తల్లివి నీవే తండ్రివి నీవే!-36

0
2

[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]

యశోదై ఇళం సింగమ్-1

ప్రసీద కమలాకాన్త ప్రసీద త్రిదశేశ్వర।

ప్రసీద కంసకేశీఘ్న ప్రసీదారిష్టనాశన॥

ప్రసీద కృష్ణ దైత్యఘ్న ప్రసీద దనుజాన్తక।

ప్రసీద మథురావాస ప్రసీద యదునన్దన॥

(బ్రహ్మాండ పురాణాన్తర్గత, మార్కణ్డేయ కృత శ్రీబాలముకున్ద స్తుతిః – 11, 12)

  1. అనాదినిధనః – ఆది (మొదలు/పుట్టుక) లేనివాడు మరియు నిధనము (తుది/నాశనము) లేనివాడు.
  2. ధాతా – బ్రహ్మను కన్న వాడు. నామ రూపాత్మకమైన ఈ చరాచర విశ్వమునంతను ధరించిన మహనీయుడు.
  3. విధాతా – బ్రహ్మను ఆవిర్భవింపజేసిన వాడు. విధి విధానములేర్పరచి, తగురీతిలో కర్మ ఫలములనొసగువాడు. కర్మఫలముల నందించువాడైన భగవానుడు. విశ్వ యంత్రాంగమంతయు అతని ఆజ్ఞకు లోబడి నడచుచున్నది. తనకు భయపడి ప్రకృతి ప్రవర్తించుచున్నది. సర్వమును కదిలించి, కదిలిన సర్వమును కనిపెట్టి, ధర్మబద్ధంగా ఫలితముల నందించి, పోషించుటచే ఆ శ్రీహరి విధాత ఆయెను.
  4. ధాతురుత్తమః – బ్రహ్మకంటెను శ్రేష్ఠుడు, ముఖ్యుడు. సృష్టికి మూలములైన సమస్త ధాతువులలోను ప్రధానము తానే అయినవాడు. Best among the best.

అలా అదితికి జన్మించి ఆదిత్యుడై వామనుడిగా త్రివిక్రముడిగా మారిన వాడే అనాదినిధనుడు.

  1. అనాదినిధనః

న విద్యేతే ఆది నిధనే యస్య సః అనాదినిధనః – ఆది అనగా (ఇక్కడ) పుట్టుక, నిధనః అనగా మరణము. న విద్యేతే అనగా లేని వాడు. అంటే జన మరణములు లేని వాడు అనాది నిధనుడు. అలాంటి అనాదినిధనుడు ధర్మ పరిరక్షణ కోసం జన్మము తీసుకున్నాడు.

మత్స్య, కూర్మ, వరాహ, నారసింహావతారాలు జన్మ తీసుకొననివి. స్వయం వ్యక్తాలు. సందర్భానికి తగిన విధంగా ఆ పరమాత్మ అవతారమును ప్రకటించాడు.

వామనావతారము ఇలా కాకుండా జన్మ తీసుకున్న అవతారము. అలాంటి నాలుగు అవతారాలలో మొదటిదిది.

మిగిలినవి భార్గవ రామ, దశరథ రామ, శ్రీకృష్ణ అవతారాలు. ఇప్పటికి జరిగినవవి. కల్కి సంగతి భవిష్యత్ కథ.

అనస్య – ముఖ్యప్రాణస్య, ఆదినిధనే యస్మాత్ ఇతి వా – ముఖ్యప్రాణుడి (బ్రహ్మగారు) ఆది అనగా పుట్టుక, నిధనం అనగా మరణం.. ఎవరి వల్ల నిర్దేశించబడతాయో అతడు అనాదినిధనుడు.

అనం – ముఖ్యప్రాణం, ఆనతీత్యనాత్ । ఏః కామస్య నిధనం యస్మాత్ రుద్రాన్తర్యామి, నృసింహరూపాదితి ఇనిధనః అనాచ్చాసౌ ఇనిధనశ్చేతి వా

అంటే

ముఖ్యప్రాణుని అనతి అనగా జీవింపజేయువాడు, రుద్రుని యొక్క అంతర్యామిగా ఉండేవాడు (రుద్రుడు లయకారుడు – సృష్టికి మరణమును/అంతమును ప్రసాదించువాడు), నృసింహరూపముగా ప్రకటించబడిన వాడు, మన్మథుని యొక్క మరణము (నిజానికది దేహత్యాగం) ఎవరి వలన కలిగినదో అతను ఇనిధనుడు. అనగా మన్మథ మారకుడు. ముఖ్యప్రాణుని జీవితమునకు, మన్మథుని మన్మథమారకునికి అంతర్యామిగా ఉండేవాడు అనాది నిధనుడు.

నాదః భగవద్విషయగానాది రూపః ఏషాం అస్తీతి నాదినః। తేషాం నిధనం యస్మాత్ స నాదినిధనః ఇతి వా గాన ప్రియత్వాత్ – భగవద్విషయ గానాది రూపములు ఎవరి వద్ద కలవో వారు నాదులు. వారియొక్క నాశము ఎవరి వల్ల కలుగుతుందో వారు నాదనిధనుడు. నాదనిధనుడు కాని వాడు అనాదినిధనుడు. నారద, తుంబురాదుల నాశరహితమైన గానముతో సంతోషించేవాడు అని భావం.

తేలికగా చెప్పాలంటే గాన ప్రియుడు.

ఆ గానం శబ్ద రూపంలో వస్తుంది. ఆ శబ్దం ఎప్పుడు వచ్చింది మొదట? బ్రహ్మాండం బ్రద్దలై ఈ విశ్వము ఏర్పడిన సమయంలో తొల్త కాంతి, ఆ పైన నాద రూపంలో శబ్దము వచ్చినవి. ఆ నాదమునకు ఆది అయినవాడు ఎవ్వరు? శ్రీమన్నారాయణుడు.

ఆ నాదమును గ్రహించి గానముగా మార్చి నిత్యము ఆ నారాయణ కీర్తన చేయువారు నారద తుంబురులు. వారి గానమును సంపూర్ణముగా అవగతము చేసుకుని ఆస్వాదించు వాడు అనాది నిధనుడు.

తుంబురుని గురించి కొంత ఇక్కడ.

భారతీయ వాఙ్మయంలో పురాణాలలో, తుంబురుడు, నారదుడు ఇద్దరూ తమ సంగీత సామర్థ్యాలకు, విష్ణువు పట్ల భక్తికి ప్రసిద్ధి చెందినవారు. వీరిని మనం ఖగోళ జీవులుగా భావించవచ్చు. తుంబురుని తరచుగా ప్రధాన గంధర్వుడు, ఖగోళ సంగీత విద్వాంసుడుగా పరిగణిస్తారు. నారదుడు తన జ్ఞాన భక్తి వైరాగ్యాలకు, ప్రపంచాల మధ్య ప్రయాణించే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందిన ముని.

హిందూ గ్రంధాలలో తుంబురుడు మరియు నారదుడు విష్ణువుకు అంకితమైనట్లు చూపబడే వివిధ కథలు ఉన్నాయి వాటిని బట్టీ విష్ణువుతో వారి సంబంధాన్ని తెలుసుకొనవచ్చు.

తుంబురుడు మరియు నారదుడు విష్ణువు యొక్క గొప్ప భక్తులుగా పరిగణించబడుతున్నారు.

అహంకార మమకారాల వల్ల మానవులు పరిపూర్ణతను సాధించి మోక్షమార్గమును అనుసరించలేక ముక్తిని పొందరు అని చెప్పుకున్నాము కదా. దానిని ఒక విద్యలో పరిపూర్ణతను సాధించటానికి కూడా అహంకార మమకారాలను త్యజించాలి అని తెలుసుకోవాలి అని కూడా అన్వయించుకోవచ్చు.

దీనికి ఉదాహరణగా నారద-తుంబుర-హనుమ వృత్తాంతం తెలుసుకుందాం.

ఇది దాదాపు 1,50,00,000 (ఒక కోటి యాభై లక్షల) సంవత్సరాల క్రితం నాటి మాట. ఆ పైన కథ 5300 సంవత్సరాల క్రితం ముగుస్తుంది.

దేవలోకంలో సంగీత విద్వాంసులుగా తుంబుర నారదులు సుప్రసిద్ధులు. నారదుడు ముని. నారద మహర్షి అని కూడా ప్రసిద్ధుడయ్యాడు. ఆయన తన కృపతో భగవదాఙ్ఞననుసరించి లోక కళ్యాణార్థం కొన్ని పనులు వేగవంతం అయ్యేలా చేస్తాడు. Narada is a representation of Newton’s First Law of Motion (మనం దీన్నీ ధృవానీతిర్మతిర్మమ అనే 9వ అధ్యాయంలో చూశాము). He sets into motion certain events. Or changes the events sometimes so that the outcomes alter. అదే కాకుండా ఆయన catalyst (ఉత్ప్రేరకం) కూడా.

తుంబురుడు గంధర్వుడు. అతని వద్ద కళావతి అనే వీణ ఉంటుంది. నారద ముని పూర్వ వృత్తాంతం మనం చూశాము. అతని వీణ పేరు మహతి. ఇద్దరూ ముల్లోక సంచారం చేస్తారు. ఇంద్రాది దేవతలను తమ గానంతో, వీణానాదంతో అలరిస్తారు.

శ్రీమహావిష్ణువును స్తుతిస్తూ అనేక కీర్తనలను గానం చేసేవారు. తమ గానానికి దేవతలు పొగుడుతూ ఉండటంతో ఇద్దరికీ గర్వం పెరిగింది. ఎవరు గొప్ప అనే విషయంలో ఇద్దరికీ స్పర్థలు కూడా మొదలయ్యాయి. ఆరోగ్యకరమైన స్పర్థలు ఎప్పుడూ ఉపయోగమే. కానీ ఇక్కడ స్పర్థలు అహంకారాల వల్ల వచ్చినవి. మరి ఆ అహంకారాన్ని తుంచాలంటే?

సాధారణంగా నారదుడికి ఈ బాధ్యత అప్పగించబడుతుంది. కానీ ఇక్కడ నారదుడికి సమస్య వచ్చినది కదా? మరి దాన్ని ఎవరు తీర్చాలి? బ్రహ్మగారు అందుకు తగిన సమర్థులు. కానీ విషయం ఆయనకు అనవసరము. కనుక ఆ బాధ్యత భవిష్యత్ బ్రహ్మ అయిన హనుమంతుడికి అప్పగించబడింది. కానీ నేరుగా కాదు.

అది ఎలా జరిగిందో చూద్దాము.

ఎవరు గొప్పో సాక్షాత్తు శ్రీమహావిష్ణువు వద్దే తేల్చుకోవాలనే పట్టుదలతో తుంబుర నారదులిద్దరూ నేరుగా వైకుంఠానికి వెళ్లారు. పోటాపోటీగా గానం చేశారు. నారదుడు తనకు ఎంతటి భక్తుడైనా, శ్రీమహావిష్ణువు మాత్రం తుంబురుడి గానానికి పరవశుడయ్యాడు.

అతనిని బాగుగా ప్రశంసించాడు. నారదుడు చిన్నబోయాడు. సంగీతంలో విద్వత్తు సాధించడానికి ఏం చేయాలంటూ శ్రీహరిని సలహా అడిగాడు. ‘గానబంధు’ అనే గుడ్లగూబ వద్ద సంగీతం నేర్చుకోమని సూచించాడు ఆ స్వామి.

‘గానబంధు’ వద్ద సంగీతం నేర్చుకున్న నారదుడు సంగీత సమరానికి సిద్ధం కావాలంటూ తుంబురుడిని సవాలు చేసేందుకు అతడి నివాసానికి వెళ్లాడు.

అక్కడ కొందరు గాయపడ్డ స్త్రీలు విలపిస్తూ కనిపించారు. ఎవరు మీరని ప్రశ్నించాడు నారదుడు.

“నీ గానంతో గాయపడ్డ రాగాలం మేమంతా,” అని బదులిచ్చారు వారు.

‘“ఇక్కడికెందుకొచ్చారు?” అని ప్రశ్నించాడు నారదుడు.

“తుంబురుడు గానం చేస్తే స్వస్థత పొందుదామని వచ్చాం,” అని బదులిచ్చారు.

ఆ సమాధానంతో నివ్వెరబోయాడు నారదుడు. ఈసారి సంగీతం నేర్చుకోవడానికి శ్రీకృష్ణుడి పట్టమహిషి అయిన రుక్మిణీదేవిని ఆశ్రయించాడు. ఇదంతా ఎంత కాలం పట్టిందో గమనించాలి. దాదాపు. కోటిన్నర సంవత్సరాల పైన.

ఆమె శిక్షణలో సంగీతంలో అపార విద్వత్తును సాధించాడు. ఎవరు గొప్ప విద్వాంసులో సాక్షాత్తు శ్రీమహావిష్ణువు వద్దే తేల్చుకుందామంటూ తుంబురుడిని సవాలు చేశాడు నారదుడు. ఇద్దరూ వైకుంఠానికి బయలుదేరారు. ఇద్దరి గానాన్నీ విష్ణుమూర్తి సంతృప్తిగా ఆలకించాడు. అయితే, ఎవరు గొప్పో తాను తేల్చలేనన్నాడు. ఈ విషయంలో తీర్పు చెప్పగల దిట్ట హనుమంతుడు ఒక్కడేనని చెప్పాడు యోగమాయా విశారదుడు.

దీంతో దేవతల సమక్షంలో పోటీ ఏర్పాటైంది. దానికి సిద్ధమైన తుంబుర నారదులిద్దరూ హనుమంతుని వద్దకు వెళ్లారు. హనుమంతుడు న్యాయనిర్ణేతగా రాగా, దేవతల సమక్షంలో పోటీ ఏర్పాటైంది. మొదట తుంబురుడు వీణ వాయిస్తూ గానం చేశాడు. తుంబురుడి సంగీతానికి దేవతలందరూ మంత్రముగ్ధులయ్యారు. లోకమంతా చేష్టలుడిగి సంగీతంలో లీనమైంది. తుంబురుడు తన గానాన్ని ఆపిన తర్వాత నారదుడు ప్రారంభించాడు. మహతి మీటుతూ గానాన్ని సాగించాడు. నారదుడి సంగీత చాతుర్యానికి ప్రకృతిలో చలనం మొదలైంది. తుంబురుడి గానానికి గడ్డకట్టిన సముద్రాలన్నీ తిరిగి కెరటాల హోరుతో సహజత్వాన్ని సంతరించుకున్నాయి.

నింగిలో నిలిచిపోయిన విహంగాలన్నీ స్వేచ్ఛగా ఎగరసాగాయి. ప్రకృతిలో జీవకళ ఉట్టిపడసాగింది. దేవతలందరూ తన్మయత్వంతో తలలూపసాగారు.

నారదుడు తన గానాన్ని ముగించాక వారందరూ క్రమంగా తేరుకున్నారు.

హనుమంతుడి తీర్పు ఎలా ఉంటుందోనని ఆత్రంగా చూడసాగారు ముల్లోక వాసులు.

“ఇద్దరూ సమ ఉజ్జీలుగానే ఉన్నారు. కనుక నేను ఇంకొక పరీక్ష పెడతాను. మీ వీణలు ఇలా ఇవ్వండి,” అని అడిగాడు హనుమంతుడు.

ఇద్దరూ తమ వీణలను అతడి చేతికి అందించారు.

హనుమంతుడు రెండు వీణలనూ తీసుకుని, రెండింటిలోని చెరో మెట్టును ఊడదీసి వారికి ఇచ్చాడు.

“ఇప్పుడు వీణ వాయిస్తూ గానం చేయండి,” అన్నాడు.

దీంతో తుంబుర నారదులిద్దరూ ఆశ్చర్యాగ్రహాలకు గురి అయ్యారు.

“వీణలో అన్ని మెట్లూ ఉంటేనే కదా వాయించగలం. చెరో మెట్టు తీసేసి ఇప్పుడు వాయించమంటే ఎలా?” అని అడిగారు.

హనుమంతుడు చిరునవ్వు నవ్వాడు. ఎదురుగా కనిపించిన ఒక వెదురు బొంగును తీసుకుని, దాన్ని చీల్చాడు. దానికి తీగలు తగిలించాడు. ఎలాంటి మెట్లులేని వీణను తయారు చేశాడు. ఇక దానిని వాయిస్తూ గానం చేయడం మొదలుపెట్టాడు.

మంద్రంగా మొదలైన స్వరఝరి క్రమంగా ఉధృతి అందుకుంది.

ఆ గానానికి వైకుంఠం నుంచి మహావిష్ణువే పరుగున అక్కడికి వచ్చినా, అతడి రాకను గుర్తించలేనంతగా అక్కడి దేవతలందరూ తన్మయులయ్యారు.

హనుమంతుడు తన గానాన్ని ముగించిన తర్వాత తుంబుర నారదులిద్దరూ సంగీతంలో తమ విద్వత్తు ఇంకా పరిపూర్ణం కాదని అంగీకరించారు.

ఆంజనేయుని గానంతో తమ తమను అహంకారం వీడినది అన్నారు. వారి మాటలతో బాహ్యస్పృహలోకి వచ్చిన దేవతలు అక్కడకు వచ్చిన శ్రీమహావిష్ణువును గమనించారు.

ఆయన అభిప్రాయం కోరారు. తుంబుర నారదులిద్దరూ తన భక్తులే అయినా, ఇద్దరిలోనూ ఇంకా అహం పూర్తిగా నశించలేదని, అందుకే వారు తమ విద్యలో ఇంకా పరిపూర్ణత సాధించలేక పోయారని, అహంకారమును జయించటం వల్లనే హనుమంతుడు పరిపూర్ణత సాధించగలిగాడని వెల్లడి చేశాడు ఆ నారాయణుడు.

ఇది ఒక చమత్కారమైన కథ.

Who judges the judges? అనే మాటకు ఒక సమాధానం లాంటిది.

వారికి అహంకార మమకారాలు ఎక్కువయ్యాయి అని తెలుసుకుని, వాటి పుట్టుక తెలుసు కనుక వాటిని నశింపజేయవలసిన బాధ్యత కూడా ఆయనదే కనుక ఈ నాటకాన్ని ఆడి వారిని అహంకార విముక్తులను చేశాడు అనుకోవచ్చు.

ఆ విధంగా శ్రీమహావిష్ణువు అనాదినిధనుడు.

ఈ అనాదినిధనః అనే నామానికి అనేకార్థాలు అందించారు పరాశర భట్టర్. అవి అన్నీ సంపూర్ణంగా అవగతం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కొనసాగిద్దాము.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here