[dropcap]అం[/dropcap]తర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా – సంచికలో ప్రచురితమైన ‘నేను కస్తూర్‍ని’ అనే కస్తూర్‍బా జీవితగాథ నుంచి కొన్ని పేరాలు అందిస్తున్నాము.
భార్యగా, గృహిణిగా, తల్లిగా నిర్వహించిన పాత్రలకి మించి తనని తాను తెలుసుకుంటూ ఆత్మోన్నతిని ‘బా’ సాధించిన తీరుని అద్భుతంగా అందించారు చందకచర్ల రమేశ బాబు.
***
21 సంవత్సరాల తరువాత భాయి, 15 సంవత్సరాల తరువాత నేను హిందూస్తాన్‌కు తిరిగి వచ్చాము. రొట్టెలు ఒత్తే కర్రను తప్ప ఇతర కర్రను చూడని నేను మనుషులను కొట్టే లాఠీల రుచి చూశాను. ఇంటి నాలుగు గోడల మధ్య బందీగా ఉన్న నేను సముద్రాన్ని దాటి వెళ్ళి ఇతర దేశం జైలు కూడా చూసొచ్చాను. ఉద్యమం, పోరాటం అనే పదాలే చెవి పైన పడని ఒక గృహిణి సత్యాగ్రహిగా మారాను. పాఠశాలకే వెళ్ళని నేను అక్షరాల్ని కూడబలుక్కుని వార్తా పత్రిక చదివేటంత, మా పత్రిక యొక్క గుజరాతీ అవతరణకు చెప్పి రాయించేటంత అక్షరస్తురాలనయ్యాను.
ఇది గర్వంగా చెప్పట్లేదమ్మాయ్! నాలో కలిగిన మార్పు. భాయి ద్వారా అయిన మార్పు కూడా. ఇది ఒక్కసారిగా అయిన మార్పు కాదు. పెరుగు కవ్వంతో చిలికగా వెన్నగా మారినట్లు. వెన్న వేడితో నెయ్యి అయినట్టు అయిన మార్పు. అందుకే ఇంత వివరంగా చెప్పాను అంతే.
~
మా సమయంలో నేను చూశాను, తమ భార్యలను నోరు విప్పడానికి ఎవరూ అనుమతించేవారు కారు. ఈ మహాత్ముడు మాత్రం “నువ్వు మాట్లాడు, మాట్లాడు” అని చెప్పేవారు. నేను మాట్లాడలేను అని చెప్పినా “లేదు. నీకు ఏమనిపిస్తుందో అదే మాట్లాడు” అనేవారు. నువ్వే ఆలోచించు, మాట్లాడు, నిర్ణయం తీసుకో, చర్చించు అనేవారు. చివరికి ఏం చెయ్యమంటావ్ అని నన్నే అడిగేవారు. ఒకసారి సిమ్లాకు వైస్రాయ్ విలింగ్డన్ గారిని చూడడానికి వెళ్ళినప్పుడు నన్ను కూడా వెంటపెట్టుకుని వెళ్ళారు. అనసూయా సారాభాయ్ కూడా ఉన్నారు. ఏం మాట్లాడను అని అడిగాను. “అది నువ్వే ఆలోచించు. కుదిరితే నన్ను వదిలేసి ఆలోచించు” అన్నారు. ఆశ్చర్యమేమంటే ఇలా నాకు నేనే స్వంతంగా ఆలోచించి మాట్లాడడానికి ప్రారంభించాకనే నేను ఎవరు అని నాకు అర్థమయ్యింది. ఆలోచించి మాట్లాడడానికి ప్రారంభించినాకనే బాపు నాకు అర్థమయ్యింది. ఆలోచించడం వల్లనే బహుశా బాపుకు కూడా అందరూ అర్థమవుతూ ఉండింది!
~
సంచిక వెబ్ పత్రికలో ‘నేను.. కస్తూర్‌ని’ పేరిట ధారావాహికంగా ప్రచురితమై పాఠకులను ఆకట్టుకున్న రచన ఇది.
***
కన్నడం: డా. ఎచ్. ఎస్. అనుపమ, తెలుగు: చందకచర్ల రమేశ బాబు
ప్రచురణ: ఛాయ రిసోర్సెస్ సెంటర్, హైదరాబాద్.
పేజీలు: 222
వెల: ₹ 250/-
ప్రతులకు:
ఛాయ రిసోర్సెస్ సెంటర్, హైదరాబాద్. 9848023384
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్. 9000413413
ఆన్‍లైన్‌లో:
https://www.amazon.in/NENU-KASTURBAA-NI-Dr-ANUPAMA/dp/B0CR1MFJM8
~
ఈ పుస్తకంపై సంచికలో వచ్చిన సమీక్ష: