Site icon Sanchika

తల్లివి నీవే తండ్రివి నీవే!-39

[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]

యశోదై ఇళం సింగమ్-4

అచ్యుతం కేశవం రామ నారాయణం

కృష్ణ దామోదరం వాసుదేవం హరిమ్।

శ్రీధరం మాధవం గోపికావల్లభం

జానకీనాయకం రామచంద్రం భజే॥1॥

అచ్యుతం కేశవం సత్యభామాధవం

మాధవం శ్రీధరం రాధికాఽరాధితమ్।

ఇందిరామందిరం చేతసా సుందరం

దేవకీనందనం నందజం సందధే॥2॥

విష్ణవే జిష్ణవే శంఖినే చక్రిణే

రుక్మిణీరాగిణే జానకీజానయే।

వల్లవీవల్లభాయాఽర్చితాయాత్మనే

కంసవిధ్వంసినే వంశినే తే నమః॥3॥

(అచ్యుతాష్టకం – 1, 2, 3)

శ్రీకృష్ణుడి అనుమతితో తనలో దైవీక భావనను తెచ్చుకున్నాడు భీష్ముడు. క్రమంగా భీష్మునిలో పారమార్థిక చింత మొదలైంది.

ఆ సమయంలో దివి నుండి చూస్తున్న దేవతలు “అయ్యో ఇది దక్షిణాయనము కదా! భీష్ముడు దక్షిణాయనంలో మరణిస్తాడేమో,” అని కలవర పడ్డారు. వారి మనోభావం గ్రహించాడు భీష్ముడు. ఆయనకు శాస్త్ర వచనం ప్రకారం దక్షిణాయనంలో ప్రాణం విడవటం మంచిది కాదని తెలుసు. అందువల్ల తన తండ్రి అయిన శంతన మహారాజు ప్రసాదించిన ఇచ్ఛామరణం అనే వరాన్ని వాడుకుంటూ, ‘నా ప్రాణములు నా మేనిలో ఉత్తరాయణము వచ్చేవరకు నిలుపుకుంటాను. నా తండ్రికి సత్యవతితో వివాహము జరిపించిన సమయంలో నా తండ్రి నాకు ఇచ్ఛా మరణం వరంగా ప్రసాదించాడు కనుక నా ప్రాణములు నా వశంలో ఉంటాయి,’ అనుకున్నాడు. భీష్ముని మానసిక భాషణం విన్న దేవతలు సంతోషించారు.

భీష్ముని తల్లి గంగాదేవి హంసల రూపంలో కొంతమంది మునులను భీష్మునికి దక్షిణాయనము గురించి తెలపడానికి పంపింది. వారు భీష్మునికి ఆ విషయమై ముందే ఆలోచించాడని తెలుసుకుని సంతోషించి తిరిగి వెళ్ళారు. భీష్ముని స్థితి తెలుసుకున్న దుర్యోధనుడు ఈ కబురు ద్రోణునికి అందించమని దుశ్శాసనుని పంపాడు. దుశ్శాసనుడు ఈ విషయం తెలుపగానే ద్రోణుడు మూర్ఛిల్లాడు. దాదాపు 75 ఏళ్ళ స్నేహం వారిది. విశేషించి చూస్తే ద్రోణుడికన్నా భీష్ముడు చిన్నవాడు. ద్రోణుడి వయసు 400 సంవత్సరాలకు పైమాటే.

ఏనాడైతే ద్రోణుడు హస్తినాపురములో అడుగు పెట్టి కుమారులను (పాండురాజు, ధృతరాష్ట్రుడి పిల్లలు) ఆశ్చర్యపరచి భీష్ముని చేత వారికి గురువుగా నియమించబడిన సమయం నుంచీ సభలో ఆయనతో సమానమైన గౌరవాదరాలు దక్కేలా చేశాడు. తన ప్రతిభకు తగిన స్థానాన్ని తనకు అందించాడు. పైకి చెప్పరు కానీ, గొప్ప మైత్రి వారిది. ఒకరి సమక్షంలో ఒకరికి ఒకరకమైన ఊరట. శతాబ్దాల పైబడి కొనసాగించిన జీవితాలలో ఒకరికి ఒకరు కనపడని భరోసా.

వార్త వినగానే ద్రోణాచార్యుడు నిలువునా కూలిపోయాడు. కొంత సమయం పట్టింది మూర్ఛ నుండీ తేరుకునేందుకు. భీష్ముడు కూలిపోయినందుకు విలపిస్తూ ఆయన పడిపోయిన ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడికి ఆ రోజు యుద్ధం ముగిసింది.

ఈ వివరాన్ని సంజయుడి ద్వారా విన్న ధృతరాష్ట్రుడు “సంజయా! ఇంతటి ఘోర వార్త విని కూడా నా మనసు ఆవంతయు చలించుట లేదు, నాది హృదయమా పాషాణమా?” అని విలపించాడు.

ఇక్కడ పాండవులు తమతమ ఆయుధములు విడిచిపెట్టి గాంగేయుని వద్దకు వెళ్ళారు. ధనంజయుడు మాత్రం తన గాండీవంతో సహా తాతగారి చెంతకు వెళ్ళాడు (కారణం ఉంది). ఆ సమయంలో ఇరు పక్షాలు తమతమ స్పర్థలను విడచి భీష్మ పితామహుని ముందు నిలిచారు.

భీష్ముడు నీ తనయుల వంక చూసి “నా తల వాలి పోతున్నది. దానికి ఒక ఆధారం కావాలి,” అన్నాడు. నీ పుత్రులు వెంటనే సుతి మెత్తని దిండ్లు తీసుకుని వచ్చారు. భీష్ముడు వాటిని సున్నితంగా తిరస్కరించి అర్జునుని వైపు చూసాడు. అర్జునుడు కళ్ళలో నీరు పెట్టుకుని పితామహుని తల వైపు మూడు బాణములు సంధించాడు. వాటిపై భీష్ముడు తన తలకు విశ్రాంతి ఇచ్చాడు.

భీష్ముడు పాడవులను, కౌరవులను చూసి, “నేను ఉత్తరాయణ పుణ్య కాలం వచ్చు వరకు ఈ శరతల్పమున శయనిస్తాను. అందుకు కావలసిన రక్షణ ఏర్పాట్లు శ్రీకృష్ణుని అనుమతి తీసుకుని చేయండి,” అన్నాడు. ఆ విధంగానే వారు భీష్ముని చుట్టూ ఒక ప్రాకారం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్మించారు. సుయోధనుని వైద్యులు వచ్చి భీష్మునికి వైద్యం చేయడానికి అనుమతి కోరారు. గాంగేయుడు వారి సహాయమును తిరస్కరించాడు. ఇంతలో గాంగేయునికి దాహం వేసి నీటి కొరకు సైగ చేసాడు. నీ కుమారులు మధురమైన శీతల పానీయములు తెప్పించారు. భీష్ముడు, “శరతల్ప గతుడనైన నేను ఇతరములైన జలమును ముట్టను. నేను తేజోమయమైన అస్త్రవిన్యాసంతో బయటకు వచ్చిన భూగర్భజలాలను మాత్రమే స్వీకరిస్తాను,” అన్నాడు.

నీ కుమారులు భూగర్భ జలములు తీసుకు వచ్చేది ఎలా అని ఆలోచించుచుండగా, భీష్ముడు అర్జునుని చూసి “అర్జునా! ఈ బాణముల వలన కలుగు బాధ నా సర్వాంగములను వేధించుచున్నది. నా దాహం తీర్చు జలములు నీవే తీసుకురావాలి,” అన్నాడు. అప్పుడు అర్జునుడు భీష్మునికి ప్రదక్షిణం చేసి దివ్యాస్త్రం సంధించి భూగర్భ జలాన్ని బయటకు తీసుకు వచ్చాడు.

ఆ జలమును సేవించి భీష్ముడు సేదతీరి అర్జునుని చెంతకు పిలిచి, “అర్జునా! నేను నారదుని వలన నిన్ను నరునిగా తెలుసుకున్నాను. నరనారాయణులైన నీవు శ్రీకృష్ణుడు కలిసిన మీకు అసాధ్యమయినది లేదు. మీ ఇద్దరితో వైరము తగదు అని ఎన్నిమార్లు చెప్పినా కురునాధుడు వినలేదు. అతడు భీముని చేతిలో తగిన ఫలితము అనుభవించుట తధ్యము,” అని పలికాడు.

తరువాత సుయోధనుని చూసి, “సుయోధనా! అర్జునుడు నరుడు. అమిత పరాక్రమశాలి. అతడికి శ్రీకృష్ణుడు ఆప్తుడు. కనుక నరనారాయణులను జయించుట అసాధ్యము. నా మాట విని అజాత శత్రువైన ధర్మనందనునికి ఇంద్రప్రస్థముతో సహా సగరాజ్యం పంచి ఇచ్చి మిగిలిన సోదరులతో నిండు నూరేళ్ళు బ్రతకండి,” అన్నాడు. ఎవ్వరూ భీష్మునికి బదులు పలుకకనే వారి వారి శిబిరాలకు తిరిగి వెళ్ళారు.

ఒక్క శ్రీకృష్ణార్జునులు మాత్రం మిగిలారు. అర్జునుడు తన చిన్నతనం నుంచీ ఆ మహాత్ముడితో ఉన్న అనుబంధం గుర్తు తెచ్చుకుని విలపించాడు. కానీ, కృష్ణార్జునులు మటుకూ భీష్ముడికి నరనారాయణులుగా అగుపిస్తున్నారు. ఆ విషయాన్ని గ్రహించిన క్షణానే శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్ర ఆవిర్భావానికి బీజం పడింది. నరుని ద్వారా నరులైన మన కోసం భీష్ముడు స్వయం భగవానుని సమక్షంలో ధర్మదేవత సాక్షిగా! గుర్తుందా?

ఇక భీష్ముడు అనాదినిధనుడా? అన్నది ప్రశ్న.

కాదు/అవును.

శ్రీమహావిష్ణు తత్వాన్ని ఆ స్థాయిలో అందుకున్నాడు కనుక ఆయనలో శ్రీకృష్ణ శక్తి కొంత మేరకు ప్రవేశించి ఉండవచ్చు. లేదా నరనారాయణుల రహస్యాన్ని నారద మహర్షి ద్వారా తెలుసుకున్నాడు కనుక (ఉపదేశం పొంది కూడా ఉండవచ్చు) ఆ విశ్వశక్తితో మమేకమై ఉండవచ్చు.

అనాదినిధనుడు గాంగేయుడిలో ఉన్నాడు అని గాంగేయుడు గ్రహించి ఉండవచ్చు.

43. ధాతా

ఆదిశేషుడు మున్నగు రూపములతో భూమిని ధరియించి, భరియించి ఉండుట చేత ధాతా అని పిలువబడును.

ధాతాపురస్తాద్యముదాజహార॥

అని మన్త్రపుష్పంలో గానం చేసిన విధంగా పరిణామశీలమైన ఈ జగన్నాటకమునకు జగన్నాథుడు పరిణామరహితమైన తెఱయై భాసించుచు ధాతా అని స్తుతింపబడుచున్నాడు.

ధాతా అని పిలువబడి విశ్వమును భరించు భగవానుడు విశ్వచట్టాలకు అధినేత. అతని యాఙ్ఞలకు లోబడియే సర్వము ప్రవర్తించుచున్నవి. విశ్వాంతర్గతమైయున్న చట్టములకు లోబడియే తాను కూడా కర్మఫలములనందించుచున్నాడు.

ఇది అద్వైతం ప్రకారం.

ధారణపోషకశ్చ॥ (డుధాఞ్ ధారణపోషణయోః ధాతురూపము) – ‘ధాతా విధాతా పరమోఽత సందృగితి’ శృతేః

ధారణము, పోషణను చేయువాడు. పై వేద వాక్యమును ఇందుకు ప్రమాణముగా చూపుతూ సత్యసంధ తీర్థుల వారు ద్వైతమత పరంగా వ్యాఖ్యానించారు.

ఇక పరాశర భట్టర్ గారు ఇలా అంటారు.

గర్భం దధాతీతి ధాతా॥ – సకలకారణమై అచిత్సమిష్టి అయిన ప్రకృతియందు చిత్సమిష్టియగు బ్రహ్మయ్యను గర్భమును ధరించువాడు.

అర్థాత్ బ్రహ్మదేవునే సృజించిన వాడు. అంటే సృష్టికర్తకు సృష్టికర్త. లేదా మూలస్థానము.

మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్గర్భం దధామ్యహమ్।

సంభవః సర్వభూతానాం తతో భవతి భారత॥3॥

సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతి యాః।

తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజప్రదః పితా॥4॥

(భగవద్గీత 14వ అధ్యాయము)

మమ — నా యొక్క

యోనిః — గర్భము

మహత్ బ్రహ్మ — సమస్త భౌతిక పదార్థము

ప్రకృతి; తస్మిన్ — దానిలో

గర్భం — గర్భము

దధామి — ప్రవేశపెట్టెదను

అహం — నేను

సంభవః — పుట్టుట

సర్వభూతానాం — సమస్త ప్రాణులు

తతః — ఆ విధముగా

భవతి — జరుగును

భారత — అర్జునా, భరత వంశీయుడా

సర్వ — సమస్త

యోనిషు — జీవ రాశులు (గర్భము నుండీ జనించునవి)

కౌంతేయ — అర్జునా, కుంతీ దేవి పుత్రుడా

మూర్తయః — రూపములు

సంభవంతి — సంభవించును (జనించును)

యాః తాసాం — అవి అన్నింటిలో కూడా

బ్రహ్మ-మహత్ — ఈ గొప్ప భౌతిక ప్రకృతి

యోనిః — గర్భము

అహం — నేను

బీజ-ప్రదః — బీజమును ఇచ్చే

పితా — తండ్రి.

ఈ సమస్త భౌతిక ప్రకృతి.. గర్భము. దానిలో నేను వేర్వేరు ఆత్మలను ప్రవేశపెడుతాను. ఆ విధంగా సమస్త జీవభూతములు జనిస్తాయి. ఓ కుంతీ పుత్రుడా, పుట్టిన సమస్త జీవ రాశులకు, ఈ భౌతిక ప్రకృతియే గర్భము. వాటికి నేనే బీజమును ఇచ్చే తండ్రిని.

తల్లిని నేనే తండ్రిని నేనే.

తల్లివి నీవే తండ్రివి నీవే అని మనం ఎఱిగి ఉండాలి.

ఆప ఏన ససార్జేఽఽదౌ తాను వీర్యమపాసృజత్॥ – ఆదిలో జలమునే సృజించెను. దానిలో వీర్యమును విడిచెను.

మూల సంహిత ప్రకారం ॥ధాతా క్షేత్రే కర్మబీజభూతం గర్భం దధాతి॥ – సర్వశ్రేష్ఠ క్షేత్రంబున కర్మంబునకు బీజమైన గర్భంబును ధరించుచున్నాడు.

44. విధాతా

పై దానికి కొనసాగింపుగా భట్టర్ ఇలా అంటారు.

తం గర్భం విదధాతి ఆవిర్భావయతీతి విధాతా॥ – ఆ చెప్పబడిన గర్భమును ఆవిర్భవింపజేయువాడు.

యో బ్రహ్మాణం విదధాతి పూర్వమ్॥ – శ్వేతాశ్వతరోపనిషత్ 6.18

ఎవడు మొట్టమొదట బ్రహ్మదేవుని కలిగించునో.. అంటే సృష్ట్యాదికి మునుపు బ్రహ్మను జనియింపజేసి ఆయనకు సృష్టి బాధ్యతను అప్పజెప్పువాడు.

అథ పునరుద్ధరణ నారాయణః॥

తత్ర బ్రహ్మా చతుర్ముఖోఽ జాయత॥

అటు పిమ్మట నారాయణుడు, వాని నుండి చతుర్ముఖ బ్రహ్మ జన్మించెను.

తస్మాద్విరాడజాయత॥

హిరణ్యగర్భం పశ్యత జాయమానమ్॥

ఇదిగో బ్రహ్మదేవుడు పుట్టుచున్నాడు. చూడండి.

నారాయణుడి లాగనే బ్రహ్మ కూడా సృష్టి చేసుకున్నాడు కదా! ఇద్దరి పని కూడా సృష్టియే కదా! వారికువురకు భేదము లేదా? అని అడిగితే ఈయన బ్రహ్మాదులకంటెను విలక్షణంగా ఉన్నాడు అనే సమాధానం వస్తుంది.

ఈ విలక్షణమైన నామమును ద్వైతము ఎలా చూసినదో ఇప్పుడు చూద్దాము.

(సశేషం)

Exit mobile version