[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]
దామోదరాయ నమః – ద్వైత లోపం
[dropcap]దా[/dropcap]మోదర లీల లేదా ఉలూఖల బంధనమ్ అనేది శ్రీమద్భాగవతానికే తలమానికమైన లీల. ఆ అద్భుతాన్ని వర్ణించటానికి అక్షరమైన అక్షరములు కూడా చాలవు. సౌలభ్యానికి పరాకాష్ట. పరాశర భట్టర్ ఇలాంటి సౌలభ్యాన్ని అనుభవించే, అనుభూతించే, భగవద్గుణ దర్పణమ్ అందించారు.
ఇక్కడే మనకు ద్వైతమ్ గురించి అర్థం చేసుకునే అవకాశం, ఎందుకు ద్వైతానికన్నా అద్వైతమే పరమ సత్యానికి దగ్గరగా ఉంది అనే విషయాలు అవగతమవుతాయి.
శ్రీకృష్ణ లీల!
యశోదమ్మ సంతోషంగా పెరుగు చిలుకుతున్నది. భగవానుడు జన్మించిన (ఏతెంచిన) తరువాత నందవ్రజంలోని వారందరూ ఐశ్వర్యవంతులయారు. ఆండాళ్ కీర్తించినట్లు ఆ సమయాన గోవుల నుంచి క్షీర ధారలు యమునా వేగంతో పోటీలు పడుతూ పితకవలసిన అవసరం లేకుండా వస్తూనే ఉంటాయి.
గోపీజనాంగనలు స్నానం చేసి శుభ్రమయిన వస్త్రములు ధరించి భగవన్నామము స్మరిస్తూ చల్ల చిలికేవారు. యశోద పెరుగు చిలుకుతూ నోటివెంట భగవన్నామం పలుకుతోంది. భగవత్కథలు పలుకుతోంది. ఏమి చేసినా ఆమె కళ్ళ ముందు కన్నయ్యే. ఆ బాలుడి లీలలే. ఆ ముద్దు మాటలు. అల్లరి. కొంటె చేష్టలు. విద్యుల్లతా సదృశమైన చిర్నవ్వు.
మనస్సులో కృష్ణయ్యను తలుచుకుంటోంది. అంతే. తన ఆలోచనల నుంచీ బైటపడి కన్నయ్య యశోద ఎదురుగా నిలుచున్నాడు.
ఎవరు నన్ను మనసు వాచా కర్మణా తలిస్తే వారినే నేను చింతించెదను అని అన్నాడు కదా ఆయన.
మరొక మాట. ఉద్ధవుడికి శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చిన మాట, లేదా తెలియజెప్పిన విషయం ఒకటి పెద్దలు చెప్తున్నారు కదా.
- నా పేరు చెప్పి దానమిస్తే అంతకు పదింతలు ప్రసాదిస్తాను.
- నన్ను కీర్తిస్తే నేను వారి గురించి ఊర్ధ్వ లోకాలలో చాటింపు చేస్తాను.
- నన్ను నిరంతరం స్మరణ చేసేవారి దగ్గరే నేను అనుక్షణం ఉంటాను.
యశోదమ్మ దగ్గరకు వచ్చాడు.
అమ్మను చూడగానే బిడ్డకు ఆకలి గుర్తొచ్చింది. “అమ్మా నాకు బాగా ఆకలి వేస్తోంది. నాకు తొందరగా పాలు ఇవ్వు,” అన్నాడు.
యశోదమ్మకు ఒక చిలిపి ఆలోచన వచ్చింది. కన్నయ్య ఏమి చేస్తాడో చూద్దామని పెరుగు చిలకడం ఆపకుండా నామస్మరణ, లీలాస్మరణ మాత్రం చేస్తూనే ఉంది.
అపుడు కృష్ణుడు, “నువ్వు పాలు చిలకడం ఆపి నాకు పాలు ఇస్తావా ఇవ్వవా?” అని ముందుకురికి కవ్వపు తాడు పట్టుకున్నాడు. పెరుగు బైటకు జారింది ఈ హడావుడి వల్ల. యశోద చిలిపితనం కూడా పెరిగందా క్షణాన.
కవ్వం తిరిగితే పిల్లవాని చెయ్యి నొప్పి పెడుతుందేమోనని తల్లి అనుకుని చల్ల చేయడం ఆపేసింది. కానీ బిడ్డను పట్టించుకోలేదు. నామ స్మరణ, లీలాస్మరణ మాత్రం మానలేదు.
“అమ్మా! ఆకలి.” గావుకేక పెట్టాడు కన్నయ్య. అది కూడా సంగీతభరితంగా ఉంది. కళ్ళవెంట జలజలా రాలింది జలం. అశ్రువుల రూపంలో. గోవుల పొదుగులకు జలారోపణ చేసినట్లు. ఇక ఆగలేదు యశోదమ్మ.
కొడుకుని ఒడిలో పడుకోబెట్టుకుని స్తన్యం ఇవ్వసాగింది. పాలు తాగుతున్నాడు. దూరంలో పొయ్యి మీద పాలు మరుగుతున్నాయి. అవి పొంగి పైకి రావడం ఆవిడ చూసింది. పాలు పొయ్యిలో పడిపోతాయేమోనని పక్కన ఒక పీటవేసి దానిమీద పిల్లవాడిని కూర్చోపెట్టి పొయ్యి దగ్గరికి వెళ్ళింది.
తనకు విలువ ఇవ్వకుండా పాల గిన్నెకు ప్రాధాన్యం ఇవ్వటం స్వామికి కాస్త ఆగ్రహం కలిగించింది. ఆగ్రహమన్నా అనుగ్రహమే కదా పరమాత్మది.
చుట్టూ కలియజూశాడు. అంతే అక్కడ వున్న ఒక రాయితీసి ఒక కుండకి గురిపెట్టి కొట్టాడు. కుండ పగిలిపోయింది. యశోద అహం పగలటానికి అది సంకేతం. అందులోంచి వెన్నముద్దలు తేలి, పైకి వస్తున్న పెరుగు ఒలికిపోయి పల్లంవైపు ప్రవహిస్తోంది. దీనిని తల్లి చూస్తే ఆగ్రహిస్తుందని క్రిందపడిన వెన్నను నోట్లో పెట్టుకుని, గబగబా మింగేస్తూ తనకి తల్లి పాలు ఇవ్వకుండా వెళ్ళిపోయిందని మధ్యమధ్యలో దొంగ ఏడుపు ఏడుస్తున్నాడు.
యశోదమ్మ ఇంకా తనని చూడలేదు. ఆవిడ పాలకుండను పొయ్యిమీద నుంచి దించే ప్రయత్నంలో ఉండిపోయింది. ఆవిడ వచ్చి చూస్తే కోప పడుతుందని రెండుచేతులతో రెండు వెన్నముద్దలను పట్టుకుని గబగబా యింట్లోంచి బయటకు వచ్చి పక్క యింట్లోకి వెళ్ళిపోయాడు. ఆ యింట్లో దంచడానికి పనికిరాని రోలు ఒకటి ఉంది. ఆ రోలును తిరగేసి దానిమీద ఎక్కి నిలబడ్డాడు.
యశోదమ్మ వస్తుందేమోనని ఓరకంట చూస్తూ ఆకలేస్తోంది అని మధ్య మధ్యలో రాగాలు తీస్తున్నాడు ఆ లీలామానుష విగ్రహుడు. అలా చేస్తూ అక్కడ చెట్ల మీద ఉన్న కోతులను పిలిచాడు. ఆ పిల్ల కోతులన్నీ వచ్చి గోడ ఎక్కి కూర్చున్నాయి. వాటన్నిటికి ఆ యింట్లోని వెన్న తెచ్చి పెడుతున్నాడు. అవి చక్కగా ఆ వెన్నను తింటున్నాయి. మధ్యలో వెనక్కి తిరిగి చూసి దొంగ ఏడుపు ఏడుస్తున్నాడు. కోతులను ఎందుకు పిలిచాడు?
నలకూబర మణిగ్రీవులు కుబేరుని కుమారులు. కుబేరుడు (కువేరుడు) ఐశ్వర్యమునకు అధిపతి. ఆయన నవనిధులకు దేవత. ఆయనకు రెండు శక్తులు ఉన్నాయి.
కుబేరుని సహజ లక్షణములు ఆ రెండు. ఒకటి ఇహ లోకంలో సంపద అంతా తన అధీనంలో ఉంటుంది. శంకరునికి దగ్గరగా ఉండటం వల్ల, ఆయన ఆజ్ఞకు బద్ధుడై ఉండటం వల్ల ఆతడు అహంకారము బారిన పడిన సందర్భాలు చాల తక్కువ. పైగా విశ్రవసువు బ్రహ్మ కుమారుడు. రావణాసురుని కన్న ముందు పుట్టాడు. పుట్టి చతుర్ముఖ బ్రహ్మగారి గురించి గొప్ప తపస్సు చేశాడు. బ్రహ్మగారు ప్రత్యక్షమయి ‘ఏమి కావాలి?’ అని అడిగారు. అపుడు కుబేరుడు తనకు దిక్పాలకత్వం ప్రసాదించమని కోరాడు. అపుడు బ్రహ్మగారు “నీకు దిక్పాలకత్వం ఇస్తున్నాను. నీవు ఉత్తర దిక్కున శంకరుని పక్కనే ఉండి నవనిధులకు అధిపతివై ఉంటావు. నిన్ను కుబేరుడని పిలుస్తారు,” అన్నారు.
కుబేరుని జీవితంలో ఒకే ఒక్కసారి పొరపాటు జరిగింది. హిమవత్పర్వత ప్రాంతములో పార్వతీదేవి వెడుతుండగా ఆవిడ సౌందర్యమును చూసి తెల్లబోయి ఎవరీ కాంత అని తల్లిని మాతృ దృష్టితో కాకుండా ఒక స్త్రీని చూసినట్లు సౌందర్య భావనతో చూశాడు. దానివల్ల కుబేరుని కన్నులలో ఒక కన్ను మెల్ల అయిపొయింది. వంకర చూపుకు ప్రతిఫలం.
కుబేరుడు తగువులకు, యుద్ధాలకు వ్యతిరేకి అని ఒక నానుడి. తమ్ముడి వరుస అయిన రావణుడు కుబేరుని లంకా నగరాన్ని ఆక్రమించుకుంటే మౌనంగా ఆ నగరాన్ని వదిలేసి ఉత్తర దిశగా వెళ్ళి అక్కడ స్థిరపడ్డాడు. పుష్పకాన్ని కోరి యుద్ధానికి వస్తే దాన్ని ఇచ్చేశాడే తప్ప గొడవ పడలేదు. ఈ రెండూ తపస్సు వల్లే. అహంకార మమకారాలను వీలైనంత జయించినవాడు కుబేరుడు. అందువల్లే దిక్పాలకుడయ్యాడు. పాలకుడికి ఉండకూడనివే అహంకార మమకారాలు కదా. ఐశ్వర్య మదాన్ని పూర్తిగా జయించినవాడు కనుకనే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాడు. సంపదను గౌరవించాల్సిన రీతిలో గౌరవించాడు కనుక దానిని కోల్పోకుండా ఉన్నవాడయ్యాడు.
అలాంటి కుబేర పుత్రులైన నలకూబర మణిగ్రీవులకు ఆ రెండు లక్షణాలు వంటబట్టలేదు అనేది ఈ సంఘటన ద్వారా తెలుస్తుంది. ఐశ్వర్యంలో పుట్టి పెరిగిన పిల్లలు ఏ విధంగా ఉంటారో ఆ విధంగానే వారి ప్రవర్తన సాగింది.
నలకూబర మణిగ్రీవులు ఒకనాడు ఆకాశగంగలో స్నానం చేస్తున్నారు. దిగంబర స్నానం కూడదన్నది శాస్త్ర వచనం. దిగంబరంగా స్నానం చేస్తే శరీరం పిశాచగ్రస్తమయిపోతుందని అంటారు. మధుపానం అధికంగా చేసిన ఆ కుబేర పుత్రులు దిగంబరంగా స్నానం చేస్తున్నారు. వారితో పాటుగా కొంతమంది యక్షకాన్తలు స్నానం చేస్తున్నారు. వాళ్ళకి కూడా ఒంటిమీద బట్ట లేదు. దిక్పాలకుని కుమారులు దగంబరులై, ఉన్మత్తులై ఉన్నారు. తగిన రీతిలో వారికి హితవు చెప్పాల్సిన అవసరం పెద్దలకు ఉంది. ఆ బాధ్యత నారద ముని పడింది.
అందుకే ఆయన పరమాత్మ ప్రేరేపితుడై ఆ దారినే వెళుతున్నాడు. సోదరులిద్దరితో ఉన్న ఆ కాన్తలు నారదమునిని చూసి, సోయి తెచ్చుకుని గబగబా ఒడ్డుకు చేరి వస్త్రములను తగురీతిలో కట్టుకుని, ఆయనకు నమస్కారము చేశారు.
నలకూబరమణిగ్రీవులు మాత్రం దిశమొలలతో నిలిచి నారదమునికి కనీసం నమస్కారం కూడా చేయలేదు. పెద్దల పట్ల అవిధేయత మంచి పధ్ధతి కాదు. పెద్దల మాటల యందు, ప్రవర్తన యందు, వారియందు, గౌరవమును కలిగి వుండాలి. నారదుడు సామాన్యుడు కాదు. అంత అవిధేయతతో నిలబడ్డ వారిని చూసి నారదముని తనకు అప్పజెప్పబడిన బాధ్యతను నెరవేర్చటానికి మాత్రమే ఆయన ఆగ్రహించాడు. ఐశ్వర్యమదం వల్ల పెద్దాచిన్నా తేడా లేకుండా ప్రవర్తించటం మంచి పద్ధతి కాదు.
యశోదమ్మ తన కుమారునికి పాలు ఇద్దామని వెనక్కి వచ్చింది. కానీ అక్కడ తన కొమరుడు కానరాలేదు. వెతికింది. అక్కడక్కడా పడి ఉన్న వెన్నను చూసింది. పగిలిన కుండ చూశాక ఆవిడకు అర్థమైంది ఏమి జరిగిందో అని. పక్క ఇంటి వైపు వెళ్ళింది. అక్కడ దృశ్యం చూసింది.
ఒక వంక కోతులకు గోరుముద్దలు తినిపించే ఆ చిన్ని చేతులను చూస్తే వెనువెంటనే ముద్దాడాలని కోరిక. మరొకవంక గోప స్త్రీల ఫిర్యాదులు. వాటిని కొట్టి పడేసినా, ఈ రోజు తన ఎదుటే.. ఏమి చేస్తాడా అని దూరం నుంచే గమనిస్తూ ఉంది. కన్నయ్య తల్లి రావటాన్ని గ్రహించాడు. ఓరకంట చూశాడు. మనసులో భావాలను పసిగట్టాడు. అందుకే పక్క ఇంటిలోకి పరుగెత్తి రాళ్ళతో పాలకుండలను కొట్టాడు.
క్షీర ధారలు. ఆ కోతి పిల్లలను ఇంటిలోకి పంపాడు.
యశోద ఇక ఆగలేదు. పరుల చేత కృష్ణయ్య ఎక్కడ మాటలు పడతాడో అని ఒక చిన్న బెత్తం పట్టుకుని వెళ్ళింది. కన్నయ్య పరిగెత్తాడు. యశోద వెనుక.
పరమాత్మ వెనుక జీవాత్మ. ఇలా రప్పించటం కోసం ఆయన చేసే లీలావినోదం.
తిప్పాడు. తిప్పాడు. యశోద అలసినది. కృష్ణా అని పిలిచింది. వెనక్కు చూశాడు స్వామి. యశోద ఆగకుండా వస్తూనే ఉంది. మరోసారి పిలిచింది. మరోసారి. మరోసారి.
నామస్మరణ. మంత్రం వేసినట్లు ఆగిపోయాడు కృష్ణుడు. యశోద సరిగ్గా..
అవిధేయతతో నిలబడ్డ వారిని చూసి నారద ముని ఆలోచించాడు. “ఆహా! తండ్రికున్న ఐశ్వర్యమును చూసుకుని ఎంత మదోన్మత్తులై ఉన్నారు వీరు?”
తండ్రి సుగుణములను అలవరచుకోని వీరు ఆ తండ్రి ఐశ్వర్యమును పొందుటకు అర్హులు కారు. కాబట్టి వీరికి ఈ ఐశ్వర్యమును లేకుండునట్లు చేస్తాను. అపుడు వీరికి దేనివలన అహంకారం కలిగిందో, అది లోపించటం వల్లే ఆ అహంకారం అణగుతుంది.
అందుకే వారిని నారదముని మద్ది చెట్లలా పడి ఉండమని శపించాడు. ఎన్ని వేల సంవత్సరాలు గడిచాయో. చివరకు ఈనాడు వారికి ఆ శాపవిమోచనం కలుగబోతోంది. అందుకే ఈ లీల.
..ఆ మద్ది చెట్ల కిందే ఉన్నదాసమయాన. యశోదకు సరిగ్గా పది గజముల దూరంలో ఉన్నాడు భగవానుడు. ఆయన ఆగి ఉండటం చూసిన యశోద వేగంగా కదిలి, స్వామిని చేరి పట్టుకుంది. చేతిలో బెత్తం మాత్రం ఈ హడావిడిలో ఎక్కడో పడిపోయింది. కన్నయ్య ఆ బెత్తం కోసం చూశాడు. అది రెండు ముక్కలై యమళార్జునుల దగ్గరలోనే పడి ఉంది.
యశోదకు ఎదురుగా రోలు కనిపించింది. స్వామి అలా కనపడాలనే ఆ రోటిని అక్కడకు లాగాడు. కుబేర పుత్రులను ఉద్ధరించటానికి ఇంత శ్రమ.
కన్నయ్యను రెక్క పట్టుకుని ఆ రోటి వద్దకు తీసుకు వెళ్ళింది. దాని మీద కుదేసింది. చెయ్యి ఎత్తి మరి పారిపోతే కొడతానన్నట్లు బెదిరించింది.
లోపలకు వెళ్ళింది. తాడును తెచ్చుకుంది. ఒక వంక రోటికి కట్టింది. అది అసలు అక్కడుకు ఎలా వచ్చిందో ఆలోచించలేదు.
పరమాత్మను ఆత్మలో బంధించటమే ఆమె లక్ష్యమా క్షణాన. మరొక వైపు ఆ తాడును కన్నయ్య నడుముకు చుట్టబోయింది. తాడు రెండు అంగుళాలు తగ్గింది. నాలుగు వేళ్ళు పెట్టి చూసింది. సరిగ్గా సరిపోయింది. మరొక చిన్నతాడు తెచ్చి కట్టబోతే మళ్ళీ రెండంగుళాలే తగ్గింది. మరో ఐదుమార్లయ్యాక అలసట మరింత పెరిగింది.
కన్నయ్యా! ఇక నేను తిరుగలేను. వల్లకావటం లేదు. నువ్వే ఇక్కడ..
మాట పూర్తి కాలేదు. యశోదకు తెలియకుండా శక్తి వచ్చింది. తగ్గిన రెండు అంగుళాలు సరిపోయేలా తాడు కొలత వచ్చింది. కట్టేసింది.
తండ్రి వచ్చేవరకు బుద్ధిగా కూర్చోమని లోపలకు వెళ్ళింది.
బుద్ధిగా కూర్చునేందుకా ఇన్ని సంఘటనలను సృష్టించింది స్వామి?
మెల్లగా ఆ రోటిని లాగుకుంటూ వెళ్ళాడు. కొంత దూరమయ్యాక నేల మీద మోకాళ్ళతో పాక్కుంటూ వెళ్ళాడు. మధ్యలో వెనుతిరిగి చూశాడు. అక్కడ పిల్ల కోతులు ఉన్నాయి. వాటి వైపు చూసి చిత్రంగా నవ్వాడు. అవి ఆయన నేస్తులుగా మారాయి.
ఇక మిగిలింది యమళార్జున భఞ్జనమే!
కదిలాడు. సరిగ్గా ఆ ఆగిన చోటుకు రెండు గజాల దూరమే మిగిలింది. తన నేస్తులు చూస్తుండగా ఆ చెట్ల మధ్యనుంచీ వెళ్ళబోయాడు. రోలు చెట్లకు అడ్డం పడింది. బలంగా లాగాడు.
అంతే! ఫెళ్ళుమని ఆ చెట్లు విరగటం నలకూవర మణిగ్రీవుల శాపం తీరి నిజరూపం రావటం క్షణాలలో జరిగింది.
స్వామి ఏమీ తెలియనట్లు కుడిచేతి చిటికెనవేలును నాభి దగ్గర ఉంచాడు. అంగుష్ఠాన్ని పైకి జరిపాడు. తన హృదయం మీద కొలత లాగా. కంఠం దగ్గర ఎడమచేయి బొటనవేలు ఉంచి, కనిష్ఠికను కిందకు జాపి కుడిచేతి బొటన వేలు పక్కనే నిలిపాడు. అవి సరిగ్గా రెండంగుళాలు సరిపోయేంత కలిశాయి. The overlapping of the left little finger and the right thumb is the place where the aatma (జీవాత్మ) resides in the body of us.
రెండంగుళాలు!
నలకూబరమణిగ్రీవుల అహంకార మమకారాలు నశించాయి. అందుకే పరమాత్మ దర్శనం జరిగింది.
అంతకుముందు నామస్మరణ, అలసిపోయాను చెప్పుకుని ఇక నీవే దిక్కు అని సంకేత మాత్రంగా తెలుపటం వల్ల యశోదకు స్వామి సాంగత్యం దక్కింది.
ఆ స్వామిని చేరటానికి కావలసిన దినుసులలో తగ్గినవి రెండే! అవే ఆ రెండంగుళాలు.
అహంకార మమకారాలు.
ఉత్తరాది మఠానికి చెందిన శ్రీ సత్యసంధ తీర్థుల వారి ద్వైత సంప్రదాయ వ్యాఖ్యానం ప్రకారం శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రంలో 998 నామాలే ఉన్నాయట!
రెండు నామాలు తగ్గాయి. లేదా పద విభజనలో వేరు రకమైన పద్ధతిని ఎన్నుకున్నారు.
అది ఎక్కడంటే…
- సనాత్సనాతన తమః
- హుతభుక్భోక్తా
ఈ రెంటిని ఏక నామాలుగా తీసుకున్నారు. నిజానికవి
సనాత్ – ఆది లేనివాడు.
సనాతన తమః – సృష్టికర్త యైన బ్రహ్మకు పూర్వము కూడా ఉన్నవాడు.
ఆ సనాతనత్వాన్ని వీరు ఇలా నిర్వచించారు.
తనకు ఎదురు నిలిచిన వానిని హరించువాడు. లేదా.. బ్రహ్మకైనను అందనంత పురాతనమైనవాడు.
ఆది లేనివాడు. దీనిని వదిలేశారు. (పెరియాయ్).
హుతభుక్ – యజ్ఞములందు ఆవాహన చేయబడిన దేవతల రూపమున హవిస్సులను స్వీకరించువాడు.
భోక్తా – భోగ్యవస్తువైన ప్రకృతిని అనుభవించువాడు.
ఈ రెండింటినీ కలిపి దాదాపు ఈ క్రింది అర్థం లోనే చెప్పారు.
యజ్ఞములందు ఆవాహన చేయబడిన దేవతల రూపమున హవిస్సులను స్వీకరించువాడు.
ఇక్కడ భోక్తా లుప్తమైపోయింది.
ప్రకృతిని అనుభవించువాడు ఆయన. తీసివేస్తే మిగిలేది మనం. ఇక్కడ అటు జీవాత్మ, ఇటు పరమాత్మ వేరు వేరు అని చెప్తున్నారు.
ఈ వేరౌట అహంకార మమకారాలు మనలో దూరినప్పుడే జరుగుతుంది. నీది, నాది అనే విభజన.
ఆ రెండు దినుసుల దూరమే ద్వైతాన్ని ప్రామాణికం కాకుండా ఆపింది. అద్వైతమే సరియైనదని ఋజువయ్యింది.
కానీ కొన్ని చోట్ల ద్వైత నిర్వచనాలు కూడా చాలా సౌందర్యవంతంగా ఉంటాయి. అందుకే దానినీ పరిశీలిద్దాము.
మొదటి పాశురంలో కీలకమైన పదాలు
యశోదై ఇళం సింగం.
అదే ఏత్త కలంగళ్ అని మొదలయ్యే 21వ పాశురంలో ఆండాళ్ రహస్యంగా ఉంచిన కీలకపదం పెరియాయ్! సంప్రదాయ అర్థాలలో, వ్యాఖ్యానాలలో దీని గురించి గట్టిగా ఆలోచించలేదు. ఎవరూ గట్టిగా చెప్పనూ లేదు. కానీ, చదవగా చదవగా, చూడగా చూడగా, అనుభవించగా అనుభవించగా అవగతమయ్యే విషయం..
పెరియాయ్! ప్రాచీనుడా. ఊహ, ఆలోచనలకు అందనివాడా. బ్రహ్మాండములోను, దానికి ఆవలా ఉన్నవాడా.
యిళంశింగమ్ – సింహపు కూన. చిన్నవాడా. పసివాడా. అణువంతటివాడా.
అంటే…
Aandal had known him inside and out. Knows how big and ancient he is and how small and newest he is. That’s why he had fallen for her. తనను గూర్చి సంపూర్ణముగా ఎరిగిన ఏ స్త్రీకి అయినా పురుషుడు..
ఈ కీలకాల గురించే మనవాళ మహాముని ఆలోచించినది. చివరకు ఆయనకు తట్టినది.
యా బలాత్కృత్య భుంక్తే..
How audacious she would have been to have been referred to like that! ఎందుకంటే ఆమె భూదేవి అంశ. ఆయన సహచరి. ఆయన సంచరించిన ప్రదేశాన్ని పట్టి ఉంచిన శక్తి. యజ్ఞవరాహ రూపంలో ఆయన చేత ఉద్ధరింపబడినదాయే! She knows him inside out.
మరి అలాంటి స్వామి తత్వాన్ని సంపూర్ణంగా తెలిపిన సహస్రనామాలను స్మరిస్తూ తరిద్దామా? అర్థం తెలుసుకుంటూ.
చూడండి చిత్రం.
మనం తెలుసుకునేది అర్థమే. అర్ధం. సగం.
మరి మిగిలినది? గురువు అందిస్తాడు. దానిద్వారా పరబ్రహ్మ స్వరూప సుజ్ఞానం కలుగుతుంది.
మనకు తెలిసేది అర్థమే!
గుర్తుంచుకోండి.
(సశేషం)