Site icon Sanchika

తమసోమా జ్యోతిర్గమయ-5

[box type=’note’ fontsize=’16’] “వీళ్ళు అన్నీ చాలా ఫాస్ట్‌గా చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. కాని యీ స్పీడు సరిపోతుందా మాధవ్‌ని ప్రమాదం నుంచి తప్పించడానికి! ఈ లోపల ఏదైనా అవుతే…..!” ఎమర్జెన్సీ గదిలో ఉన్న భర్త గురించి రాధ ఆందోళనని గంటి భానుమతి ‘తమసోమా జ్యోతిర్గమయ’ ధారావాహిక అయిదవ భాగం చెబుతుంది. [/box]

[dropcap]ఆ[/dropcap]యాలూ వార్డ్ బోయ్‌లు అక్కడే తచ్చాడుతున్నారు. వాళ్ళకి పేషెంటు వెళ్ళిపోతున్నాడని తెలిసింది. రాధ వాళ్ళని చూళ్ళేదు. పెద్దగా పట్టించుకోలేదు. ప్రశాంత్‌కి అర్థం యింది వెంటనే నారాయణని చూస్తూ అన్నాడు, “మామూళ్ళ కోసం అనుకుంటాను.”

“మామూళ్ళా…! దేనికీ? ఏ పని చెయ్యలేదు కదా…!”

“అని మనం అనుకుంటాం. కానీ వాళ్ళని పిలిచి అడిగితే ఏం చెప్తారో వింటావా.. మేమెంత చేసినా మీకు కనపడదు. చేసినప్పుడు చేయించుకుంటారు. అన్ని మరచి పోతారు. వేడినీళ్ళు తెచ్చాము. ఒళ్ళు తుడిచాము. కాఫీలు టిఫిన్లు బయటనుంచి తెచ్చాము అని అంటారు అవన్నీ ఎవరికి తెలియనిది…. వాళ్ళు ఏం చెయ్యలేదని అందరికి తెలుసు అయినా ఓసారి…… వింటావా….”

“వద్దులే, ఏదో ఇచ్చేద్దాం. ఇవ్వకపోతే శాపనార్థాలు కూడా పెడ్తారు. ఎంత మంది ఉన్నారో చూడు.”

“ముగ్గురే ఉన్నారు. వంద చాలునుకుంటాను….” అని పర్సు లోంచి వంద కాయితం తీసి, స్ట్రెచరు లాగిన మనిషి కిచ్చాడు. “ఇతనికివ్వచ్చు మిగిలిన ఇద్దరూ ఏం చేసారో మనకి తెలీదు” అని అన్నాడు నారాయణ.

మాధవ్ పక్కనే నడుస్తున్న రాధ ఓ పక్కగా ఉన్న డాక్టరుని చూసింది. అతని మొహం చూసి రాధకి ఎందుకో అనుమానం వస్తోంది. కాని ఏం అడగడానికి ధైర్యం చాల్లేదు. చేతిలో మాధవ్ రిపోర్టులున్న ఫైలుని ఓసారి చూసింది. ఆ ఫైలు తెరిస్తే అయోమయంగా ఉన్న మాధవ్ జీవితం కనిపిస్తుంది. భవిష్యత్తు కనిపిస్తుంది. అందుకే దాన్ని తెరవాలనుకోవడం లేదు.

మాధవ్‌ని చూస్తుంటే బెంగగా ఉంది. తలకి కట్లు ఛాతికి కట్లు. అంతకు ముందు కనీసం ఊపిరి తీసుకుంటున్నట్లుగా కనిపించింది. ఇప్పుడు అదేం లేదు. ఆలస్యం అయిపోతోందా! మరోసారి చూసింది. అసలు బతికి ఉన్నాడో. ఊపిరి ఉంది.

పరవాలేదు. ఆందోళనగా ప్రశాంత్, నారాయణ కోసం చూసింది. వాళ్ళు కనిపించలేదు.

అంతలోనే ఓ కారు వచ్చి ఆగింది. అందులోంచి ప్రశాంత్, నారాయణ దిగి రాధ దగ్గరికి వచ్చారు. అందరూ కలిసి అంబులెన్స్ వైపు చూసి ఒకళ్ళనొకళ్ళు చూసుకున్నారు..

వెళ్దాం అన్నట్లుగా తల ఊపారు. రాధ యాంత్రికంగా ముందుకు నడిచింది. మళ్ళీ మాధవ్ స్ట్రెచర్ మీద, మిగిలిన వాళ్ళంతా పరుగు….. ఆసుపత్రి గుమ్మం దగ్గర ఆగి ఉన్న అంబులెన్స్ దగ్గరికి వెళ్ళారు.

అంబులెన్స్‌లో రాధ కూచుంది. సెలైన్‌తో సహా మాధవ్‌ని లోపల పడుకోపెట్టారు. వెనక కార్లో ప్రశాంత్, నారాయణ వెళ్ళారు. రోడ్లు పొద్దున్నలాగా ఖాళీగా లేవు. ట్రాఫిక్ ఎక్కువై పోయింది. ఇన్ని కార్లేంటీ…! ఆదివారం కదా…! అయినా యింత ట్రాఫిక్కా! నత్తలా వెళ్తున్న అంబులెన్స్ అకస్మాత్తుగా ఆగిపోయింది. రాధ తలని ముందుకి వొంచి, డ్రైవరుకి ముందున్న గాజు కిటికీ లోంచి చూసింది. రోడ్డుకి మధ్యలో ఓ మేకల గుంపులు అడ్డు వచ్చాయి. డ్రైవరు హారన్ కొట్టాడు. మేకల కాపరి కర్ర పుచ్చుకుని, అదిలిస్తున్నాడు. అవి మెల్లిగా కారు హార్న్‌లకి భయపడుతున్నట్లుగా అటూ ఇటూ పరిగెడుతూ ఓ వైపుకి, తప్పుకున్నాయి. దారినిచ్చాయి. నడి రోడ్లో ఈ మేకలు మందలేంటీ…? ఆలస్యం అయిపోతోందేమో బెంగగా అనుకుంది. రోడ్డు క్లియరయింది. మళ్ళీ అంబులెన్స్ కదిలింది.

అంబులెన్స్ సైరన్ పెడుతున్నా, కార్లూ లారీలు పక్కకి వెళ్ళినట్లే వెళ్ళి, ఆగినట్లే ఆగి, విననట్లే మళ్ళీ అడ్డొచ్చేస్తున్నాయి. ఏంటీ వీళ్ళు అంబులెన్స్‌కి కూడా దారి ఇవ్వరా…! ఇంత కూడా సెన్స్ లేదేంటీ….! సైరన్ వేస్తూ వెళుతున్నఅంబులెన్స్ లోపల ఉన్న మనిషి ఏ స్థితిలో ఉన్నాడో మనం దారి ఇవ్వాలేమో అని అనుకోరా….! చావుబతుకుల మధ్య ఊగిసలాడుతున్నాడో.. ఏమో…. అన్న ఆలోచన రాదా…..! ప్రాణం పోయక్కర్లేదు. కనీసం తీయకుండా ఉంటే చాలు….. అంతా చదువుకున్న వాళ్ళల్లాగే కనిపిస్తారు. కాని సివిక్ సెన్స్ మాత్రం శూన్యం.

ఎలాగో కొంచెం ముందుకి వెళ్ళగలిగారు. హమ్మయ్య క్లియరైంది అని అనుకోడం మాత్రం మిగిలిపోయింది. కొంచెం దూరం వెళ్లాక అంబులెన్స్ మళ్ళీ ఆగింది. ఈ సారి ఓ పెళ్ళి వారి ఊరేగింపు. పెళ్ళివారు, పూర్తిగా ఆ రోడ్డుని ఆక్రమించేసారు. ముందు ఓ డజను మంది బ్యాండు వాళ్ళు. ఆ వెనకాల డాన్సులు చేస్తున్నవాళ్ళు. ఊరేగింపు ఆగి పోయింది ఒకటే శబ్ధం ఆ హోరులో అంబులెన్స్ సైరన్ వినపడలేదు. అలాగే వెళ్తున్నారు. బాగా దగ్గరి కొచ్చాకా సైరన్ వాళ్ళకి వినపడినట్లుంది. అప్పుడు ఓ పెద్ద మనిషి వెనక్కి తిరిగి చూసి, చొరవ చేసుకుని ఓ వైపున, నుంచుని, చేత్తో, అందరినీ ఓ సైడు నుంచి వెళ్ళమన్నట్లు సైగ చేసాడు. పెళ్ళివారి గుంపుని రెగ్యులర్ చేసి, దారి చేసాడు.

ఇదంతా చూసాకా రాధకి అనిపించింది. అసలు ఏ దేశంలోనైనా ఉంటుందా! ఇలా ఈ మేకల మందలూ, పెళ్ళి ఊరేగింపులు, రోడ్డు నడి మధ్యలో వెళ్ళడం దర్జాగా ఆవులు గేదేలు తిష్ట వెయ్యడంలాంటివి. వచ్చే పోయేవాళ్ళకి అడ్డుగా ఉండిపోవడం.

ఆందోళనగా, కోపంగా, ఊరేగింపు వైపు చూసింది. ఓపెన్ టాపు కారు. పెళ్ళికొడుకు, మరో ముగ్గురు కూచుని అటూ ఇటూ చూస్తున్నారు. ఆ పెళ్ళి కొడుకు అసలు ఏం అనుకుంటున్నాడు…. నాకు పెళ్ళి జరుగుతోంది. నాకీ రోజు ముఖ్యం…. మీరంతా తప్పుకోండి. దిసీజ్ మై హైవే… ఈ రోడ్డు నాది, నా ఇష్టం… అనుకుంటున్నాడా..! ఆ పెళ్ళివారు వెంట రాగా బిందాస్‌గా వెళ్తున్నాడు. అసలు వాళ్ళల్లో ఎవరికీ ఆలోచన రాలేదా..! ఆ రోడ్డు అందరిదీ. అందరికీ హక్కులుంటాయి అని అనుకోరా…! తమ మూలంగా మిగిలిన వాళ్ళకి ఇబ్బంది కలుగుతోందన్న ఆలోచన రాదా…! ఆలోచించడం రాదు. ఎందుకంటే ఇవన్నీ చదువుల్లో ఉండవు. ఇది కామన్ సెన్స్… ఇది ఎవరికి మటుకు వాళ్ళే తెలుసుకోవాలి. సంస్కరించుకోవాలి.

రోడ్డు అంతా గుంటల మయం. అంబులెన్స్ ఎగిరి ఎగిరి వెళ్తోంది. ఎగిరినప్పుడల్లా దడ దడ మంటూ శబ్ధం వస్తోంది. ఒళ్ళంతా హూనం అయిపోతోంది. మాధవ్ శరీరం కూడా అటూ ఇటూ ఊగుతోంది. కొంచెం వొంగి, మాధవ్ శరీరాన్ని పట్టుకుంటోంది. పట్టుకొకపోతే కింద పడిపోతాడు….

ఈ రోడ్లు ఎందుకిలా ఉన్నాయి?.. ఇన్ని గుంటలేంటీ? పట్టించుకోరా! దీన్ని బాగు చెయ్యరా!.. డబ్బుల్లేవని అనడానికి లేదు. ముక్కు పిండీ టాక్సులు అన్నీ సరిగ్గా తీసుకుంటారు. మరి ఆ డబ్బు ఎక్కడ పోతోంది? టాక్సులు తీసుకుంటున్నప్పుడు రోడ్లు బాగు చెయ్యాలి కదా…! ఈ రోడ్లు ఎవరివి…? ఇన్నిఎత్తు పల్లాలేంటీ.? ఆ కార్పొరేటరు దగ్గరి కెళ్ళి అడగాలి. ఆ ధైర్యం ఉందా.! ఆ కార్పొరేటరు కనిపించడు. రోడ్డు రూల్స్ పాటించాల్సిన వాళ్ళు పాటించరు, ఇలా యాక్సిడెంట్లవుతూంటాయి.. సామాన్యుల సంగతి ఎవరిక్కావాలి. ప్రాణాలు అలా గాల్లో కలిసి పోతూంటాయి. ఈ మనుషులూ ఈ రోడ్లూ రెండూ కూడా అనాథలే. ఎవరికీ పట్టదు. ఎవరికీ అక్కర్లేదు. ఇప్పుడు ఈ గతుకుల రోడ్లో ఎప్పుడు వెళ్ళాలి…?.ఎప్పుడు ఆసుపత్రికి చేరాలీ…? ఓసారి మాధవ్‌ని చూసింది. దేవుడా ఈ ప్రపంచంలో నాకు ఉన్నది ఈ మాధవ్ ఒక్కడే. తనకి ఏం కాకూడదు. మమ్మల్ని రక్షించు…… అని మనసులో అనుకుంది.

ఓ అరగంటలో చేరాల్సిన వాళ్ళు నలభై నిమిషాలు తర్వాత చేరారు. ఆ హాస్పిటల్ చాలా పెద్దగా ఉంది.. అంతే పెద్దగా ఉంది ఆవరణ. అక్కడ చాలానే కార్లూ అవీ ఓ పక్కన వరసగా పార్క్ చేసి ఉన్నాయి. అంబులెన్స్ తిన్నగా వెళ్ళి ఎంట్రెన్స్ దగ్గర ఆగింది. అంబులెన్స్‌ని చూడగానే, అది ఆగి, ఆగగానే అక్కడున్న వాళ్లల్లో కొంచెం చలనం వచ్చింది. రాధ మెల్లగా దిగింది. అటూ ఇటూ చూసింది. అంతలోనే నారాయణ, ప్రశాంత్‌ల కారు వచ్చింది.

నారాయణ కారు దిగి లోపలికి వెళ్ళాడు. ప్రశాంత్ కారుని పార్కింగ్ చేయడానికి వెళ్ళాడు. అంతలో స్ట్రెచరు తీసుకుని ఓ ఇద్దరు వచ్చారు. వాళ్ళ వెనకే నారాయణ కూడా ఉన్నాడు. అంతా కలిసి లోపలికి వెళ్ళారు. ఓ పెద్ద హలు. తెల్లగోడలు, తెల్లపెయింటుతో తలుపులు, టేబుళ్ళు కౌంటర్లూ అన్నీ తెల్లవే. పూలకుండీలు, చెట్లున్న కుండీలు, హాస్పటల్ లాగా లేదు. ఏదో హోటల్ ముందు భాగంలా ఉంది. చూడగానే ఓ రకమైన ప్రశాంతత. నాలుగు వైపులా డాక్టర్ల గదులు. ఆ గదుల ముందు పదేసి కుర్చీలు. కానీ అన్నీ ఖాళీగా ఉన్నాయి. ఓ వైపున రిసెప్షన్. అక్కడ ఎవరూ లేరు. అటూ ఇటూ చూసారు. మామూలుగా కార్పోరేట్ ఆసుపత్రుల్లో జాతరలా మనుషులుంటారు. అటూ ఇటూ వెళ్తూ, డాక్టర్ల గదుల దగ్గర వెయిటింగ్ చేస్తూ, ఆయాలు, సిస్టర్లూ పేషెంట్లని చూడ్డానికి వచ్చేవాళ్ళు…… అలాంటి దృశ్యాలేం లేవు. నిశ్శబ్ధంగా కూడా ఉంది.

రిసెప్షన్ దగ్గరికెళ్ళారు. అక్కడ “మీ కోసం ఎదురు చూస్తున్నాం” అన్నట్లుగా ఏం లేదు. రిసెప్షన్ దగ్గర వెయిటింగ్. రాధకి మాధవ్‌ని చూస్తుంటే భయంగా ఉంది. ఆమెకున్న తొందర అక్కడున్న వాళ్ళకి లేదు. అన్నింటికి వెయిటింగ్.. అక్కడికి ఇక్కడికీ తిప్పుతూంటే ఇంకా భయంగా ఉంది. ఓ పావుగంట తరవాత ఓ ఇద్దరు వచ్చారు. కబుర్లు చెప్పుకుంటూ వచ్చారు. వస్తూనే ఫోన్లని పట్టుకున్నారు. రిసెప్షన్‌లో ఉన్న వాళ్ళిద్దరు బిజీ. రాధ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సురక్షలో ఇచ్చిన ఫైలు చూపించింది. అక్కడున్నఆమె మరో ఫైలు తయారుచేసింది.

“ఆఫీసుకెళ్ళి, అకౌంట్సు కౌంటర్‌లోడబ్బు కట్టండి. ఎమర్జెన్సీ డాక్టరు వస్తారు” అంది.

ఆమెకి సురక్షలో లోపలికి ప్రవేశించిన వెంటనే చేర్చుకోడానికి ఇంత ఆలస్యం చెయ్యలేదు. వైద్యం చేసినా చెయ్యకపోయినా కొంచెం కాకపోతే కొంచెం ఏదో చేసారు. అది బాగానే ఉంది. ఇక్కడ ఇంకా ఏదీ మొదలు పెట్టకుండానే డబ్బు కట్టండి అంది. ఆ డాక్టరు ఎప్పుడు వస్తారో ఏమో……

ఇక్కడ ఏంటో…. ఖాళీగా అనిపించింది. ఆదివారం కాబట్టి అనుకోవచ్చా.. ఇలా అయితే మాధవ్ పరిస్థితి ఏఁవిటీ…. ఇంక ఆలోచించలేదు. గబ గబా అటూ ఇటూ వెళ్ళింది. కారీడార్లు. అటూ ఇటూ స్పెషలిస్టు డాక్టర్ల పేర్లు, వాళ్ళ డిగ్రీలు ఉన్న బోర్డులున్న గదులు అన్నీ మూసి ఉన్నాయి. కానీ గులాబీ రంగులో నర్సులు టక టక మంటూ అటూ ఇటూ తిరుగుతున్నారు. డాక్టర్లు కూడా అప్పుడప్పుడు హడావుడిగా వెళ్తూ కనిపిస్తున్నారు. అందరూ ఓ సారి వీళ్ళవైపు చూసి వెళ్ళిపోతున్నారు. ఏఁవిటీ! ఎందుకున్నారూ! ఏ డాక్టరు కోసం ఎదురు చూస్తున్నారు…..! అని అడుగుతారేమో అనుకుంది. కానీ అదేం లేదు. ఎవరి మటుక్కు వాళ్ళే బిజీగా ఉన్నారు, అలా కనిపిస్తున్నారు. తిరిగి, తిరిగి వచ్చేసింది.

ప్రశాంత్ లేచాడు. “నేను ఎవరైనా డ్యూటీ డాక్టరున్నాడా అని చూసి వస్తాను” అంటూ వెళ్ళాడు. మరో ఐదు నిమిషాల్లో తిరిగి వచ్చాడు.

“ఇద్దరు డాక్టర్లున్నారుట, కానీ ఎమర్జెన్సీ కేసుట. ఆపరేషన్‌తో ధియేటర్లలో బిజీగా ఉన్నారుట. మరోసారి రిసెప్షన్లో కనుకుందామనుకుంటున్నాను. ఇది కూడా ఎమర్జెన్సీ కేసే, డాక్టరు వచ్చి చూస్తేనే కదా తెలిసేది. అని అనుకుంటూ, అటువైపు వెళ్ళాడు. నారాయణ ఆ వెనకే కూడా వెళ్ళాడు. మాధవ్ పరిస్థితి చెప్పారు. అంతకు ముందు రాధతో అన్న మాటే అంది. నిరాశగా వచ్చి ఓ చోట కూచున్నారు.

టైము పది అవుతోంది. ఇంతవరకూ ఏ రకమైన వైద్యం జరగలేదు. అసలు మొదలే పెట్టలేదు. కోపం వచ్చేస్తోంది. అలాగే కారుతున్నకన్నీళ్ళని తుడుచుకోకుండా నడుస్తూ రిసెప్షన్ దగ్గరికి వచ్చింది రాధ.

అక్కడ ప్రశాంత్, నారాయణ ఎవరితోనో మాట్లాడుతున్నారు. అంతలో ఓ డాక్టరు వచ్చి, ఓ గదిలోకి వెళ్ళడం అందరూ చూసారు. ఆ డాక్టరు అపాయింట్‌మెంటు ఇచ్చినట్లున్నాడు. వాళ్లు ఆ గది ముందు కూచుని ఉన్నారు. పరవాలేదు, ఓ ఐదారుమంది ఉన్నారు. కానీ, వాళ్ళది ఎప్పుడవ్వాలీ, ఎప్పుడు తమ వంతు రావాలి, ఈ ప్రకారంగా అయితే ఇంక అయినట్టే తొందరగా డాక్టరు చూడాలి అంటే తను వెళ్ళి పరిస్థితి వివరించాలి. వెంటనే రాధ గబ గబా లోపలికి వెళ్ళి, మాధవ్ గురించి డాక్టరుకి చెప్పేసింది.

డాక్టరు గబుక్కున లేచి, బయటికి వచ్చాడు. అతనితో వెనకాలే ఓ సిస్టరు కూడా వచ్చింది. వెంటనే మాధవ్‌ని చూసి, ఎమర్జెన్సీగది లోకి తీసుకెళ్ళమని అన్నాడు. మరో ఇద్దరు వచ్చి, మాధవ్‌ని ఎమర్జెన్సీ అని యారో మార్కులున్న కారిడార్ల లోంచి తీసుకెళ్ళారు. రాధ పరుగున వాళ్ళ వెనకే వెళ్ళింది. అక్కడ డ్యూటీలో ఉన్న మరో డాక్టరు కూడా వచ్చి చూసారు. పక్కనే ఉన్న సిస్టర్‌కి ఏం చెయ్యాలో చెప్పారు. మరో గదిలోకి తీసుకెళ్ళారు.అక్కడ ఓ ఇద్దరు మేల్ నర్సులున్నారు. మళ్ళీ అటూ ఇటూ.. హడావిడి.. గబ గబా రక్తం సాంపిల్ తీసుకున్నారు. బీపీ చూసారు. ఈసీజీ తీసారు. సెలైన్ పెట్టారు. ఆదివారం అయినా ఏదో విధంగా వైద్యం జరుగుతోంది. పరవాలేదు,అని అనుకుంది.ఆ మాటే ప్రశాంత్ వాళ్ళతో అంది.

అందరూ గబ గబా వచ్చేసారు. డాక్టరు గది పక్కనే ఉన్న గది లోకి ఆ స్ట్రెచరుతోనే తీసుకెళ్ళి, మాధవ్‌ని పరీక్ష చేసెస్తున్నారు. ఎలాగైనా కార్పోరేట్ కార్పోరేటే. ఏంటో చాలా శ్రద్ద తీసుకుంటున్నట్లుగా అనిపించింది.

ఓ గంట తరవాత మాధవ్‌ని బయటికి తీసుకొచ్చారు. ఆ వెనకే నర్సు, వార్డ్ బోయ్ కూడా వచ్చారు.

 వెంటనే గబ గబా మాధవ్‌ని తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళ వెనకాలే రాధ, నారాయణ, ప్రశాంత్ పరుగులాంటి నడకతో వెళ్ళారు.

డ్యూటీ డాక్టర్ అని ఉన్న గది దగ్గరికి తీసుకెళ్ళారు. నర్స్ లోపలికి వెళ్ళి ఏదో మాట్లాడింది. బయటికి వచ్చిన తరవాత న్యూరో సర్జన్, న్యూరోఫిజీషియన్ అన్న పేర్లు ఉన్న ఓ గది ముందు కూచోమంటే అక్కడ కూచున్నారు. ఆ గది ముందు కూడా చాలా కుర్చీలున్నాయి

“రాధా నువ్వు కూచో….. డాక్టరు లేరు, ఇప్పుడు పిలిపిస్తారుట.. ఆదివారం కదా చాలా మంది ఆఫ్ తీసుకుంటారు. కానీ పేషెంట్లుంటేనే పిలుస్తారుట.. నేను అంతలో నేను డబ్బు కట్టి వస్తాను. రాగానే కట్టమన్నారు కానీ అప్పుడు కట్టలేదు.”

“కట్టమన్నారా….! డబ్బు ఉందా..!”

 “మాధవ్‌ని లోపలికి తీసుకెళ్ళినప్పుడు చెప్పారు. ఆఫీసులో కెళ్ళికనుక్కోమని, అంటే వెళ్ళి కనుక్కున్నాను, ముందు ముప్పై వేలు కట్టమన్నారు తరవాత మిగిలినది…”

 “కార్పోరేటు కదా…. చాలా అవుతుంది.. ముందు రెడీ చేసి పెట్టుకుంటే మంచిది. ఎంత డబ్బైనా పరవాలేదు. మాధవ్ సేఫ్‌గా బయటికి రావాలి. మనిషి ప్రాణం కన్నా డబ్బు ఎక్కువ కాదు. నేను వెళ్ళి తీసుకొస్తాను. ప్రశాంత్ ఎక్కడా… కనిపించడంలేదు….” అంటూ లేచింది.

 “రాధా నువ్వు కూచో. ఆ డబ్బు నేను ఇందాకే తెచ్చేసాను. ఈ సారికి చూడచ్చు అయినా ఏటిఎం ఈ పక్కనే ఉంది. ఇప్పుడు నేను వెళ్ళి తెచ్చాను కదా, ప్రశాంత్ ఏదో తిని, కాఫీ తాగి వస్తానన్నాడు. వచ్చేప్పుడు నీకు కూడా కాఫీ తెస్తాడు.”

“నాకేం తాగాలని లేదు. అనవసరంగా తెమ్మన్నావు……”

“తాగకుండా ఎలా ఉంటావు… ఎప్పుడో పొద్దున్న తాగావు.. ఇప్పుడు పది దాటింది. కాస్త ఎనర్జీ అయినా రావాలి కదా… నీరస పడిపోతావు… మాధవ్ కి ఏం కాదు. ధైర్యంగా నువ్వుండక పోతే ఎలా… ముందు కాఫీ తాగు… దేన్నైనా ఎదుర్కోవాలి.ఆ శక్తి రావాలి………”

అంతలోనే ప్రశాంత్ ఓ డిస్పోజబుల్ గ్లాసులో కాఫీ తీసుకొచ్చాడు. ఓ సారి వద్దంది. కానీ, మరో సారి అంటే తాగేసింది .తాగాకా ఏదో తప్పు చేసినట్లుగా ఫీల్ అయింది.. మాధవ్ అలా చలనం లేకుండా ఆ గదిలో పడుకుంటే తనకి ఏం అనిపించలేదా.. ఎలా తాగేసింది…! కానీ తాగేసింది. అంటే మాధవ్‌ని పట్టించుకోవడంలేదా..! తనలో స్వార్థం ప్రవేశించిందా….! కాఫీ పూర్తిగా తాగాకా నిజంగానే ఏదో మార్పు వచ్చినట్టనిపించింది.

“ఇక్కడ డబ్బు కట్టడం అన్నది ఓకే. జెన్యున్, ఎందుకంటే ఏవేవో పరీక్షలు అవీ చేసారు ఇంకా చెయ్యడానికి తయారుగా ఉన్నారు. కాని మనం సురక్షలో కూడా కట్టాం కాని అక్కడ ఏం చేసినట్లు లేదు. పైగా అక్కడ రూంలో లేము. వాడెవడో బ్లడ్ కూడా తెస్తానని అన్నాడు అది కూడా జరిగినట్లు లేదు. మరి ఆ అబ్బాయికి కూడా ఇచ్చారా…..”అంది.

 “లేదు, ఆ అబ్బాయి కివ్వలేదు. మేము డబ్బివ్వలేదు. ఆ డాక్టరు ముందు నుంచే కష్టం కష్టం అంటున్నాడు. తీసుకెళ్ళి పొమ్మంటున్నాడు. అందుకని అక్కడ ఏమీ కట్టలేదు. అలాంటప్పుడు రక్తం ఎక్కించడం ఎలా అవుతుంది అని మా ఇద్దరికీ అనిపించింది. అందుకే ఇవ్వలేదు. కాని, ముందు రెండు వేలు కట్టమన్నారు, అది కట్టడం అయింది. దానికి తగ్గ ట్రీట్మెంటు చేసారు.”

“అవును ఓ ఫైలిచ్చారు, ఫస్ట్ ఎయిడ్ చేసారు… ఆ మాత్రం పరవాలేదు.”

 “ఇందాక వస్తూ నేను మన ఫ్రెండ్స్ అందరికి మెసేజ్ ఇచ్చాను. సౌమ్య, వరుణ్ మాత్రం తొందరగా వస్తాన్నారు” అని ఆగి రాధ మొహం చూసి ఆగాడు…. సౌమ్య,వరుణ్ ఒకే కాలేజీలో ఇంజినీరింగ్ పూర్తి చేసారు. ఒకే దగ్గర వర్క్ చేస్తున్నారు. పెళ్ళి చేసుకున్నారు.

రాధ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. అసలు వీళ్ళిద్దరూ ఎవరు..? స్నేహితులు అంతే. కబురు ఇలా తెలియగానే అలా వాలిపోయారు. ఎక్కడి దక్కడ వదిలేసి వచ్చేసారు. నిద్ర మంచం మీదనుంచి లేచి వచ్చేసారు. కానీ, తన వాళ్ళు, మాధవ్ వైపు వాళ్ళు ఇక్కడ లేరు. నిజానికి వాళ్ళకి ఇన్‌ఫర్మేషనే ఇవ్వలేదు. ఎందుకో భయం వేసింది. కొంచెం జంకింది. ఏం అంటారో ఏం వినాల్సి వస్తుందో అని కూడా అనిపించింది. అసలు వస్తారో లేదో అనిపించింది.

అలాగే ఆ స్నేహితులు కూడా తన నమ్మకాన్ని వమ్ము చేయలేదు. ముందుకు వచ్చేసారు. నిజం. సృష్టిలోని తీయనైనది స్నేహం. దానికి గొప్ప బీద తేడా లేదు. కులం మతం లేదు. అవసరం అయితే ప్రాణాలు కూడా ఇవ్వడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు. ఈ తేడాలు ఏవీ లేకపోతే మనుషుల మధ్య దూరం ఉండదు.

“ఇంటికి ఫోను చెయ్యాలి” అంటూ వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళారు.

రాధ ఒక్కత్తీ కూచుని అటూ ఇటూ చూస్తోంది. గది బయట కూచున్న ఆమెకి లోపలికి బయటికి హడావుడిగా వెళ్తున్న సిస్టర్లని, ఆయాలని చూస్తూంటే అనిపించింది, చాలా ఎఫీషియెంట్ స్టాఫ్ అని. అందరూ సిస్టమాటిక్‌గా చేసుకుపోతున్నట్లుగా అనిపించింది. వీళ్ళు అన్నీ చాలా ఫాస్ట్‌గా చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. కాని యీ స్పీడు సరిపోతుందా మాధవ్‌ని ప్రమాదం నుంచి తప్పించడానికి! ఈ లోపల ఏదైనా అవుతే…..! ఏం జరగకూడదు. అసలు మాధవ్ ఎలా ఉన్నాడో…..

(ఇంకా ఉంది)

Exit mobile version