Site icon Sanchika

తల్లివి నీవే తండ్రివి నీవే!-31

[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]

సర్వం విష్ణుమయం జగత్ – 2

మదన పరిహర స్థితిం మదీయే

మనసి ముకుందపదారవిందధామ్ని।

హరనయనకృశానునా కృశోఽసి

స్మరసి న చక్రపరాక్రమం మురారేః ॥ 29 ॥ (ముకున్దమాలా)

అగణిత గుణ కనక చేల సాల విడలనారుణాభ సమాన చరణాపార

మహిమాద్భుత సుకవిజన హృత్సదన సుర మునిగణ విహిత కలశ

నీర నిధిజా రమణ పాప గజ నృసింహ వర త్యాగరాజాధినుత

(జగదానంద కారకా.. త్యాగరాజ పంచరత్నం)

29.భూతాదిః = సకల భూతములకు మూలము, కారణము, సకల భూతములచే ఆత్రముగా కోరబడువాడు. పంచ భూతములను సృష్టించిన వాడు.

30.నిధిరవ్యయః = తరుగని పెన్నిధి, ప్రళయకాలమునందు సమస్త ప్రాణికోటులను తనయందే భద్రపరచుకొనువాడు.

భూతములకు ఆది కారణమై భూతాదిః అని స్తుతించబడుతున్నాడు. పంచ మహాభారతాలకు ఆయనే కారణమై ఉన్నాడు.

మమ వర్త్మాను వర్తన్తే మనుష్యాః పార్థసర్వశః॥ – భగవద్గీత 4వ అధ్యాయం.

సనాతన ధర్మానుయాయులకు మానవ లక్ష్యాన్ని చేర్చే మార్గాలు మూడు ప్రముఖమై భాసిల్లుతున్నాయి.

  1. ద్వైతము
  2. అద్వైతము
  3. విశిష్టాద్వైతము.

మూడూ అనుసరణీయాలే. ఈ విషయాన్ని స్వయంగా గురువాయూరప్పన్ స్పష్టపరచిన విషయం మనం మొదట్లో చూశాము. అది ద్వైత మార్గమైనా, అద్వైతమైనా, వ్శిష్టాద్వైతమైనా భక్తి ప్రధానం. ఆ పైన ఆ పరమాత్మ ఎవరిని ఎక్కడకు చేర్చాలో అక్కడకే చేరుస్తాడు. ఎవరి స్వ సంప్రదాయాన్ని వారు పాటించాలి. ఇతరులను గౌరవించాలి. స్వీయ ఆచరణ సర్వ ఆదరణ అనే చిన జీయర్ స్వామి వారి మాట సదా అనుసరణీయం.

మూఢులు తాము అనుసరిస్తున్న మార్గమే విశిష్టమైనదని భావిస్తూ ఇతర మార్గాలను అనుసరించే వారిని ద్వేషిస్తారు. ఆ ద్వేషం కూడదు. ద్వేషం ఆసురీ గుణం. తమస్సును పెంచుతుంది. భగవచ్ఛక్తి ఇటువంటి గుణమును సహించదు.

ఒకరు శివుడు గొప్ప అంటే వేరొకరు విష్ణువు గొప్ప అంటూ వుంటారు. శివనామము ఉచ్చరించని వైష్ణవులు, విష్ణునామమును సహించని శైవులు కొంతకాలం ముందుండేవారు. వీరశైవులు వైష్ణవులను ఎలా వేధించింది కూడా చాలా చరిత్రలలో ఉంది. ఈమధ్య చాలామంది ప్రముఖ ప్రవచనకారులు కావాలని వైష్ణవాన్ని చిన్నబుచ్చేలా మాట్లాడటం మనం చూస్తున్నాం. అలాగే శివాలయాలను స్మశానాలతో పోల్చే అఙ్ఞానులు కూడా తారసపడుతునే ఉన్నారు.

వీరు శివుడంటే ఏమో, కేశవుడంటే ఏమో తెలియని మూర్ఖులు. అన్ని నదులూ సముద్రము చేరినట్టే మనము ఏ దేవునికి నమస్కరించినా అది దేవదేవుడైన పరమాత్ముని చెంతకు చేరుతాయి.

ఆకాశాత్పతితం తోయం యథా గచ్ఛతి సాగరం

సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్ఛతి.

కొందరు శంకరం ప్రతిగచ్ఛతి అని మార్చుకుంటారు. తప్పులేదు. విష్ణుద్వేషం వల్ల కాకుంటే.

ఏ యథా మాం ప్రపద్యన్తే తాం సథైవ భజామ్యహమ్।

మమ వర్త్మాను వర్తన్తే మనుష్యాః పార్థ సర్వశః॥

ఎవరెవరు వారికి నచ్చిన రూపములో ధ్యానిస్తే నేను ఆయా రూపములతో వారికి సాక్షాత్కరిస్తాను అన్నాడు గీతాచార్యుడు.

దీనికి ధృవ చరిత్రములో మంచి ఉదాహరణము లభిస్తుంది. ధృవుడి తపస్సుకు మెచ్చి శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు ధృవుడు ఆ వచ్చినది నారాయణుడా అని గుర్తుపట్టలేని స్థితిలో ఉంటాడు. ఆ బాలుడికి తెలసినది శంఖచక్ర గదాపద్మములతో ఉంటాడు ఆ శ్రీ హరి అని మాత్రమే. కానీ ఇక్కడ ఒక చిక్కు వచ్చింది. ధృవుడి లెక్కన చక్రము కుడి చేతిలో, శంఖము ఎడమ చేతిలో ఉంటాయి అని నారదముని చెప్పిన మాటలు బాగా పట్టించుకున్నాడు. కానీ అప్పుడు జనార్దనుడి ఎడమ చేతిలో చక్రము, కుడి చేతిలో శంఖము ఉన్నాయట. అది చూసి బాలుడైన ధృవుడు తత్తరపడి గుర్తుపట్టలేదట వచ్చినది శ్రీమహావిష్ణువే అని. అది గ్రహించిన శ్రీహరి ధృవుడు ఊహించుకున్న రూపములోనే దర్శనమిస్తాడు.

ఆయుధాలు ఎలా ఉన్నాయి అన్నది కాదు విషయం. ఎవరు ఎలా ఆరాధిస్తారో అలానే దర్శన మివ్వటం అన్నది తెలుసుకోవలసిన సంగతి. అందుకే అర్థం మాత్రమే అవుతుంది మనకు. అంటే ఏ ఒక్కరూ ఆ పరబ్రహ్మాన్ని ఒకేలా చూడలేకపోవచ్చన్నది అంగీకరించాల్సిన మాట.

ద్వైతము నిజమా? అద్వైతము నిజమా? విశిష్టాద్వైతము నిజమా? ఈ ప్రశ్నకు సమాధానమే అర్థ సంపూర్ణం.

Just like every observer has his/her own frame of reference, everyone has his/her own perception of this universe. Based on the frame of reference, every law of physics alters not in its base model but on value terms. ఈ విషయాన్ని మనం ఇంద్రధనసు ఉదాహరణతో 22వ భాగం (అనాత్మ గానం) లో చూశాము.

The Parabrahman transcends all these frames of reference and remains the same. But the observers see differences. The problem is with us. Not with the universe.

చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోవాల్సిన విషయమిది. పరబ్రహ్మ ఒక్కడే. ఆ పరబ్రహ్మను మనం అవగతం చేసుకునే విధానాలు వేరు వేరు. ఎవరికి వారము మనం చూసే పరబ్రహ్మము కూడా మారవచ్చు. ఇదంతా నిరాకారానికి సంబంధించి. కానీ పరబ్రహ్మము ఎల్లప్పుడూ ఒకే రకంగా ఉంటాడు. మనకు సులభంగా అందుబాటులో ఉండేందుకు ఆయన నిరాకారం నుంచీ సాకారమవుతాడు. ఆ సాకార రూపాన్ని మనం standardise చేసుకోవాలని విఫలయత్నం చేస్తుంటాము. అక్కడే మనకు విగ్రహారాధన పనికి వచ్చేది. ఎవరో గీసిన చిత్రాలో, ఎవరికి వారు ఊహించుకున్న విధంగా కాకుండా ఆ పరమాత్మ మనకు స్వయంభూ గా వెలసి నన్ను ఇలా కూడా పూజించవచ్చు అని మార్గాన్ని సులభం చేస్తాడు.

ఒక సత్యము అంతకన్నా విశిష్ట మైన సత్యాన్ని చూపుతుంది. మహా భక్తాగ్రేసరుడైన ఆంజనేయుడు ఈమూడు సిద్దాంతాలను అద్భుతంగా సమన్వయ పరిచాడు. ఈ విషయాన్ని నేను పెద్దల నోట విన్నాను. వారు చెప్పిన ప్రకారం..

దేహ భావేన దాసోహం – ద్వైతము

జీవ భావే త్వదంశకః – విశిష్టాద్వైతము

ఆత్మాభావే త్వమేవాహం – అద్వైతము

ఇతియే నిశ్చితా మతః

అనగా దేహభావంతో భగవంతుని ‘దాసోహం’ (నీ దాసుడను) అని అర్చిస్తారు.

జీవభావంతో ‘నేను భగవదంశను’ అని మరొకరు(విశిష్టాద్వైతము) దేవుని ప్రార్థిస్తారు.

ఆత్మ భావం తో నీవే నేను (సోహం)అని అద్వైతి భగవంతుడిని ఆస్వాదిస్తారు.

ఎవరికి వారు తమ తమ ప్రకృతి ననుసరించి వారు తమ పద్ధతి ప్రకారం లేదా సంప్రదాయం ప్రకారం భగవంతుడిని ఆరాధిస్తారు. మార్గాలు వేరైనా లక్ష్యమొకటే అని అర్థమన్నా చేసుకుంటే ద్వేషాలకు తావు ఉండదు. ప్రసిద్ధమైన శ్లోకాలు.

శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే।

శివస్య హృదయం విష్ణు: విష్ణోశ్చ హృదయం శివః॥

యథా శివమయో విష్ణురేవం విష్ణు మయశ్శివః।

యథాంతరం నపస్యామి తథామే స్వస్తిరాయుషి॥

భూతైః ఆదీయతే ఉపాదీయతే ఇతర భూతాదిః (పరాశర భట్టర్ వ్యాఖ్యను అనుసరించి).

స్పృహణీయుడిగా (కోదగినవాడిగా) ఉండటం చేత సమస్త ప్రాణుల చేతను గ్రహింపబడుతున్నాడు.

ద్వైత వ్యాఖ్య ప్రకారం…

భూతానాం ఆదిః – ప్రాణికోటికి కారణమైనవాడు.

ఆదిః అంటే మొదలు అనే కాదు. మూలకారణము అయిన వాడు. The root cause of all.

భూతానామ్ ఆదిః భక్షక ఇతి వా (అద భక్షణే ధాతువు). అంటే ప్రళయకాలమున సమస్త ప్రాణికోటినీ భక్షించువాడు.

Everything comes from the same source and it is to the same root everything goes back.

సృష్టి సంకల్పానికి పూర్వమున్న శుద్ధచైతన్యమే భూతాదిః అని సుదర్శన వ్యాఖ్య తెలుపుతున్నది. దీనికి ముందు వచ్చిన స్థాణుః అనే నామము చైతన్యరాహిత్యాన్ని తెలుపుచున్నదా అని అనుమానం కలిగితే దానికి సమాధానమీ నామము.

ఇక్కడ మరొక విషయాన్ని గమనించాలి. ఆ ఆదిచైతన్యాన్ని.. అంటే సృష్టికి పూర్వమున్న చైతన్యమునే గోదాదేవి (ఆండాళ్) పెరియాయ్ అనే పద ప్రయోగం ద్వారా తెలిపింది. ఆ తల్లి వాడిన ఆ మాటకే వటపత్రశాయి ఆమెకు లొంగాడు. ఆమె ఆడమన్నట్లు ఆడాడు. నడవమంటే నడుస్తాడు. కూర్చోమంటే కూర్చుంటాడు. అలా.. ఈ విషయాన్ని మనం తిరుప్పావైలో చూస్తాము.

నీవు నడిస్తే చూస్తాము మేము (సింహగమన సదృశమైన నీ నడకను మేము చూడాలని తహతహలాడుతున్నాము). నీవు కూర్చుంటే చూస్తాము.

ఈ భూతాదిః అన్న నామమునకు సంప్రదాయ వ్యాఖ్యలు క్లుప్తంగానే ఉన్నాయి. కానీ ఇక్కడ గ్రహించాల్సినది చాలా ఉన్నది. దానిని పరశీలిద్దాము.

(సశేషం)

Exit mobile version