[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]
విష్ణుం వన్దే జగత్పితమ్
కలయామి కలిధ్వంసం కవిం లోకదివాకరం।
యస్య గోభి: ప్రకాశాభిరావిద్యం నిహతం తమ:॥
దేని అల్లెత్రాడు లాగితే పుట్టే శబ్దానికి
ధర్మపరుల కష్టాలన్నీ బెదరి
పలాయనం చిత్తగిస్తాయో,
అధర్మపరుల గుండెలదరుతాయో..
ఆ శార్ఙ్గము అనే శ్రీమహావిష్ణువు యొక్క విల్లు అవతారమే
నీలన్ అని పిలువబడిన, పరకాలన్ అని కీర్తింపబడిన తిరుమఙ్గై (తిరుమంగై) ఆళ్వార్.
ఈ ఆళ్వార్ తనను తాను పరకాలనాయకిగా మలచుకున్నాడు. ఈయన చరిత్ర చాలా విచిత్రంగా ఉంటుంది. అంటే శ్రీమహావిష్ణువు అక్కడ ఆయనకు నాయకుడు.
స్వామి పురుషుడు. ఆళ్వార్ ప్రకృతి.
స్వామి పద్మావతీదేవిని వరించినట్లు.. ఈ మహాభక్తుడైన ఆళ్వార్‌ను స్వయంగా ఉద్ధరించాలని వస్తాడు. తిరుమన్త్రము ఉపదేశిస్తాడు. ఆ కథ మరో అద్భుతము.
ద్వైత వ్యాఖ్యానం ప్రకారం
పుర్ – అగ్రగమన ఇత్యతః పురుషః। సృష్టే ప్రాగ్వద్యమానః
ముందు నడిచేవాడు.
ఎవరి ముందు?
జీవాత్మల ముందు.
ఎందుకు?
వాటిని ఉద్ధరించి మోక్షానికి చేర్చటానికి.
ఇక్కడ ఆత్మకు పరమాత్మకు అభేదం లేదు.
జీవాత్మలన్నీ సృష్టిలో భాగాలే కాబట్టి, సృష్టి జరుగటానికి ముందే ఉన్నవాడు ఈ పురుషుడు.
మరొక రకంగా చూస్తే..
పురుః – బహుళః, షః – చేష్టా యస్యేతి వా – అంటే అనేక చేష్టలు కలవాడు.
శృతులలో చెప్పబడినట్లు పురిః ప్రాణ ఆత్మేతి – అంటే పురము లేదా శరీరము యందు శయనించినవాడు పురుషుడు. అనగా ఆత్మ స్వరూపుడు అని అర్థం. అర్థమే!
పురు – బహుదైత్యనాశకత్వాద్వా – అనేకమైన రాక్షసులను నిర్జించినవాడు పురుషుడు.
పురు – పూర్ణం, మోక్షాఖ్యం ఫలం స్వాత్మానమేవ , సనోతి – దదాతి ఇతి పురుషః.
భాగవతం ప్రకారం..
పూర్ణమైన సారూప్య మోక్షమను ఫలమును ఇచ్చువాడు. ఎందుకు? భక్తులకు ఆయన వశమై ఉన్నాడు కనుక.
తిరుమంగై ఆళ్వార్ కోసం ఆయన చేసిన ప్రయోగం అదే కదా!
- సాక్షీ
సాక్షాత్ ఈక్షతే – చక్కగా సమస్తమును దర్శించువాడు సాక్షి.
లేవ్ తొల్స్తోయ్ (Leo Tolstoy) చెప్పినట్లు God Sees Truth But Waits.
ఆ వేచి ఉండటము అనేది కర్మలను బట్టీ ఉంటుంది. మనం చేసే కర్మలను గమనిస్తూ ఉండేవాడు సాక్షి.
అందరికీ తెలిసిన కథే. కానీ మరొకసారి చూద్దాం. మనం కూడా సాక్షులమే.
ఒకానొకప్పుడు ఒక ముని దగ్గర కొందరు శిష్యులు తమ విద్యను పూర్తి చేసుకుని శిష్యరికం ముగించటానికి సిద్ధంగా ఉన్నారు. బ్రహ్మచర్యాశ్రమాన్ని దాటి గృహస్థాశ్రమ వాసులు కావాలని ఉవ్విళ్ళూరుతున్నారు. సరే! వారికి ఎంత వరకూ నిజ జ్ఞానము అబ్బిందో తెలుసుకుందామని ఒక పరీక్ష పెట్టాలని నిర్ణయించాడాయన.
తలా ఒక వక్క ఇచ్చి, ఆశ్రమమునకు దూరంగా ఎవరూ చూడని చోట పడేసి రమ్మన్నాడు. ఏ ఒక్కరూ ఒకే చోట పడవేయవద్దని కూడా చెప్పాడు (ఎందుకో తెలుసు కదా). అందరూ వెళ్ళారు. ఒక్కడు మాత్రము (ఒక్కడే) అక్కడే అలాగే నిలబడిపోయాడు.
గురువు గారు అతనిని చూశారు. చిరునవ్వు రువ్వారు.
కాసేపటికి మిగిలిన వారంతా ఆ యా వక్కలను వదిలేసి వచ్చారు.
గురువు ఇలా అడిగాడు, “అందరూ ఎవరూ చూడని చోటే పడవేశారు కదా!”
అందరూ ఔనన్నారు. ఆ ఒక్కడు తప్ప.
ఇతను మాత్రము మౌనంగా ఉన్నాడు. చేతిలో వక్క అలాగే ఉండిపోయింది. మిగిలిన శిష్యులు మూడు రకాలుగా చీలిపోయారు.
కొందరు.. వీడేదో ప్రత్యేకమైన కారణం వల్ల వెళ్ళలేదేమో. ఏంజరుగుతుందో చూద్దాం అని వేచి చూస్తున్నారు.
ఇంకొందరు.. వీడు గురువాఙ్ఞను ధిక్కరించాడు. ఆయన అనుగ్రహానికి పాత్రుడు కాలేడు అని అనుకుంటున్నారు వారిలో వారే.
మరికొందరు వినోదంగా చూస్తున్నారు.
గురువు అడిగాడు, “నాయనా! నీవు ఎందుకు కదలలేదు? ఎందుకు ఆ వక్కను విడువలేదు?”
ఆ శిష్యుడు, “గురుదేవా! సర్వ సాక్షియైన ఆ భగవానుడు/ఈశ్వరుడు చూడని ప్రదేశమేమున్నది?”
అందుకే ఈ సృష్టిలో ఎవరూ చూడని ప్రదేశము ఉండదు.
ఆ సాక్షి సాక్షాత్ భగవానుడే.
ఎందుకంటే
- ఆయనే విశ్వ స్వరూపుడు
- ఆయనే వ్యాపించిన విష్ణువు. సమస్త చరాచర భూతప్రపంచమంతా వ్యాపించి యుండు భగవానుడు. తాను తయారు చేసిన సృష్టి తనకన్నా అన్యముగాక పోవుటవేత తాను సర్వవ్యాపి అయినాడు.
- వ్యాప్తి చెందటానికి కావలసిన ఓజస్ ను కలిగి ఉన్న వషట్కారుడు
- భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నిటికీ ప్రభువైన వాడు (అంటే అన్ని కాలాలను తన వశంలో ఉంచుకున్నాడు. అంటే సర్వకాల సర్వావస్థలలో అన్నిటినీ చూడగలడు)
- సకల భూతములను సృష్టించువాడు. ప్రళయ కాలమున సకల భూతములను నాశనము చేయువాడు (భూతాని కృన్తతి).
- సమస్త భూతములను పోషించువాడు, భరించువాడు.
- అన్నింటికి ఉనికియైనవాడు. తనలోని సర్వ విభూతులను ప్రకాశింపజేయువాడు.
- సమస్త భూతములకు తాను ఆత్మయై యుండువాడు. సర్వ జీవకోటియందు అంతర్యామిగా యుండువాడు. సర్వభూతాంతరాత్మకుడైన భగవానుడు సమస్త శరీర మనుగడకు కర్తయై, సాక్షియై యుండు చైతన్యము.
- తల్లిదండ్రులవలె జన్మనిచ్చి, పెంచి, పోషించు వాడు భగవానుడు. ఆ తల్లిదండ్రులకు కూడా ఆయనే తల్లి, తండ్రి. అందుకే ఆయన జగత్పిత. विष्णुम् वन्दे जगत्पितम्
- కర్మ ఫల దోషములు అంటని పవిత్రమైన ఆత్మ. ‘పూత’ అనగా పవిత్రమైన, ‘ఆత్మా’ అనగా స్వరూపము గలవాడు. పవిత్రాత్ముడు.
- పరమమైన, అంతకు అధికము లేని, ఆత్మ. సర్వులకూ తానే ఆత్మ గాని, తనకు వేరు ఆత్మ యుండని వాడు. తాను సర్వులకు ఆత్మయై తనకు మరొక ఆత్మ లేనివాడు.
- ముక్తులైన వారికి (జనన మరణ చక్రమునుండి విముక్తి పొందిన వారికి) పరమాశ్రయమైన వాడు. ముక్తులకు ఇంతకంటె ఆశించవలసినది మరొకటి లేదు. ముక్త పురుషులకు పరమగమ్యమయిన వాడు – భగవంతుడు. గతి యనగా గమ్యము. పరమా అను విశేషణము యొక్క అర్ధము ఉత్తమము. ఏది గ్రహించిన పిదప మరొకటి గ్రహించనవసరములేదో, ఏ స్థానమును చేరిన జ్ఞానికి పునర్జన్మ ప్రాప్తించదో అదియే పరమగతియని తెలియదగును.
- తరుగు లేని వాడు. తనను చేరిన వారిని మరల జనన మరణ చక్రములో పడనీయని వాడు. వినాశము కానివాడు మరియు వికారము లేనివాడు.
- శరీరమందు శయనించియున్నవాడు. సమస్తమునకు పూర్వమే ఉన్నవాడు. జగత్తునకు పరిపూర్ణతనిచ్చువాడు.
ఇన్ని అయిన వాడు సర్వమునూ అదుపులో ఉంచుకుని, అన్నిటినీ తానే స్వయముగా జరుగున్నట్లు చూచువాడు. సాక్షి!
ఒకసారి పూతాత్మా, పరమాత్మా అనే నామములకు సుదర్శన వ్యాఖ్య చూద్దాము.
పూతాత్మా – శ్వేతాశ్వతర ఉపనిషత్ చెప్పినట్లు “కేవలో నిర్గుణశ్చ”.. అకారణముగా గుణ సంబంధమూ, ఉపాధి సంబంధమూ లేని వాడు.
అందుకే ఆ శక్తి శుద్ధతత్వం అయ్యింది. శుద్ధమైనది. లేదా శుద్ధమైన తత్వము (philosophy) అయింది. The philosophy which has no counter.
భూతాత్మా అనే నామం వల్ల ఉపాధి దోషాలను కలిగి ఉండడా అన్న శంకకు సమాధానం.
పరమాత్మా – కార్యకారణముల కంటే వ్యతిరిక్తమైన నిత్యశుద్ధబుద్ధముక్త స్వభావము ఐనవాడు. పూతాత్మా అన్న నామంలో పవిత్రతారూప శంకకు ఈ నామం ఉత్తరమిస్తుంది. ఎలా?
భక్తాత్మ పూతమే కదా?
అలాంటప్పుడు అది భగవంతునితో ఏ విధంగా భేదిస్తుంది? భక్తునికి భగవంతునితో కార్య కారణ సంబంధం ఉంది. కానీ భగవంతునికి ఆ సంబంధం ఉండదు.
ఆ పూతాత్మ ఒక్కడే! ఆ ఒక్కడూ ఎవరయ్యా అంటే పరమాత్మ కూడా అయిన వాడే! ఈ విషయాన్ని చెప్పటం కోసమే వ్యాస భగవానుడు పరమాత్మా ‘చ’ అని వాడాడు.
- క్షేత్రఙ్ఞః
క్షేత్ర అనగా శరీరము. ఙ్ఞః అంటే తెలుసుకొనువాడు.
అంటే శరీరములో జరుగుతున్న (ప్ర)క్రియలన్నీ తెలుసుకొనువాడు. లేదా ఎరిగి ఉన్నవాడు. లేదా ఆ శక్తి.
॥క్షేత్రఙ్ఞం చాపిమాం విద్ధి సర్వక్షేత్రేషు భారత॥ (భగవద్గీత 13వ అధ్యాయం)
సర్వ దేహములలో దేహియై వెలుగు క్షేత్రఙ్ఞుడు ఆ పరమాత్ముడే. ఈశ్వరుడే. శ్రీకృష్ణుడే!
ఈ విషయాన్నే ఉటంకించి భీష్మాచార్యుడు ఆ వాసుదేవ కృష్ణునికి నమస్కరించాడు. మౌనం వహించాడు.
అప్పుడు వ్యాసభగవానుడు పలికాడు.
బృహదార్ణ్యకోపనిషత్ ప్రకారం..
॥నాన్యోఽతోఽస్తి ద్రష్టా॥
అతనికంటే వేరుగా మరొక ద్రష్ట లేడు.
శరీరములు, వాటికి బాజములైన శుభాశుభ కర్మలను తెలుసుకొనుటచే ఆ యోగాత్ముడు.. యోగీశ్వరుడు క్షేత్రఙ్ఞుడని పిలువబడుచున్నాడు.
క్షేత్రములు నశిస్తాయి. క్షేత్రఙ్ఞుడు నశించడు. అవినాశి.
ఇది తెలిసిన వెంటనే భీష్మాచార్యుడికి సంపూర్ణ భగవత్స్వరూపం అవగతమైనది.
పలికాడు ఈ విధంగా..
- అక్షరః
క్షరము లేనివాడు. నాశము లేనివాడు. లేదా అలాంటి శక్తి.
Once again the Law of Conservation of Energy is touched.
నక్షరతి – నశించడు
కనుక అక్షరః అని పిలువబడుతున్నాడు. బహుశః ఈ నామాన్ని నరనారాయణులలో నారాయణుడు స్వయంగా అందించాడు.
॥అక్షరం బ్రహ్మ పరమం॥ (భగవద్గీత 8వ అధ్యాయం)
భగవానుడే స్వయంగా చెప్పిన మాట. అంటే ఈ నామాన్ని దర్శించి అందించింది నారాయణ ఋషి. నరుల కోసం. ఎందుకంటే జీవాత్మలలోనీ ఆత్మలు కూడా అక్షరములే కదా.. పరమాత్మలో ఐక్యం అయ్యే వరకూ. ఆ పైన ఎటూ అక్షరములే.
వేదార్థం చూస్తే.. మాయ క్షరము బ్రహ్మము అక్షరము.
క్షేత్రఙ్ఞునకు, అక్షరమునకు పరమార్థమైన భేదం లేదని చెప్పటానికి ఏవ చ అనే పదములను వాడాడు కృష్ణ ద్వైపాయన వ్యాసుడు. వ్యవహారిక భేదము కూడా లేదు.
అవ్యయమూ, అక్షరమూ అయిన స్వరూపం కనుకనే క్షేత్రఙ్ఞత్వము, అక్షరత్వము ఒప్పాయి ఆ శక్తికి. లేదా ఆయన (భగవానుడు)కు. ఈ విషయాన్ని అక్షర ఏవచ లోని ఏవ అనే శబ్దం తెలుపుతున్నది. తత్వమసి అనే శృతి వాక్యాన్ని నిర్ధారణ చేస్తుంది. చ-కారం వ్యావహారిక భేదాన్ని చెప్తుంది. దాన్ని చూసి తత్వభేదం సత్యమనుకోకూడదు.
ఎందుకంటే ఈ భేదమనేదే అప్రమాణం కనుక. అద్వైతం.
ఇక ద్వైత వ్యాఖ్యానాన్ని చూస్తే..
అక్షేషు – అక్ష్యాది ఇన్ద్రియేషు రమత ఇతి వా
ఇన్ద్రియముల యందు రమించు వాడు (అక్ష + రః).
క్షి – క్షయే ఇతి ధాతో । క్షం – నాశః, న విద్యతే క్షం యస్య తదక్షం, వైకణ్ఠాది. తత్ రాతి – జాతి ఇతి వా।
నాశరహితమైన వైకుంఠాది లోకములను ఇచ్చేవాడు.
తత్ర రమతః ఇతి వా – ఆ యా వైకుంఠాది లోకముల యందు రమించువాడు.
అంటే.. ఆయన లేదా ఆ శక్తి మోక్షాన్ని ఇస్తాడు/స్తుంది. మనం స్వీకరించే వారము.
ద్వైతము.
ఇచ్చేవాడిని ఆశ్రయించాల్సిన బాధ్యత మనదే.
ఆ బాధ్యతను ఆయనే తీసుకుంటాడు. ఎందుకంటే ఆయనే మనం కనుక. లేదా మనమే ఆయన కనుక. అంటే.. ఈ సృష్టిలోని జీవులన్నీ ఆయనతో అభేదం కలిగి ఉన్నవే కదా.
అద్వైతం.
ఆయన ఎల్లప్పుడూ భాగవతులతోనే ఉంటాడు (ఇతర జీవులతో ఉండడని కాదు. కాస్త ఎక్కువ మమకారం కాని మమకారం భక్తుల మీద).
విశిష్టాద్వైతం.
(సశేషం)