[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]
హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్న్యౌ
శ్రీవల్లభేతి వరదేతి దయాపరేతి। భక్తప్రియేతి భవలుంఠనకోవిదేతి।
నాథేతి నాగశయనేతి జగన్నివాసేతి । ఆలాపనం ప్రతిపదం కురు మే ముకుంద॥
శ్రీమన్నారాయణుడు అపరిమితమైన అనంత కళ్యాణగుణములతో కూడుకొని ఉన్న సర్వోన్నత పరతత్త్వం.
కః శ్రీః శ్రియః పరమసత్వసమాశ్రయః కః
కః పుణ్డరీకనయనః పురుషోత్తమ కః।
కస్యాయుతాయుతశతైకకలాంశకాంశో
విశ్వం విచిత్రచిదచిత్ప్రవిభాగవృత్తమ్॥
— స్తోత్రరత్నం 9వ శ్లోకం
లక్ష్మీదేవికే సౌభాగ్యాశ్రయమైన వాడు ఎవ్వడు? (హృదయలక్ష్మి). పరమ సాత్వికులైన భాగవతులకు ఆశ్రయమైనవాడు ఎవ్వడు? పుణ్డరీకములవంటి నయనములు కలవాడు ఎవ్వడు? పురుషోత్తముడెవ్వడు? ప్రకృతి జీవాత్మలు ఎవ్వనిలో అత్యంత సూక్ష్మమైన అంతర్భాగాలు? ఆయనే పరబ్రహ్మమైన శ్రీమన్నారాయణుడు.
శ్రీమాన్ = రమణీయమైన స్వరూపము గలవాడు (శ్రీనృసింహమూర్తిగా).
సదా లక్ష్మీదేవిని తన వక్షస్థలమున ధరించినవాడు.
ద్వైతం..
శంరూపే వాయౌ రతత్వాత్ శ్రీః – భారతీ లక్ష్మీః కాన్తిర్వా, శ్రీః – స్వామిత్వేన వా భర్తృత్వేన వా ఆధారత్వేన తద్వాన్
శం (సుఖ) రూపి అయిన వాయువునందు నివాసము కలిగినవాడు. శ్రీః అనగా భారతీదేవి, లక్ష్మీదేవి, మరియు కాంతి. వీరందరికీ ఆధారభూతమైన వాడు. శం అనే అవ్యయానికి వాయువు అని అర్థం. వాయువు దేవతలలో అత్యంత శక్తివంతమైనవాడు (వాయుపుత్రులు హనుమ, భీముడు). ఆ శం కలిగినది శ్రీ. శక్తి కలిగినది లక్ష్మి. శం అస్యాస్తీతి శ్రీః. వాయువునందు నివాసం కలిగినవాడయి భారతీదేవికి స్వామి అయిన వాడు, లక్ష్మీదేవికి భర్త అయిన వాడు, కాంతికి ఆధారమైన వాడు శ్రీమాన్.
అద్వైతం ప్రకారం..
ఎల్లవేళలా లక్ష్మీదేవితో కూడియుండువాడు కనుక ఆయన శ్రీమాన్ అయ్యెను. ఆ తల్లి నిత్యానపాయని. ఆయనను వదలి ఉండదు. ఐశ్వర్యప్రదాయిని అయిన లక్ష్మీదేవిని హృదయమునందు ధరించినవాడు కనుక శ్రీమాన్.
వక్షస్థలము హృదయానికి చిహ్నం. అంటే హృదయములో కల్యాణ గుణములు కలిగినవాడు శ్రీమాన్. అంటే గొప్పనడవడిక కలిగిన వాడు. సదాచారములకు మూలమూర్తి.
శుభప్రదమైన ఆధ్యాత్మిక సంపద కలిగిన వాడు అజ్ఞానమును తృటిలో అంతమొందించగలడు. అంటే అజ్ఞానాంధకారమును తొలగించి జ్ఞానదీపమును వెలిగించువాడు (జీవుల హృదయమునందు ఉండి) శ్రీమాన్.
అందుకే శ్రీవైష్ణవ సంప్రదాయములో మగవారి పేర్లముందు శ్రీమాన్ అని పెడతారు.
సుదర్శన వ్యాఖ్య ప్రకారం ఎవ్వని హృదయమునందు ఎల్లెడలా శ్రీ అనగా సత్వగుణములు తిష్టవేసుకుని ఉండునో వాడే శ్రీమాన్.
23.కేశవః = సుందరమైన కేశములతో విరాజిల్లువాడు. కేశి అను రాక్షసుని సంహరించినవాడు. బ్రహ్మ, విష్ణు, శివ రూపములు ధరించువాడు (త్రిమూర్తి స్వరూపి). అందమైన కిరణములతో విశ్వమును చైతన్యవంతులుగా చేయువాడు. ‘కేశ’ యనెడి అసురుని వధించినవాడు – విష్ణుమూర్తి. మనోహరములైన శిరోజములు (కేశములు) కలిగియున్నవాడు – శ్రీ కృష్ణుడు. “క + అ + ఈశ” కలసి “కేశ” శబ్దమయినది. ‘క’ అనగా బ్రహ్మ. ‘అ’ అనగా విష్ణువు, ‘ఈశ’ అనగా ఈశ్వరుడు. ఈ త్రిమూర్తులకు ఆధారమయిన వాసుదేవ చైతన్యమే కేశవుడు.
24.పురుషోత్తమః = పురుషులలో ఉత్తముడు. త్రివిధ చేతనులైన బద్ధ-నిత్య-ముక్తులలో ఉత్తముడు. క్షరుడు (నశించువాడు), అక్షరుడు (వినాశన రహితుడు) – ఈ ఇద్దరు పురుషులకు అతీతుడు, ఇద్దరికంటె ఉత్తముడైన వాడు.
వేదాహమేతం పురుషం మహాన్తమ్ |
ఆదిత్యవర్ణం తమసస్తు పారే |
సర్వాణి రూపాణి విచిత్య ధీరః |
నామాని కృత్వాఽభివదన్ యదాస్తే |
This great Purusha, brilliant as the sun, who
is beyond all darkness, I know him in my
heart. Who knows the Purusha thus,
attains immortality in this very birth.
I know of no other way to salvation.
పరమపురుషుడు, పురుషోత్తముడు, నారాయణుడు విరాట్ పురుషుడు. ఆయన అనేకకోటి సూర్యులకన్నా తేజోసంపన్నుడు. వెలుతురుకు, చీకటికి అతీతమైనవాడు. ఆయన నా హృదయములో సర్వకాల సర్వావస్థలలో నిలిచియున్నాడు. ఆ తేజోమూర్తిని నేను దర్శిస్తున్నాను. ఆ విరాట్ స్వరూపుడిని సంపూర్ణముగా తెలుసుకున్న వారు శాశ్వతత్వాన్ని పొందుతారు. జరామరణములను జయించి జన్మరాహిత్యాన్ని పొందుతారు. మోక్షానికి ఇంతకుమించిన మార్గము లేదు.
పురుషసూక్తములో ప్రతిపాదింపబడిన పరబ్రహ్మతత్వమే శ్రీమహావిష్ణువు.
ఆ హ్రీ (సిగ్గు, లజ్జ, వినయము, బుద్ధి, modesty) దేవికి, శ్రీదేవికి (లక్ష్మీదేవికి) నాథుడైన వాడు పురుషోత్తముడు.
అంటే సంపన్నుడై వినయసంపన్నుడైన వాడే శ్రీపతి అయిన శ్రీమన్నారాయణుడు. ఈ స్థితిని పొందగలిగిన వారు ఆయన సామీప్యమును పొందగలరు.
– కం – బ్రహ్మాణం, రుద్రం చ వర్తయతీతి కేశవః
(క+ఈశ+వః) – బ్రహ్మరుద్రాదులను ప్రవర్తింపజేయువాడు కేశవుడు.
హరివంశంలో కైలాసయాత్ర ఘట్టంలో రుద్రుని చేత చెప్పబడిన విధంగా చూస్తే
– “కో బ్రహ్మేతి సమాఖ్యాత ఈశోఽహం సర్వదేహినామ్। అవాం తవాంగసంభూతౌ తతః కేశవనామవాన్”
– క అనే శబ్దం బ్రహ్మను తెలుపుతుంది. “నేను ప్రాణులందరికినీ శాసకుడను. మేమిరువురము (బ్రహ్మ, రుద్ర) నీ శరీరము నుండి జన్మించినవారము కనుక నీవు కేశవుడవు.”
తిరుమழிశై ఆళ్వార్ దర్శించి చెప్పిన విధంగా..
– “నాన్ముకనై నారాయణన్ పడైత్తాన్ నాన్ముకమామ్ తాన్ముకమాయ్ చంగరనై తాన్ పడైత్తాన్” అన్నదానికిది సరిపోలుతున్నది.
నారాయణుడు నాలుగు ముఖములు కలిగిన వాడిని సృష్టించెను. ఆయన్నే బ్రహ్మ అందురు. ఆ చతుర్ముఖ బ్రహ్మ తానే స్వయముగా శంకరుని సృష్టించెను అని పెద్దల వాక్కు. ఆ శంకరునికే రుద్రుడని పేరు. ఎందుకంటే, పుట్టగానే పెద్దగా రోదించాడట. మనిషి పుట్టగానే ఏడుస్తాడు. అలా మనిషికి ఈయనకు గొప్ప సంబంధమున్నది.
ఈ విధంగా చూస్తే కేశవః అంటే బ్రహ్మరుద్రులకు జన్మనిచ్చినవాడు లేదా వారికి మూలమై ఉండువాడు.
హిరణ్యగర్భః కః ప్రోక్త ఈశః శంకర ఏవ చ।
సృష్ట్యాదినా వర్తయతి తౌ యతః కేశవో భవాన్॥
క అనగా హిరణ్యకర్భుడైన బ్రహ్మ, ఈశునిగా చెప్పబడే శంకరుడు (ఈశ్వరుడు – ఈశ్వర – వేరు) వీరిద్దరికీ సృష్టి, లయము అనే బాధ్యతలను అప్పగించి ప్రవర్తింపజేయువాడు కనుక ఆయన కేశవ అనే నామమును పొందెను. ఈ విషయాన్ని తెలియజేసింది సాక్షాత్ శంకరుడే.
– ప్రశస్తాః కేశాః అస్య సన్తి అనగా ప్రశస్తమైన కేశములు కలవాడు.
– కేశినం హన్తీతివా అనగా కేశి అనే రాక్షసుని సంహరించినవాడు.
మహాత్ముడైన నారద ముని శ్రీ విష్ణు పురాణములో శ్రీకృష్ణుడితో అన్న మాటలు..
యస్మాత్ త్వయైవ దుష్టాత్మా హతః కేశీ జనార్దన।
తస్మాత్ కేశవనామ్నా త్వం లోకే ఙ్ఞేయో భవిష్యసి॥
కేశి అనే రాక్షసుడిని వధించినావు కనుక నీవు కేశవుడు అనే నామముతో ప్రసిద్ధికెక్కినావు.
ఈ నామమును దర్శించినది నారదముని.
పురుషోత్తమః అనే నామమును దర్శించినది బ్రహ్మ గారు. పురుషులయందు ఉత్తముడైనవాడు పురుషోత్తముడు. పురుషః – జీవాత్మలు – వాటిని సృష్టించుటకు మునుపే బ్రహ్మ గారు శ్రీమన్నారాయణుని దర్శించినారు. ఆ జీవాత్మలను ఆయన ఆఙ్ఞ మేరకు సృష్టించెను.
కేశోఽ0శుమానీతి వా అనగా సూర్యుని వంటి కిరణములు కలిగిన వాడు కేశవుడు.
సూర్యస్య తపతో లోకాన్ అగ్నేః సోమస్య వాఽప్యుత।
అంశవో యత్ప్రకాశన్తే మమ తే కేశ సంఙ్ఞితాః॥
(మోక్షధర్మ పర్వము – 345.49)
మోక్షధర్మ పర్వములో, “సూర్యుని యొక్క కిరణములు నా కేశములే. అట్టి కాంతివంతములైన కేశములు కలవాడను కనుక నేను కేశవుడను అని భగవానుడు తెలిపియున్నాడు.
ఇక పురుషోత్తమః అనే నామమునకు..
యస్మాత్ క్షరమతీతో హమ్
అక్షరాదపి చోత్తమః।
అతోస్మి లోకే వేదే చ
ప్రథిత: పురుషోత్తమః॥
(భగవద్గీత 15.18 – పురుషోత్తమప్రాప్తి యోగము)
క్షర, అక్షర పురుషులకు అతీతుడును, ఉత్తమమోత్తముడను అగుటచే నేను ఈ జగమునందును మరియు వేదములందును పురుషోత్తమునిగా ప్రసిద్ధినొందితిని.
పైన పేర్కొన్న రెండు రకాల జీవరాశులైన బద్ధ జీవులు, ముక్తుల జీవుల కంటే భగవంతుడు ఎంతో ఉన్నతుడై పరిమాణ రీత్యా అద్వితీయమైన శక్తులను కలిగి ఉన్నవాడు. కాబట్టి అటువంటి భగవంతుడు, జీవునితో సరిసమానుడని భావించుట సరి కాదు. ఇక్కడ ఆ తేడాను ‘ఉత్తమ’ అను పద ప్రయోగము తేట తెల్లము తెల్లము చేయుచున్నది. కాబట్టి ఎవ్వరూ విరాట్ పురుషుడైన శ్రీహరిని అధిగమించలేరు. ఈ విషయము వేదాలలో ప్రత్యేకించి వేదాల ఉద్ధేశ్యాన్ని వివరించే స్మృతి శాస్త్రాలలో నొక్కి వక్కాణించడమైనది. భగవంతుడు బ్రహ్మజ్యోతికి కూడా మూలమని, అతడే పరమాత్మ రూపములో విస్తరించి ఉన్నాడని అంతే కాక వేద వ్యాసునిగా (కృష్ణద్వైపాయన) అవతరించి వేద జ్ఞానమును వివరించి ఉన్నాడని అర్థము చేసుకొనవలెను.
అట్టి పురుషోత్తమ ప్రాప్తి పొందిన వారికి ఇక తెలుసుకొనవలసినది ఏదీ ఉండదు.
॥పురుషాన్నపరం కించిత్॥
అని వేద వాక్యము. ఆయనకన్నా అన్యమైనదేదీ లేదు. ఆయనే సమస్తము అయి ఉన్నాడు.
ఈశ్వరతత్వాన్ని తెలిపే నామము ఇది.
ఇదంతా శ్రీనృసింహావతారానికి అన్వయించి చెప్పుకోవచ్చు.
(సశేషం)