Site icon Sanchika

తల్లివి నీవే తండ్రివి నీవే!-34

[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]

ధర్మోధికతమో మతః

విశుద్ధవిజ్ఞానఘనస్వరూపం

విజ్ఞానవిశ్రాణనబద్ధదీక్షం।

దయానిధిం దేహభృతాం శరణ్యం

దేవం హయగ్రీవమహం ప్రపద్యే॥ (హయగ్రీవ స్తోత్రం – 5)

అజ్ఞానాంధకారం నుంచీ భక్తులను విముక్తులను చేస్తాను అన్నది హయగ్రీవ స్వామి వారి వ్రతం. ఎలా అంటే..

సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే।

అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ॥

ఒక్కసారి శరణు అని నన్ను ఆశ్రయించిన చాలు, నేను నీ వాడినని అర్థిస్తే చాలు (ఆత్మార్పణ) అఖిలజీవరాశులందరికి (సమస్త జీవ సముదాయానికి) నేను అభయం ఇచ్చి తీరుతాను. ఇది నా యొక్క వ్రతము.

అని శ్రీరామచంద్రుడు చేసిన ప్రతిఙ్ఞలాగా.

అలా ఆ దీక్ష పూనిన హయగ్రీవుని కరుణ ఎంత గొప్పదో. అనంతమైన ఆ కరుణకు పాత్రులైన వారు అదృష్టవంతులు. శుద్ధమైన బ్రహ్మజ్ఞానానికి నెలవైన శ్రీహయగ్రీవుని కరుణ కొరకు భక్తులు ఆయన పాదాలను ఆశ్రయించి కృతార్థులు అవుతారు. హయగ్రీవుడు శుద్ధమైన పరబ్రహ్మ స్వరూపం. తనను ఆశ్రయించిన వారిని ఆయన జననమరణ చక్రం నుంచీ విముక్తులను చేస్తాడు. భక్తులకు దారి చూపే కాంతి లాంటి వాడు శ్రీహయగ్రీవ స్వామి. ఆయన రక్షణ దొరికితే భక్తులకు ఏ విధమైన సమస్యా ఉండదు. అలాంటి హయగ్రీవ స్వామిని నేను ఆశ్రయిస్తున్నాను. ఆయన్నే శరణు వేడుతున్నాను.

దాక్షిణ్యరమ్యా గిరిశస్య మూర్తిః-

దేవీ సరోజాసనధర్మపత్నీ।

వ్యాసాదయోఽపి వ్యపదేశ్యవాచః

స్ఫురన్తి సర్వే తవ శక్తిలేశైః॥ (హయగ్రీవ స్తోత్రం – 5)

సకల విద్యలకూ అధిదేవత శ్రీహయగ్రీవ స్వామి. పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకునేందుకు ఆయనను మించిన శక్తిగల వారు మరొకరు లేరు. దక్షిణామూర్తికి ఆ విద్యాశక్తిని అందించింది హయగ్రీవుడే. ఆ శక్తిని ఆధారం చేసుకునే దక్షిణామూర్తి బంగారు రంగుగల మఱ్ఱిచెట్టు క్రింద కూర్చుని అగస్త్య మహర్షి, మార్కండేయుడు, పులస్త్యుడు మొదలైన వారికి పరబ్రహ్మమునకు సంబంధించిన తత్వజ్ఞానాన్ని బోధించాడు. వారిని తరింపజేశాడు. పితామహుడైన బ్రహ్మదేవుని ధర్మపత్ని సరస్వతీదేవికి ఆ విద్యా ధనాన్ని ప్రసాదించింది హయగ్రీవుడే. ఆమె తెల్లని పద్మంలో కూర్చుని ఉంటుంది. వేదవ్యాసునికి పురాణేతిహాసాలను రచించటానికి, వేదాలను వ్యాసము (విభజన) చేయటానికి అవసరమైన శక్తిని ఒసగినది కూడా ఆ హయగ్రీవుడే. వీరందరికీ ఆయన ప్రసాదించిన లేశమాత్రమైన శక్తి ఎన్నో అద్భుతాలను చేయించింది. అలాంటి హయగ్రీవ స్వామిని నేను ఆశ్రయిస్తున్నాను.

ఈశ్వరః (36)

  1. ఈశానశీలత్వాత్ ఈశ్వరః – శాసించు స్వభావం కలవాడు.
  2. ఈశేభ్యో వర ఇతి – ప్రభువులందరి కంటే శ్రేష్ఠుడు.

ఇది ద్వైతం ప్రకారం. శాసించు స్వభావం అంటే ఇక్కడ ఆ పరబ్రహ్మం నియంతృత్వమున్నవాడు లేదా నియంతృత్వాన్ని చూపేవాడు అని కాదు. దీని గురించి నియంతా అనే నామము దగ్గర పరిశీలనగా చూద్దాము. ఎందుకు శాసించగలడు అంటే ఆయన అందరిలోకి సర్వోన్నతుడు కనుక మిగిలిన అందరూ ఆయన ఆఙ్ఞలకు బద్ధులు అయి ఉంటారు. చెప్పాల్సిన పని లేకుండానే.

ప్రభువులందరి కంటే శ్రేష్ఠుడు అంటే దేవతలకు కూడా ప్రభువైన వాడు కనుక.

ఈష్టే ఇతి ఈశ్వరః – ఒకరి సహాయం లేకుండానే సమస్త కార్యములు నెరవేర్చుకొనగలిగిన శక్తి ఉండటం చేత ఈశ్వరః అని కీర్తింపబడెను.

ఏష సర్వేశ్వరః.

అతడే సర్వేశ్వరుడు అని వేదం తెలియజేయుచున్నది. అతని వైభవం నిరుపాధికం. అతని ప్రాదుర్భావము నిరంజనము. అతని ప్రాభవము నిర్వికల్పము. అతని వైదగ్ధ్యము ఊహాతీతము. సకలమునకూ అతడే వ్యవహర్త. సమస్తమునకూ అతడే అధిష్ఠాత. సర్వమునకు అతడే అనుగ్రహీత. సర్వులకు అతడే అభిగోప్త. ఆవిర్భవించిన, ఆవిర్భవిస్తున్న, ఆవిర్భవించబోతున్న సకల ప్రాణులకు తానే ఆది అయి ఉన్నాడు (భూతాదిః).

పెరియాయ్!

ఇది అద్వైతము ప్రకారం.

ఈష్ఠే ఇతి ఈశ్వరః – అన్న ఈ వాక్యమును ప్రమాణముగా విశిష్టాద్వైతము స్వీకరించినా వ్యాఖ్యానము వేరుగా ఉన్నది.

పరమపదములో పరమేష్ఠిగా ఉండటం కన్నా, అవతరిస్తూ భక్తులను తరింపజేస్తూ, తన ఐశ్వర్యము అధికముగా అవతారములందు ఐశ్వర్యము గలవాడు.

భగవద్గీతలో చెప్పినట్లు..

అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితమ్।

పరం భావమజానంతో మమ భూతమహేశ్వరమ్॥ (9.11)

నేను నా సాకారమనుష్య రూపంలో అవతరించినప్పుడు, మూఢులు నన్ను గుర్తించలేకున్నారు. సకల భూతములకు ఈశ్వరుడనైన నా వ్యక్తిత్వం యొక్క దివ్యత్వము వారికి తెలియదు.

అజోఽపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోఽపి సన్।

ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా॥ (4.6)

నేను పుట్టుకలేని వాడిని అయిఉండి కూడా, సమస్త ప్రాణులకు ప్రభువునై ఉండి కూడా, నాశములేని వాడినై ఉండి కూడా, నేను ఈ లోకంలో నా యోగమాయా దివ్య శక్తిచే అవతరిస్తుంటాను.

భూతానామ్ — సమస్త ప్రాణులకు

ఈశ్వరః — స్వామి

అపి — అయి

సన్ — ఉండినా

సంభవామి — నేను వ్యక్తమవుతాను

ఆత్మ-మాయయా — నాయొక్క యోగమాయా శక్తి చేత.

అంటే ఈశ్వరః అంటే సకలమునకు స్వామి.

అంటే బ్రహ్మ గారికి కూడా స్వామియే.

అయినా శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన యోగమాయ వల్ల ఆయన శ్రీకృష్ణుడే పరబ్రహ్మము అని తెలుసుకొనలేక ఆ పరీక్షకు పాల్పడి ఓడిపోయాడు.

బ్రహ్మ అంటే ఈ ఒక్క బ్రహ్మ అని ఏమీ లేదు. అనేకులున్నారు. వారు అనేకములైన సృష్టులకు బాధ్యత వహిస్తుంటారు. వారందరికీ ఈశ్వరుడైన వాడు ఒక్కడే. ఆ ఈశ్వరుడే శ్రీకృష్ణావతారమునెత్తి బ్రహ్మ గారికి ఈ సందర్భములో తన మహిమను చూపెను.

ఒక ప్రక్క గొల్ల పిల్లలు ఇటు ప్రక్కనా ఉన్నారు (శ్రీకృష్ణ లీల ద్వారా). మరొకప్రక్క వారు బ్రహ్మ గారు దాచిన గుహలో కూడా ఉన్నారు. Parallel universe?

సమాంతర విశ్వాలా?

చాలా పేరు పొందిన స్టీఫెన్ హాకింగ్ పుస్తకం.. Black Holes and Baby Universes ఈ విషయాలను గురించి చెప్తుంది.

Black Holes and Baby Universes by Stephen Hawking is a collection of essays and lectures exploring the nature of black holes, the beginning and end of the universe, and the possibility of other universes.

In the third essay of the book, Prof. Hawking turns his attention to the possibility of other universes. He discusses the concept of the multiverse, the idea that there may be an infinite number of universes existing alongside our own. He also discusses the possibility of traveling between universes, and the implications of this for our understanding of reality.

ఇక మల్టీవర్స్ సిద్ధాంతం (అనేక విశ్వాలు) గురించి క్లుప్తంగా చూస్తే..

ఇది ఒక ఊహాత్మక భౌతిక శాస్త్ర సిద్ధాంతం. ఇది మన ఉన్న విశ్వము ఒక్కటే కాదని, ఇలాంటి, ఇందుకు భిన్నమైన విశ్వాలు మరిన్ని ఉన్నాయని (లేదా ఉండి ఉంటాయని) సూచిస్తుంది. ఈ విశ్వాలు ఒకదానికొకటి చాలా భిన్నంగా ఉండవచ్చు, భౌతికశాస్త్ర నియమాలు, ప్రాథమిక స్థిరరాశులలో భేదాలు కూడా ఉండవచ్చు.

స్థిరాంకంలో చివరి అంకె అనే 16వ అధ్యాయంలో ఇలా చెప్పబడింది.

ఆకాశంలో మనకు కనిపించే కోటానుకోట్ల నక్షత్రాలు, గ్రహాలు, గ్రహశకలాలు, తోకచుక్కలు, కనపడని కాలబిలాలు, చీకటి పదార్థాలు మొదలయిన వన్నిటి సమూహాలను, సముదాయాలను విశ్వం లేదా యూనివర్స్ అంటున్నాం. విశ్వం లోని ప్రతీ అణువు ఇతర సూక్ష్మకణాలతోను, కొన్ని శక్తులతోను ఏర్పడింది. స్థలకాలాదులు, అన్ని రకాల రూపాలు తీసుకున్న పదార్థం.. బలం, గతి, భౌతిక నియమాలు, స్థిరాంకాలు (Physical Constants) వీటిని నియంత్రిస్తూ వుంటాయి.

ఏవిటా స్థిరాంకాలు? అవి ఎందుకు అలాగే ఉన్నాయి? ఆ స్థిరాంకాల విలువలు సంపూర్తిగా అంతు చిక్కిన వారు ఉన్నారా?

ఈ స్థిరాంకాలు ఈ విశ్వానికి మాత్రమే చెందినవి కావచ్చు ఒకవేళ మల్టీవర్స్ (అనేక విశ్వాలు) సిద్దాంతం నిజమని అనుకుంటే (ఆధునిక శాస్త్రవేత్తలు). ఇతర విశ్వాలలో ఈ స్థిరాంకాలు వేరు కావచ్చు.

ఈ విశ్వపు బ్రహ్మ గారు చూడలేని మరొక విశ్వం నుండీ ఈ గోపబాలకులను శ్రీకృష్ణుడు కూడా తెచ్చి ఉండవచ్చు. ప్రాప్తి అనే అష్ట సిద్ధులలో ఒకదాని సహాయంతో. ఈ ప్రాప్తి అనే సిద్ధితోనే ఉక్కు భీముడిని శ్రీకృష్ణ భగవానుడు ధృతరాష్ట్ర కౌగిలికి అందిస్తాడు.

లేదా ఆయనే స్వయంగా అనేక విశ్వాలుగా విడిపోయి (ఆయన విశ్వం కదా! మొదటి నామము) ఆ యా బాలకుల రూపంలో మనకు కనపడి ఉండవచ్చు. ఒక్కొక్క మనిషిది ఒక్కొక్క లోకం అని మనం అనుకున్నట్లుగా ఆ యా బాలకుల తల్లదండ్రుల కోసం, ఆ లేగల తల్లులైన గోవుల కోసం ఆయన అలా చేసి ఉండవచ్చు. అంటే ఒకేసారి ఎంతమంది గోపబాలకులు ఉన్నారో అన్ని విశ్వాలను తన రూపంలో మన విశ్వానికి తెచ్చి ఉండవచ్చు శ్రీకృష్ణ భగవానుడు.

వేదాలను గోవులు అని అనుకుని ఉంటే ఒక్కొక్క మహాయుగంలో వచ్చే ద్వాపర యుగంలో ఒక్కొక్క వేదవ్యాసుడు ఒక్కొక్క రకంగా విభజించి ఉండవచ్చు.

అది ప్రాప్తి ద్వారా జరిగి ఉండవచ్చు. లేదా ఆయనే మల్టీవర్స్‌ను ఇక్కడే ఆ లిప్తపాటు కాలం కోసం సృష్టించి ఉండవచ్చు. బ్రహ్మగారి లిప్తపాటు మన భూమి మీద ఏడాది.

యశోదమ్మకు నోటిలో విశ్వాన్ని చూపినట్లు బ్రహ్మ గారికి బహుళ విశ్వాలను దర్శింపజేసి ఉండవచ్చు.

ఈ విశ్వాలు ఎప్పుడు ఏర్పడి ఉండవచ్చు?

సృష్ట్యాదిలో ఆ బ్రహ్మాండం బ్రద్దలైనప్పుడు బుడగల రూపంలో అనేక విశ్వాలు ఏర్పడి ఉండవచ్చు. అవి ఎన్ని ఉన్నాయి అంటే మనం చెప్పలేము.

స్టీఫెన్ హాకింగ్ కూడా అనంతమైన విశ్వాలు ఉండి ఉండవచ్చు అని చెప్పాడు.

శ్రీమహావిష్ణువుకు ఈ అనంత అనే నామము ఈ విధంగా సార్థకము అయింది.

మల్టీవర్స్‌లు విభిన్న రకాలుగా ఉండవచ్చు. ప్రతి ఒక్కటీ దానికే స్వంతమైన ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉండవచ్చు. కొన్ని సాధారణ రకాలు:

పారలెల్ యూనివర్స్ లేదా సమాంతర విశ్వాలు.

ఈ విశ్వాలు మన స్వంత విశ్వం నుండి చిన్న మార్పులతో ఏర్పడతాయి.

బబుల్ యూనివర్స్ లు లేదా బుడగ విశ్వాలు.

ఈ విశ్వాలు బిగ్ బ్యాంగ్ సమయంలో ఏర్పడే బుడగలు వంటివి. ప్రతి బుడగ ఒక ప్రత్యేకమైన విశ్వంగా విస్తరిస్తుంది. దీనినే పైన మన సనాతన ఆధ్యాత్మిక కోణంలో చూశాము.

సెబ్రాన్ విశ్వాలు

ఈ విశ్వాలు భిన్నమైన భౌతికశాస్త్ర నియమాలను కలిగి ఉంటాయి. ఉదాహరణకు, ఒక సెబ్రాన్ విశ్వంలో, గురుత్వాకర్షణ బలం మన విశ్వంలో కంటే బలంగా ఉండవచ్చు. లేదా అసలు గురుత్వాకర్షణయే లేకపోవచ్చు అంటారు. కానీ మన సనాతన విజ్ఞానంలో చెప్పే సంకర్షణ శక్తి లేకుండా ఉండే అవకాశం ఉండదు. అలాగే మరియొక విశ్వంలో Schrodinger’s Time Independent Equation ఉండి Time Dependent EqUation అవసరపడతాయి పోవచ్చు.

మెటాఫిజికల్ విశ్వాలు

ఈ విశ్వాలు మనకు మనంగా అర్థం చేసుకోలేని విధంగా భిన్నంగా ఉంటాయి. అవి మనం ఊహించగలిగే దానికంటే చాలా ఎక్కువ లేదా తక్కువ పరిమాణాలను కలిగి ఉండవచ్చు. అంతేగా! ఈ విశ్వసృష్టి/రచనను సాక్షాత్ బ్రహ్మ గారే అర్థం చేసుకోలేక పోయారు. చివరకు నారాయణుని శరణు వేడితే చతపశ్శ్లోకీ భాగవతం చెప్పబడింది.

మల్టీవర్స్ సిద్ధాంతానికి ఆధారాలు

కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ (CMBR). బిగ్ బ్యాంగ్ తర్వాత మిగిలి ఉన్న శాఖల నుండి వచ్చినట్లు భావించే ఈ రేడియేషన్ లోని కొన్ని అసాధారణ లక్షణాలు మన విశ్వం ఒక పెద్ద మల్టీవర్స్‌లో  భాగం కావచ్చని సూచిస్తాయి.

క్వాంటం మెకానిక్స్. క్వాంటం మెకానిక్స్ లోని కొన్ని సూత్రాలు బహుళ విశ్వాల ఉనికికి అవకాశం ఉందని సూచిస్తాయి. ఉదాహరణకు, బహుళ విశ్వాల వ్యాఖ్యానం ప్రకారం, ప్రతి క్వాంటం సంఘటనకు అనేక సంభావ్య ఫలితాలు ఉన్నాయి, ప్రతి ఫలితం దాని స్వంత విశ్వంలో జరుగుతుంది.

స్ట్రింగ్ థియరీ. ఈ సిద్ధాంతం ప్రకారం, మన విశ్వం 10 లేదా అంతకంటే ఎక్కువ కొలతలను కలిగి ఉండవచ్చు (నిజానికి 11 – ఏకాదశ రుద్రులు).

స్ట్రింగ్ థియరీ గురించి ఒక చిన్న వివరణ.

స్ట్రింగ్ థియరీ అనేది భౌతికశాస్త్రంలో ఒక ఊహాత్మక సిద్ధాంతం, ఇది పదార్థం మరియు శక్తి యొక్క ప్రాథమిక భాగాలు చిన్న, కంపనం చెందుతున్న తీగలుగా ఉంటాయి అని ప్రతిపాదిస్తుంది. ఈ తీగలు చాలా చిన్నవి, ఒక ప్రోటాన్ లేదా న్యూట్రాన్ కంటే కూడా చాలా చిన్నవి. మనకు ప్రత్యక్షంగా గమనించగలిగే అవకాశమివ్వనంత సూక్ష్మమైనవి. అయినప్పటికీ, వాటి కంపనాలు వివిధ రకాల పదార్థాల సృష్టికి మరియు శక్తుల ఆవిర్భావానికి దారితీస్తాయని ఈ సిద్ధాంతం చెబుతుంది.

ఈ స్ట్రింగ్ థియరీ ప్రకారం మనం చూసే మూడు స్థల డైమెన్షన్లు (పరిమాణాలు), ఒక కాలానికి సంబంధించిన డైమెన్షన్‌తో పాటుగా మరి కొన్ని ఇతరమైన పరిమాణాలు మొత్తం 10 లేదా 11 ఉంటాయని చెప్తుంది. ఆ పదకొండింటిని ఏకాదశ రుద్రులుగా చెప్పి ఉండవచ్చు. ఎటూ సందర్భం వచ్చింది కనుక ఏకాదశ రుద్రుల పేర్లు తెలుసుకుందాం.

రుద్రనమకం లోని ఒక అనువాకం ప్రకారం ఏకాదశ రుద్రుల పేర్లు

  1. విశ్వేశ్వరుడు
  2. మహాదేవుడు
  3. త్రయంబకుడు
  4. త్రిపురాంతకుడు
  5. త్రికాగ్నికాలుడు
  6. కాలాగ్నిరుద్రుడు
  7. నీలకంఠుడు
  8. మృత్యుంజయుడు
  9. సర్వేశ్వరుడు
  10. సదాశివుడు
  11. శ్రీమన్మహాదేవుడు

శివుడు మనకు పదకొండు అవతారాలతో ఏకాదశ రుద్రులుగా దర్శనమిచ్చును. ఓంనమస్తేస్తు భగవన్ “విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయనమః” అని రుద్రనమకంలో చెప్పబడింది.

దీని ప్రకారం ఏకాదశ రుద్రులపేర్లు

మరొక రకంగా చూస్తే ఏకాదశ రుద్రులు, వారిభార్యలైన ఏకాదశ రుద్రాణుల పేర్లు ఈవిధంగా ఉన్నాయి.

  1. అజపాదుడు – ధీదేవి
  2. అహిర్భుద్న్యుడు – వృత్తిదేవి
  3. త్రయంబకుడు – ఆశనదేవి
  4. వృషాకపి – ఉమాదేవి
  5. శంభుడు – నియుత్ దేవి
  6. కపాలి- సర్పిదేవి
  7. దైవతుడు- ఇలా దేవి
  8. హరుడు – అంబికాదేవి
  9. బహురూపుడు – ఇలావతీదేవి
  10. ఉగ్రుడు – సుధాదేవి
  11. విశ్వరూపుడు- దీక్షాదేవి

వీటిని పరిశీలిస్తే మనకు మరిన్ని విశేషాలు తెలియవచ్చు.

స్ట్రింగ్ థియరీ బిగ్ బ్యాంగ్ మరియు విశ్వం యొక్క విస్తరణతో సహా విశ్వం యొక్క మూలం గురించి ఒక వివరణను అందించగలదు. ఇంకా కనుగొనబడని కొత్త రకాల కణాల ఉనికిని సూచిస్తుంది. మనకు తెలియని విశ్వం ఇంకా ఉన్నదని అందరూ అంగీకరిస్తారు కదా. మరి విశ్వాల గురించి ఎప్పుడు తెలుసుకోవాలి?

అత్యంత సంక్లిష్టమైన గణిత సూత్రాలు, సమీకరణాలు అవసరపడతాయి కనుక స్ట్రింగ్ థియరీని అందరూ అర్థం చేసుకోవటం చాలా కష్టం. ఇక అర్థ సంపూర్ణం ఎప్పుడు చేసుకోవాలి?

ఈశ్వరః అనేది 36వ నామము కావటము కూడా ఒక వైచిత్రియే. దాని గురించి కూడా చూడాలి. తెలుసుకుందాం.

శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పబడినది కలియుగారంభానికి సరిగ్గా 36 సంవత్సరాల క్రితం. చెప్పించినది ఈశ్వరుడైన శ్రీకృష్ణుడు.

అరిషడ్వర్గాలను జయించేందుకు సమస్త మానవాళికి ఉపయోగపడబోయే అపురూప స్తోత్రానికి (శ్రీవిష్ణు సహస్రనామము) నాన్ది పలికినవి ఆరే ప్రశ్నలు.

ఆశ్చర్యం చూశారా?

6 x 6 = 36.

మరొక విశేషం.

ఆ అరిషడ్వర్గాలలోని కామం చతుర్విధ పురుషార్థాలలో ఒకటి.

  1. ధర్మ
  2. అర్థ
  3. కామ
  4. మోక్ష

4 x 9 = 36

ఈ నాలుగు పురుషార్థాలను నవగ్రహాల ప్రభావం చేత 36 రకాలుగా భ్రష్టు పట్టిస్తారు మానవులు. వారిని ఉద్ధరించేది ఒకటే! ఆ ఒకటే..

శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రం.

అంతేనా?

శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పబడినప్పుడు

అక్కడ సప్తర్షులు నిలబడి ఉన్నారు. 7.

భీష్మాచార్యులు. గురువు. ఆచార్యుడు. 1.

శ్రీకృష్ణ పరమాత్మ. 1. ఒక్కడే. ఒక్కడే. ఒక్కడే.

మొత్తం 9.

చతుర్విధ పురుషార్థాలను అటు మహర్షిగణంతోను, ఆచార్యునితోను, ఈశ్వరునితోను అనుసంధిస్తూ, అనుసంధానిస్తే..

మానవులు తరించవచ్చని సందేశం.

చివరగా సుదర్శన వ్యాఖ్య ప్రకారం ఈశ్వరః అంటే చూద్దాము.

నిరుపాధికమైన ఐశ్వర్యము కలవాడు ఈశ్వరుడు. ఉపాధి రూపంలో ఉండే అన్ని ఐశ్వర్యాలు నశించవచ్చు. దీనికి దేశ కాలాదులు కారణమవుతాయి. దేవతల నుంచీ సృష్టిని చేసే బ్రహ్మ గారి వరకూ అందరూ నశించాల్సిందే. తద్భిన్నమైనది ఈశ్వరత్వం. అదియే శ్రీమన్నారాయణుడు.

సర్వః తో మొదలై, చివరికి ఈశ్వరః తో ముగిసిన ఈ శ్లోకం ఈశ్వర తత్వాన్ని బహు విధాలుగా వర్ణించింది.

గమనించ వలసిన చిన్న విషయం.

ఈశ్వరః అన్న నామము ద్వైత వ్యాఖ్య ప్రకారం 37వది.

నిధిః, అవ్యయః అని విడదీయటం వల్ల ఇలా జరిగింది. ఆ విడదీత అద్భుతంగా ఆ సమయానికి, ఆ సందర్భానికి ఒప్పినా, మొత్తంగా తీసుకుంటే ద్వైతము యొక్క లోపాన్ని తెలిపేదిగా ఉంది.

అందుకే అద్వైతమే పరమ ప్రామాణికం. దానికి విశేషతను చేకూర్చినది విశిష్టాద్వైతము. శారదాదేవి ఇచ్చిన పేరు కదా.

పైన ఇచ్చిన ప్రార్థనా శ్లోకాలు మామూలుగా ఇచ్చినవి కాదు.

గ్రహించాలి.

ఇక్కడ వేదాంత దేశికులు హయగ్రీవుని శక్తి లేశం వల్ల అటు దక్షిణామూర్తి అయినా, ఇటు సరస్వతి అయినా, వేదవ్యాసుడైనా వారి వారి ఉపాధులను సక్రమంగా నెరవేర్చారు అని ఉంది. మరి దక్షిణామూర్తియే సకల విద్యలకు ఆలంబనమైన వాడు అన్నది వేరొక విశ్వంలో కావచ్చు. ఆ విశేషాన్ని మరొక రకంగా ఈ విశ్వంలో కూడా మన మహర్షులకు ద్యోతకమై ఉండి మనకు అంది ఉండవచ్చు. సరస్వతీ దేవి విషయం కూడా అంతే.

కానీ హయగ్రీవ శక్తి వీటిలో కాస్త హెచ్చు సంఖ్యలో ఉన్న విశ్వాలలో ప్రాధాన్యత కలిగి ఉండి ఉండవచ్చు. లేదా మన ప్రస్తుత విశ్వంలో కావచ్చు.

ఎటు చూసినా హయగ్రీవ స్తోత్రం కానీ, దక్షిణామూర్తి స్తోత్రం కానీ విశేషమైన ఫలాలను ఇస్తాయి. వేటిని ఆచరించే వారు వాటిని ఆచరించటమే.

(సశేషం)

Exit mobile version