[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]
యశోదై ఇళం సింగమ్-3
ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకీ
నిర్వాహ కోరకిత నేమ కటాక్షలీలాం।
శ్రీరంగ హర్మ్యతల మంగళ దీపరేఖాం
శ్రీరంగరాజ మహిషీం శ్రియమాశ్రయామః॥
(శ్రీరఙ్గరాజమహిషి ప్రార్థన)
కృష్ణో రక్షతునోజగత్రయగురుః కృష్ణం నమస్యమ్యహం।
కృష్ణేనామరశ్త్రవో వినిహతాః కృష్ణాయ తస్త్మైనమః॥
కృష్ణా దేవ సముత్ధితాం జగదిదం కృష్ణస్య దాసో స్మ్యహం।
కృష్ణే తిష్ఠతి సర్వమేతదఖిలం హే కృష్ణ! రక్షస్వమాం॥
దివ్యదేహాల గురించి చెప్పుకుంటూ రావణుడు ప్రయోగించిన శక్తి ఆయుధం దెబ్బతిన్నప్పుడు లక్ష్మణుడు ఔషధీపర్వతం వచ్చేదాకా తాను విష్ణ్వంశ అని ఎఱిగి ఉండి తట్టుకున్నాడు ఆ ఘాతాన్ని అని చెప్పుకున్నాము. శ్రీరామాయణం ఎంత ఇతిహాసం అయినా కూడా దాదాపు కోటీ తొంభై లక్షల సంవత్సరాల క్రితం నాటి మాట. ఆ ఆదర్శాలు, ధర్మ నిరతి ఇప్పటికీ ఆచరణీయమైన అయినా అలాంటి దివ్య దేహాదులు ఈమధ్య జరిగిన చరిత్రలో ఉన్నవా? అని కొందరి ప్రశ్న.
దానికి సమాధానం ఇవ్వటము కూడా ఉచితమే కనుక పరిశీలిద్దాము.
ముందుగా..
బోద్ధారో మత్సరగ్రస్తాః
ప్రభవః స్మయ దూషితా।
అబోధోపహతాశ్చాన్యే
జీర్ణ మఙ్గే సుభాషితమ్॥
తెలిసినవాళ్ళేమో అసూయాపరులు, ప్రభువులేమో గర్వాంధులు. ఇతరులకి విని బోధపరచుకొనే తెలివిలేదు. చెప్పాలనుకున్న సుభాషితం నాలోనే జీర్ణమైపోయింది.
ఈ విధంగా మహానుభావుడైన భర్తృహరి బాధపడినా, కొన్ని వందల ఏళ్ళ తరువాత కూడా మంచి మాటలు లేదా సుభాషితాలు అనగానే ఆయన పలుకులే గుర్తుకువస్తాయి.
అలాగే ఇంతింత రాస్తున్నావు చదువుతారా? అని వచ్చే ప్రశ్నలకు.. చదవాలన్నా, చదవకుండా ఉండాలన్నా ముందు చదివించేది లభ్యమవ్వాలి కదా! రాస్తున్నందుకు విస్తారమైన వివరణలు అవసరాన్ని బట్టీ ఇవ్వాల్సిన బాధ్యత అయితే ఉంది. కావాలి అనుకున్న వారికి అన్నీ ఒక్కచోటే కనబడతాయి. చదవని వారు ఎటూ చదవరు.
మనకు కూతవేటు కాలంలో జరిగిన మహాభారత యుద్ధంలో ఒక ఘట్టంలో లక్ష్మణుడి లాగనే జరిగింది.
అనాదినిధనుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మను చూస్తూ భీష్ముడు తన్మయత్వంలో మునిగాడు. చూసిన వారికి ఆశ్చర్యం కలుగదు. కానీ, నేడు వింటున్న వారికి అనుమానం రావచ్చు. అంతంత బాణఘాతాలతో అంపశయ్య మీద ఉన్న గాంగేయుడు ఆ బాధను ఎలా భరించ గలిగాడు?
ఇంతకు 62 రోజుల క్రితం!
యుద్ధం ముగిసింది. దుర్యోధనుడు ఎప్పటిలాగనే పితామహుడి వద్దకు వచ్చి ఆయనకున్న పాండవ పక్షపాతం వల్లే ఆయన తన స్థాయికి తగిన రీతిలో యుద్ధం చేయటం లేదని ఆక్షేపిస్తాడు. కొంత నింద కూడా చేస్తాడు. వాదనలు అవుతాయి. చివరకు ఇక నేను రేపటి యుద్ధంలో నా పౌరుష-ప్రతాపాలను తీవ్రంగా వెల్లడి చేస్తాను అని గట్టిగా చెప్తాడు శాంతనవుడు. దుర్యోధనుడు వెళ్ళిపోతాడు.
అంతకు మూడు రోజుల ముందు.
దృతరాష్ట్రుడు “సంజయా! ఇక నీవు యుద్ధభూమికి వెళ్ళి ఏమి జరుగుతున్నదో చూసి రా,” అని పంపాడు.
యుద్ధభూమికి వెళ్ళిన సంజయుడు (వ్యాసుని వరం – యుద్ధంలో జరిగేది మొత్తం తెలుస్తుందని, అందులో పాల్గొన్న వారి మనసులో ఉండే భావాలతో సహా) కొన్ని రోజుల తరువాత తిరిగి వచ్చి దృతరాష్ట్రుని చూసి ఏడుస్తూ పాదముల పై పడ్డాడు. ఏమైనదని ధృతరాష్ట్రుడు విస్తుపోయాడు.
“అయ్యో ఏమని చెప్పను? రాజా! పరాక్రమ వంతులలో అత్యంత శ్రేష్ఠుడైన భీష్ముడు అంపశయ్యపై పడి ఉన్నాడు. పరశురాముని జయించిన వీరుడు శిఖండి చేత భంగపడ్డాడు. ఏ భీష్ముని అండ చూసుకుని నీ కొడుకు జూదంలో పాండవులను గెలిచాడో ఆ భీష్ముడు యుద్ధమనే జూదంలో ఓడి పోయాడు. పది వేల సైన్యం ఎదురు వచ్చినా ఒక్కడుగా ఎదుర్కొనగల వీరుడు పది రోజుల వీరోచిత పోరు సలిపిన పిదప నేలకొరిగాడు.” అని విలపించసాగాడు.
భీష్ముడు నేలకొరిగిన వార్త విన్న ధృతరాష్ట్రుడు మూర్చిల్లాడు.
కొంతసేపటికి తేరుకుని “సంజయా! దేవాసురులు ఒకటై వచ్చినా చలించని భీష్ముడు నేలకొరిగాడా? శస్త్రాస్త్ర ప్రకరణములతో విరోధుల మద మణచుచున్న భీష్ముని శిఖండి ఒంటరిగా ఎదిరించడం కంటే ఆశ్చర్యం ఏమి ఉంది? ప్రచండ ఛండమారుతం లాంటి భీష్ముని శిఖండి అనే చిరుగాలి ఎదిరించిందా? అంబ కొరకు పోరిన పరశురాముని ఎదిరించి నిలిచిన భీష్ముడు పాండవుల కొరకు శిఖండి చేతిలో నేల కొరిగాడా? అతని సత్వము, శౌర్యము, శీలము, పరాక్రమము, అతని శుద్ధ వ్రతము నాశం లేనివని నమ్మాను కదా! ఇప్పుడు ఏమి చేయాలి?” అని రోదించాడు.
ధృతరాష్ట్రుడు తిరిగి “సంజయా! భీష్మునిపై అస్త్ర వర్షం కురిపిస్తున్నప్పుడు మన వాళ్ళు అడ్డుకొనలేదా ఇన్ని అక్షౌహిణుల సైన్యం ఒక్క భీష్ముని రక్షించలేక పోయిందా? ద్రోణుడు, అశ్వత్థామ, కృపుడు, శల్యుడు పారిపోయారా? లేకున్న భీష్మునికి ఈ విధమైన స్థితి ఏమిటి? కుల వృద్ధుడైన గాంగేయుని వధించి రాజ్యాధికారాన్ని చేపట్టడానికి ధర్మరాజు సాహసించడం అధర్మం కాదా? అధర్మానికి ఒడికట్టిన పాండవులకు దైవం తోడైంది కదా! కౌరవ సేన అనాథ అయింది! నా కుమారులు ఎంత కలత పడుతున్నారో కదా! ఈ పది రోజులు యుద్ధం ఎలా సాగింది? భీష్ముడు పోరు ఎలా సాగించాడు. నాకు సవివరంగా తెలుపుము,” అన్నాడు.
దానికి సంజయుడు, “మహారాజా! నీ అవినీతి వలనే పాండవులు ఇన్ని కష్టాల పాలు అయింది. ధర్మపరులైన పాండవులకు అపకారం చేసినందుకు ఫలితం అనుభవించక తప్పదు,” అని చెప్పి సంజయుడు యుద్ధం గురించి వివరించ సాగాడు.
మొదటి మూడు రోజుల యుద్ధం తరువాత ధార్తరాష్టృని నిష్ఠుర మాటలు విన్న మరునాడు భీష్ముడు, కౌరవ సేనలు శంఖములు పూరించగానే పాండవులు తమ శంఖములు పూరించారు. భీష్ముడు విజృంభిస్తూ అర్జునుని మీదకు రథం నడిపాడు. ఇరు వర్గాల మధ్య పోరు ఘోరమైంది. హూంకారములు, అదలింపులు, రంకెలు, ధిక్కారములు, పొగడ్తలు, వీరాలాపములు చేస్తూ ఇరుపక్షాల నిలచిన సైన్యాలు వీర విహారం చేస్తున్నాయి.
విరిగిన రథములు, మొండెములు, రక్తపు మడుగులు, నేలన పడిన గుర్రములు, తలలు తెగిన ఏనుగులు మొదలైన వాటితో యుద్ధ భూమి భీకరంగా ఉంది. సైన్యంలో కొంత మంది అక్కడ తిరగడం ఇష్టం కాక దూరంగా గుంపులుగా నిలిచి చూస్తున్నాయి. భీష్ముడు భీకరాకారంతో అంతటా తానై యుద్ధం చేస్తున్నాడు. అతడి ఒక్కొక్క బాణంలో వేయి బాణములు పుడుతున్నాయి. పాండవ సేనలను తుత్తునియలు చేస్తున్న భీష్ముని ఎదిరించడం ఎవరి శక్యం కావడం లేదు. ప్రళయ కాల రుద్రుని వలె ఉన్న భీష్ముని చూసి పాండవ సేనలు భయభ్రాంతమయ్యాయి.
ఇది చూసిన శ్రీ కృష్ణుడు “అర్జునా! ద్రోణ, కృపాచార్య సహితంగా భీష్ముని మట్టు పెట్టగలనని చెప్పి ఇలా చూస్తూ ఊరుకున్నావేమి?” అన్నాడు. అర్జునుడు “అలా అనకు బావా. రధమును భీష్ముని ఎదుటికి పోనిమ్ము అతడి పని పడతాను,” అన్నాడు.
అర్జునుడు తన ఎదుటికి రాగానే భీష్ముడు అర్జునిని రథానికి కట్టిన హయముల మీద, అర్జునిని మీద, శ్రీకృష్ణుని మీద శరములు సంధించాడు. తన మీద బాణములు వేసిన భీష్ముని మీద శ్రీకృష్ణుడు ఆగ్రహించాడు. అది చూసిన అర్జునుడు భీష్మునిపై ఒకే బాణం సంధించి అతని విల్లును విరిచాడు.
భీష్ముడు మరొక విల్లు అందుకున్నాడు. అర్జునుడు దానిని కూడా విరిచాడు. భీష్ముడు మరొక విల్లు అందుకుని కృష్ణార్జునుల మీద శరవర్షం కురిపించి నొప్పించాడు. కృష్ణుడు చిత్రవిచిత్ర రీతుల రథాన్ని నడుపుతూ భీష్ముడి ఆ బాణముల బారి నుండి అర్జునుడిని తప్పిస్తూ వచ్చాడు. అర్జునుడు కూడా భీష్మునిపై క్రూరమైన బాణములు విడిచాడు. శ్రీకృష్ణుడు బాగా గాయపడిన అర్జునుని చూసి ఇలా అనుకున్నాడు.
“పాండవ సైన్యాలు భీష్ముని ధాటికి ఆగలేక పోతున్నాయి. అర్జునుడు పూర్తిస్థాయిలో పోరాడటం లేదు. పరిస్థితి ఇలా కొనసాగితే దుర్యోధనుని సమస్త కోరికలు భీష్ముడు ఈ రోజే నెరవేర్చగలడు. కేకయరాజులు, పాంచాలురు, యాదవులు పారిపోతున్నారు. కౌరవ సేనలు ఉన్మాదంతో ఊగిపోతున్నారు. ఇక ఉపేక్షించి లాభం లేదు.”
ఇంతలో భీష్ముడు అర్జునునిపై శరవర్షం కురిపించాడు. అర్జునుడు శరసంధానం చేయలేక పోతున్నాడు. ఇది గమనించిన కృపాచార్యుడు, అశ్వత్థామ, భూరిశ్రవుడు, సైంధవుడు, వికర్ణుడు ఒక్క సారిగా అర్జునుని వైపు తమ రథాలను మరల్చారు. సాత్యకి తన గజ బలమును అర్జునునికి సాయంగా నిలిపాడు. సాత్యకి పాండవ సేనలను చూసి, “ఎందుకు పారిపోతున్నారు మీరు పలికిన పలుకులు మరిచారా? భీష్ముడు మనలను ఏమి చేయలేడు. కౌరవ సేనలను నరకండి తరమండి.”
సేనలను ప్రోత్సహిస్తూ ముందుకు వచ్చాడు. శ్రీకృష్ణుడు “సాత్యకీ! పోయే పిరికివారిని ఎందుకు ఆపుతావు ఈ రోజు నేను భీష్ముని చంపి ద్రోణుని పని పడతాను. కౌరవ సైన్యాలను నాశనం చేసి ఈ నాలుగు సముద్రముల నడుమ ఉన్న రాజ్యమంతా పాండు తనయునకు కట్టబెడతాను,” అని పలికి సుదర్శన చక్రాన్ని మనసున తలచిన వెంటనే శ్రీకృష్ణుని చేతిలో సుదర్శన చక్రం ప్రత్యక్షమైంది.
పగ్గములను నొగల మీద పెట్టి కట్టు పంచ జారుతున్నా లక్ష్యపెట్టక కోపంతో రగిలి పోతూ భీష్ముని పైకి లంఘించాడు.
కౌరవ సేనలు నిశ్చేష్టులై చూస్తూ ఊరక ఉన్నారు. భీష్ముడు పారవశ్యంతో రథం దిగి శ్రీకృష్ణునికి ఎదురు వెళ్ళి “కృష్ణా! రావయ్యా! నన్ను సంహరించి కృతార్ధుడిని చెయ్యి,” అని చేతులు జోడిస్తూ ప్రార్ధించాడు.
ఇది చూసిన అర్జునుడు రథం దిగి శ్రీకృష్ణుని వెనుక నుండి పట్టుకున్నాడు. కాని శ్రీకృష్ణుని బలానికి ఆగలేక చతికిల పడి తిరిగి లేచి శ్రీకృష్ణుని గట్టిగా పట్టుకుని “కృష్ణా! నీ కోపం వదలవయ్యా. యాదవులకు పాండవులకు నీవే దిక్కు. నీవే ఇలా అలిగతే పాండు పుత్రుల అందునా ధర్మతనయుని ధైర్యం, పరాక్రమం, వీర్యం ఏమి కావాలి. లోక నాయకా శాంతించు. నీ సాయంతో కౌరవ సేనను రూపు మాపుతాను. నాకు అపకీర్తి తీసుకు రాకు,” అని ప్రార్థించగా శ్రీకృష్ణుడు శాంతించి కోపం ఉపసంహరించి తిరిగి రథం ఎక్కి పగ్గములు చేత పట్టాడు. కృష్ణార్జునులు పాంచజన్య దేవదత్తములు పూరించారు.
కేవలం అర్జునుడిని రెచ్చగొట్టటానికే శ్రీకృష్ణుడు ఆయుధం పట్టి భీయ్ముని మీదకు లంఘించాడా? మాటలతోనే ఆ పని చేయగలడు కదా? మరి ఎందుకు అలా చేయవలసి వచ్చింది?
కారణం ఆరోజు యుద్ధం చేస్తున్నది భీష్ముడు కాదు. మానవోపాధిలో ఉన్న వసువు ద్యువు ఆ నాడు భీష్ముని తన నిజశక్తితో ఆవహించాడు. మానవులు చేస్తున్న సంగ్రామములో దేవతా శక్తి పొందిన వీరుడు అలాగే యుద్ధం చేస్తుంటే దానిని నిలువరించ వలసిన బాధ్యత దేవాది దేవుడిదే కదా! అందుకే ఆ పని.
మరోసారి 9వ రోజున కూడా అలాగే జరిగిందని చెప్పాడు సంజయుడు. “రాజా! ఈసారి శ్రీకృష్ణుడు సుదర్శన చక్రం వరకూ కూడా ఆగలేదు. చెర్నాకోలతోనే రథం దిగాడు. కానీ అది కూడా భీష్ముడికి సుదర్శనం లాగనే దర్శనమిచ్చింది.
అంతకు ముందు రోజు సాయంత్రం..!
భీముని ధాటికి తమ్ముల మరణంతో కలత చెందిన సుయోధనుడు దుశ్శాసనుని పిలిచి వెంటనే కర్ణుని, శకునిని పిలుచుకురమ్మని కబురు పంపాడు. దుశ్శాసనుడు కర్ణ, శకునులతో సుయోధనుని వద్దకు వచ్చాడు. ఏకాంతంలో సుయోధనుడు, “తాత భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు తటస్థంగా ఉన్నారు. పాండవులను వారు చంపడం లేదు. మన సైన్యం అతి వేగంగా తరిగి పోతోంది ఏమి చేయాలి?” అన్నాడు.
కర్ణుడు రణక్రీడా ఉత్సాహుడై, “సుయోధనా! భీష్ముని రావద్దని చెపితే నేను రణరంగ ప్రవేశం చేస్తాను. పాండవులూ వారి సేనల మదం అణచగలను” అన్నాడు. ఆ మాటలు విని సుయోధనుడు, “దుశ్శాసనా! తాతగారి వద్దకు వెళ్ళి ఈ విషయం చెబుదాము. రా!” అని అనగా, ఇరువురు భీష్ముని వద్దకు వెళ్ళి ఆయనకు నమస్కరించారు.
“పితామహా! మిమ్మల్ని నమ్మి యుద్ధానికి దిగాను. కాని యుద్ధ రంగమున దేవదానవులను ధిక్కరించగల మీరు ఏమీ చేయక ఎనిమిది రోజుల నుండి దిక్కులు చూస్తూ పాండవులను చంపక నిరీక్షిస్తున్నారు. అర్జునుని చంపడం మీకు చేతకాలేదు కాని నా తమ్ములు మాత్రం మరణిస్తున్నారు. కనుక మీరు రణరంగం నుండి తప్పుకుని కర్ణునికి యుద్ధం చేసే అవకాశం ఇవ్వండి,” అన్నాడు.
దానితో మనసు గాయపడిన భీష్ముడు తొమ్మిదవ రోజు మరల వసు-శక్తితో విజృంభించాడు.
తొమ్మిదవనాటి భీష్ముని విజృంభణ చూసిన ధర్మనందనుని మనసు కలత చెందింది. కౌరవ శిబిరంలో ఆనందోత్సాహాలు మిన్నంటాయి. భీష్ముని వేనోళ్ళ పొగిడారు. నీ కుమారుల ఆనందానికి హద్దు లేదు. భీష్ముని ఉదాత్త హృదయంతో ప్రస్తుతి చేసారు.
ఆరోజు రాత్రి ధర్మనందనునికి నిద్ర పట్టలేదు. తన తమ్ములను తీసుకుని కృష్ణుని శిబిరానికి వెళ్ళాడు. “కృష్ణా! చూసావు కదా కార్చిచ్చు అడవిలోని మృగములను నాశనం చేసినట్లు భీష్ముడు పాండవ సేనలను ధ్వంసం చేసాడు. ఆ మహా వీరుని ముందు మనవాళ్ళెవరూ నిలువ లేకపోయారు. కార్యాచరణ విచక్షణ లోపించి నేను వినాశకరమైన యుద్ధానికి అంగీకరించాను. బంధు మిత్రులను చంపుకుని నేను ఈ రాజ్యాన్ని ఎలా పాలించగలను? కనుక నేను అడవులకు పోయి నిశ్చింతగా ఆకు అలములు తింటూ తపస్సు చేసుకుంటాను. నా తమ్ములతో కూడి ముని వృత్తి స్వీకరిస్తాను. వాళ్ళంతా నా కారణంగా అడవులలో కష్టాలు అనుభవించారు. వారిని నేను భీష్మునికి బలి ఇవ్వలేను. నా తమ్ముల క్షేమమే నాకు ముఖ్యం. కృష్ణా! మా మీద దయ ఉంచి ధర్మ మార్గాన్ని ఉపదేశించు,” అని వేడుకున్నాడు.
ఆ మాటలు విన్న కృష్ణుడు, “ధర్మనందనా! నీవు సత్యవాక్పరిపాలకుడవు. నీ తమ్ములు నాలుగు దిక్కులు జయించిన వారు. మీకు ఎలాంటి దుర్గతి కలుగదు. నా సహాయసంపత్తితో మీకు అమాత్యుడనై మీకు రాజ్యసిద్ధి కలుగ చేస్తాను. అర్జునుడు నాకు భక్తుడు, సఖుడు, బంధువు, శిష్యుడు అతని కోసం నేను నా శరీరాన్ని అయినా కోసి ఇస్తాను. ఉపప్లావ్యంలో అర్జునుడు పలికిన పలుకులు నిజం చేయవలసిన బాధ్యత నా మీద ఉంది. నేను మీకు సాధకంగా శపథం చేసాను. అవన్నీ నిజం చేయవలసిన బాధ్యత నాకు ఉంది. ఒక వేళ అర్జునుడు తెగువ చేసి భీష్ముని వధించకున్న నేను ఆపని చేసి అయినా మీకు విజయం చేకూరుస్తాను,” అన్నాడు.
అది విన్న ధర్మనందనుడు “కృష్ణా! నీవు యుద్ధం చేయనని కేవలం సహాయ సహకారాలు అందిస్తానని చెప్పావు. నీ చేత యుద్ధం చేయించి నీ మాట అసత్యం చేయటం భావ్యం కాదు,” అన్నాడు.
భీష్ముడు కౌరవుల పక్షాన యుద్ధం చేసినా ధర్మజునికి మేలు చేస్తానని మాట ఇచ్చాడు. వారి తండ్రి పోయిన నాటి నుండి వారిని ఆదరించి అల్లారు ముద్దుగా పెంచిన భీష్మునికి కీడు చెయ్యడానికి మనసు రావడం లేదు. అయినా తప్పేలా లేదు. రాజ ధర్మం ఎంతటి క్రూరమైందో కదా!
“ఓ రాజా! శ్రీకృష్ణునికి ధర్మనందనుని ఆంతర్యం అర్థం అయింది,” అని సంజయుడు అన్నాడు.
భీష్ముని వధోపాయం తెలుసుకోవాలని అనుకుంటున్నాడు. ఆ రోజు భీష్ముడు మరలా కలవమని చెప్పడంలో అంతర్యం ఇదే కాబోలు అనుకుని, “ధర్మనందనా! నీ ఆలోచన బాగుంది. భీష్ముడు కోపంతో చూస్తే అతడి ముందు ఎవరు నిలువలేరని నీవే చెప్పావు కదా! నీవు వెళ్ళి అడిగితే చాలు భీష్ముడు తనను వధించే ఉపాయం నీకు తప్పక వివరించగలడు. కనుక మనమందరం భీష్ముని సందర్శించి ఆయనను భక్తితో ప్రార్థించి అతని వలన ఉపదేశం పొందవలెను,” అని పలికాడు.
అప్పుడు ధర్మరాజు సౌమ్య వేషధారణతో శ్రీకృష్ణ సహితంగా తన తమ్ములను తీసుకుని భీష్ముని చూడడానికి వెళ్ళాడు. భీష్మునికి సాష్టాంగ నమస్కారం చేసాడు. భీష్ముడు వారిని సాదరంగా ఆదరించి పేరు పేరునా వారి క్షేమం అడిగి, “ధర్మనందనా! ఈ సమయంలో మీరు నన్ను చూడవచ్చిన కార్యమేమి? సందేహించక అడుగు ఎంతటి దుష్కర కార్యమైనా నెరవేర్చగలను,” అని పలికాడు.
దీనవదనుడై ధర్మరాజు, “పితామహా! మాకు రాజ్యప్రాప్తి ఎలా కలుగుతుంది. మా సైన్యం క్షీణించకుండా కాపాడే మార్గం సెలవివ్వండి,” అని అడిగాడు.
భీష్ముడు, “ధర్మనందనా! నేను యుద్ధ భూమిలో ఉన్నంత కాలం మీకు రాజ్యప్రాప్తి కలుగదు,” అన్నాడు.
ధర్మరాజు, “పితామహా! రణభూమిలో మీరు త్రిశూలం ధరించిన రుద్రుని వలె నిలబడినంత కాలం మిమ్ము గెలుచు వీరుడెవ్వరు కలరు? కనుక మిమ్ము గెలుచు ఉపాయము మాకు చెప్పండి!” అన్నాడు.
“ధర్మనందనా! నా చేత ఆయుధం ఉండగా నన్ను గెలుచుట అసాధ్యం. నా శక్తి తెలుసుకుని నన్ను గెల్చు ఉపాయం తెలుసుకొన వచ్చారు. మీకు సహాయం చేయుట కంటే సుకృతం ఏముంది. నేను ఆయుధం విసర్జించిన నన్ను గెలువవచ్చు. నేను కవచం తీసిన వాడిని, ఆయుధం ధరింపని వాడిని, కేతనమును దించిన వాడిని, స్త్రీలను, పూర్వ స్త్రీలను (స్త్రీగా ఉండి పురుషునిగా మారిన వారిని) తలపాగా తీసిన వాడిని, అన్నదమ్ములు లేని వాడిని, పుత్రులు లేని వారు ఎదురైన వారితో యుద్ధం చేయను. వెంటనే నా ఆయుధములను విడిచి పెడతాను. పుట్టుకతో పురుషుడు కాక దైవత్వంతో పురుషుడైన వాడితో నేను యుద్ధం చేయను. ద్రుపద కుమారుడు శిఖండి పుట్టకతో స్త్రీ అయి దైవీకంగా పురుషత్వం పొందాడు. శిఖండిని ముందు పెట్టుకుని అర్జునుడు యుద్ధం చేసిన నేను ఆయుధము విసర్జిస్తాను అప్పుడు అర్జునుడు శిఖండిని అడ్డుపెట్టుకుని నన్ను పడగొట్టవచ్చు. తరువాత బంధు మిత్ర సహితంగా సుయోధనుని గెలుచుట సులభం,” అన్నాడు.
వచ్చిన కార్యం సఫలమైంది అనుకుని ధర్మనందనుడు తమ్ములతో తమ శిబిరానికి మరలాడు.
ఈ సందర్భమంతా పనికట్టుకుని మరీ ధర్మాన్ని గెలిపించాలి. లేకపోతే ముందు తరాల వారు ధర్మాచరణను చేయరు. ఈ విషైకంగా మనం చూడాలి. పైగా భీష్మునికి కూడా ధర్మ మార్గంలో నడిచే వారికి చేయూతనీయాలనే బలమైన కోర్కె కూడా ఉంటుంది.
ఆ విధంగా పదవ రోజు చాలా సేపు దేవవ్రతుడని పేరు కలిగిన శాంతనవుడు వీర విజృంభణ చూపినాక, సాయం సమయం కానస్తుండగా ఆయనకు విరక్తి మొదలౌతుంది. అర్జునుడసలే ఓటమి ఎరుగని వీరుడు. తనకా ఇచ్ఛామరణం (స్వచ్ఛంద మరణం) తన తండ్రి వరంగా ఇచ్చాడు. పైగా ఆయుధం చేతిలో ఉంటే తనను ఎవరూ ఓడించలేరు.
ఇలా కొనసాగుతుంటే ఇరుపక్షాలా సైన్యము, ఇతర వీరులు (భీముడు ఎటూ ప్రతిరోజూ దుర్యోధన సోదరులలో కనీసం ఒకరిని చంపుతూనే ఉన్నాడు) మరణిస్తారు. పైగా పాండవులకు శ్రీకృష్ణుని అండ ఉన్నందున వారు మరణించరు. ఇలా యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. ధర్మ విజయం అన్నది ఆలస్యమవుతూనే ఉంటుంది. ఎన్నో తర్క-వితర్కాల తరువాత ఆ మహాత్ముడు శిఖండిని ముందు పెట్టుకుని యుద్ధం చేస్తున్న అర్జునునికి అవకాశం ఇస్తూ తన ఆయుధాలను త్యజించాడు.
ఆ పైన అర్జునుడి బాణ పరంపర, ఇతర వీరుల హాహాకారాలు. భీష్ముడి తీర్పు దిక్కు వైపు శిరస్సు ఉండేలా నేల కూలాడు. ఈ విషయం ధృతరాష్ట్రునకు చెప్పి సంజయుడు అమితమైన దుఃఖానికి గురయ్యాడు.
అక్కడ అందరూ నిశ్చేష్ఠులై చూస్తున్నారు. భీష్ముని చూపు మటుకూ శ్రీకృష్ణుని వైపే. నారాయణ ధ్యానం చేస్తూ ఆయన అనుమతి అడిగాడు. దేని కోసం?
నిజానికి దేవతలకు దేవజాతి వారికి మానవ జన్మ ఎత్తటం ఒక శాపం లాంటిది. ఈ వాసనా ఉపాధులు వారికి చాలా కష్టంగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఒక రకమైన దివ్య దేహాలతో ఉండే వీరు, మల మూత్రాదులకు అలవాలమైన మానవ దేహాదులలో ఉండటానికి ఇష్టపడరు. భీష్ముడిది అదే సమస్య. శాపవశాత్తూ ఆయన నరజన్మ తీసుకోవలసి వచ్చింది. అలాగే ఉన్నాడు. మిగిలిన ఏడుగురు వసువుల అంశాశక్తి ఆయనలో చేరింది. కానీ, ధర్మాన్ని అనుసరించి తన నిజ శక్తిని మాత్రం ఆయన యుద్ధంలో వాడలేదు. రెండుసార్లు దుర్యోధనుడి ఎత్తిపొడుస్తుంది మాటల తరువాత అలా చేయబూనినా, భీష్ముడు ధర్మం తప్పకుండా కాచుకున్నాడు జగన్నాథుడైన శ్రీకృష్ణ భగవానుడు. అక్కడ అర్జునుడిని రెచ్చగొట్టి పనిచేయించటం ఎంత ఉందో తన భక్తుడైన, మహాత్ముడైన భీష్ముడిని ధర్మ తప్పకుండా చూడటం కూడా అంతే ప్రాధాన్యం వహించింది.
లేకపోతే ద్రోణుడితో యుద్ధం విషయంలో ఇలా ఎందుకు జరుగలేదు? పైగా అశ్వత్థామ తరువాత అంత ఇష్టమైనవాడు కదా అర్జునుడు. అర్జునుడి గురుభక్తి కూడా లోక విదితమే కదా.
అందుకే మహాభారతానికి కథానాయకుడు శ్రీకృష్ణుడు అయినా, ఆ గాథ మాత్రం మహాత్ముడైన భీష్మునిదే. మొదలే చెప్పుకున్నట్లు ఆయనతోనే ప్రారంభమై, ఆయనతోనే ముగుస్తుంది. కథకు మంగళాశాసనంగా భీష్ముని చివరి వాక్కులుగా శ్రీవిష్ణు సహస్రనామములు వచ్చాయి లోకాన్ని ఉద్ధరించేందుకు.
ఉత్తరాయణం వచ్చాక భీష్ముడు శరీరత్యాగం చేసి దివ్యలోకాలకు.. అనగా తన నిజస్థానానికి వెళ్ళాలి. కానీ, అందుకు ఇంకా ప్రణాళిక ప్రకారం 47 రోజులు ఉంది. అంతవారకూ అంపశయ్య మీద దేహబాధను ఓర్చుకునేందుకు తన దివ్య దేహం గురించిన ఆలోచన మనసులో పెట్టుకునేందుకు.
శ్రీకృష్ణ భగవానుడు అందుకు చిరునవ్వుతో అంగీకరిస్తాడు.
అంటే భీష్ముడు కూడా అనాదినిధనుడా?
గొప్ప చిక్కే వచ్చి పడిందే?
పరిష్కారం చూద్దాం!
(సశేషం)