[డా.టి.రాధాకృష్ణమాచార్యులు రచించిన ‘’తంగేడు సింగిడి’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]బ[/dropcap]తికిన ఊపిరి ఆశలుగా ఎదిగింది
మట్టి పూచిన సింగారం
నిగ్గుదేలిన నిగనిగల మేలిబంగారు
అమ్మలక్కల నుదుటి సింధూరం
తోబుట్టువుల నవ్వుల్లో
పూరేడు తంగేడు అందాలు
చిరునవ్వుల వాన కురిపించిందా
తడిసిన వొడి పలికేదే
ఆకుపచ్చ చేను వికాసం
విన్నావా
తంగేడు అంటే పూల వనం అనుకొంటాంగాని
అది పైకెత్తిన తలల అస్తిత్వ జెండా
మౌన రాగమాల తడిమిన మాట
ప్రగతి నేల ప్రవాహ జలాలు
ఎదసొదల వినే ఆత్మీయచెట్టు
గుండె గూడైన సంక్షేమ భరోసా
గుండెపాటే దరువేసిందిక్కడ
రుధిరం
ఆకాశం ఆశగా దిగొచ్చిందా
నేల సింగిడేసే
పసిడి పలుముకున్నది బతుకమ్మ
ఒక్కొక్క పూవైన గౌరమ్మ ఆత్మ
మనసూరించే బంగారు రవ్వ
చిటికెడు పసుపు మిలమిలలు
అచ్చంగా అమ్మ మనసే తంగేడు
వీచే గాలి కెరటాలు
కనుల నిండిన దీపాలు
గుండె లోతుల మౌనశబ్దాల నడక
పరిమళించే తొవ్వ తంగేడు