తల్లివి నీవే తండ్రివి నీవే!-23

3
2

[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]

ఆత్మగానం

నహిరామాత్ పరందైవమ్

శాస్త్రాద్ రామాయణాదపి।

శ్రీ రామ సదృశోదేవో

నభూతో నభవిష్యతి॥

మిత్రుడు తులసీకృష్ణ పెట్టిన ఈ శ్లోకం అద్భుతమైనది.

12. ముక్తానాం పరమాగతిః

ముక్తయపురుషులకు పరమగమ్యమై ఉన్నవాడు.

గతి అంటే గమ్యము. పరమా అని చేరినందువల్ల ఉత్తమమైన గమ్యము అని అర్థం వస్తున్నది. అంటే ఆ గమ్యం చేరాక ఇక వేరే ఏ గమ్యములు ఉండవో అలాంటి గమ్యమైన వాడు.

ఏ స్థానానికి చేరిన తరువాత ఇక తిరిగి రావలసిన అవసరము ఉండదో అలాంటి స్థానాన్ని నిలబెట్టినవాడు/శక్తి. ఎవ్వరిని చేరితే ఇక పునర్జన్మ ఉండదో ఆ విరాట్ స్వరూపుడు.

॥మాముపేత్య కౌన్తేయ పునర్జన్మ నవిద్యతే॥

భగవద్గీతలో అక్షరపరబ్రహ్మ యోగంలో శ్రీ భగవానువాచ. నదులకు సాగరము పరమగతి అయినట్లు మానవులకు ఆ పరబ్రహ్మమే గతి.

సముద్రములో ఐక్యమైన నది తన స్వభావ స్వరూపములను కోల్పోయినట్లు, భగవానుని చేరిన జీవి భగవద్వైభవములో లయించుట జరుగుతున్నది. లయించటము అంటే ఇక్కడ నాశనము అవటం కాదు. శాశ్వతత్వాన్ని పొందటం.

అంటే ముక్త జీవులకు శాశ్వతత్వాన్ని చేకూర్చేవాడు.

ఆత్మ పరమాత్మలో లీనమవటం. ఆత్మగానం యొక్క అసలు లక్ష్యం అదే కదా!

॥యద్గత్వా న నివర్తన్తే తద్ధామ పరమం మమ॥ – భగవద్గీత 15వ అధ్యాయం

దేనిని చేరిన తరువాత జీవులకు తిరిగి రావలసిన అవసరము, అగత్యము ఉండదో అటువంటి పవిత్రమైన స్థానము నా నివాసము అని శ్రీ భగవానువాచ.

13. అవ్యయః

నాశము లేనివాడు. వికారము లేని వాడు. లేదా అలాంటి శక్తి.

Here it talks about the Law of Conservation of Energy.

శక్తి ఒక రూపం నుంచీ మరొక రూపానికి మారుతుంది తప్ప అది సృష్టింపబడదు. అలాగే నాశము పొందదు.

Energy can neither be created nor be destroyed. It changes from one form to another form.

॥అజరో అమరో అవ్యయః॥ – బృహదారణ్యకోపనిషత్

ఆ శక్తి (శ్రీమహావిష్ణువే) జరా (disintegrating) మరణములు (being destroyed) లేక అవ్యయుడై (అవ్యయమై) ఉన్నాడు (ఉంది).

లింగ, వచన, విభక్తుల చేత మార్పులు లేని పదములు అవ్యయములు. ఇవన్నీ ఆ శ్రీహరి రూపములే.

That which cannot be defined.

ఎందుకంటే..

గోచరమగునది ఏది అయినా పరిణామము చెందుతుంది. అలా పరిణామము చెందునది ఏదైనా నశిస్తుంది. కానీ, భగవానుడు అలా పరిణామము చెందు వస్తు సముదాయములో చేరడు.

చిత్రమైన విషయం ఏమిటంటే ఆ పరమాత్మ అనబడు శక్తి అటు పరిణామము చెందుతుంది. చెందనూ చెందదు. ఆ విధముగా నిర్వచనములకు లొంగదు ఆ శక్తి.

ఇక్కడ గమనించాల్సినది ఏమిటంటే పరమాత్మ వస్తురహితమైన చైతన్యమై అవ్యయః అని కీర్తింపబడుతున్నాడు. అందుకే ఆ అవ్యయమైన పరమాత్మను చేరిన వారు (ముక్తులు) మరల పరిణామం చెందే జగత్తులో అడుగిడరు. అంటే మరో జన్మ ఉండదు.

Let us think about annihilation and pair production.

Annihilation (లయము) is the conversion of matter into energy, especially the mutual conversion of a particle and anti-particle into electromagnetic radiation.

అంటే పదార్థము, లేదా సూక్ష్మకణములు (particles) శక్తిలో ఐక్యమౌతాయి. ముక్తానాం పరమాగతిః

If we convert the same energy into particles, that is gamma is converted back into particles, the same particles can never appear. These are newly created particles.

14. పురుషః

దేహమునందు వసించు చైతన్యమే పురుషుడై ఉన్నాడు.

॥నవద్వారే పురే దేహీ॥

భగవద్గీతలో కర్మసన్న్యాస యోగంలో చెప్పబడిన విధంగా నవ ద్వారములు కలిగిన పురమునందున్న వాడు పురుషుడు. నవద్వారములు కలిగినది మానవ దేహం. అందు చైతన్య శక్తిగా ఉన్నవాడు పురుషుడు. ఆ చైతన్య శక్తియే భగవానుడు.

॥అసఙ్గోయం పురుషః॥ – బృహదారణ్యకోపనిషత్

పురములు ఏర్పడకముందు కూడా పురుషుడు ఉన్నాడు అని శృతి.

॥పూర్వమేవాహ మిహాసమితి తత్పురుషస్య పురుషత్వమ్॥

వేద ప్రమాణకంగా

ఈ దేహాదులు ఏర్పడక పూర్వమే నేను ఉంటిని అనునదియే పురుషులకు పురుషత్వము.

॥పురూణి ఫలాని సనోతి దదాతీతి॥

పురూణి ఫలాని – శ్రేష్ఠమైన ఫలములను

సనోతి – ఇచ్చేవాడు

అన్నిటికన్నా శ్రేష్ఠమైనది ముక్తి. లేదా పరమపదము. లేదా మోక్షము. దానిని ఇచ్చేవాడు పురుషుడు. ఆ పురుషుడు సృష్టించినది ప్రకృతి.

పురుషుడు భోక్త.

ప్రకృతి భోగ్యం.

మనందరము అనగా సకల చరాచర, గోచరాగోచర జీవులన్నీ ఆ శక్తికి లేదా ఆయనకు భోగ్యములే. కనుక ఆయనను చేరగానే, నోటి ద్వారా మన శరీరంలో ప్రవేశించిన ఆహారము తన ఉనికిని కోల్పోయి శక్తి రూపంలోకి మారి మన దేహాలకు శక్తినిస్తుందో.. అదే విధంగా ఆ పరమ పురుషుని చేరిన జీవాత్మలు తమ ఉనికిని కోల్పోయి ఆయనలో లేదా ఆ శక్తిలో ఐక్యమౌతాయి. కానీ, ఆ పురుషునకు వేరే శక్తి అవసరం ఉండదు.

అన్నం మనకు శక్తినిస్తుంది కానీ, తనకు తాను శక్తినిచ్చికోదు. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం.

॥పురూణి భువనాని స్యతి॥

ఈ విశ్వమును పూరించి ఉండుటచే పురుషుడు అయ్యాడు.

వేద ప్రమాణకంగా

॥పురుషోహవై నారాయణః॥

పురుషుడే నారాయణుడు.

చైతన్య స్వరూపుడైన పురుషుడే ఈ విశ్వమంతటికినీ ఆధారమై ఉన్నాడు.

ఇక్కడ మనం పురంజనోపాఖ్యానం చూడవలసి వస్తుంది. చూద్దాము.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here