తల్లివి నీవే తండ్రివి నీవే!-53

0
3

[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]

శాశ్వతం కృష్ణం అచ్యుతమ్

నమస్తే దేవ దేవేశ వరాహవదనాచ్యుత।

క్షీరసాగరసంకాశ వజ్రశృంగ మహాభుజ॥1॥

అనేకదివ్యాభరణయజ్ఞసూత్రవిరాజిత।

అరుణారుణాంబరధర దివ్యరత్నవిభూషిత॥2॥

ఉద్యద్భానుప్రతీకాశపాదపద్మ నమో నమః।

బాలచంద్రాభదంష్ట్రాగ్ర మహాబలపరాక్రమః॥3॥

దివ్యచందనలిప్తాంగ తప్తకాంచనకుండల।

ఇంద్రనీలమణిద్యోతిహేమాంగదవిభూషిత॥4॥

వజ్రదంష్ట్రాగ్రనిర్భిన్నహిరణ్యాక్షమహాబల।

పుండరీకాభిరామాక్ష సామస్వనమనోహర॥5॥

శృతిసీమంతభూషాత్మన్సర్వాత్మన్చారువిక్రమః।

చతురాననశంభుభ్యాంవందితాయతలోచనా॥6॥

సర్వవిద్యామయాకారశబ్దాతీత నమో నమః।

ఆనందవిగ్రహానంత కాలకాల నమో నమః॥7॥

(భూదేవీ కృత ఆదివరాహ స్తోత్రం)

ద్వైత వ్యాఖ్య ప్రకారం శాశ్వతః..

శాశ్వతః – సదైక రూపాయ॥ – ఎల్లప్పుడూ ఒకే రూపంతో ఉండేవాడు. నిరాకార నిర్గుణ పరబ్రహ్మ కాదు. అందరికీ ఒకే రీతిన దివ్య తేజస్సుగా గోచరించేవాడు.

ఇక అద్వైత వ్యాఖ్య విషయానికి వస్తే..

సర్వకాలములందు ఉన్నవాడు (విశ్వశక్తి) కనుక భగవానుడు శాశ్వతః అని కీర్తింపబడుతున్నాడు.

As Ayn Rand said: EXISTENCE EXISTS.

ఆయన ఉన్నాడు. ఉంటున్నాడు. ఉంటాడు. అంతే!

శాశ్వతగ్0 శివ మచ్యుతమ్॥ – భగవానుడైన నారాయణుడు త్రికాలములందూ ఉండి, కాలాతీతుడై మనగలుగుతున్నాడు కనుక శాశ్వతుడు. అవినాశి అయినందున మంగళకరుడు. మంగళకరుడు (సృష్టి అన్నదే మంగళకరమైన చర్య కనుక) కనుక లేకుండా ఉండడు.

ఇది నారాయణోపనిషత్ వాక్యం. భగవానుడు శాశ్వతుడు, మంగళకరుడు కనుక దుఃఖానికి అతీతంగా ఉంటాడు. ఆనంద స్వరూపుడు. ఆ‘నంద’ స్వరూపుడు.

ఇక భట్టరు వ్యాఖ్యను చూస్తే..

ఏవం శాశ్వతః। అనవరత-జగద్వ్యాపార-ప్రవాహత్వేన నిత్యః॥ – ప్రవాహమువలె నిరంతరమూ జగద్వ్యాపారమును కావించువాడు కనుక శాశ్వతుడు.

ఆయన స్థిరంగా ఉంటాడు. ప్రవహిస్తూ ఉంటాడు. ప్రవహిస్తూ స్థిరంగా కనిపిస్తాడు. స్థిరంగా ఉంటూ ప్రవాహంలా అగుపిస్తాడు.

ఒక నది లాగా. నది ప్రవహిస్తుంది.. కానీ మనతో పోలిస్తే అది శాశ్వతంగా అక్కడే ఉంటుంది.

అవ్యుచ్ఛిన్నాస్తతస్వేతే సర్గస్థిత్యన్త సంశయాః॥ – విష్ణు పురాణం నుంచీ.

భగవద్గీతలో చెప్పినట్లు సృష్టి, స్థితి, లయములు అనేవి అలా ఒకదాని తరువాత అదే వరుసలో కొనసాగుతూనే ఉంటాయి. వాటికి బైట ఆయన ఉన్నా అవన్నీ ఆయనలో భాగాలే. అయినా వాటి వల్ల ఆయన ప్రభావితం కాడు.

58. కృష్ణః – సర్వమును ఆకర్షించువాడు. దట్టమైన నీల వర్ణ దేహము గలవాడు. సృష్ట్యాది లీలా విలాసముల వలన సర్వదా సచ్చిదానందమున వినోదించువాడు.

దీనితో పాటు శాశ్వతః అనే నామాన్ని కూడా అనుసంధించుకుంటూ చూడాలి.

కృష్ణడే శాశ్వతుడు. శాశ్వతుడైన వాడే కృష్ణుడు. ఎలా అన్నది వివరంగా చూద్దాము.

ఇక మనకు ఆధారం శ్రీమద్భగవద్గీత

అందులో 8వ అధ్యాయం (8వ అధ్యాయం. గ్రహించండి).

అక్షరబ్రహ్మ యోగము.

చెప్పినవాడు శ్రీకృష్ణ భగవానుడు. విన్నవాడు ప్రధానంగా అర్జునుడు అనగా నరుడు.

నరుడికి భగవానుడు చెప్పిన రహస్య వేదం.

వేదము – అనే పదము విద్ అనే ధాతువు నుండి ఉత్పన్నము అయినది. విద్ అంటే తెలుసుకొనతగినది అని అర్థం. ఎందుకంటే దీనిచేత ధర్మాధర్మముల నెరుగుదురు.

కానీ ఇది అప్పటికప్పుడు ఏదో అర్జునుడు అడిగాడని చెప్పబడినది కాదు. చాలా పూర్వమే శ్రీకృష్ణ భగవానుడు లేదా శ్రీమహావిష్ణువు లేదా ఆ నిరాకార నిర్గుణ (సగుణ సాకార కూడా) అయిన శ్రీమన్నారాయణుడు) సూర్యునికి బోధించెను.

దానికి ఆధారం భగవద్గీతలోనే ఉంది.

ఇంతకూ సూర్యుడికి ఈ యోగము ఎప్పుడు చెప్పబడినది?

ప్రస్తుత మన్వంతరానికి ప్రారంభ కాలంలో.

॥శ్రీ భగవానువాచ॥

ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయమ్।

వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవేఽబ్రవీత్॥4.1॥

ఏవం పరంపరాప్రాప్తమిమం రాజర్షయో విదుః।

స కాలేనేహ మహతా యోగో నష్టః పరంతప॥4.2॥

స ఏవాయం మయా తేఽద్య యోగః ప్రోక్తః పురాతనః।

భక్తోఽసి మే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమమ్॥4.3॥

॥అర్జున ఉవాచ॥

అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః।

కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి॥4.4॥

॥శ్రీ భగవానువాచ॥

బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున।

తాన్యహం వేద సర్వాణి న త్వం వేత్థ పరంతప॥4.5॥

అజోఽపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోఽపి సన్।

ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా॥4.6॥

యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత।

అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్॥4.7॥

పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్।

ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే॥4.8॥

జాగ్రత్తగా గమనించండి.

పరమేశ్వరుడైన శ్రీ కృష్ణ భగవానుడు ఇలా అన్నాడు:

నేను ఈ యొక్క సనాతనమైన యోగ శాస్త్రమును సూర్య భగవానుడైన వివస్వానుడికి చెప్పాను. వివస్వానుడు మనువుకి తెలిపాడు. మనువు ఇక్ష్వాకునికి దీనిని ఉపదేశించాడు.

అంటే ఇది ప్రస్తుత వైవస్వత మన్వంతరం ప్రారంభం కావటానికి కొద్ది కాలం ముందర జరిగినది.

అంటే ఎంత కాలమో లెక్కగట్టి చూద్దాము.

ప్రస్తుతం మనం ఉన్నది వైవస్వత మన్వంతరంలో 28వ మహాయుగము. దీనికి మునుపు 27 మహాయుగాలు గడచినాయి.

ఒక్కొక్క మహాయుగంలో నాలుగు యుగాలు ఉంటాయి.

అవి వరుసగా

  1. కృత (17,28,000 సంవత్సరాలు)
  2. త్రేతా (12,96,000 సంవత్సరాలు)
  3. ద్వాపర (8,64,000 సంవత్సరాలు)
  4. కలియుగము (4,32,000)

ఈ లెక్కన ఒక్కొక్క మహాయుగము 43,20,000 సంవత్సరాలు ఉంటుంది.

27 పూర్వ మహాయుగాలు 43,20,000 x 27 = 11,66,40,000

దీనికి ఈ మహాయుగములో కృతయుగము, త్రేతా యుగము, ద్వాపర యుగములను కూడితే =

38,93,120 సంవత్సరాలు (నేటికి కలియుగంలో 5124వ సంవత్సరము సగాన పడింది – 2024 CE).

పై రెండు పెద్ద సంఖ్యలు కలిపితే…

11,66,40,000 + 38,93,120 = 12,05,33,120 సంవత్సరాలు.

అంటే భగవద్గీత మనకు తెలిసిన రూపంలో సుమారు 12 కోట్ల సంవత్సరాల క్రితం వివస్వానుడు అనబడే సూర్యునికి తెలుపబడగా, అది అతని పుత్రుడైన మనువుకు నేర్పాడు. ఆ మనువే వైవస్వతుడు. ఆ వైవస్వత మనువు ఇకాష్వాకువుకు తెలుపగా ఆయన ద్వారా సూర్యవంశీకులకు పరంపరగా అందింది. తర్వాత ఇతరులకునూ.

రాజర్షులు ఈ విధముగా యోగ శాస్త్రమును పరంపరలో పొందినారు. కానీ కాలగమనంలో అది ఈ లోకంలో లుప్తమైపోయినది (క్షీణించి పోయినది).

అదే ప్రాచీనమైన పరమ రహస్యమైన, ఈ యోగ విజ్ఞాన శాస్త్రమును నేను నీకు ఈరోజు తెలియచేస్తున్నాను. ఎందుకంటే, ఓ అర్జునా! నీవు నా మిత్రుడవు (సఖుడవు) మరియు భక్తుడవు, ఈ అలౌకిక జ్ఞానాన్ని అర్థం చేసుకోగలవాడవు.

గమనించాల్సిన విషయం. అర్జునుడు నరుడు కనుక నరులంతా శ్రీకృష్ణ పరమాత్మకు భక్తులు సఖులు. ఈ విషయాన్ని మనం సంపూర్ణంగా గ్రహించగలిగితే ఈ యోగము మనకు సంపూర్తిగా అవగతమౌతుంది.

ఆ మాటలు విన్నాక అర్జునుడు ఇలా అన్నాడు:

నీవు వివస్వానుడి తరువాత ఎంతో కాలానికి పుట్టావు. మరి నీవు ఈ విద్యని అతనికి ప్రారంభంలోనే ఉపదేశించాను అంటున్నావు. అంటే నేను దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?

అందరికీ వచ్చే అనుమానమే.

దానికి శ్రీభగవానువాచ:

మన ఇద్దరికీ ఎన్నో జన్మలు గడచినవి. నీవు వాటిని మరిచిపోయావు, కానీ, అవన్నీ నాకు జ్ఞాపకం ఉన్నాయి.

అంటే మానవ ఉపాధి పొందిన అందరూ ఎన్నో జన్మలు ఎత్తారు. ఎత్తుతున్నారు. ఎత్తబోతున్నారు. అలాగే భగవానుడు కూడా ఎన్నో అవతారాలను ఎత్తాడు (మానవ జన్మలకన్నా తక్కువే కావచ్చు. లేదా అంశావతారాలు అయితే మనకు అంతుచిక్కనన్ని కావచ్చు). కానీ, మనం గతంలో జరిగినది మర్చిపోతాము. భగవానుడికి ఆ సమస్య లేదు.

తాను అర్జునుడి ముందు మానవ రూపంలో నిల్చుని ఉన్నంత మాత్రమున తనను మానవులతో సమానంగా పరిగణించవద్దు అని వివరిస్తున్నాడు శ్రీ కృష్ణుడు. భగవంతుడు ఒక్కోసారి ఈ భౌతిక ప్రపంచంలోకి అవతరిస్తూ ఉంటాడు, కానీ అతని దైవీ గుణాలు, దివ్య శక్తులు ఏమాత్రం తగ్గవు.

ఈ శ్లోకంపై తన భాష్యంలో శంకరాచార్యులు ఇలా అంటారు:

యా వాసుదేవే అనీశ్వరాసర్వజ్ఞాశంకా మూర్ఖానాం తాం పరిహరన్ శ్రీ భగవానువాచ॥

(4.5వ శ్లోకంపై శంకర భాష్యం) అంటే ‘శ్రీ కృష్ణుడు భగవంతుడేనా అని ఏ మూర్ఖులకైనా సందేహం ఉంటే, దానిని ఖండించటానికే ఆయన ఈ శ్లోకం చెప్పాడు.’ నమ్మకం లేని కొంత మంది, శ్రీ కృష్ణుడు కూడా మనలాగే పుట్టాడు. మనలాగే భుజించాడు, త్రాగాడు, నిద్రపోయాడు. కాబట్టి ఆయన భగవంతుడు అవ్వటానికి అవకాశం లేదు అని వాదించవచ్చు. ఇక్కడ శ్రీ కృష్ణుడు, జీవాత్మకి, భగవంతునికి ఉన్న తేడాని స్పష్టంగా వివరిస్తున్నాడు. తను ఎన్నో సార్లు ఈ ప్రపంచంలో అవతరించినా ఆయన సర్వజ్ఞుడుగానే ఉంటాడు. అదే సమయంలో జీవాత్మ యొక్క జ్ఞానం మాత్రం పరిమితమైనది.

ఉదాహరణకు వాస్తవ సంఖ్యలైన (Real Numbers) 1, 2 తీసుకుందాము.

వాటిమధ్య అనంతమైన ఇతర వాస్తవ సంఖ్యలు ఉంటాయి. కానీ అవన్నీ అపరిమిత పరిమితమైనవి. అంటే 1, 2 మధ్య అపరిమితమైన వాస్తవ సంఖ్యలు ఉన్నా, అవి అన్నీ 1, 2 కు మధ్యలోనే ఉంటాయి. వాటిని దాటలేవు. మానవులు సంసార బంధనాలను దాటలేనట్లుగానే.

కానీ భగవానుడైన శ్రీకృష్ణ పరమాత్మ అనంత అనంత అనంతాలుగా విస్తరించి ఉండి ఏ రకమైన పరిమితులు (boundaries), నియంత్రణలు (constraints) లేకుండా ఉన్నాడు.

జీవాత్మకి, పరమాత్మ అయిన భగవంతునికి చాలా పోలికలున్నాయి – రెండూ సత్-చిత్-ఆనందములే (సనాతనమైనవి, చైతన్యవంతమైనవి, మరియు ఆనంద స్వరూపాలు).

పై ఉదాహరణనే కొనసాగిస్తే 1, 2 మధ్య ఉన్నవి అన్నీ వాస్తవ సంఖ్యలే. వాటికి కూడా అన్ని వాస్తవ సంఖ్యలకు ఉండే గుణాలు అన్నీ ఉంటాయి. కానీ, అనంత అనంత వాస్తవ సంఖ్యలతో పోలిస్తే అవి పరిమితమే.

కానీ, జీవాత్మకు పరమాత్మకు ఎన్నో తేడాలు కూడా ఉన్నాయి.

1, 2 మధ్య ఉండే వాస్తవ సంఖ్యలు 2 కన్నా లేశమాత్రం పెద్దవైన వాస్తవ సంఖ్యలకన్నా కూడా చిన్నవే.

భగవంతుడు సర్వవ్యాపి. జీవాత్మ తను ఉన్న శరీరంలోనే వ్యాపించి ఉంటుంది. మరొక శరీరం లభిస్తే దానిలోనూ.

భగవంతుడు సర్వశక్తివంతుడు, కానీ జీవాత్మకి తనను తాను మాయా మొహం నుండి కూడా భగవంతుని కృప లేకుండా విడిపించుకునే శక్తి లేదు.

భగవంతుడు ఈ ప్రకృతి నియమాలను సృష్టించిన వాడు. ఆత్మ ఈ నియమాలకు బద్ధమైనా ఉంటుంది.

భగవంతుడు సమస్త సృష్టికి ఆధారభూతమైనవాడు. జీవాత్మకు కూడా ఆయనే ఆధారం.

భగవంతుడు సర్వజ్ఞుడు. కానీ జీవాత్మ ఒక్క విషయం పైన కూడా సంపూర్ణ జ్ఞానం కలిగి ఉండదు.

ఇంకా శ్రీకృష్ణ భగవానుడు ఇలా కొనసాగించాడు.

నేను పుట్టుకలేని వాడిని అయిఉండి కూడా, సమస్త ప్రాణులకు ప్రభువునై ఉండి కూడా, నాశములేని వాడినై ఉండి కూడా, నేను ఈ లోకంలో నా యోగమాయా దివ్య శక్తిచే అవతరిస్తుంటాను.

ఎప్పుడెప్పుడైతే ధర్మము క్షీణించునో, అధర్మము పెచ్చుమీరుతుందో, ఆ సమయంలో నన్ను నేను భూలోకంలో సృజించుకుంటాను.

ధర్మాత్ములను కాపాడటానికి, దుష్టులను నిర్మూలించటానికి, ధర్మాన్ని తిరిగి ప్రతిష్ఠాపించటానికి నేను ఈ లోకంలో ప్రతి యుగము నందు అవతరిస్తాను.

ధర్మము దేశకాలమాన పరిస్థితులను బట్టీ ఉంటుంది. శ్రీరాముని కాలము నాటి ధర్మము, శ్రీకృష్ణుడి కాలం నాటి ధర్మము వేరు వేరు. ఇద్దరూ చేసిన ధర్మానుసరణ వేరు వేరు.

పూర్వ శ్లోకంలో భగవంతుడనైన నేను అవతరిస్తుంటాను అని చెప్పిన శ్రీ కృష్ణుడు,

దానికి ఉన్న మూడు కారణాలను వివరిస్తున్నాడు

1) సాధు జనులను రక్షించుట కొరకు

2) దుష్టులను సంహరించుట కొరకు

3) ధర్మాన్ని స్థాపించుట కొరకు.

కానీ, వీటిని నిశితంగా పరిశీలిస్తే ఈ మూడు కారణాలు కూడా నమ్మకంగా అనిపించవు.

మళ్ళీ గమనించండి.

మొదట శిష్ట రక్షణ. తరువాత దుష్ట శిక్షణ.

పరిత్రాణాయ సాధూనాం తరువాతే వినాశాయ చ దుష్కృతాం.

Punishing the evil is an after thought. As it is a necessary evil. కానీ శిష్ట రక్షణే ప్రధానం.

దానితో పాటూ గ్రహించ వలసిన సూక్ష్మాంశాలు..

సాధు జనులను రక్షించుట కొరకు: పరమాత్మ తన భక్తుల హృదయాల్లో స్థితుడై ఉంటాడు, లోపలనుండి వారిని ఎల్లప్పుడూ పరిరక్షిస్తూనే ఉంటాడు. ఈ పని కోసం ఒక అవతారం తీసుకోవలసిన అవసరం లేదు.

దుష్టులను సంహరించుట కొరకు: భగవంతుడు సర్వ-శక్తివంతుడు, దుష్టులను తన సంకల్ప మాత్రంచేతనే సంహరింపగలడు. దీనికోసం ఒక అవతారం ఎత్తవలసిన అవసరం ఏమున్నది?

ధర్మాన్ని స్థాపించుట కొరకు: అనాది కాలం నుండి వేదములలో ధర్మము వివరించబడింది. భగవంతుడు దానిని ఒక మహాత్ముని ద్వారా తిరిగి స్థాపించవచ్చు. దీనిని సాధించటం కోసం తానే ఒక రూపంలో అవతరించాల్సిన అవసరం లేదు.

అలాంటప్పుడు, ఈ శ్లోకంలో చెప్పబడిన కారణాలను మనం ఎలా అర్థం చేసుకోవాలి? శ్రీ కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడో కొంచెం లోతుగా వెళ్లి అర్థం చేసుకుందాం.

జీవాత్మ చేయ గలిగే అత్యున్నత ధర్మం, భగవంతుని భక్తిలో నిమగ్నమవ్వటమే. ఎక్కడి నుంచీ వచ్చాడో అక్కడకే తిరిగి చేరాలి. దానికి చేయవలసిన పనులు చేయాలి. చేయలేకపోతున్నాయి కాబట్టే పరమాత్మ తన అవతారం ద్వారా చేయనేర్పుతాడు. భగవంతుడు ఈ లోకంలో అవతరించినప్పుడు తన దివ్య రూపములు, నామములు, గుణములు, లీలలు, ధామములు, మరియు సహచరులను ఆవిష్కరిస్తాడు.

ఇది జీవాత్మలకు భక్తి కోసం ఒక సులువైన ఆధారాన్ని అందిస్తుంది. మనస్సుకి ధ్యానం చేయటానికి, అనుసంధానమవటానికి ఒక రూపం అవసరం, అందుకే భగవంతుని నిరాకార తత్త్వం, ఆరాధించటానికి చాలా కష్టతరమైనది. అదే సమయంలో, సాకార రూపంలో ఉన్న భగవంతునిపై భక్తి అనేది, సామాన్య జనులకు అర్థం చేసుకోవటం తేలిక, ఆచరించటానికి సులువైనది, ఎంతో మధురమైనది.

అందుకే పరాశర భట్టర్ వ్యాఖ్య ఆ సగుణ సాకార పరబ్రహ్మనే ఆధారంగా చేసుకున్నది. అందుకే ఆయన శ్రీవిష్ణు సహస్రనామ వ్యాఖ్య భగవద్గుణ దర్పణమ్అయి అత్యంత ఆచరణ సౌలభ్యతను కలిగి ఉంది.

ఈ విధంగా, ఐదు వేల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు అవతరించినప్పటి నుండి, కొన్ని కోట్ల జీవులు (జీవాత్మలు) కృష్ణుడి దివ్య లీలలను తమ భక్తికి ఆధారంగా వాడుకుని, తమ మనస్సులను సునాయాసంగా, ఆహ్లాదంగా పవిత్రమొనర్చుకున్నారు. ఇదే విధంగా, శ్రీ రామాయణం కూడా ఎన్నో యుగాలుగా జీవాత్మల భక్తికి, ఎంతో జనాదరణ పొందిన ఆధారంగా ఉపయోగపడింది.

భారతదేశంలో ఆదివారాల్లో టీవీలో రామాయణం మొదలయిన రోజుల్లో, దేశంలో అన్ని వీధులు నిర్మానుష్యమయ్యేవి. రామచంద్రుని లీలలు జనులకు ఎంత ముగ్ధమోహనముగా ఉండేవంటే, ప్రజలు తమ టెలివిజన్ తెరలకు, ఆ లీలలను చూడటానికి, అతుక్కుపోయేవారు. కరోనా సమయంలో పునః ప్రసారం చేస్తే 94% మంది చూసిన అపూర్వమైన చరిత్ర సృష్టించింది.

శ్రీరామచంద్రుని అవతారం, చరిత్రలో ఎన్నో కోట్ల జీవాత్మలకు తమ భక్తికి ఒక ఆధారాన్ని అందించింది. తులసీ రామాయణం ఇలా పేర్కొంటున్నది:

రామ ఏక తాపస తియ తారీ, నామ కోటి ఖల కుమతి సుధారీ॥

‘తన అవతార సమయంలో, రామచంద్ర మూర్తి ఒక్క అహల్యకే (గౌతమ ముని భార్య, ఆమెను రాముడు ఒక రాతి శరీరంనుండి విడిపించాడు- వాల్మీకి రామాయణంలో అసలు ఘట్టం ఉన్నది వేరు. ఇక్కడి సందర్భం వేరు) సహాయపడ్డాడు. కానీ, అప్పటి నుండి “రామ” నామము జపించి, కోట్ల మంది పతితులైన జీవులు తమను తాము ఉద్ధరించుకున్నారు.’ కాబట్టి, ఈ గీతా శ్లోకానికి నిగూఢమైన అర్థం ఏమిటంటే..

ధర్మాన్ని స్థాపించటం కోసం: జీవాత్మలకు భక్తిలో నిమగ్నమై తమ అంతఃకరణ శుద్దికి సహకరించటానికి, తన నామములు, రూపములు, లీలలు, గుణములు, ధామములు, మరియు సహచరులను ప్రకటించటం ద్వారా, భక్తి అనే ధర్మాన్ని స్థిరపరచటానికి భగవంతుడు అవతరిస్తాడు.

దుష్టులను సంహరించటం: భగవంతుని లీలలలో పాలు పంచుకోవటానికి, ఆయనతో పాటుగా కొంతమంది ముక్త మహాత్ములు కూడా అవతరించి, దుర్మార్గులుగా నటిస్తారు. ఉదాహరణకి, రావణ-కుంభకర్ణులు నిజానికి భగవత్ దివ్య ధామము నుండి దిగివచ్చిన జయ-విజయులే. వారు రాక్షసులుగా నటించారు మరియు రాముడినే ఎదిరించి పోరాడారు. వారు దివ్య పురుషులు కాబట్టి మరెవ్వరి చేత సంహరింపబడలేరు. కాబట్టి, భగవంతుడే అటువంటి రాక్షసులను తన లీలలలో భాగంగా సంహరించాడు. అలా సంహరించి, వారిని తన దివ్య ధామానికి పంపించాడు, ఎందుకంటే వారు నిజానికి అక్కడి నుండి వచ్చిన వారే.

ధర్మాత్ములను రక్షించటం: ఎన్నో జీవాత్మలు, భగవంతుడిని తమ ఎదురుగా దర్శించటానికి తగినంత ఉన్నతిని సాధనలో పొందిఉన్నారు. ఈ అర్హత సంపాదించిన జీవాత్మలు, శ్రీ కృష్ణుడు ఈ లోకంలో అవతరించినప్పుడు, భగవంతుని లీలలలో పాలు పంచుకోవటానికి మొదటి అవకాశాన్ని పొందాయి.

ఉదాహరణకి, కొంతమంది గోపికలు (శ్రీ కృష్ణుడు తన లీలలను ప్రదర్శించిన బృందావనానికి చెందిన మహిళలు) నిజానికి శ్రీ కృష్ణుని లీలలలో సహకరించటానికి ఆయన దివ్య ధామము నుండి దిగివచ్చిన ముక్త జీవులు. మరికొంత మంది గోపికలు, మొదటి సారి భగవంతుని కలిసి, సేవించుకుని, ఆయన లీలలలో పాలు పంచుకునే అవకాశమొచ్చిన, భౌతిక బంధములో ఉన్న జీవులు. కాబట్టి శ్రీ కృష్ణుడు ఈ లోకంలో అవతరించినప్పుడు, అలాంటి పరిపక్వత కలిగిన జీవాత్మలకు, ఆయన లీలలలో భాగస్వాములై, తమ భక్తిని పరిపూర్ణమొనర్చుకునే అవకాశం కలిగింది.

చివరగా

జన్మ కర్మ చ మే దివ్యమ్ ఏవం యో వేత్తి తత్త్వతః।

త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోఽర్జున॥4.9॥

నా యొక్క జన్మ మరియు కర్మల దివ్య స్వభావాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో, ఓ అర్జునా, వారు తమ దేహం విడిచిపెట్టిన తరువాత తిరిగి జన్మనెత్తవలసిన అవసరం లేదు, వారు నా నిత్యశాశ్వత ధామానికే వస్తారు.

ఇక్కడ!!!

తన శాశ్వతత్వాన్ని ప్రతిపాదించాడు/ప్రకటించాడు పరమాత్మ.

ఏ రూపంలో అంటే శ్రీకృష్ణుని రూపంలో.

ఆ అవతార వైశిష్ఠ్యాన్ని ఇక్కడ తెలుసుకోవాలి.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here