Site icon Sanchika

తల్లివి నీవే తండ్రివి నీవే!-24

[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]

ప్రకృతీ పురుషమ్

నమః పఙ్కజనాభాయ భూత సూక్ష్మేన్ద్రియాత్మనే।

వాసుదేవాయ శాన్తాయ కూటస్థాయ స్వరోచిషే॥

సఙ్కర్షణాయ సూక్ష్మాయ దురన్తాయాన్తకాయ చ।

నమో విశ్వప్రబోధాయ ప్రద్యుమ్నాయాంతరాత్మనే॥

నమోనమోఽనిరుద్ధాయ హృషీకేశేన్ద్రియాత్మనే।

నమః పరమహంసాయ పూర్ణాయ నిభృతాత్మనే॥

(శ్రీమద్భాగవతమ్, చతుర్థాశ్వాసం, 24వ అధ్యాయం, 34, 35, 36 శ్లోకాలు)

పద్మనాభుడవు, భూతసూక్ష్మాలు, సకలేంద్రియాలు, వీటన్నిటిలో ఉన్న సర్వకారణకారకుడవు, పరమ శాంతస్వభావం కలిగినవాడవు, కూటస్థుడవు, స్వయం ప్రకాశం కలిగినవాడవు అయిన ఓ నారాయణా! నీకిదే నా వందనము.

నీవే సంకర్షణుడవు. అత్యంత సూక్ష్మరూపంలో మనగలిగే నీవు మరణరహితుడవు. కానీ, శత్రువులకు మరణమైనవాడవు. సమస్త ప్రపంచానికి జ్ఞాన ప్రదాతవు. అంతరాత్మవు. అట్టి నీ ప్రద్యుమ్న రూపానికి నమస్కారములు.

నీవే అనిరుద్ధ రూపంలో దర్శనమిస్తావు. హృషీకేశుడవు. ఇంద్రియరూపుడవు, పరమహంసలకే పరమహంసవు (యోగిహృదుధ్యాన గమ్యం. ముక్తానాం పరమాగతిః). సర్వగుణ పరిపూర్ణుడవు. అవాప్త సమస్తకాముడవు. అట్టి నీకు వందనం.

ఆరు మన్వంతరాల క్రితం!!

ధృవుని తరువాత రెండు తరాలు గడిచాక అతని వంశంలో వేనుడు అనే అత్యంత దుర్మార్గుడైన వ్యక్తి జన్మిస్తాడు. అతని పతనాన్ని శాసిస్తారు మహర్షులు. పరమ శాంతమూర్తులైన మహర్షి గణమే అంత కోపించిందంటే అతని ప్రజా పీడన ఎంత ఎక్కువగా ఉండేదో!

అతని శరీరాన్ని మథిస్తే అప్పుడు అతని చేతుల నుండి లోక సంరక్షణార్థం శ్రీమన్నారాయణ అంశతో ఒక పురుషుడు, లక్ష్మీదేవి అంశతో ఒక స్త్రీ ఉద్భవించించారు. అది చూసి ప్రజలందరూ ఎంతో సంతోషించారు. ఆ పురుషుడే “పృథు చక్రవర్తి” అనే పేరుతో సుప్రసిద్ధుడయ్యాడు. ఆ స్త్రీమూర్తి పేరు “అర్చి”. ఆ కన్యకు సుగుణాలే అలంకారాలు. ఆమె పృథు చక్రవర్తిని వరించింది.

ఆ పృథు చక్రవర్తి తరువాత ఆయన పుత్రుడు విజితాశ్వుడు ఈ భూమండలాన్ని పాలించాడు. అతని తరువాత ఆయన కొడుకు హవిర్ధానుడు వచ్చాడు. ఆయనకు ఆరుగురు కొడుకులు. అందులో ఒకడైన బర్హిష్మదుడు యజ్ఞదీక్షాశాలియై, భూతలమంతా యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ, ప్రజలచేత యోగసమాధినిష్టుడు అనీ, ప్రజాపతి అనీ కీర్తించబడ్డాడు. అతనిని జనులు ప్రాచీనబర్హి అని పిలిచేవారు. దానికి కారణం…

ఈ బర్హిష్మదుడు యాగాలు చేయటం మొదలైన కర్మకాండలలో, యోగాభ్యాసం చేయటంలో నిమగ్నమై ఉండేవాడు. ఈ భూమి మీద ఒక యఙ్ఞం తరువాత మరొక యఙ్ఞం చేస్తూ ఉండటం వల్ల భూభాగమంతా ప్రాచీనాగ్రాలైన దర్భలతో నిండిపోయింది. అందుకే అతనిని ప్రాచీనబర్హి అని పిలిచేవారు.

ఆ ప్రాచీనబర్హి బ్రహ్మ గారి ఆఙ్ఞ మీద సముద్రతనయ అయిన శతదృతిని వివాహం చేసుకున్నాడు. ఆమె ఎంత పవిత్రమైన మనసు కలిగినదంటే అత్యంత పరిశుద్ధునిగా పేరున్న అగ్నిదేవుడు ఆమెను చూసి మోహపడతాడు. అలాంటి ధర్మపత్ని వల్ల ప్రాచీనబర్హికి పది మంది కుమారులు కలిగారు. వారంతా వారి తల్లిదండ్రుల సుగుణాలన్నీ పోతపోసినట్లు పొందారు.

వారినే ప్రచేతసులు అంటారు. వారు వారి తండ్రి ఆజ్ఞానుసారం ప్రజాసృష్టిని కొనసాగించడానికి అడవులకు వెళతారు. ముందుగా తపస్సు చేసి ధర్మ సృష్టికి తగిన శక్తిని పొందేందుకు. వారికి ఆ దారిలో సాక్షాత్ రుద్రుడు దర్శనమిస్తాడు. వారి వినయ విధేయతలను, అహంకార రాహిత్యాన్ని, సుగుణాలను చూసి సంతోషించి వారికి అత్యంత గుహ్యమైన నారాయణ స్తోత్రాన్ని అనుగ్రహిస్తాడు.

 ఆ స్తోత్రాన్నే యోగాదేశము అంటారు.

పైన ఇచ్చిన మూడు అద్భుతమైన శ్లోకములు రుద్రుని నోటివెంట వెలువడిన అమృతతుల్యమైన స్తోత్రం లోనివే.

యమ నియమాలను పాటిస్తూ ఈ స్తోత్రాన్ని అనుసంధానం చేసిన వారికి శివుని అనుగ్రహంతో విష్ణుభక్తి కలుగుతుంది. వారి మనస్సు ధర్మాన్ని వాంఛిస్తుంది. వారు చేసే పనులు ప్రజోపకారంగా ఉంటాయి. వారికి అంతిమంగా మోక్షం లభిస్తుంది. లౌకిక జీవనంలో వారికి సంసార సాగరాన్ని తేలికగా దాటటానికి ఉపయోగపడటమే కాకుండా వారు కోరుకునే ధర్మబద్ధమైన కోరికలన్నీ నెరవేరుతాయి.

ఈ స్తోత్రాన్ని మొదటగా చతుర్ముఖ బ్రహ్మ గారు మానసపుత్రులైన భృగువు వంటి ప్రజాపతులకు, రుద్రుడికి ఉపదేశించారు. వారి కర్తవ్య నిర్వహణలో ఉపయోగపడుతుందని. ప్రజాపతుల కర్తవ్యం ప్రజాసృష్టి. రుద్రునిది లయం. ప్రజాసృష్టి కోసం తండ్రి ఆఙ్ఞ మీద వెళుతున్న ప్రచేతసులకు అనువైన, వారి కార్యాన్ని సఫలం చేసే ఈ స్తోత్రాన్ని రుద్రుడు అనుగ్రహించాడు.

ఆయన ఆదేశానుసారం ప్రచేతసులు నారాయణుడిని పదివేల దివ్య సంవత్సరాలు పూజించారు.

ఈ స్తోత్రంలో ఉన్న నామాలు..

– వాసుదేవ

– శాన్త

– సూక్ష్మ

– ప్రద్యుమ్న

– అనిరుద్ధ

– హృషీకేశ

– హంస

ఈ నామాలను, వాటి శక్తిని తొల్త దర్శించినది బ్రహ్మ గారు. ఆ పైన ప్రచేతసుల ద్వారా మానవులకు అందించినది శివుడు. ఈ స్తోత్రానికి రుద్రగీతమనే నామాంతరం కూడా ఉంది.

ఇటువైపు ప్రాచీనబర్హి తన యఙ్ఞకర్మలను కొనసాగిస్తూనే ఉన్నాడు. కేవల కర్మకాండల వల్ల మోక్షం లభించదు. అందుకే అతని పరిస్థితి చూసి, అతనిని ఉద్ధరించటానికి కరుణాసముద్రుడు, హితకారి అయిన నారదముని అతని వద్దకు వెళ్ళాడు.

పరమపూజ్యుడైన నారదమునిని చూసి ప్రాచీనబర్హి తగురీతిన సత్కరించి ఆయన ఆశీస్సులను పొందుతాడు. ఆ పైన మోక్షస్థితిని తెలుసుకోవడానికి తనకు జ్ఞానోపదేశం చేయమని నారదుడిని అడుగుతాడు ప్రాచీనబర్హి.

సంసార చక్రంలో పరిభ్రమించే తన లాంటివాడు మోక్షపదాన్ని పొందలేడు అని తనకు తెలుస్తున్నదని, తానియచేసిన తప్పులను తెలియజేసి మోక్షం పొందే మార్గాన్ని ఉపదేశించమని అర్థిస్తాడు.

అప్పుడు దయాళువైన నారదుడు, యజ్జాలలో నీవు చంపిన జంతువులు వేలసంఖ్యలో వున్నాయనీ, అవన్నీ నీ కసాయితనాన్ని స్మరిస్తూ, నీవు ఎప్పుడైతే పరలోకం చేరుతావో అప్పుడు నిన్ను హింసించడానికి ఎదురుచూస్తున్నాయనీ అంటాడు. ఈ కర్మల దురించి అతి ప్రాచీనమైన ఒక ఐతిహ్యాన్ని చెప్తానని అంటాడు.

అదే పురఞ్జనోపాఖ్యానం.

ఆరుమన్వంతరాలకు పూర్వం నాటికే ఇది ఐతిహ్యమైంది కనుక దీని కాలాన్ని గుర్తించటం కష్టం.

పూర్వకాలంలో పురంజనుడు అనే రాజు ఉండేవాడు. అతడికి జ్ఞానంతో కూడిన ప్రవర్తన కల విజ్ఞాతుడనే స్నేహితుడున్నాడు. తనకు అనుకూలమైన రాజ్యం (పురము) కొరకు స్నేహితుడితో కలిసి పురంజనుడు భూమండలమంతా తిరిగాడు. అలా తిరగగా తిరగగా ఎన్నో సంవత్సరాల తరువాత భోగవతి లాంటి ఒక పురాన్ని చూశాడు.

అది గోపురాలతో, ప్రాకారాలతో, బురుజులతో, కందకాలతో, రకరకాల సౌకర్యాలతో, సర్వలక్షణాలు కల నాగుల నివాస పట్టణమైన భోగవతి లాగా వున్నది. ఆ పురానికి వెలుపల అందమైన ఒక ఉద్యానవనం వున్నది. అందులో సరస్సులున్నాయి. ఆ ఉద్యానవనంలో పురంజనుడు ఒక అందమైన యువతిని అనుచరగణంతో సహా చూశాడు. ఆమె ఎవరని, ఆమె పేరేమిటని, తండ్రి ఎవరని, ఆమెను అనుసరిస్తున్న వున్న పదకొండు మంది సేవకులు ఎవరని, ఆమె ఈ వనంలోకి రావడానికి కారణం ఏమిటని, ఆమె ముందు నడుస్తున్న ఐదు తలల నాగము ఎవరని ప్రశ్నించాడు పురంజనుడు.

తనకు తన తండ్రి ఎవరో, తన కులం ఏమిటో, పేరేమిటో, తానున్న ఈ పురం పేరేమిటో, దాన్ని నిర్మించిన వారెవరో తెలియదనీ, తన వెంట వున్నవాళ్లు తన సఖులని, చెలికత్తెలని, ఆ నాగము తను నిద్రించేటప్పుడు పురాన్ని పాలిస్తుందని అని ఆ యువతి ఉత్తరమిచ్చినది.

తనను ప్రేమించమని అడుగుతాడు పురంజనుడు.

తన భాగ్యవశాన పురంజనుడు అక్కడికి వచ్చాడని, ఆ పురాన్ని స్వీకరించి పాలించమని, తాను సమకూర్చే సకల సౌకర్యాలను నూరు సంవత్సరములు అనుభవించమని అంటుంది. పురంజనుడి లాంటివాడిని తనలాంటి కన్య తప్పక వరిస్తుందని చెప్పింది.

ఆ పద్మాక్షిని పురంజనుడు తక్షణమే వరించాడు. ఆ పురంలోకి ప్రవేశించి ధన్యుడయ్యాడు. నూరు వత్సరాలు సమస్త సౌఖ్యాలను అనుభవించాడు. ఆ పురానికి వున్న మొత్తం తొమ్మిది ద్వారాల అధిపతులకు, తూర్పున వున్న అయిదు ద్వారాల అధిపతులకు మహాధిపతి పురంజనుడే. ఆయా ద్వారాల ద్వారా రకరకాల విషయాలను పొందుతాడు.

అతడి నగరంలో నిర్వాక్కు, పేశస్కరుడు అనే ఇద్దరు గుడ్డివాళ్లున్నారు. వాళ్ల సాయంతో ఆయన గమనం, కరణం అనే పనుల్ని నెరవేర్చుకుంటాడు. అంతఃపురంలోకి వెళ్లేటప్పుడు విషూచీ అనే ఆమెతో కలిసి భార్యాపుత్రుల వల్ల కలిగే మోహప్రసాద హర్షాలను పొందుతాడు. ఇలా పురంజనుడు కామాసక్తుడై, ’బుద్ధ’ అనే పట్టమహిషి వల్ల వంచించ బడ్దాడు.

ఆమె పురంజనుడు ఏది చేస్తే అది చేస్తుంది. తింటే తింటుంది, తాగితే తాగుతుంది, నడిస్తే నడుస్తుంది. అలా పురంజనుడు తన నిజస్వరూపాన్ని ఎడబాసి, పట్టమహిషి వల్ల మోసపోయి, జ్ఞానం కోల్పోయి, ఆ పురంలో కాపురం వున్నాడు.

అలా కొన్నాళ్లు గడిచాక ఒకనాడు ధనస్సు, బాణాలు ధరించి సైన్యంతో కలిసి వేగంగా బయల్దేరి, పురాన్ని వదిలి, అడవికి వెళ్లి, పట్టమహిషిని విడిచి, మదంతో సంచరించాడు. మృగాలను దయాహీనుడై వధించాడు. వేటాడింది తన ఆహారం కోసం కాదు, కేవలం వినోదం కోసం. అందుకే అది ఒక రాక్షస క్రీడగా పరిణమించింది.

జ్ఞానియైన విద్వాంసుడు చేయతగని హింసను చేసి, నియమాన్ని ఉల్లంఘించి, దుస్సహంగా వేటాడి, అలసిపోయి మందిరానికి వెళ్లాడు.

బడలిక తీరేదాకా నిద్రపోయాడు పురంజనుడు.

మళ్లీ తన ప్రియురాలైన పట్టమహిషి మీద మనసుపడ్డాడు. భార్య కనిపించక పోయేసరికి అంతఃపుర స్త్రీలను ఆమె గురించి అడిగాడు. కిందపడి పొర్లాడుతూ, ప్రణయ కోపం నటిస్తూ పడుకున్న భార్యను చూపించారు వారు. ఆమెను దగ్గరికి తీసుకుని ఓదార్చాడు.

ఆమె కోపాన్ని వీడి అలంకరించుకుని భర్తను చేరింది. ఇద్దరూ శృంగారంలో రాత్రిపగలు అనే తేడా లేకుండా, విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయి గడిపి, ఆయువు క్షీణిస్తున్నదన్న సంగతి కూడా తెలుసుకోలేకపోయారు. పురంజనుడు ఒళ్లు మరిచిపోయి జీవితాన్ని గడిపాడు. అతడి నవయవ్వన కాలమంతా అరక్షణం లాగా గతించి పోయింది.

పదకొండు వందలమంది కొడుకులను, నూటపదిమంది కూతుళ్లను కన్నారు వారిద్దరు. అతడి ఆయుష్షులో సగభాగం తరిగిపోయింది. కుమారులకు, కుమార్తెలకు వివాహం చేశాడు. వారికి ఒక్కొక్కరికి వందమంది చొప్పున కొడుకులు పుట్టి వంశాభివృద్ధి చెందింది.

ఆ తరువాత నిష్ఠగా యజ్ఞదీక్ష వహించి, అనేక యజ్ఞాలు చేశాడు పురంజనుడు.

ప్రాచీనబర్హీ! నీ లాగానే యజ్ఞాలకోసం వేలాది పశువులను చంపాడు. తనకు హితాన్ని కలిగించే కర్మల పట్ల ఏమాత్రం శ్రద్ధ వహించలేదు.

అప్పుడు చండవేగుడు అనే గంధర్వ రాజు పురంజనుడి పురాన్ని చుట్టుముట్టాడు. అతడు ఏమీ చేయలేక చింతాక్రాంతుడై పోయాడు. ఇదిలా వుండగా కాలపుత్రిక అనే ఒక కన్య మైత్రేయుడు తనను వరించడానికి ఒప్పుకోకపోవడంతో కోపించి శపించింది. యవన దేశాధిపతైన భయుడు కూడా ఆమెను తిరస్కరించాడు. ఆమెకు భర్త ఎవరో చెప్తానని అంటూ, తమ్ముడు ప్రజార్వుడుతో కలిసి పురంజనుడి పురాన్ని ముట్టడించాడు.

కాలకన్యక పురంజనుడి పురాన్ని అనుభవించింది. పురంజనుడు ఇష్టం లేకపోయినా ఆ పురాన్ని విడిచి వెళ్లడానికి సిద్ధపడ్దాడు. శక్తిహీనుడైపోయాడు. తన సంతానాన్ని తలచుకుని తపించాడు. తాను మరణిస్తే భార్య అనాథై తన కుమారులను ఎలా కాపాడుతుందో అని దుఃఖించాడు. అలా దుఃఖిస్తున్న పురంజనుడిని తీసుకుపోవడానికి భయుడు వచ్చాడు. అతడిని పశువును కొట్టినట్లు కొట్టి ఈడ్చుకుపోయాడు. అనుచరులంతా ఆయన వెంట వెళ్లారు.

ఆయన వున్న పురం పంచభూతాలలో కలిసిపోయింది. చనిపోయి పరలోకం చేరిన పురంజనుడిని యజ్ఞపశువులు మహాకోపంతో వచ్చి గొడ్డళ్లతో నరికాయి. చాలాకాలం పరలోక బాధలు అనుభవించాడు. మరుజన్మలో విదర్భరాజు ఇంట్లో స్త్రీగా జన్మించాడు.

మలయకేతనుడనే పాండ్యరాజు విదర్భ రాకుమారిని వీర్యశుల్కంగా పొంది వివాహమాడాడు. వారిద్దరికి ఒక కూతురు, ఏడుగురు కొడుకులు జన్మించారు. కొడుకులు దక్షిణ దేశాధిపతులయ్యారు. ఒక్కొక్కరికి కోటానుకోట్ల సంతానం కలిగారు.

మలయకేతుడి కుమార్తె అగస్త్యుడిని పెళ్లిచేసుకుంది. మలయకేతు భూమండలాన్ని తన కొడుకులకు ఇచ్చి భార్య వైదర్భి సమేతంగా కులపర్వతానికి వెళ్లి వెయ్యి దివ్య సంవత్స్రాలు తపస్సు చేశాడు. చివరకు ప్రాణాలు త్యజించాడు. వైదర్భి విలపించింది. సహగమనం చేయడానికి సిద్ధపడింది.

అప్పుడొక విజ్ఞానస్వరూపుడైన బ్రాహ్మణుడు వచ్చి, ఆమెతో, పూర్వ జన్మలో తామిద్దరం హంసలమని, స్నేహితులమని చెప్పాడు. భౌతిక సుఖాల పట్ల ఆసక్తికలిగి వైదర్భి కామినీ నిర్మితమై, ఆయిదు ఆరామాలు, తొమ్మిది వాకిళ్లు, ఒకే పాలకుడు, మూడు చావళ్లు, ఆరు గుంపులు, అయిదు అంగళ్లు, పంచ ప్రకృతులు, స్త్రీయే నాయకిగా కలిగిన ఒక పురాన్ని చూశావని చెప్పాడు.

అలాంటి పురంలో ప్రవేశించినవాడు స్త్రీలమీద ఆధారపడే అజ్ఞాని అనీ, దాంట్లో వైదర్భి ప్రవేశించి, కామినికి చిక్కి, ఆమెతో ఆనందిస్తూ, ఈశ్వరుడిని విస్మరించి, చివరకు వైదర్భిగా పుట్టి దుఃఖాలను అనుభవిస్తున్నాడని చెప్పాడు. ఇలా చెప్పి ఆ బ్రాహ్మణుడు ఇదంతా తన మాయతో కలిపించబడిందని, తామిద్దరం పూర్వం హంసలమని, అతడి తేజోరూపాన్ని తెలుసుకోమని అన్నాడు.

ఇదంతా చెప్పిన నారదుడు పురంజనుడి కథ అనే మిషతో ఆధ్యాత్మ తత్త్వాన్ని నీకు తెలియచెప్పాను అని ప్రాచీనబర్హితో అన్నాడు.

ప్రాచీనబర్హి దర్భలను భూమండలమంతా పరచి, అహంకారంతో, అవినయంతో ఎన్నో పశువులను చంపాడని, కానీ, కర్మస్వరూపాన్ని, విద్యాస్వరూపాన్ని తెలుసుకోలేకపోయాడని అదేంటో చెప్తాను వినమని అన్నాడు.

“ఆ సర్వేశ్వరుడి పట్ల మనస్సును లగ్నం చేసేది ఏదయితే వుందో అదే విద్య. ఆ పరమాత్మయే దేహధారులకు అత్మ. ఈశ్వరుడు. కాబట్టి క్షేమకరమైన ఆశ్రయం నారాయణుడి పాదమూలాలే. ఆ శ్రీమహావిష్ణువే ప్రియాతిప్రియమైన వాడు, సేవించతగ్గవాడు. ఆయనను ఆశ్రయించి సేవించే వారికి అణుమాత్రమైనా దుఃఖం కలగదు. ఆ భగవత్ స్వరూపాన్ని ఎవడు తెలుసుకుంటాడో వాడు విద్వాంసుడు. అతడే గురువు. అతడే హరిస్వరూపం. కాబట్టి సకల జీవులకు ఆశ్రయమైన ఈశ్వరుడిని భజించు. సర్వ విధాలా విరక్తిని పొందు. మనస్సే జీవులందరికీ సంసార కారణం. అటువంటి కర్మ వశం వల్ల ఇంద్రియాలలో సంచరించడం జరుగుతుంది. దాన్నే అవిద్య అంటారు. అవిద్య వల్లే అనేక జన్మలు, కర్మ బంధాలు కలుగుతున్నాయి. కాబట్టి అలాంటి అవిద్య తొలగేందుకు లక్ష్మీపతిని భజించు.

సృష్టిస్థితిలయకారకుడైన పరమేశ్వరుడిని, పద్మనేత్రుడిని, ఈశ్వరుడిని ధ్యానించు. సర్వజగత్తును భగత్ స్వరూపంగా అర్థం చేసుకుని అతడి పాదపద్మాలను ఆరాధించు.”

ఈ విధంగా, జీవుడు ఈశ్వరుడిని చేరే మార్గాన్ని తెలిపి నారదుడు తన దారిన వెళ్లిపోయాడు. ఆ తరువాత నారదముని అనుగ్రహవశాన తన తప్పిదములను తెలుసుకున్న ప్రాచీనబర్హి తన పుత్రులకు రాజ్యాన్ని అప్పగించి తపస్సు చేసుకునేందుకు కపిల మహాముని ఆశ్రమానికి వెళ్లాడు. ఆ పైన అవ్యయానందమైన విష్ణుపదాన్ని పొందాడు.

ఈ పురంజనోపాఖ్యానంలో అనేక సంకేతాలు ఉంటాయి. ఈ పురందనుడి వంటి వారే మానవులు. అలాంటి వారిని అనుగ్రహించి ముక్తిని ప్రసాదించేవాడు, నవ ద్వారే పురే దేహీ! అతనే పురుషుడు.

ఆ సంకేతాలను తెలుసుకోవాలంటే ఈ క్రింది పట్టికను చూడండి.

1 | అవిజ్ఞాతుడు అనే బ్రాహ్మణుడు | ఈశ్వరుడు.
2 | పురంజనుడు | జీవుడు.
3 | మానస సరస్సులో నివసించే హంసలు | జీవాత్మ పరమాత్మలు.
4 | కామినీ నిర్మితం, పంచారామం, నవద్వారం, ఏకపాలకం, స్త్రీనాయకం అయిన ఒక పురం | దేహం.
5 | పంచారామాలు | పంచేంద్రియార్థాలైన శబ్దం, స్పర్శం, రూపం, రసం, గంధం అనేవి ఐదు.
6 | నవద్వారాలు | ముక్కు మొదలైన తొమ్మిది రంధ్రాలు. ముక్కు రంద్రాలు 2, నోరు 1, కన్నులు 2, చెవులు 2, రహస్యావయము 1, గుదము 1 మొత్తం తొమ్మిది (9) రంద్రాలు.
7 | ఏకపాలకము | ప్రాణం (1).
8 | త్రికోష్ఠాలు | భూమి, జలం, అగ్ని అనేవి మూడు (3).
9 | షట్కులం | నాలుక, కన్ను, చెవి, ముక్కు, చర్మం, మనస్సు అనే జ్ఞానేంద్రియాలు ఆరు (6).
10 | పంచవిపణాలు | వాక్కు, పాణి, పాదం, పాయువు, ఉపస్థ అనే కర్మేంద్రియాలు అయిదు (5).
11 | పంచప్రకృతి | పృథివి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాలు అయిదు (5).
12 | కామిని | బుద్ధి.
13 | నేనే నీవు, నీవే నేను | జీవాత్మ పరమాత్మల అభేదం.
14 | ఏక పాది | ఒక పాదం కలది (చెట్టు),
15 | ద్విపాది | రెండు పాదాలు కలది (మానవుడు, పక్షి),
16 | త్రిపాది | మూడు పాదాలు కలది,
17 | చతుష్పాది | నాలుగు పాదాలు కలది (జంతువు),
18 | అనేకపాది | పెక్కు పాదాలు కలది (కీటకం),
19 | అపాదం | పాదాలు లేనిది (పాము)
20 | పురంజనుడు | పురుషుడు.
21 | అవిజ్ఞాతుడు అనే మిత్రుడు | ఆ పురుషునికి నామ క్రియాగుణాలచే తెలియబడ్డ ఈశ్వరుడు. పురుషుడు
22 | పురం | తొమ్మిది ద్వారాలతోను, రెండు చేతులతోను, పాదాలతోను కూడిన దోషరహితమైన దేహం.
23 | ఉత్తమ స్త్రీ | బుద్ధి.
24 | ఆ బుద్ధికి స్నేహితులు | జ్ఞాన, కర్మ కారణాలైన ఇంద్రియ గుణాలు.
25 | చెలికత్తెలు | ఇంద్రియ వ్యాపారాలు.
26 | అయిదు తలల పాము | పంచవృత్తి అయిన ప్రాణం.
27 | పదకొండుమంది మహాభటులు | జ్ఞాన కర్మేంద్రియాలు పది, వాటిని ప్రేరేపించే మనస్సు (బృహద్బలుడు).
28 | బృహద్బలుడు | మనస్సు.
29 | తొమ్మిది ద్వారాలతో కూడిన ఆ పురాన్ని చుట్టి వచ్చిన పాంచాల దేశాలు | శబ్దం మొదలైన పంచ విషయాలు.
30 | నవద్వారాలు | రెండు కన్నులు, రెండు ముక్కు రంధ్రాలు, ఒక నోరు, రెండు చెవులు, గుదం, మగగురి.
31 | తూర్పు ద్వారాలు | రెండు కన్నులు, రెండు ముక్కు రంధ్రాలు, ఒక నోరు ఈ ఐదు.
32 | కుడి చెవి | దక్షిణ ద్వారం.
33 | ఎడమచెవి | ఉత్తర ద్వారం.
34 | పడమటి ద్వారాలు | గుదం, శిశ్నం రెండు.
35 | ఒకేచోట నిర్మింపబడిన ఖద్యోత, ఆవిర్ముఖి | కన్నులు.
36 | విభ్రాజితం | రూపం.
37 | ద్యుమంతుడు | నేత్రేంద్రియం.
38 | నళిని, నాళిని | ముక్కు రంధ్రాలు.
39 | సౌరభం | గంధం.
40 | అవధూత | ఘ్రాణేంద్రియం.
41 | ముఖ్య | నోరు.
42 | విపణం | వాగింద్రియం.
43 | రసజ్ఞుడు | రసనేంద్రియం.
44 | ఆపణం | సంభాషణం.
45 | బహూదనం | పలురకాలైన అన్నం.
46 | పితృహువు | కుడిచెవి.
47 | దేవహువు | ఎడమ చెవి.
48 | చంద్రవేగుడు | కాలాన్ని సూచించే సంవత్సరం.
49 | గంధర్వులు | పగళ్ళు.
50 | గంధర్వీజనులు | రాత్రులు.
51 | పరీవర్తనం | ఆయుఃక్షయం.
52 | కాలకన్యక | ముసలితనం.
53 | యవనేశ్వరుడు | మృత్యువు.
54 | అతని సైనికులు | ఆధివ్యాధులు.
55 | ప్రజ్వారుడు | వేగంగా చావును కలిగించే జ్వరం.
56 | శీతం, ఉష్ణం | ఈ జ్వరం రకాలు రెండు.
57 | దక్షిణ పాంచాలం | పితృలోకాన్ని పొందించేదీ, ప్రవృత్తి రూపకమూ అయిన శాస్త్రం.
58 | ఉత్తర పాంచాలం | దేవలోకాన్ని పొందించేదీ, నివృత్తి రూపకమూ అయిన శాస్త్రం.
59 | శ్రుతధరుడు | చెవి.
60 | ఆసురి అనే పేరు కలిగిన పడమటి ద్వారం | శిశ్నం.
61 | గ్రామకం | రతి.
62 | దుర్మదుడు | యోని.
63 | నిరృతి అనే పేరు కలిగిన పడమటి ద్వారం | గుదం.
64 | వైశసం | నరకం.
65 | లుబ్ధకుడు | మలద్వారం.
66 | సంధులు | చేతులు కాళ్ళు.
67 | అంతఃపురం | హృదయం.
68 | విషూచి | మనస్సు
69 | రథం | శరీరం.
70 | గుఱ్ఱాలు | ఇంద్రియాలు.
71 | రెండు యుగాలు | సంవత్సరం, దాని చేత ఏర్పడిన వయస్సు.
72 | రెండు చక్రాలు | పుణ్యపాప కర్మలు.
73 | మూడు జెండాలు | త్రిగుణాలు.
74 | పంచబంధనాలు | పంచప్రాణాలు.
75 | పగ్గం | మనస్సు.
76 | సారథి | బుద్ధి.
77 | గూడు | హృదయం.
78 | రెండు నొగలు | శోకమోహాలు.
79 | పంచప్రహరణాలు | ఐదు ఇంద్రియార్థాలు.
80 | పంచవిక్రమాలు | కర్మేంద్రియాలు.
81 | సప్త వరూధాలు | రసం, రక్తం, మాంసం, మేధస్సు, అస్థి, మజ్జ, శుక్రం అనే ఏడు (7) ధాతువులు.
82 | స్వర్ణాభరణం | రజోగుణం.
83 | అక్షయ తూణీరం | అనంత వాసనాహంకార ఉపాధి.
84 | ఏకాదశ సేనాపతి | పది ఇంద్రియాలు, మనస్సు.
85 | ఆసురీవృత్తి | బాహ్య విక్రమం.
86 | వేట | పంచేంద్రియాల చేత హింసాదులను చేసి విషయాలను అనుభవించడమే.
87 | పురుషుడు | దేహంతో స్వప్న సుషుప్తి జాగ్రదవస్థలతో ఆధ్యాత్మిక, ఆధిదైవిక, ఆధిభౌతికాలైన బహువిధ దుఃఖాలచేత కష్టాలను అనుభవిస్తాడు. అజ్ఞానం చేత కప్పబడి నిర్గుణుడు ఐనా ప్రాణేంద్రియ మనోధర్మాలను తనలో ఆరోపించి కామలేశాలను ధ్యానిస్తూ, అహంకార మమకారాలతో కూడ వందయేండ్లు కర్మలను ఆచరిస్తాడు.

(సశేషం)

Exit mobile version