[శ్రీ రాచకుళ్ల విశ్వరూప చారి రచించిన ‘తందనాలు’ అనే చిన్న కవితలని పాఠకులకు అందిస్తున్నాము.]
271
ప్రకృతి అప్పుడప్పుడు విరుచుకు పడుతుంది
వక్ర బుద్ధి చూపిస్తుంటుంది
టక టకా వడగళ్ల వాన
పకడ్బందీగా వుండి రక్షించుకోవాల్సిందేగా
272
లక్ష లక్షణాలున్న చెట్లు మొలిచె
తక్షణమే ఎంచుకోమనిరి
తీక్షణంగా చూచి ఎన్నుకొనిరి
పక్షపాతం లేకుండా సరియైనవే ఎంచుకొనిరి
273
సుడిగాలులు అమెరికాలో అదేనండి టోర్నడోలు
గోడు వినిపించుకోకుండా
గడ గడ లాడించేస్తవి
తడబడకుండా ధ్వంసం చేస్తవి క్షణాల్లో
274
కోటికి పడగలెత్తినా
కూటి కోసం అర్రులు చాచవలసిందే
నేటి ఆహార పదార్థాలూ కల్తీయేగా
కోటీశ్వరులైనా, సామాన్యులైనా తినాల్సిందే
275
అగ్నికి ఆకలైనప్పుడల్లా
భగ భగమని మంటలు లేపి
బుగ్గి చేసి తినేస్తుంది దేని నైనా క్షణాల్లో
ఆగి చూచే పనే ఉండదు ఏది ఏమైనా
276
వరుణునికి తొందరెక్కువ
కరుణతో భూమాతను తడపాలని
త్వర త్వరగా కురవాలని
పరుగులో నీటితో పాటు రాళ్ల వర్షం కురిపించె
277
ఆడవాళ్ళ కష్టాల్ని పట్టించుకునే వారేరి
పండగ వచ్చిందంటే యెంత శ్రమో
పడి పడి వంటలు రుచిగా చేయాలి
కడు రుచిగా వున్నా వంకలెన్నో!
278
మగవారు వంకలు పెట్టటంలో రహస్యముంది
తగినంత ఉప్పు కారాలు లేకుంటే రుచెక్కడ
నగ నట్రా చూసుకుంటూ చేస్తే
సగం రుచి తగ్గిపోదా
279
దేవుడు కోట్ల మంది కోర్కెలు తీర్చేనా?
కావవే అంటూ కోరినంత మాత్రాన
ఎవరి కోరికలు వారే తీర్చుకోవాలి
కావున దేవుణ్ణి కోరుట వృథా
280
కరుణామయుడైన దేవుని
కరుణ అందరికి సమమే?
కోరుకున్న వారికి కోరినట్లు చేస్తాడా?
నరులకేనా, మరి ఇతర జీవరాశులకు?