[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]
అనాత్మగానం
ఆత్మాఽనాత్మా పదార్థౌ ద్వౌ భోక్తృభోగ్యత్వలక్షణౌ।
బ్రహ్మేవాఽఽత్మాన దేహాదిరితి వేదాంతడిండిమః॥ – వేదాన్త డిణ్డిమము (2)
ఆత్మ అనీ, అనాత్మ అనీ రెండు పదార్థాలు ఉన్నాయి. పరార్థాలు కూడా. వాటిలో ఆత్మ భోక్త. అంటే అనుభవించు వాడు. అనాత్మ అనేది అనుభవించబడేది. ఆత్మయే బ్రహ్మమని, ఈ దేహాదులు ఎందుకూ కొరగానివి అనీ వేదాన్త భేరి మ్రోగుతున్నది.
మరికొంత వివరంగా మాట్లాడుకుంటే, ఆత్మ చిత్స్వరూపమైనది. అనాత్మ జడమైనది.
ఆత్మ దృక్కు. అనాత్మ దృశ్యం.
ఇది అందరికీ విదితమైనదే.
అందుకే ఆత్మ భోక్త అని, అనాత్మ భోగ్యమని ఇక్కడ చెప్పబడింది. అసలు జీవుడు అనే శక్తి నిజం చెప్పుకోవాలంటే చిత్రూపమైన బ్రహ్మయే. జడమైన ఈ దేహాదులు ఎన్నటికీ బ్రహ్మము కాలేవు.
అందుకే జీవులు తమను తాము తమ ఆత్మ స్వరూపంతో తెలుసుకుని, తాము అల్పులమనే భ్రమను వీడి, ఈ దేహేన్ద్రియాలు తాము కామని, తాము సచ్చితానన్ద బ్రహ్మ స్వరూపములే అని గ్రహించి పరమానందమే తమ లక్ష్యమని తెలుసుకోవాలి.
పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః।
అవ్యయః పురుషః సాక్షీ క్షేత్రఙ్ఞోஉక్షర ఏవ చ॥
10) పూతాత్మా – పవిత్రాత్ముడు.
11) పరమాత్మ – నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపమై కార్య కారణముల కంటే విలక్షణమైన వాడు.
12) ముక్తానాం పరమాగతిః – ముక్త పురుషులకు పరమ గమ్యమైన వాడు.
13) అవ్యయః – వినాశము కానివాడు. వినాశము లేని వాడు.
14) పురుషః – నవద్వారములు కలిగిన పురము నందు ఉండువాడు.
15) సాక్షీ – చక్కగా సమస్తమును దర్శించువాడు.
16) క్షేత్రజ్ఞః – శరీరము లో జరుగు క్రియలన్నింటిని గ్రహించువాడు.
17) అక్షరః – నాశరహితుడు.
భూతాత్మా, పూతాత్మా, పరమాత్మా!!!
ఆత్మా ఆత్మా ఆత్మా!!!
భూత ఆత్మ, పూత ఆత్మ, పరమ ఆత్మ.
ఆత్మ శబ్దానికి చాలా ప్రధాన్యం ఉంది. ముందు ముందు తెలుసుకుందాం.
భూత, పూత, పరమ.
భూత = సకల జీవకోటి.
పూత = అత్యంత పవిత్రమైనది
పరమ = అన్నిటికన్నా ఉన్నతమైన
ఇతఃపూర్వం, భీష్మాచార్యుడు చెప్పినట్లుగా,
“ఉన్న ఒకే ఒక్క సూర్యుడు సకల జీవరాసులకు ఒక్కొక్కడుగా కానవస్తాడు కదా. ఆ విధంగానే తాను సృష్టించిన నానావిధ ప్రాణి సమూహాల హృదయ కమలాలలో నానా విధాల రూపాలతో సర్వకాల సర్వావస్థల యందు తన లీలా విలాసంతో తనరారే నారాయణుని పవిత్రహృదయంతో ప్రార్థిస్తున్నాను.”
ఒక్కొక్క అక్షాంశం దగ్గర, ఒక్కొక్క రేఖాంశం దగ్గర సూర్యుడు ఒక్కొక్క రకంగా దర్శనమిస్తాడని మనకు అనుభవైకవేద్యమే కదా. పక్కపక్కనే ఉన్న వ్యక్తులకు ఈ తేడా అంతగా ఉండకపోయినా, తేడా అయితే కచ్చితంగా ఉంటుందన్నది సుస్పష్టం. అంతెందుకు? ఇప్పుడు మార్చి 9, 2024 7:08 ఉదయం. ఇదే అక్షాంశం మీద దక్షిణార్థగోళంలో ఉన్న వారికి చలికాలం రాబోతుంటే, మనకు మాత్రం వేసవి రాబోతోంది. అదే విధంగా పూర్వార్థ గోళం 82.5° రేఖాంశం దగ్గర ఉన్న మనకు పగలు అయితే ఇదే రేఖాంశం పశ్చిమార్థ గోళంలో ఉన్నవారికి రాత్రి.
అంటే ఒక్కొక్క చోట ఉన్నవారికి సూర్యుడు ఒక్కొక్క రకంగా కనబడుతున్నాడు అన్నది అర్థమవుతూనే ఉంది కదా (అర్థమే).
అలాగే ఇంద్రధనసు ఎలా ఏర్పడుతుందో మనకు తెలుసు.
A rainbow is an optical phenomenon caused by refraction, internal reflection and dispersion of light in water droplets resulting in a continuous spectrum of light (means all seven colours) appearing in the sky.
తేలికగా అర్థం అయ్యేలా చెప్పాలంటే..
సాధారణంగా వర్షం పడ్డాక ఉండే సన్నివేశం. ప్రకృతిలో నీటి బిందువులు నిలిచి ఉంటాయి. అవి అనేక లక్షల సంఖ్యలో ఉంటాయి. అలా నిలిచిన నీటి బిందువుల గుండా సూర్య కాంతి ప్రయాణం చేస్తే ఆ కాంతి విక్షేపణం (dispersion) చెందుతుంది. సూర్యకాంతి, లేదా వెలుతురు తెల్లరంగులో కనిపిస్తుంది. ఆ తెల్లటి కాంతి నీటి బిందువుల సహాయంతో విక్షేపణం చెందటం వల్ల ఎరుపు రంగు తక్కువ విచలనాన్ని (deviation), ఊదా రంగు ఎక్కువ విచలనాన్ని పొందుతాయి.
అలా నీటి బిందువులో ఒకవైపు నుంచీ రెండవ వైపు చేరిన వివిధ రంగుల్లో కానవచ్చే కాంతి సంపూర్ణాంతర పరావర్తనం (Total Internal Reflection) చెందటం వల్ల నీటి బిందువులోనే వెనకకు (అంటే వ్యతిరేక దిశలో) పరావర్తనం చెందుతాయి. నీటి బిందువులోకి ప్రవేశించే కిరణాలు, బయటకు వెళ్ళే కిరణాల మధ్య కోణం 0° నుంచీ 42° మధ్య ఎంత అయినా ఉండవచ్చు. ఒకవేళ ఈ కిరణాల మధ్య ఉండే కోణం 40° నుంచీ 42° మధ్య మాత్రమే ఎక్కువ కేంద్రీకృతమైతే ప్రకాశవంతమైన ఇంద్రధనసు ఏర్పడుతుంది.
అలా ఏర్పడిన ఇంద్రధనసు నిజానికి ఒక పూర్తి వృత్తం ఆకారంలో ఏర్పడుతుంది. కానీ మనకు కేవలం దానిలో ఒక చాపాకార భాగం మాత్రమే కనిపిస్తుంది.
As HowStuffWorks explains, there’s essentially a line running from the sun to the very center of the rainbow’s full circle (called the antisolar point), which passes straight through your vantage point along the way. If you stood on your toes, crouched down, or moved two feet to your left, that line would change – and so would the rainbow, though it might not be very noticeable.
ఇంద్రధనసు ఒక పూర్తి వృత్తం అయితే దాని కేంద్రం మీదకు సూర్యుడి నుంచీ ఒక రేఖ గీసినట్లు మనం భావించాలి. ఆ ఇంద్రధనసు కేంద్రాన్ని antisolar point అంటారు. అది మనం నిలుచున్న ప్రదేశం బట్టి, స్థితినిబట్టీ మారుతుంది. మనం నిలుచుంటే, కూర్చుంటే, వంగితే, పడుకుంటే, మోకాళ్ళ మీద ఉంటే.. ఇవన్నీ ఒకచోట చేసినా మనం ఆ రేఖతో చేసే కోణం మారుతుంది. అది మనం అంతగా గుర్తించలేక పోయినా, కచ్చితంగా మార్పు అన్నది ఉంటుంది. అది శాస్త్రీయంగా ఋజువైంది కూడా.
But if you moved out of the way and had someone stand right where you’d just been, wouldn’t they then see the rainbow just as you’d seen it? Sure, it may look pretty much the same. But since a rainbow isn’t a static image, as meteorologist Joe Rao wrote for Live Science, “its appearance is always changing.” You’d need to be in the exact same place at the exact same time, which only happens in science fiction (as far as we know).
మరి ఇంద్రధనసు విషయంలోనే ఇంత వ్యవహారం ఉంటే ఈ ఇంద్రధనసులు ఏర్పడటానికి కారణమయ్యే అసలు శక్తి (కాంతి ఒక్కటే కాదు. కాంతి = light energy), దాని వెనుక ఉన్న శక్తి వాటి గురించి తెలుసుకోవాలంటే అంత తేలికైన పనా?
ఇంకొక్కటి గమనించండి.
ఇంద్రధనసు లేదా వానవిల్లు ఏర్పడేది ఒక సంపూర్ణ వృత్తం లాగా. అలా సంపూర్ణ వృత్తం లాగా ఏర్పడే ఇంద్రధనసునే మనం పూర్తిగా చూడలేము. నేల మీద లేదా భూమి మీద ఉంటే. విమానమో, మరో మార్గంలోనో బాగా ఎత్తుకు వెళ్ళగలిగితే అప్పుడు చూడగలం.
మన ఋషులు భగవంతుని చూడటానికి లేదా దర్శించటానికి మనను చేయమంటున్న పని అదేగా.
ఇంకొక రకంగా ఆలోచిస్తే ఒక్కొక్క మహర్షి ఒక్కొక్క రకంగా ఆ భగవచ్ఛక్తిని దర్శించి ఆ రూపానికి తగిన నామాన్ని మనకు ఇచ్చారు.
పునరుక్తి అయినా సరే మరలా అదే విషయం దగ్గరకు రావలసి ఉంది.
– జీవులు పుట్టి పెరుగుటకు కారణమైన వాడు ఎలా ఉంటాడు?
సర్వ జీవ కోటి యందు అంతర్యామిగా!
– సర్వ జీవ కోటి యందు అంతర్యామిగా ఉండేవాడు ఎవరు?
సమస్త చరాచర ప్రపంచమంతయు తానే వ్యాపించిన వాడు.
– సమస్త చరాచర ప్రపంచమంతయు తానే వ్యాపించిన వాడు ఏమి చేస్తాడు?
జీవులందరిని పోషిస్తాడు.
– జీవులందరినీ పోషించువాడు అలా ఎంతకాలం చేయగలడు?
అనాది నుంచీ చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు, ఈ క్షణాన చేస్తున్నాడు. భవిష్యత్ లో కూడా చేస్తూనే ఉంటాడు.
– మరి అలాంటి వ్యక్తి లేదా శక్తి ఎలా ఉండాలి?
పూతాత్మ. అంటే అత్యంత పవిత్రుడై.
– అత్యంత పవిత్రుడైన వ్యక్తి అని మనం స్పష్టంగా ఎవరి గురించి చెప్పగలం?
పరమాత్మ.
– అంతటి పరమాత్మ కనుకనే ఆయన ముక్తి కోరుకునే వారికి పరమ గమ్యం అయి ఉంటాడు.
అంతటి శక్తిని సంపూర్తిగా ఎవరు అవగాహన చేసుకోగలరు? ఎవరూ లేరు. అందుకే మనం చేసుకోగలిగేది అర్థం మాత్రమే.
(సశేషం)