తల్లివి నీవే తండ్రివి నీవే!-2

4
2

[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]

భీష్మ దర్శనమ్

[dropcap]బ్ర[/dropcap]హ్మకు కూడ అందనివాడు

రుద్రుడి చేత నిత్యం కొలవబడేవాడు

ఇంద్రుడే పాహిమాం పాహిమాం అంటూ అర్థించేవాడు

సమస్తము సృష్టించి పోషించి లయం చేసేవాడు

అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడు

భక్తి ప్రేమ అనే చిన్ని త్రాడుకి బందీ అయ్యాడు

ఎలా అయ్యాడు? ఎందుకయ్యాడు?

దానికి కారణం తెలుసుకుందాం.

~

మొదట..!

విష్ణు సహస్రనామాలు ఎన్ని ఉన్నాయి?

అదేమి ప్రశ్న? అని అనిపించవచ్చు.

నాకు తెలిసి కనీసం మూడు లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాలు ఉన్నాయి. వాటిలో బాగా ప్రాచుర్యం పొందిన ప్రకృతిం వికృతిం అంటూ సాగే లక్ష్మ్యష్టోత్తరం ఎన్నదగినది.

దానితో పాటూ పాంచరాత్రాంతర్గత లక్ష్మీ అష్టోత్తరం కూడా ప్రాచుర్యం పొందింది. దీన్ని శ్రీరంగంలో వాడతారు. దీనికీ, శ్రీసూక్తానికీ చాలా సామ్యాలు ఉన్నాయి. ఇది శ్రీః లక్ష్మీ కమలా దేవీ అని ప్రారంభమౌతుంది. ఇది అత్యద్భుతం. స్వయం వ్యక్తం. అలాగే అలాగే లక్ష్మీ సహస్రనామ స్తోత్రాలు కూడా మూడు ప్రధానమైనవి ఉన్నాయి. మరి వాటిలో ఏది చదవాలి? అభ్యసించాలి? అది గురువు అనుగ్రహం మీద ఆధారపడి ఉంటుంది.

అదే మాదిరి విష్ణు సహస్రనామాలు అనేకం అని ఒక ప్రాచుర్యమైన మాట. ఉండవచ్చు. ఉన్నాయి. అయితే వాటిలో అత్యంత ప్రసిద్ధమైనది మహాభారతంలోని ఆనుశాసనిక పర్వంలోని భీష్మ యుధిష్టిర సంవాద రూపంలో ఉంది. అక్కడే అది దర్శింపబడింది పూర్తిస్థాయిలో. ఎందుకు ఇదే ప్రసిద్ధమైనది? ఎందుకు ఇదే అన్నిటికన్నా ముఖ్యమైనది? పరమ ప్రామాణికంగా భావిస్తారు?

ఈ విష్ణు సహస్రనామాన్ని మహాభారత విష్ణు సహస్రనామం అని కూడా పిలుస్తారు అని ఒక ద్వైత వ్యాఖ్యాత చెప్పారు.

ఇది మిగతా విష్ణు సహస్రనామాలలాగా, ఇతరేతర స్తోత్రాల లాగా పురాణాంతర్గతం కాదు. శాస్త్ర విషయాల్లో చర్చకు వస్తే, పురాణాలకన్నా ఇతిహాసాలకే ప్రాధాన్యతనివ్వాలని పెద్దలు చెప్పారు. ఇతి హాసము. ఇలా జరిగింది. ప్రమాణాలు, సాక్ష్యాలు బాగా అందుబాటులోనో, దగ్గరగానో ఉంటాయి. పైగా మహాభారతము మనకు బాగా దగ్గరి, అందుబాటులో కూతవేటు దూరంలోఉన్న కాలంలో జరిగింది. కనుక మహాభారతాంతర్గత విష్ణు సహస్రనామము అత్యంత ప్రామాణికముగా ఒప్పుచున్నది.

కరుక్షేత్రానంతరం యుధిష్ఠిరుడు యుద్ధభూమిలో మరణం కోసం ఎదురు చూస్తున్న భీష్మ పితామహుని ద్వారా విన్నాడు. ఎందుకు ఈ సందర్భంలోనే శ్రీకృష్ణ భగవానుడు భీష్ముని చేత చెప్పించాడు?

విష్ణు సహస్రనామం సంస్కృతంలో మరియు ఇతర భాషలలో అనేక వ్యాఖ్యానాలకు అలవాలమైనది.

విష్ణు సహస్రనామానికి సంబంధించిన అత్యంత ప్రసిద్ధ వ్యాఖ్యానాలలో ఒకటి ఆదిశంకరుడు అందించినది. ఇది అనేక దేవాలయాలలో సహస్రనామంతో పాటు పఠించబడుతున్నది. It is more like earlier theories of the structure of the Universe we live in. We’re part of the universe and we’re the universe. ప్రామాణికం.

విష్ణుసహస్రనామం రోజువారీ పూజలో భాగంగా చాలా ఇళ్లలో నిత్య పారాయణం చేయబడుతున్నది. ఇది చాలా శక్తివంతమైన మంత్రంగా పరిగణించబడుతున్నది. ఏ సందర్భంలో అయినా శుచిగా ఉంటే చాలు పెద్ద నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం లేకుండా చదువుకొనవచ్చు.

శంకరాద్వైత వ్యాఖ్య తరువాత సగుణబ్రహ్మ ప్రధానంగా, సౌలభ్యానికి పరాకాష్టగా ఉండే వ్యాఖ్యానాన్ని పరాశర భట్టర్ ఆనతిచ్చారు. దాదాపు ఒక సహస్రాబ్ది (780 సంవత్సరాలు) తరువాత. అది విశిష్టాద్వైతాన్ని అనుసరించి చెప్పబడినది. అందుకు తగిన విధంగానే ఇది భగవద్గుణదర్పణం అనే పేరుతో జగత్ప్రసిద్ధమైనది. Just like the Salient Features of the Experienceable Universe. It also resolved a few seemingly contradictory aspects of the Sahasranama. Hence the Vishista tag. ఆ విశిష్ట అనే జోడింపు ఇచ్చినది స్వయంగా శారదాదేవి. కాశ్మీరదేశంలో శారదాపీఠాన కొలువున్న తల్లి.

ఆ పైన మరో ఐదు శతాబ్దాలు గడిచాక ఉత్తరాది మఠానికి చెందిన శ్రీ సత్యసంధ తీర్థుల వారు ద్వైత సంప్రదాయం ప్రకారం వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు. ఆయన ఎలా, ఎందుకు మనకు ఈ చెరుకు రసం లాంటి వ్యాఖ్యను అందించారు? ఆ చరిత్రను ముందు ముందు చూడవచ్చు.  This one throws light on the strengths of the Supreme being and the two most important frailties of the humans.

ఇప్పుడు!

సూర్యోదయమైనది. చేయవలసిన పనులను నందాదులు ముగించుకుని వారి వృత్తులు నిర్వహించటానికి వెళ్ళారు. ఇంట్లో ఇక మిగిలింది కన్నయ్యతో అమ్మ. లేదా అమ్మతో కన్నయ్య. తెలిసిందే కదా.. చాలా అల్లరి వాడు. కానీ, పరమాత్మ కనుక చేసే ప్రతి పనిలో, వేసే ప్రతి అడుగులో పరమార్థం ఉంటుంది.

ఆరోజు ఎందుకో కాస్త ఆలోచనలో మునిగి ఉన్నాడు. ఏమాలోచిస్తున్నాడు ఆ నల్లనయ్య? ఎక్కడైనా తనను గూర్చి విచారించే వారి గురించే కదా? మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం తరువాత ధర్మరాజు శ్రీకృష్ణ భగవానుని గృహానికి వెళతాడు. అప్పుడు కృష్ణయ్య ఇంకా హస్తినలోనే ఉన్నాడు. ఏదో ధ్యానంలో ఉన్నట్లు కనుపించాడు ధర్మజునికి.

“ఎవరి గురించి చింతించుచుంటివి బావా?” అని యుధిష్ఠిరుడు అడుగుతాడు.

“నన్ను గురించి ఎవరు చింతించుచుండెదరో వారిని గురించే,” అని భగవానుని సమాధానం. అప్పుడు ఆయన ఆలోచనలలో నిండి ఉన్న అదృష్టవంతుడు భీష్మ పితామహుడు. అంతిమ ఘడియలు సమీపిస్తున్నాయి. మోక్షాన్ని అందించాలి. వెళ్ళాలి. అక్కడే సహస్రనామానికి అంకురార్పణ జరగాలి. దేనికి?

<<<గంగా పుత్రుడు అమ్ములపొదిలో నుంచీ బాణాన్ని తీసి విల్లుకు సంధించాడు. మంత్రం వేసినట్లు దాని మీద శబ్దభేది అభిమంత్రించాడు. క్షణమాగితే ఆ బాణం సంధింపబడేదే. తనను మంత్రముగ్ధుని చేసి భవిష్యత్ నుంచీ (తనకు తెలియకుండానే) వినవస్తూ తననాకర్షింప చూస్తున్న ఆ వ్యక్తి ఎవరో తనకు తెలియజేయమని ప్రార్థిస్తూ.

కానీ, అది శబ్దభేది. వేస్తున్నది భావి భారత సామ్రాట్.. గంగా శంతనుల సంతానమైన గాంగేయుడు.

ఆ అస్త్ర లక్ష్యం ఆండాళ్!!!>>>

దిగ్గున లేచాడు వటపత్రశాయి. సర్వవ్యాపకుడైన శ్రీమహావిష్ణువు మృగరాజు (సింహః) రూపంలో గర్జించాడు. ప్రసన్నంగానే. ఆ కాల స్వరూపుడి గర్జన శ్రీవిల్లిపుత్తూరులో కాకుండా మూడు వందల సంవత్సరాలు కాలంలో వెనక్కి ప్రవహించింది (time travel concept). శాంతనవుడు వింటి నారిని ఆకర్ణాంతం లాగాడు. లిప్తపాటులో శరాన్ని వదిలేవాడే. ఇంతలో దగ్గరలోనే దాడికి సిద్ధమౌతున్న కేసరి గర్జన వినవచ్చింది. తనతో వచ్చినవారి భయంతో కూడిన రవాలు.

వెంటనే ఆ శబ్దం వచ్చిన వైపు తిరిగి ఆత్మరక్షణ కన్నా, తనవారి భయాన్ని నివారించటానికా అన్నట్లు సంధించాడు శరాన్ని. ఆ సంధించేలోపలే అస్త్రపు గతినీ మార్చాడు.

గాలిని కోసుకుంటూ ఆ శరం దూసుకుపోయింది. క్షణ మాత్రంలో మాయమైంది. పగటి వెలుతురు కూడా మాయమైంది. అది ఇంకా వేకువ ఝామే. శాంతనవుడు ఆశ్చర్యంగా అటు వైపే చూశాడు. లిప్తమాత్రం ప్రకృతి స్తంభించింది.

పూచిన పూలు చెట్ల నుంచి విడివడి పైకి లేచి ఉన్నాయి. ఆకులు వింజామరలై ఆ క్షణం కోసం ఎదురుజూస్తున్నాయి. ఎత్తైన తరువులు నాయకునికి గౌరవ వందనం సమర్పిస్తున్న సైనికుల మాదిరి కనుపించాయా గాంగేయునికి.

కాంతి పుంజం.

వర్ణనాతీత సౌందర్యం.

ఒక ఆకారం రూపుదిద్దుకుంటోంది.

కస్తూరి తిలకం లలాట ఫలకే (పూలన్నీ వర్షంలా కురిశాయి)

వక్షః స్థలే కౌస్తుభమ్ (ఆకులు వింజామరలై సేవిస్తున్నాయి)

నాసాగ్రే నవమౌక్తికం (ఎత్తైన తరువులు శిరస్సు వంచి ప్రణామం చేస్తున్నాయి)

కర తలే వేణుం కరే కంకణమ్ (ఆ చేతిలో చులాగ్గా ఆడుతున్న బాణ-వేణు ద్వయం గాంగేయుడికి దర్శనమిచ్చాయి)

సర్వాంగే హరి చందనం చ కలియన్ (పక్షులు ఆనందంతో కిలకిలారవాలు చేస్తున్నాయి)

కంఠే చ ముక్తావళి (పర్జన్యుడు సన్నటి తుంపరలు క్షణ మాత్రం స్వామికి అభిషేకంలా కురిపించాడు)

గోపస్త్రీ పరివేష్టితుడు కాని ఆ గోపాలచూడామణి ఆనందనందన రూపంలో నడుస్తున్నాడు గంగాపుత్రుని కడకు.

బాలుడా? యవ్వనవంతుడా? వీరుడా? సుకుమారుడా? ఆ తేజస్సు ఏమిటి? ఆ ముఖలావణ్యం ఏమిటి?

గాంగేయుడు చేస్టలుడిగి చూస్తుండి పోయాడు.

~

మూడు వందల సంవత్సరాల తరువాత.

శ్రీవిల్లిపుత్తూరు.

అదే రోజు. అదే సమయం.

నీళాదేవి కూడా రహస్య రూపంలో ఆండాళ్, ఆమె స్నేహితలను అనుసరిస్తూ వెళుతోంది. చేరవలసిన చోటుకు చేరారు అందరూ. గరుడ ఛత్రం పైన. పాదాల క్రింద ఆదిశేష శక్తి. స్వామివారిని చేరారు.

చెప్పారు.

“పొదుగు క్రిందనుండి కడవల కొలదీ పాలు చరచరా నిండాయి. నిండి, పొంగిపొరలి పోతున్నాయి. అక్కడితో ఆగాయా అంటే.. ఆగక, పాలు స్రవిస్తూనే ఉన్నాయి బాగుగా బలసిన ఆల మందల నుంచీ. అటువంటి అసంఖ్యాక గోవులను కలగిన నందగోప కుమరన్! ప్రమాణదార్ఢ్యముగల పరబ్రహ్మస్వరూపా! ఆశ్రితరక్షణ ప్రతిజ్ఞాధార్ఢ్యముగల మహామహిమ సంపన్నా! ఈ భూమి మీద మా కొరకు ఆవిర్భవించిన జ్యోతిస్స్వరూపా! నిద్ర నుండీ మేల్కొనుము. శత్రువులు నీ పరాక్రమమునకు లొంగి, నీ వాకిటకు వచ్చి నీ దాసులై, నీపాదారవిందముల నాశ్రయించినట్లు మేము కూడా నిన్ను వీడి యుండలేక నీ చరణములనే ఆశ్రయించి మంగళాశాసనము చేయుటకై వచ్చితిమి.” (21వ పాశురము).

ఆండాళ్, పరమాత్మ చిత్రం శ్రీ కేశవ్ సౌజన్యంతో

ఇక్కడ గాంగేయుడున్న చోట అలా నడచి వస్తున్న ఆ తేజోసంపన్న మూర్తి పాదముల మీద క్షీరధారల అభిషేకం జరుగుతోంది. అయినా ఆ పాదములకు మట్టి అంటటం లేదు. సకల జీవులూ ఆ రూపం వంకే చూస్తున్నాయి.

“శాంతనవా!” పలికింది ఆ స్వరం. వేయి కోయిలల పెట్టు. పుంస్కోకిల.

చేతిలో ఉన్న శరాన్ని చూపాడు. అది తనదే అని కురు యువరాజు గుర్తించాడు. అంటే ఆ సింహగర్జన ఈయనదేనా?

అప్రయత్నంగా చేతులు జోడించాడు. మోకాళ్ళ మీద నిలిచాడు. ఎదురుగా విశ్వమే ఒక రూపుదాల్చి వచ్చింది. స్తోత్రం చేయబూనాడు. వలదన్నట్లు చిరునవ్వుతో వారించాడు స్వామి. పరమాత్మ ఆఙ్ఞ కనుక ఆగాడు.

శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర ఆవిర్భావము

“సమయం ఉంది పితామహా!”

ఆశ్చర్యం. తాను పితామహుడా? ముప్పదియారు సంవత్సరాలున్న తాను, పరమాత్మకు పితామహుడా? ఏమి ఆశ్చర్యము!

క్షణ కాలములో రాబోయే నూట ఏబది వత్సరములలో కురు వంశాన జరుగబోయేది ఎరుక చేశాడు స్వామి. “అంపశయ్య మీద ఉండి నీ కర్మ ఫలాన్ని తీసి వైచుకొనుచూ చెప్పవలసిన ఉపదేశమే నీవు చేయబోయిన స్తోత్రం” అని పలికాడు భగవానుడు.

“కృష్ణా! పరంధామా!” గాంగేయుడు ఆశ్చర్యానందాలతో అనగలిగాడు.

“నీవీరోజున భాగవదాపచారమే కాదు. భగవదపచారం కూడా. ఆ పాట పాడినది, పాడుతున్నది ఆండాళ్. ఆమె తండ్రి పెట్టిన పేరు కోదై. తులసివనంలో దొరికిన కూన. అయోనిజ. సీతా స్వరూపం. భూదేవి శక్త్యంశ. సాక్షాత్ జగజ్జనని.”

అంటూనే స్వామి శ్రీ, భూ, నీళా సమేతుడై దర్శనమిచ్చాడు. ఒక్క నిముష కాలం. ఆ పైన కొనసాగించాడు.

ఆమె భాగవతురాలు మానవ జన్మ పరంగా. ఆమె మీద అస్త్రాన్ని ఎక్కుపెట్టి భాగవతాపచారం చేశావు. అందుకు నీకు స్త్రీల వల్ల పెను సమస్యలు వస్తాయి. ఐదు సందర్భాలలో. చివరికి పురుష జన్మ స్వీకరించిన స్త్రీ వల్ల నీ పతనం జరుగుతుంది. ఘోర రణాన. భగవదపచారం – భూదేవి మీదే నీ శరసంధానమా? అందుకు నీవు నాకు యుద్ధంలో ఎదురుపడాల్సి వస్తుంది. నీవు ధర్మాత్ముడిని అయినా అధర్మ పక్షాన నిలచి పోరాడతావు. అలా ధర్మపక్షాన నిలువబోయే నా శత్రు సమూహంలో నీవు ఉంటావు.

శ్రీకృష్ణ భగవానుని దర్శనం వల్ల పులకితుడైన గాంగేయుడు అంతా విని చిరునవ్వుతో, “ఆఙ్ఞ!” అన్నాడు.

~

ఈ వృత్తాంతాన్ని తలపోశాడు పరమాత్మ. సమయం ఆసన్నమైనది. భీష్మునికి ముక్తి ప్రసాదించాల్సిన సమయం వచ్చింది. ఎదురుగా నిలుచున్న ధర్మజునితో అన్నాడు.

“భీష్మ పితాముహుని చూడవలసిన సమయం వచ్చింది. మహర్షులందరికీ కబురు పెట్టి, ప్రయాణానికి సన్నాహాలు చేయించు.”

ధర్మజుడు నకులుడిని ఈ వార్తను మహర్షి గణానికి అందచేయమని పంపి, ఇక్కడ ప్రయాణానికి ఏర్పాట్లు చూడమని భీమునితో అన్నాడు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here