టాటా.. బై.. బై..

0
2

[కన్నడంలో మాలతి హెగడే గారు రచించిన ‘తళర్చు’ అనే కథని తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు.]

[dropcap]రా[/dropcap]త్రి నిశ్శబ్ధాన్ని భంగపరుస్తూ గోడ గడియారపు టిక్ టిక్ శబ్దాలను వింటూ పడుకున్నా. ఎక్కడో దూరాన కుక్కల మొరుగుళ్లు.. ఇంట్లో వాళ్ల సూటి పోటి మాటల్లాగ. పొట్టను నెమ్మదిగా చేత్తో నిమురుకున్నా. నా నలభై ఏళ్ల వయస్సులో నేను అదెన్ని సార్లు ఇలా పొట్టను నిమురుతూ వచ్చానో నొప్పి తాళలేక అని నిట్టూర్చిన ఆ క్షణం ఆ నొప్పి తీవ్రత ఇంకాస్తా ఎక్కువై ఒళ్లంతా ప్రాకి, వణుకు పట్టటం ప్రారంభించింది. లేచి మెల్లగా అడుగులు వేశా టాయిలెట్ వైపుకి. “అమ్మా!” అనే అరుపును పెదవి దాటనీయకుండాలనే తలంపుతో వున్నా.. విపరీతమైన రక్తస్రావంతో తల తిరగటం ప్రారంభించింది. కాలికిన్ని నీళ్లు జల్లుకుని, అభ్యాస బలంతో గోడలని తాకుతూ, నెమ్మదిగా వచ్చి పరుపు మీద వాలాను. నోటిలో తడి ఆరిపోయి, ఇక ప్రాణం పోతుందేమోనన్న భావన. ఎవర్నయినా మేల్కొలిపి పిల్చి ఒకిన్ని వేడి నీళ్లు కాచి ఇవ్వమని అడగనా?

పిల్లలిద్దరూ తమ కాలాన్నంతట్నీ స్కూల్లో గడిపి, రాత్రిళ్లు హోం వర్క్ ముగించి పడుకొని వుంటారు. పాపం! వాళ్లనెలా నిద్ర లేపటం? పోనీ అత్తగార్ని.. “ఈ చుప్పనాతి 15 రోజుల కోసారి మూల కూర్చొంటుంది” అని వెటకారం చేస్తూ “ఈ ఇంటి పని అంతా నేనే చేసి చావాలి” అని దెప్పిపొడుస్తూ వుంటుంది. ఆమెకీ 60 ఏళ్లు. ఇంటి చాకిరి చేసి అలసి వుంటుంది. వద్దు, అనిపించింది. “ఏమండీ!” అని ఆయన్ని లేపితే, “రోజూ చచ్చేవాళ్లకి ఏడ్చేదెవరు” అని అనే ఆయన మాటలు గుర్తుకొచ్చి ఊరకుండి పోయాను. “ఎలాగూ ఇద్దరు బిడ్డలకు తల్లి వయ్యావు. ఇంకా ఎందుకు నీకీ గర్భకోశం. డాక్టర్ చెప్పారు గదా, ఫైబ్రాయిడ్స్ పెరిగాయి, గర్భకోశం తీసేయాలి అని అంటే ఒప్పకోవడం లేదు నీవు. బ్లీడింగ్ ఎక్కువయినప్పుడల్లా నీ శరీరం పాలిపోతూవుంది. చూద్దాం చూద్దాం అని దాటవేస్తూనే వున్నావు; నీ ఒకత్తెవు మంచాన పడితే ఇల్లు చూడు ఎంత అస్థవ్యస్థమవుతూ వుందో, 60 ఏళ్ళ ముసలది అమ్మ ఒక్కతే ఇంటి పని అంతట్నీ చేయాల్సి వస్తూవుంది. నీవు చెప్పినట్లే, ఆయర్వేదం, హోమయోపతి అన్నింటినీ వాడి చూశాం. ప్రయోజనం ఏమిటి? రాత్రిళ్లు అదెన్ని సార్లు టాయ్‍లెట్‌కి వెళ్లివస్తూంటావో, నా నిద్ర పాడు చేస్తూంటావు. ఇకనైనా ఆపరేషన్‌కి ఒప్పుకో” అని కటువుగా అంటూంటారు. ఆయన్ని లేపటానికి అభిమానం అడ్డు వచ్చింది.

తలగడ ప్రక్కనే వున్న బాటిల్ గుర్తుకొచ్చింది. నిద్రించటానికి ముందు నా కూతురు, “అమ్మా! నీళ్లు ఇక్కడ ఉంచాను. తాగు, కావాల్సినప్పుడు” అని చెప్పి వెళ్లిపోయింది. నీళ్లు తాగిం తర్వాత పోయే ప్రాణం తిరిగి  వచ్చినట్టయ్యింది. కూతురు, నాకో చిన్న అమ్మాలాగా అన్పించింది. “ఈ గర్భకోశం ఎందుకు నీకింక?” అనే భర్త మాటలు చెవిలో జోరీగ లాగ వినిపిస్తూనే వున్నాయి. ఆయన అలా అన్నాడని కాదుగాని, నేనే ఎన్నో సార్లు అలానే ప్రశ్నించుకున్నా. గట్లు తెంచుకొని ప్రవహించే నదిలాగ జ్ఞాపకాలు.. ఒకటి తరువాత ఒకటిగా

***

8వ తరగతి పరీక్షలు ముగిశాయి. సెలవల్లో స్నేహితురాళ్లతో కలిసి ఆటలు పాటలు. ఓ రోజు రాత్రి పొద్దు పొట్టలో ఏదో తెలియని నొప్పి. అయినా అల్లాగే నిద్రపోయాను. నిద్ర నుంచి లేచేసరికి నా లంగా తడి అయ్యింది. తడుముకోగా చేతికి రక్తం అంటుకుంది. ఈ విషయం తెల్సి అమ్మ, “ఈ రోజు ఇంట్లోనే వుండు. నీ స్నేహితురాళ్లతో కలసి ఆడుకోటానికి బయటికి వెళ్లవద్దు” అంది. “ఎందుకమ్మా! రోజూ పంపించేదానివి.. ఈ రోజు ఎందుకు వద్దంటున్నావు?” అడిగాను.

“ష్, ఎలా చెప్పేదే నీకు! నీవు ఆడపిల్లవు కదా, నీ కడుపులో గర్భసంచీ ఉంటుంది. ఇక మీద నుంచి నెలకు నాలుగైదు సార్లు నీ నుంచి చెడు రక్తం బయటకొస్తుంది” అని చెప్పింది అమ్మ, ఏదో రహస్యాన్ని చెప్పినట్లు. అవమానం, భయం, దుఃఖం అన్నీ ఒక్కసారిగా అలుముకున్నాయి. “అమ్మా! ఈ గర్భసంచి నాకొద్దే!” అని వెక్కి వెక్కి ఏడ్చా. “పిచ్చిపిల్లా! వద్దు కావాలి అని అనుకుంటే ఇదేమైనా ఇడ్లీ దోశె అనుకున్నావా, నేనిచ్చేది కాదు. ఆ దేవుడే ఆడపిల్లలకి ఇస్తాడు – ఆ గర్భసంచే లేకపోతే ఆడపిల్ల తల్లి కాలేదు. ఆడది జన్మ నీయకుంటే ఈ మనుషులంతా ఎలా పుడతారనుకున్నావు? సరే, నీకర్థం కాదులే. ఈ విషయాన్ని ఇక్కడికి వదివేయ్. పో.. అక్కడ ఆ మూల్లో కూర్చో. ఆ తర్వాత నేనంతా చెబుతాను” అంది. అంతవరకూ గర్భకోశం అనే ఒక అవయవం తానున్నానని తన అస్థిత్వాన్ని తెలియజెప్పింది.

నాల్గవ రోజున మా వూరి వాళ్లందర్ని ఆహ్వానించి ఓ పండుగ వాతావరణాన్ని సృష్టించారు మా ఇంట్లో. వచ్చిన ముత్తైదువ లందరూ ఆశీర్వదించి, “కుందనపు బొమ్ములాగున్నావే.. పెళ్లయ్యాక పండంటి బిడ్డల్ని కను.” అని అన్నారు.

ఈ సద్దు అంతా ముగిశాక మళ్లా స్కూల్‌కి వెళ్లడం ప్రారంభించా. ఆ నెలంతా అమ్మ, ఎన్నెన్నో రకాల తీపి వంటకాలు వండి తినిపించింది. అప్పుడప్పుడు దిష్టి కూడా తీసేది. నెలలు గడిచే కొద్దీ నాలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. ఓ కొద్దిగా నునుపెక్కాను. అద్దంలో చూచుకొని ఎంత అందంగా వున్నానో అని మురిసి పోయేదాన్ని. కానీ అప్పుడప్పుడు పొట్టలో నొప్పి వస్తూండేది. సరైన టాయిలెట్స్ లేని స్కూలు, కాలేజీలలో చదివే ఆడపిల్లల పరిస్థితి ఆ దేవుడికే ఎఱుక. కడుపులో సుడులు తిరుగుతున్నంతగా నొప్పి. దాన్ని పెదవుల మధ్యనే అణచి పెట్టుకోవలసి వచ్చేది. ఎందుకని ఆడపిల్లగా పుట్టానా అని అనిపించది, హాయిగా ఎగురుతూ గంతులేస్తూ ఎకసెక్కాలాడుతున్న మగపిల్లల్ని చూచి. ఎందుకు సమకూర్చాడో ఈ గర్భసంచిని ఆ భగవంతుడు ఆడపిల్లలకి అని అనుకునేదాన్ని.. ఎన్నోసార్లు.

***

గత జ్ఞాపకాల నుంచి బయటకొచ్చా. “అమ్మా! నీ నొప్పి తగ్గిందా” అని కూతురు అడిగినప్పుడు నిజం చెప్పి ఆ లేత మనసును నొప్పించలేక “అవునమ్మా! నీవు స్కూల్‌కి వెళ్ళి రా” అన్నా. నా అవస్థ చూసి చూసి పిల్లలు తమ పనులను తామే చేసుకునేవారు. “నీవు పడుకో అమ్మా. మా పనులని మేం చేసుకుంటాం” అనేవారు.

ఓ రోజు మా వారి దగ్గరికి వెళ్లి కూర్చొని, “ఏమండీ – ఆఫీసుకి సెలవు పెట్టి నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లండి. ఇంకోసారి డాక్టర్‍ని సంప్రదించాక.. ఆపరేషన్ చేయించుకుంటా” అన్నాను. మావారి కళ్లల్లో ఆశ్చర్యం, ఏ దేవుడు బుద్ధి ఇచ్చాడో అన్నట్లుగా చూశారు. పోయినసారి తీసిన స్కానింగ్‍లో కన్పించాయి – గర్భకోశంలో పెరిగిన ఫైబ్రాయిడ్స్. మీకు పెరగడానికి వేరే  స్థలమే దొరకలేదా అని తిట్టుకున్నా.

మావారి రాక కోసం ఇంటి అరుగు మీద కూర్చుని వుండగా ఫోన్ రింగ్ అయ్యింది. “హల్లో ఎలా వున్నావే నీలూ” స్నేహితురాలు శారద.

“బ్లీడింగ్ నిలవడం లేదే. ఆపరేషన్ చేసుకునేందుక నిశ్చయించా. ఇంట్లో వాళ్ళ పోరు పడలేక పోతున్నా”

“ఇంట్లో వాళ్ళ పోరు ఇంపార్టెంట్ కాదే, నీలూ. ఈ మన డాక్టర్లు ఉన్నారే – గర్భకోశానికి ఏ సమస్య వచ్చినా, దాన్ని రిమూవ్ చేయాల్సిందే అని అంటారు. అమెరికాలో ఉన్న నా కూతురు అంటుంది – పెరిగిన ఫైబ్రాయిడ్స్‌ని తొలగించి గర్భకోశాన్ని కాపాడుతారు – అది లేకుంటే ముందు ముందు ఎన్నో అవాంతరాలు వచ్చే ప్రమాదముందట – ఆపరేషన్ చేయించుకోకు” అంది.

“సరే అక్కా- మా వాళ్లు వస్తున్నారు – ఆస్పత్రికి వెళ్ళాలి” అని ఫోన్ కట్ చేశా.

***

“బ్లీడింగ్ నిల్చిందా అమ్మా!” అడిగారు డాక్టరు హేమ.

“లేదండి” నా కన్నులు నీళ్లతో నిండాయి.

“నాల్గు వారాల నుండి మెడిసన్ తీసుకుంటానే వున్నా, బ్లీడింగ్ తగ్గలేదంటే ఇక ఆపరేషన్ చేసి గర్భసంచి తొలగించాల్సిందే. ఏమంటారు?”

“ఇక వేరే మార్గమే లేదా డాక్టర్?”

శారద మాటలు గుర్తుచేసుకుని, “డాక్టర్, గర్భకోశంలోని ఫైబ్రాయిడ్స్ తొలగించి గర్భకోశాన్ని సంరక్షించుకోవచ్చునట కదా!”

“లేదమ్మా. ఫైబ్రాయిడ్స్‌ని తొలగించగల తంత్రజ్ఞానం మన దేశానికింకా రాలేదమ్మా. ఇక దారి లేదు. తొలగించాల్సిందే. లేకుంటే కాన్సర్ రావచ్చు.” అనే అస్త్రాన్ని విడిచారు డాక్టర్ హేమ. నా మౌనాన్ని భంగపరుస్తు “చూడమ్మా, పొట్ట కోసి ఆపరేషన్ చేసే పనిలేక, నార్మల్ కాన్పు చేసినట్లే గర్భకోశం తీసేస్తాను. నాల్గు రోజుల తర్వాత డిశ్చార్జ్ చేస్తాను. అటు తర్వాత ఈ బహిష్టు కావాల్సిన జంఝాటమే ఉండదు. ఏమిటి?” అని చిన్నగా నవ్వారు. నేను మాత్రం ఏం చెప్పగలను! ఆమె లాగానే చిరునవ్వు నవ్వి ఊరుకున్నాను.

ఆపరేషన్ డేట్ ఫిక్స్ చేసింది డాక్టర్ హేమ. ఆపరేషన్ చేయించుకోటానికి శరీరం సహకరించేందుకు తీసుకోవల్సిన జాగ్రత్తలను, ఎటువంటి ఆహారం తీసుకోవాలనే విషయాలని మావారికి వివరించి, ఇంటిపనులు చేయటానికి ఇంకెవరినైనా వినియోగించటం మంచిదని, ఆపరేషన్ అనంతరం పాటించాల్సిన జాగ్రత్తలనూ విశదీకరించారు డాక్టర్ హేమ.

***

ఆపరేషన్‍కి ముందు, ఆ తర్వాత ఇంటి పని చేయటానికి పార్వతి అనే పనిమనిషిని నియమించుకున్నాము. నాలుగైదిళ్లల్లో పనిచేసేది పార్వతి. “అమ్మాయిగారూ, భారీపనులు చేయటం నాకు చేతకాదండి. చిన్న చిన్న ప్రేమలు మాత్రమే చేయగలను” అంది పార్వతి.

ఎక్కువ జీతం ఇస్తామని చెప్పినా ఆమె అంగీకరించలేరు. కారణమడిగాను. “నాకు ఓ ఆపరేషన్ అయ్యింది అమ్మగారూ, ఎక్కువసేపు వంగోని పని చేయటం చేతకాదు” అంది.

పట్టుమని ముప్ఫై కూడా నిండని దీనికి ఎట్లాంటి ఆపరేషన్ అయివుంటుంది?

“ఎంత మంది పిల్లలు నీకు?”

“పిల్లలే లేరండి అమ్మగారు. ఇద్దరు పిల్లలు పుట్టారు. ఇద్దరూ పోయారు. నాకు గర్భసంచి ఆపరేషన్ అయ్యింది అమ్మగారు.”

అది విని నా గుండె ఝల్లుమంది. ఎందుకు అడిగానా ఈ ప్రశ్న అనిపించింది.

“పిల్లలే లేనిదానివి, గర్భసంచి ఆపరేషన్ ఎందుకు చేయించుకున్నావు?”

“అదంతా ఓ కథండి అమ్మగారు”

పార్వతి, దాని మగడు కడుపు నింపుకోటానికి వాళ్ల ఊరు వదిలి వచ్చేశారు. పార్వతికి అతిచిన్న వయసులోనే పెళ్లి జరిగి పోయింది. ఇద్దరు పిల్లలూ పుట్టారు. ఈ వూరు వచ్చిం తర్వాత వాళ్ళిద్దరికీ చిక్కింది, చెఱకు కత్తరించే పని. చిన్న వయస్సున్న వాళ్లని పనిలో చేర్చుకోరని, మరీ మరీ పిల్లలు పుడితే భారీ పనులు చేయటానికి కుదరదని మగని ఇంటివారు గర్భసంచిని తొలగించుకోమన్నారు. ఇంత చిన్న వయసులో కూడదని డాక్టర్లు చెప్పినా వినక, ఇంటివాళ్లు ఇంకో డాక్టర్‍కి లంచమిచ్చి ఎట్లాగో తీయించేశారట. ఉన్న ఇద్దరు పిల్లలూ ఓసారి ఆడుకుంటూ వెళ్ళి వాళ్లు పనిచేస్తున్న ఏరియాలో వున్న నీటిగుంటలో పడిపోయారు; ఎవరూ లేని సమయంలో. ఆ తర్వాత దొరికింది వాళ్ళిద్దరి శవాలే. వాళ్ల షావుకారికి ఏమనిపించిందో ఏమో, వాళ్లని పిల్చుకొచ్చి పార్వతి మొగుణ్ణి ఓ స్కూలు సెక్యూరిటీగా నియమించాడు. పార్వతి ఇళ్లచాకిరీ చేసి కాలం వెళ్లబుచ్చుతూంది.

ఈ కథ చెబుతూ పార్వతి తన చీర చెరుగు అంచుతో కళ్లు తుడుచుకుంది. దాని కథ విని  నేను చలించిపోయి వెంటనే లేచి వెళ్ళి దాన్ని కౌగలించుకున్నా. చిన్న వయస్సులోనే పిల్లల్ని పోగొట్టుకుని, ఇక బిడ్డల్ని కనలేక వున్న పార్వతి స్థితిని తల్చుకొని కృంగిపోయాను. అదెంతసేపు నా కౌగిట్లో ఇమిడిపోయి సాంత్వనం పొందిందో!

ఓ రోజు వెళ్లి ఆపరేషన్ డేట్ ఫిక్స్ చేసుకొని వచ్చాం. మా పెద్దనాన్న కూతురు ఫోన్ చేసి, “నేనూ ఇదే స్థితిలో వున్నదాన్నే. ఆపరేషన్ చేయించుకున్నా, ఇప్పుడు ఏ తాపత్రయం లేదు. నెలనెలా మూల కూర్చునే అవస్థ లేకుండా హాయిగా వున్నా. ఏం భయం లేదు. చేయించుకో” అంది.

***

ఆపరేషన్ థియేటర్‌లో డాక్టర్లు, నర్సుల మధ్య ఆపరేషన్ టేబుల్‍పై..

‘ఏమి అవస్థ తెచ్చి పెట్టావు భగవంతుడా’ అని అనుకుంటున్నంతలో, అనెస్థీషియా స్పెషలిస్ట్ ఇచ్చిన ఇంజక్షన్ వీపున గుచ్చుకొంది. క్షణoలో దేహం కొయ్యబారి పోయినట్లయ్యింది. ఏమైనా చేసుకోండి అనే మనస్థితిలో వుండిపోయాను. ఎవరెవరివో మాటలు వినబడుతున్నాయి. ఏం చేస్తున్నారో? ఏం జరుగుతున్నదో? అదెంత సేపు గడిచిందో!

“ఆపరేషన్ సక్సెస్.. కన్నులు తెరవండి” అని డాక్టర్ హేమ భుజం తట్టారు.

‘అవునా? అయిపోయిందా? థ్యాంక్స్’ అని మూలిగింది నా హృదయం. అనెస్థీషియా మత్తు నుంచి బయటపడ్డా.

“మీ గర్భకోశాన్ని చూస్తారా” అని అడిగారు.

“అవును చూస్తాను,. చూడాలి”

గులాబి వర్ణపు ఒక ఆకృతిని గ్లౌస్ వేసుకున్న ఓ చేయి చూపించింది. “చూడండి ఎంత పెద్దదయ్యిందో!”

ఆస్పత్రి వాళ్లు దీన్ని ఏం చేస్తారు! వీధిలోకి పాతికేసి కుక్కలకు ఆహారంగా వేస్తారా? మెడికల్ స్టూడెంట్స్‌కి, పాఠం చేయటానికి దీన్ని ఉపయోగిస్తారా? పిండాన్ని తొమ్మిది నెలలు తనలో ఇముడ్చుకుని దానికో రూపాన్ని ఇచ్చి మానవ లోకం లోకి విడుదల చేసే ఈ నిలయానికి ఇదేనా విలువ!? ఎన్నెన్నో ప్రశ్నలు. దీనికి సమాధానమిచ్చే వారెవరు?

***

కలలోకి జారుకున్నా నేను. డాక్టర్, ఆ గులాబీ వర్ణపు గర్భకోశాన్ని తన చేతిలో వుంచుకుని చూపిస్తున్నది. “నాకు కావాలండీ అది.. నా చిన్నారి పాపలు పుట్టి, పెరిగిన గూడు అది” అంటూ చేతిని చాచా. అది అందలేదు నాకు. చూస్తూ చూస్తూ వుండగానే అది ఒక ఆడదాని రూపును సంతరించుకుంది. దానికి ఇరువైపులా రెక్కలు. నాలోని భావాలను అర్థం చేసుకున్నట్లుగా అది, “ఇంకో జన్మలో నీవు ఆడదే అయితే తప్పక చిక్కుతాను” అంటూ శరవేగంతో ఆకాశంలోకి దూసుకువెళ్లింది; “టాటా.. బై.. బై..” అంటూ.

కన్నడ మూలం: శ్రీమతి మాలతి హెగడే

అనువాదం: శ్రీ కల్లూరు జానకిరామరావు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here