Site icon Sanchika

తల్లివి నీవే తండ్రివి నీవే!-47

[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]

చాతుర్వర్ణ్యం మయా సృష్టమ్

అనంత పద్మనాభమ్-3

[dropcap]ప[/dropcap]ద్మనాభుడు అమర ప్రభుః మాత్రమే కాదు. ఆయన మరప్రభుః కూడా. ఆ విషయాన్ని గతంలోనే గురువాయూర్ ఉదంతం, అక్కడి మరప్రభు విగ్రహం గురించి ఉన్న ఆధారాలతో తెలుసుకున్నాము.

అమరులైన దేవతలకు ప్రభువు అనే కాదు. శ్రీమన్నారాయణుడు నిత్యమై సత్యమై వెలుగొందు ఆత్మ కూడా అమరమై, ఇంకా చెప్పాలంటే అమరులకన్నా కూడా ఈ జీవాత్మ (వారిలో ఉండేది కూడా) అనంత కాలం నుంచీ ఉన్నదే (multiple). కనుక ఆ యా ఆత్మలన్నిటికీ ఆయన ప్రభువు.

ఇంకా వివరంగా చూడాలంటే లక్ష్మీదేవి కూడా ఒకరకంగా జీవాత్మయే అని కొందరు పెద్దలు అంటారు. దానికి సాక్ష్యములు కూడా చూపుతారు. శృతి వాక్యాలను. ఆ జీవాత్మ అయిన లక్ష్మీదేవి సంపూర్తిగా పరమాత్మ తత్వాన్ని తెలుసుకుని ఉండుట చేత ఆ అమ్మ స్వామివారికి అత్యంత ఇష్టురాలయి, వారితోనే ఎల్లెడలా ఉంటుంది. నిత్యానపాయని అని అంటారు కదా. స్వామిని విడిచి అమ్మ ఉండలేదు. నిజానికిది ఆ పరమాత్మతో జీవాత్మ ఎలా ఉండాలి అన్న దానిని చూపుటకు కల్పించిన లీలావినోదం అనుకోవచ్చు.

లక్ష్మీదేవి ఏ విధంగా అయితే స్వామిని విడిచి ఉండలేదో, జీవాత్మలు కూడా ఆ పరబ్రహ్మ కోసం అలాగే తపించాలి. అప్పుడే ఆయనలో ఐక్యమౌతారు. లక్ష్మీదేవి వక్షస్థలంలో ఉండటం అంటే పరమాత్మ హృదయమే అమ్మ అని అర్థం. అమ్మ అక్కడ జీవ శక్తిగా ఉండి మనలను స్వామి కరుణించేలా చేస్తుంది. హృదయం నుంచీ రక్త ప్రసరణ జరిగి శరీరం ఎలా చేతనమవుతుందో, ఆ రక్త ప్రసరణ ఆగితే ఎలా అచేతనమవుతుందో, మన జీవాత్మలు కూడా స్వామితో అనుబంధం పొందటానికి అమ్మ, హృదయం నుంచీ వచ్చే రక్త ప్రసరణలా మన మీద ఆయన కరుణ ప్రసరించేలా చేస్తుంది. మన స్థానం కూడా ఆ హృదయమే. మన హృదయంలో ఉన్న పరమాత్మను దర్శించి, నిజ పరమాత్మను పొందేందుకు తపించాలి. ఆ వివరం చూద్దాము.

మానవుల హృదయాల గురించి చూద్దాము.

కంఠం నుంచీ అంగుష్ఠాన్ని ఉంచి చిటికెన వేలుతో ఒక జాన, అలాగే నాభి నుంచీ చిటికెన వేలు ఉంచి పైకి బొటనవేలు జరుపుతూ ఒక జాన తీసుకుంటే ఆ రెండు వేళ్ళూ కలసే చోట ఆ చోటు ఎంత పరిమాణం ఉందో అంత భాగం అంతే పరిమాణంలో జీవుడు ఉంటాడు. ఆ జీవుడు లక్ష్మీ అంశయే. అలా అమ్మ మన హృదయాల్లో జీవుడి రూపంలో ఉండి మనను శ్రీహరితో అనుబంధం కలిగి ఉండేలా చేస్తోంది. వీటి గురించి ముందు ముందు నామాల్లో మరింత వివరంగా చర్చించవచ్చు.

లక్ష్మీదేవి చైతన్య శక్తి అన్న విషయమును గురించి తరువాత నామమైన విశ్వకర్మా దగ్గర మరింత వివరం దొరుకుతుంది.

50.విశ్వకర్మా

విశ్వమంతటికిని సంబంధించిన కర్మలను తన కర్మలుగా గలవాడు. విశ్వమును సృష్టించిన వాడు. విశ్వరచన చేయగలుగువాడు – భగవానుడు.

విచిత్రమైన సృష్టినిర్మాణము చేయగల సామర్థ్యమును కలిగియుండెను. బ్రహ్మ ఆవిర్భావమునకు పూర్వమే భగవానుడు సృష్టిరచన సాగించెను. కాని సృష్టిని అనుసరించలేదు. అందుచేత సృష్టిలోని అశాశ్వత లక్షణములు భగవానునియందు లేవు.

ఇప్పుడు ద్వైతం ప్రకారం సత్యసంధ తీర్థుల వారు ఇచ్చిన వ్యాఖ్య చూద్దాము. చాలా అద్భుతంగా ఉంటుంది.

వినా – గరుడేన, శువతి – గచ్ఛతీతి విశుః, న విద్యతే కర్మబంధకం యస్యేతి వా॥

గరుడుడి మీద వెళ్ళేవాడు విశుః. కర్మ బంధాలు లేని వాడు అకర్మః. విశ్వకర్మా అంటే గరుడుడి మీద వెళ్ళేవాడు, కర్మబంధాలు అంటని వాడు.

ఇది చాలా సూక్ష్మంగా పరిశీలించాల్సిన విశేషమైన వ్యాఖ్య. మనకు ద్వైతలోపాన్ని తెలుపుతుంది. కానీ, ఇక్కడ ఇచ్చిన వివరణ ఎంత సొగసుగా ఉందో, ఎంత గొప్పగా నప్పుతుందో కూడా తెలుస్తుంది.

గరుడమఖిలవేదనీడాధిరూఢం॥

అని వేదాన్తదేశికుల వారు గరుడదణ్డకములో చెప్పారు. శ్రీ గరుడ దండకం ప్రారంభ వాక్యం.

గరుడుడు (గరుడాళ్వార్) వేదాలను తన నివాసంగా చేసుకున్నవాడు. ఆ వేదములే తనకు ఆసనంగా కూడా కలిగిన వాడు అని వేదాంతదేశికర్ గరుడ దండకంలో చెప్పారు.

అలాంటి గరుడుడినే తన వాహనంగా చేసుకున్నాడు శ్రీమన్నారాయణుడు. వాహనం ఆసనంగా కూడా పనిచేస్తుంది కదా.

అలాగే ఆయన కర్మలు చేసినా ఆయన కర్మ చేయనట్లే. అకర్మా.

కనుక ఆ విశుః + అకర్మా = విశ్వకర్మా.

భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు,

చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మవిభాగశః।

తస్య కర్తారమపి మాం విద్ధ్యకర్తారమవ్యయమ్॥

జనుల గుణములు, కార్యకలాపముల ఆధారంగా, నాలుగు రకాల వృత్తి ధర్మములు నా చేత సృష్టించబడ్డాయి. ఈ వ్యవస్థకి నేనే సృష్టికర్త అయినా నన్ను అకర్తగా మరియు సనాతనునిగా తెలుసుకొనుము.

వేదములు జనులను నాలుగు రకాల వృత్తులవారీగా విభజించాయి. ఈ విభజన వారి స్వభావం అనుగుణంగా చేసినవి కానీ వారి పుట్టుకను బట్టి చేసినవి కావు. ఇటువంటి వైవిధ్యం ప్రతి సమాజంలోనూ ఉంటుంది. సమత్వమే ప్రధానమైన సూత్రముగా ఉండే కమ్యూనిష్టు దేశాల్లో కూడా మానవులలో ఉండే నానావిధత్వమును తొలగించలేము. కమ్యూనిష్టు పార్టీలో మూల సిద్ధాంతకర్తలుగా ఉండే తత్త్వవేత్తలు, దేశాన్ని కాపాడే సైనిక దళాలు, వ్యవసాయం చేసుకునే రైతులు, కర్మాగారాల్లో పనిచేసే కార్మికులు.. వీరంతా ఉంటారు. ఇది స్వామి ముకుందానంద వివరణ ఆధారం చేసుకుని రాసింది.

వారి వారి శక్తులను బట్టీ, ఆసక్తిని బట్టీ ఆ యా వృత్తులు చేస్తారు. ఒక వృత్తి చేసేవారు ఇతరవృత్తికి మరలరాదు అని ఆ ఇజమ్‌లో లేదు. ఒకవేళ ఉన్నదంటే అది మానవుల తప్పిదమే తప్ప ఆ ఇజమ్‌ది కాదు.

వైదిక/సనాతన ధర్మం, శాస్త్రం ఈ వైవిధ్యాన్ని మరింత శాస్త్రీయ పద్ధతిలో విశదీకరించింది. దాని ప్రకారం, భౌతిక శక్తి మూడు గుణములతో సమ్మిళితమై ఉంటుంది: సత్త్వ గుణము, రజో గుణము, తమో గుణము. బ్రాహ్మణులు అంటే సత్త్వ గుణం ప్రధానంగా ఉన్నవారు. వారికి స్వాభావికంగా బోధన మరియు భగవత్ ఆరాధన అనేవి విధులుగా ఉన్నాయి. వీరు భగవంతునికి, ఇతరవర్ణాల వారికి అనుసంధానకర్తలుగా కూడా వ్యవహరించవచ్చు. సాక్షాత్ శ్రీరాముడికే వశిష్ఠ మహర్షి పరబ్రహ్మ తత్వాన్ని యోగవాశిష్ఠం రూపంలో తెలిపాడు.

క్షత్రియులు రజో గుణ ప్రధానముగా ఉండి, స్వల్పంగా సత్వ గుణం మిళితమై ఉంటారు. పరిపాలన, యాజమాన్యం వారి విధులు. వైశ్యులు రజో గుణము మరియు కొంత తమో గుణము మిళితమై ఉంటారు. కాబట్టి వారు వ్యాపారము మరియు వ్యవసాయం ప్రధానంగా ఉంటారు. తరువాత, శూద్రులు, వీరు తమో గుణ ప్రధానంగా ఉంటారు. వీరు శ్రామిక వర్గముగా ఉంటారు. ఈ వర్గీకరణ అనేది జన్మతహా వచ్చినవి కావు లేదా మార్చలేనివి కావు. ఈ వర్ణాశ్రమ వర్గీకరణ అనేది జనుల స్వభావము మరియు చేష్టల ఆధారంగా ఉంటుంది అని శ్రీ కృష్ణుడు అంటున్నాడు.

శ్రీవైష్ణవులు ఎంతో ఆరాధించే, ఇతరులు గౌరవించే తిరుమంగై ఆళ్వార్ కాస్త తక్కువ సామాజిక వర్గానికి చెందిన వారే. కానీ ఆయన క్షాత్రాన్ని చూపి కొంత రాజ్యం పొంది పరిపాలన చేశాడు. అలాగే భగవత్ సంపర్కం తరువాత మహా పండితుడై నర్కవి పెరుమాళ్ అని కీర్తింపబడ్డాడు. అలాగే ఆయనను చతుష్కవి ప్రధానాయ అని మంగళాశాసనం చేస్తారు. అది బ్రాహ్మణ్యమే కదా!

ఇక పాణ యోగి లేదా తిరుప్పాణ ఆళ్వార్.. ఈయన నిమ్న వర్గాలకు చెందిన వారు. వీరిని స్వయంగా బ్రాహ్మణ పండితులే/అర్చకులే భుజాల మీద మోసుకుని వెళ్ళి శ్రీరంగని దర్శనం చేయించారు (చేయించవలసి వచ్చింది). కనుక జీవుల గుణ కర్మలను బట్టీ వచ్చిన విభాగాలు ఇవి.

భగవంతుడు ఈ ప్రపంచ వ్యవస్థకి సృష్టికర్త అయినా, ఆయన అకర్తగా ఉంటాడు. ఇది వర్షము వంటిది. అడవిలో వర్షపాతం అంతటా సమానంగా పడినా, కొన్ని విత్తనాల నుండి పెద్ద మర్రి చెట్లు వస్తాయి, మరికొంత విత్తనాల నుండి అందమైన పుష్పములు పూస్తాయి, మరివేరే వాటినుండి ముళ్ళపొదలు వస్తాయి. ఆ వర్షం అన్నిటి పట్ల పక్షపాతం లేకుండా సమంగా కురుస్తుంది, ఈ వ్యత్యాసానికి బాధ్యత దానిది కాదు. ఇదే విధంగా, భగవంతుడు జీవులకు కర్మలను చేసే శక్తిని ప్రసాదిస్తాడు, కానీ ఆ శక్తితో వారు ఏమి చేస్తారో వారికి పూర్తి స్వేచ్ఛ ఉంది. వారి చర్యలకు భగవంతుడు కారణం కాదు. కనుక ఆయన అకర్త. తద్వారా అకర్మ కూడా. కర్మ చేయడు.

వేదాలను తన ఆసనంగా, నివాసంగా చేసుకున్న గరుడుడిని తన వాహనంగా చేసుకుని, సర్వమును తానే సృష్టించి, అయినా అకర్తగా, అకర్మ చూపుతూ ఆయన విశుః అకర్మ విశ్వకర్మ గా వెలుగొందుతున్నాడు.

చూశారా ఎంత గొప్పగా ఉందో ఈ వివరణ!!!

న విద్యతే కర్మ క్లిష్టం యస్యేతి వా అకర్మా। విశుశ్చాసౌ అకర్మా చ ఇతి విశ్వకర్మా॥

గరుడుడి పై ప్రయాణించు వాడు. ఎలాంటి కర్మ అయినా క్లిష్టత ఉండని వాడు. అర్థాత్ ఆయనకు ఏదీ క్లిష్టం కాదు. అన్నీ సులభసాధ్యమే.

విశ్వం కర్మ యస్మాదితి వా॥ – ఎవరి వలన విశ్వానికి కర్మ ఏర్పడుతున్నదో/విశ్వం కర్మగలది అవుతున్నదో ఆయనే విశ్వకర్మా. సమస్త కర్మలను నడిపించువాడు.

ఇక శంకర భగవత్పాదుల వారి భాష్యం చూద్దాము.

విశ్వం కర్మ క్రియా యస్య స విశ్వకర్మా॥ – ప్రపంచము కార్యముగా కలిగిన వాడు.

క్రియతి ఇది జగత్కర్మ విశ్వం కర్మ యస్యేతి వా॥ – ఉత్కృష్టమైన సృష్టిశక్తి కలిగిన వాడు. జగత్ యొక్క కర్మను నిర్దేశించువాడు.

విచిత్ర నిర్మాణశక్తిముచ్యాద్వా విశ్వకర్మా॥ – విచిత్రమైన సృష్టి నిర్మాణ శక్తి కలవాడు.

ఇక భట్టరువారి వ్యాఖ్యకొస్తే ఆయన ఈ విధంగా చెప్పారు.

అతో విశ్వకర్మా, బ్రహ్మసృష్టేః ప్రాగూర్థ్వం చ విద్యమాణం విశ్వం కర్మ జగద్వ్యాపారః అస్యైవ ఇతి॥ – పద్మనాభుడి నుంచీ బ్రహ్మ ఉద్భవించి, ఇప్పటి – మనం చూస్తున్న సృష్టి రచన జరుగక పూర్వం, సృష్టి రచన జరిగిన తరువాత కూడా జగత్ వ్యాపారాలను నిర్వహించు వాడు.

ఇక్కడే మనం ఒకే విశ్వం ఉండదు. అనంత విశ్వాలు ఉంటాయి అని గ్రహించాలి. ఈ విశ్వము ఉద్భవించి బ్రహ్మ సృష్టి చేయటం ప్రారంభించటానికి పూర్వము, బ్రహ్మ చేసే సృష్టి కార్యము మొదలైన తరువాత కూడా అన్నిటి మనుగడ, ఆయన మీదే ఆధారపడి ఉంది.

దీనినే ఆండాళ్ (గోదాదేవి) పెరియాయ్ అనే పద ప్రయోగం ద్వారా మనకు తెలియజేసింది.

She is the one – in the recent history (some 5000 years ago) who had known the Parabrahman inside and out. That is why she became Ranganatha Priya.

విశ్వంలో భాగము బ్రహ్మ. ఆ బ్రహ్మ ఉద్భవించింది ఈ పద్మనాభుడి ద్వారా. ఆ విశ్వ రచనను (సృష్టి రచన కాదు) చేయువాడు విశ్వకర్మా!

ఈ నామమును సంపూర్తిగా దర్శించినది ఆండాళ్.

విశ్వకర్మణః సమవర్తతాధి॥ ఆది లో ఈ విశ్వమును తన యొక్క కర్మ చేతనే నిర్మించిన వాడు ఈ విశ్వకర్మా.

ఈ వ్యాఖ్యానము (భట్టర్ వారిది) ఆధునిక సైన్స్ పరిశోధనలకన్నా గొప్ప వివరాలను అందిస్తున్నది. Structure of the Universe. Beyond it. And inside it.

ముందు ముందు మరింతగా తెలుస్తుంది. గత మూడు ఎపిసోడ్లు చూశాను కదా!

॥పురుషం విశ్వకర్మాణమ్ ఆదిదేవమ్ అజమ్ విభుమ్॥

ఆయనే పురుషుడు – ఇక్కడ పురుషుడు అన్నది పుంలింగ వాచకము కాదు. పరమాత్మ అని. The super-atma. లింగముతో సంబంధము లేదు. సర్వమూ ఆ విశ్వశక్తియే. ఆ శక్తియే ఆది దేవుడు. ఆయనే అజుడు. ఆయనే అందరికీ మూలము.

అందుకే ఆయన మనుః కాబట్టి!

(సశేషం)

Exit mobile version