తందనాలు-30

0
13

[శ్రీ రాచకుళ్ల విశ్వరూప చారి రచించిన ‘తందనాలు’ అనే చిన్న కవితలని పాఠకులకు అందిస్తున్నాము.]

291
పరాచికాలు ఎక్కువైతే
అరాచకాలు ప్రబలే ముప్పు ఉండవచ్చు
మరల మరల జాగ్రత్తగా ఆలోచించి
పరాచికాలు చేయవలసి ఉంటుంది

292
పయనించే ఓ బాటసారి, ఒంటరినని
భయమేల నీకు, దారి వెంట
కోయ దొరలు కాచుకుంటారు నిన్ను
రయమున ముందుకు సాగి గమ్యము చేరు

293
చీకటి వెలుగుల దీపావళి ప్రారంభం
రక రకాల మందు గుండు సామాగ్రి
చక చకా కాల్చి వేసిరి
పక పకా నవ్వులతో ముగిసె దీపావళి

294
బయట అంతా వెన్నెల చల్లగా
కాయకష్టములన్నీ మర్చిపోయి
శయనించక మనసు చల్లబడుటకు
రయమున బైటకు వెళ్లి సేద తీర్చుకో

295
సుడి గాలులకు (టోర్నడోలకు) యెంతో కోపం
వడి వడిగా సుళ్ళు తిరిగి భీభత్సం చేస్తవి
నడ్డి విరిచేస్తవి అన్నిటిని
చడి చప్పుడు కాకుండా పారిపోతవి

296
విశాలమైన ఆకాశంలో విహరించే పక్షుల్లాగ
వశంగాని మనసు అంతే
లేశమంతైనా అదుపులో ఉండదు
శశి అంచుల వరకు వెళ్లగలదు గదా

297
తొలకరి జల్లులతో భూమి పులకించె
మొలకెత్తినవి వెదజల్లిన విత్తనం
కాలానుగుణంగా ఫలాల్నిచ్చాయి
ఫలాల్ని అనుభవించారు జనం

298
వ్యక్తిగత ఆస్తులు లేకుంటే
వ్యక్తులందరూ సమానమేగా సమాజంలో
బిక్షకుల ప్రసక్తే ఉద్భవించదు
కక్షలు కార్పణ్యాలు వుండవు కొంతమేర

299
కపట వేషదారులు చెప్పే మాటలు
అపశకునాలు నమ్ముతారు జనం
అపశకునాలంటే ప్రకృతిలోవేగా
జప తపాలు చేస్తారు నివృత్తికి

300
సూరీడు అంటే కోపం
పరిశీలనగా చూస్తాడని
నేరాలు ఘోరాలు చేసినా చూస్తూనే ఉంటాడు
తరచి చూస్తే ఏమి చేయడని తేలింది, భయమేల?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here