Site icon Sanchika

‘తండ్లాట’ నానీల పుస్తకావిష్కరణ – ప్రెస్ నోట్

సజీవ చేతనస్వరం బోల యాదయ్య కవిత్వం

[dropcap]స[/dropcap]జీవ చేతన స్వరం బోల యాదయ్య కవిత్వమని ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ రఘు పేర్కొన్నారు.

27 ఫిబ్రవరి 2024 నాడు మహబూబ్ నగర్ పట్టణంలోని ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో బోల యాదయ్య రచించిన ‘తండ్లాట’ నానీల పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా, ఆవిష్కర్తగా విచ్చేసి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలమూరు జిల్లా మట్టి పరిమళం బోల యాదయ్య అని, సజీవమైనటువంటి కవిత్వాన్ని ఆవిష్కరిస్తున్న బోల యాదయ్య నిత్య చేతన స్వరమని ప్రశంసించారు. నిరంతరం కొత్త కొత్త అభివ్యక్తితో తనదైన శైలిలో పాలమూరు మాండలికాన్ని ఒడిసిపట్టి నిత్యనూతనంగా కవిత్వాన్ని ఆవిష్కరిస్తున్న బోల యాదయ్య కవితాపిపాసి అని కొనియాడారు. బోల యాదయ్య జీవితంలోని సంఘటనలను, జీవన సంఘర్షణను నానీల రూపంలో వెలువరించారన్నారు. పాలమూరు జిల్లాలో ఒకప్పుడు కరువు ఎలా ఉండేదో, వలసలు ఏ విధంగా ఉన్నాయో అవన్నీ తన నానీలో బలంగా ఆవిష్కరించారన్నారు.

విశిష్ట అతిథి వి.మనోహర్ రెడ్డి మాట్లాడుతూ పాలమూరు జిల్లాలో యువకవులు చక్కటి కవిత్వం రాస్తున్నారన్నారు. యువకవులను నిరంతరం ప్రోత్సహిస్తే భవిష్యత్తులో వారు కూడా చక్కటి కవిత్వం రాస్తారన్నారు.

సభాధ్యక్షులు, కళాశాల ప్రిన్సిపాల్ కెప్టెన్ డాక్టర్ యం. విజయ్ కుమార్ మాట్లాడుతూ కళాశాలలోని విద్యార్థినులను ప్రోత్సహించే విధంగా కార్యక్రమాలను చేపడతామన్నారు. అందుకోసం రైటర్స్ వింగ్ కూడా ఏర్పాటు చేశామన్నారు.

ఆత్మీయ అతిథులు కోట్ల వేంకటేశ్వర రెడ్డి, డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్‌లు మాట్లాడుతూ పాలమూరు నుంచి చక్కని, చిక్కని కవిత్వం రాస్తున్న వారందరూ సమకాలీన సమస్యలను చిత్రిక పట్టాలన్నారు. పాలమూరు జిల్లా నుంచే అనేక సాహిత్య ప్రక్రియలు పురుడు పోసుకున్నాయన్నారు.

ప్రముఖ యూవకవి పొన్నగంటి ప్రభాకర్ పుస్తక సమీక్ష చేస్తూ బోల యాదయ్య కవిత్వంలో సజీవమైన కవిత్వం ఉంటుందని‌, ఏదీ కృతకంగా ఉండదన్నారు. తండ్లాట నానీల సంపుటిలో పాలమూరు వలస పక్షుల వేదనను చక్కగా ఆవిష్కరించారన్నారు.

పాలమూరు యూనివర్సిటీ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ మన్నెమోని కృష్ణయ్య మాట్లాడుతూ బోల కవిత్వంలో జీవితపు అనుభవాలు తొంగిచూస్తాయన్నారు. అనుభవంలోంచి వచ్చిన కవిత్వం ఎల్లప్పుడూ నిలుస్తుందన్నారు.

గౌరవ అతిథులు బెక్కెం జనార్దన్, ఎన్.పి.వెంకటేష్, సత్తూరు చంద్రకుమార్ గౌడ్, కె. లక్ష్మణ్ గౌడ్, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ గంగాధర్, తెలుగు శాఖ ఆచార్యులు విఠలాపురం పుష్పలత, యువకవుల వేదిక ప్రధాన కార్యదర్శి కె.పి.లక్ష్మీనరసింహ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version