరాహావతారం. ఎవరిని రక్షించటానికి?
భూమిని. భూదేవిని. భూలోకం కర్మలోకం. వరాహావతార రహసం కర్మను బోధించటమే. ముందు ముందు తెలుస్తుంది.
In other words he’s the master of Space. And also a controller of time.
శ్రీవరాహమూర్తి, వరాహావతారము, వరాహ స్వామి. శ్రీమహావిష్ణువు మూడవ అవతారము.
విష్ణువు లోకపాలకుడు. సాధుపరిరక్షణ, దుష్టశిక్షణ కొఱకు ఆయన ఎన్నో అవతారాలలో ప్రతి యుగంలోనూ సంచరిస్తాడు భూమి మీద.
భగవద్గీతలో ఉన్నట్లు.. శ్రీకృష్ణ భగవానుడు హామీ ఇచ్చినట్లు
యదా యదా హి ధర్మస్య
గ్లానిర్భవతి భారత।
అభ్యుత్థానమధర్మస్య
తదాత్మానం సృజామ్యహమ్॥4.7॥
పరిత్రాణాయ సాధూనాం
వినాశాయ చ దుష్కృతామ్।
ధర్మసంస్థాపనార్థాయ
సంభవామి యుగే యుగే॥4.8॥
అలా అవతరించిన వాటిలో ఒకరి రక్షణ కొరకు అని మాత్రమే ప్రత్యేకంగా అవతరించిన స్వామి వరాహ స్వామి.
అలాంటి అవతారాలలో 21 ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారములు అంటారు. వాటిలో అతిముఖ్యమైన 10 అవతారాలను దశావతారాలు అంటారు. ఈ దశావతారాలలో మూడవ అవతారము వరాహావతారము. మహాలక్ష్మిని సంబోధించే ‘శ్రీ’ పదాన్ని చేర్చి శ్రీవరాహమూర్తి అని ఈ అవతార మూర్తిని స్మరిస్తారు. వరాహావతారం హిరణాక్షుడిని చంపి, భూమిని ఉద్ధరించి, వేదములను కాపాడిన అవతారము.
ఈ అవతారము కడు చిత్రముగా నారసింహ అవతారముతో సంబంధం కలిగి ఉంటాడు. శ్రీకృష్ణ అవతారంతో పాటూ, కలియుగంలో ప్రత్యక్ష నారాయణ స్వరూపమైన తిరుమల వాసి వేఙ్కటేశునితో పాటూ గోవిన్ద అనే పేరుతో స్మరింప, సంబోధింపబడతాడు.
ఆది వరాహ మూర్తి, యజ్ఞవరాహ మూర్తి, మహా సూకరం అని నామాలు కూడా ఉన్నాయి. తిరుమల కొండలపై మొదట వెలసిన స్వామి వీరే, వీరి అనుమతితోనే శ్రీనివాసుడు అక్కడ నివాసము ఏర్పాటు చేసుకున్నారు.
రాక్షసునితో భయంకరంగా యుద్ధం చేసి, చక్రాయుధంతో వానిని సంహరించి, భూమాతని జలముపై నిలిపిన స్వామి, వేదాలను రాక్షసుల బారినుండి రక్షించిన స్వామి ఈయనే. గో శబ్దానికి వేదము అని కూడా అర్థం ఉంది. కనుకనే ఆయన గోవిన్దుడు కూడా.
వసతి దశన శిఖరే ధరణీ తవ లగ్నా
శశిని కలంక కలేవ నిమగ్నా
కేశవ ధృత సూకర రూప
జయజగదీశ హరే!!
అంటే..
వరాహ అవతారం ఎత్తిన ఓ కేశవా!
నీ కోరల మీద నిలపబడియున్న ఈ భూగోళం
మచ్చలున్న చంద్రుని వలె ఉన్నది.
హిరణ్యాక్షుడిని సంహరించాక,
“ఈ విశ్వపు సృష్టి, స్థితి, లయ లందు వికారము నీవే, విశ్వము నీవే! నీ లీలలు అపారము. చర్మమున అఖిల వేదములు, రోమముల యందు బర్హిస్సులు, కన్నులలో అజ్యము, పాదముల యందు యజ్ఞ కర్మములు, తుండమున స్రువము, ముక్కులో ఇడాపాత్ర, ఉదరమున, చెవులలో జమసప్రాశిత్రములు, గొంతులో మూడు ఇష్టులు, నాలుకపై అగ్ని కలిగిన ఓ దేవా! వితత కరుణాసుధా తరంగితములైన నీ కటాక్షవీక్షణములతో మమ్ము కావవయ్యా..,” అని ప్రార్థించారు బ్రహ్మాది దేవతలు ఈ వరాహరూపుడిని.
వరాహస్వామి భూమిమీద సంచరించిన ప్రదేశమే నేటి తిరుమల. అదియే శ్రీ శైలము. నేడు మనకు ప్రసిద్ధముగా తెలసిన శ్రీశైలము వేరు. ఆ కథ వేరు. తిరుమల క్షేత్రం మొదట వరాహ క్షేత్రంగా ప్రసిద్ధి పొందినది. అయితే తిరుమలకొండపై ఉండేందుకు వేంకటేశ్వరస్వామికి అనుమతి నిచ్చినది వరాహస్వామే.
వరాహస్వామివి ప్రధానంగా మూడు రూపాలున్నాయి.
- ఆదివరాహ స్వామి
- ప్రళయవరాహ స్వామి
- యఙ్ఞ వరాహ స్వామి
ప్రళయవరాహస్వామిగా, యజ్ఞ వరాహస్వామిగా, ఈ మూడు రూపాలలో తిరుమలలో ఉన్నది ఆదివరాహస్వరూపము. వరాహస్వామి భూమిమీద సంచరించేటప్పుడు వృషభాసుడనే రాక్షసుడు తటస్థపడేసరికి వాడ్ని చంపి ఆ కోపంతో తిరిగేటప్పుడు అక్కడికి శ్రీనివాసుడు వస్తాడు. శ్రీనివాసుడే.. శ్రీ మహావిష్ణువని గ్రహిస్తాడు ఆదివరాహస్వామి. వరాహస్వామి రూపములో ఉన్నది శ్రీ మహావిష్ణువే అని శ్రీనివాసుడు తెలుసుకుంటాడు.
శ్రీమహావిష్ణువే రెండు రూపాలను ధరించి ముచ్చటించుకుంటుంటే ముక్కోటి దేవతలు మురిసిపోయారట. అదో అపురూప ఘట్టం.
అవిభక్తం విభక్తేషు అని గీతాచార్యడు అన్నట్లు రెండు శ్రీమహావిష్ణువు స్వరూపాలు కూడా ఒకటే అనే జ్ఞానం మనకు ఉండాలి. మరి ఒకటే అయినప్పుడు రెండుగా ఎందుకు కనిపిస్తున్నాయి?
అర్థ సంపూర్ణమ్!
అంటే ఎవరెవరి తత్వాన్ని బట్టీ పరమాత్మ ఆ యా రూపాలలో వ్యక్తమౌతుంటాడు. శ్రీనివాసుడూ ఆయనే. యఙ్ఞవరాహుడూ ఆయనే. ఇద్దరికీ అభిన్నత్వం కూడా ఆయనే. రెండు రూపాలలో మనకు అగుపించినా, ఆయన నివాసముంటున్న తిరుమల లేదా తిరుమలై లేదా శ్రీ (తిరు) మలై (శైలము) ఒకటే. ఇప్పటి ప్రఖ్యాత మల్లికార్జునుని శ్రీశైలము కూడా శేషాచల పర్వత శ్రేణులలోవే.
మొట్టమొదటగా కప్పమందుకున్నది కూడా వరాహ స్వామియే. శ్రీనివాసుని నుంచీ. అదే హవిస్సు. ఈయన యఙ్ఞ స్వరూపుడు కదా. అందుకే వషట్కారః!
వషట్కారః
యఙ్ఞో వై విష్ణుః అని తైత్తిరీయోపనిషత్ చెప్తుంది.
యఙ్ఞం విష్ణు స్వరూపం.
భగవద్గీత, 3వ అధ్యాయములో
యజ్ఞార్థాత్ కర్మణోఽన్యత్ర లోకోఽయం కర్మబంధనః।
తదర్థం కర్మ కౌంతేయ ముక్తసంగః సమాచర॥3.9॥
యజ్ఞ-అర్థాత్ — యజ్ఞం కోసం
కర్మణః — కర్మల కంటే
అన్యత్ర — వేరే
లోకః — ఈ భౌతిక ప్రపంచం
అయం — ఈ యొక్క
కర్మ-బంధనః — కర్మ బంధనము
తత్ — దాని
అర్థం — కోసం
కర్మ — కర్మలు (చర్యలు)
కౌంతేయ — కున్తీపుత్రుడైన ఓ అర్జునా!
ముక్త-సంగః — ఫలాసక్తి రహితంగా
సమాచర — సరిగ్గా చేయుము.
చేయవలసిన పనులని ఒక యజ్ఞం లాగా, భగవదర్పితంగా చేయాలి. లేదా, ఆ పనులు మనలను ఈ జగత్తులో కర్మబంధములలో కట్టివేస్తాయి. కాబట్టి, ఓ కుంతీ పుత్రుడా, నీకు నిర్దేశింపబడిన విధులను, వాటి ఫలితములపై ఆసక్తి లేకుండా, ఈశ్వర తృప్తి కోసం నిర్వర్తించుము.
అంటే ప్రతి జీవీ కర్తవ్య నిర్వహణను సక్రమంగా చేయాలి. అలా సక్రమంగా చేయటం కూడా యఙ్ఞమే. యఙ్ఞంలో హవిస్సులను దేవతలకు ఇస్తాము. అలా మన కర్తవ్య నిర్వహణను మనం సక్రమంగా చేస్తే మనకు తెలియకుండానే ఆ యా హవిస్సులు చేరవలసిన దేవతలకు చేరతాయి.
ఎందుకు?
ఈ జగత్తులో అన్నీ శ్రీమహావిష్ణువు ఆధీనంలోనే ఉంటాయి. శక్తులు కూడా. అంటే దేవతలు కూడా. వారికి కర్మ ఫలాన్ని కూడా ఇవ్వవలసినది ఆయనే. ఇందుకే ఆయన యఙ్ఞ స్వరూపుడు. కర్మ జరిగేలా చేసి ఆ కర్మ ఫలాన్ని చేరవలసిన వారికి చేరవలసిన రూపంలో చేరేలా చేసేది ఆయనే. జీవుడు చేయవలసిన కర్మ యఙ్ఞమే. అంటే మనం చేసే, చేసిన, చేస్తున్న, చేయవలసిన, చేయబోయే కర్మను నిర్దేశించేవాడూ ఆయనే, ఆ కర్మ ఫలితాలను అందించేవాడూ ఆయనే.
ఒక్కసారి వరాహ అవతార సందర్భం చూద్దాము. ఎందుకంటే మనమున్నది ప్రస్తుతం శ్వేతవరాహ కల్పం కదా. అంటే ఒకపరి మనం కాలంలో సుమారుగా 1,50,36,00,000 సంవత్సరాల క్రితానికి ప్రయాణిద్దాం.
హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు తన బలగర్వంతో భూమినంతటినీ చాపలా చుట్టి పాతాళలోకంలో దాగి ఉన్నాడు.
బ్రహ్మ సృష్టి అయిన ఈ విశ్వంలో ఏడు ఊర్థ్వలోకాలు, ఏడు అధోలోకాలున్నాయంటారు. అన్నింటిలోనూ అత్యంత ప్రాధాన్యం, ప్రాభవం కలిగినది, వూర్ధ్వలోకాల్లో చేరిఉన్న భూలోకం మాత్రమే. దానిమీదనే మానవాది సర్వప్రాణికోటి నివసించేది. మిగిలిన లోకాలన్నింటి ఉనికికీ కేంద్రస్థానం లాంటిది భూమి. అలాంటి భూలోకం ఉనికికి ప్రమాదం ఏర్పడితే మిగిలిన లోకాల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. ఇదంతా విష్ణువుకు విన్నవించుకున్నారు దేవతలంతా.
పైగా కర్మఫలం పొందాలన్నా, కర్మ క్షయం జరగాలన్నా భూతలం మీదనే సాధ్యం. భూదేవి సైతం తన బాధలను సమగ్రంగా విష్ణువుకు మొరపెట్టుకుంది. తనను రక్షించమని వేడుకుంది. అప్పుడు హిరణ్యాక్షుని చెరనుంచి భూమిని విడిపించడానికి ధరించినదే వరాహావతారం. ఆ వరాహం ఆవిర్భవించింది చతుర్ముఖ బ్రహ్మ గారి నాసికల నుంచీ. 3 dimensions plus time. చతుర్ముఖముల యందున్న నాసికల నుంచీ వచ్చాడాయన. Moreover, analysing Varaha Avatara gives us a lot of information. అది ముందు ముందు చూద్దాము.
ఆ రూపం – పర్వత సమానమై చీకట్లను చీల్చుకొని ప్రజ్వరిల్లుతున్న జ్యోతుల్లా ప్రకాశవంతమైన కళ్ళతో పాటూ రెండు దౌడలనుంచి పైకి చొచ్చుకు వచ్చిన ఉక్కు కమ్మీల్లాంటి కోరలలతో అగుపిస్తున్నది. తన పదఘట్టనతో ఎంతటి దుష్టశక్తినైనా అణగదొక్కే సమర్థత కలిగి ఉన్నట్లున్న గిట్టలు. మేఘగర్జనను మించిన ‘ఘర్ఘర(పంది అరుపు పేరు) ధ్వని’తో పాతాళంలో దాగిన హిరణ్యాక్షుణ్ని ఎదుర్కోవడానికి అనువైన లక్షణాలతో ఆవిర్భవించిందా వరాహం.
పాతాళలోకం చేరాక అక్కడి వరకూ వ్యాపించి ఉన్న కుల పర్వతాల మొదళ్లను తన ముట్టెతో పెకలించసాగింది. ఆ చర్యతో పర్వతాలు భయపడి హిరణ్యాక్షుడు దాగిన చోటును చూపించాయి. అలా దొరకబుచ్చుకుంది హిరణ్యాక్షుణ్ని. అయినా లొంగక విష్ణువుతో యుద్ధానికి తలపడ్డాడతడు. తనకున్న శక్తినంతా కూడగట్టుకుని వరాహాన్ని కొట్టాడు. తిరిగి తన శరీరానికే దెబ్బతగిలి విపరీతమైన నొప్పి పుట్టసాగింది. దానికితోడు వరాహ రూపధారి అనేక రకాలుగా కొడుతున్న దెబ్బలను తాళలేకపోతున్నాడు హిరణ్యాక్షుడు.
పట్టుకుందామంటే దొరకదు, రెండు కాళ్ల సందునుంచి దూరి తప్పించుకుంటోంది. అంతలో అన్నివైపుల నుంచీ హిరణ్యాక్షుడి మీద దాడి చేస్తోంది. అల్పప్రాణిలా కనబడుతున్నా, పైకి కనిపించని శక్తులు కలిగిన వరాహంతో యుద్ధంచేసి అలసి చివరికి మరణించాడు హిరణ్యాక్షుడు. అప్పుడా వరాహమూర్తి పాతాళంలో చుట్టగా పడిఉన్న భూమిని తన కోరలతో పైకి ఎత్తి యథాస్థానంలో ప్రతిష్ఠించాడు. అలా భూమిని ఉద్ధరించిన వరాహమూర్తిని దేవతలందరూ స్తుతించారు.
శ్వేతవరాహ కల్పాదిలో జరిగిన అత్యంత గొప్ప కర్మ ఇదే. చేసినవాడు స్వయంగా ఈశ్వరుడైన శ్రీమహావిష్ణువు యొక్క అవతారమైన వరాహ స్వామి.
(సశేషం)