Site icon Sanchika

తాండూరుతో ములాఖాత్..

[శ్రీ ప్రమోద్ ఆవంచ గారి ‘తాండూరుతో ములాఖాత్..’ అనే రచనని అందిస్తున్నాము.]

[dropcap]ఉ[/dropcap]దయం అయిదు గంటలు, అలారం మోగుతుంది. హిమాలయ ఇన్ హోటల్.. తాండూరు. ముందు రాత్రే అలారం పెట్టుకున్న కారణంగా మెలుకువ వచ్చింది. ఉదయం నాలుగున్నర నుంచే హైదరాబాద్‌కి బస్సులు మొదలవుతాయని తెలిసి, అంత పొద్దున్నే ఎటూ లేవలేమనీ, ఒక దృడ నిశ్చయానికి వచ్చి, అయిదున్నర బస్సులో వెళ్ళడానికి నిర్ణయించుకున్నాను. అందుకే అలారం అయిదింటికి మోగింది. లేచి తొందర, తొందరగా ఫ్రెష్ అయి, హోటల్ బయటకు వచ్చాను.

హొటల్ నుంచి బస్టాండ్ దూరం అవుతుందని, ఎవరో చెప్పడంతో, హైదరాబాద్ దారిలోని, పోలీసు స్టేషన్ సర్కిల్ వద్దకు వడి వడిగా అడుగులు వేసాను. కానీ అప్పటికే బస్సు దూరంగా వెళ్ళిపోతూ కనిపించింది. అరే.. టైంకి ముందే వేళ్ళిపోయిందన్న బాధ అనిపించినా, చేసేది ఏమీ లేక ఇంకా ఆరు గంటల బస్సే దిక్కని తలచి, నిల్చున్నాను.

అక్కడ నిల్చొని అటూ ఇటూ చూసాను, నాకు కొంచెం దూరంలో, చాయ్ బండి ఉంది. అప్పుడప్పుడే తెరిచాడనుకుంటా, వేడి వేడి పొగలు గాల్లోకి లేచి ఆవిరవుతున్నాయి. మెల్లగా వెళ్లి చాయ్ తీసుకుని, ఆ వేడి చాయ్‌ను ఆస్వాదిస్తూ, చుట్టూ చూసాను.

ఎక్కడి నుంచో గుడి గంటల శబ్దం వినిపిస్తుంది. రోడ్డు మీద సైకిల్ పై ముస్లిం సోదరుడు, ఫజర్ నమాజ్ కోసం మసీదు వెళుతున్నాడు. దూరంగా రోడ్డుపై దుమ్ము గాలిలోకి లేచి ఆ ప్రదేశం అస్పష్టంగా కనిపిస్తుంది. మున్సిపాలిటికి చెందిన కొందరు మహిళలు, చేతిలో పొడవైన పొరకలు పట్టుకునీ, రోడ్డు ఊడుస్తున్నారు. అలా లేచిన దుమ్ము రోడ్డంతా ఆవహించింది. వెనక వైపు ఉన్న ఒక ఇంటి పిట్ట గోడ పై కోతి, ఏదో తింటూ, భయంగా అటూ ఇటూ చూస్తుంది. మరో ఇంటి ముందు ఇద్దరు పిల్లలు గోళీలాట ఆడుకుంటున్నారు. ఏ బాదరాబంది లేని బాల్యం, ఎంత బాగుంటుంది కదూ. చెట్టు మీద పిచ్చుకల గొంతులు, వెలుగుల ప్రస్థానం అయి, పొగమంచుని, మెల్ల మెల్లగా తుడిపేస్తాయి. మరో కొత్త రోజు వెలుగు కిరణమై మనసును ఉత్తేజితం చేస్తుంది.

కన్న కలలు, తూర్పుకి వైపుకి పయనించి అంతమౌతాయి. మెలుకువ వచ్చాకా, ఏదో అసంతృప్తి గుండెను సాగదీస్తుంది. అదే మెలి పెడుతుంది.

ఈలోపల బస్సు వచ్చింది. ఎక్స్‌ప్రెస్ బస్సు, హడావుడిగా, ఎక్కాను.

బస్సు బయలుదేరింది, వచ్చే దారిలో, ఆగే నెక్ట్స్ స్టాప్ దారూర్, దారికిరువైపులా పచ్చని పొలాలు, ఆ పోలాలలో, అందమైన శ్వేత వర్ణంతో, కొంగలు బారులు తీరిన దృశ్యం. ఎంత అద్బుతం, నేనైతే గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్‌ని మర్చిపోలేకపోతున్నా!

గట్టు మీద వరుసగా ఆ పక్షులను చూస్తే, పంటకు గిట్టుబాటు ధరనే కాదు, ఎంతైనా ఇచ్చి కొనుక్కోవాలన్న ఆశ కలిగింది. నిజం కాదా, ఆలోచిస్తే, మన ప్రతి కదలికను అక్షరీకరిస్తే ఎంతో అందంగా వుంటుంది కదూ. కానీ నా ఆనందం ఎంతో సేపు నిలవలేదు. పచ్చగా ఉండే పంటపొలాలు, మనకోసం కష్టపడే రైతులు, రేయింబవళ్ళు వాళ్ళు పడే కష్టం, ఒక్కసారిగా బూడిదలో పోసిన పన్నీరు చందంగా, మారింది. పంట పొలాలన్నీ రియల్ ఎస్టేట్ పడగ నీడల్లో నాశనం అవడం గమనించాను. చేనును సేద్యం చేయకుండా ప్లాట్లుగా చేసి అమ్ముతున్నారు. ఇది ఒక్క తాండూరు లోనే కాదు, తెలంగాణా లోని అన్ని ప్రాంతాలలో, అదే తంతు. రానున్న రోజుల్లో రైతనేవాడు కనుమరుగై, భూములన్నీ, కమర్షియల్‌గా మారి, ప్లాట్లు అయిపోవడం ఖాయం అనిపించింది. రోడ్డు సైడు ఎకరా భూమి కోటి రూపాయల పైమాటే అంటే నమ్మశక్యంగా లేదు. కానీ అది నిజం, దాన్ని నమ్మక తప్పదు.

తాండూరు ఒక మండల కేంద్రం. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి, వికారాబాద్ జిల్లాకు మారింది. తాండూరు నుంచి పదిహేను కిలోమీటర్లు పోతే కర్నాటక బార్డర్ వస్తుంది. కర్నాటక చించోలి అక్కడి నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సేడం వంద కిలోమీటర్ల దూరం. మరోవైపు మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్, కోస్గిలు, ఇంకొకవైపు కోహీర్ మీదుగా జహీరాబాద్, సంగారెడ్డిలు. గత కొన్నేళ్లుగా ఆ ప్రాంతమంతా చాలా వెనకబడి ఉన్నదన్న  విషయం నిర్వివాదాంశం. కానీ అక్కడ వున్న వనరులు పుష్కలం. దాదాపు మరొక వంద సంవత్సరాల వరకు అక్కడున్న గ్రానైట్ సంపద ఉపయోగంలో వుంటుంది. అంటే అక్కడి గ్రానైట్‌ని, వచ్చే వంద సంవత్సరాల వరకు ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ చేసుకునే ధనిక ప్రాంతం. ఇంకో విషయం ఏమిటంటే, తాండూరు టైల్స్ దేశవ్యాప్తంగా ప్రసిద్ది గాంచాయి. కానీ నాయకుల, నిర్లక్ష్యం, దళారుల వ్యాపార ధోరణి, ప్రజల నిసహాయ స్థితి కారణంగా, ఇప్పటికీ ఆ ప్రాంతంలో అభివృద్ధి జాడలు కనిపించవు.

ప్రస్తుతం తాండూరు చుట్టుపక్కల ఉన్న సిమెంట్ కర్మాగారాలను పరిశీలిస్తే, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, చెట్టినాడ్ సిమెంట్, పెన్నా సిమెంట్స్, ఇండియా సిమెంట్స్ లిమిటెడ్, ముఖ్యమైనవి. ఆ కర్మాగారాల్లో పనిచేసే, ఉద్యోగులు, తమ రోజు వారి అవసరాల కోసం తాండూరుకి రావడం వల్ల, అక్కడ వ్యాపారం అభివృద్ధి చెందింది. ప్రస్తుతం ఆది పెద్ద వ్యాపార కేంద్రం.

ఆ సిమెంట్ కర్మాగారాల్లో అధికార స్థాయిలో, నార్త్ ఇండియన్స్ ఉండడం గమనార్హం.

పదిహేళ్ళ క్రితం, నేను చూసిన తాండూరుకి, నేటి తాండూరుకి చాలా మార్పు వచ్చింది. అప్పట్లో ఇరుకైన రోడ్లు, పక్క నుంచి ఒక బస్సు పోయినా, మరే ఇతర వాహనం పోయినా, మన తలల్లో దుమ్ము, మన బట్టలపైన మూడు ఇంచుల మందం మట్టి. ఇదీ అప్పట్లో అక్కడి దుస్థితి. చేవెళ్ళ నుంచి తాండూరు వరకు సింగిల్ రోడ్డు. చీకటైయ్యాక, ఒక వాహనం రోడ్డు దిగిందంటే, ఏదో పెద్ద గుంట, అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి. ఇక్కడ ఇక్కొక విషయం చెప్పాలి, వికారాబాద్ నుంచి తాండూరుకి దారి చాలా అధ్వాన్నంగా ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు గడిచినా పూర్వపు కన్నా దరిద్రంగా వున్నాయి రహదారులు.

కానీ ప్రస్తుతం తాండూరులో, రోడ్లు వైడెనింగ్ చేసారు. మధ్య మధ్యలో డివైడర్ కూడా వేసారు. అప్పట్లో ఉన్నంత దుమ్ము, ధూళి ప్రస్తుతం లేదు.

ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వర్షాకాలంలో వర్షాలు కురవడం సహజం. అవి కొంచెం మోతాదు మించితే ఇంక అంతే, తాండూరు నుంచి వికారాబాద్ దారిలో హైదరాబాద్‌కి వెళ్ళడం అసాధ్యం. దారిలో వున్న వంతెనలు, అధిక వర్షానికి మునిగిపోవడం, రహదారులు మూసుకుపోయి, ఎక్కడి వాళ్ళు అక్కడే ఆగిపోయే స్థితి. ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, నాయకులు ఎన్నికలప్పుడే తప్ప మళ్ళీ రారు. కోటిపల్లి రిజర్వాయర్ నిండిపోతే, రహదారులు బంద్. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆలోచించక పోవడం దురదృష్టకరం.

Image source: Internet

Exit mobile version