Site icon Sanchika

తల్లివి నీవే తండ్రివి నీవే!-8

[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]

దర్పణమ్

[dropcap]L[/dropcap]ook at the face in the mirror

I wonder what I see!

ఒక పాటలో వాక్యాలు.

మన జీవితంలో ఆవశ్యక క్షణాలు.

సంస్కృతంలో లుక్ (लुक्) అనే ధాతువు కర్థం చూడటం. అంటే ఆషామాషీగా చూడటం కాదు. తేరిపార చూడటం. ఒక రకంగా it’s an equivalent to the English word Look.

కానీ, लुक् అంటే శాస్త్రాలను పరిశీలించి చూడటం అనే అర్థం కూడా వస్తుంది.

శాస్త్రము అనగా అపౌరుషేయమైన వేదము. అంటే వేదమే శాస్త్రము. దానికి షడంగాలు ఉంటాయి. అవి

  1. శిక్ష
  2. వ్యాకరణము
  3. ఛందస్సు
  4. నిరుక్తిని
  5. జ్యోతిషము
  6. కల్పము

కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణమ్।

పరాయణమ్! చర్చించి చెలుసుకోవలసిన మాట.

ఇక అన్నమయ్య అంటాడు.. నామ సఙ్కీర్తనం గురించి.

వొక్క సంకీర్తనే చాలు వొద్దికై మమ్ము రక్షించఁగ

తక్కినవి భండారాన దాఁచివుండనీ

వెక్కసమగు నీ నామము వెల సులభము ఫలమధికము

దిక్కై నన్నేలితివిఁక నవి తీరని నా ధనమయ్యా

ఒక రాజు బెదిరిస్తే..

పుట్టుభోగులము మేము

భువి హరిదాసులము

నట్టనడిమి దొరలు మాకీయవలదు.

నిర్భీతుండు ప్రశస్త భాగవతుడు.

అంటాడు.

ఆ పైన.. మనకు తెలసిన విషయమే

కృతేతు నారసింహో భూ త్రేతాయాం రఘునందన।

ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వేంకటనాయకః॥

వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన।

వేంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి॥

ఇక్కడ గమనించవలసినది..

కలియుగంలో నామ సఙ్కీర్తనం లేదా స్మరణ లేదా జపము. ఇంతకు మించిన సాధన లేదు అని పెద్దలన్నారు. శాస్త్రమూ అదే ఘోషించింది.

మరి శాస్త్రాలు.. అవే వేదాలు విష్ణు తత్వం గురించి చెప్పాయా?

ఎలా చెప్పగలవు? వేదాలకు కూడా అందని వాడు అని కదా ఆయన గురించి మహర్షులతో సహా అనేది. అమ్మ ఆండాళ్ అందుకేగా “పెరియాయ్” అనే సంకేత పదం ద్వారా మనకు తెలియజెప్పింది, ఆయన హృదయం గెలుచుకున్నది!

కలియుగంలో నామస్మరణను మించిన మార్గము లేదని ఎన్ని స్వరాలు ఘోషిస్తున్నాయో లెక్కలేదు. అందుకే ఇక ఆలస్యం చేయకుండా..

సఙ్కల్పం తీసుకుందాం శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రం గురించి తెలుసుకునేందుకు.

సఙ్కల్పం ఎందుకు చెప్పుకోవాలి?

ఒక పని చేయాలంటే లేదా ఒక కోరిక ఉంటే దాన్ని తీర్చుకోవాలంటే ముందు మనకు ఏమి కావాలి అన్నది ప్రశ్న. దానికి మనకు స్పష్టత ఉండాలి. ఏమి కావాలి? ఎందుకు కావాలి? అవసరమా? నిజంగా అవసరమా? అది లేకుండా మనం ఉండలేమా? దాని ఆవశ్యకత ఏమిటి? వీటన్నిటికీ మనకు మనం సమాధానం ఇచ్చుకోగలగాలి. అప్పుడు మనం ఆవశ్యకమైన వాటి నుండి అనావశ్యకమైనవి వేరు చేసి, ఏరకమైన దృష్టి మళ్ళింపుడు వ్యవహారాలకు లోబడకుండా చేయాల్సిన దాన్ని చేస్తాము.

అందుకు మనకు కావలసినది సఙ్కల్ప బలం. ఈ సఙ్కల్పం అనేది కోరికలు పెట్టుకుని చేసే సందర్భాలలోనే కాదు, కోరికలు లేకుండా కేవల నామస్మరణ కోసం మాత్రమే చేసేప్పుడు కూడా చెప్పుకోవటం మంచిది. విశేషించి, ఆ విశ్వశక్తికి మన particular frame of reference గురించిన సమాచారం ఇవ్వటం. ఇక్కడ నేను మన సఙ్కల్పం లో చెప్పుకునే ప్రదేశాల గురించి చెప్పటం లేదు. కానీ అవన్నీ అన్వయమౌతాయి.

అలా ఆ frame of reference కు సంబంధించిన సమాచారం పలికి, ఆ విశ్వశక్తికి మనను మనం అనుసంధానం చేసుకుంటే ఆ శక్తి తాలూకు కంపనాలు మనలోనూ చోటుచేసుకుని మనను ఆ శక్తిని మనలోకి ఆహ్వానించేందుకు సమాయత్తం చేస్తాయి. ఆ క్షణంలో, ఆ సందర్భంలో మన శరీరం ఎంత వరకు భరాయించగలదో అంతవరకు ఆ విశ్వ శక్తి నిలిచి ఉండేలా మన సఙ్కల్ప మన్త్రము (మననాత్ త్రాయతే..) మనకు సహాయం చేస్తుంది.

ఆ శక్తిని access చేసేందుకు మనం మన మనోవాక్కాయాలను సమాయత్తం చేసుకునేందుకు వాడేవే అఙ్గన్యాస కరన్యాసాలు.

అస్య శ్రీ విష్ణోర్దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య।

శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషిః।

అనుష్టుప్ ఛందః।

శ్రీమహావిష్ణుః పరమాత్మా శ్రీమన్నారాయణో దేవతా।

అమృతాంశూద్భవో భానురితి బీజమ్।

దేవకీనందనః స్రష్టేతి శక్తిః।

ఉద్భవః, క్షోభణో దేవ ఇతి పరమోమంత్రః।

శంఖభృన్నందకీ చక్రీతి కీలకమ్।

శార్ంగధన్వా గదాధర ఇత్యస్త్రమ్।

రథాంగపాణి రక్షోభ్య ఇతి నేత్రమ్।

త్రిసామాసామగః సామేతి కవచమ్।

ఆనందం పరబ్రహ్మేతి యోనిః।

ఋతుస్సుదర్శనః కాల ఇతి దిగ్బంధః॥

శ్రీవిశ్వరూప ఇతి ధ్యానమ్।

శ్రీ మహావిష్ణు ప్రీత్యర్థే సహస్రనామ జపే వినియోగః

కరన్యాసః

విశ్వం విష్ణుర్వషట్కార ఇత్యంగుష్ఠాభ్యాం నమః

అమృతాం శూద్భవో భానురితి తర్జనీభ్యాం నమః

బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మేతి మధ్యమాభ్యాం నమః

సువర్ణబిందు రక్షోభ్య ఇతి అనామికాభ్యాం నమః

నిమిషోஉనిమిషః స్రగ్వీతి కనిష్ఠికాభ్యాం నమః

రథాంగపాణి రక్షోభ్య ఇతి కరతల కరపృష్ఠాభ్యాం నమః

అంగన్యాసః

సువ్రతః సుముఖః సూక్ష్మ ఇతి ఙ్ఞానాయ హృదయాయ నమః

సహస్రమూర్తిః విశ్వాత్మా ఇతి ఐశ్వర్యాయ శిరసే స్వాహా

సహస్రార్చిః సప్తజిహ్వ ఇతి శక్త్యై శిఖాయై వషట్

త్రిసామా సామగస్సామేతి బలాయ కవచాయ హుం

రథాంగపాణి రక్షోభ్య ఇతి నేత్రాభ్యాం వౌషట్

శార్ఙ్గ ధన్వా గదాధర ఇతి వీర్యాయ అస్త్రాయఫట్

ఋతుః సుదర్శనః కాల ఇతి దిగ్భంధః

దీని ద్వారా physics laboratory లో మన equipment ను calibrate చేసుకున్నట్లుగా మన మనోవాక్కాయాలు కూడా శుద్ధమై ఆ దైవీ శక్తి (విశ్వ శక్తి) మనలో ప్రవేశించేందుకు సన్నద్ధం చేయబడతాము.

ఇదే దర్పణం.

ఒక దర్పణం లేదా అద్దంలోకి ఒకసారి చూస్తే మనమేంటనేది మనకు తెలుస్తుంది. రూప వికారాలు మొదలైనవి. మనస్సనే అద్దంలోకి తొంగి చూసుకుంటే మన మనస్సు గురించి తెలుస్తుంది. అట్లాగే మన అంతఃచేతనం లోకి తొంగి చూసుకుంటే, ఆత్మను దర్పణంగా వాడుకోగలిగితే మనలో ఉన్న విశ్వశక్తి మనకు దర్శనమిస్తుంది.

ఇక్కడ కొన్ని విషయాలను, విశేషాలను తెలుసుకోగలిగితే, అప్పుడు మనం శ్రీవిష్ణు సహస్రనామాలను స్మరిస్తూ వాటి శబ్దార్థాలనే కాక త్రిమతాచార్యులు అందించిన భాష్యాలను నేర్చుకునవచ్చు.

దానికి ముందు శ్రీవిష్ణు సహస్రనామాల గురించి, ఈ స్తోత్రం యొక్క ప్రత్యేకత గురించీ చూడాలి.

లుక్! ధాతువే.

(సశేషం)

Exit mobile version