తమసోమా జ్యోతిర్గమయ-4

0
2

[box type=’note’ fontsize=’16’] మెడికో లీగల్ కేసులలో కొన్ని ఆసుపత్రులు ఎలా వ్యవరిస్తాయో, కొందరు మధ్యవర్తులు ఎంతగా కంగారుపెట్టి భయపెడతారో గంటి భానుమతి “తమసోమా జ్యోతిర్గమయ” ధారావాహిక నాలుగవ భాగం చెబుతుంది. [/box]

[dropcap]కొం[/dropcap]చెం దూరంగా ఓ పిట్ట గోడని ఆనుకుని వరసగా తెల్ల ప్లాస్టిక్ కుర్చీలున్నాయి నారాయణ అటువైపు వెళ్ళి, ఓ దానిలో కూచున్నాడు. సెల్ తీసి ఎవరితోనో మాట్లాడుతున్నాడు. అతనికి కూడా అంతా అయోమయంగా ఉంది. ఓ అరగంట వరకూ అక్కడే కూచున్నాడు డాక్టరు బయటికి వచ్చి ఏం చెప్తాడో అని ఆతృతగానే ఉన్నాడు.

అంతలోనే ఏదో నీడ కదిలినట్లయితే తలెత్తి చూసాడు. ఓ పాతిక ముప్పై ఏళ్ళ మనిషి ఎదురుగా నుంచున్నాడు. ఓ జీన్సు పాంటు పిల్లాడు వచ్చి నుంచున్నాడు: “ఏం కావాలన్నట్లు” తలతోనే ప్రశ్నించాడు.

“ఇప్పుడు థియేటరులో ఉన్న మనిషికి బ్లడ్ కావాల్సి వస్తుంది కదా… అది నేను తీసుకొస్తాను”.అటూ ఇటూ చూస్తూ అన్నాడు.

ఆ పిల్లాడి మాటలకి నారాయణ ఆశ్చర్యపోయాడు. చాలా కాజుయల్‌గా బాగా అలవాటున్నట్లుగా మాట్లాడాడు. అదే అతని పని అన్నట్లుగా అడిగాడు.. పైగా పొద్దున్నతాము రావడం అంతా చూసినట్లున్నాడు. అందుకే వెంటనే వచ్చాడు. ఈ హాస్పిటలు సంగతి బాగా తెలిసినట్లుగా ఉన్నాడు.

“నువ్వే ఎందుకు తేవడం…” అన్నట్లుగా, ప్రశ్నార్థకంగా చూసాడు.

“అతనికి రక్తం అవసరం, డబ్బిస్తే నేనే తెస్తాను” మరోసారి అడిగాడు.

“ఆ సంగతి మాకే తెలీదు,నీకెలా తెలుసు?”

“ఇందులో తెలీక పోవడానికేం ఉంది…. జరిగింది యాక్సిడెంటు కదా, తప్పకుండా అవసరం అవుతుంది ఆ సంగతి నాకు బాగా తెలుసు. నేనిక్కడే ఉంటాను కాబట్టి యాక్సిడెంటు అంటేనే రక్తం పోవడం, అందుకే అడిగాను. పైగా నేనే ఇక్కడ రక్తం అవసరం ఉన్న వాళ్ళందరికీ తెస్తూంటాను.”

“అంటే……”

“అంటే, ఏం లేదు,డోనర్లని తీసుకొస్తాను.”

నారాయణ ఆశ్చర్యంగా ఆ అబ్బాయిని చూసాడు, ఎన్నో రోజులనుంచి ఆ వ్యాపారం చేస్తున్నట్లుగా, నేను తెస్తాను అని ఎంతో కాన్ఫిడెంటుగా అనేసాడు.

“మరి గ్రూపు అదీ ఏం తెలీదుగా, ఏ గ్రూపు డోనర్లని నువ్వు తెస్తావు….”

“అన్నీ గ్రూపుల వాళ్ళూ రెడీగా ఉంటారు. వాళ్ళకి రానుపోను చార్జీలూ, ఓ రోజు హోటల్లో ఉండడానికి అరేంజ్‌మెంట్, డబ్బుఅదీ ఇచ్చేస్తే చాలు.”

“ఇక్కడ వీళ్ళు పెట్టుకుంటారేమో.. నువ్వు తేవడం ఎందుకూ….”

“వీళ్ళు పెట్టుకోరు. ఎప్పటికప్పుడు ఎవరికి అవసరం అయితే వాళ్ళకి, నేనే తెస్తాను.”

 “సరే…. నేను కనుకుంటాను. డాక్టరుగారు బయటికి వచ్చాక చెప్తారు, అప్పుడు నేను తెస్తాను.ఈ బాంక్ ఎక్కడుందో చెప్పు……..”

“మీకెందుకు సార్ ఈ శ్రమ. బ్లడ్ సాంపుల్ తీసుకుని ఉంటారు. ఇప్పుడు గ్రూపు తెలిసిపోతుంది. గ్రూపు నేను కనుక్కుని ఎన్ని యూనిట్‌లు కావాలంటారో అడిగి తెస్తాను. అయినా ఆ బాంక్ దగ్గర్లో లేదు. చాలా దూరం. మీరు వెళ్లడం కష్టం. ఎలాగూ నలుగురికి కావాలి వాళ్ళ కోసం తెస్తున్నాను. మీక్కూడా తేవచ్చని, అనుకున్నాను. అందుకని అడిగాను”.

“కానీ డాక్టరుగారు ఏంచెప్పలేదు. అయినా కనుకుంటాను..” అని అన్నాడు. రాధని, ప్రశాంత్‌ని కూడా అడుగుదామని మనసులో ఉంది.

“ఇప్పుడు యాక్సిడెంటు అయిన అబ్బాయి కదా.. స్పహలో లేడు… హెడ్ ఇంజ్యూరీ… రక్తం చాలా పోయి ఉంటుంది. ఎలాగూ రక్తం ఎక్కించాల్సిందే. అది నేను తెస్తాను. ఓ అరగంటలో చెప్పండి. ఈ రిసెప్షన్‌లో ఎవరుంటే వాళ్ళకి చెప్తే వాళ్ళు నాకు చెప్తారు. డబ్బు కూడా అక్కడ ఇచ్చేయండి” అని వెళ్ళి పోయాడు.

నారాయణ రాధ దగ్గరికి వెళ్ళి,అదే సంగతి ఆమెకి చెప్పాడు.

“అలాగా… అయితే…. ఆ అబ్బాయి తెస్తానంటే మంచిదే, తెప్పించేద్దాం. ఇప్పుడు మనం ఆ రక్తం కోసం ఎక్కడికి వెళ్తాం. నేను డబ్బు తెస్తాను. అక్కడ రిసెప్షన్‌లో ఇచ్చేసేయ్యి..” అంటూ లేచింది.

“అరేరే.. నా హాండ్ బాగ్ నీ కార్లో ఉండిపోయింది… డబ్బు ఎలా……” అని అంది.

“ఈ అబ్బాయి మాటలు పక్కన పెడ్దాం. అసలు డాక్టరు ఏం అంటారో విన్నాక తెప్పిద్దాం. ఇప్పుడే వద్దు” అని నారాయణ మళ్ళీ తను కూచున్న చోటుకి వెళ్ళి అదే కుర్చీలో కూచున్నాడు. తన సెల్ తీసుకుని ఎవరితోనో మాట్లాడుతూంటే ఏదో నీడ కదులుతున్నట్లుగా అనిపించింది. మాట్లాడుతూనే తల ఎత్తి చూసాడు.

ఓ సిస్టర్ వచ్చి, నారాయణ ముందు నుంచుంది. సెల్‌లో ఇంటికి మాట్లాడతున్న వాడల్లా ఆమెకేసి చూస్తూనే సెల్‌ని ఆఫ్ చేసి, జేబులో ఉంచాడు.

“మీరు డిపాజిట్ కట్టాలి……..”

అప్పుడు గుర్తొచ్చింది. ప్రైవేటు ఆసుపత్రుల్లో డిపాజిట్ కట్టాలన్న సంగతి. అలాగే అన్నట్లు తల ఊపాడు.

“ఎంత…….?”

“ముందు, ఐదు వేలు…”

అంత డబ్బు తన దగ్గర లేదు. ఫోను రాగానే బయల్దేరి వచ్చేసాడు. బాంకుకి వెళ్ళి తీసుకురావాలి.. ముందు ఇంటికి వెళ్ళాలి.. కార్డు తీసుకోవాలి. ఒక వేళ రాధ దగ్గరి కెళ్ళినా అంత ఢబ్బు ఉంటుందని అనుకోడం లేదు. ఎందుకంటే, ఆమె హేండ్ హేగ్ ఆమె చేతిలో లేదు. ఉన్నా ఇప్పుడు అడగడం బాగుండదు. ప్రశాంత్ కూడా తన లాగే రాధ ఫోన్ చెయ్యగానే వచ్చేసాడు. అందుకని అతని దగ్గర కూడా ఉండక పోవచ్చు. అందుకని అదే ఫ్లోర్‌లో ఉన్న రిసెప్షన్ టేబుల్ దగ్గర ఉన్న సిస్టర్ దగ్గరికెళ్ళి విషయం అంతా చెప్పాడు.

ఆమె వెంటనే తల అడ్డంగా ఊపేసింది.

“సారీ….. మీరు బయటికి వెళ్ళడానికి లేదు. ఇలాగే డబ్బు తీసుకొస్తామని చెప్పి బయటికి వెళ్ళిన వాళ్ళు, పేషెంటుని ఇక్కడ ఉంచేసి అట్నించి అటే, అలాగే వెళ్ళిపోయిన సంఘటనలు చాలా ఉన్నాయి. మా కష్టాలు మావి.. ఇది పోలీసు కేసు….. అందుకని మీరు ఇక్కడే ఉండి అరేంజ్ చేసుకోండి. అది ఎలాగా అన్నది మీ సమస్య” అంటూ తన కుడి చేత్తో ఓ రెండు కాయితాలు తీసి, నారాయణ చేతిలో ఉంచింది.

“ఇదేఁవిటి …….”.అన్నాడు…

“ఇది పోలీసు కేస్ కదా అందుకని… వీటిని నింపి ఇవ్వండి……..”

నారాయణ ఆ కాయితాలని తీసుకుని, వాటిని చూస్తూ నడుస్తూ, అక్కడ ఉన్న ఓ కుర్చీలో కూచుని వాటిలో ఏం ఉందో చూస్తున్నాడు.

ఎవరో భుజం తట్టినట్టుగా అనిపిస్తే, ఉలిక్కిపడి, తలెత్తి, పక్కకిచూసాడు..

ఓ యాభై ఏళ్ళ మనిషి నుంచుని ఉన్నాడు… ఆ మనిషి నారాయణని చూస్తూ, పక్కన ఉన్న కుర్చీలో కూచున్నాడు.. ఆ వెంటనే ఫారాల వైపు చూడడానికి ఒంగాడు.

“వీటిని నింపకండి………” అంటూ గుసగుస లాడాడు..

వెంటనే అతని వైపు అనుమానంగా చూసాడు..

“ నిజంగానే… వీటిని నింపకండి… ఒక్కసారి.. ఈ ఫారాలు నింపి.. వివరాలు ఇచ్చారనుకోండి… ఇంక మీ పని… అయిపోయినట్లే….”

నారాయణ అయోమయంగా చూసాడు.

“సరిగ్గా నేను ఇలాగే అయోమయంలోకి వెళ్ళిపోయి… బతికాను… ఎందుకు…? ఓ మనిషి, చావు బతుకుల్లో ఉంటే ప్రాణాలు కాపాడాలనే ఓ మంచి ఉద్దేశంతో…. సాయం చేసాను. అంతే… అదే నేను చేసిన తప్పు. అంతే ముందు హాస్పటల్ చుట్టూ తిరిగాను. ఆ తరవాత కోర్టు చుట్టూ…. సాక్షిగా తిరగాల్సి వచ్చింది. ప్రమాదం జరిగిన వ్యక్తి బతికి ఉంటే బావుండేది… జరిగినది చెప్పేవాడు. కాని….. పోయాడు… నేను కోర్టుల చుట్టూ తిరిగి తిరిగి…. విసిగి వేసారి పోయాను……. అందుకని అడుగుతున్నాను. మీరు చూసారా…..! ఈ జరిగిన ప్రమాదాన్ని….. నాకు ఎలా తెలుసనుకుంటున్నారా…! నేను మీ మాటలు అంతా విన్నాను…. అందుకే చెప్తున్నాను.. మీరు సాయం చేస్తున్నారా అని…….”

వెంటనే నారాయణకి అంతా అయోమయంగా అనిపించింది. జరిగింది గుర్తు తెచ్చుకోడానికి ఓ నిమిషం సమయం పట్టింది. తను ఎందుకు వచ్చింది, తను అక్కడ ఎందుకు ఉన్నాడో తెలిసొచ్చింది. అసలు జరిగింది ఆ రోజేనా.. అన్న సంగతి కూడా గుర్తు రాలేదు. ఇది, ఎప్పుడో జరిగినట్లుగా అనిపిస్తోంది……

టూకీగా జరిగింది చెప్పాక అతణ్ణి చూసాడు…….

“నిజానికి నేను సాక్షిని కాదు…. మా స్నేహితుడుకి ఇక్కడికి దగ్గర్లోనే యాక్సిడెంట్ జరిగింది. మేము, ఇక్కడికి పది కిలోమీటర్ల దూరంలో ఉంటాము. అందుకని అతని వైఫ్ ముందు మాకే ఫోన్ చేసింది.. ఆమె ఫోన్ చేస్తే వాళ్ళకి అన్నివిధాలా సాయం చేయడం కోసం నేను, మరో స్నేహితుడు రెండు కార్లలో వచ్చాము. మా ఫ్రెండ్‌ని తీసుకొచ్చాం….. తలకి, బాగానే దెబ్బలు తగిలాయి. ఇప్పుడు థియేటర్‌లో ఉన్న మనిషి మా స్నేపితుడు, అదిగో అక్కడ కూచున్న ఆమెకి భర్త. అతనే ప్రస్తుతం యాక్సిడెంటు అయి థియేటరు ఉన్నాడు… ఇంతకీ ఈ ఫారాలు….” అని ఆగిపోయాడు నారాయణ.

వెంటనే తలని అడ్డంగా ఊపుతూ, లాభంలేదు, ఆ పెద్ద మనిషి,పెదవి విరిచాడు.

“ప్చ్….. వేస్ట్… నువ్వు ఎవరో వాళ్ళకి తెలీదు… ఓ యాక్సిడెంట్‌లో గాయపడ్డ మనిషిని, చావు బతుకుల్లో ఉన్న ఓ మనిషిని తెచ్చి చేర్పించారు… ఇదే వాళ్ళకి తెలిసింది. అంతే. ఇప్పుడు థియేటర్‌లో ఉన్న మనిషికి ఏదయినా జరిగితే…… బాధ్యత ఎవరు తీసుకోవాలి……..? ఆలోచించండి… హాస్పిటల్ వాళ్ళయితే తీసుకోరు.. తెచ్చిన మనిషి తీసుకుంటాడా…! మీలాంటి వాళ్ళు సిద్ధంగా ఉంటారా…! ఇంక పోలీసులు రంగంలోకి దిగుతారు.. వాళ్ళకి ఇలాంటి కేసులు తలనొప్పి కేసులు… ఎందుకంటే ఇది ఓ హిట్ అండ్ రన్ కేసు…. తప్పుదారిలో అతి వేగంతో వచ్చి యాక్సిడెంట్ చేసేసి తిరిగి చూడకుండా వెళ్ళిపోయిన ఆ మనిషిని పట్టుకోవడం కష్టం. ఒకవేళ పట్టుకున్నారనుకోండి…. అప్పటికి ఓ పది ఏళ్ళు పడుతుంది. ఈ లోపల మానసికంగా ఎంత కిందికి వెళ్ళాలో అంత కిందికి వెళ్ళిపోతారు. ఓ పదేళ్ళ తరవాత కేసుని మూసెయ్యడానికే పోలీసులు ప్రయత్నిస్తారు. యాక్సిడెంటు ఎలా జరిగిందో మీకు తెలీదు. అక్కడున్నవాళ్ళ సాక్ష్యం సరిగా ఉండదు. డైల్యూట్ అయిపోతుంది. ఎందుకంటే సాక్షులు కొన్ని చూడగలుగుతారు కొన్ని చూడరు… కొన్ని సరిగా గుర్తుండదు. అసలు ఏం జరిగిందో పోయిన వ్యక్తి చెప్పడు కదా…….!”

నారాయణ ఆందోళనగా ఆ మనిషిని చూసాడు..

“అన్నీ చెప్పడానికి అతని వైఫ్ ఉంది. ఆమె అన్నీ ఇన్వెస్టిగేషన్‌లో చెప్పెస్తుంది.ఆ యాక్సిడెంటు అయిన అతను ఇంకా బతికే ఉన్నాడు. కొంచెం మాట్లాడగలిగే స్థితికి వచ్చినప్పుడు జరిగింది చెప్తాడు. ఎవరు రోడ్ రూల్స్ పాటించలేదో, ఎవరిది తప్పో…. ఎవరు రాంగ్ సైడు నుంచి వచ్చి కొట్టారో అందరికీ తెలుసు, మాఫ్రెండు కూడా చెప్తాడు. అప్పుడు అన్ని తెలుస్తాయి……” సందేహంగా చూస్తూ అన్నాడు…..

“ఆ పరిస్థితి వస్తుందని నేను అనుకోను. ఇప్పుడు జరుగుతున్న వేగం చూస్తే అంటున్నానికాదు కాని ఈ లెక్క ప్రకారం అతను బతకడు.. వాళ్ళు వైద్యం ఇంకా మొదలు పెట్టారో లేదో… ఎందుకంటే ఇది ప్రైవేటు ఆస్పత్రి. అన్నీ ఉంటాయని నేననుకోను. వాళ్ళు అన్నీ ఆలోచించి మొదలు పెట్టేసరికి ఆ మనిషి పోతాడు. ఇంక వాళ్ళు నాటకం ఆడతారు, వైద్యం చేయడం ఆలస్యం అయిందన్న విషయాన్ని చెప్పరు. నువ్వు ప్రాణాలతో ఉన్న మనిషిని తెచ్చావన్న విషయాన్ని కూడా చెప్పరు. ఓ మృతుడిని తెచ్చావంటారు. అదే సంగతి రిపోర్ట్‌లో రాస్తారు……”

నారాయణ మొహం పాలిపోయింది……. వెంటనే దూరంగా ఉన్న రాధ వైపు చూసాడు.ఆమె కళ్ళు మూసుకుని ఉంది. దేవుడిని ప్రార్థిస్తోందనిపించింది.

“..అంతేనా.. ఇంకా ఉంది….. ఆ తరవాత నీకు నిద్ర లేని రాత్రిళ్ళు…… మెల్లి మెల్లిగా పిచ్చి పట్టడానికి ఓ రెండు మెట్లు కింద ఉంటావు.. …ఆ కారు నంబరు వాళ్ళకి దొరకదు… దొరికిన నంబరు సాక్షులతో కేసు నడిపిస్తారు.. ఈ కేసు తెగదు. అంతే నువ్వు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉద్యోగానికి సెలవలు పెడుతూ నరకంలో అలా కొన్ని ఏళ్ళు ఉండి పోతావు….”

నారాయణ భవిష్యత్తుని ఊహించుకుంటూ అతని వైపు చూసాడు..

యాభైకి దగ్గర్లో ఉన్నట్టున్నాడు. బాగా నెరిసిన జుట్టు. తెల్ల పైజామా కుర్తా. మనిషి తెలుపు, నలుపు కాదు. మధ్యస్థం.. చూడగానే గౌరవించాలని పించేలా ఉన్నాడు..

“నాకేంటీ ఇంట్రెస్ట్ అని అనుకుంటున్నారా…..!.. నాకు ఇలాగే జరిగింది….. నా అనుభవం మూలంగా మీకు చెప్పాలనిపించింది…… చెప్పాను……” అంటూ నవ్వాడు.

నారాయణ నవ్వలేదు. అతని వైపు చూస్తున్నాడు.

“నేను ఎవరో మీకు తెలీదు. నా పేరు పార్థసారధి. మన హైదరాబాదుకి ఓ పాతిక కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ ఇంజనీరింగ్ కాలేజ్‌లో పని చేస్తున్నాను. మేము ఇక్కడికి దగ్గర్లోనే ఉంటాము.ఈ ఏరియాలో ఇదే కాస్త పెద్దాసుపత్రి. పైగా ఎమర్జెన్సీ కూడా ఉంది. మా అమ్మకి మూడోసారి గుండెల్లో పోటు వస్తే ఇక్కడే ఎమర్జెన్సీ వార్డులో నిన్నటి నుంచి ఉంది. మీరు రావడం, వాదించడం అన్నీ విన్నాను. అందుకే ఓ చిన్న సలహా ఇద్దామని వచ్చాను. ఏం జరగడానికి ఆస్కారం ఉంటుందో మీకు చెప్పాను.

 ఓసారి, మా కాలేజి స్టూడెంట్ మా కాలేజి ముందరే రోడ్డు దాటుతూంటే ఓ లారీ గుద్దేసింది. ప్రాణాలతో ఉన్న ఆ పిల్లాడిని తీసుకొచ్చాం. ఆ తరవాత ఏం జరిగిందో, నీకు చెప్పాను. ఆ పిల్లాడు పోయాడు. ఆ తరవాత ఎనిమిది ఏళ్ళు మేమందరం తిరిగాం. ఒక ఏడాది కాదు రెండేళ్ళు కాదు, ఎనిమిదేళ్ళు…. అందరం విసిగిపోయాం ఆఖరికి కేసు మూసేసారు……” ఆగి నారాయణని చూసాడు.

“నేను ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఇది హిట్ అండ్ రన్ కేసు. మీకు లైసెన్స్ ప్లేటు కనపడి ఉండచ్చు. దానితో ఎఫ్ఐఆర్ వేసి ఉంటారు. ఇంక అంతే పోలీసులు, ఆ ప్రమాదం చేసినవాడికి మీ సమాచారం ఇస్తాడు, వాడికి ఏం చేయాలో అర్థం అయిపోతుంది. నాకేమనిపిస్తోందంటే వాడు ఇప్పటికే ఓ లాయర్ని పెట్టుకుని ఉంటాడు. కోర్టుకి రావలసిన రోజున వాడు రాడు. అందుకని కేసుని వాయిదా వేస్తారు. మరో రోజు, మరోసారి వాయిదా.. వాడు రాకుండా ఇలా కాలం గడిపేస్తాడు.. అతను మీకు నిద్ర లేని రాత్రుళ్ళని అందించి,  మీజీవితం నరకానికి తీసుకెళ్తాడు.”

నారాయణ ఆలోచిస్తున్నాడు. ఇలా జరుగుతుందా…..!

కారు ప్రమాదానికి లోనైన స్నేహితుడైన వ్యక్తికి సాయం చేయడం తప్పా…….!

ఈ క్షణంలో మాధవ్‌కి ఏదైనా ఊహించడానికి రానిది జరిగితే …. తప్పు ఎవరిది అవుతుంది…!

రాధ ఫోను చేసిన వెంటనే రాకపోతే తనదే తప్పవుతుంది. తను హాస్పిటల్‌కి తీసుకు వచ్చీ చేర్చకపోతే తన తప్పవుతుంది. ఏదైనా జరగరానిది జరిగితే……. అప్పుడు సమయానికి చేర్చనందుకు పశ్చాత్తాపం దహించి వేస్తుంది.. నిద్ర లేని రాత్రుళ్ళు అప్పుడు మొదలయ్యేవి. ఈ క్షణంలో మాధవ్ పోతే తప్పు తనది కాదు. తను చెయ్యాల్సింది చేస్తున్నాడు. ఓ స్నేహితుడికి సాయం చేస్తున్నాడు.. అతని భార్య కోసం ఆలోచించకుండా, తయారయిపోయాడు ఎందుకు? స్నేహితుడి కోసం.. సహాయం కోసం దిక్కులు చూస్తున్న మాధవ్ భార్యకి తను సాయం చేయకపోతే, తమ స్నేహానికి అర్థం లేదు….. చదువుకున్న చదువు, అందులోంచి నేర్చుకున్న నైతిక విలువలకి అర్థం లేదు…… అని..

పర్వాలేదు. కోర్టుల చుట్టు తిరగ వలసి వచ్చినా, పరవాలేదు.,,. కేసు అలా నెలల తరబడి ఏళ్ళ తరబడి, నడిచిపోతున్నా పరవాలేదు… రాధకి, మాధవ్‌కి… న్యాయం జరిగేలా చూడాలి… న్యాయం గెలవాలి. ఆ యాక్సిడెంటు చేసిన వాడిని పట్టించాలి…. నేను స్వార్థపరుడిగా మారకూడదు, ఎందుకంటే నేను దేవుడికి భయపడ్తాను. మనిషికి సాయం చేయాలి అన్నయాటిట్యూడ్ ఉన్న వాడిని… అని అనుకున్నాడు.

అంతలో ఆ సారధిని కలవడానికి ఎవరో వస్తే అతను నారాయణతో చేతిని కలిపి వెళ్ళిపోయాడు…

మాధవ్‌కి ఏం కాకూడదు బతకాలి….. కళ్ళుమూసుకుని దేవుడిని వేడుకున్నాడు. ఏదయినా జరిగితే, ఊహించాలని లేదు.అంతలో రాధ వచ్చి, పక్కనున్న మరో కుర్చీలో కూచుంది.

డాక్టరు బయటికి వచ్చారు. ఇద్దరూ వెంటనే లేచి పరుగు లాంటి నడకతో అతని ముందు నుంచున్నారు.

వాళ్ళని ఓ సారి చూసి,”మీరు వెంటనే వేరే పెద్దాసుపత్రికి తీసుకెళ్ళండి.ముందే మీకు చెప్పాం కదా…మా దగ్గర కొన్ని ఫెసిలిటీస్ లేవు అని….”.

“అయ్యో ….ఇప్పుడు…ఎలా…. వేరే అంటే…” అంటూ ఏడ్చేసింది.

“వేరే అంటే ఉస్మానియా లేకపోతే గాంధీ…..అని….”

“అయ్యో ఆ రెండూ దూరమేనే….. దగ్గర్లో మరోటి లేదా…”

 “దగ్గర అంటే ఓ పది కిలోమీటర్ల దూరంలో ఓ మోస్తరు కార్పొరేట్ హాస్పటల్ ఉంది. కాని, డబ్బు చాలా అవుతుంది అయితే అది పెద్దాసుపత్రే….. అక్కడ అన్నీ ఫెసిలిటీసున్నాయి. ఇవాళ ఆదివారం డాక్టర్లు ఎక్కువ మంది ఉంటారో లేదో మరి…”

“పెద్దాసుపత్రికి తీసుకుని వెళ్ళేలోగా….. ఈ లోపల ఏదైనా జరిగితే….తప్పు ఎవరిదవుతుంది…..”

“చూడండి, మీరు ఇలాంటి ఇమోషనల్ డిబేట్లు పెట్టకండి. ఇవాళ ఆదివారం. పైగా ఉదయం. చాలా మంది డాక్టర్లు ఉండరు. ఇది ఓ కారణం. మరో కారణం పేషెంటు తలకి దెబ్బ బాగానే తగిలినట్లుంది. లోపల ఏం జరిగిందో తెలియనప్పుడు ఎవరేం చెయ్యగలరు… ఈ క్షణాన పేషెంటు పక్కన ఓ న్యూరో సర్జన్ ఉన్నా,ఏం చెయ్యలేరు. ఒక్కొక్కసారి, హాస్పిటల్ గేటునుంచి లోపలి కెళ్ళి, థియేటరులోకి తీసుకెళ్ళే లోపలే ప్రాణం పోవచ్చు. లోపల ఏం జరిగిందన్నది తెలవకపోతే అతను మాత్రం ఏం చెయ్యగలడు. మా నైతిక బాధ్యతగా ముందు అతని ప్రాణం నిలపాలి. ఇప్పుడు మేము చేయవలసినది ఇదే. ప్రాణం నిలిపే ప్రయత్నం అన్నమాట. లైఫ్ లైన్ స్టార్ట్ చేసాము. టీటీ ఇంజెక్షన్, సెలైన్, ఆక్సిజన్, మీరు తొందరగా తీసుకెళ్లండి. గొడవలు అవీ రాకుండా……”

వాళ్ళిద్దరూ.. నోరు తెరుచుకుని చూసారు. గొడవలా….! గొడవలు ఏఁవిటీ! గొడవలు ఎందుకొస్తాయి.! అసలు… ఎందుకంటున్నాడు ఆ మాటని…!

“మీరు అసలు ఏం చూడకుండానే అలా ఎలా అనేస్తారు… అసలు కండిషను ఏంటో చెప్పనే లేదు. ముందే గొడవలు అంటున్నారెందుకు…”

“మేము ఇలాంటి వాటిని తీసుకోము. ఇప్పుడు ఏదైనా జరగకూడనిది జరిగితే… ఈ పోలీసులు మమ్మల్ని వదలరు. ఇలాంటి విషయాలు తొందరగా తెలిసిపోతాయి. ఇలాంటి సంఘటనల కోసం నక్కల్లా కాచుకునేవాళ్ళు ఈ చుట్టుపక్కలే తిరుగుతూంటారు. వాళ్ళు రంగంలోకి దిగారంటే, మా పని అయిపోయనట్లే… కుర్చీలని, అద్దాలని ఒకటేఁవిటీ…. ఏది కనిపిస్తే…. దాన్ని విసిరేస్తారు, విరక్కొడ్తారు, ఇంక రిపోర్టర్లు వస్తారు. టీవీల్లో చూపించేస్తారు. మాఆసుపత్రి పేరు ఓ వంద సార్లు చూపిస్తారు, నిందలు వేస్తారు… రాజకీయం చేస్తారు.. అసలేం జరిగిందో మమ్మల్ని చెప్పనివ్వరు, నేరం మాదికాదు, మా తప్పేం లేదు అనేదానికి అవకాశం అసలు ఇవ్వరు. మమ్మల్ని ఓ పెద్ద క్రిమినల్స్‌గా ప్రొజెక్ట్ చేస్తారు. ఇంకొంచెం ముందు కెళ్ళి అరెస్ట్ కూడా చేస్తారు. ఇలాంటివి జరగడానికి అవకాశాలు చాలా ఎక్కువ. ఇలాంటి కష్టాలు తెచ్చుకోవడం ఇక్కడ ఎవరికి ఇష్టం లేదు. ఇందులో మీరేమీ అనుకోడానికి ఏం లేదు. పైగా…మా దగ్గర అవన్నీ చూసే మిషనరీ మా దగ్గర లేదు. అలాంటప్పుడు మేం ఎలా ఉంచుకుంటాం.? ఉంచుకున్నా ఇలాంటి కేసుల వలన ప్రాబ్లెంస్ చాలా ఉంటాయి. అందుకే మా డ్యూటి డాక్టరు వెనకాడాడు. రిస్క్ తీసుకుని చేస్తున్నాము. ఫస్ట్ ఎయిడ్‌కి ఏం చెయ్యాలో అదే చేస్తాం. అంటే ఫ్యూజన్, ట్రాన్స్‌ఫ్యూజన్ లాంటివి అన్నమాట…” అని ఆ డాక్టరు లోపలికి వెళ్ళిపోయాడు.

“అయితే కార్పొరేట్ కి వెళ్ళిపోదామా..” అని రాధ కేసి చూస్తూ అన్నాడు.

అలాగే అన్నట్లుగా తల ఊపింది.

“అయితే నేను ప్రశాంత్ దగ్గరికెళ్ళి చెప్పి డబ్బుకోసం అరేంజ్ చేస్తాను. నేను తొందరగా వచ్చేస్తాను. మళ్ళీ వేరే హాస్పిటల్ కి వెళ్ళాలి కదా……”

మళ్ళీ తల ఊపింది.

నారాయణ వెళ్ళిన వైపే చూస్తుండిపోయింది. ఆమెకి అంతా అయోమయంగా అనిపిస్తోంది. అంతలో తలుపులు తీసిన శబ్ధం అయింది.ఒక్కసారి లేచి ఎదురెళ్ళింది.

“మీరు వెంటనే వేరే దగ్గరికి తీసుకెళ్ళడం మంచిది. ప్రస్తుతం, రక్తస్రావం అరికట్టడం కోసం పేషెంటుకి ప్రెషర్ బాండేజ్‌లు కట్టాం. సెలైన్ వెళ్తోంది మా అంబులెన్స్‌లో పంపిస్తాం”

“అంతేనా… డాక్టరుగారూ…..”

“అంతే…. మీరు మా పొజిషన్ అర్థం చేసుకోవాలి. ఇది ఓ మెడికో లీగల్ కేసు. ఇప్పటికే పోలీసులకి తెలిసినట్లుంది. ఓ కట్ట పేపర్లని ఇచ్చి వెళ్ళారు. మాకు దాన్ని నింపడం ఇష్టంలేదు. ఈ కష్టాలు మాకు అనుభవంలో ఉన్నాయి…. ప్రైవేటు ఆస్పత్రులని నడిపించడం కత్తి మీద సాము లాంటిది. ఉత్తమమైన వృత్తి కానీ కొన్ని లిమిట్స్ మా లాంటి ఆస్పత్రులకి ఉన్నాయి..”

“పోనీ కనీసం ఎక్స్ రే లాంటిది తీసినా తెలుస్తుంది కదా.. లోపల ఏం అయిందోనని….. మరో ఆసుపత్రికి వెళ్లాకా అన్నీ పరీక్షలు మళ్ళీ మొదలు పెట్టి ఇంకా ఆలస్యం చేయడం ఎందుకూ, దానికన్నా కొన్ని ఇక్కడ చేసి ఆ ఆసుపత్రికి తీసుకెళ్తే….”

“సారీ, ఎన్ని సార్లు చెప్పించకుంటారు…? ఇవాళ ఆదివారం. ఎక్స్‌రే టెక్నీషియన్‌లు రారు. ఒకవేళ వాళ్ళు వచ్చి తీసినా, ఆ ఇమేజ్‌లో అన్నీ కనపడవు. దానికి ఎంఆర్ఐ తీయాలి. అందులో అన్నికూడా అన్ని యాంగిల్స్‌లో కనిపిస్తాయి. అన్నీ తెలుస్తుంది. ఈ రిపోర్టులన్నీ చూసాకా ఆపరేషన్ ఎక్కడ చెయ్యాలో అన్నీ వివరంగా న్యూరోసర్జన్ చెప్తారు. మా పానెల్‌లో న్యూరోసర్జన్ ఉన్నారు కానీ అతని వేళలు వేరే….

ఒకవేళ అతను ఈ క్షణంలో ఇక్కడ ఉన్నా కూడా ఏం చెయ్యలేరు. అతనికీ లేపల ఏం అయిందో తెలీదు. అందుకని, అతను కూడా వేరే పెద్ద ఆసుపత్రికే వెళ్ళడానికే రెఫర్ చేస్తాడు. ఎందుకంటే మాధగ్గర ఆ మెషినరీ లేదు. మేము పెట్టుకోము. వాటి ఖరీదు కోట్లల్లో ఉంటాయి. వాటిని వాడడానికి స్పెషలిస్ట్ లుంటారు. వాళ్ళ జీతాలు అవీ అందరూ భరించలేరు. ఇవన్నీ గవర్నమెంటు ఆసుపత్రుల్లో కార్పోరేట్ ఆసుపత్రుల్లో ఉంటాయి. ఎలాగైనా మీరు వేరేదగ్గరికి వెళ్ళాల్సిందే…….. ఒక సాయం మాత్రం మేము చెయ్యగలం. మా అంబులెన్స్ ఇస్తాము. అందులో తీసుకెళ్ళచ్చు.” అని ఆ డాక్టరు లోపలికి వెళ్ళిపోయారు.

అంతలోనే నారాయణ తల ఊపుతూ వచ్చేసాడు. డబ్బు అరేంజ్ చేసాడని ఆమెకి అర్థం అవాలని.

రాధ లాభం లేదనుకుంది. ఇంక వెళ్ళిపోదాం అన్నట్లుగా తల ఊపింది. మరో ఐదు నిమిషాలకి మాధవ్‌ని స్ట్రెచరు పైన తీసుకొచ్చారు. వెనకాల అంతకుముందు చూసిన కుర్ర డాక్టరు కూడా ఉన్నాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here