[శ్రీ రాచకుళ్ల విశ్వరూప చారి రచించిన ‘తందనాలు’ అనే చిన్న కవితలని పాఠకులకు అందిస్తున్నాము.]
211
ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూపులు
అప్పుడు పనులు ప్రారంభించుటకు
చెప్పుకో లేనంత సంతోషం సూర్యోదయంతో
అప్పుడే అన్నీ ప్రారంభం
212
సూరీడు వంకర చూపులు ఎందుకో
తరుణం కోసం ఎదురు చూస్తున్న ప్రకృతి
వరుణుడి అడ్డు తొలిగింది
కరుణతో తన దృష్టి సారించె భూమ్మీద
213
పూలు ఆహ్వానిస్తాయి తేనెటీగలను
తలుపులు లాంటి రేకలు తెరుచుకుంటివి
పలు తేనెటీగలు చేరుతా యప్పుడు
గ్రోలుతాయి మకరందాన్ని
214
నది ప్రవాహం గురించి
ఏ దిశకు చేరుతుందో తెలియదు
కదలలేని చోటల్లా దిశ మార్చుకోవాలి
వదిలేయాలి అడ్డు వచ్చిన వాటన్నిటిని
215
తీరం దాటే ప్రయత్నమే సముద్రానిది
కెరటాలుగా లేచి దాటాలని
మరల ఉవ్వెత్తున లేస్తుంది
మరల మరలా ప్రయత్నిస్తుంది వెనక్కి పోతుంది
216
జలపాతాల హోరు శ్రవణానందమే
జల జలా పారుటలో నేత్రానందం
వలతో చిక్కవు చేపలు
చలనం లేని నేల భరిస్తుంది దాని ధాటిని
217
పవనునికి కొండ అడ్డొచ్చింది
రవ్వంత కూడా ఆలోచించకుండా అమెరికా పయనం
కోరి సుడి గుండమై
దారిలో అన్నిటిని ధ్వంసం చేసె కోపంతో
218
కరుడు కట్టిన తీవ్ర వాదంలో చేరు కొందరు
కరవాలాలు, కత్తులు, తుపాకులతో
చెరచు పనులన్నిటినీ
మరుభూమిగా మార్చు మంచి లోకాన్ని
219
తేలు కొండి లక్షణం కొందరిది
వీలు చూచుకొని సూటి పోటీ మాటలతో గుచ్చుతుంటారు
పలు మార్లు చేస్తూనే వుంటారు
కోలుకో లేనంతగా చేస్తారు
220
కొంటె కుర్రోళ్ళు కొందరు చేసే పనులు
కంటి మీద కునుకు లేకుండా చేస్తవి
ఒంటరిగా వుంటే మరీ రెచ్చిపోతారు
తుంటరితనం మాత్రము మానరు