[శ్రీ రాచకుళ్ల విశ్వరూప చారి రచించిన ‘తందనాలు’ అనే చిన్న కవితలని పాఠకులకు అందిస్తున్నాము.]
151
శాస్త్రవేత్తలందరూ చేరిరి
శాస్త్రాలన్నీ తిరగవేసిరి విఫలం కొరకు
కాస్త లోతుగా అధ్యయనం చేసిరి
దస్త్రంలోనే లోపమని గ్రహించిరి
152
పామరు లందరూ చేరి గోల గోల
వాముల దొడ్లో దూరిన పాము గురించి
తాము పట్టుకునే దెలానా అని
సాము చేసి పట్టుకుందామని ఆలోచన
153
కండ గలిగిన వాడే బలవంతుడు
అండ లేనినాడు నిస్సహాయుడే
కొండంత డబ్బున్నా అండలేనిచో వృథా
దండకారణ్యం లోనైనా అండే ముఖ్యము
154
బంగారు బొమ్మా యెంత అందంగా వున్నావే!
కంగారు పడిందామాటలకు చిన్నది
సింగారాన్ని చూచుకొని ఆనందించె
రంగ రంగా అంటూ మురిసి పోయింది
155
రంగు రంగు చీరలతో భామలు
కొంగు బిగించి మాటల తూటాలు
తగునా యిన్ని మాటలంటూ కొందరు
ఖంగు తినిరి అసలు తూటాలు పేలే సరికి
156
వారసత్వ సంపద వున్న బద్ధకస్తుడు
కోరడు యెంత మంచి పనినైనా
చేరడు అత్యున్నత స్థాయినెన్నడూ
సరి చేసుకుంటాడు వున్న దాని తోనే
157
ఎన్నో విద్యలుంటాయి నేర్వవలసినవి
అన్నీ అందరికి అబ్బవు
కొన్ని మాత్రమే నేర్వగలరు జీవితంలో
ఎన్ని నేర్చినా నిష్ణానతే ముఖ్యం గదా
158
యెంత విద్యావంతులైనా
కొంత మిగిలే వుంటుందిగా
యెంత పెద్ద చదువులు చదవగలరు ఎవరైనా
యెంత చదువైనా జీవనోపాధి కొరకేగా
159
చిలక పలుకులతో చిన్నది
వలపంతా వొలకబోసె చిన్నోడు
కల తిరిగారు చెట్టా పట్టాలేసుకొని
కలగన్నాడు చిన్నోడు పెళ్లయిందని
160
కాల చక్రానికి కాళ్ళుండవు
చలనం మాత్రం ఆగదు యెవ్వరి కోసం
తొలకరి జల్లులు తప్పక వస్తాయి
మొలకలు ఎత్తుతాయి గింజలీ జల్లుతో