తారక మంత్రం

2
2

[dropcap]ఆ[/dropcap] రోజు డిగ్రీ ఫైనలియర్ ఆఖరి పరీక్ష పూర్తి అయ్యింది. ఎంతగానో కష్టపడి చదివేశానన్న ఫీలింగ్‌తో కాలేజీ నుండీ ఫ్రెండ్స్ కలసి సరాసరి సినిమాకి వెళ్ళాడు క్రిష్ణమోహన్.

సమారు రెండు నెలల నుండీ అసలు సినిమా ముఖమే చూడలేదట! అందుకే స్నేహితులతో కలసి హాయిగా సినిమా చూశాడు. అటు నుండీ పబ్ కెళ్ళి మత్తుగా తాగి, అమ్మాయిలతో ఆడిపాడి ఇంటికి చేరుకునే సరికి తెల్లవారుతోంది.

అప్పటికే కొంతమంది ఆడబడుచులు వాకిళ్ళలో కళ్ళాపి చల్లి ముగ్గులేస్తున్నారు. చడీచప్పుడూ లేకుండా పిల్లిలా గేటు తీసుకొని లోపలికి రాబోతుండగా, అక్కడే నిలబడి కాపలా పోలీసులా తనవంకే తీక్షణంగా చూస్తున్నాడు తండ్రి భరద్వాజ.

తేలుకుట్టిన దొంగలా తలవంచుకొని తూలుతూ ఇంట్లోకి వెళ్లిపోయాడు క్రిష్ణమోహన్, అయినా పట్టువదలని విక్రమార్కుడిలా కొడుకుని అనుసరించాడు తండ్రి. ఆయన ముఖం నిప్పులు చెరుగుతూ, ప్రశ్నల బాణాలు సంధిస్తూనే ఉంది.

ఇంతలో భార్య ఉమామహేశ్వరి అడ్డుగా వచ్చింది. “పొద్దున్నే ఇదేం గొడవండీ? కొంచెం మెల్లగా మాట్లాడండి. చుట్టుపక్కల వాళ్ళందరూ వింటారండీ!” అని ఇంకా ఏదో చెప్పబోయింది ఆమె.

“ఔను ఉమా! నేను ఇప్పుడు మాట్లాడేవి పచ్చి నిజాలు. అందుకే నన్ను గట్టిగానే మాట్లాడనీయ్! ఈ రోజు మనవాడు చేసిన ఘనకార్యం గూర్చి అందరినీ విననీ పరవాలేదు. అప్పుడైనా వాడికి బుద్ధి వస్తుంది” అని కోపంతో చివాట్లు పెడుతున్న నాన్నను చూస్తుంటే క్రిష్ణమోహన్‌కి ఒక్కసారిగా వెన్నులోంచి ఒణుకుపుట్టుకొచ్చింది.

“అమ్మా!” అని భయంతో కేక వేస్తూ ఉలిక్కిపడి నిద్ర మేల్కొన్నాడు. ఇది కలా! హమ్మయ్య, ఇదంతా నిజమేనని ఎంత భయపడిపోయానో, దేవుడా! ఈసారికి గండాన్ని ఇలా గట్టెక్కించావన్న మాట అంటూ దేవునికి దణ్ణం పెట్టుకొని, లెంపలేసుకొని మామూలుగా వాష్ రూమ్ లోకి వెళ్ళిపోయాడు.

క్రిష్ణమోహన్ అందగాడు. తాను ఎంతో అందంగా వున్నాన్న గర్వం కూడా పుష్కలంగా ఉన్నవాడు. ఇక కాలేజీ అమ్మాయిలతోపాటు, చుట్టుపక్కల అమ్మాయిలు కూడా అతనికి లైట్ కొట్టేవాళ్ళే,

క్లాస్‌మేట్లయిన నీరజ, ప్రతిభ, రంజితలు కూడా అతనితో అల్లరి చిల్లరిగా తిరిగిన భామలే. అమ్మాయిల చిలిపి స్నేహాల కోసం డబ్బును విలాసవంతంగా ఖర్చుచేసేవాడు. అది నాన్న ఇచ్చింది కాదులే.

నాన్న ఎప్పుడూ చాలీచాలని వంద, రెండొందలు మాత్రమే పాకెట్ మనీగా ఇచ్చేవాడు. అవి టిఫెన్లకూ, సిగరెట్లకు సరిపోయేవి, మరి ఇంతమంది ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయటం ఎలా? అందుకే అప్పుడప్పుడూ హెల్మెట్ పెట్టుకొని చైన్ స్నాచింగ్ కూడా చేయవలసి వచ్చేది. ఇంకా నయం పోలీసులకు ఒక్కసారి కూడా దొరకలేదు. ఇంట్లో కూడా తెలియకుండా జాగ్రత్తపడేవాడు. పోనీలే! అదంతా గతం. కానీ ఇపుడు తాను చేయవలసిన పనేంటి?

“డాడీ! నేను సొంతంగా బిజినెస్ చేసుకుంటాను. నాకు పదిలక్షలు ఇవ్వండి” అని అడుగుతుండగా అమ్మ అక్కడకు రానే వచ్చింది.

“ఒరేయ్ క్రిష్ణా! నువ్వైనా దర్జాగా ఏదైనా ఉద్యోగం చేయరా! మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి ఈ వ్యాపారాలు అంతగా కలసి రావురా!” అని సలహా ఇచ్చింది ఆవిడ.

“ఉమా! నువ్వెందుకు ప్రతి విషయంలోనూ ఇలా మధ్యలో వస్తావ్? వాడేదో చెపుతున్నాడుగా చెప్పనీ” అని కసురుకున్నాడు తండ్రి భరద్వాజ.

“ఇది బాగానే ఉంది. నేను మీకు భార్యను, వాడిని కన్న తల్లిని కాబట్టి, నాకు కూడా ఈ ఇంటి వ్యవహారాలలో మాట్లాడే బాధ్యత ఉందనే” సమాధానమిచ్చింది.

“ఒరేయ్! నేను చిన్న చిన్న కాంట్రాక్టులు చేసి పెద్దగా సంపాదించింది ఏమీ లేదు. కేవలం ఈ ఇల్లూ, పది తులాల బంగారంతోపాటు ఒక స్కూటరు మాత్రమే నా ఆస్తి. ఇంకా నీ చెల్లెలు హిమజ చదువు పూర్తి అవ్వాలి. ఆ తరువాత అమ్మాయికి పెళ్లి చేయవలసిన బాధ్యత కూడా నాకుంది తెలుసా? క్రిష్ణా నువ్వు నన్ను డబ్బులు ఇమ్మని అడిగే హక్కు నీకుండవచ్చు,

కానీ మీ చదువులూ, సంస్కారాలతోపాటు మీ పెళ్ళిళ్ళు చేసే బాధ్యతలు అమ్మకూ నాకూ ఉన్నాయి. అంతేకాదు నిన్ను వక్రమార్గంలోకి వెళ్ళకుండా ఆపటం, సరియైన దారిన చూపించటం కూడా మా కర్తవ్యమే అని తెలుసుకో.

అందుకనే అమ్మ చెప్పినట్లు నువ్వు ఏదైనా ఉద్యోగం చేయటం మంచిది. నీకు నెలవారీ జీతం వస్తుందన్న ఒక భరోసా ఉంటుంది. అలా కాకుండా నాలాగా గమ్యం తెలియని వ్యాపారాలలో దిగావంటే వాటిలో లాభాలు రావచ్చు. లేక నష్టాల్ని కూడా చవి చూడవలస్సి వస్తుంది” అని వివరంగా తండ్రి చెప్పటంతో క్రిష్ణమోహన్ ఆలోచన్లతో ములిగిపోయాడు. తన మనసు బిజినెస్ వైపే మొగ్గుచూపుతోంది. ఆఫీసర్లకు వంగి వంగి దణాలు పెడుతూ, ఎదుగూ బొదుగూ లేని జీవితం వద్దనే నిర్ణయానికి వచ్చేశాడు.

“అయితే నీ ఇష్ట ప్రకారమే చేయరా! అంతేకాదు, నీవు ఏ పని చేసినా మన ఇంటిపేరు నీతి నిజాయితీకి మారుపేరు కావాలి. ఈ విషయం జ్ఞాపకం పెట్టుకో. అప్పుడు నువ్వు తప్పకుండా విజయం సాధిస్తావు” అని లక్ష రూపాయల చెక్కును కొడుకుకిచ్చాడు.

“ఇదేంటి నాన్నా ఈ లక్ష రూపాయలతో నేనేం బిజినెస్ చేయగలను?” క్రిష్ణమోహన్ ప్రశ్నించాడు. “ఒరేయ్ క్రిష్ణా! నీలాగే నేను కూడా తాతయ్యను డబ్బులడిగితే ఆయన మారు మాట్లాడకుండా పదివేల రూపాయలిచ్చాడు. ఆనాడు తాత యిచ్చిన పదివేలతోనే మనం ఈ రోజు ఇంతవాళ్ళమయ్యాం” అని కన్నీళ్ళు పెట్టుకున్నాడు భరద్వాజ. అవి బాధతో కూడిన ఆనందబాష్పాలు.

“అలాగే నాలాగా నువ్వు కూడా ఈనాటి లక్ష రూపాలతో కోటి రూపాయలు సంపాదించాలి!” అని కొడుకుకి షేక్ హ్యాండ్ ఇచ్చి పనిమీద బయటకు వెళ్ళిపోయాడు తండ్రి భరద్వాజ. నాన్న మాటలు చాలా కరకుగా ఉంటాయి. కానీ ఆయన మనసు మాత్రం నవనీతం లాంటిది.

ఆ రోజుల్లో భరద్వాజకి చదువు విలువ తెలియలేదు. ఇక జీవితంలో ఏదో ఒక పనిచేయాలి కదా! అని చిన్నా చితకా కాంట్రాక్టులు చేసుకుంటూ వచ్చాడు. పర్మిట్లకూ, టెండర్లకూ లంచాలు ఇమ్మని అధికారులు ఎన్ని రకాల వత్తిళ్ళు చేసినా ఇచ్చేవాడు కాదు. నిజాయితీగా, పట్టుదల క్రమశిక్షణతో అంచలంచలుగా సమాజంలో ఎదుగుతూ వచ్చిన ఆదర్శవంతమైన వ్యక్తిత్వం కలవాడు భరద్వాజ.

నీరజ క్రిష్ణమోహన్ స్నేహం కోసం నిత్యం ఆరాటపడుతూనే ఉంది. ఏదో పనిమీద వచ్చి రోజూ ఒక గంటసేపు బాతాఖానీ కొట్టనిదే నీరజకు నిద్ర రావటం లేదు. “నువ్వంటే నాకిష్టం, నీతోనే నా జీవితమంతా!” అని ప్రతిభ, రంజితలు కూడా క్రిష్ణమోహన్ చుట్టూ పెనవేసుకుంటున్నారు. కబీర్ దాస్ చెప్పినట్లు ప్రేమ అనే సందు చాలా ఇరుకైనది, దానిలో ఒక్కరికే స్థలం ఉంటుంది. ఇద్దరు దానిలో ఇమడలేరు. కానీ క్రిష్ణమోహన్‌కి మాత్రం వాళ్ళను ఎంటర్‌టైన్ చేసే సమయంలేదు. ఇప్పుడు అతని దృష్టంతా బిజినెస్ మీదే లగ్నమై ఉంది.

తారకరామారావు ఒకప్పుడు బాగా పేరున్న, డబ్బుగల చార్టడ్ ఎకౌంటెంట్. ఆయన కొడుకే గౌరవ్ తేజ. అతను హైస్కూలు నుండీ డిగ్రీవరకూ కృష్ణమోహన్‌కు క్లాస్‌మేట్. ఆ నమ్మకంతోనే వాడిని బిజినెస్‌లో స్లీపింగ్ పార్టనర్‌గా తీసుకున్నాడు.

“మావాడు నిజంగానే చాలా బద్దకస్తుడు. పైగా నేను చెప్పిన మాట అసలు వినడు. అలాంటిది నువ్వు వాడికి పని కల్పించి, మంచి పని చేశావ్. చూడు క్రిష్ణమోహన్ మనం చేసే వ్యాపారాలలో అనేక సమస్యలు ఎదురౌతూనే ఉంటాయి. అలాంటివాటికి మనం ఏ మాత్రం భయపడకుండా ఉండాలి. నీకు ఎలాంటి సమస్య ఎదురైనా నా సలహాలు, సూచనలు తప్పకుండా తీసుకోవచ్చు. ఇక నేను ఎలాగూ చార్టర్ ఎకౌంటెంట్ కాబట్టి మీ కంపెనీ ఎక్కౌంట్స్ అన్నీ నేనే ఆడిట్ చేస్తాను. ఓ.కె. అయితే ఇక్కడ ఒక్క షరతు. నాకిచ్చే ఫీజు మాత్రం మీకు మీరుగా ఇస్తే తీసుకుంటాను, లేకుంటే ఏదో సర్వీస్ చేస్తున్నాను అని ఆనందిస్తాను” అని సరదాగా, నవ్వుతూ తారకరామారావు ఇచ్చిన ప్రోత్సాహానికి క్రిష్ణమోహన్ ఉప్పొంగిపోయి వెంటనే ఆయనకు పాదాభివందనం చేసి, దీవెనలందుకున్నాడు. గౌరవ్ తేజ, నీరజ, రంజిత, క్రిష్ణమోహన్ నల్గురూ కలసి మొత్తం తొమ్మిది లక్షల రూపాయలు సమకూర్చుకున్నారు.

కానీ కంపెనీ కోసం ఓవరాల్‌గా ఫుల్ టైమ్ యాక్టివ్‌గా పనిచేసేది క్రిష్ణమోహన్ నీరజలు మాత్రమే.

క్రిష్ణమోహన్ కనస్ట్రక్షన్ కంపెనీ ప్రారంభించిన ముహూర్తం ఎంతో దివ్యంగా ఉంది. వీళ్లు చేస్తున్న పనులన్నీ చకచకా శరవేగంతో ముందుకు దూసుకుపోతున్నాయి. దాదాపు సంవత్సరాల కాలంలో రెండు వెంచర్లకు కాంట్రాక్టులు దొరికాయి.

ఇప్పుడు క్రిష్ణమోహన్ కంపెనీకి జోరుగా ఆర్డర్లు వస్తున్నాయి. చేతినిండా పని, అసలు రాత్రి పగలూ తేడా తెలియకుండా పనిచేస్తున్నారు. లాభాలు కూడా అనూహ్యమైన రీతిలో రావటంతో మార్కెట్లో బలంగా విస్తరించుకుంది కంపెనీ.

వచ్చిన డబ్బును ఎక్కువ మొత్తంలో ఇతర కంపెనీల షేర్లు కొనేశారు. ఇప్పుడు వర్కర్లు కూడా వందమందికి పైగానే పనిచేస్తున్నారు. లాభాలు అధికంగా రావటం జీతాలు, బోనస్లూ బాగానే ఇస్తున్నారు.

రోజూ ఆఫీసులో పనిచేస్తూ రాత్రి వరకూ ఉండిపోయేవారు. అదే నీరజకి మంచి లక్కీఛాన్స్ ఉపయోగపడింది. “ఇప్పుడు మన నలుగురం బోర్డ్ ఆఫ్ డైరక్టర్లం తెలుసా? ఇకనైనా నన్ను ఆట పట్టించటం మానుకో క్రిష్ణా! ఇప్పుడైనా నన్ను అర్థం చేసుకో! ఇక నేను భరించలేకుండా ఉన్నాను” అని క్రిష్ణమోహన్ ని పెనవేసుకుపోయింది నీరజ. దాంతో వారిద్దరి మధ్యా విరహవేదన రాజ్యమేలుతోంది. “క్రిష్ణా! మనిద్దరం హ్యాపీగా పెళ్ళి చేసుకందాం” అంటూ పలవరిస్తోంది.

క్రిష్ణమోహన్ నీరజ చేసిన పనికి ఒక్కసారిగా షాక్ తిన్నాడు. “అయితే విను నీరజ. ఈ హైటెక్ యుగంలో పెళ్లి మీద నాకు అంతగా నమ్మకం లేదు. నీకు నేను అంతగా కావాలనుకుంటే మనం స్నేహితుల్లాగా ఇలాగే లివింగ్ టుగదర్ అంటే హాయిగా సహజీవనం చేద్దాం!” అని చెప్పేశాడు క్రిష్ణమోహన్.

“అసలు నువ్వెందుకు పెళ్లి వద్దనుకుంటున్నానని నీరజ సూటిగా ప్రశ్నించింది.

“ఓ! అదా ఇప్పుడు మన భారతదేశ జనాభా ఎంత? బస్సులు, రైళ్ళూ వాటిల్లో కనీసం మనకు సీట్లు దొరుకుతున్నాయా? ఇక ఎయిర్ పోర్టు కూడా బస్టాండుల్లా మారిపోయాయి. మనం చేసే ప్రయాణం తక్కువ, వెయిటింగ్ ఎక్కువ. ఈ మధ్యలో పొల్యూషన్ ఒకటి. వీటన్నిటికీ మనం అన్యాయంగా బలైపోతున్నాం కదా! మరి ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులలో మనం పెళ్ళి చేసుకోవటం ఎందుకు? చేసుకున్నామే అనుకో ఇంకా పిల్లల్ని కనటం అవసరం అంటావా?” అని తన మనసులోని వేదనను నీరజకు వివరించాడు క్రిష్ణమోహన్.

“నా ప్రియమైన పిచ్చి క్రిష్ణా! నాకు కూడా పెళ్ళి చేసుకోవటం, తరువాత పిల్లల్ని కనే యంత్రంలా మారటం అసలే ఇష్టం లేదు” ఇంకొకసారి అతనికి ఇంకా దగ్గరైపోయింది తన్మయత్వంలో నీరజ.

టి.వి.లో ‘బ్రేకింగ్ న్యూస్’ చూసి షాక్‌కి గురైయ్యడు క్రిష్ణమోహన్. క్రిష్ణమోహన్ కనస్ట్రక్షన్ కంపెనీ నిర్మించిన ఆరంతస్తుల భవనం నిర్మాణ దశలోనే కూలిపోయింది. సంఘటనా స్థలానికి టి.వి. రిపోర్టలందరూ చేరుకున్నారు. కేవలం కాంట్రాక్టర్ క్రిష్ణమోహన్ యొక్క నిర్లక్ష్యం వలననే ఈ భవనం కుప్పకూలిపోయిందని ప్రత్యక్ష ప్రసారంతో బ్రేకింగ్ న్యూస్ వస్తోంది.

భవన నిర్మాణంలో ఉపయోగించిన సిమెంట్, ఇసుకతోపాటు స్టీలు కూడా నాణ్యమైనవి కావని, నాసిరకం బిల్డిండ్ మెటీరియల్‌తో కట్టినట్లు రిపోర్టర్లు వార్తలను వివరిస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరు కూలీలు కూడా మరణించారని నిర్ధారించారు. వెంటనే దర్యాప్తు మొదలైయ్యిందని, కాంట్రాక్టర్ క్రిష్ణమోహనను అరెస్టు చేస్తారని తెలిసిపోయింది. ఇలాంటి అవాంతరాలు జరుగుతాయని ముందుగానే పసిగట్టిన క్రిష్ణమోహన్ ఈ కాంట్రాక్టును సబ్ కాంట్రాక్టున్ కి అప్పగించేశాడు. చాలా తెలివిగా తప్పించుకున్నాడు క్రిష్ణమోహన్. –

మళ్ళీ తండ్రి దగ్గర నుండీ లక్ష రూపాయలు తెచ్చి కంపెనీలో ఖర్చు చేశాడు. అయినా క్లిష్టమైన సమస్య నుండి బయటకొచ్చే మార్గం దొరకటం లేదు. అప్పుడు గుర్తు వచ్చాయి, అంకుల్ తారక రామారావుగారు చెప్పిన మాటలు, వెంటనే ఆయననింటికి వెళ్ళాడు.

“చూడు! క్రిష్ణమోహన్ ఇలాంటి సమయంలోనే నువ్వు ధైర్యంతో ముందుకు వెళ్ళాలి” అని కంపెనీ స్థాపించిన దగ్గర నుండీ జరిగిన విషయాలన్నీ అడిగి తెలుసుకుని ఆశ్చర్యపోయాడు.

క్రిష్ణమోహన్ సూపర్‌వైజర్ల మీద నమ్మకంతో అసలు బిల్డింగ్ సైట్‌కి వెళ్ళేవాడు కాదు. అంతేకాదు ఆ ఏరియాలో నాలుగు అంతస్తులకే పర్మిషన్ ఉంది. అధికారులకు లంచాలు దండిగా ఇచ్చి, ఆరు అంతస్తులు నిర్మించాడు. “అందువల్లే నీ ప్రాజక్ట్ ఇలా కుప్పకూలిపోయింది. అయినా భయపడకు. అధికారులకు లంచాలు ఇవ్వకు. ఈసారి అదృష్టం కొద్ది నువ్వు సబ్ కాంట్రాక్టర్ని అడ్డం పెట్టుకొని కేసు నుండీ బయటకు రాగలిగావ్. అలా ప్రతీసారి కుదరదు.

ఇక వచ్చే సంవత్సరం నుండి మళ్లీ నీకు రావలసిన టెండర్లు, ఆర్డర్లు నీకు వస్తాయి. ఇదిగో ప్రస్తుతానికి ఈ ఐదు లక్షల చెక్కు తీసికెళ్ళి మళ్ళీ నీ వ్యాపారాన్ని మామూలుగా చెయ్యి” అని ధైర్యం చెప్పి భుజం తట్టాడు తారకరామారావు.

“అంకుల్ నన్ను క్షమించండి. మీరు చెప్పిన మాటలే మా నాన్నగారు కూడా చెప్పారు. కానీ నేనే మొండిగా ప్రవర్తించాను. డబ్బుతో మనం అన్ని పనులూ ఈసీగా చేసేయచ్చని విర్రవీగాను” అంటూ ఆ చెక్కును తీసుకొని సరాసరి తన ఆఫీసుకు చేరుకున్నాడు.

తన లగ్జరీ కారును అమ్మేశాడు. ఆఫీసులో ఏసీలు తీసేశాడు. తమ జీతాలను కూడా తగ్గించుకున్నారు. వర్కర్లతో, సూపర్‌వైజర్లతో దగ్గరుండి మరీ భవన నిర్మాణపు పనులన్నీ చూసుకుంటున్నాడు. ఒక సంవత్సరం తరువాత తారక రామారావుగారిని కలిశాడు.

“సార్! మీరు చేసిన సహాయానికి చాలా చాలా థాంక్స్. ఇదిగో మీరిచ్చిన ఐదు లక్షల రూపాయల చెక్. ఒకవేళ ఈ చెక్‌ను నేను ఖర్చుచేస్తే మళ్లీ మీకు అప్పు తీర్చటం కష్టమవుతుందని ఈ చెక్కును మార్చలేదు” అని ఆయనకు అదే చెక్ ను తిరిగిచ్చాడు.

“చూడు మిష్టర్ క్రిష్ణమోహన్! నా ఎకౌంట్ లో అంత డబ్బు లేనే లేదు. నీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచటానికే ఆ చెక్‌ను నీకిచ్చాను. నా సలహాను నువ్వు సద్వినియోగం చేసుకున్నావు. అది తారకమంత్రంలా పనిచేసింది. ఆల్ ద బెస్ట్” అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు తారకరామారావు. చెల్లెలు హిమజ వివాహం ఘనంగా జరిగింది. ఆ తరువాత నీరజ క్రిష్ణమోహన్ పెళ్లి కూడా వైభోగంగా జరిపించారు తల్లిదండ్రులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here