Site icon Sanchika

తందనాలు-25

[శ్రీ రాచకుళ్ల విశ్వరూప చారి రచించిన ‘తందనాలు’ అనే చిన్న కవితలని పాఠకులకు అందిస్తున్నాము.]

241
అమ్మది ఆడ జన్మేగా, ఐనా
తమకు పిల్లలు కావాలన్నప్పుడు అబ్బాయే కావాలి
మమతానురాగాలు పంచటానికి పాపాయైతే
నేమి అనుకోరు

242
పుట్టినప్పుడు పిల్లలందరూ సమానమే
మట్టిలో మాణిక్యాలుగా కొందరు
తొట్టి గ్యాంగుగా కొందరు
చుట్టు ప్రక్కల పరిస్థితులని బట్టి మారుతారు

243
మనిషి నియంతగా మారటానికి కారణం
చిన్ననాటి పరిస్థితి, ప్రభావాలు
కనే దృశ్యాలు పెరిగేకొద్దీ
అన్నీ కలిపి మనిషిని మారుస్తాయి

244
ప్రజాస్వామ్యంలో దద్దమైనా, మంచివాడైనా
ప్రజలే గదా ఎన్నుకునేది
వజ్రాలాంటి వారైనా దద్దమ్మలైనా
రాజ్యమేలేది ఎన్నుకున్న అభ్యర్ధులేగా

245
అసమర్ధుని చేతిలో అధికారం చిక్కితే
అసమంజసంగానే వుంటుంది పాలన
కసిగట్టి ప్రజలు ఎదురుతిరిగి
నసలేకుండా మార్చవల్సిందే

246
విద్యావంతుడైనంత మాత్రాన సమర్థుడే?
విద్య లేనివారూ సమర్థులై వుంటారు
విద్యతో ముడి పడి వుండదు సమర్థత
విద్యే అన్నిటికి మూలం అనుకోలేం

247
తీర్చ రాని సమస్యలెన్నో జీవితంలో
చేరనివ్వద్దు అలాంటి వాటిని
కోరకుండా వచ్చేవైతే
మరెలా యెదుర్కొవాలో సుదీర్ఘంగా ఆలోచించాల్సిందే

248
ముక్తి కోసం వెంపర్లాట
భక్తి తో పొందాలనే కోరిక
శక్తి మేరకు భక్తి భావం పూజలు నిర్వహించె
ముక్తి చివరకు లభించింది నిర్యాణము తోనే

249
తల్లి తండ్రులు జీవితాన్ని ఇచ్చారు
మెల్లగా ప్రకృతి పెరిగేట్లు చేసె
ఆప్యాయంగా తల్లి తండ్రులు పెంచె
వల్ల మాలిన ఆశలు లేనిచో ఆనందమే

250
నాటు పాటకు ఆస్కార్ అవార్డు
పాట అంతటి అనుభూతి నిచ్చేనా?
హిట్‌కు కారణం పాటా, సంగీతమా
పాటలో ‘నాటు’ అనే అక్షరాలే అంత క్రేజా

Exit mobile version