[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]
ధృవానీతిర్మతిర్మమ
॥శ్రీభగవానువాచ॥
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన।
మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోఽస్త్వకర్మణి।। 2.47।।
కర్మణి, ఏవ, అధికారః, తే, మా, ఫలేషు, కదాచన మా, కర్మ-ఫల, హేతుః, భూః, మా, తే, సంగః, అస్త, అకర్మణి
చేయవలసిన కర్మ (పని) మీద నీకు బాధ్యత/అధికారం ఉన్నాయి. కానీ, ఫలితం మీద లేవు. హక్కు అసలే లేదు. కర్మఫలానికి, మనకు ఏ విధమైన సంబంధం లేదు.
సంకల్ప కల్పము
ఋషి – వేదవ్యాసుడు
ఛందస్సు – “అనుష్టుప్”
మంత్రాధిష్టాన దైవము – శ్రీమన్నారాయణుడు
బీజము – అమృతాం శూద్భవః భానుః
శక్తి – దేవకీ నందనః స్రష్టా
మంత్రము – ఉద్భవః క్షోభణః దేవః
కీలకము – శంఖభృత్ నందకీ చక్రీ
అస్త్రము – శార్ఙ్గధన్వా గదాధరః
నేత్రము – రథాంగపాణి రక్షోభ్యః
కవచము – త్రిసామా సామగః సామః
యోని – ఆనందం పరబ్రహ్మ
దిగ్బంధము – ఋతుః సుదర్శనః కాలః
ధ్యానము చేయవలసిన దేవుడు – విశ్వరూపమున దర్శనమీయగల, ఇచ్చే విష్ణువు
చేసే పని (కర్మ) – సహస్రనామ జపము
కారణము – శ్రీమహావిష్ణువు ప్రీతి కొరకు
శ్రీమహావిష్ణు ప్రీత్యర్థే
ఎందుకు?
మనం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవలసిన విషయం సఙ్కల్పంలోనే కాదు, ఏ రకంగా చెప్పాలన్నా, ఈ సహస్రనామ జపం చేయాలన్నా, సాధన చేయాలన్నా అది కేవలం శ్రీమహావిష్ణు ప్రీత్యర్థమే.
భౌతిక, ఆధ్యాత్మిక కారణాల కోసం చేయవచ్చు అని పెద్దలు చెప్తారు. విఙ్ఞులూ అదే చెప్పారు. జనులూ అదే అనుకుంటున్నారు. కానీ ఇక్కడో చిన్న సూక్ష్మాన్ని గ్రహించాలి.
శివకేశవ మౌలిక భేదం. అంటే వారి వారి తత్వాలలో.
ఆ సూక్ష్మాన్ని సంపూర్ణంగా పరిశీలించే ముందు..
ఒకసారి కాలంలో కొన్ని మన్వన్తరాలు వెనక్కు ప్రయాణిద్దాం..!
అందులో మొదటి మజిలీ దాదాపు 5100 సంవత్సరాల క్రితం.
నాన్ముకనై నారాయణన్ పడైత్తాన్ నాన్ముకమామ్ తాన్ముకమాయ్ చంగరనై తాన్ పడైత్తాన్
నారాయణుడు నాలుగు ముఖములు కలిగిన వాడిని సృష్టించెను. ఆయన్నే బ్రహ్మ అందురు. ఆ చతుర్ముఖ బ్రహ్మ తానే స్వయముగా శంకరుని సృష్టించెను అని పెద్దల వాక్కు. ఆ శంకరునికే రుద్రుడని పేరు. ఎందుకంటే, పుట్టగానే పెద్దగా రోదించాడట. మనిషి పుట్టగానే ఏడుస్తాడు. అలా మనిషికి ఈయనకు గొప్ప సంబంధమున్నది.
ఆ శంకరుడు స్వయంగా భూమి మీద నివశించే ఏకైక దేవుడు.
అన్నీ ఇవ్వగలిగీ, అన్నీ పరిత్యజించిన వాడు. ఊంఛ వృత్తి ద్వారా యోగులు జీవనం సాగిస్తారు. అది విధి. అంటే విధింపబడినది. ఆ విధింపబడిన దానిని ఆచరించి చూపిస్తాడు. ఆది భిక్షువు. నిరంతర రామ నామ స్మరణ గావిస్తాడు. భక్తులకు సులభోపాయంగా తారక మంత్రాన్ని అందించాడు.
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే।
సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాననే॥
అంతేనా? హనుమగా ఆ శ్రీరామ చంద్రుని సేవించుకుని భగవదారాధన ఎలా చేయాలో చెప్పాడు అని అవాల్మీకమైన పెద్దల వాక్కు.
భక్త సులభుడు. ఆశ్రితజన రక్షకుడు.
పిలిస్తే పలుకుతాడు. ఎపుడెపుడు పిలుస్తారని ఎదురు చూస్తుంటాడేమో కూడా.
ఈయనకు శివుడని మరొక పేరు. అంటే మంగళప్రదుడు. శ్మశాన నివాసి. ప్రమథ గణాలను అదుపులో పెట్టుకున్న వాడు. నంది యనిన ఎద్దును వాహనంగా చేసుకున్న వాడు. ఎడ్ల బండ్లు తెలుసుగా. మనుషులకు ఉదాహరణగా నిలిచాడు. పశు పక్ష్యాదులకు ప్రాణ సమానుడు. పశుపతి.
శక్తికి అధిపతి. కండలు తిరిగిన దేహం కలవాడు. పుష్టిగా ఉండమని మానవులకు ఆచరించి చూపిన వాడు. ఎవరన్నా ఒక మాట అంటే కస్సున లేచొస్తుంది కోపం మనకు. ఆయనకూ అంతే. భళ్ళున చల్లారుతాడు. కరుణిస్తాడు. దీనికి ఉదాహరణ మనకు కూతవేటు దూరంలో కలియుగ ప్రారంభంలో జరిగిన చరిత్ర.
తనను మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం. అడిగిన వారందరకు కోరిన వరాలిస్తాడు. ఇరుకున పడతాడు. ఇదీ మనకు ఉదాహరణే. బాబూ, ఇలా చేయకండి అని.
ఒకనాడు శివుడు పార్వతితో కలసి తన వాహనమైన వృషభముపై ఆకాశములో వెళ్ళు చుండెను. అప్పుడు వారి నీడ ఒక వ్యక్తి పైన పడబోతుండగా ఆయన ప్రక్కకు జరిగాడు. అది గమనించిన పార్వతి రుద్రునితో మనము అతనిని కలవాలని కోరినది. మహా జ్ఞాని, శ్రీమన్నారాయణుని భక్తుడైన అతను మనను నిర్లక్ష్యము చేయును అని రుద్రుడు బదులిచ్చాడు. దీనిలో ఒక గొప్ప ధర్మ సూక్ష్మముంది. రుద్రో బహుశిరా అన్న నామముల దగ్గర మనకు విశదమౌతుంది.
రుద్రుడు వారించినా పార్వతి క్రిందికి వెళ్ళి అతనిని తప్పక కలవాలని పట్టుబట్టింది. అర్థాంగి అడిగాక అంగీకరించక తప్పదు ఎవరికైనా. చేసేదేమి లేక సరేనని నందిని క్రిందకు దిగమని ఆజ్ఞాపించగా అతను వినయంతో ఆ ఆదేశాన్ని పాటించాడు.
ఆ వ్యక్తి వారి రాకను కనీసము చూడనైనా చూడ లేదు.
రుద్రుడు – “మేము మీ ముందర ఉన్నప్పటికినీ మీరు మమ్మల్ని నిర్లక్ష్యము చేయుచున్నారు?”
ఆ వ్యక్తి – “నాకు మీతో చేయవలసిన పనేమీ లేదు.”
రుద్రుడు – “మేము మీకు వరము ఇవ్వదలచితిమి.”
ఆ వ్యక్తి – “నాకు మీ నుండి ఏమియూ అవసరము లేదు.”
రుద్రుడు – “నా వరము వృథాగా పోదు మీ కోరిక ఏమిటో చెప్పండి.”
ఆ వ్యక్తి – “పోయినచో?”
శంకరునికి కోపం వచ్చింది. పార్వతి నొచ్చుకోవటం కూడా గమనించాడు. అయినా ఆ భావనను పైకి వ్యక్తం చేయకుండా..
రుద్రుడు – పోదు.
ఆ వ్యక్తి – అటుపైన నాకీ క్షణమున మోక్షమునిమ్ము.
రుద్రుడు – “నాకు ఆ అధికారము లేదు కేవలం శ్రీమన్నారాయణుడు మాత్రమే ప్రసాదించును.”
ఆ వ్యక్తి – “ఎవరి మరణమునైనా నిలిపివేయగలరా?”
రుద్రుడు- “అది వారి కర్మానుగతము. దానిపై నాకు అధికారము లేదు”. (మార్కణ్డేయుని వృత్తాంతము? ఇక్కడ కూడా ధర్మ సూక్ష్మాన్ని పరిశీలించాలి. ముందు ముందు చూస్తాము)
ఆ వ్యక్తి – “కనీసము ఈ సూదిలో దారమునైన ఎక్కించగలరా?”
ఆ వ్యక్తి చేస్తున్న పని మీద నుంచీ ధ్యాస మరల్చలేదు. శంకరునికి ఇక కోపమాగలేదు. పార్వతి ఆశ్చర్యముగా చూస్తోంది.
రుద్రుడు – “నిన్ను కామదేవుని వలె కాల్చివేయుదును.”
శివుడు తన మూడవ నేత్రమును తెరచి అగ్నిని విడుదల చేసెను. ఆ వ్యక్తి కూడా తన కుడికాలి బొటన వేలు ముందు భాగమున ఉన్న మూడవ నేత్రము నుండి అగ్ని శిఖలను ఏకధాటిగా విడుదల చేశాడు.
ఉష్ణం ఉష్ణేన శీతలమ్!
రుద్రుడు ఆ అగ్ని కీలల నుండి వచ్చే వేడిని తట్టుకోలేక రామనామ స్మరణ చేయగా కాస్త ఉపశమనం లభించింది. కానీ అటు శంకరుని త్రి నేత్ర జ్వాలలు కానీ, ఇటు ఈ వ్యక్తి కుడి కాలి బొటనవేలు నుంచీ పుడుతున్న అగ్ని శిఖలు కానీ ఆగటం లేదు.
దేవతలు, ఋషులు మొదలగువారు శ్రీమన్నారాయణుని ఆ ప్రళయమును ఆపమని అర్థించారు. శ్రీమన్నారాయణుడు వెంటనే పర్జన్యుని పెద్ద వర్షమును కురిపించమని ఆఙ్ఞాపించెను. కాని అతడు తమకు ఆ వ్యక్తి పంపుతున్న అగ్నిని ఆపే శక్తి లేదనగా శ్రీమన్నారాయణుడు వరుణుడికి ఆ శక్తిని ప్రసాదించెను.
ఒక పెద్ద వరద ఆ అగ్నిని అణిచి వేయుటకు బయలుదేరింది. ఆ వ్యక్తి ఎలాంటి కలత చెందక శ్రీమన్నారాయణుని ధ్యానమును చేస్తూనే ఉన్నాడు. రుద్రుడు ఆ వ్యక్తి నిష్ఠకు, శ్రీమహావిష్ణువు పైన ఉన్న నిశ్చలమైన భక్తికి ముగ్దుడై అతనికి “భక్తిసార” అని బిరుదును ఇచ్చి, అతడిని కీర్తిస్తూ తన భార్యతో ‘దుర్వాసుడు అమ్బరీశుడికి చేసిన అపచారమునకు ఏ విధముగా ఆ ఋషి శిక్షించబడెనో వివరించి చివరకు దీనివలన భాగవతులు ఎప్పటికినీ అపజయమును పొందరు” అని తమ ప్రదేశమునకు వెళ్ళిపోయిరి.
విశ్వేశ్వరమజం దేవం జగతః ప్రభుమవ్యయమ్।
భజంతి యే పుష్కరాక్షం న తే యాంతి పరాభవమ్॥
నారాయణుని నిజభక్తులకు కోర్కెలు ఉండవు. ఉన్నవి ఏదోక రూపంలో నెరవేరుతాయి. అది నారాయణుని ద్వారా అయినా, వేరొక రూపమున అయినా.
దీనికి భాగవతములో మరో దృష్టాంతము నిదర్శనంగా ఉంది.
ఆరు మన్వన్తరాల క్రితం జరిగింది.
నేటికీ మనకు ఆదర్శమైనది. వినండి. తెలిసిన కథే అనిపిస్తుంది కానీ, తెలుసుకోవలసినది చాలా ఉంది.
స్వాయంభువ మనువు.
ఆయనకు శతరూప అనే భార్య.
ఆమె క్షేత్రంగా ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అని ఇద్దరు కుమారులు కలిగారు. వారిలో ఉత్తానపాదుని కథే ఇక్కడ మనం చూడబోయేది.
సునీతి, సురుచి ఆయన భార్యలు. పెద్ద భార్య సునీతి కొడుకు ధృవుడు. చిన్న భార్య సురుచి కొడుకు పేరు ఉత్తముడు. ఉత్తాపాదునికి చిన్న భార్య సురుచి మీద మిక్కిలి ప్రేమ. దానితో పెద్ద భార్యను సరిగ్గా పట్టించుకొనేవాడు కాదు.
ఒకనాడు ఉత్తానపాదుడు ఉత్తముడిని తన ఒడిలో కూర్చుండబెట్టుకొని ఆడిస్తున్నాడు. అప్పుడు ధృవుడికి కూడా తన తండ్రి తొడలపై కూర్చోవాలని కోర్కె కలిగింది. దాంతో దానిని తీర్చుకునేందుకు ప్రయత్నంగా తండ్రి వద్దకు వెళ్ళి ఒడిలో కూర్చోబోయాడు. కాని తండ్రి దగ్గరకు తీసుకోలేదు.
అప్పుడు సురుచి గర్వంగా సవతి కొడుకును చూచి ఇలా అన్నది. “నా కడుపున పుట్టినవాడే తండ్రి ఒడిలో కూర్చునే అర్హుడు. వేరొకరి గర్భాన పుట్టిన నీకు ఆ అదృష్టం లేదు. చేతనైతే నీవు శ్రీమహావిష్ణువును ప్రార్థించి నా కడుపున పుట్టేటట్లు కోరుకో. అప్పుడు నీ కోరిక నెరవేరుతుంది.”
రెక్క పట్టుకుని ఆ పసికందుని ఈడ్చివేసింది. ఉత్తానపాదుడు నిర్లిప్తంగా చూస్తూ ఉన్నాడు తప్ప వారించలేదు. దానికి కారణం ఉంది.
ఒకప్రక్క తన కోరిక నెరవేరలేదు. మరొకప్రక్క పినతల్లి సురుచి చేసిన అవమానం. వీటి పైన తండ్రి చూపిన ఉదాసీనత!
బాలుడైన ధృవుడు భరించలేకపోయాడు. కళ్ళలో దివిజ గంగ ఉప్పొంగుతోందా అన్నట్లు నీరు రెప్పల చెలియలకట్టలు దాటాలనే ప్రయత్నం.
సురుచి మాటలు మాటలు మనస్సుకు గుచ్చుకున్నాయి. బిగ్గరగా రోదిస్తూ కన్నతల్లి దగ్గరకు వెళ్లాడు. ఆమె కుమారుని బుజ్జగించి విషయం తెలుసుకుంది. సవతి మాటలకు ఆమె కూడా కుమిలి పోయింది. తరువాత కుమారునితో ఇలా అన్నది. “కుమారా! ఆగ్రహం వలదు. ఏడవకు. అది క్షత్రియ పుత్రుని లక్షణం కాదు. పూర్వజన్మలో చేసిన పాపం మనం అనుభవించక తప్పదు. మీ తండ్రిగారు నన్ను దాసీలాగ కూడ చూడటం లేదు. నీ సవతి తల్లి చెప్పినట్లు ఏ దిక్కు లేనివానికి ఆ శ్రీహరియే దిక్కు. మీ తాతగారైన స్వాయంభువ మనువు వలె ఆ దేవదేవుని పాదాలను ఆశ్రయించు. నీ కోరికలన్నీ నెరవేరుతాయి. అంత గొప్ప సూచన చేసినందుకు నీ పినతల్లికి కృతఙ్ఞతలు తెలుపుకో.”
తల్లి మాటలు విన్న ధృవుడు తన మనస్సు గట్టిపరచుకొని రాజధాని నగరం వీడాడు. అక్కడి నుండి బయటకు ఉత్తర దిశగా అడవులలోకి నడిచాడు.
అక్కడ శ్రీహరి ఈ విషయాన్ని గ్రహించాడు. లీలామానుష విగ్రహుడైన ఆయన నారదుని తలచాడు. నారదుడు ఆ దేవదేవుని చెంత చేరాడు సభక్తిపూర్వక వినయాఞ్జలి ఘటిస్తూ.
శ్రీహరి ఆజ్ఞ మేరకు నారద మహర్షి ధృవుని వద్దకు చేరాడు. ఆప్యాయంగా పలకరించాడు. విషయం నోటి ద్వారా విన్నాడు. ఆతని కోరికలో సామంజసాన్ని గ్రహించాడు.
అన్నాడు, “కుమారా! మానవులకు సుఖదుఃఖాలు దైవసంకల్పం వల్లనే కలుగుతాయి. మీ తల్లి చెప్పిన యోగమార్గం అతి కఠినమైనది. నీవు ఆటపాటలతో కాలం గడపాల్సిన పసివాడివి. ఈ ప్రయత్నం విరమించుకో. మోక్షం మీద కోరిక ఉంటే ముసలితనంలో ప్రయత్నించ వచ్చు.”
ధృవుడు వినలేదు. అతని సఙ్కల్పం చెక్కు చెదరనిది. (గుర్తు పెట్టుకోండి). తనకు మోక్షమే కావాలన్నాడు. నారదుడు ధృవుని ఏకోన్ముఖ దీక్షను మెచ్చాడు.
“ఆ నారాయణుడే మోక్షమార్గాన్ని పొందడానికి నిన్ను ప్రేరేపించి ఉంటాడు. దీనికి ఒక గొప్ప కారణమే ఉండి ఉంటుంది. కనుక నీవు ఆ మహానుభావుణ్ణి సేవించు. యమునా నది ఒడ్డున ఉన్న మధువనానికి వెళ్ళి స్ధిరమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించు.” అని చెప్పాడు.
వాసనాద్వాసుదేవస్య వాసితం భువనత్రయమ్।
సర్వభూతనివాసోஉసి వాసుదేవ నమోஉస్తు తే॥
‘ఓం నమో వాసుదేవాయ’ అనే వాసుదేవ ద్వాదశాక్షరీ మంత్రాన్ని ఉపదేశించాడు.
ద్వాదశాక్షరి గురించి.
అష్టాక్షరిలో నారాయణతత్త్వం ప్రకాశిస్తే వాసుదేవ మంత్రంలో సర్వవ్యాపకత్వం గూఢముగా ఉందని, దేవకి నారాయణాష్టాక్షరి అయితే యశోద వాసుదేవ ద్వాదశాక్షరీ మంత్రమని కందాడై రామానుజాచార్యులు వివరించారు. యశోద ఏ విధంగా నారాయణుడైన శ్రీకృష్ణుని తన భక్తితో రోటికి కట్టగలిగినదో మనకు తెలుసు. అదేవిధంగా ధృవుని కోర్కె త్వరగా తీరాలంటే వాసుదేవ మంత్రమే సులభోపాయమైంది ఆ క్షణాన. ద్వాదశాక్షరి.
అప్పుడు ధృవుడు నారదునకు ప్రదక్షిణం చేసి, నమస్కరించి, మధువనానికి బయలుదేరి వెళ్లాడు.
అక్కడితో నారదుని బాధ్యత తీరలేదు. ఆ మహాముని తరువాత ధృవుని తండ్రి అయిన ఉత్తానపాదుని దగ్గరకు వెళ్లాడు. ఆ రాజు చేసిన పూజలు అందుకొని, ఉన్నతాసనం పైన కూర్చొన్న తరువాత, “ఉత్తానపాదా! నీ మొహం వాడిపోయి ఉంది. నీ విచారానికి కారణం ఏమిటి?” అని అడిగాడు. ఏమీ తెలియనట్లు.
అందుకు ఉత్తానపాదుడు “నా అయిదేండ్ల కుమారుని నేను అవమానించాను. అందుకు వాడు అలిగి, తల్లితో పాటు వెళ్ళిపోయాడు. వాడు ఏమైనాడో అనే బాధతో దుఃఖిస్తున్నాను. నా చిన్న భార్య మీద ప్రేమతో ఈ దుర్మార్గపు పని చేసాను.”
అప్పుడు నారదుడు “మహారాజా! నీ కుమారుణ్ణి నారాయణుడు రక్షించాడు. ధృవుడు శ్రీమహావిష్ణువు సంరక్షణలో ఉన్నాడు. ఆయనను సేవించి సమస్త దిక్పాలకులూ పొందలేని నిత్యపదాన్ని వరంగా పొందుతాడు. తొందరలోనే నీ దగ్గరకు వస్తాడు. నీ కీర్తిని కల్పాంతం వరకూ ఉండేటట్లు చేస్తాడు.” అని చెప్పి నిష్క్రమించాడు.
నారదుడు ఎక్కడా క్షణమొక్కువా, క్షణం తక్కువా ఉండడు. ఎక్కడా తచ్చాడడు. నిరంతర నారాయణ నామ స్మరణ చేస్తుంటాడు. ఆ శ్రీమన్నారాయణుడు ఎప్పుడు ఏ కార్యమునకు తనను నియోగిస్తాడో అని ఎదురు చూస్తుంటాడు. దానికి అతను ఎంచుకున్న మార్గం సంచారం. ఒకచోట చేరగిలపడి ఉండకుండా ఎల్లప్పుడూ కదులుతూనే ఉంటాడు. దానికి కారణం కూడా ఉంది.
Narada is a master of kinetic energy. He is the external force that compels any body and anybody into action. He is the equivalent of the so-called Newton’s First Law of Motion. He always sets into motion the situations that leads to great events. Like the birth of Lord Narasimha. Damodara. And now Dhruva the polestar.
చూడండి. అటు ప్రహ్లాదుడైనా, ఇటు ధృవుడైనా, మధ్యలో కువేరుని సంతానమైన మణిగ్రీవ నలకూవరులైనా ఆయన వల్లే సంస్కరింపబడ్డారు. Means, the culmination of their lives were set into motion by Narada the external force.
ధృవుడు మధువనంలో ప్రవేశించాడు. యమునా నదిలో స్నానం చేసాడు. రామానుజుల వారు యామునుల వారి అనుగ్రహం పొందటం ఇక్కడ గుర్తుచేసుకోండి. బాదరాయణ సంబంధం. జాగ్రత్తగా పరిశీలిస్తే చాలా విశేషాలు తెలుస్తాయి. అన్నీ చెప్పలేము. అవసరమూ లేదు. గ్రహించాలి.
ఏకాగ్ర దృష్టితో సకల సృష్టికి కారణమైన భగవంతుని ధ్యానించాడు. నియమంతో, ఒంటి కాలిపై నిలబడి, తన శ్వాసను కూడా బంధించి పరమేశ్వరునితో అనుసంధానం చేసాడు. ఈ విధంగా శ్వాసను నిరోధించడం వల్ల శ్రీహరియే కంపించాడు. ఆయన కంపించగానే లోకాలన్నీ ప్రకంపించాయి. ఈ విపత్తును గ్రహించిన దిక్పాలకులు ఆపదను తొలగించమని లోకరక్షకుడైన విష్ణుమూర్తిని ప్రార్థించారు. వారికి అభయమిచ్చి ధృవుని వృత్తాంతం తెలిపాడు శ్రీహరి.
ఆ తరువాత ఆ శ్రీమన్నారాయణుడు తన గరుడవాహన మెక్కి మధువనానికి వెళ్ళాడు.
ధృవుడు తన ముందు సాక్షాత్కరించిన కరుణామూర్తిని చూడగానే అతని మనస్సులోని రూపం మాయమయ్యింది. స్వామిని చూసి పులకించాడు. సాష్టాంగ నమస్కారం చేసాడు. భగవంతుని ఎలా స్తుతించాలో తెలియక తడబడుతూ నిలబడ్డాడు.
ఇక్కడ మన ప్రయత్నమే ముఖ్యం. పెరియాళ్వార్ కూడా నాకు ఏమీ తెలియదనే నిలచున్నాడు. కానీ, నీవే చేయాలని చేయించాడు ఆ శ్రీహరి. తిరుప్పల్లాండు వచ్చింది.
ఆ ధృవుని ఆలోచన గ్రహించిన పద్మనాభుడు తన చేతి శంఖంతో ఆ బాలుని చెక్కిలి తాకాడు. భగవంతుడు ప్రసాదించిన వాక్ శక్తి వలన సుజ్ఞాని అయిన ధృవుడు పలు విధాల ఈశ్వరుణ్ణి స్తుతించాడు. ఇక్కడ ధృవుడు తన పినతల్లిని దూషించకపోవటం అన్నది ప్రధానపాత్ర పోషించింది. దూషణ మన స్వరాన్ని, జిహ్వను అపవిత్రం చేస్తుంది. ధృవుడి విషయంలో అతడి తల్లి సంస్కారం ఉపయోగించింది.
భగవంతుడు మనస్సులో సంతోషించి ఇలా అన్నాడు. “రాకుమారా, నీ వ్రత దీక్షకు మెచ్చాను. నీ అభిప్రాయాన్ని గ్రహించాను. నీ కోరిక తప్పక తీరుతుంది. గ్రహాలూ, నక్షత్రాలూ, తారా గణాలు, సప్తర్షి మండలమూ, జ్యోతిశ్చక్రమూ దేనిని ప్రదక్షిణ చేస్తుంటారో అటువంటి ‘ధ్రువక్షితి’ అనే మహోన్నతమైన స్థానాన్ని అరవై ఆరు వేల సంవత్సరాల తరువాత నీవు పొందుతావు. ఇదివరకు ఎవ్వరూ దానిని పొందలేదు. మూడు లోకాలు నశించేటప్పుడు కూడా అది నశింపక ప్రకాశిస్తూ ఉంటుంది. అంత వరకు నీ తండ్రి రాజ్యాన్ని ధర్మ మార్గాన పరిపాలిస్తావు.” అని అతడు చూస్తుండగానే నారాయణుడు అంతర్ధాన మయ్యాడు.
ధృవస్థానము, ధృవుడు.
Centripetal (centripetal force is a net force that acts on an object to keep it moving along a circular path) and centrifugal force (Centrifugal force is the apparent outward force on a mass when it is rotated) of the known universe. And a master of the cycle of time.
ఒక వంక ధృవుడు మోక్షం కోరుకున్నా, అతని చిన్న కోరిక తండ్రి ఒడిలో కూర్చుని ఆడుకొనటం. ఆ విషయం అటు ధృవుడూ అడగలేదు. ఇటు విష్ణవూ ఎత్త లేదు.
పెక్కు జన్మలెత్తినా కూడా పొందలేని స్థానాన్ని పొంది కూడా తన చిన్న కోర్కె సిద్ధించలేదని అప్పుడు ధృవుడు భావించాడు. మనిషి జీవితం ఇంతే! మోక్షం లభిస్తున్నా, జన్మవాసనలు అంత త్వరగా పోవు.
అయినా గురువాయూరప్పన్ నారాయణ భట్టాతిరికి చెప్పినట్లు, తననే నమ్ముకుని నిరంతరం తన స్మరణ చేసేవారి తప్పులను కూడా తానే నశింపజేసి వారికి మోక్షాన్నిస్తానన్నట్లుగా..
శ్రీహరి అనుగ్రహం అందుకొని కన్న కుమారుడు తిరిగి వస్తున్నాడని చారుల వల్ల తెలుసుకున్న ఉత్తానపాదుడు బంధు మిత్రులతో, మంత్రులతో, ఇద్దరు భార్యలతో బంగారు పల్లకీలు ఎక్కి వెళ్ళి దృవుని కలుసుకున్నాడు. భగవంతుని కరుణాకటాక్షాలు పొందిన తన కుమారుడిని ప్రేమతో కౌగలించుకుని మైమరచి పోయాడు. ఎత్తుకుని భుజాన వేసుకుని రాజధాని దాక నడిచాడు.
గమనించండి. ధృవుని కోర్కె కేవలం తండ్రి ఒడిలో ఆడుకోవటం. అది కూడా కాసేపు. కానీ శ్రీహరి అనుగ్రహం వల్ల అతనికి ఆడుకోవటం కాదు. తండ్రి ఆలింగనం లభించింది. ఆయనే స్వయంగా భుజానెక్కించుకుని రాజధానికి నడిచాడు. అది కాక ధృవస్థానం లభించనే లభించింది.
అదే శ్రీహరి అనుగ్రహానికి, శంకరుని అనుగ్రహానికి తేడా. శంకరుడు అడిగింది ఇస్తాడు. శ్రీహరి అర్హత ఉన్నదంతా ఇస్తాడు.
వినయంతో ధ్రువుడు తల్లులిద్దరికీ భక్తితో నమస్కరించాడు. పినతల్లి సురుచి కూడా ఆనందంతో ‘చిరంజీవ’ అని ఆశీర్వదించింది. అంతకన్నా కావలసినదేముంది?
భగవంతుని దయకు పాత్రుడైన వానిని అందరూ అనుకూలభావంతో చూస్తారు. వారికి శత్రువులెవరూ ఉండరు. ధ్రువుడు తమ్ముడు ఉత్తముని ప్రేమతో కౌగలించుకున్నాడు. తల్లి సునీతి ప్రేమాభిమానాలు పొంగిపొరలగా తన కొడుకును దగ్గరకు తీసుకొని వాని స్పర్శతో ఇన్నాళ్ళు తను పడిన దుఃఖాన్ని మరచిపోయింది. అప్పుడు దేవేంద్రుడు స్వర్గంలో ప్రవేశించినట్లుగా ధ్రువుడు తిరిగి రాజభవనంలో ప్రవేశించాడు.
అందుకే..
శ్రీవిష్ణు సహస్రనామ సఙ్కల్పంలో మనం అనుకోవలసినది..
శ్రీమహావిష్ణు ప్రీత్యర్థే!
అంతే!
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన।
మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోఽస్త్వకర్మణి॥
ఈ భగవద్గీతా వాక్యానికి కూడా అర్థసంపూర్ణమదే!
(సశేషం)