తప్పెవరిది

1
4

[dropcap]మి[/dropcap]ట్టమధ్యాహ్నం సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. చెమటలు కక్కుకుంటూ ఇంట్లోకి ప్రవేశించింది ఇందిర.

“ఏమైంది ఇంత తొందరగా వచ్చేసావ్?” అని అడిగింది పిన తల్లి సత్యవతి కరుకుగా.

“నేను ఉద్యోగం మానేశాను” అంది ఇందిర చేతిలో బుక్స్, బ్యాగు టేబుల్ మీద పెడుతూ.

“ఏమొచ్చింది మాయ రోగం బంగారం లాంటి ఉద్యోగం మానేయడానికి, ఏమిటి విషయం అని నువ్వైనా అడగవయ్యా” అంది పక్షవాతంతో పడక కుర్చీలో పడుకున్న భర్త మాధవయ్యతో.

కూతురు కారణం లేకుండా ఏ పని చేయదు. ఆయనకు తెలుసు. కానీ భార్య మాటలకు బాధపడొద్దు అన్నట్లు కూతురికి సైగ చేశాడు ఎడం చేత్తో.

ఆమె అంతటితో ఆగలేదు ఇరుగు, పొరుగుతో చెప్తూ హంగామా చేసింది సాయంత్రం వరకు.

***

మాధవయ్య ఒక కాలేజీలో ప్రిన్సిపల్‌గా చేసి రిటైర్ అయ్యాడు. మాధవయ్య మొదటి భార్య అరుంధతి ఎంతో నెమ్మదయినది. ఇందిర పుట్టిన ఆరేళ్లకు మళ్లీ నెల తప్పింది. బాబు పుట్టాడు అని సంతోషించే లోపే కన్నుమూసింది. పాపని, పుట్టిన బిడ్డని ఎలా పెంచాలో అర్థం కాక అయోమయంలో పడిన మాధవయ్యకు తమ రెండవ కూతురిని చేసుకోమని పిల్లల ఆలనా పాలనా చూసుకుంటుందని సత్యవతిని ఇచ్చి పెళ్లి చేశారు ఆమె తల్లిదండ్రులు.

కొన్నాళ్ళు బాగానే ఉంది. తనకు ఒక కూతురు పుట్టగానే ఇందిరను చులకనగా చూడటం మొదలుపెట్టింది. ఇంట్లో చిన్నపాటి పనిమనిషిని చేసింది.

***

పిల్లలు పెద్దయ్యారు. ఇందిరకు పెళ్లి చేయడం మానేసి తన కూతురుకి పెళ్లి చేసింది పట్టుబట్టి సత్యవతి.

కొడుకు పై చదువుల కోసం వెళ్ళిపోయాడు. ఇందిర చిన్నప్పటినుంచి ఎన్ని పనులు ఉన్నా చేసుకొని తండ్రి వెనకాల స్కూల్‌కి వెళ్ళిపోయేది.

చదువులో ఎప్పుడు ఫస్ట్ ఉండేది. బి.ఈడి చేసింది. తను పనిచేసే స్కూల్లోనే కూతురికి ఉద్యోగం వేయించాడు తండ్రి. కొద్ది కాలంలోనే మంచి టీచర్ అని పేరు తెచ్చుకుంది.

ఆరు నెలల క్రితం తనకు పక్షవాతం రావడంతో ట్యూషన్లు చెప్పడం కూడా మానేసాడు మాధవయ్య.

కూతురు జీతంతోనే ఇల్లు గడుస్తుంది. ఇప్పుడు ఇల్లు ఎలా గడుస్తుంది? అనే ఆలోచనలో పడ్డాడు మాధవయ్య.

***

ఇందిరతోపాటు మరో నలుగురు టీచర్లు ఒకేసారి రాజీనామా చేయడంతో ఆ విషయం పేపర్ వాళ్లకు తెలిసింది. ఇంటి మీదకు వచ్చేసారు. “ఏం జరిగింది” అంటూ ప్రశ్నలు వర్షం కురిపించారు ఇందిరను.

“ఇప్పుడు నేనేమీ చెప్పలేను. దయచేసి మీరందరూ వెళ్లిపోండి” అంది నమస్కరిస్తూ ఇందిర.

“చెప్పాల్సిందే” అంటూ పట్టుబట్టారు మీడియా వారు. “అయితే నాతో పని చేసిన టీచర్లని, మా స్టూడెంట్స్ తల్లిదండ్రులని సమావేశపరచండి. అప్పుడు చెప్తాను” అన్నది ఇందిర.

***

అదే స్కూల్లో మీటింగ్ హాలు పిల్లల తల్లితండ్రులతో, టీచర్స్‌తో, మీడియా వాళ్ళతో నిండిపోయింది.

“టీచర్స్ రాజీనామా చేస్తే మమ్మల్ని అందరినీ ఎందుకు పిలిచారు?” అని అడిగారు కొందరు పేరెంట్స్.

ఇందిర లేచి “కొంచెం నిశ్శబ్దంగా ఉండండి కారణాలు చెప్తాను” అంది మైకు దగ్గరకు తీసుకుంటూ.

తల్లితండ్రులకు మొదటి ప్రశ్న. “మీ పిల్లలు స్కూల్ నుంచి ఎన్ని గంటలకు వస్తున్నారు?” అని అడిగింది ఇందిర.

“ఇదేం ప్రశ్న? రోజు రాత్రి 9 గంటలకు వస్తున్నారు. స్కూల్లో ప్రైవేట్ క్లాసు ఉందని చెప్తున్నారు” అని అన్నారు అందరూ ఏకగ్రీవంగా.

“సాయంత్రం 6 గంటలకు స్కూలు అయిపోయి స్కూలుకు తాళం వేస్తున్నాం. ఒక రోజు రెండు రోజులు ప్రైవేట్ క్లాస్ ఉంటుంది కానీ సంవత్సరం అంతా ఉండదు కదా! ఒకసారయినా పిల్లల్ని అడిగారా మీరు?” అన్నది ఇందిర.

“పోనీ మమ్మల్ని ఏమైనా అడిగారా?” అన్నది మళ్ళీ.

అందరూ మౌనం వహించారు. “మీ పిల్లలు చదువుతున్నది తొమ్మిది, పది తరగతులు. వాళ్లకు సెల్ ఫోన్ కొనిచ్చారు. అది మీ ఇష్టం. కానీ మీరు ఒకసారి అయినా తెలుసుకున్నారా, వాళ్లు మొబైల్లో ఏం చూస్తున్నారని ఒక్కసారైనా గమనించారా?”

“మేము పిల్లల్ని కొడితే మమ్మల్ని ప్రశ్నించడానికి వస్తున్నారు కదా! మా బాధని ఎవరైనా గమనించారా? ఎదిగి ఎదగని పిల్లలు చాలా అసభ్యంగా మమ్మల్ని వర్ణించడం, కామెంట్ చేయడం చేస్తున్నారు. పైగా సిగరెట్లు కాలుస్తూ, మందు తాగుతూ ఆ మత్తులో ఆడపిల్లల్ని ఏడిపించడం. ఏ ఒక్కసారైనా మీ పిల్లల బ్యాగుల్ని చెక్ చేశారా? అంత టైము మీకు లేదు. వాళ్ళు ఏ దారిలో నడుస్తున్నారు తెలియదు కానీ మార్కులు రాకపోతే మాత్రం మా మీద యుద్ధానికి వస్తారు. మీ పిల్లలు మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారో” అని ఆగింది ఇందిర.

పక్కనున్న లక్ష్మీ టీచర్ ఇందిర భుజం మీద ఓదార్పుగా చేయి వేస్తూ “మన బాధ వీళ్ళకేం తెలుస్తుంది. మనకు పెళ్లిళ్లు అయినా అవ్వకపోయినా మీ పిల్లలు మాట్లాడే మాటలకు మానసికంగా చచ్చిపోతున్నాం. కుటుంబపరంగా ఉద్యోగం చేయక తప్పదు. కానీ మితిమీరిన మీ పిల్లల ప్రవర్తన వల్ల మేమందరం రాజీనామా చేసాం” అంది లక్ష్మీ ఉద్వేగంగా.

“ఒకప్పుడు టీచర్లకు పిల్లలు భయపడేవారు. ఈరోజు పిల్లలకు టీచర్లు భయపడవలసిన పరిస్థితి వచ్చింది. పిల్లల్ని ఎలా పెంచుతున్నాం అనేది ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి, మొదటి గురువు తల్లి, తర్వాత తండ్రి. పాఠశాలకి వచ్చాక ఉపాధ్యాయుడు. చివరగా ఒక మాట గౌరవమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి విద్యార్థుల వలన మేము బాధపడుతున్నాం. అలాగని పోలీసులకు రిపోర్ట్ ఇస్తే మీ పిల్లల జీవితాలు పాడవుతాయని ఆలోచించాం” అన్నది ఇంకో టీచర్ రేవతి కళ్ళు తుడుచుకుంటూ.

వెంటనే ప్రిన్సిపాల్ లేచి “నాకు చాలా సార్లు కంప్లైంట్ ఇచ్చారు కానీ నేను పట్టించుకోలేదు, స్కూల్ పరువు పోతుందని” అని అన్నది తల దించుకుంటూ.

ఇంతమంది ఇన్ని విధాల బాధపడుతున్నది తమ పిల్లల వలన అన్న విషయం జీర్ణించుకోలేకపోతున్నారు తల్లిదండ్రులు. ‘ఎప్పుడూ బిజినెస్ పనులతో, సెల్‌ఫోన్స్‌తో, లాప్టాప్ లతో గడుపుతూ పిల్లలకు అవసరానికి మించిన డబ్బులు, వాహనాలు కొనిచ్చే తమలాంటి వారి పిల్లలు ఇలాగే తయారవుతారు ఇకనైనా మేము మారాలి’ అనుకున్నారు ప్రతి తల్లిదండ్రులు.

మీడియా వారు మాటలు రాక, ప్రశ్నించలేక నిశ్శేష్టులై ఉండిపోయారు. తప్పెవరిది అని ప్రశ్నిస్తున్న ఇందిరకు జవాబు చెప్పేది ఎవరు?

***

ఆరేళ్ల తర్వాత ఒకరోజు “జాగ్రత్త, జాగ్రత్త మెల్లిగా పక్కనుంచి నడవండి” అంటూ పిల్లల్ని రోడ్డు దాటిస్తుంది ఇందిర.

“మేడమ్” అని పిలిచిన పిలుపుకి ప్రక్కకి తిరిగి చూసింది ఇందిర.

ఇద్దరు యువకులు నీట్‌గా టక్ చేసుకుని ఉన్నారు. “ఎవరు మీరు” అన్నది ఇందిర కళ్లద్దాలు సరిచేసుకుంటూ.

“మేడమ్ గుర్తుపట్టలేదా, మేము మీ టెన్త్ క్లాసు స్టూడెంట్స్‌మి. ఆ రోజు మీటింగ్ జరుగుతున్నంత సేపు మేము బయట ఉండి అన్నీ ఆలకించాము.

మా నుంచి మా తల్లిదండ్రులు తలదించుకోవడం చూసాం. మేమే ఇలా ఉంటే రేపు పెద్దయ్యాక మా పిల్లలు ఎలా ఉంటారు అని ఊహించాము” అన్నాడు రోహిత్ ఆ భయంకరమైన క్షణం ఊహించుకుంటూ.

“చాలా దారుణమైన భవిష్యత్తు కనిపించింది అందుకే ఆ రోజే అప్పుడే నిర్ణయం తీసుకున్నాం మా అలవాట్లనన్నిటిని మానేశాం. మా తల్లిదండ్రులు కూడా మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవడం మొదలుపెట్టారు. మేమిద్దరం ఇంజనీరింగ్ లాస్ట్ ఇయర్ చదువుతున్నాం, జాబ్స్ కూడా వచ్చాయి. మాతో ఉన్న బ్యాచ్ అందరూ కూడా మారి వారికి తగ్గ ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఆలోచిస్తే మీ పట్ల ఆ రోజు ఎంత తప్పుగా ప్రవర్తించామో అర్థమైంది మమ్మల్ని క్షమించండి మేడమ్” అంటూ కాళ్ళ మీద పడ్డారు రోహిత్, మోహన్.

“లేవండి రా పిల్లలు మీరు బాగుపడ్డారంటే అందరికంటే ఎక్కువ సంతోషించేదాన్ని నేనే” అంది ఇందిర వాళ్ళని ఆశీర్వదిస్తూ.

“నేను కూడా ఆ రోజే నిర్ణయం తీసుకున్నాను. మొక్కై వంగనిది మానయ్యాక వంగుతుందా అని అందుకే ఈ చిన్న పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నాను. ఇప్పటినుంచి వీళ్ళు సన్మార్గంలో నడుచుకుంటే అటువంటి సమస్యలు రావని” అన్నది పిల్లల్ని చూపిస్తూ ఇందిర.

“మరి మీరు” అంటూ సగంలో ఆపేశారు ఇద్దరు.

“నేనా ఏముంది నాన్నగారు చనిపోయారు, పిన్ని.. చెల్లెలి ఇంటికి వెళ్ళిపోయింది, తమ్ముడు అమెరికాలో స్థిరపడిపోయాడు, ఇలా ఒంటరి జీవితం గడిపేస్తున్నాను” అన్నది ఇందిర.

“లేదు మేడమ్, మా కళ్ళు తెరిపించి మాకు మంచి జీవితాన్ని ప్రసాదించిన మీరు ఇలా మోడువారిన చెట్టులా ఉండిపోకూడదు” అన్నారు ఇద్దరూ.

“లేదు ఇంక నా జీవితం ఇంతే ఇలా పిల్లల మధ్యలో ప్రశాంతంగా గడుపుతాను” అన్నది ఇందిర.

“లేదు మేడమ్ మీరు ఇలా ఒంటరిగా ఉండిపోవడానికి వీలు లేదు. మా ఇంటికి రండి సొంత అక్కయ్య లాగా మిమ్మల్ని భావిస్తాం. మా తల్లిదండ్రులకు కూడా మీరంటే ఎంతో అభిమానం. మీకు నచ్చినట్టుగానే పిల్లలకి చదువులు చెప్పుదురు‌ కానీ మీరు ఒంటరిగా ఉండడానికి వీలు లేదు. మీకు మంచితోడు కావాలి ఆ ప్రయత్నాలు మేము చేస్తాం” అంటూ ఇందిరకు ఆత్మీయంగా చేతిని అందించారు.

వాళ్లతో పాటు అడుగులు వేస్తూ ‘ఆలోచించే విధానంలో పద్ధతి మారితే ఆచరించే విధానంలో సంస్కారం కనిపిస్తుంది అనుకుంది’ ఇందిర కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ముందుకు సాగుతూ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here