[శ్రీ రాచకుళ్ల విశ్వరూప చారి రచించిన ‘తందనాలు’ అనే చిన్న కవితలని పాఠకులకు అందిస్తున్నాము.]
101
కొండంత బలవంతుడై వుండి కూడా
అండదండలు లేక మిన్నకుండి పోయె
కండ బలమున్న వేరొకనితో జత కట్టె
చెండుకు తిన్నారిద్దరూ కలసి
102
అంశం దొరక్క పద్యం వ్రాయలేక పోయా
వశమయ్యే రీతిలో అంశం దొరక లేదు
లేశమంతైనా మదిలో మెదిల్తేనా
ఆశ నశించి వ్రాయటం మానేశా
103
అవసరాలు చాలా
కావలసినన్నిఅంగట్లో దొరుకుచున్నవిగా
పేవలంగా వున్నవి ఎంచుకోలేము
చవకవే ఎక్కువగా వున్నవి విఫణిలో
104
నీతి పద్యాలు వ్రాయుటలో పోటీ
చేతి వాటంతో వ్రాసే వారు
మతి దగ్గర పెట్టుకుని వ్రాసే వారు
యతి గణ ప్రాసలు తెలియక వ్రాయ లేని వారు
105
యతి గణ ప్రాసలతో పద్యాల కూర్పు
మత్తేభమైతే గట్టి పదాలు కావాలి
ఉత్పలమాలైతే ఉత్తినే అవ్వదు
చేతిలో కలముండాలి వ్రాసేందుకు
106
కోస్తా తీరంలో కొబ్బరి చెట్లకేం కొదువ
బస్తాల కొద్దీ కాయలు లభించె
రాస్తాలన్నీ కొబ్బరి లారీలతో నిండె
చేసేందుకేమున్నది నిరీక్షించక
107
జనాభా పెరిగే కొద్దీ కొత్తవి సృష్టించాలి
పనులనేకంలో కొన్ని వెతికా
పన్నుల వల్ల కొన్ని వదిలేశా
ఎన్నుకున్నవి అన్నీ ఫలించక పోయె
108
దోమ యెంత దొంగదో మీకేమి తెలుసు
కమ్మగా తింటున్నప్పుడు కుట్టేస్తుంది
చెమ్మగా వున్న చోటల్లా చేరిపోతుంది
తమ సైన్యంతో మరీ కుట్టి పోతుంది
109
కేదారేశ్వర వ్రతంలో వున్నారు ఇంటి సభ్యులంతా
చందాల కోసం వచ్చిరి కొందరు
వందైనా యివ్వందే వదలమన్నారు
మందకొడిగా సాగింది వ్రతం
110
కాలచక్రం ఆగదు ఎవ్వరి కోసం
నేల నీరు లేక ఫలితమివ్వదు
తలకు మించిన భారం, ఫలితం శూన్యం
కల ఎన్నటికీ నిజం కానేరదు