[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]
ఏషమే సర్వ ధర్మాణామ్
कवन सो काज कठिन जग माहीं।
जो नहिं होइ तात तुम्ह पाहीं॥
राम काज लगि तव अवतारा।
सुनतहिं भयउ पर्बताकारा॥3॥
జాంబవంతుడు చెప్తున్నాడు.
నీకు సాధ్యం కాని పని ఈ లోకంలో ఏముంటుంది? రామకార్యం సాధించేందుకే నీవు జన్మించావు.
ఈ మాటలు వినగానే హనుమ తన శరీరాన్ని పెంచి పర్వత సదృశంగా భాసిల్లాడు.
यन्मायावशवर्ति विश्वमखिलं ब्रह्मादिदेवासुरा
यत्सत्त्वादमृषैव भाति सकलं रज्जौ यथाहेर्भ्रमः।
यत्पादप्लवमेकमेव हि भवाम्भोधेस्तितीर्षावतां
वन्देऽहं तमशेषकारणपरं रामाख्यमीशं हरिम्॥6॥
(రామచరితమానస్ ప్రార్థనా శ్లోకం)
ఎవరి మాయ ఈ విశ్వాన్ని తన అధీనంలో ఉంచుకుంటుంది? ఎవరు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు అతీతమైన శక్తిగా నిలిచి దేవతలను, రాక్షసులను, మర్త్యులకు, ఇతర జీవాలను పాలిస్తున్న వాడు? అతని మాయ/ప్రభావం వల్లనే ఈ కనిపించే ప్రపంచం లోకం నిజమని తోస్తుంది. రజ్జు-సర్ప భ్రాంతిలో పాము నిజమనుకునే క్షణాలలో లాగ. సంసారమనే ఈ సాగరాన్ని దాటించే నావ ఆతని పాదపద్మాలు. ఆ శ్రీహరినే నేను ప్రార్థిస్తున్నాను. సకలకారణకారకుడైన ఆయనే శ్రీరాముడు అని పిలువబడతాడు.
స్వయంభూః శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః।
అనాదినిధనో ధాతా విధాతా ధాతురుత్తమః॥
37. స్వయంభూః – స్వయముగా, ఇచ్ఛానుసారము, వేరు ఆధారము లేకుండ జన్మించువాడు.
38. శంభుః – శుభములను, సుఖ సంతోషములను ప్రసాదించువాడు. ఈ నామాన్ని శైవ పరంగా అన్వయించుకుంటారు.
39. ఆదిత్యః – సూర్య మండల మధ్యవర్తియై బంగారు వర్ణముతో ప్రకాశించువాడు. ద్వాదశాదిత్యులలో విష్ణువు. సమస్తమును ప్రకాశింపజేసి పోషించువాడు. అదితి కుమారుడైన వామనుడు. సూర్యుని యందు స్వర్ణకాంతితో ప్రకాశించువాడు – భగవానుడు. “ద్వాదశాదిత్యులు లో విష్ణువు అను పేరు గలవాడు తానే” యని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత విభూతి యోగములో తెలియజేసి యున్నాడు. ‘ఆదిత్యః’ అనగా ఆదిత్యుని వంటి వాడని కూడా భావము. ఆదిత్య ఉపమానము ద్వారా ఈ అద్వైత సత్యమును నిత్యానుభవములోనికి తెచ్చుకొని సంతృప్తి చెందవచ్చును.
40. పుష్కరాక్షః – తామరపూవు వంటి కన్నులు గల వాడు. (సూర్యుని పరంగా సౌరములో)
41. మహాస్వనః – గంభీరమైన దివ్యనాద స్వరూపుడు. వేద నాదమునకు ప్రమాణమైనవాడు.
ఛలయసి విక్రమణే బలి మద్భుత వామన
పదనఖ నీరజ నతజన పావన
కేశవ ధృత వామన రూప జయ జగదీశహరే
(జయదేవుని దశావతార స్తోత్రము)
కశ్యప మహర్షి భార్య అదితి తపస్విని. విరోచనుడు అనే దైత్యుని కొడుకు బలి. దైత్య కులమున పుట్టినా బలి గొప్ప విష్ణుభక్తుడు. అందుచేత అతడు విష్ణువు అభిమానాన్ని అధికంగా చూరగొన్నాడు. దానితో అతనికి గర్వం కలిగి దేవతల మీద యుద్ధానికి వెళ్ళాడు. ఒకపరి ఓడినా శుక్రాచార్యుని సహాయముతో తరువాత సారి దేవతలను జయించి అమరావతిని చేజిక్కించుకున్నాడు. అప్పడు దేవతలు శ్రీమన్నారాయణుని సన్నిధికి వెళ్ళి బలి బాధ పోగొట్టవలసిందిగా ప్రార్జించారు. భక్తుని విజయానికి భంగం కలిగించటానికి శ్రీమహావిష్ణువుకు ఆదిలో ఇష్టం లేకపోయింది. అయినా దేవతుల విన్నపం మన్నింపక తప్పదు.
మరొక వైపున అదితి తన సంతానమైన దేవతల కష్టాలను కశ్యపునితో చెప్పుకుంది. వారిని ఉద్ధరించి దైత్యులను నిలువరించమని వేడుకుంది. దానికి సమాధానమిస్తూ కశ్యప మహర్షి ఇలా అన్నాడు.
“అదితీ! శ్రీమహావిష్ణువు భగవంతుడు. పురుషోత్తముడు. జనార్దనుడు. దయాసముద్రుడు. సర్వాంతర్యామి. జగదీశ్వరుడూ. కనుక అయనను ఆరాధించు. ఆయన సంతోషిస్తే చాలు నీ కోరిక తీరుస్తాడు. అన్ని ప్రయోజనాలూ నెరవేరుతాయి. ఆతనిని పూజించితే నీకు తగిన విధంగా మేలు చేస్తాడు.”
తగిన విధంగా అంటే ధర్మ పరిరక్షణ జరిగేలా అవసరమైన చర్యలు తీసుకుంటాడని భావం. అంతే కానీ అడిగినదంతా ఇస్తాడని కాదు. శ్రీమన్నారాయణుడు భక్తివైరాగ్యాలకు ప్రథమ ప్రాధానం ఇస్తాడు. ఆ పైన భక్తులకు చేయవలసిన మేలు గట్టిగానే చేస్తాడని మనం ధృవ చరిత్రలో చూశాము.
అన్నీ చేయగల సమర్థుడు ఆయనే. ఎందుకంటే ఆయన స్వయంభూః
37. స్వయంభూః
స్వయమేవ భవతీతి స్వయంభూః – స్వయంగా అవతరించిన వాడు. ఇది ద్వైత పరంగా. జీవులు స్వయంభూః కాలేవు అన్నది అన్వయం.
మనుస్మృతి ప్రకారం
స ఏవ స్వయ ముద్భభౌ – తనంతట తానే ఉద్భవించుట చేయ ఆయనను స్వయంభూః అని కీర్తిస్తారు. పుట్టుక పొంది, బతుకుతున్న జీవులు కార్యకూపమున తెలియుచున్నందున వాటికి కారణం ఉండితీరాలి.
భగవానుడే సర్వమునకూ కారణం (సర్వ కారణకారణం). కార్యరూపమున నొప్పారు సమస్తమునకు కారణమైన ఆదిదేవుడి ఆవిర్భావానికి వేరొక కారణం అవసరం లేదు. అందుకే ఆయన స్వయంభూః.
ఈ చరాచర జగత్తులో, విశ్వంలో (అది కూడా ఆయనే కదా), ఆ శ్రీమహావిష్ణువొక్కడే స్వయంభూః!
ఈశావాయ్యోపనిషత్ ప్రకారం
పరిభూః స్స్వయంభూః – అంతటా ఉండేవాడు స్వయంభూః.
అంతటా ఉండేవాడు వ్యాపించిన వాడే. ఆ వ్యాపించిన వాడే విష్ణువు.
ఇది ద్వైత పరంగా.
ఇక
స్వయమేవ భవతీతి స్వయంభూః అనే ప్రమాణాన్ని తీసుకున్నా విశిష్టాద్వైత వ్యాఖ్య మరొక కోణంలో ఉంటుంది.
లీలా ప్రయోజనం కోసం తన ఇచ్ఛచే అసాధారణమగు పరమసత్వమయమైన ప్రకృతిని దేవతిర్యఙ్మనుష్యాది సజాతీయము గావించుకుని – బ్రహ్మాదుల వలె ఇతరులకు పరతంత్రము గాకుండుటచే – ఆయనకు ఇంత అనంతమైన మహిమ గలిగింది.
కనుకనే కశ్యపుడు అనంత మహిమాన్వితుడైన శ్రీహరినే వేడుకొనమని అదితికి సలహా ఇచ్చాడు.
స్వయమ్భూః బ్రహ్మ పరమం కవీనామ్ – తనకు తానే ఆవిర్భవించిన (లేదా అసలు ఆవిర్భావము కూడా అవసరం లేని, అంతటా ఎల్లెడలా ఉండు పరబ్రహ్మము నిత్యసూరులకన్నా ఉత్కృష్టమైనవాడు.
హరివంశాన్ని అనుసరించి..
బ్రహ్మ తేజోమయం దివ్యమాశ్చర్యం దృష్టవానసి।
అహం స భరతశ్రేష్ఠ! మత్తేజస్తత్సనాతనం॥
ప్రకృతిస్సా మమ పరావ్యక్తా వ్యక్తాచ భారత।
తాం ప్రవిశ్య భవన్తీహముక్తా భరతసత్తమ॥
వైదిక పుత్రానయన ఘట్టంలో లీలోపకరణంబులగు రెండు ప్రకృతిల గురించి వివరించిన తరువాత బ్రహ్మతోజో రూపమై ఆశ్చర్యకరమై దివ్యమై ఉండే దేనిని నీవు ఇప్పుడు చూశావో అది నేనే అని తెలుసుకొనుము భరతశ్రేష్టా! అది సనాతనమైన నా తేజస్సే. ఉత్కృష్టమైన నా ప్రకృతి వ్యక్తముగాను, అవ్యక్తముగాను ఉంటుంది. వానిని ప్రవేశించియే ముక్తులందరు సత్ ను పొందుతారు.
“స్వామీ! అలాంటి పరమాత్ముడైన శ్రీమహావిష్ణువును ఏవిధంగా ధ్యానించాలి. అందుకు తగిన మంత్రమేది. దాని నియమాలు ఏవి. పూజింప వలసిన కాలమేది. అన్నీ నాకు ఉపదేశించు.” అని అదితి కశ్యప మహర్షిని అర్థిస్తుంది.
భార్య అయిన అదితికి కశ్యపుడు పయోభక్షణం అనే వ్రతాన్ని ఉపదేశించాడు. దానికి తగిన కాలాన్ని, మంత్రాన్ని, నియమాన్ని, వ్రతకాలంలో పాటించవలసిన ఉపవాస, దాన, భోజనాది విధివిధానాలను బోధించాడు.
అదితి ఫాల్గుణ మాస శుక్ల పక్షం మొదటి దినము అయిన పాడ్యమి నాడు ఆ వ్రతాన్ని ప్రారంభించింది.
పన్నెండు దినాలు యథావిధిగా భగవంతుడు విష్ణుమూర్తికి సమర్పిస్తూ వ్రతం పూజించింది. ఇక్కడ పన్నెండు అనే సంఖ్యను జాగ్రత్తగా గమనించాలి.
వ్రతం ముగించి నియమవంతురాలు అయి ఉన్న అదితికి జగన్నాధుడైన శ్రీహరి ప్రత్యక్షమయ్యాడు. ఆయన చతుర్భాహుడు. శంఖాన్ని చక్రాన్ని ధరించి, పచ్చని పట్టువస్త్రాన్ని కట్టుకొని ఉన్నాడు. యథావిధిగా గదా పద్మములు ఉన్నవి. ధృవానికి ఎలా సాక్షాత్కరించాడో అదే విధంగా అదితి ఎదుట నిలిచాడు. తేడా ఏమిటంటే అదితికి శ్రీమన్నారాయణ ఆకారం (సాకారమైనప్పుడు) మీద కాస్త అవగాహన ఉంది. ధృవుడికి కుడి చేతిలో శంఖము, ఎడమ చేతిలో చక్రముతో కనబడాల్సి వస్తే, కుడిచేతిలో చక్రము, ఎడమ చేతిలో శంఖముతో అదితికి కనిపించాడు.
కన్నులకు కానరాని భగవంతుడు అలా ఆమె కన్నుల ఎదుట సాక్షాత్కరించాడు.
సంతోషంవల్ల అదితి కన్నులనుండి కురిసిన కన్నీళ్ళు ఆమె వక్షస్థలంపై జాలువారాయి. ఆమె శరీరము అంతా పులకరించింది. భక్తితో స్తోత్రాలు చేస్తూ నుదిటిపై చేతులు జోడించి స్వామికి నమస్కరించింది.
అదితి ఆ దేవదేవుని రూపాన్ని ఎంత చూసినా తనినితీరక చూపులతో మిక్కిలిగా త్రాగింది. నిండు సంతోషంతో మైమరచి ఆ లక్ష్మీపతిని మృదుమధుర వాక్కులతో ఇలా స్తుతించింది.
యజ్ఞేశ! విశ్వంభరాచ్యుత! శ్రవణ మం-
గళనామధేయ! లోకస్వరూప!
యాపన్న భక్త జనార్తి విఖండన!-
దీనలోకాధార! తీర్థపాద!
విశ్వోద్భవస్థితి విలయకారణభూత!-
సంతతానంద! శశ్వద్విలాస!
యాయువు దేహంబు ననుపమ లక్ష్మియు-
వసుధయు దివముఁ ద్రివర్గములును
వైదికజ్ఞాన యుక్తియు వైరిజయము
నిన్నుఁ గొలువని నరులకు నెఱయఁ గలదె
వినుతమందార! గుణహార! వేదసార!
ప్రణత వత్సల! పద్మాక్ష! పరమపురుష!
(పోతన భాగవతం – 8-483-సీ, 8-484-తే)
యజ్ఞేశ్వరా! విశ్వంభరా! అచ్యుతా! నీ పేరు తలచిన చాలు సర్వమంగళాలూ ఒనగూడుతాయి.
లోకమే రూప మైనవాడవు.
పూజించేవారిని ఆపదలనుండి ఆర్తినుండి బ్రోచేవాడవు.
దీనులందరికి దిక్కైనవాడవు.
పాదంలో పవిత్రమైన గంగానది కలవాడవు.
లోకాలు పుట్టి పెరిగి గిట్టుటకు కారణమైనవాడవు.
ఎల్లప్పుడూ ఆనందంతో అలరారేవాడవు.
శాశ్వత మైన లీలావిలాసాలు కలవాడవు. అంతటా నిండిన వాడవు.
నీవు భక్తులపాలిటి కల్పవృక్షానివి. ఎందుకంటే స్వయంభూః, భూతాదిః కనుక.
సుగుణనిధివి.
పరమాత్ముడవు.
వేదాలకు ఆధారమైనవాడవు.
సేవించేవారి యందు వాత్సల్యము కలవాడవు.
కమలాల వంటి కన్నులు కలవాడవు. (ఈ కమలముల వంటి కన్నుల కలిగిన వాడా అనేది, పద్మములకు సంబంధించిన సంబోధనలన్నీ శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరము).
పరమపురుషుడవు.
ఈలోకంలో మంచి మనుగడ, కలిమి, ఇహము, పరమూ, ధర్మార్థ కామాలూ, వేదవిజ్ఞానమూ, శత్రు జయమూ నిన్ను పూజించని వారికి లభించవు కదా!
తండ్రీ! బలవంతులైన రాక్షసులు బలి ఆధ్వర్యమున నా బిడ్డలైన దేవతలను జయించి స్వర్గ లోకాన్ని పాలిస్తున్నారు. కడుపుతీపి గురించి నీకు తెలియనిది కాదు. ఆ బెంగతో దేవతల కన్నతల్లిని అయిన నాకు నాటి నుండి కంటికి నిద్ర కరువైంది. ఈ నా శోకాన్ని పోగొట్టి కాపాడు.
ఇలా ప్రార్థించింది అదితి.
అదితి మాటలు విని శ్రీ మహా విష్ణువు చిరునవ్వు చిందించాడు. శరణు వేడిన వారికి కామధేనువు అయిన ఆ పరమాత్ముడు అదితితో ఇలా అన్నాడు.
అమ్మా! తేజస్సుతో కూడిన రూపంతో నీ కడుపున పుడతాను. నీ కోడళ్ళూ, కొడుకులూ, నీ మగడూ, నీవు మెచ్చుకొనేటట్లు చేస్తాను. మీ ఆలుమగలు సంతోషించేటట్లు చేస్తాను. రాక్షసులు కళవళ పడేటట్లు చేస్తాను. నీ ఒడిలో ఆడుకోవాలని నాకు కుతూహలంగా ఉంది.
అమ్మలకే అమ్మ అయిన శ్రీమన్నారాయణుడు తల్లి లాలన అనుభవించాలని కుతూహలపడి అదితి గర్భమున స్వయంగా జన్మ తీసుకున్నాడు. అదే వామనుడు.
38.శంభుః – శుభములను, సుఖ సంతోషములను ప్రసాదిస్తాను అని అదితికి మాట ఇచ్చి నిలుపుకన్న వాడు కనుక ఆయన శంభుః.
39. ఆదిత్యః – అదితికి జన్మించి ఆదిత్యుడయ్యాడు.
40. పుష్కరాక్షః – తామర పూవుల వంటి కన్నులు కలవాడు.
ఆ నామము పలికే కదా అదితి మెప్పించింది!
చివరగా స్వామి ఇలా అన్నాడు.
“నా రూపాన్ని స్మరించుకుంటూ నీ భర్తను సేవించు నేను. నీ గర్భంలో చేరుతాను మక్కువతోనూ కనికరంతోనూ నన్ను పెంచు తల్లీ!”
ఆ విధంగా స్వామి సౌలభ్యాన్ని ప్రదర్శించాడు.
అలాగే బలిని అమరావతి నుంచీ వేరు చేసినా ఆ మహాత్మునకు చేయవలసిన మేలును చేశాడు.
ఆ కథ ముందు ముందు.
(సశేషం)