తన దాకా వస్తే ?!

77
4

[dropcap]చి[/dropcap]న్న కొడుకు ప్రదీప్ పెళ్లి నిశ్చితార్థం జరిగింది మొదలు రంగనాయకమ్మ సంతోషం పట్ట లేకుండా వుంది. ప్రదీప్ వయసు పెద్దదేమీ కాదు, కానీ కాస్త ఆలస్యమైందని చెప్పాలి. దాంతో తండ్రి లేని కొడుకు ప్రదీప్ పెళ్లి చేయమని మిగతా ఇద్దరు పెద్ద కొడుకులను సంవత్సర కాలంగా వేధించి, మొత్తానికి సాధించింది రంగనాయకమ్మ.

భర్త బ్రతికి వున్న రోజుల నుంచీ రంగనాయకమ్మ తన చిన్న కొడుకు ప్రదీప్‌తో అదే వూర్లో, తన ఇంట్లోనే వుండి పోయింది. ఇద్దరు పెద్ద కొడుకులు ఉద్యోగరీత్యా వేరే ప్రాంతాలకు వెళ్లి పోయారు. అందరి కంటే చిన్న కొడుకు ప్రదీప్ అంటే రంగనాయకమ్మకు పంచ ప్రాణాలు.

వీధిలో నడుస్తూ వెళ్తోంది రంగనాయకమ్మ. చాలా రోజుల తర్వాత ఆవిడ మనసంతా తృప్తిగా, ఆనందంగా వుంది.

ఆవులను తోలుకుంటూ వస్తున్న వెంకమ్మను చూసి “నా చిన్న కొడుకు పెళ్లి వచ్చే నెలలోనే..” అంటూ సంతోషంగా చెప్పింది రంగనాయకమ్మ.

రాజయ్య బడ్డీ కొట్టు నిండా జనాలతో కిట కిట లాడుతూ వుంది. ఆ పక్క లోనే నిన్న మొన్నటి వరకూ పనీ పాటా లేకుండా తిరుగుతున్న వీరదాసు ఈ మధ్యనే పెట్టుకున్న కిళ్లీ కొట్టు ముందు కూర్చొని క్యారం బోర్డు ఆడుతున్న కొడుకు స్నేహితుల వేపు చూసి “ఒరేయ్ బడుద్ధాయిలు. మీ ప్రదీపుడి పెళ్లి వచ్చే నెలే” అంటూ సంతోషంగా చెప్తూ వెళ్తున్న రంగమ్మను చూసి “అలాగే పెద్దమ్మా” చేతులూపారు వాళ్ళందరూ.

వీధి కుళాయి ముందు నిలబడి కబుర్లు చెప్పుకుంటూ ఇత్తడి బిందెలో నీళ్లు నింపుకుంటున్న ఆడవారి గుంపును చూసి

“కామేశ్వరి, రాధా, లక్ష్మి! నా కొడుకు పెళ్లి వచ్చే నెలే.. పత్రిక పంపిస్తా, తప్పకుండా రావాలి” అని అరిచింది.

“అలాగే పిన్ని.. సంతోషం.. వస్తాం, ఇంతకీ అమ్మాయి ఎక్కడ నుండీ?” అని నవ్వుతూ అడిగారు.

“పక్క ఊరే.. లక్ష్మీపురం” అని చెప్పి ముందుకు కదిలింది రంగనాయకి.

నెలలో మొదటి వారం కావటంతో నారాయణ శెట్టి కిరాణా కొట్టు జనాలతో కిటకిట లాడుతూ వుంది.

ఆ కొట్టులోకి అడుగు పెట్టి

“నమస్కారం శెట్టి.. నా కొడుకు పెళ్లి వచ్చే నెల.. ఇదుగో ఈ చిట్టీ తీసుకో ఇందులో వున్న సరకులు అన్నీ తీసి, కట్టి వుంచు మళ్ళీ వస్తాను, ఇంటి దగ్గర బోలెడు పనులున్నాయి” అని చెప్పి వెనుతిరిగింది.

“శుభం. ఇంకేం. నీకిక పనులు.. బాధ్యతలు తగ్గుతాయి” అంటూ నవ్వాడు శెట్టి. సమాధానంగా రంగనాయకమ్మ మనసంతా అంతు లేని సంతోషం నిండి పోయింది.

***

అన్నవరం కొండ మీద ప్రదీప్, రాణిల పెళ్లి జరిగి పోయింది. పెళ్లింట్లో నుండీ ఒక్కొక్కరుగా చుట్టాలందరూ వెళ్లి పోయారు.

ఉదయాన్నే లేచి బయట కళ్ళాపి చల్లి, పనులన్నీ ముగించి గోడ గడియారానికేసి చూసింది రంగనాయకి. సమయం ఎనిమిది కావస్తోంది. కోడలింకా గది లోనుండీ బయటికి రాలేదు. వీధిలో కూరలమ్మే వెంకాయమ్మ కేకేయటం వినిపించి చటుక్కున లేచి బయటి గుమ్మం లోకి వచ్చింది. కుంటుతూ వస్తున్న రంగనాయకిని చూసి “ఏంటమ్మ గారు కాలుకేమయ్యింది? కోడలు పిల్ల ఎక్కడా?” అడిగింది వెంకాయమ్మ ఇంటి లోకి చూపులు సారిస్తూ.

“నీ అరుపు విని వెంటనే లేచానే, మోకాలు పట్టేసినట్టయ్యింది. వయసు మీద పడుతోందిగా. నడుం నొప్పులు, పైగా గుండె దడగా వుంటుందీ మధ్య” అని చిన్నగా మూల్గుతూ, కూరలు ఏరుకోసాగింది.

పెళ్లయి రెండు నెలలుగా కోడలు రాణి ఏ పనిలో సహాయం చేయకుండా టివి చూస్తూ కూర్చుండి పోవటం లేదా గదిలోకి వెళ్లి పడుకోవటం చూసి ఏమనాలో తెలీక ఉండిపోయింది రంగనాయకి.

ఉదయం నిద్ర లేచి బయటికి వస్తున్న కోడలి వంక చూసి “ఎనిమిది కావస్తోందమ్మా.. కాస్త పెందలకడ లేచి గుమ్మం ముందు ముగ్గు వేస్తే మనకు శుభం, రేపట్నుంచీ నువ్వే వేయాలి, నా వయసు మీద పడుతోంది, ఇంకెన్నాళ్ళుంటానో ఏమో” అంది నీరసంగా నవ్వుతూ రంగనాయకి.

“సరే అత్తయ్య” అని మొహం ముడుచుకుని, బ్రష్ చేసుకోసాగింది రాణి.

ఆ రోజు రాత్రి “ఏమండీ.. ఇంకెన్నాళ్ళుండాలిక్కడ.. ఇక నువ్వు అన్నీ చూసుకో.. నే వెళ్ళ్తాను అంటోంది అత్తయ్య” అంది గోముగా.

“నిజమే కదా, అమ్మ పెద్దదవుతోంది. అన్ని పనులు బాధ్యతలు నువ్ చూడాలి మరి” అన్నాడు అనునయంగా ప్రదీప్ పక్కకు వొత్తిగిలి పడుకుంటూ.

మరుసటి రోజు ఉదయాన్నే లేచి గదిలో నుండీ బయటకి వచ్చిన కోడలిని చూసి ఉప్పొంగి పోయింది రంగనాయకి.

“అత్తయ్య గారు, ఈ రోజు నుండీ అన్నీ నే చూసుకుంటా, ఇంటి ఖర్చులు , డబ్బుల లెక్క అంతా నా పని” అంటున్న కోడలిని చూసి తృప్తిగా తలూపింది.

నెల రోజులు గడిచిపోయాయి. అత్త గారి మీద ఇంట్లో అన్నిటా రకరకాల ఆంక్షలు విధించింది రాణి.

“నేను వడ్డిస్తాను.. మీరు అంత వరకూ ఆగాలి” అని అరిచింది రాణి. అన్నం తన ప్లేట్‌లో పెట్టుకుని తినబోతున్న రంగనాయకమ్మ విస్తుపోయి కోడలి వంక చూడసాగింది.

ఒక వారం తర్వాత భోజనం సమయంలో వంటింట్లోకి అడుగు పెట్టింది రంగనాయకి.

“అత్తయ్య! నువ్వీ రోజు నుండీ ఈ ప్లేట్ లోనే తినాలి.. అన్నీ ముట్టుకోవద్దు.” అని రంగనాయకమ్మ వేపు చూడకుండా పక్కకు చూస్తూ చెప్పింది రాణి.

విస్తుపోయింది రంగనాయకి. “ఎందుకలా” అడిగింది గొంతు పెగుల్చుకుని .

“నీకు బిపి ఉందిగా… ఆ జబ్బు అందరికీ అంటుకుంటుంది, అయినా అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు నాకు” కరకుగా అంది రాణి.

వయసు మీద పడి తనకున్న శక్తి అంతా హరించుకు పోయి ముడతలు పడ్డ శరీరం చూసుకుంది రంగనాయకి.

లేచి వెళ్లి అద్దంలో పళ్ళన్నీ ఊడిపోయిన బోసి నోటిని చూసి నవ్వుకుంది..

ఎనభై మీద పడిన తన సమయం ఇక ఇక్కడ అయిపోయిందని అర్థం అయ్యింది రంగనాయకికి. ఆ రాత్రి బాగా అలోచించి ఉదయం పెద్ద కొడుక్కి ఫోన్ చేసింది. “ఒరేయ్ పెద్దోడా రేపు వస్తున్నాను” అంది మనసులోని బాధ అణుచుకుంటూ.

“ఏంటమ్మా గొంతే మిటీ ఏదోలాగుంది.. ఏం జరిగింది… నువ్వేం బాధ పడకు నేనున్నాగా… సరేలే వచ్చేయి” అని ఫోన్ పెట్టేసాడు.

తన పెళ్లయి కాపురానికొచ్చిన రోజునుండీ వున్న ఇంట్లోనుండీ వెళ్ళటానికి మనసుని కఠినం చేసుకుంది రంగనాయకి. చిన్న కొడుకంటే ప్రాణం. కానీ తనుంటే ఇక పైన కోడలితో తనకు వచ్చే ఇబ్బందులతో కొడుకు మనసు బాధ పెట్టటం ఇష్టం లేదు.

తనను ఇంట్లోనుండీ బయటకు పంపాలని కోడలు చేస్తున్న పనులు కొడుకు దృష్టికి తీసుకెళ్ల లేకపోయింది.

ఆలస్యంగా పెళ్ళైన కొడుకు సంతోషమే తనకు ముఖ్యం అనుకుంది. కడుపులో నుండీ తన్నుకొస్తున్న బాధ ఎవరితో చెప్పుకో లేక రాత్రంతా కుమిలి పోయింది.

భర్త తోడు లేని వృద్ధాప్యంలో, కొడుకుల బాగోగులు చూడటంతో గడిచిన జీవితం ఒక్కసారిగా ఇప్పుడు ఒంటరిగా అనిపించింది.

తెల్లవారు జామున లేచి తులసి మొక్కకు, పూల మొక్కలకు నీళ్లు పోసి, ఇల్లంతా ఒక సారి కలియ తిరిగి చూసుకుంది. గోడకు తగిలించిన తన భర్త పటం ముందు నిలబడింది. పటంలో నుండీ నవ్వుతూ చూస్తున్న భర్త కేసి చూసి నేనే ముందుగా వెళ్లిపోవాల్సింది అనుకుని కళ్ళ నీళ్లు తుడుచుకుని తన గది లోకి వెళ్ళిపోయింది.

వెంటనే తన బట్టలు సర్దుకుని, కొడుకుతో పాటు బస్సు స్టాండ్ వేపు దారి తీసింది రంగనాయకి. బస్సు కదిలిన తర్వాత చిన్న కొడుకు “త్వరగా వచ్చేయ్.. జాగ్రత్త.. మందులు సమయానికి వేసుకో” అంటున్న మాటలు బస్సు రొదలో కలిసి పోయాయి.

అత్తగారు వెళ్ళిపోయిన నాటి నుండీ రాణి మనసులో చెప్పలేనంత హాయిగా వుంది.

పెద్ద కొడుకు వద్దకు వెళ్లిన తర్వాత చిన్న కొడుకు ప్రదీప్ మీద దిగులుతో ఎక్కువ రోజులు వుండలేదు. సంవత్సరం లోగా దేవుడి దగ్గరకు వెళ్ళిపోయింది రంగనాయకమ్మ.

గోడ మీద భర్త ఫోటో పక్కన రంగనాయకమ్మ ఫోటో చేరుకుంది.

***

తల్లి కర్మ కాండలన్నీ ముగించుకొచ్చిన మరుసటి రోజు ఈజీ చైర్‌లో కూర్చొని కాఫీ కప్పు పట్టుకుని బిస్కట్ తినబోయేంతలో “ఏవండీ!! ఏంటి మీరు చేస్తున్నది?”అని పెద్దగా అరిచిన భార్య అరుపుతో భయపడిపోయాడు ప్రదీప్.

భార్య వేపు చూసి “ఏంటి ఏమైంది?” అని ఆశ్చర్యంగా అడిగాడు.

“ముందు అత్తయ్య ఫోటోకు బిస్కట్ పెట్టి మీరు తినాలని తెలీదా?!” అంది రాణి కళ్ళు పెద్దవి చేసి.

“అలాగే” అని తల్లి ఫోటో వేపు చూసాడు ప్రదీప్. ఎందుకో గానీ తల్లి చిన్నగా అదో రకంగా నవ్వుతున్నట్లుగా కనిపించింది.

ప్రదీప్ మనసంతా కలచి వేసినట్లయ్యింది.

2

రంగనాయకమ్మ స్వర్గస్తురాలయ్యి ముప్పయ్ సంవత్సరాలు గడిచి పోయాయి. రాణి,ప్రదీప్‌లకు అరుణ్ ఒక్కడే సంతానం. అరుణ్ వివాహం నాలుగు సంవత్సరాల కింద జరిగింది. హైదరాబాద్ లో స్థిరపడ్డాడు. భార్య హారిక కూడా హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ వుద్యోగం చేస్తూ ఉంది.

వారి వివాహం జరిగిన కొత్తలో ఇద్దరూ కలిసి పండగలకు ఇంటికి వచ్చి వెళ్తూ వుండే వారు. తర్వాత మెల్లి మెల్లిగా రావడం తగ్గించారు.

రాత్రి తొమ్మిది కావస్తోంది. ఈటీవీలో తెలుగు వార్తలు మొదలయ్యాయి . ముందు గదిలో కొడుకు అరుణ్, భర్త కలిసి భోజనం చేస్తూ వున్నారు. రాణి కూరలు వడ్డిస్తూ వుంది.

“ఈ రోజే కదా వచ్చింది, రేపే వెళ్ళాలా” అడిగింది రాణి, కొడుకును దిగులుగా చూసి.

“అవునమ్మా.. అక్కడ ఇంట్లో హారిక, బాబు ఇద్దరే వున్నారు ఒంటరిగా” అన్నాడు అరుణ్ తల లేపకుండా.

“కోడలు, మనమడు పక్కనే వున్న హైదరాబాద్ నుండీ ఇక్కడ మనింటికి రాక దాదాపు మూడు సంవత్సరాలు దాటింది రా” అన్నాడు ప్రదీప్ కొడుకును ప్రేమగా చూస్తూ అనునయంగా.

“నువ్వు కూడా వచ్చి ఈ రోజుతో సంవత్సరం గడిచింది దాదాపుగా” అంది రాణి కాస్త నిష్ఠూరం ధ్వనిస్తూ.

ఇబ్బందిగా కదిలాడు అరుణ్ “అమ్మా.. నస పెట్టకు.. ఈ ఊరికి రావడం నీ కోడలికి నచ్చదు. నేను వచ్చి వెళ్తున్నాగా” అన్నాడు చిరాకుగా .

“సరేలేరా.. నీ ఇష్టం, మరైతే మేమే వస్తాములే, ముసలితనం వచ్చింది, మాకూ నీతో వుండాలని వుంది, ఎప్పుడు రావాలి?” ఆతృతగా బాధతో అడిగింది రాణి.

“అక్కడికి వచ్చి నువ్వేం చేస్తావ్ అమ్మా.. పైగా నీ అలవాట్లు హారికకు నచ్చవు, మీకిక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయిగా, నేనే వస్తుంటా” అని నిష్కర్షగా చెప్పి లేచి వెళ్ళిపోయాడు చేతులు కడుక్కోవటానికి.

అప్పుడు ఎక్కడి నుండో అత్తగారు తనను పిలిచినట్లు వినిపించి గోడకున్న అత్తగారి ఫోటో కేసి ఆశ్చర్యంగా చూసింది రాణి.

అందులో అత్తగారు తనను జాలిగా చూస్తున్నట్టు  కనిపించింది రాణికి.

అమ్మ మనసు అంతే…..తన గుండెను కోసుకెళ్ళిన కొడుకు కాలికి రాయి తగిలితే దెబ్బ తగిలిందా నాయనా? అని అడుగుతుంది.
కుళ్ళి కుళ్ళి ఏడవసాగింది రాణి.
అందరూ కొడుకు వెళ్తున్నందుకు దుక్ఖిస్తోందనుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here