తందనాలు-17

0
2

[శ్రీ రాచకుళ్ల విశ్వరూప చారి రచించిన ‘తందనాలు’ అనే చిన్న కవితలని పాఠకులకు అందిస్తున్నాము.]

161
చక్కని కవిత్వంతో పులకింప చేయాలి ప్రజను
మొక్కవోని దీక్షతో ప్రారంభించె
వొక్క పేరా ఐన వ్రాయలేదు
కక్కలేక మ్రింగలేని చందమాయే

162
ప్రకృతి, జీవుల మధ్య సంవాదం
సక్రమ పద్దతిలో లేదని
వక్ర మార్గంలో నడుపుచున్నదని జీవులు
చక్రాలు యెన్ని అడ్డు వేసినా ఇదే మార్గం

163
గాలికి, మేఘానికి సంవాదం
చలనానికి సాయపడుట లేదు
కాల చక్రంతో పాటు కదల నివ్వటంలా పవనుడు
జల జలా వర్షించటానికి

164
సూర్యోదయం కోసం ఎదురు చూపులు
కార్యక్రమాలు సాగించుటకు
యెర్రని రంగులో తూర్పున ఉదయించె
బిర బిరా పనులు ప్రారంభించె జీవరాశి

165
పిల్లలేగా పునర్జన్మ
పిల్లలు లేనివారికి మరు జన్మ ఏది?
పిల్లలేగదా వృద్ధాప్యంలో ఆదుకునేది
పిల్లలు లేని జీవితం దుర్భరమేగా

166
తల్లక్రిందులుగా తపస్సు చేసినా
వల్లమాలిన ఆంక్షలు సడలించినా
కొల్లగొట్టేందుకు వీలు పడలా
తెల్లవార్లు ప్రయత్నించి ప్రయోజనం శూన్యం

167
కమ్మగా భోజనం చేసేందుకు సిద్ధమైరి అతిథులు
గమ్మత్తుగా వంటలు పూర్తి అయ్యె
కమ్మ పొడి నెయ్యి కూడా సిద్ధం
వమ్మయ్యె వంటలు పాడవటంతో

168
తిట్ల పురాణమేగా నేటి రాజకీయం
అట్లే నాయకులు మొదలు పెట్టిరి
తట్టి ప్రజను లేపుదామనే ఉద్దేశం
వట్టి తిట్లతో ప్రజను మార్చలేరు

169
ఆరోపణల పర్వం కూడా నేటి రాజకీయం
పరోపకారం ఊసే లేదు
మరో జన్మెత్తినా నాలా చేయలేరని ఒకరు
భరోసా ఇమ్మని ఇంకొకరు.

170
ప్రభుత్వ నిధులతో గుళ్ళు గోపురాలు
మభ్య పెట్టటానికి ప్రజలను భక్తితో
లభ్యమైయ్యే ఆధ్యాత్మికత యెంత?
రభస లేకుండా యెత్తుగడ గావచ్చు

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here