తల్లివి నీవే తండ్రివి నీవే!-5

3
1

[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]

అక్షరం అక్షరమ్

॥కిమేకం దైవతం లోకే॥

ఎందుకు ఒక్కడే అయిన పరమాత్మ గురించి అడిగాడు? ధర్మరాజుకు పరబ్రహ్మమొక్కటే అని తెలుసునా? అలా అయితే మిగిలినవన్నీ ఆ శక్తి యొక్క ఇతర రూపములా? లేదా విష్ణువు మాత్రమే ఆ శక్తి లేదా ఆ పరబ్రహ్మ అని భీష్ముని చేత ప్రకటితము చేయటానికి వచ్చిన ప్రశ్నా?

ఏకమేవాఽద్వితీయం బ్రహ్మ!

విశ్వం విష్ణుః

భీష్ముడి చేతే ఎందుకు చెప్పిస్తున్నాడు పరమాత్మ? తానే అందించిన భగవద్గీత ఉండగా? దీనికి రకరకాల కారణాలు చెప్తారు.

ఒక చిన్న ప్రశ్న.

పూతనాది రాక్షసులను, కంస శిసుపాలుని వంటి వారిని నిర్జించిన శ్రీకృష్ణ భగవానుడు దుర్యోధుడిని ఎందుకు సంహరించలేదు?

దీనికి నేను విన్న సమాధానం..

ప్రజలు ఎల్లప్పుడూ తమ (కోసం) యుద్ధంలో మరొకరు పోరాడాలని కోరుకుంటారు.

శ్రీకృష్ణుడు దుర్యోధనుడిని చంపి ఉంటే, అది జనానికి తప్పుడు సంకేతం పంపి ఉండేది. తమ భవిష్యత్ యుద్ధాలను ఎదుర్కోవడానికి భగవానుడు మళ్లీ వస్తాడని ప్రజలు అనుకుంటారు. ప్రయత్నం మానుకుంటారు. గీత సారాంశం అది కాదు కదా. ప్రయత్నపూర్వకంగా చేయవలసినదంతా చేసి ఇక మానవప్రయత్నం వల్ల కాదు అని అనిపించిన క్షణాన శరణాగతి చేయాలి (గజేంద్ర మార్గం – అందుకే గజేంద్రుని గాథకు భగవద్గీతతో సమానమైన స్థానం కల్పించారు). లేదా అసలు మొదటే పూర్తి శరణాగతి కోరి, నీవు తప్ప ఇతఃపరంబు లేదు అనగలగాలి. కానీ మనవన్నీ మధ్యేమార్గాలు.

Ayn Rand says: You either have to choose this side or that. If you leave yourself in the middle path, you’re the first to perish.

మనం మహాభారతాన్ని లోతుగా కాకున్నను శ్రద్ధగా చదివితే, ఒక వ్యక్తి తన కథలో తానే నాయకుడు. భగవంతుడు కేవలం ఒక అద్భుతమైన మార్గదర్శి అని మనకు అర్థమవుతుంది.

భారతం మొత్తం శ్రీకృష్ణుడు అదే చేశాడు. మార్గనిర్దేశం చేయదగిన వ్యక్తులకు ఆయన మార్గనిర్దేశం చేశాడు. సమర్థులైన వ్యక్తుల కోసం ఆయన ఎప్పుడూ పోరాడలేదు. ఆయన ఎవరి వైపు ఉంటే వారు సమర్థులు అయి ఉండవచ్చు. నరునికి దారి చూపి నరులకు పరమధర్మ పథాన్ని అందించాడు.

మనమందరం అర్జునుడిలా సమర్థులం. మనం మార్గదర్శనం కోరుకునే స్థితిలో ఉంటే, భగవానుడే స్వయంగా మనకు మార్గనిర్దేశం చేస్తాడు. మనం కేవలం ఎక్కడ చూడాలో అక్కడ చూస్తే చాలు.

చిత్రం చూడండి. మహాభారతంలో కథానాయకుడు శ్రీకృష్ణుడు. కానీ మహాభారతం ఆయన కథ కాదు. కురు వంశీయులది. అక్కడ కథ మొదలయ్యింది భీష్ముని వల్ల. ముగిసేది కూడా భీష్మునితోనే. కథ ఎప్పుడూ మన భారతీయ/ఆర్యావర్త/జంబూద్వీప వాసుల సంప్రదాయం ప్రకారం శుభకరంగానే ముగియాలి. గ్రీక్ ట్రాజెడీ అన్నారు కానీ మనదెప్పుడూ ఆనన్దమే.

మరి భీష్ముని మరణం? అంటారా.. అది ఆయనకు విముక్తే. వసువు. మానవరూపాన్ని దాదాపు రెండు శతాబ్దాలు భరించాడు. అది వదలి తన అసలు రూపం తీసుకోవటం శుభకరమైన ముగింపే కదా.

అందుకే కథ చివరలో మంగళాశాసన స్తోత్రాలు చేస్తారు. అది మనకు మహాభారతంలో

శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రం రూపంలో అందింది.

జగత్ప్రభుం దేవదేవమనన్తం పురుషోత్తమమ్।

స్తువన్నామసహస్రేణ పురుషః సతతోత్థితః॥

జగానికి ప్రభువు. దేవాది దేవుడు (ఆండాళ్ చెప్పిన పెరియాయ్ = పెద్దవాడు. ప్రాచీనుడు. (ప్రకృతికి) అందనివాడు. మనం అర్థం మాత్రమే చేసుకోగలిగిన వాడు). ఆదిమధ్యాన్తరహితుడు. పురుషోత్తముడు. అనగా.. పురుష = జీవులు. పురుషోత్తముడు = జీవులలో ఉత్తముడు. అది కూడా (సకల) చరాచర జీవులలో.

అలాంటి వాని సహస్రనామములను ప్రతిరోజు చదివితే/పఠిస్తే/జపిస్తే, నమస్కరిస్తే (మనస్కరించినా) జీవులకు అన్నిరకములైన బంధనాలు తొలగి ఉద్ధరింపబడుతారు.

ఎందుకు? It’s being aware of everything around us, inside us, that’s with us, and that’s without us.

तत् एजति। तत् न एजति।

तत् दूरे। तत् उ अन्तिके।

एतत् अस्य सर्वस्य अन्तः।

तत् उ सर्वस्य अस्य बाह्यतः॥

తదేజతి। తన్నైజతి।

తద్దూరే। తద్వన్తికే।

ఏతదస్య సర్వస్య అన్తః।

తదు సర్వస్యాస్య బాహ్యతః॥

అది చలిస్తుంది, అది చలించదు. అది దూరంగా ఉంది కానీ దగ్గరగా కూడా ఉంది. అది అన్నిటి లోపలా ఉంది. అన్నిటి వెలుపలా ఉంది.

లోక వ్యాపారాలన్నిటికీ ఆధారభూతమైనది ఆత్మ. అందువలన ఆత్మ చలిస్తున్నది. కానీ అది సర్వత్రా వ్యాప్తి చెందినదని తెలిసిన స్థితిలో దానికి చలనం ఉండదు.

మనందరలోను ఆత్మ ఉండటంవలన అది మనకు చాల సమీప వస్తువు. కానీ విషయం తెలుసుకోనప్పుడు, దానికోసం అన్వేషిస్తున్నపుడు అది చాల దూరంగా ఉంటుంది.

దీన్ని ఆధారం చేసుకునే వేవ్ ఫంక్షన్ గురించి చెప్పారు. Heisenberg Uncertainty Principle వచ్చింది. This also hints at the collapse of wave function.

ఇక పరమాత్మ స్థితిలో ఆత్మ అన్నిటి లోపల ఉంటుంది, అన్నిటి బయట వుంటుంది.

Those who choose the best never get confused by choices.

తమేవ చార్చయన్నిత్యం భక్త్యా పురుషమవ్యయమ్।

ధ్యాయన్ స్తువన్నమస్యంశ్చ యజమానస్తమేవ చ॥

ఆ బ్రహ్మణ్యుని, పుండరీకాక్షుని ఆరాధించుట ఉత్తమ ధర్మము. ఆ దేవదేవుడు పరమ మంగళ ప్రదుడు. సకల సృష్టి-స్థితి-లయ కారకుడు. ఈ వేయి గుణ కీర్తనకరములైన నామములను ఋషులు గానము చేసినారు. ఆయనను ఆరాధించిన వారే శాశ్వతమైనదైన విముక్తిని పొందుతారు. అంటే ఆయనను గురించి సంపూర్తిగా తెలుసుకున్న వారు ఆయనలో ఐక్యమవగల అర్హత పొందుతారు.

అలాంటి వారు వైకుణ్ఠ వాసులైనా, భూమిమీదే మిగిలిపోయి బృన్దావనంలో అదృశ్య సంచారకులుగా ఉంటూ ఆ రాధాకృష్ణుల రాసములో భాగమైపోయినా, లేదా అర్చామూర్తులనే నిత్యం కొలుస్తూ బాహ్యేతరాలు పట్టని వారు అయినా ఒకటే (ఇలాంటి స్థితిని తప్పో ఒప్పో శ్రీరామదాసు సినిమా ముగింపుగా చూపారు). సర్వాంన్తర్యామిలో భాగాలే. వారు ఆ పరమాత్మ స్థాయిలో సృష్టి చేయగలరా అన్నది ప్రశ్నే! కానీ ఆ స్థాయిని మాత్రం చేరగలరు. చేరారు అన్నది సత్యం. మనమూ చేరగలము అనటానికి నిదర్శనం.

అనాదినిధనం విష్ణుం సర్వలోకమహేశ్వరమ్।

లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వదుఃఖాతిగో భవేత్॥

అనాదినిధనుడు. ఎవరయ్యా అంటే ఆ శ్రీమహావిష్ణువే. సర్వలోకాలకూ (మహా) ఈశ్వరుడైన వాడు. లోకాలన్నిటికీ అధ్యక్షుడైన వాడు. మాటమాత్రం చేత అన్నిటినీ తన అధీనంలో ఉంచుకుని సవ్యమైన మార్గంలో నడిపించేవాడు. ఇటువంటి వానిని ప్రతి రోజూ.. నిత్యమూ స్తుతిస్తే/స్మరిస్తే అన్ని రకములైన దుఃఖములు తొలిగిపోతాయి. హరింపబడుతాయి. దఃఖాలన్నీ నశించి పోతాయి.

బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనమ్।

లోకనాథం మహద్భూతం సర్వభూతభవోద్భవమ్॥

బ్రహ్మ, బ్రాహ్మణులు మొదలైన వారి శ్రేయోభిలాషి, అన్ని ధర్మాలను తెలిసినవాడు, అన్ని ధర్మములు తానే అయినవాడు, లోకానాం (లోకములయందు ఉండెడివారు, వారి కీర్తిని పెంచేవాడు), ప్రపంచానికి ప్రభువు, సత్యం సంపూర్ణం, అన్ని విషయాలకు పరిణామాలకు మూలం. అన్ని జీవులు ఆయనలోనే ఉద్భవించిన వాడు. అన్ని జీవుల్లో ఉద్భవించి కూడా ఉన్నవాడు (నారసింహావతారం దగ్గర విశదమవుతుంది. తెలుసుకుందాం ఆ నామం వచ్చినప్పుడు).

ఏష మే సర్వధర్మాణాం ధర్మోఽధికతమో మతః।

యద్భక్త్యా పుణ్డరీక్కాక్షం స్తవైరర్చేన్నరః సదా॥

ఈయన నామ సంకీర్తన/స్తుతి/స్మరణ అన్ని ధర్మాలలో అత్యంత అద్భుతమైన ధర్మమని తెలుసుకొనుము. భక్తితో, మనిషి ఎల్లప్పుడూ కమల కమలనాథుని (భగవంతుని) స్తవముల ద్వారా స్మరిస్తూ ఉండాలి.

ఇక్కడ కమలనాథుడంటే పరిశీలిద్దాము.

క = బ్రహ్మ

మ = శక్తి (లయకారకుడు, ఆయన శక్తి). మా అంటే లక్ష్మి. ఇక్కడ కేవలం మకారమే. మ. అంతే.

ల = లక్ష్యతీఽతి లక్ష్మి.అందరికీ లక్ష్యము కావలసినది. మోక్ష లక్ష్మి. ఈ అందరి నాథుడే కమలనాథుడు.

అందుకే శ్రీమహావిష్ణువుకు కమలనయనుడని పేరు. Eyes are the gateways. To everything. అందుకే సర్వేన్ద్రియాణాం నయనం ప్రధానం అన్నారు. నయనం అంటే మన కళ్ళు కాదు. అంతఃచక్షువు. దానికి అధిపతి. ఆ సహస్రనామధారి.

అందుకే కప్యాసానికి వేరు అర్థమును తన గురువు చెప్తే రామానుజుల వారు విలవిల్లాడింది. వ్యతిరేకించినది. ప్రాణముల మీదకు వచ్చినా లెక్కచేయనిది. లక్ష్మీదేవి కూడా కమలము నుండీ వచ్చినది. కమలమధ్యమున కూర్చునేది. వాటన్నిటికి తాను కూడా అధిదేవతయే అని తెలియజెప్పటానికి.

పరమం యో మహత్తేజః పరమం యో మహత్తపః।

పరమం యో మహద్బ్రహ్మ పరమం యః పరాయణమ్॥

ఆయన గొప్ప కాంతి. అంతకు మించిన తేజస్ ఉండదు. ఆయనే సర్వోన్నతమైన గొప్ప పాలకుడు. తపస్సు చేసేందుకు కూడా ఆయనకు మించిన లక్ష్యము లేదు. అతను సర్వోన్నతమైన గొప్ప బ్రాహ్మణుడు (సంపూర్ణుడు). బ్రహ్మ స్వరూపం. పరమ పురుషులకే ఆయన పరమపురుషుడు. అత్యున్నత లక్ష్యాలకు అత్యున్నత లక్ష్యం ఆయన.

సర్వత్ర సర్వదా వ్యాపించి ఉన్న ఆ పరమశక్తికి మించిన లక్ష్యం ఎవరికీ ఉండదు. ఆయన స్మరణ చేత మాత్రమే మనం ఆద్యంతాలు లేని స్థితికి చేరగలము.

ఆ చేరటానికి అవసరమైన సామాగ్రిని మనకు అందించే గురువు భీష్మాచార్యుని రూపంలో శ్రీకృష్ణ భగవానుని సమక్షంలో ఆయన కృపవల్ల దక్కాడు. ఆ గురువు ప్రసాదించిన ఈ విష్ణు సహస్రనామములను స్మరించినంత మాత్రమునే పరమపదమూ, పరమపథమూ మనం చేరగలము/అందుకోగలం. ఆ దారిన నడువగలం.

పవిత్రాణాం పవిత్రం యో మంగళానాం చ మంగళమ్।

దైవతం దైవతానాం చ భూతానాం యోఽవ్యయః పితా॥

అతను పవిత్రమైనవాటిలో అత్యంత పవిత్రుడు. శుభం కలిగించే వారిలో శివునికన్నా శుభకరుడు. దైవాంశ సంభూతులలో ఆ దైవత్వాన్ని నింపే శక్తి కలిగిన వాడు. ఆయన అనంతజీవరాశులకు తండ్రి. తల్లి. గురువు. దైవం. అన్నిటికి, అందరికి, అన్నియు ఆయనే. (సంస్కృతంలో ళ అనేది లేదు. ల మాత్రమే ఉంది. దానికో ప్రత్యేక కారణం ఉంది. సమయం వచ్చినప్పుడు చూద్దాము. కానీ తెలుగు భాషలో ఉంది కనుకా, మనం పలుక గలం కనుకా, సాక్షాత్ భగవానుని ఆఙ్ఞ కనుకా (ఎపిసోడ్ 4) ‘ళ’ భాష పరంగా వచ్చినప్పుడు రాద్దాము. పలుకుదాము)

యతః సర్వాణి భూతాని  భవన్త్యాదియుగాగమే।

యస్మింశ్చ ప్రలయం యాన్తి పునరేవ యుగక్షయే॥

అతని నుండి అన్ని జీవులు యుగ/సమయం/సృష్టి ఆరంభంలో వచ్చాయి. వస్తున్నాయి. వస్తాయి. అలాగే ఆయనలో అవి అన్నియు (యుగ) అంతమున మళ్లీ లీనమవుతాయి. బ్రహ్మ విష్ణు శివ రూపములు శ్రీమహావిష్ణువు రూపాంతరములే. పరబ్రహ్మము ఆయనే. పరబ్రహ్మము యొక్క శక్తి ఆయనే. ఆ పరబ్రహ్మాన్ని దేవుడని, ఆ శక్తిని అమ్మవారు అని అనుకున్నా, అవి కూడా ఆ యా శక్తుల రూపాన్తరములే తప్ప మరియొకటి కావు. ఆ పరబ్రహ్మమే అన్ని చోట్లా వ్యాపించిన విష్ణువు.

తస్య లోకప్రధానస్య జగన్నాథస్య భూపతే।

విష్ణోర్నామసహస్రం మే శృణు పాపభయాపహమ్॥

ఆ పరబ్రహ్మమే ఈ ప్రపంచానికి చోదక శక్తి. స్థితి, గతి శక్తి కూడా ఆ జగన్నాధుడే. Potential and kinetic energies.

అని అప్పటి భూ పతి అయిన యుధిష్ఠిరుడికి భీష్మాచార్యుల వారు చెప్పెను.

ఈ విష్ణు సహస్రనామములను విన్న వారికి పాపము, భయము.. వీతరాగక్రోధముల వల్ల కలిగే దుష్ఫలితాలు కలుగవు.

ఎందుకు? శ్రద్ధాసక్తులతో ఉండగలిగితే ఆ శ్రవణ మాత్రమునే మనమా పరబ్రహ్మలో భాగం కాగలం.

యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః।

ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే॥

ఆ పరబ్రహ్మ అయిన శ్రీమహావిష్ణువు యొక్క గుణగణములను దర్శించి, మనకోసము వెలికి తీసిన వారు మహాత్ములైన ఈ ఋషివరేణ్యులు.

చతుర్ముఖ బ్రహ్మ గారే విశ్వం అన్న నామమును మనకు అందించారు. ఆ విశ్వము యొక్క వ్యాపక గుణమును (విష్ణుః) తొలుత దర్శించినది కూడా ఆయనే. అలాగే అనేక ఇతరేతర నామములను దర్శించిన మహర్షి గణం ఇక్కడే ఉన్నారు.

ఆ క్షణంలో అక్కడ వేదఘోషలు వినిపించాయి. మహర్షులంతా భగవన్తుడైన శ్రీకృష్ణుని వైపే చూశారాక్షణాన. వారి చూపులకు కారణభూతమైన కాంతి, ఆ నీలమేఘశ్యాముని మీద పడ్డది. ఆయన నుంచీ వెలువడుతున్న ఆ చెప్పనలవికాని సౌందర్యవన్తమైన వెలుగును భీష్ముడు గ్రహించగలిగాడు. అందులోనే సహస్రనామములను దర్శించగలిగాడు. ఆ పైన వాటిని యధిష్ఠిరుడి ద్వారా, నరనారాయణుల ఎదుట నరులమైన మనకు అందించనుద్యుక్తుడయ్యాడు.

భీష్మాచార్యుడు!!

ఋషిర్నామ్నాం సహస్రస్య వేదవ్యాసో మహామునిః।

ఛన్దోఽనుష్టుప్ తథా దేవో భగవాన్ దేవకీసుతః॥

ఆ యా ఋషుల ద్వారా దర్శింపశక్యమైన, దర్శింపబడిన ఆ నామములు, వాటి శక్తి, అనుష్టుప్ ఛందస్ ను వాడి మహాముని అయిన వేదవ్యాసుడు ఒకచోట కూర్చి అందించాడు.

అమృతాంశూద్భవో బీజం శక్తిర్దేవకినందనః।

త్రిసామా హృదయం తస్య శాంత్యర్థే వినియుజ్యతే॥

విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరమ్।

అనేకరూప దైత్యాన్తం నమామి పురుషోత్తమమ్॥

వీటి గురించి చూద్దాము.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here