[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]
వ్యాస పరా‘శరం’
శ్రీ పరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహితః।
శ్రీవత్సాంక సుతః శ్రీమాన్ శ్రేయసే మే౭స్తు భూయసే॥
వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్ర మకల్మషం।
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్॥
వశిష్ఠ మహర్షికి ముని మనుమడు. శక్తికి మనుమడు. పరాశరునకు పుత్రుడు. శుక మహర్షికి తండ్రియైన తపోనిధుడు. కల్మష రహితుడైన వ్యాసునకు నమస్కారం. గుర్తు పెట్టుకోండి. తెలుసుకోవలసినది చాలా ఉంది.
వ్యాసపరాశరులు!
వారికి ముందు..
వశిష్ఠ మహర్షి.
విశ్వామిత్ర మహర్షి.
ఒకరు బ్రహ్మర్షి.
మరొకరు రాజర్షి.
ఇతఃపూర్వం కూడా ఒకరు బ్రహ్మర్షియే. కానీ మరొకరు క్షత్రియ యోధుడు.
ఆ కథ మనకు తెలిసిందే.
అందుకే తెలియని కొన్ని విశేషాలను ఒకసారి చూద్దాం. పరిశీలనగా.
అరుంధతీ దేవి వశిష్ఠ మహర్షి ధర్మపత్ని. మహాపతివ్రత. సప్తర్షి మణ్డలంలో, వారి స్థాయిలో, తన పతి పక్కన స్థానం దక్కించుకున్న తపస్వి. వివాహ సమయంలో సప్తర్షి మణ్డలం దగ్గరలో ఉన్న అరుంధతిని ఈ కాలపు కళ్ళతో చూడలేక పోయినా (ఫాగ్, లైట్ పొల్యూషన్ ఎట్సెటరాదులు కూడా కారణమే) ఆమెను మనసారా స్మరించి దర్శించుకోగలిగితే, కనీసం ఆ అనుభూతి పొందితే ఎన్ని అవరోధాలు ఎదురైనా ఆ దాంపత్యం ఆదర్శనీయంగా సుఖసంతోషాలతో వర్థిల్లుతుంది. ఇది సత్యం.
ఆ తల్లిని దర్శించాలంటే పరిశీలనగా చూడాలి. అయినా కానరాకపోతే స్మరించి అంతఃచేతనంతో చూసేందుకు ప్రయత్నించాలి. లేదా భక్తి ప్రపత్తులతో అంతఃచక్షువుతో గ్రహించగలగాలి. అంత చేయగలిగిన వారు, అంత ఓపిక ఉన్నవారు చిన్న కారణాల వల్ల విడిపోరు. ఆలోచిస్తారు. పరిశీలిస్తారు. గ్రహిస్తారు. నిలుస్తారు.
మాఘమాసాది పంచ మాసాల కాలమందు తప్ప ఈ నక్షత్రం సాయంత్రం వేళ కానరాదు. కనుక పైన చెప్పినదే ప్రధానమైన మార్గం. పైగా..
తివిరి ఇసుమున తైలము తీయగల శక్తిమంతురాలు అరున్ధతీ మాత.
రాత్రిపూట చంద్రుడ్ని, నక్షత్రాలను చూడటం వల్ల కంటి శక్తి పెరుగుతుంది. అందరూ చెప్పే మాటే. దిక్కుల గురించిన సమాచారము, జ్ఞానము పెరిగి భౌగోళిక, అంతరిక్షం విజ్ఞానం మీద మక్కువ కలుగుతుంది. ప్రపంచంలో ఏ మూల పడవేసినా దిక్కు తెలుస్తుంది. శిశిర, వసంత, గ్రీష్మ ఋతువులందు సాయంకాల సమయాన, మిగిలిన కాలాల్లో అర్థరాత్రి లేదా దాటిన తర్వాత తెల్లవారుఝామున కనిపిస్తుందని పెద్దలు ఇచ్చిన సమాచారం.
పవిత్రత అనే పదానికి పర్యాయ పదమే అరుంధతీ మాత అని ఒక ప్రవచనకారుడు చెప్పిన మాట అతిశయోక్తి కాదు. ఈమె ఎంతో అందగత్తె. కంటికి కనపడని సౌందర్యం ఆమెది. తెరుచుకున్న కళ్ళతో చూడాలి. అంతః చక్షువుతో తెలుసుకోవాలి. పైపై మిసమిసలు కాదు. ఇదే వివాహ సమయంలో అరుంధతీ నక్షత్రాన్ని చూడమని చెప్పటంలో ఆంతర్యం.
Look beyond physical beauty. Look beyond what’s superficial. Think deep before arriving at conclusion. Analyse. Think out of the box. ఇదీ అసలు బంధాలను నిలుపుకోవాల్సిన ప్రక్రియ.
ఈమె మహాపతివ్రత. ఇసుకను అన్నంగా తయారు చేయగలిగింది.
వశిష్ఠ మహర్షి వివాహం కోసం తగిన కన్య కోసం అన్వేషిస్తూ ఒక గ్రామానికి వస్తాడు. నగరాలకు దూరంగా. అక్కడ ఒకచోట చాలామంది ఆయనను చూడటానికి వస్తారు. కన్యలంతా ఆశీస్సులు కోరతారు. ఆయన వచ్చింది తగిన కన్య కోసం.
“ఎవరన్నా ఇసుకతో అన్నం వండగలరా?” అని అడుగుతాడు.
అందరూ ఆశ్చర్యపోతారు. తమవల్ల కాదంటారు.
గుంపుకు దూరంగా కూర్చున్న ఒక బాలిక (దగ్గరలో ఉన్న మాల పల్లె నుంచీ వస్తుంది) తాను చేయగలనని వస్తుంది ముందుకు.
అందరినీ తొలగి త్రోవ ఇవ్వమని వశిష్ఠుడు ఆఙ్ఞాపిస్తాడు. ఆ పిల్ల బిడియపడుతూ ముందుకు వస్తుంది. వశిష్ఠుని కళ్ళలోకి చూస్తుంది. రజస్వల అయి ఒక ఆరు మాసములు గడచి ఉంటాయి. అంతే. కానీ ఆమె చూపులలో గొప్ప జ్ఞానం గోచరిస్తుంది. గొప్ప వర్చస్సు.
దోసిలి పడుతుంది. స్వీకరించేటప్పుడు అలాగే స్వీకరించాలి. అంటే పట్టిన దానానికి లేదా స్వీకరించిన దానికి తగిన ఫలం చూపుతాను అని చేసే ప్రతిజ్ఞ అది. అపాత్రదానం కూడదు కదా. అందుకే అందుకనే వారు ఇవ్వాల్సిన హామీ అది.
కొన్ని సందర్భాలలో ఇచ్చేటప్పుడూ అలాగే ఇవ్వాలి. అసలెప్పుడూ అలాగే ఇచ్చినా తప్పులేదు. వీలు కుదిరితే. దానికర్థం ఫలితం కూడా నీవే స్వీకరించు అని.
మాఫలేషు కదాచన. కృష్ణార్పణమ్. అంతా ఆ భగవచ్ఛక్తికే.
వశిష్ఠుడు దోసిలిగానే అందిస్తాడు. స్వీకరించి ఇంటికి వెళుతుంది.
రెండు ఘడియల తరువాత వస్తుంది.
“స్వామీ! అన్నం సిద్ధం,” అంటుంది.
ఆ బ్రహ్మర్షి ఆమె ఇంటికి వెళతాడు. జనులంతా ఆశ్చర్యచకితులై చూస్తుంటారు. ఆయన వెంట కదులుతారు.
ఇంటికి వెళ్ళాక ఉచితాసనం చూపి స్వీకరించమంటుంది.
తనను వివాహమాడితేనే స్వీకరిస్తానని చెప్తాడు.
ఆమె తల్లితండ్రులు వస్తారు.
“ఎలా చేయగలిగావు?” తల్లి అడిగింది.
“అన్నం పరబ్రహ్మ స్వరూపం. పరబ్రహ్మము ఆంతటా నిండి ఉంది. ఈ ఇసుకలో కూడా. ఆ పరబ్రహ్మాన్నే శరణాగతి చేశాను. ఈ రూపము దాల్చినది.”
వశిష్ఠ మహర్షి చిర్నవ్వు నవ్వాడు. తనకు తగిన వనిత అనుకున్నాడు. ఆమె తల్లితండ్రులను ఒప్పించి ఆమెను చేబట్టాడు.
“మీరు సంతానార్థియై వచ్చారని ముందే తెలుసు,” అంటుంది అరున్ధతీ వివాహం అవగానే. “కానీ సమయం కోసం చూస్తున్నారు.”
సర్వం గ్రహించగలిగిన వశిష్ఠుడు చిరునవ్వుతో తల పంకించాడు.
ఆ తల్లి క్షేత్రంగా జన్మించిన వాడే శక్తి. ఆయన బీజమే పరాశర మహర్షి. శక్తి విశ్వామిత్రుని చేతిలో (కారణాన వేరే రాజు.. ఇక్కడ అంత వివరం అనవసరం) నిహతుడౌతాడు. కానీ అప్పటికే ఆయన చేయవలసిన కార్యం చేసే ఉంటాడు. భార్య గర్భవతి. ఆమె సంతానం కోసమే, పుత్రుల మరణం వల్ల ఆత్మత్యాగం కోసం ప్రయత్నిస్తున్న వశిష్ఠుడు ఆ ప్రయత్నాన్ని విరమిస్తాడు. పరాశరుడు అంతటి గొప్పవాడు. అడుగంటిన ఆశలను మొలకెత్తించి మొక్కగా, వృక్షంగా మార్చగలిగిన శక్తి ఆయనది.
ఆ పరాశర స్మృతే ఈ కలియుగానికి దిక్సూచి. అది ఏమిటో లేదా ఎవరో తెలుసా?
వ్యాసుడు.
వేదవ్యాస మహర్షి. ఎలాగో ముందు ముందు చూద్దాము.
ఉపరిచర వసువు వల్ల అద్రిక ద్వారా జన్మ తీసుకున్న మత్స్యగంధి సత్యవతిగా దాశ రాజు వద్ద పెరుగుతుంది.
ఆమెకు పరాశరుడు అందించిన సంతానమే వేదవ్యాసుడు. ఆ కథ తెలిసిందే.
ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తే వ్యాస మహర్షికి కూడా వసు సంబంధం ఉంది. దీని కోసమే పరాశరుడు సత్యవతిని ఎన్నుకున్నది. అంతే తప్ప ఆయన చలించలేదు. ఎన్నుకునే చేశాడు. అందుకే అక్కడ కామం కన్నా, ధర్మమే, ప్రేమయే ఎక్కువ ప్రాధాన్యం కలిగింది. అందుకే సుజ్ఞానం వర్థిల్లింది వారి సంతానం రూపంలో.
ఆ కృష్ణ ద్వైపాయన వ్యాసుని వల్లనే కురు వంశం నిలిచింది. కురు వంశానికి రక్షకునిగా నిలుస్తానన్న భీష్మాచార్యుడు వసువే. వ్యాసుడు కూడా తల్లి ద్వారా (ఉపరిచర) వసు సంబంధం కలిగిన వాడు. ఇందువల్ల మహాభారతం భీష్మాచార్యుని గాథయే అని రూఢి చేసుకోవాలి. (గాథ వేరు, కథ వేరు మళ్ళీ). అందుకే ఆయన మరణంతో భారతం ముగుస్తుంది.
అక్కడ జరిగిన మంగళాశాసనమే శ్రీవిష్ణు సహస్రనామం.
దాన్ని మనకు అందించిన వేదవ్యాసుడు తల్లి ద్వారా వసువుకు, తండ్రి, తాత ద్వారా వశిష్ఠ మహర్షికే కాక అరుంధతి అంతటి సాధ్వి క్షేత్ర సంబంధం కలిగినవాడు. అందుకే పరబ్రహ్మ స్వరూప జ్ఞానం సంపూర్తిగా కలిగిన వాడు. తద్వారా భాగవతమే కాదు అష్టాదశ పురాణాలను, అష్టోత్తరశత ఉపనిషత్తులను, మహాభారతం వంటి ఇతిహాసాన్ని అందించగలిగాడు. ప్రస్థాన త్రయాన్ని దర్శించి మనకు అందేలా చేశాడు. విష్ణు పురాణాన్ని ఆయన తండ్రి అయిన పరాశర మహర్షి అందిస్తే దానిని విస్తృత పరచి వ్రాసినది కృష్ణద్వైపాయనుడే.
ఇక్కడ ద్వై అన్న శబ్దాన్ని గుర్తు పెట్టుకోండి. ముందు ముందు పరశీలనగా చూడవలసి వస్తుంది.
శ్రీవిష్ణు సహస్రనామము మనకు అందటానికి ఇన్ని సంఘటనలు కల్పింపబడ్డాయి. అసలు మహాభారతం యొక్క లక్ష్యమే కలియుగ జనులకు బ్రహ్మ జ్ఞానాన్ని సులభసాధ్యం చేయటానికి స్వయం భగవానుడైన శ్రీకృష్ణ పరమాత్మ కల్పించిన లీల.
ఇదంతా ఇక్కడే ముగియలేదు.
***
కాలం 4200 సంవత్సరాల ముందుకు నడుస్తుంది.
అది రామాజనుజాచార్యుల వారి యుగం ప్రారంభం కావటానికి ముందు రోజులు. ఆయన అప్పటికి లోక ప్రసిద్ధులు కాలేదు. యతిగా మారలేదు.
యామునాచార్యులు అంత్యదశలో ఉన్నారు. వారిదే వైష్ణవ జన భారమప్పటికి.
చాంధోగ్యోపనిషత్ లోని “తస్యయథా కప్యాసం పుణ్డరీక మేవ మక్షిణీ” అను సూత్రమునకు రామానుజుల వారు ఇచ్చిన భాష్యాన్ని, తప్పు చెప్పినందుకు గురువునైనా ఎదిరించగలిగిన దక్షత కలిగి ఉండటాన్ని చూసి ఆశ్చర్యానందాలకు గురయ్యారు యామునులు (యామునులు – గుర్తు పెట్టుకోండి. ముందు ముందు చాలా విశేషాలు తెలుసుకోవాలి)
ఇంతకీ భవిష్యత్‌లో యతిరాజులుగా ప్రసిద్ధులయ్యే శ్రీ రామానుజులవారు అనుగ్రహించిన భాష్యము ఏమిటి?
“గంభీరాంభ స్సమూఁద్భూత సుమృష్ఠానాళ రవికర వికసిత పుండరీక దళామలాయ తేక్షణః”
బాగుగా లోతైన సరస్సులో ఆవిర్భవించిన మృదువైన నాళము మీద సూర్యకిరణములచే వికసింపచేయబడిన రమ్యమైన తామరపద్మము యెక్క రేకుల వంటి విశాలమైన నేత్రములు కల స్వామి.
ఇక ఆగలేదు యామునులు. రామానుజుల వారిని తీసుకుని రమ్మని పంపారు మహాపూర్ణులనబడే పెరియ నంబిని. ఆయన కాంచీపురానికి వెళ్ళి రామానుజులు వినేలాగ యామునాచార్యులు అనుగ్రహించిన స్తోత్రరత్నాన్ని గానం చేస్తుంటాడు. అది విని వచ్చిన రామానుజులు పెరియ నంబి ద్వారా ఆళవన్దార్ లేదా యూమునుల గురించి తెలుసుకుని ఆయనను చూపమని అడుగుతాడు. అప్పటిదాకా రామానుజాచార్యుల వారి బలవంతం మేరకు (ఇదీ గుర్తు పెట్టుకోండి), అభ్యర్థన మేరకు గురువుగా నిలచిన కాంచీపూర్ణులనబడే తిరుక్కచ్చినంబి రామానుజులకు తగిన గురువు లభించే సమయమాసన్నమైందని తెలుపుతారు.
క్షణమాలస్యం చేయకుండా పెరియనంబితో వెళతాడు రామానుజాచార్యులు.
అప్పటికే యామునులవారు తమ అవతార పరిసమాప్తి కానిస్తారు. ఆయన పార్థివ దేహంలో ఒక విచిత్రం గమనిస్తారు రామానుజులు. మూడు వేళ్ళు మూసుకుని ఉంటాయి. అది చూసి ఆశ్చర్యపోతారు.
రామానుజులవారు అడుగుతాడు: “స్వామీ! యామునుల వారి వేళ్ళు మొదటి నుంచీ అలాగే ఉన్నాయా?”
(వారి observation skills గురించి ఇక్కడ గ్రహించాలి మనం. అలాగే deductive skills. Bhagavad Ramanuja was a highly underrated logician. తర్క శాస్త్రంలో ఉద్దండుడు. ఎంత వరకు తర్కం పనికి వస్తుందనేది ఆయనకు తెలసినంత తెలసినది భక్తులుగా జనించిన వారిలో హనుమంతుడొక్కడికే).
లేదని చెప్తారు. అయితే కచ్చితంగా తాను ఇక్కడకు రాబోయే సమయాన్ని ముందుగానే లెక్కకట్టిన ఆళవన్దార్ స్వామి తనకు ఒక సందేశాన్ని ఇస్తున్నారని గ్రహిస్తాడు. మరి ఆయన మరణం ముందే ఎందుకు జరిగింది? To make public Ramanuja’s deductive skills?
ఏమిటా సందేశం?
వైష్ణవ వ్యాప్తి బాధ్యతలు ఒక తరం నుంచీ మరియొక తరం వారికి చేరవలసిన సమయమిది. అంటే ఎవరో ఒకరు ప్రతిజ్ఞ తీసుకోవాలి. అది ఎవరు?
మహాపూర్ణులా?
అయితే ఏమిటా ప్రతిజ్ఞ? సాధారణమైన ప్రతిజ్ఞ అయితే తనకోసం ఇంత వేచి ఉండరు. తన రాక ఆలస్యమైతే ఇంత సంకేత సందేశం అందించరు.
అందుకే తన గురువైన కాంచీపూర్ణులవారిని స్మరించి రామానుజులవారు ధ్యానంలోకి వెళతారు. ఆ బాధ్యత నిజానికి తనదే అని తెలుస్తుంది. తనకు ఆ బాధ్యతను అప్పగించవలసినది పెరియనంబి అని సందేశమందుతుంది వరదరాజ పెరుమాళ్ ద్వారా. ఇది వేరే కథ.
వెంటనే మూడు ప్రతిజ్ఞలు చేస్తాడు.
- నేను వైష్ణవ వ్యాప్తి కొరకు కృషి చేస్తాను. పఞ్చ సంస్కారాలను ప్రామాణికం చేసి, ద్రవిడ వేదాలను వ్యాప్తి చేసి, శరణాగతిని అందరి గతిగా తెలియజేస్తాను. (కలియుగంలో శరణాగతియే గతి. ఆ శరణాగతియే నామ సఙ్కీర్తన రూపంలో ఉంటుంది. అదే శ్రీవిష్ణు సహస్రనామ విశేషం).
- బాదరాయణ మహర్షి మానవులకు అందించిన ప్రస్థాన త్రయానికి (ఉపనిషత్-భగవద్గీతలు, బ్రహ్మ సూత్రాలు) వ్యాఖ్యానం అందిస్తాను. తద్వారా జనులు ముక్తిని సులభంగా పొందే మార్గాన్ని అందిస్తాను. అదే శ్రీభాష్యమైనది.
- వ్యాస పరాశరుల నామములను అర్హత కలిగిన వ్యక్తులకు అందించి వారి కృషిని అజరామరంగా నిలిచేలా చేస్తాను.
ఈ మూడు ప్రతిజ్ఞలు వినగానే యామునుల వారి హస్తము ఆశీర్వచన ముద్రలోకి మారి రామానుజుల వారే ఆచార్యులు ఇక పైన అని సంకేత మాత్రాన తెలియజేసి వైకుణ్ఠధామానికి చేరతారు.
అక్కడి నుంచీ సమయం మూడు దశాబ్దాల ముందుకు కదులుతుంది.
రామానుజుల వారి ప్రధాన శిష్యులైన కూరేశ మిశ్రులు, ఆండాళ్ దంపతులకు శ్రీరంగనాథుని అనుగ్రహము వలన కలిగిన సంతానమే శ్రీపరాశర భట్టర్, వేదవ్యాస భట్టర్.
ఒకనాడు వర్షం కురుస్తుండటం వలన కూరేశులు భిక్షాటనకు వెళ్ళలేకపోయారు. అందువల్ల ఆకలితో ఆయన అలాగే విశ్రమించారు. వారి ధర్మపత్నియైన ఆండాళ్, కోవెల నుండి నైవేద్య గంటానాదాన్ని విని తమ మనసులో పెరుమాళ్ళకి ఇలా విన్నవించుకుంది – “నీ భక్తుడైన నా పతి దేవులు ఉపవాసముతో శయనిస్తే నీవు మాత్రం భోగాన్ని అనుభవిస్తున్నావా?”.
ఇది గ్రహించిన శ్రీరంగనాథులు ఉత్తమ నంబి ద్వారా తమ ప్రసాదాలని కూరేశ మిశ్రుల ఇంటికి చేరేలా చూస్తారు. ప్రసాదమును చూసిన కూరేశులు భీతి చెంది వెంటనే ఆండాళ్ వైపు తిరిగి ‘పెరుమాళ్ళను ఏమైనా అడిగావా నా విషయంలో?’ అని ప్రశ్నిస్తారు. ఆమె అవునని అంటుంది. ఆయన ఈ విషయ మందు కలత చెంది, రెండు గుప్పిళ్ళ నిండా సరిపడు ప్రసాదాన్ని మాత్రమే తీసుకొని, ఆ ప్రసాదంలో కొంచం తాను స్వీకరించి మిగితాది తమ ధర్మపత్నికి ఇచ్చిరి. ఆ ప్రసాద విశేష ప్రభావం వలన వారికి ఇద్దరు పిల్లలు పుడతారు.
పెరుమాళ్ సఙ్కల్పం వల్ల ఆ బాలురు జన్మించారని గ్రహించిన యతిరాజులు
(అంటే భగవద్రామానుజులు. తిరుమన్త్ర్రం బహిర్గతం కూడా చేయబడినదప్పటికే – తిరుక్కోయష్టియూర్ లో. అక్కడే ఆయనకు వారి గురువులే శిష్యులుగా మారి – తిరు మన్త్రాన్ని ఉపదేశించిన గోష్ఠీపూర్ణులు – ఎంబెరుమానార్ అని సంబోధిస్తారు. అంటే గురువు. The Master. లేదా జగదాచార్యులు. జగత్తుకు ఆచరణ ద్వారా మార్గం చూపిన వారు అని. ఇది చాలామంది అనుకున్నట్లుగా శ్రీరంగం గోపురం మీద నుంచీ చెప్పబడింది కాదు. తిరుక్కోష్టియూర్ లో సౌమ్యనారాయణ పెరుమాళ్ ఆలయ గోపురం),
వారికి అదే ఆ పిల్లలకు – తమ గురువులైన ఆళవన్దార్‌కు మాట ఇచ్చినట్లుగా – వ్యాసభట్టర్, పరాశర భట్టర్ అనే దివ్య నామములు ఇస్తారు.
ఆ పరాశర భట్టార్య యే సౌలభ్యానికి ప్రతీకగా వ్రాసిన శ్రీవిష్ణు సహస్రనామ వ్యాఖ్యను భగవద్గుణ దర్పణమ్ అనే పేరుతో అందించారు .
నిర్గుణ బ్రహ్మను అందరూ గ్రహించలేరు అని అవగాహన ఉన్న రామానుజుల వారు ముక్తి కోసం సులభంగా ఉండే సగుణ బ్రహ్మ సంబంధం కూడా పనికి వస్తుందని శ్రీవైష్ణవ మతం ద్వారా చాటారు. ఆ శ్రీవైష్ణవానికి ఆలంబనమైన వేదాంత తత్వాన్ని శారదాదేవియే విశిష్టాద్వైతమని కొనియాడిన సంగతి మొదటే తెలుసుకున్నాము.
అక్కడ వేద వ్యాసులవారు విని సంకలనం చేసి మనకు అందించిన శ్రీవిష్ణు సహస్రనామములకు, వారి తండ్రి గారైన పరాశర మహర్షి నామమును పొంది, సాక్షాత్ శ్రీరంగనాయకి ఆదేశాన ఆమె సన్నిధిలో పెరిగిన పరాశర భట్టర్ అందించిన వ్యాఖ్య
భగవద్గుణ దర్పణమైంది.
పుత్రుడు క్రోడీకరించిన నామస్తోత్రానికి తండ్రిగారి వ్యాఖ్య!!!
The Salient Features of the Observable Universe.
Observable Universe is relative. Every observer has his own inertial frame of reference. అందుకే సహస్రనామాలు. సహస్ర అంటే వెయ్యి మాత్రమే కాదు. అనేకం. Infinite. ఇక్కడ సత్యసంధ తీర్థుల వారిచ్చిన ఒక వివరణ చాలా గొప్పగా ఒప్పుతుంది. ఆయన ద్వైతాచార్యులు.
ముందు ముందు చూద్దాం.
ఈ ప్రక్రియకు అరుంధతీ దేవికీ బాదరాయణ సంబంధం ఉంది. పరాశరుని ద్వారా. అరుంధతిని సరిగ్గా చూడాలంటే ఎలా సూక్ష్మ పరిశీలన, భక్తి, ఓపిక కావాలో అవన్నిటినీ భగవద్రామానుజుల వారి శ్రీవైష్ణవమనే విశిష్టాద్వైతం కలిగి ఉంది.
ఇదే వ్యాసపరాశరమ్!
ఆ పరా‘శర’మే మన అజ్ఞానాన్ని భేదించేది.
(సశేషం)