తమసోమా జ్యోతిర్గమయ-9

0
2

[box type=’note’ fontsize=’16’] “గతాన్ని వదిలేయాలి. దాని గురించి ఆలోచిస్తూంటే, ప్రశ్నలు ఎక్కువ, సమాధానాలు తక్కువ ఉంటాయి” భర్త గురించి రాధ ఆందోళనని గంటి భానుమతితమసోమా జ్యోతిర్గమయ’ ధారావాహిక 9వ భాగం చెబుతుంది. [/box]

[dropcap]కొ[/dropcap]న్ని గంటల్లో ఎంత మార్పు. ఎంత తేడా…. నిన్నటి వరకూ జరిగినవన్నీ, కోసేస్తున్న జ్ఞాపకాలుగా ఉన్నాయి. ఈ రోజున జరిగిన ఘటన జీవితాన్ని అర్థం చేసుకునే జ్ఞానం, అయోమయంలో పడేస్తోంది. ఎన్నో కలలు, ఎన్నో ఊహలు అవన్నీ అలా గతంలోనే ఉండిపోవాలా…

“మళ్ళీ వస్తాం. పిల్లలు ఏం చేస్తున్నారో చూసి, మా అత్తగారికి అన్ని విషయాలు చెప్పి వస్తాం, ఓ గంటలో మళ్ళీ వచ్చేస్తాం” అని సౌమ్య, వరుణ్ వెళ్ళిపోయారు.

రాధ ప్రశాంత్ వైపు చూసింది. ఆ చూపుని అర్థం చేసుకున్నట్లుగా, తలని అడ్డంగా ఊపాడు.

“భలేదానివే నిన్ను ఇక్కడ ఉంచి ఎలా వెళ్తాం… నారాయణ వెళ్తాడు, తన మిసెస్ ప్రెగ్నంట్. ఆమెకి తన హెల్ప్ చాలా అవసరం.. నాకు పరవాలేదు. అంతగా అయితే నారాయణ వచ్చాకా నేను వెళ్ళి వస్తాను.”

“లేదు నేను కూడా ఇక్కడే ఉంటాను.. నువ్వు ఒక్కదానివి ఇలాంటి పరిస్థితిలో.. అంతగా అయితే సౌమ్యా వాళ్ళు వచ్చాకా వెళ్తాం…” అన్నాడు నారాయణ.

“వాళ్ళు వచ్చే వరకూ అంటే వాతావరణం అప్పటికి ఎలా ఉంటుందో. సాయంత్రం నుంచి దట్టంగా నీటి మేఘాలున్నాయి. సన్నగా వాన కూడా మొదలయింది. ఇంకా పెద్దగా అవక ముందే, మీరు వెళ్ళి వచ్చేయండి అని అంటున్నాను. ఇంటికెళ్ళి భోంచేసి రండి.”

“డబ్బు ఎంత తెస్తే సరిపోతుంది” అని అడిగాడు.

“నాకు అస్సలు ఐడియా లేదు. రెండు మూడు లక్షలవుతుందేమో… ఆపరేషన్ ముందు మనం కొంత కట్టాం. మాధవ్ పేరెంట్స్ యీభైవేలు ఇచ్చారు. అయినా రేపు సోమవారం కదా అకౌంట్సు వాళ్ళు అందరూ వస్తారు. అప్పుడే వాళ్ళని అడిగి చూసుకోవచ్చు. ఇప్పడేం వద్దు. మీరు వెళ్ళి వచ్చేయండి. పైగా ఏటీఎంలు ఉండనే ఉన్నాయి. డబ్బుకి ఇబ్బంది లేదు. మీరు వెళ్ళండి.”

వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు

మాధవ్ పేరెంట్సుని ఇన్ని నెలల తరవాత ఇప్పుడు, ఇలా… హాస్పటల్‌లో చూడాల్సి వస్తుందని అనుకోలేదు. వాళ్ళు రావడం ఆశ్చర్యం అనిపిస్తోంది. మీరు రావద్దని, సంబంధం లేదు అని అన్న మనిషి, ఎలా వచ్చారు…. కొడుకు మీద ప్రేమ కావచ్చు. మరి ఆ రోజుది… అది ఏఁవిటీ….,! అది, నిజం కాదా….! ఆ నిజం మీద ఈ రోజుది సంస్కారం, ఆ రోజున ఆమె అన్న మాటలు, ఇంకా గుర్తుది… మీది మాది ఓ కులం కాదు, ఓ ప్రాంతం కాదు, మీకు కట్నం ఇచ్చుకునే శక్తి ఉండదు, ఎందుకంటే నీ జీతం మీద బతుకుతున్న కుటుంబం మీది. నీ పెళ్ళి మీ వాళ్ళు చెయ్యరు అందుకే డబ్బున్నవాడని మా పిల్లాడిని వల్లో వేసుకున్నావు… ఇలాంటి సంబంధం చేస్తే మా బంధువుల్లో మా పరువు పోయింది కదా… ఎంతో మంచి మంచి సంబంధాలొచ్చాయి… ఇంకా మేము వాటిల్లో ఏదో ఒకటి సెటిల్ చేయాలనుకుంటున్నాం, అంతలోనే ఈ పెళ్ళి… నన్నడిగితే.. అసలు ఈ పెళ్ళి చెల్లదు. పోలీసు కంప్లెయింట్ ఇస్తాం అప్పుడు గానీ తెలీదు, మాలాంటి వాళ్ళతో పెట్టుకుంటే ఏం అవుతుందో, అలాగే చేసారు.. ఆ తరవాత నరకం చూపించారు. పోలీసులు గొడవలు, తన ఇంట్లో, తల్లీ తండ్రి మరో రకం గొడవ.. ఆఖరికి పోలీసులు కలగచేసుకుని విడదీసారు.

ఇది జరిగి ఏడాది అయింది. కిందటి నెలలోనే మొదటి పెళ్ళిరోజు జరుపుకున్నారు. అవన్నీ ఎప్పుడో జరిగినట్లనిపిస్తోంది. ఆ గతాన్ని మర్చిపోవాలా…! దాన్నిసమాధి చెయ్యాలా! ‘మనసులో పెట్టుకోకు.. మన వాళ్ళని మనం క్షమించకపోతే ఎవరు క్షమించాలి’ అన్న మాధవ్ చెప్పినట్లు చెయ్యాలి. ఇప్పుడు ఆవిడ తన కొడుకు మాధవ్ కోసం వచ్చింది. తన కన్నా ముందు నుంచే మాధవ్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఆ యింట్లో పెరిగాడు. ఓ ఏడాదిలో ఆ బంధం ఎలా తెగుతుంది. తెగదు… ఆవిడ ఓ తల్లి, ఆమెని క్షమించేసింది.

ఎవరో వచ్చి చెయ్యి పట్టుకుంటే కళ్ళు తెరిచింది. నీటిబొట్లు చూపుని మందగించాయి. కాని ఆ నీటి తెరల్లోంచి వాళ్ళని గుర్తించింది.

అమ్మ…. నాన్న…. తమ్ముడు…… ఆమె పక్కన కూచున్నారు. వాళ్ళకి కొంచెం పక్కగా సౌమ్య, వరుణ్ ఎప్పుడొచ్చారో ఏమో నుంచుని ఉన్నారు.

వెంటనే తల్లి ఒళ్ళో తన రెండు చేతులూ ఉంచి, తలని ఆమె భుజం మీదకి ఆనించింది. వసుంధర తల కుడిచేతిని కూతురి భుజం పైన వేసి ఏడ్చింది. ఇలాంటి సాంత్వన కోసం,ఇలాంటి దగ్గరతనం కోసమే ఎదురు చూసింది. వాళ్ళిద్దరూ ఎంత సేపు అలా ఉన్నారో తెలీదు.

“ఎలా జరిగిందే… డాక్టర్లు ఏం అంటున్నారు….” తేరుకుని వసుంధర అడిగింది.

మొదటి నుంచి, జరిగినదంతా చెప్పింది.

“దేనికైనా పెద్దవాళ్ళ ఆశీర్వాదం ఉండాలి. లేకపోతే ఇదిగో ఇలాగే, ఇలాంటివే జరుగుతూంటాయి.”

రాధకి నోటమాట రాలేదు.

తన పెళ్ళి, వాళ్ళలో ఇంత వ్యతిరేకతని పెంచిందా! ఆ విషయం ఏమాత్రం సంకోచించకుండా చెప్పేయగలిగింది అంటే ఆమె తన కోపాన్ని ఎంతగా మనసులో ఉంచుకుందో….! ఎంతో మంది, తమ తల్లి తండ్రులకి ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. అందరూ ఇలాగే ఉంటున్నారా..! లేదే…. వెంటనే అన్నీ మర్చిపోయి, మామూలైపోతునన్నారు. ఒకటై పోతున్నారు. ఏడాది అయినా అమ్మ ఏం మారలేదు. మాధవ్ తల్లికి, అమ్మకి తేడా ఏం లేదు. ఈ విషయంలో ఇద్దరూ ఒకే లాగా ప్రవర్తించారు.

అమ్మ తనని అర్థం చేసుకుంటుందని అనుకుంది. కానీ చేసుకోలేదు. నిజమే అమ్మా వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్ళి చేసుకుంది. అది వాళ్ళకి బాధ కలిగించింది. వాళ్ళ బాధ తెలుసు. అర్థం చేసుకోగలదు, తను పెళ్ళిచేసుకోవడం అమ్మా వాళ్లకిష్టంలేదు. అయితే ఆమాట అనాల్సిన సమయమా ఇది…. సందర్భమా ఇది… ప్రతీసారీ, ప్రతీదీ, ప్రతీ విషయం అమ్మ తనవైపు నుంచే చూస్తుంది.

రాధకి పాతవి ఎన్నో గుర్తొచ్చాయి. అలా గుర్తుకు తెచ్చుకోవడం ఇష్టం లేదు. కానీ వచ్చేస్తోంది. గతాన్ని వదిలేయాలి. దాని గురించి ఆలోచిస్తూంటే, ప్రశ్నలు ఎక్కువ, సమాధానాలు తక్కువ ఉంటాయి. ఇప్పుడు కూడా అంతే. జరిగినది తలచుకోకూడదని అనుకున్నా…. గుర్తుకొచ్చేస్తోంది.

ఇన్ని రోజుల తరవాత మాధవ్ వైపు వాళ్ళు, తన వైపు వాళ్ళు వచ్చారు, అందరూ కూడా అప్పటి వాళ్ళే. …వీళ్ళు అప్పటి ఆ మనుషులా..! ఇప్పటి ఈ మనుషులా…..! అది నిజమా! ఇది నిజమా….! అప్పటి ఆ నిజం మీద ఇది పై పూత ఈ పూత పేరు, సంస్కారం. కల్చర్.. ఆ కోపం పోయిదా..! ఒకవేళ పోతే తనని దగ్గర తీసుకునేవారు కదా. లేదు ఆ కోపం పోలేదు. అది అలాగే ఉంది. ఇది లోకం కోసం…..

ఎలా ఉన్నావ్ అని అడిగిన తల్లికి సమాధానం వెతుక్కోనక్కర్లేదు అని అనుకుంది. ఒక్కసారిగా ఎన్నో నాలిక చివరికి వచ్చేసాయి. ఎన్నో చెప్పాలనుకుంది. పెళ్ళికి ముందు అమ్మ తనకి ఎంతో దగ్గర అనిపించేది. ఎన్నో చెప్పుకునేది. మళ్ళీ ఇన్నిరోజుల తరవాత అమ్మ కనిపించేసరికి ఎంతో దగ్గర అనిపించింది. అందుకే.. తన మనసులో ఉన్నది చెప్పుకోవాలనిపించింది. అత్తగారింట్లో తనకి జరిగిన అవమానం చెప్పాలనుకుంది. తను ఆ రోజున ఎలా బాధ పడిందో మనసు విప్పి చెప్పాలనుకుంది. తను ఉద్యోగం, ఇంటి బాధ్యత ఎలా బెలెన్స్ చేసుకొస్తొందో ఇలా ఎన్నో ఉన్నాయి చెప్పుకోడానికి.

ఈ లోపలే తల్లి వాళ్ళ ఆరోగ్యం డాక్టర్లూ రోగాలూ అన్నీచెప్పడం మొదలు పెట్టింది. రాధ తెల్లబోయింది. ఇదేంటీ..! ఇలా.. మాట్లాడుతోంది…! అమ్మ తన గురించి అడిగి ఉంటే ఎంత బావుండేది! ఈ ఏడాది నీ జీవితం ఎలా గడిచింది! నెల తప్పావా….! లాంటి ప్రశ్నలు వేసి ఉంటే తన బాధ కొంచెం తగ్గేది… పెళ్ళికి ముందు ఎంతో ప్రేమ ఉండేది. అమ్మ ఓ ఆదర్శ మహిళ రోల్ మోడల్ అని అనుకోనేది. ఫ్రెండ్స్‌తో మాట్లాడేటప్పుడు మా మదర్ అని, మా అమ్మ అని ఎన్నోసార్లు అనేది. మాధవ్ కోసం అమ్మని వద్దనుకుందా…. అమ్మ లాగే తను పెళ్ళి చేసుకోవాలనుకుంది. అది ప్రకృతి సహజం. అమ్మ అర్థం ఎందుకు చేసుకోలేదు? ఆమెది ఎటువంటి ప్రేమ…? అమ్మతో జీవితం ఓ కలా! ఓ జీవితం ఓ కలా..! అవును, అది కలల కుప్ప. కల ఓ సారి వచ్చి కరిగిపోతుంది. తిరిగి అదే కల మరోసారి రాదు. మరోసారి కనలేము. తమ మధ్య కూడా అంతేనా…! అమ్మ తన మీద చూపించిన ప్రేమ కూడా అంతేనా…! అది అంత బలహీనమైనదా..! డబ్బుతో ముడి పడి ఉందా..! డబ్బు ఇస్తూ పెళ్ళిచేసుకోకుండా ఉంటే ఈ ప్రేమ మరింత గట్టి పడేదా….! కారణం ఏఁవిటీ. తనేనా…! వాళ్ళు అలవాటు పడ్డ ఆధునికత అన్నింటిని దూరం చేసింది.

మళ్ళీ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. అటు వాళ్ళు, ఇటు వాళ్ళు ఈ సమయంలో కూడా వదలేయడానికి సిద్దంగా ఉన్నారు. ఎవరూ ఎవరికీ ఏమీ కారు… చివరికి మిగిలేది మనకి మనమే.. ఎవరూ ఎవరికీ అర్థం కారు. అది నిజం. కాని ఒప్పుకోడానికి అహం అడ్డొస్తోంది. ఇది తమ బలహీనతా…

ఇంక తల్లితో మాట్లాడాలనిపించలేదు. ఓ అరగంట తరవాత తల్లి మామూలుగా అయిపోయింది. ఎన్నో విషయాలు ఇదివరకూ లాగే చెప్పి, రాధ మూడ్‌ని కొంచెం మార్చింది. తల్లి కోపం పోయిందా!

అంతకు ముందు మాధవ్ తల్లి మాట్లాడిన విధానంలో కూడా తేడా వచ్చింది. అంతేనా ఈ ఫీలింగ్స్ అన్నీ శాశ్వతం గావా. అది నిజమా… ఇది నిజమా… మాధవ్ మాటలు గుర్తొచ్చాయి.

“మనం అనుకుంటాం కానీ, ఈ కోపాలూ తాపాలూ ఎక్కువ రోజులుండవు.అవి శాశ్వతం కావు. ఇవన్నీ తాత్కాలికం. అప్పటికప్పుడు కలిగే అనుభూతులు ఏవైనా అంతే. చాలాకాలం ఉండవు. అభిప్రాయాలు కూడా అంతే, చంచలంగా మారిపోతూంటాయి. ఓసారి బలంగా కలిగిన అనుభూతి కొన్నిరోజుల తరవాత బలహీన పడిపోవచ్చు. ఇప్పుడు కూడా అంతే, ఏదో ఓ రోజున అమ్మ మనల్ని రమ్మంటుంది. చూస్తూండు.”

మాధవ్ గుర్తొచ్చేసరికి మనసులో అలజడి బాధ.. లోపల మాధవ్ ఎలా ఉన్నాడో… బయట వీళ్ళు వీళ్ళ మూలంగా అలజడి. బద్ద శత్రువుల్లా…. చేరోమూలా… ఒక వైపున అమ్మా నాన్న, మరో వైపున అత్తగారు వాళ్ళు… మధ్యలో తను….. అందరూ ఒకళ్ళకొకరు కావలసినవాళ్ళే…. కానీ అది చెప్పుకోడానికి మాత్రమే…. అందుకే అందరి మధ్యా ఒంటరిగా ఉండిపోయింది. అందరూ ఆధునికంగా ఉన్నారు. బాగా చదువుకున్నవాళ్ళే… కానీ… ఎవరికి వారే ద్వీపాంతర వాసులు…. గ్రహాంతర వాసులు. ఏది వీళ్ళందరినీ విడదీసింది. ఆధునికతా… టెక్నాలజీనా….. చదువులా….. అన్నీ కనిపిస్తున్నాయి, కాని, మానవ సంబంధాలు మాయమయిపోయాయి.

కళ్ళు మూసుకుంది. మళ్ళీ కళ్ళ ముందు అయోమయం ప్రపంచం. మాధవ్ మీద బెంగ. లోపల ఎలా ఉన్నాడో.. ఆపరేషన్ ఎంతవరకూ వచ్చిందో…. ఓ రెండు సార్లు నర్సులు వచ్చారు కానీ ఏం చెప్పడంలేదు. అడిగితే ఓ సారి మొహం చూసి వెళ్ళిపోతున్నారు. ఆపరేషన్ చేసేముందు వాళ్ళు అన్నారు,.

ఆ తలుపులు వెనకాల ఏం జరుగుతోందో మీకు తెలవాలి, మీరు కూడా తెలుసుకోవాలి, మేము ఆపరేషన్ ఎలా చేస్తున్నామో అన్నీ బయటినుంచి మీరు ఆ స్క్రీను మీద చూడచ్చు అన్నారు…. కాని ఇప్పుడు అదేం లేదు. ఏదో స్క్రీను పాడయిందిట అందుకే లోపల ఏం జరుగుతోందో ఏం చేస్తున్నారో, అన్నీ బయటినుంచి మీరు చూడలేకపోతున్నారు అని అన్నారు. అది నిజం కావచ్చు కాకపోవచ్చు. కానీ, లోపల జరిగేది ఎవరికీ తెలీడంలేదు.. అందుకని ఆ తలుపులు ఎప్పుడు తెరుచుకుంటాయో.. ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో…. అన్నట్టుగానే టెన్షన్‌తో ఉన్నారు.

అంతలో ఇంటికి వెళ్ళిన నారాయణ వరుణ్, ప్రశాంత్ వచ్చారు. వస్తూ రెండు పెద్ద ఫ్లాస్కుల నిండా కాఫీ తీసుకొచ్చారు. అక్కడున్న వాళ్ళందరికీ ఇచ్చారు. వద్దనకుండా అందరూ తాగారు. సౌమ్య సాండ్‌విచ్‌లు అందరికీ ఇచ్చింది. అందరూ ఆకలి మీద ఉన్నారేమో మొహమాటపడుతూనే తిన్నారు.

ఇది జరిగిన ఓ అరగంటకి వర్షం తగ్గడంతో… ఎవరో ఫోన్ చేయడంతో… సౌమ్య బయటికి వెళ్ళింది. వాళ్ళ ఆఫీసువాళ్ళు ఓ పది మంది రిసెప్షన్‌లో ఉన్నారుట అని అక్కడికి వెళ్ళింది. ఆ మాట వినగానే రాధ గుండెలో తడి… బరువు… వీళ్ళంతా తనని ఓదార్చడానికి వచ్చినవాళ్ళు. సౌమ్య ఓ ఇద్దరిని తీసుకొచ్చింది. వస్తూనే రాధని గట్టిగా కౌగలించుకున్నారు. అలా చాలా సేపుండిపోయారు.

“అక్కడ మన వాళ్ళున్నారు. వీళ్ళు వెళ్ళాకా వాళ్ళు వస్తారు” అని అంది సౌమ్య.

“అలాగా వాళ్ళక్కడ ఉన్నారా… ఇలా ఇద్దరిద్దరు చొప్పున ఎలా ఎన్నిసార్లు వస్తారు. నేనే అక్కడికి వెళ్తాను” అంటూ లేచింది. అందరూ అక్కడినుంచి కదలి వెళ్ళారు. అందరూ ఓ పావు గంటకూచున్నారు.

“ఈ వర్షం మూలంగా తొందరగా రాలేకపోయాం. అందరం ఓ చోట చేరుకుని వచ్చేసరికి ఇంత టైము అయింది” నీకు మేమంతా ఉన్నాం అని ఓ వంద సార్లు చెప్పారు.

“పొద్దుపోయింది మీరంతా వెళ్ళిపొండి” అని రాధ బలవంతంగా పంపించేసింది.

“మళ్ళీ పొద్దున్న వస్తాం…” అని వెళ్ళారు.

వాళ్ళు వెళ్ళిపోయాకా….. రాధ ఒక్కత్తి అయిపోయింది. చేసేది ఏంలేక థియేటరు వైపు నడిచింది.

ఎక్కువ మందిని థియేటరు ముందు ఉండనివ్వడంలేదు. అందుకని రాధ పక్కన, ఎవరో ఇద్దరు మాత్రమే ఉంటున్నారు. సౌమ్య వెళ్ళాక తల్లి వసుంధర మాత్రమే ఉంది. ఇంచుమించు ఏడాది తరవాత తల్లి తనని చూస్తోంది. తల్లితో మాట్లాడే అవకాశం దొరికింది.

కాని, ఏం మాట్లాడాలో తెలీలేదు. ఏదో దూరం. తెలియని దూరం. కాలం అన్నింటిని మానుస్తుంది. ఆ కాలానికి సమయం కూడా ఇవ్వడం అయింది. సమయం దూరాన్ని తగ్గించేస్తుంది అని అంటారు. కానీ తమ మధ్య తగ్గినట్లు లేదు. కారణం డబ్బేనా… తన డబ్బు, తన జీతం తమని వేరు చేసిందా… ఎవరిది స్వార్థం… తల్లి దృష్టిలో తనది… తన దృష్టిలో తల్లిది. నిజంగా తను స్వార్థపరురాలా…. జీవితంలోని ఓ సహజమైన మలుపు పెళ్ళి, అది కావాలనుకోవాలనుకోడం తప్పుకాదు కదా… ఎందుకో మనసు విప్పి మాట్లాడలేకపోయింది. ఆమె కూడా ఏదో మాట్లాడబోయింది. కాని ఏదో అడ్డు వస్తోంది అని అనిపిస్తోంది. కానీ ఏదో మాట్లాడాలని నోరు విప్పింది.

తండ్రి వచ్చాడు. వస్తూనే రాధ తల మీద చెయ్యి వేసి నిమిరారు.

“ఏం పరవాలేదమ్మా మాధవ్ ఆరోగ్యం మామూలవుతుంది. ఇవన్నీ అలా వచ్చి ఇలా కురిసి వెళ్ళే మేఘాలు. ఇప్పుడూ అంతే… సాయంత్రం అంతా వర్షం… ఏదీ ఇప్పుడు… ఉందా లేదు కదా… మళ్లీ మేఘాలున్నాయి, వర్షం మళ్ళీ రావచ్చు. అంతే ఈ కష్టాలు కూడా…. అప్పుడప్పుడు దేవుడు మనకి పరీక్షలు పెడతాడు. మనం తనని మర్చిపోకుండా అన్నమాట.”

తండ్రి మాటలకి చలించి పోయింది. వెంటనే తండ్రి చేతులు పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చేసింది. అలా చాలా సేపు ఉండిపోయింది. ఈ సాంత్వన తల్లినుంచి ఆశించింది. ఎంత తేడా… తల్లికీ తండ్రికీ..

అంతలో నారాయణ మరో ఇద్దరిని తీసుకెచ్చాడు. వాళ్ళని చూడగానే రాధ తండ్రి లేచి,భుజం మీద చేయి వేసి చిన్నగా తట్టి వెళ్ళిపోయడు. వెంటనే మరో నలుగురు వచ్చారు. అంతా నిశ్శబ్ధంగా కూచుని, మూసిన తలుపులనే చూస్తు కాస్సేపు అన్ని విషయాలు తెలుసుకున్నారు.

అంతలోనే నిశ్శబ్ధంగా తలుపులు కొంచెంగా తెరుచుకున్నాయి. అందరి దృష్టి అటు తలుపుల వైపే ఉంది కాబట్టి, వెంటనే అటువైపు చూసారు. తలుపులు పూర్తిగా తెరుచుకున్నాయి.. దూరంగా గాజు తలుపుల నుంచి చూస్తున్న వాళ్ళందరూ గబ గబా దగ్గరికి వచ్చారు. అక్కడున్నవారిలో ఒక్కసారిగా చైతన్యం, అందరూ అటూ ఇటూ కదిలారు. ఓ రెండు అడుగులు ముందుకు వెళ్ళారు. లోపలనుంచి ఓ డాక్టరు ఫుల్ థియేటరు డ్రెస్‌తోనే బయటికి వచ్చారు. తన మాస్క్ తప్పించకుండా దాన్ని అలాగే ముక్కుకి ఉంచుకుని, అందరినీ ఓసారి చూసాడు. రాధ ముందుకి వచ్చింది. రాధ ఆతృతగా ముందుకి వెళ్ళింది.

“డాక్టర్…” అంటూ ముందుకెళ్ళింది రాధ. ఆమెకి కొంచెం వెనకగా అక్కడున్న వాళ్ళు.

“ఆపరేషన్ అయిందా… మాధవ్ ఎలా ఉన్నాడు…..” అందరూ ఇంచుమించూ అలాంటి ప్రశ్నలే వేసారు.

డాక్టరు ఏం అనకుండా గ్లోవ్స్ ఉన్న చేతులని కదిలిస్తూ అందరిని చూసాడు…

“సారీ… కొన్ని కాంప్లికేషన్స్ వచ్చాయి… గొంతుకి అటూ ఇటూ ఉన్న ఆర్టరీలు బాగా దెబ్బ తిన్నాయి. అయినా ప్రయత్నం చేస్తున్నాం…”

“మీకు నమ్మకం ఉందా డాక్టర్….” అంది రాధ.

“కానీ చేసే ప్రయత్నం ఫలిస్తుందన్న ఆశ ఎక్కడో ఉంది.”

“ఆశ…. అంటే……” అందరూ మొహాల్లో ఓ లాంటి భయం కనిపిస్తోంది.

“అంటే… బ్రెయిన్‌కి రక్తం సరఫరా….. అదీ జరగడం లేదు. ఆక్సిజన్….. సరిగా అందడం లేదు. గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం…. చూద్దాం ఏదైనా మిరకల్ జరుగుతుందేమో…. అద్భుతం జరగాలి అంతే….” అని ఆగీ ఆగీ నానుస్తూ మెల్లిగా చెప్పి,వెళ్ళిపోయాడు.

రాధ కొయ్యలా నుంచుండిపోయింది. ఆమె ఏదో అడగాలనుకునే లోపలే డాక్టరు వెళ్ళిపోయాడు. డాక్టరు అన్న మాటల అర్థం ఏఁవిటీ…? ఓ ఆరేడు గంటలు ఆపరేషన్ చేసి ఆఖరున చెప్పింది ఇదా….! ఇన్ని గంటల ఆపరేషన్‌లో చేసిందేఁవిటీ మనసు మీద నల్లటి దుప్పటి కప్పేసినట్లు ఒకటే స్థబ్తత..

“మీరందరూ విజిటర్స్ రూంలో కూచోండి…” అంది నర్సు.

ఎవరూ కదల్లేదు. మరోసారి చెప్పాకా కదిలారు. నిశ్శబ్ధంగా అక్కడికి వెళ్ళి కూచున్నారు. ఎదురు చూస్తున్న ప్రళయం ఏ క్షణంలోనైనా పడ్తుందన్న భయం అందరి ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.

అందరి ముందు ఏడ్చే ధైర్యం లేక గుండెలు బద్దలయ్యేలా కూచుంది. భర్త ఏ స్థితిలో ఉన్నాడో.. ఏ క్షణం ఏమాట వినాల్సి వస్తుందో.. అని గిలగిలలాడిపోతోంది. ఒక్కసారి అన్నీ గుర్తుకొస్తున్నాయి. అందరూ వరసగా తప్పులు చేసారు. ఫలితం మధవ్ మరణం. చావుతో చెలిమి చేస్తున్నాడు. గంట పైనే అయింది డాక్టరు మిరకల్ కోసం ఎదురుచూద్దాం అని అన్నాడు. ఇంత వరకూ ఏ విషయం తెలీలేదు.

రాధ స్పృహ కోల్పోయినట్లుగా కుర్చీలో కూలబడిపోయింది. అంతా ఆమె దగ్గరికి వెళ్ళి నుంచున్నారు. మరో రెండు గంటల తరవాత మరో డాక్టరు వచ్చారు.

“సారీ… ఎంత ప్రయత్నించినా పేషెంటుని కాపాడలేకపోయాం. ప్రస్తుతం పేషెంటుని, వెంటిలేటరు మీద ఉంచాం. అవయవాలన్నీ అంటే ఆర్గన్స్ అన్ని పనిచేస్తాయి, ఒక్కొక్క సారి ఇలా వెంటిలేటరు మీద ఓ రెండు మూడు రోజులున్నాకా తిరిగి బతికిన కేసులున్నాయి. కాని మీ కేసు వేరు. అతను మరణించినట్లే లెక్క.”

అందరూ బొమ్మల్లా ఉండిపోయారు.

“ఇప్పుడే కదా… ప్రయత్నం చేస్తున్నాం అని అన్నారు. అప్పుడే… ఎలా… అంతలోనే ఎలా చెప్పగలిగారు… అంటే థియేటరు లోపలికి తీసుకెళ్ళేటప్పటికే ప్రాణం లేదా… లేకపోయినా చూద్దాం, ప్రయత్నిద్దాం అని అనుకున్నారా..” ఏదైనా ఇప్పుడు ఈ డాక్టరు చెప్పింది నమ్మాల్సిందే.

రాధ బుర్ర మొద్దుబారిపోయింది. నమ్మాలని లేదు. కానీ నమ్మమని అంటున్నారు. ఈ జీవితం నుంచి ఎన్నో ఆశించింది. తనే కాదు మాధవ్ కూడా… అన్నీ కూడా కళ్ళ ముందే ముక్కలు ముక్కలయిపోయింది. ఇందులో తమ ప్రమేయం యేమీ లేదు.

అందరూ అంటారు నీ జీవితం నీ చేతుల్లో ఉంది అని, నీ ఆనందం నీ చేతుల్లో అని అంటారు, కానీ తమ విషయంలో కాదు. మాధవ్ జీవితం ఆ కారు డ్రైవరు చేతిలో ఉండిపోయింది. అంతా అలా అలా కరిగిపోయింది

ఏ చీకూ చింతా లేకుండా హాయిగా నడుస్తున్న సంసారం. కానీ ఇప్పుడు జరుగుతున్నది వేరు. అన్నింటికీ దూరం అయి క్షణం ఒక భయంకరమైన స్వప్నంలా ఉంది. అడుగు కదిపితే ఏమవుతుందో అనే భయంలో జీవితం ఈడ్చుకుపోతోంది.

ఏడుస్తున్న రాధని సౌమ్య మీద ఒరిగిపోయిన రాధని, ఓదార్చడానికి ఎవరికి ధైర్యం చాల్లేదు. కానీ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఓ వైపున మాధవ్ తల్లి, ఆమెతో ఉన్నవాళ్ళు నిశ్శబ్ధంగా ఉన్నారు. ఎవరికో ఫోన్లు చేస్తున్నారు. మధ్య మధ్య మాధవ్ తల్లిని ఓదారుస్తున్నారు. మరి కాస్సేపటికి, ఓ పెద్ద మనిషిని పట్టుకుని ఓ ఇద్దరు ఆడవాళ్ళు మాధవ్ తల్లి దగ్గరికెళ్ళి కూచున్నారు. అంతా ఒక్కసారి, అతడిని పట్టుకుని నిశ్శబ్ధంగా ఏడవడం మొదలెట్టారు. మరో మూల రాధ తల్లిదండ్రులు కళ్ళు తడుచుకుంటూ వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. కొంచెం సేపయ్యాక రాధ తల్లి వచ్చి రాధని పట్టుకుని గట్టిగా ఏడ్చేసింది.

ఏదో గుర్తొచ్చినట్లుగా తల్లి చేతులు విడిపించుకుని, గబుక్కున లేచింది. స్నేహితులందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఏదైనా ప్రమాదం తలపెట్టుకోవడం తేదు కదా… ఎక్కడికి… అంటూ ఆమెని పట్టుకున్నారు..

“ఇప్పుడే డాక్ఠరుని కలిసి వస్తాను” అంటూ విజిటర్స్ రూంనుంచి డాక్టర్లుండే గది వైపు నడిచింది. వెనకాలే సౌమ్య వెళ్ళింది.

ఆ గదిలో ఎపరూ లేరు. థియేటరు వైపు వెళ్లింది. మూసి ఉన్నతలుపుని మెల్లిగా తీసింది. ఎదురుగా ఆపరేషన్ గది లేదు. అది ఓ చిన్న కారిడార్ కనిపించింది.. ఖాళీగా ఉంది. అక్కడ కూడా మూసి ఉన్న గాజు తలుపులు కనిపించాయి. సరిగ్గా అదే సమయాన ఓ సిస్టర్ ఫుల్ డ్రెస్, మాస్క్‌లో బయటికి వచ్చింది. ఆమె ప్రశ్నార్థకంగా చూసి, బయటికి వెళ్ళండన్నట్లుగా చేయితో సైగ చేసింది. తల అడ్డంగా ఊపింది. “నేను లోపల పేషెంటు భార్యని. ఒక్కసారి అతడిని చూడాలి….” అని చాలా మెల్లిగా గుస గుసలాడుతున్నట్లు ఆమె చెవి దగ్గర చెప్పింది. ‘ఆగండి’ అన్నట్లుగా తన అరచేత్తో సైగ చేసింది. రాధ అక్కడే ఆగిపోయింది. మరో రెండు నిమిషాలకి ఓ డాక్టరు వచ్చారు.

“ఈ సమయాన కష్టం. పేషెంటు వెంటిలేటరు మీద ఉన్నారు. అబ్సర్వేషన్ కోసం రూంకి షిఫ్టు చేసి అక్కడ ఉంచుతాం. ఓ గంట అయ్యాకా మీరు వెళ్ళి చూడచ్చు. ఇప్పుడు మాత్రం కాదు. మేము చెప్తాము. అప్పుడు బాడీని పక్కనే ఉన్నరూం లోకి షిఫ్ట్ చేస్తాం. అప్పుడు మీరు చూడడానికి అనుమతి ఇస్తాము”.

రాధ ఏం అనలేక పోయింది. అంతకు ముందు, ఏడ్చిన కళ్ళు ఇప్పుడు గాజు కళ్ళల్లాగా జీవం లేకుండా ఉన్నాయి. బొమ్మరాళ్ళయి పోయాయి..

‘మాధవ్ జీవితం లాగే.. నా జీవితం కూడా విధి మూలంగానే నడుస్తోంది’.

ఓ రెండు గంటల గడిచాయి. ‘రావచ్చు’ అన్నట్లుగా సైగ చేసారు. అప్పుడే సౌమ్య కూడా వచ్చింది. ఆమె కూడా రాధ వెనకాల వెళ్ళింది. లోపల రక రకాల ట్యూబులు, ఆక్సిజన్ మాస్క్, రక్తం ఉన్నబ్యాగ్, ఓ నాలుగు రకాల మానిటర్లు, తలకి పూర్తిగా కట్లు… నిద్ర పోతున్న మాధవ్.

“మానిటర్లు కదులుతున్నాయి కాబట్టి, మనిషి బతికి ఉన్నాడని అనుకోకండి. ఈ మిషన్లు పెట్టాం గుండె, ఊపిరితత్తులు పనిచేస్తున్నాయి, కాబట్టి అవయవాలన్నీ పనిచేస్తున్నాయి. ఇది మెడికో లీగల్ కేసు కాబట్టి, పోస్ట్ మార్టెం చెయ్యాలి. ఆ తరవాత బ్రెయిన్ డెత్ సర్టిఫికెట్ ఇస్తాం… ఇంక ఇక్కడ మీరుండి లాభం లేదు… నిజానికి తీసుకుని రావడం ఆలస్యం అయింది.”

మళ్ళీ అదే మాట, వాళ్ళ తప్పులు కప్పి పుచ్చేసుకుంటున్నారు. ఉదయం పది గంటలకి ఇక్కడికి తీసుకొస్తే, సాయంత్రం ఆరుగంటల వరకూ ఆపరేషనే మొదలు పెట్టలేదు, ఆ తప్పుని చెప్పుకోరెందుకని, తెచ్చిన వెంటనే చేసి ఉంటే… అవన్నీ వదలేసి, తను తీసుకురావడం లేటయిందని అనడానికి మనసెలా ఒప్పిందో…

అంతలో వెనక శబ్ధం అయితే వెనక్కి తిరిగింది.

డాక్టరు హడావుడిగా, లోపలికి వచ్చారు.

“సిస్టర్… పేషెంటు శరీరపు వేడి, గుండె సంకోచ వ్యాకోచాలు, అన్నీ గమనిస్తూ ఉండండి. ఎలాంటి ఇనఫెక్షన్స్ అవీ రాకుండా… యాంటిబయాటిక్స్ అవీ వాడాల్సి వస్తుంది అని డాక్టరు గారు అన్నారు మరోసారి ఆ విషయాలన్నీ విఫులంగా కనుకోండి… వాళ్ళు ఏం చేయమన్నారో ఎలా చేయమన్నారో అన్నీ అలాగే జాగ్రత్తగా చేయండి” అని వెళ్ళిపోయాడు.

‘ఈ క్షణం నుంచి, టైం బాంబు క్లాక్ స్టార్ట్ అయింది’ రాధ మనసులో అనుకుంది.

మాధవ్‌ని ప్రిపేర్ చేసేందుకు నర్సులు వస్తున్నారు.

“నీతో గడిపిన జీవితం, గత వైభవం. నాకు ఎంతో సంతృప్తినిచ్చింది, ఈ జీవితానికి అది చాలు. నువ్వు నాలో ఉన్నావు. నీ మనసు నీ హృదయం, నీ నవ్వు, నీ వ్యక్తిత్వం అన్నీ కూడా నా కడుపులో ఊపిరి పోసుకుంటున్న జీవిలో ఉంటాయి” కనుకొలనుల్లో దోబూడులాడుతున్న నీటి బిందువులు కిందకి జారాయి.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here