[box type=’note’ fontsize=’16’] “కారణం ఏదైతేనే ఓ గంట అలా రోడ్డు మీద పిచ్చిపట్టిన దానిలా ఏడుస్తూ ఉన్నాను. కర్ణుడి చావులాగా అనుకో…. అన్నీ ఆలస్యమే” భర్త గురించి రాధ ఆందోళనని గంటి భానుమతి ‘తమసోమా జ్యోతిర్గమయ’ ధారావాహిక ఏడవ భాగం చెబుతుంది. [/box]
[dropcap]ఆ[/dropcap]లోచనలు అమ్మావాళ్ళ పైకి వెళ్ళింది. జరిగింది తను చెప్పడం అయితే చెప్పింది. వాళ్ళు వస్తారో లేదో… డబ్బు ముందు అన్నీ బలాదూరే. ఇరవైఎనిమిది ఏళ్ళు ఆ ఇంట పెరిగింది. తను పెళ్ళి చేసుకోడం వాళ్ళకి అంత కోపాన్ని తెప్పించిందా..? అంత కాని పని తనేం చేసింది…?
ఆలోచిస్తూంటే అనిపిస్తోంది, వాళ్ళు మామూలు మనషులు. ఇప్పుడు ఫోనులో విషయం తెలుసుకున్నాకా వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో ఊహించడం పెద్ద కష్టం కాదు. అలాంటివి చాలా జరిగాయి. వాళ్ళ సంభాషణ ఎలా ఉంటుందో తెలీంది కాదు.. ఓసారి బాబాయికి ఏదో ఆపరేషన్ జరిగితే వెళ్ళలేదు, అదే విషయాన్ని అడిగింది.
“అదేంటమ్మా, నీ సొంత వాళ్ళే కదా, వెళ్ళక పోతే ఎలా…. ఇది వరకు డబ్బుకి మొహాలు చూసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు అలా కాదు కదా… టాక్సీ చేసుకుని వెళ్ళండి… నేను డబ్బిస్తాను కదా…” అంది.
“ఈమధ్య వాళ్ళు సరిగా ఉండడం లేదులే.. వాళ్ళకి మనం ఎంత దూరమో మనకీ వాళ్ళు అంతే… ఇప్పుడు ఆరొందలు ఖర్చు పెట్టుకుని చెన్నై వెళ్ళక్కర్లేదు.”
ఆశ్చర్యపోయింది. ఇలాంటి భాష వాడితే మనుషుల మధ్య దగ్గరితనం ఎలా వస్తుంది?.. ఎదుటి వాళ్ళ మనసు నొప్పించకుండా మాట్లాడ లేరా! అలా అయితే మరి సంబంధాలు ఎలా నిలుస్తాయి! రాకపోకలు లేక పోతే ఎలా..! వాడే భాష ఎంత మెత్తగా సరళంగా ఉండాలి.. మనం బాధపడకుండా, ఇతరులను బాధపెట్టకుండా ఉండడంలోనే భాష ప్రయోజనం ఉందనిపించింది.
నిజంగా డబ్బే కారణం అవుతోందా! మనషుల మధ్య దూరం పెరగడానికి, బంధాలు మాయం అయిపోడానికి. ఇది వరకూ ఇలా లేరు. తల్లీ తండ్రి అన్నింటికీ వెళ్ళేవారు. కబురు తెలిసిన వెంటనే అయ్యో వెళ్ళాలి.. వెళ్ళకపోతే ఎలా….. బావుండదు… అది శుభం అయినా అశుభం అయినా సరే…. అలాగే బస్సుల్లోనే వెళ్ళేవారు. అప్పుడప్పుడు ఆటోల్లో.. అలాంటిది ఈరోజున కార్లో వెళ్ళగలిగే పొజిషన్‌లో ఉన్నా వెళ్ళడంలేదు. ఎందుకని? స్వంత వాళ్లే… అయినా డబ్బుని మధ్యలో తీసుకొస్తున్నారు.
ఇది అర్థం కాని విషయం. ఇన్ని రోజులూ లేనిది ఇప్పుడెలా వచ్చింది. ఇది తన డబ్బు వాళ్ళకి, ఇస్తున్న అహంకారం అవుతుందా..! గర్వం వచ్చేస్తోందా…. రక్త సంబంధాలు డబ్బుతో ముడి వేసుకు పోయాయా… ఈ ఆధునిక సౌకర్యాలు మానసికంగా దూరాలని పెంచిందా.! ఇదే ఓ కారణమా, తనకి పెళ్ళి చెయ్యాలన్న ఆలోచన వాళ్ళకి రాకపోవడానికి.
పెళ్ళి చేసుకుని వెళ్ళిపోతే… ఎలా….. అని అనుకున్నారా కానీ, తనకీ ఓ జీవితం ఉండాలి కదా.. పెళ్ళి చేసుకుంటే…. అన్న ఆలోచన చాలా సార్లు వచ్చింది. ఎన్నో సార్లు అనుకుంది. కాని, తల్లికి చెప్పడానికి సిగ్గు పడింది. పరోక్షంగా ఫ్రెండ్స్ పెళ్ళకి వెళ్ళి వచ్చినప్పుడల్లా అక్కడ జరిగినవన్నీ చెప్పినా వాళ్ళు ఉత్సాహంగా వినేవారు కాని తన మనసులోని కోరికని గుర్తించేవారు కాదు. లేకపోతే నటిస్తున్నారా…! తప్పో ఒప్పో కాని తల్లి మనసులో కొంచెం స్వార్థం ప్రవేశించినట్లు ఆమెకి అనిపించింది. దానికి తోడు జరిగినవి ఆ భావానికి బలాన్నిచ్చాయి.
అప్పటివన్నీ ఇంకా కళ్ళకి కట్టినట్లుగా ఉంది అన్నీ గుర్తే…. సతీష్ తనని పెళ్ళి చేసుకుంటానని అంటే అమ్మ ఏం అందో ఇప్పటికీ గుర్తు.
“నా కొలీగ్ ప్రపోజ్ చేసాడు..” అని అన్నప్పుడు… అమ్మ భావాలు మొహంలో మారాయి. “మనవాళ్ళేనా…” అని అంది
“కాదు….” అని అంది.
“మనవాళ్ళు కాకపోతే వద్దు. వర్ణ సంకరం చేస్తానంటావేంటీ? మనవాళ్ళల్లోనే బోల్డు మంది ఉన్నారు. నన్ను ఇద్దరు ముగ్గురు అడిగారు నిన్ను కోడలిగా చేసుకుంటామని. కాని, నేనే ఏం సమాధానం ఇవ్వలేదు. నువ్వుఇప్పుడే చేసుకుంటావో లేదో అని మేమూ దాని గురించి పట్టించుకోలేదు” అని తాపీగా అంది.
రాధకి ఆశ్చర్యం వేసింది. తనకి ఇరవయ్యారేళ్ళు వచ్చాయి, పెళ్ళి చేసుకునే వయసు. ఆ సంగతి అమ్మకి తెలుసు. అయినా చేసుకుంటుందో లేదో, అని ఎలా అనుకుంది. అలా అనుకునేముందు తనని ఒక్కమారు అడగాలి కదా…! అసలు అడగకుండానే ఎలా అనుకుంది, తను చేసుకుంటుందో లేదో అన్న అనుమానం ఎందుకొచ్చింది.
“మా బాధ్యతని నువ్వు గుర్తు చేసావు… ఇంక ఇప్పటినుంచి డబ్బు జాగ్రత్త చేస్తే గానీ పెళ్ళినాటికి తేరుకోలేం….. పెళ్ళంటే మాటలా… ఎన్నింటిని కాదనుకున్నా, ఎన్నింటిని, వదిలేసినా, చచ్చు ఏడెనిమిది లక్షలైనా ఉండాలి. అందులో సగం భోజనాలకే సరిపోతుంది… ఫంక్షన్ హాళ్ళు కూడా అలాగే ఉన్నాయి. దోచేస్తున్నారు. ఇంక చీరలూ సారెలూ కొనకుండా ఎలా ఉంటాం? ఇంక రిటర్న్ గిఫ్ట్స్ ఎలాగూ ఉన్నాయి.. పెళ్ళిచేయించే బ్రహ్మ గార్లు కూడా అలాగే ఉన్నారు….. వాళ్ళకో పాకేజీ…అంతా తడిపిమోపెడు. అన్నీ చూసుకోవాలి. పెళ్ళంటే మాటలా లక్షలతో కూడుకున్న వ్యవహారం. అయినా మా బాధ్యత. ఇది మరీ భాధ్రపద మాసం. మంచి నెల కాదు. ఆశ్వీయుజం రానీ చూడ్డం మొదలెడదాం…” అంది.
కానీ ఆ తరవాత దాని గురించిన మాటే లేదు. మ్యారేజి బ్యూరోలో రెజిస్టరు చేద్దాం అని అన్న అమ్మ ఆ సంగతి మరిచిపోయినట్లుంది. కాని రాధ మర్చిపోలేదు. ముందు డబ్బుకావాలి. లోను తీసుకోవచ్చుకాని అది సరిపోదు. అప్పటినుంచి పెళ్ళి కోసం విడిగా పెట్టడం మొదలు పెట్టింది. ఎందుకో తల్లికి ఆవిషయాన్ని చెప్పాలనిపించలేదు.
అప్పటినుంచి ఇంట్లో వాళ్ళని గమనించడం మొదలెట్టింది. తన ఉద్యోగం, తన డబ్బు ముందు, తన పెళ్ళి వాళ్ళకి చిన్నగా కనిపిస్తోంది అని మెల్లి మెల్లిగా అర్థం అవడం మొదలయింది.
రిటైరు అయిన తండ్రి, అన్నింటికి ఆర్గ్యూ చేసే తల్లి, తన జీతంతో గడిచే ఇల్లు, చదువుకుంటున్న తమ్ముడు… అందరూ తన మీద, తన డబ్బు మీద ఆధారపడ్డ వాళ్ళే. తను పెళ్ళి చేసుకోడం ఇష్టం లేనివాళ్ళే అందరు, తను వెళ్ళపోతే ఎలా…! ఎన్నో కంఫర్ట్స్ పోతాయి.. ఎన్నో సౌకర్యాలు పోతాయి.. వాళ్ళకి కావలసింది ఎన్నో. అవన్నీ పోతాయి. కాని, తను మాత్రం ఎన్ని ఏళ్ళు వాళ్ళని చూడగలదు…?
అందరూ కూడా వారి వారి అవసరాలు తీర్చుకుంటున్నారు. ఏడేళ్ళనుంచి ఉద్యోగం చేస్తోంది. ఏ మాత్రం మార్పు లేదు. కాకపోతే అప్పుడప్పుడు విమానంలో వేరే ఊళ్ళకి, యూఎస్‌కి వెళ్తోంది. జీతం పెరిగింది. అంతేనా.. జీవితం అంటే ఉద్యోగం, సంపాదన అంతేనా….. ఆపైన కూడా తనకో జీవితం ఉంది. అది వీళ్ళకి తెలీదా….! తెలుసు… కాని తెలీనట్లుంటారు.
ఓ కూతురి బాధ్యత తల్లి దండ్రులది కాదా..! చదువు వరకూ వాళ్ళ బాధ్యత నిర్వర్తించారు. తన పెళ్ళి వాళ్ళ బాధ్యతే, కానీ వాళ్ళ దగ్గర డబ్బు లేదు. అలాంటప్పుడు వాళ్ళే తన పెళ్ళి చేయాలన్న రూలేం లేదు. అందుకే సతీష్‌ని చేసుకుందామనుకుంది, తనే తన పెళ్ళి చేసుకుంటే, వాళ్ళు ఆశీర్వదిస్తారు, అనుకుంది, కాని అలా జరగలేదు. పెళ్ళి అయి వెళ్ళిపోతే వాళ్ళని చూడనేమోనన్న భయం వాళ్ళకుండచ్చు. కానీ తను వాళ్ళని వదిలెయ్యదు. పెళ్ళయ్యాకా కూడా అమ్మా వాళ్ళకి అన్ని విధాలా అండగా ఉంటుంది…. ఆదుకుంటుంది. దాని గురించే భయం వాళ్ళకుంటే దాన్ని పోగొడుతుంది. వాళ్ళకి భరోసా ఇస్తుంది. కానీ వాళ్ళకి తన మీద నమ్మకం లేకపోయింది. అందుకే మాట్రిమోనీ వాళ్లు ఇచ్చిన లిస్ట్‌లో ఉన్న పెళ్ళికొడుకులందరికీ ఏదో ఒక వంక పెట్టి, రిజెక్ట్ చేసేది. అసలు తల్లి చూపించిన కారణాలు వింతగా అనించాయి.
“మరీ పల్లెటూరి వాటంలా ఉన్నాడు…. డొనేషన్ కాలేజీలో చదివాడు. అది కూడా ఎక్కడో ఊరవతల ఉన్న కాలేజీలో చదివాడు.. ఇలాంటి వాళ్ళకి ఎక్స్‌పోజర్ తక్కువ… ఇలాంటి వాళ్ళతో కంపాటబులిటీ తక్కువుంటుంది….. ఈ పిల్లాడేంటో ఓ గ్రూపు ఫొటో పెట్టి, తనెక్కడున్నాడో ఓ సున్నా చుట్టాడు. అలా పెడితే ఆ పిల్లాడి గురించి ఏం తెలుస్తుంది…. అసలు పెళ్ళి చూపులు ఆ ఫొటోలు ఎలా ఉండాలో తెలీదు ఏం బాలేదు…. ఇంకోటి చూద్దాం. పెళ్ళి చూపుల కోసం పెట్టిన ఫోటోలో నల్ల కళ్ళజోడు పెట్టుకోడం ఏంటీ… నాకు అసలు నచ్చలేదు బాబూ…..
మీ ఇద్దరి జీతాలు ఒకటే. చదువులు కూడా ఒకటే….. అబ్బాయి కూడా బీటెక్కే అయితే ఎలా.. నీకన్నా ఎక్కువ చదువుండాలి. ఏ ఎంబీఎనో, ఎంటెక్కో, ఎంసీఏనో అయితే బావుంటుంది. అవునా…” అంటూ కూతురి మొహం చూసింది. రాధ ఏం మాట్లాడ లేదు.
తల్లి చెప్పిన సంబంధాలు ఏ ఒక్కటీ కూడా కుదరలేదు. ఎందుకు కుదరలేదో రాధ అడగలేదు.
ఆమె ఎందుకు వంకలు పెడుతోందో తెలీదు. తనకైతే అన్నీ బాగున్నాయి. అసలు వంక పెట్టేందుకేం కనిపించలేదు. తల్లి ఎందుకలా చేస్తోంది.
రాధ మౌనంగా ఉండిపోయింది. ఆ తరవాత ఇంట్లో అందరితో మాటలు తగ్గించేసింది. అప్పటినుంచి, ఇంట్లో అందరిని గమనించడం మొదలు పెట్టింది. కొంచెం కొంచెంగా అర్థం అవుతోంది. అందరిలోను స్వార్థం తొంగి చూస్తోంది. స్వంత వాళ్ళు ఇలా ఉంటారా…! తను వాళ్ళ పుట్టిన రోజులకి, పండగలకి, పబ్బాలకి స్పాన్సర్ చేసే మనిషి మాత్రమే…
అంతలో ఎవరిదో మాటలు వినిపిస్తే తల్లి ఆలోచనల్లోంచి ఈ లోకంలోకి వచ్చింది రాధ చుట్టూ చూసింది. అది హాస్పటల్ అన్న సంగతి గుర్తుకొచ్చింది.
వెనక్కి వెళ్ళి,అంతకు ముందు కూచున్న దగ్గరికి వెళ్ళింది. అక్కడ వాళ్ళిద్దరూ కనిపించ లేదు. ఎక్కడికైనా వెళ్ళి ఉంటారు అని అనుకుంటూ కూచుంది. మరో రెండు నిమిషాలకి, ఆఫీసు వాళ్ళు ముగ్గురిని వెంట పెట్టుకుని నారాయణ, ప్రశాంత్ వచ్చారు. వాళ్ళు సౌమ్య, వరుణ్, అక్షయ్, రాధతో పని చేసేవాళ్ళు. అందరూ నిశ్శబ్దంగా వచ్చి, రాధ చేతిని నొక్కారు. ఆమె ఒక్కసారిగా ఏడ్చేసింది. అందరూ ఓదారుస్తూ ఆమె పక్కనే కూచున్నారు.
“అప్పుడనగా బయల్దేరుతున్నాం ఓ అరగంటలో వచ్చేస్తాం అని అన్నారు. ఇంతసేపయిందేంటీ? ” అని అన్నాడు ప్రశాంత్.
“నిజమే అప్పుడే నీకు చెప్పినప్పుడే బయల్దేరాం. రోడ్లు బావుంటే అరగంట ఏంటీ, పావుగంటలోనే రావచ్చు. మా వీధిలో డ్రైనేజి పైపులేస్తున్నారు. మన రోడ్ల సంగతి మనకి బాగా తెలిసిందే కదా…. పైపులంటూ, డ్రైనేజీలంటూ, వైర్లంటూ కేబుళ్ళు, ఓ సారి కరెంటు వాళ్ళు, మరోసారీ మున్సిపాలిటీ. ఇలా ఎవరి మటుకు వాళ్ళు రోడ్లని ఇష్టం వచ్చినట్లు తవ్వి పారేయడం, ఉన్నఆయింత రోడ్లో సగం తవ్వకాలతో మిగిలిన సగం తవ్వి పారేసిన మట్టి కుప్పలు. ఉన్న ఆ మిగిలిన రిబ్బను ముక్కలాంటి రోడ్డు గతుకులు, గుంటలు. పైగా అక్కడక్కడో పైపు లీకు అయనట్లుంది. నీటి గుంటలు. అందులోనే ట్రాఫిక్ జాం. కార్లో ఉన్నా ఒళ్ళు హూనం అయిపోయింది. ఇలాంటి రోడ్డ మీద వస్తే అరగంటలో ఎలా వస్తాం! అయినా మన సంగతి ఎవరిక్కావాలి…! ఈ రోడ్లూ, మనం అంతా అనాధలం. టాక్సు మాత్రం ముక్కు పిండీ వసూలు చేస్తారు.
ఈ గతుకుల దార్లో, కొంచెం దూరం వచ్చాం, హమ్మయ్య పరవాలేదు అని అనుకోడానికి లేదు. ఆ తరవాత పూర్తి కాని మెట్రో.. పనులు, ఆదివారం అయినా ఎంత ట్రాఫిక్కో… ఓ చోట ట్రాఫిక్ లైట్లు పనిచెయ్యడం లేదు. పోలీసులు, వాహనాలని కంట్రోల్ చేస్తున్నారు. ఇంక వాడు మధ్య మధ్యలో మరో పోలీసుతో ముచ్చట్లు పెడుతూ, ఓ వైపు వాళ్ళకి, తొందరగా వెళ్ళమన్నట్లు చెయ్యి చూపించి, మరోవైపు చూపించడం మర్చిపోయాడు. ఇంక అంతే. అలాగే ఉన్నాం. అందరూ విసుగ్గా హారన్ మోగిస్తే అప్పుడు మావైపు వాహనాలని వెళ్ళమన్నట్లు చేయి ఊపాడు. ఇదిగో ఇలా ఈ కారణాలవల్ల గంట పట్టింది. ఏఁవిటో మన రోడ్లు మీద ప్రయాణాలూ ఓ పెధ్ద ఛాలెంజ్ అయిపోయింది… ఏ క్షణాన ఏం జరుగుతుందో ఏమో అని అనుకుంటూ గుప్పిట్లో ప్రాణాలు పెట్టుకుని ప్రయాణం చెయ్యాల్సి వస్తోంది. ఆదివారం కాని మహా రష్…” ఆపింది సౌమ్య.
“మన రోడ్ల సంగతి అందరికీ తెలిసిందే. దాని గురించి మాట్లాడడం వేస్ట్. రాధా నువ్వు చెప్పు, డాక్టర్లేం అన్నారు… కండిషన్ ఎలా ఉందంటున్నారు….” అని రాధ వైపు తిరిగాడు వరుణ్.
“ఇంతవరకూ అయితే ఏం అనలేదు. అసలు వాళ్ళకి ఏదైనా అర్థం అయిందో లేదో అని అనిపిస్తోంది. ఎమ్మారై రిపోర్ట్ చూసి, వెంటనే ఆపరేషన్ చేయాలని అన్నారు, కాని, ఇంతవరకూ మొదలు పెట్టలేదు. ఆశ్చర్యంగా ఉంది, నమ్మకం కుదరడం లేదు. ఇది మాకే జరిగిందా అని అనిపిస్తోంది. చూస్తుండగానే, ఏంటో ఒక్కసారి అంతా నా కళ్ళ ముందు నిమిషాల్లో జరిగిపోయింది. నేనేం చేయలేకపోయాను” కళ్ళు తుడుచుకుంటూ అంది రాధ.
“కార్లో పక్కన నువ్వు లేవా, అక్కడ…… అంటే మాధవ్ ఒక్కడికే ప్రమాదం జరిగింది కదా అందుకేనువ్వు కారులో లేవా అని…..” సౌమ్య కళ్ళు తుడుచుకుంటూ అడిగింది.
“లేను….. అప్పుడే దిగి పళ్ళు కొనడానికి వెళ్తున్నాను. నిమిషాల్లోనే…. నా కళ్ళముందే…. అంతా జరిగిపోయింది..” అంటూ ఏడ్చేసింది.
“ఆ క్షణంలో కార్లో నువ్వు లేవు, కొంతలో కొంత నయం.. అదృష్టమో దురదృష్టమో నువ్వూ నీ కడుపులో బేబి, సేఫ్గా ఉన్నారు”
దీర్ఘంగా నిట్టూర్చిఅందరినీ చూసింది.
“బతకడం అదృష్టం అయితే నేను అదృష్టవంతురాలినే.. మరి లోపల పెరుగుతున్నబేబీ సంగతి ఏఁవిటీ… దురదృష్టవంతురాలా, జరిగిపోయిన దానికి ఎవరు బాధ్యలవుతారు. కారణం ఎవరవుతారు… దేవుడా, పళ్ళ వాళ్ళా, లేకపోతే యాక్సిడెంట్ చేసినవాడా.. అయినా ఈ అదృష్ట దురదృష్టాలు ఎవరు నిర్ణయిస్తారు. మాధవ్‌కి ఏదైనా అయితే…. కడుపులోని పాపకి రేపు ఏం సమాధానం ఇచ్చుకోగలను. జవాబు తయారు చేసుకున్నా సంతృప్తి పరచగలనా… లేదు” అంటూ కళ్ళు తుడుచుకుంది.
‘ఊరుకో రాధా, మాధవ్‌కి ఏం కాదు ఓ రెండు రోజుల్లో మనతో మాట్లాడుతాడు.”
అంతలో కొంచెం అలసటగా మొహం పెట్టి నారాయణ వచ్చి, రాగానే అందరి మొహాలు ఓ సారి చూసాడు… అందరూ అతడిని చూసారు.
అంతవరకూ నారాయణ అక్కడ లేడన్న సంగతి రాధకి తెలియలేదు. బయట ఎక్కడో ఉన్నాడనుకుంది. కేఫెటేరియా నుంచి వచ్చాకా చూడలేదు. పట్టించుకోలేదు కూడా. తన ఆలోచనలో తనుండిపోయింది.
“ఈ సమయంలో చెప్పాలని లేదు కానీ చెప్పాలి. పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చి వచ్చాను. చూద్దాం కేసుని ఎంత వేగంగా చేస్తారో…. అని”
“వేగమా… ఈ పోలీసులా…. అది జరిగేది కాదులే…. ఒకవేళ ఆ కారుని కనుక్కోగలిగితే అదే సంతోషమే… అయినా సీసీ కెమెరాలుండి ఉంటాయి కదా కనుకుంటారులే.. కాని ఏం లాభం.. ఇంక అప్పటినుంచి, తిప్పిస్తారు. ఇవన్నిమన టైముని తినేస్తాయి. ఇంక మనలని పిలవడం మొదలెడతారు. ఓసారి కాదు రెండు సార్లు కాదు. అదో కంటిన్యుయస్ ప్రాసెస్.. ఎన్ని చూడడం లేదూ, ఎన్ని వినడం లేదు” అన్నది సౌమ్య.
‘అదే వాళ్ళు కూడా అన్నారు. యాక్సిడెంటు ఎవరు చేసారో, తెలిసిపోతుంది. కారుని కనుక్కోగలుగుతాం. కనుక్కున్న వెంటనే మీకు చెప్తాం, మీరు రావాల్సి వస్తుంది అని అన్నారు.’
“కనుక్కోగలుగుతారే అని అనుకుందాం. ఏంచేస్తాం..?” అని అంది రాధ నిర్వికారంగా.
“అదేంటీ, రాధా అలా అనేస్తావ్..! ఏంచేస్తాం…. ఏంటీ …. న్యాయం కోసం అందరం కలిసి పోరాడుదాం. మాధవ్‌కి న్యాయం జరిగేలా చూడాలి. నీకు, నీ కడుపులోని బేబికి న్యాయం జరగాలి. మనం చదువుకున్న వాళ్ళం, ఊరుకోకూడదు. చట్ట ప్రకారంగా వెళ్దాం. పోరాడుదాం. ఆ డ్రైవరుని పట్టిద్దాం. శిక్షవేయిద్దాం” అని అన్నాడు నారాయణ.
“ఏమో నాకు ఆ కారు కనిపిస్తుందన్న నమ్మకం లేదు. పైగా నాకు ఈ వ్యనస్థ మీద నమ్మకం లేదు..” అని అన్నాడు వరుణ్.
“నాకు నమ్మకం ఉంది. కారుని గుర్తిస్తారు, పట్టుకుంటారు కానీ శిక్ష సంగతి మాత్రం నేను చెప్పలేను” అంది సౌమ్య.
“ఆరుగంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది ఇంత వరకూ ఏంటన్నది చెప్పలేదు. తొందరగా తెచ్చి ఉంటే….. అని ఎవరైనా అంటారు” అంది సౌమ్య.
రాధ ఒక్కసారిగా ఏడ్చేసింది.
“నిజమే తొందరగా తెచ్చి ఉంటే.. బతికే అవకాశాలు ఎక్కువ కాని ఎప్పుడు.. అది ప్రమాదం జరిగిన వెంటనే సాయం దొరికినప్పుడు కదా… అదే జరగలేదు. ప్రమాదం జరిగాకా మనుషులు ఎలా ప్రవర్తిస్తారో ప్రత్యక్షంగా చూసాం…. అందుకే. ఆ మాట ఎలా అనగలుగుతున్నారు అని అనిపిస్తుంది.. రోడ్డు మీద నేను…. లిటరల్‌గా నడి రోడ్లో కూచుని పిచ్చి పట్టిన దానిలా అందర్నీ అడిగాను. బతిమాలాను. ఏడ్చాను. ఎవరూ ముందుకి రాలేదు. మనుషులు వెళ్తున్నారు, ఆగుతున్నారు, చూస్తున్నారు, కానీ, ఎవరూ కూడా ముందుకి రాలేదు. కారులోంచి బయటికి తీయడానికి ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా సాయం చేయడానికి ముందుకి రాలేదు…..” అంటూ మళ్ళీ ఏడ్చేసింది.
“రారు… ఎందుకంటే మన సమాజం అలా ఉంది. నలుగురిలో ముగ్గురు ముందుకి రారు. అంతేకాదు, మనకెందుకనే తత్వం కూడా ఉంది. ఓ రకమైన మానసిక స్థబ్ధత. అదో సైకొలాజికల్ సిండ్రోం. అందుకే ప్రేక్షకులుగా ఉండిపోతున్నారు. వాళ్ళ అనుమానాలు వాళ్లకు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, ఈ కోర్టు వ్యవహారాలూ మన చట్టాలు అవీ జాలిపడి, రోడ్డుమీద గాయపడిన వాళ్ళని, వాళ్ళకి సాయపడే గుడ్ సమరిటన్స్‌ని రక్షించవు అని….. అందుకే ముందుకి రారు” అన్నాడు నారాయణ.
“కారణం ఏదైతేనే ఓ గంట అలా రోడ్డు మీద పిచ్చిపట్టిన దానిలా ఏడుస్తూ ఉన్నాను. కర్ణుడి చావులాగా అనుకో…. అన్నీ ఆలస్యమే. అంబులెన్స్‌కి ఫోన్ చేస్తే వెంటనే రాలేదు.
ఇదివరకు రోజులంటే వేరు. ఆ రోజుల్లో ఇలా రోడ్డు మీద ఏదైనా జరిగిందంటే, ఫోను చెయ్యాలంటే పబ్లిక్ ఫోన్లు ఎక్కడున్నాయో వెతకాల్సి వచ్చేది. లేకపోతే ఫోనున్న దుకాణం కోసం అటూ ఇటూ వెళ్ళాల్సి వచ్చేది.
కాని, ఈ రోజుల్లో అలా కాదు కదా… ఎక్కడికో వెళ్ళి పోను చెయ్యాల్సిన పనే లేదు. అందరి దగ్గర మొబైలు ఫోన్లున్నాయి, యాక్సిడెంటు అయిన వెంటనే ఫోను చేయడం జరిగింది. అంబులెన్స్ రావడం ఆలస్యం అవుతుందని చెప్పారు. వచ్చిన పోలీసులు మా ఏరియా కాదని వెళ్ళిపోయారు… ఉన్న మనుషులు సాయం చేయడానికి రాలేదు. పైగా ఉదయం కూడా మనుషులు ఎక్కువ లేరు. అటూ ఇటూ ఉన్న దుకాణాలు అన్నీ మూసి ఉన్నాయి. వీళ్ళిద్దరకీ కాల్ చేసాను. వాళ్లుండేది అక్కడికి దగ్గర్లో. ఉన్నవాళ్లు వచ్చినా ఏం చేయలేకపోయారు, చూడ్డం తప్ప. అందుకని వెంటనే తీసుకు వచ్చి ఉంటే అన్నది జరగదు..” అని ఆగి, రాధ ఒక్కసారి గట్టిగా ఏడ్చేసింది.
“ఒక వేళ అలా జరిగితే అని ఈ జరిగినదానికి ఎవరు బాధ్యలు అన్నదే.. దాని గురించే …”
“ఎవరు బాధ్యులు అంటే ఏం చెప్పగలం.. యాక్సిడెంటు అయిన వెంటనే సాయం అందలేదు. అదే మెయిన్ కారణం. ఓ గంట రెండు గంటలైనా చూస్తారు, కాని చెయ్యి వేసి పక్కకి కూడా జరపరు…. అంతే…. వాళ్ళు కేవలం స్పెక్టేటర్స్.”
“వాళ్ళని అనడానికి లేదు. ఈ చుట్టూ చూడడానికేవచ్చే వాళ్ళు ఇలాంటి వాటిలో తల దూర్చి బొప్పి కట్టుకున్నవాళ్ళే అయి ఉండాలి. అందుకే భయపడుతున్నారు.”
“ఎందుకూ! వీళ్ళెవరికి భయపడుతున్నారు! పోలీసులకా..! చట్టాలకా….! ఈ చట్టాలు అంత భయపెట్టేలా ఉన్నాయా…! జనాలని భయపెట్టే ఈ చట్టాలు ఎవరికి లాభాన్నిస్తున్నాయి…!” ఎవరూ ఏం మాట్లాడలేదు.
“మా అన్నయ్య లాయరు. కొంచెం కనుకుంటాను, కేసు ఎలా ఫైలు చేయడమో… అదీనూ” అన్నాడు
“అదో తలనొప్పి, వద్దులే…. మాధవ్ బాగయిపోతే చాలు….. పైగా ఇది సమయం కాదు, ఇంత జరిగాకా, నాకేం కేసు పెట్టాలనిపించడం లేదు.. పైగా ఇంత వరకూ మాధవ్ గురించి డాక్టర్లు ఏం చెప్పలేదు. ఈ పోలీసులు, కేసు, వీటి గురించి నాకేం చెప్పద్దు. నాకేం ఇంట్రెస్ట్ లేదు. లోపల తను ఎలా ఉన్నాడో…” అంటూ రాధ కళ్ళు తుడుచుకుంది.
“నిజమే రాధా.. ఇదంతా తొందరగా తేలే వ్యవహారం కాదు. ఓ సారి ఇలాగే ఓ చేదు అనుభవం మాక్కూడా జరిగింది. ఓ సారి ట్రాఫిక్ వయొలేషన్ కేసు, చాలా చిన్నదే అనుక్కో….. దాని కోసం నేను, మా కాంప్లెక్స్ లో ఉండే ఫ్రెండ్‌కి సాయంగా కోర్టుకి వెళ్ళాను. అవి పెట్టీ కేసులు. కాబట్టి ఆఖరున వచ్చాయి. సాయంత్రానికి అయిపోయింది. దానికోసం ఓ రోజు పూర్తి సెలవు పెట్టుకోవాల్సి వచ్చింది. ఆ కోర్టు ఆవరణలో అటూ ఇటూ తిరుగుతూ పడిగాపులు కాసాము. ఆ కోర్టులో మమ్మల్ని అందరూ నేరస్తుల్లా చూస్తున్నట్లనిపించింది. ఎందుకంటే అందరూ అలాంటి వాళ్లే వస్తారు కాబట్టి, డబ్బు కట్టడం అయిపోయింది. ఒక్క రోజుతో సరిపోయింది. కాని ఆ ఒక్కరోజుకే ఎంత టైము వేస్ట్ అయిందో అనిపించింది. మరో రకం మెంటల్ టెన్షన్. అలాంటిది, వేరే వాళ్ళకోసం వీళ్ళంతా ఎలా వెళ్తారు. ఒక్కరోజుతో అయిపోతుందనుకోడానికి లేదు. ఎన్నిరోజులు పడుతుందో ఎవరికీ తెలీదు. ఒక్కొక్కసారి ఏళ్ళు పడతాయి మనం సల్మాన్ ఖాన్ కేసు చూసాం, అందుకే సాక్ష్యానికి రావాలంటే ఓ రెండు అడుగులు వెనక్కి వేస్తారు. కోర్టుతో అంటే ఇంక అంతే సంగతులు అని తెలుసు” అన్నాడు వరుణ్.
“నేను అనేది కూడా అదే… ఈ సమయంలో ఇవన్ని అవసరమా…. ప్రస్తుతానికి వదిలేద్దాం. నాకేం మాత్రం ఇంట్రెస్ట్ లేదు. దాని గురించి మాట్లాడుకోడం వేరు. అనుభవిచడం వేరు. థియరీ వేరు ప్రాక్టికల్స్ వేరు. చెప్పడానికి ఎన్నైనా చెప్పచ్చు. కోర్టుల చుట్టూ తిరగడం అంటే ఎన్నో వదులుకోవాలి. అందుకని సాయం చెయ్యడానికి ఎవరూ ముందుకి రారు….. మాధవ్ ఇలా ఉంటే కోర్టులూ అవీ ఎందుకూ…. పైగా ఇవి ఒక్క రోజులో తేలేవి కావు… వదిలేయడం మంచిది…..” అంది రాధ.
“అలా అని వదిలేయం కదా… నేను కనుకుంటాను. ఓ గంటలో వస్తాను…” అని రాధ వైపు తిరిగాడు నారాయణ.
“నేను ఇప్పుడే వస్తాను” అంటూ లేచింది సౌమ్య. వరుణ్ కూడా ఆమె వెనకాలే వెళ్ళాడు.
(ఇంకా ఉంది)