Site icon Sanchika

తమస్సు నుండి ప్రకాశం వైపు సమగ్ర జీవన ప్రస్థానం

[శ్రీ పాలకుర్తి రామమూర్తి వ్రాసిన ‘తమస్సు నుండి ప్రకాశం వైపు సమగ్ర జీవన ప్రస్థానం’ అనే ఆధ్యాత్మిక రచనని అందిస్తున్నాము.]

[dropcap]ఏ[/dropcap] వ్యక్తి జీవితంలోనైనా ప్రధానమైన పార్శ్వాలు రెండు. ఒకటి.. భౌతిక జీవనం కాగా రెండవది.. ఆధ్యాత్మిక జీవనం. సాధారణంగా భౌతిక జీవనం ప్రగతిని ప్రసాదిస్తుంది కాగా ఆధ్యాత్మిక జీవనం సుగతిని ప్రసాదిస్తుంది. ఒకటి ప్రేయస్సును ఇస్తే రెండవది శ్రేయస్సు నిస్తుంది. జీవితంలో ప్రగతి సాధనలో అర్థకామాల ప్రాధాన్యత ప్రముఖమైనది కాగా వాటిని ఎక్కడ ఎప్పుడు వదిలివేయాలో తెలుసుకోవడం సుగతిని ఇస్తుంది. ఈ రెంటిని అనగా ప్రగతిని సుగతిని లేదా ప్రేయస్సును శ్రేయస్సును సమన్వయం చేసుకోవడంలోనే మానవ జీవితం సార్థకమౌతుంది. అలాగే మానవ జీవితం రసమయం కావాలి అంటే శృంగారం, వాత్సల్యం, భక్తి ఈ మూడూ అవసరమే. నిజానికి ఈ మూడూ రూప భేదాలే కాని వీటికి మూలమైన స్థాయీ భావం ఒక్కటే. ఆ భావన తన స్త్రీ/పురుషునిపై కేంద్రీకృతమైతే దానిని శృంగారం అంటాము.. ఆ భావమే సంతానంపై కేంద్రీకృతమైతే వాత్సల్యం అంటాము.. అదే భావన తన మూలాలను తెలుసుకునే విధానంపై లేదా భగవంతునిపై కేంద్రీకృతమైతే దానినే భక్తి అంటాము.

ప్రతి వ్యక్తీ ఈ భూమిపై ఆయువు ఉన్నంత వరకు బ్రతకాలి, బ్రతుకుతారు కూడా. అయితే కొందరు మాత్రమే జీవిస్తారు. బ్రతకడం అవసరం అదే తమస్సు కాగా జీవించడం ప్రయోజన సాధన, అదే ప్రకాశం. జ్ఞాన కామం పట్ల జిజ్ఞాస కలిగిన వ్యక్తి జీవిస్తాడు.. కామ జ్ఞానం పట్ల కోరిక కలిగిన వ్యక్తి బ్రతుకుతూ ఉంటాడు. ఆ ప్రక్రియలో తమ జీవన ప్రయోజనాలను గుర్తించి ఆ ప్రయోజన పారమార్ధాన్ని సాధించాలనే తపనతో జీవించే వ్యక్తులకు జీవితం పట్ల, జీవన వైఖరి పట్ల, జీవిత లక్ష్యాల పట్ల, జీవన గమనం పట్ల స్పష్టమైన విలక్షణమైన దృక్పథం ఉంటుంది. అలాంటి వ్యక్తుల జీవన ప్రస్థానం తమస్సు నుండి ప్రకాశం వైపు సాగుతుంది.

భౌతిక జీవనానికి అతీతమైన ఆధ్యాత్మిక జీవన ప్రస్థానంలో గమించే వ్యక్తులు.. ఈ సృష్టి ఎక్కడి నుండి వచ్చింది.. ఎక్కడికి చేరుతుంది.. ఆ సృష్టి గమనంలో మన పాత్ర ఏమిటి? అనే అంశాలను అన్వేషిస్తూ సమాధానాలకై తపిస్తారు. ఆ తపనలో వారు సాధించిన సమాధానాలను అక్షరబద్ధం చేసి భావితరాలకు అందిస్తారు. అలాంటి జిజ్ఞాసువులలో వివిధ స్థాయిలలో ఉన్న వ్యక్తుల సాధనా మార్గాలు వేరు వేరుగా ఉన్నా గమ్యం మాత్రం ఒక్కటే.

ఉన్నత స్థితిని సాధించిన వ్యక్తి తాను సాధించిన విజ్ఞానాన్ని తోటివారితో పంచుకునే క్రమంలో తన అనుభవాలను కథల రూపంలో పంచుకోవడం జరుగుతుంది. ఎందుకు అంటే సమాజంలో ఎక్కువ మందికి ఆ పారలౌకిక ప్రస్థాన రహస్య విధానాలు తాత్త్వికంగా చెపితే అవగాహన కుదరకపోవచ్చు కాబట్టి. సృష్టికి సంబంధించిన విజ్ఞానం నుండి తదుపరి కాలంలో అభివృద్ధి చెందిన వాస్తుశాస్త్రం, శిల్పశాస్త్రం, నాట్య శాస్త్రం, అలంకార శాస్త్రం.. ఇలా ఎన్నో వైవిధ్య భరిత శాస్త్రాలపై కథల ద్వారా అవగాహనను పెంచే ప్రయత్నం చేశారు జ్ఞానులు. ఇలా వివిధ వ్యక్తుల అనుభవాల అన్నింటి మధ్య ఏకత్వాన్ని సాధించడం కాకుండా వాటి మధ్య సామరస్యతను సాధిస్తూ వెలుగు చూచింది పురాణ వాఙ్మయం. ఈ వాఙ్మయం కాలాంతరంలో అపరిమితంగా వృద్ధి పొందడం మనకు కనిపిస్తుంది.

వ్యక్తియొక్క ఉన్నతీకరణ సమాజ ఉన్నతీకరణకు ప్రాతిపదిక ఔతుంది. సత్సమాజ స్థాపనలో విద్య ప్రధాన భూమికను పోషిస్తుంది. విలువలు, నైతికత ఆధారంగా ఆధ్యయనం చేయబడ్డ విద్య వల్ల ఆరోగ్యవంతమైన మానవ సంబంధాలు నెలకొంటాయి. నాణ్యమైన మానవత్వ ప్రకాశం వెలుగుచూస్తుంది. ఇక్కడ రెండు అంశాలు ప్రస్తావించుకోవాలి.

నాణ్యమైన విద్యావిధానం కావాలి అంటే జ్ఞానం, శీలం, యోగం కలిగిన వ్యక్తులను తయారుచేసే ఉపాధ్యాయుల అవసరం ఎంతైనా ఉంటుంది. జ్ఞానం అంటే సరైన దృష్టి లేదా దార్శనికత, సరైన సంకల్పాన్ని కలిగియుండడం. శీలం అంటే సదాచారం (అంటే అనూచానంగా వస్తున్న ఆచారాన్ని గుడ్డిగా అనుసరించడం కాదు). సరైన మాట, సరైన పని, సరైన జీవికను కలిగి యుండడం. ఇక యోగం అంటే సరైన ప్రయత్నం, సరైన స్మృతి.. దీనినే సరైన సమాధిగా యోగులు చెపుతారు.. ఏదైనా యోగం అంటే పొందదగినది అనుకోవచ్చు. అలాగే విద్యార్థులు అధ్యయన శీలత కలిగి అర్హతను సంతరించుకోవాలి. వారిలో తెలుసుకోవాలనే జిజ్ఞాస, తపన జ్వలించాలి. గురువు పట్ల తెలుసుకునే అంశం పట్ల విశ్వాసం కలిగినవారై ఉండాలి. అప్పుడే ఆ విద్య సరైన విధానంలో అవగాహనను పెంచుతుంది. అలాంటి గురువు యొక్క వైఖరి, శిష్యుని యొక్క క్రమశిక్షణ ఈ రెండూ, రెండు దరులుగా ప్రవహించే జ్ఞాన ప్రవాహం సరైన దిశలో సరైన లక్ష్యానికి మార్గం చూపుతుంది.

ప్రతి వ్యక్తిలో సహజ ప్రకృతి ఒకటి ఉంటుంది. దానికి ఏ విధమైన ఉద్దేశ్యాలు లేదా సంకల్పాలు ఉండకపోవచ్చు, ఉండాల్సిన అవసరమూ లేదు. ఉదాహరణకు.. పాడడం, ఆడడం, కళలపై అభిరుచిని పెంచుకోవడం లాంటివి. ఇవి విభిన్న వ్యక్తులకు విభిన్నంగా ఉండవచ్చు. ఆ ఉన్నవి కూడా ఎక్కువమందిలో సుప్తావస్థలో ఉంటాయి.

అలాగే కొందరిలో.. కొందరిపై ఆత్మీయతను ప్రదర్శించడం, కొందరితో సాన్నిహిత్యాన్ని పెంచుకోవడం, కలిగిన దానిని పంచుకోవడం లాంటి లక్షణాలూ ఉండవచ్చు. అలాగే కొందరు తమ జీవన లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ వైపు సాగడం, అందులో కొన్ని అంశాల పట్ల అత్యంత ఆసక్తి కలిగియుండడం, వాటి సాధనకై తీవ్రంగా తపించడం కూడా కనిపించవచ్చు. అలాగే చేసే పనిలో కొన్ని ఉద్దేశ్యాలు, సంకల్పాలూ ఉండవచ్చు. ఆ క్రమంలో అంతర్గత ప్రతిభను జాగృతం చేసుకోవడం జరుగుతుంది.

మరికొందరు తమ లక్ష్యంపై స్పష్టతను కలిగియుండడం మూలంగా అనేకాగ్రమైన మనస్సును ఏకాగ్రం చేసుకోగలుగుతారు. గమ్యము, గమనములపై స్పష్టతను కలిగియుండి తమ జిజ్ఞాసలో సత్యాన్ని దర్శించడం, ఆవైపు గమించడమూ జరుగుతుంది. అయితే దానిని హేతువుతో నిరూపించడం వారికి చాతకాకపోవచ్చు. వారు తమ దర్శనాన్ని కాక మరేదానినీ ప్రమాణాలుగా స్వీకరించరు. కాని వారు తాము దర్శించిన సత్యాన్ని ఆశ్రయించి తమ జీవితాన్ని నిర్వచించుకుంటారు.. అలా నిర్వచించుకున్న సత్యం యొక్క పరిమితులలో జీవిస్తారు.

మరికొందరిలో మేధ జాగృతమౌతుంది. తమకు సత్యదర్శనలో కలిగిన అనుభవాలను, అనుభూతులను అవగాహన చేసుకోవడం, విశ్లేషణ చేసుకోవడం, హేతుబద్ధంగా క్రమబద్ధీకరించుకోవడం జరుగుతుంది. బుద్ధితో విచారిస్తూ ఏది యుక్తమో ఏది అయుక్తమో విచక్షణతో అవగాహనను పెంచుకుంటారు. అలాంటి మహనీయులలో అంతర్దృష్టి వికసిస్తుంది. చైతన్యం పల్లవిస్తుంది. దానితో వారు పకృతియొక్క అంతరంగాన్ని పరిశీలించగలుగుతారు. ప్రతి మాట వెనుక, ప్రతి చర్య వెనుక ఉండే అంతరార్థాలను తెలుసుకునే వికాసం వారిలో కలుగుతుంది. దానినే ‘ఎఱుక’ అంటున్నాము. దానితో వారు పరిణామాలను గ్రహించి, ఊహించి తదనుగుణమైన ప్రవర్తనను సంతరించుకుంటారు.

మరికొందరిలో సమగ్రమైన జాత్యంతరీకరణ జరుగుతుంది. జాతి అంటే స్థాయి. తమలోని దైవదత్తమైన శక్తిని ప్రదర్శించే సామర్ధ్యము వెలుగు చూస్తుంది. తత్సంబంధితమైన ప్రేరణాశక్తీ ఉత్తేజితమౌతుంది. దివ్యమైన, భవ్యమైన చైతన్యం ఆవిష్కృతమై ముందుకు నడిపిస్తుంది. అయితే ఇవి ప్రలోభాలకు దారి చూపవచ్చు. ఆ ప్రలోభాలకు లొంగిపోయిన వ్యక్తులు పతనావస్థకు చేరుకుంటారు.. ప్రలోభాలను అధిగమించిన వ్యక్తులు జీవన పారమార్థాన్ని సాధిస్తారు. దీనినే శ్రేయస్సును సాధించే విధానంగా చెప్పుకోవచ్చు.

భౌతిక జీవనంలో వ్యక్తి తనలోని అంతర్గత శక్తులు సుప్తావస్థలో ఉండడం వల్ల తన శక్తి సామర్థ్యాలను గుర్తించలేని దురవస్థలో ఉండడం జరుగుతుంది. నిజానికి భగవంతుడు అనబడే పరిపూర్ణ, సమగ్ర శక్తిలో ఏయే శక్తి సామర్ధ్యాలు ఉన్నాయో.. ఆ శక్తి నుండి ఆవిష్కృతమైన లేదా ప్రకటితమైన ప్రతి జీవిలోనూ ఆయా శక్తి సామర్ధ్యాలు నిగూఢంగా ఉంటాయి. అయితే భగవంతునిలోని శక్తిసామర్థ్యాల అవగాహన ఆ భగవంతుని లేదా పరమాత్మ స్మృతిలో ఉంటాయి.. ఆ అవగాహన జీవాత్మ స్మృతిలో ఉండదు.. అదే భేదం.

శరీరం, మనస్సు, ఆత్మ ఈ మూడింటి సమ్మేళనమే ఉపాధిగా తాత్త్వికులు చెపుతారు. ఈ ఉపాధిగతమైన ఆత్మను జీవాత్మగా చెపుతారు. అయితే ఈ ఉపాధిరహితమైన విశ్వవ్యాప్తమైన చైతన్యాన్ని విశ్వాత్మగా లేదా పరమాత్మగా చెప్పారు, తత్త్వజ్ఞులు. ఇక్కడ ఒక్క విషయం గుర్తించాలి. నిజానికి జీవాత్మ, పరమాత్మ అని రెండు ఉన్నాయా అంటే లేవనేదే సమాధానం. ఉన్నది ఒక్కటే.. మరి రెండుగా చెప్పడంలో భావం ఏమిటి?

ఉన్న ఆత్మ ఉపాధిగతమైతే.. అది జీవాత్మ.. లేకపోతే పరమాత్మ. “అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః” అంటుంది, వేదం. అంతటా ఉన్నది ఒక్క నారాయణ తత్వమే. ఉపాధిరహితమైన విశ్వచైతన్యాన్ని ‘నారాయణుడు’ అంటే ఉపాధిగతమైన చైతన్యాన్ని ‘నరుడు’ అంటున్నాము. నరుడు తనలోని ఆత్మను దర్శించి, ‘అహం బ్రహ్మాస్మి’ అన్న జ్ఞానాన్ని, సత్యాన్ని, ఎఱుకను, తెలివిని అనుభవ పూర్వకంగా పొందితే నరుడే నారాయణుడు అవుతాడు. E= MC2 or M= E/C2. E అనేది నారాయణుడు కాగా M అనేది నరుడు. C2 అనేది పరివర్తన భాజకం అనవచ్చు.

ఉపాధిగతమైన చైతన్యం మాయ అనే ముసుగును కప్పుకోవడం వల్ల అంతర్గత శక్తిసామర్థ్యాలను గుర్తించే సామర్థ్యాన్ని కోల్పోతుంది. స్తబ్దుగా నిర్జీవంగా, నిరాసక్తంగా, నిరీహమై జఢత్వాన్ని ఆశ్రయిస్తుంది. అయితే ఈ స్థితి నుండి తన నిజ స్థితిని తిరిగి సాధించడం సాధ్యమా అంటే సాధ్యమే. దానికి గురువు మార్గదర్శన అవసరమవుతుంది. దానినే కెటాలిస్ట్ అనవచ్చునేమో.

సాధించాలనే సంకల్పం అత్యంత బలీయమైన వేళ, ఆ సంకల్పమే అవసరమైన వనరులను వసతులను వెతుక్కుంటుంది. తన లక్ష్యానికి చేర్చే విధానాలను, వ్యక్తులను గుర్తిస్తుంది. అవసరమైన సహాయ సహకారాలను తీసుకుంటుంది. సహచరులతో కూడుతుంది. ప్రణాళికలు రచించుకుంటుంది.. కార్యాన్ని నిర్వహించే విధానానికి రూపకల్పన చేసుకుంటుంది.

ఎప్పుడైతే నరునిలో బలీయమైన ఇఛ్ఛాశక్తి జాగృతిని పొందుతుందో, సాధించాలనే తపన జ్వలిస్తుందో అప్పుడు అతనిలో ఉద్దేశ్యాలు, లక్ష్యాలు వెలుగు చూస్తాయి. కార్య నిర్వహణకు అవసరమైన బృందాలను నిర్మించుకోవడం, ఆ బృందాలను సమర్థవంతంగా నడిపించడం, తానూ బృందాలతో కలసి నడవడం జరుగుతుంది. తదనుగుణమైన జ్ఞాన శక్తినీ పొందుతాడు. కార్య నిర్వహణలో ప్రావీణ్యాన్ని సాధించ గలుగుతాడు.

ఆ ప్రక్రియలో తనపై తనకు, తోటివారిపైనా, సమాజం పైన దయ, కరుణ, ప్రేమాభిమానాలు జనిస్తాయి. దయ ఆలోచనకు సంబంధించినది కాగా కరుణ క్రియాత్మకమైనది. దానితో జ్ఞానాన్ని పెంచుకోవడం, ఆలోచించే విధానాన్ని తెలుసుకోవడం, భావ వ్యక్తీకరణ నైపుణ్యాన్ని సంతరించుకోవడం, వివిధ ఉపాధుల ద్వారా సమాచారాన్ని సేకరించడం, దానిని విశ్లేషించుకోవడం, అవసరానికి వినియోగించుకోవడం లాంటి వివిధ ప్రక్రియలలో అవగాహన కుదరడమే కాక అందులో నిష్ణాతులు కావడం జరుగుతుంది. అలాగే కార్య నిర్వహణలో ఏకాగ్రతను సాధించడం, అంతర్దృష్టిని సాధించడం జరుగుతుంది. దానితో సమగ్రమైన, సాధికారికమైన, చైతన్య పూరితమైన తెలివితో యెఱుకతో కార్య నిర్వహణ చేసే విధానం అలవడుతుంది.

చివరగా.. ఉన్నది ఒక్కటే.. అదే ఉన్నది.. లేనిది లేదు. జీవన ప్రస్థానం.. భౌతికమైనా ఆధ్యాత్మికమైనా.. దాని నిర్వహణలో జాగరూకత కావాలి. నిర్వహణా నైపుణ్యాన్ని సంతరించుకోవాలి. ఆ నైపుణ్యాన్నే ‘విదగ్ధ’ అంటుంది లలితా సహస్రనామం. మనోవాక్కాయ కర్మలను నియంత్రించుకోగలిగే లేదా నిర్వహించుకోగలిగే ప్రావీణ్యాన్ని వైదగ్ధ్యం అంటారు. విదగ్ధకు సంబంధించినది వైదగ్ధ్యం. దీనినే చిద్రూపియౌ శ్రీ లలితాంబ శక్తి ప్రకటనగా గుర్తించాలి. ఆ ప్రావీణ్యం వల్లనే ఆమె ముగురమ్మల మూలపుటమ్మగా నిలిచింది. ముగురమ్మల మూలపుటమ్మ అనడంలో.. ముగ్గురమ్మలకు మూలపుటమ్మ అని కాదు.. మూలపుటమ్మయే ముగురమ్మలుగా తెలుసుకోవాలి అని విన్నవిస్తూ..

ఆ నైపుణ్యాన్ని మనందరికీ ఆ అమ్మయే ప్రసాదించాలని ప్రార్థిస్తూ..

Exit mobile version