Site icon Sanchika

తాత – మనవడు

[dropcap]“సా[/dropcap]హిత్య పుస్తకాలన్నీ ఇలా చెదలు పట్టుకుపోతుంటే చూసుకోవేరా అబ్బాయ్.”

“ఇప్పుడు తెలుగు సాహిత్యాన్ని ఎవరు చదువుతున్నారు మాష్టారు?”

“అదేమిట్రా అలాగంటావు, నువ్వు చిన్నప్పడు తెలుగు పాఠాల్లో అందరికంటే ముందుండేవాడివి. పెద్దయ్యాక తెలుగు సాహిత్యాన్ని చదువుతాను మాష్టారు అనేవాడివి. ఆ మాటలన్నీ ఏమయ్యాయిరా?”

“ఇప్పుడంతా కంప్యూటర్ యుగం మాష్టారు. ఇలా కంప్యూటర్ కోర్సు చేయగానే అలా ఉద్యోగం వస్తోంది. ఎవరికి కావాలి మాష్టారు ఈ సాహిత్యపు చదువులు.”

“అంతేలేరా కాలం మారింది. బతుకుదెరువు ముఖ్యం. అది సరేగాని తీరిక సమయాల్లోనైనా తెలుగు సాహిత్యాన్ని చదువుతూ ఉండరా.”

“ఎక్కడ మాష్టారు, పొద్దున ఫోన్ పట్టుకొని లెగిస్తే రాత్రి టీవీ కట్టేసి పడుకోవడంతో రోజు గడిచిపోతోంది. ఇంక తీరికెక్కడిది. మీరు తెలుగు పండితుడిగా చెప్పిన పాఠాల వరకే గుర్తున్నాయి. ఆ తరువాత మళ్లీ తెలుగు పుస్తకం ముట్టుకోలేదు. అంతా ఇంగ్లీష్ పుస్తకాల మీద ఆధారపడటమే.”

“కాలం మారింది రా అబ్బాయ్. కాలంతో పాటు తెలుగు భాషా సాహిత్యం దాని మాధుర్యం అంతా, చదివేవాడు లేక చెదలుగొట్టుకుపోతోంది. ఆదరించేవాడే లేడు. అయితే మారాల్సిందే నేనేనన్నమాట. సరే మీ నాన్న రాగానే నేనొచ్చినట్టు చెప్పు.”

***

“ఏమయ్యో, అమ్మాయి మనవడు అమెరికా నుండి బయలుదేరారట, రేపు ఉదయమే ఇక్కడ వుంటారట. అల్లుడు గారు ఫోన్ చేసి చెప్పారు.”

“అలాగా”

“ఏంటి అలాగున్నారు, భోజనం వడ్డించమంటారా?”

“మనసు బాలేదే.. దాంతో ఆకలి లేదు.”

“ఆ తెలుగు పండితుడిగా రిటైరయ్యాక మీ మనస్సు అస్సలు బాగుండటం లేదు. మళ్లీ తెలుగు గురించి ఎవరైనా తక్కువగా మాట్లడారా ఏమిటి?”

“తక్కువగా మాట్లాడటం కాదే పిచ్చిదానా, తెలుగును పాతాళలోకం తొక్కేస్తున్నారు. తెలుగు సాహిత్యాన్ని ఆదరించేవాడే లేడు. అసలు తెలుగు భాష గురించి మాట్లాడే మానవ మాత్రుడే లేడు.”

“మీకీ మధ్య ఈ గోల ఎక్కువైంది”

“అదికాదే, అందరు సెల్ ఫోన్లని కంప్యూటర్లని టీవీలని కాలక్షేపం చేస్తున్నారే గాని, మంచి సాహిత్యాన్ని చదివి జ్ఞానాన్ని పొందుదామని ఒక్కరికైనా ఉందా.”

“ఈ రోజుల్లో ఎవడిక్కావలండి మీ సాహిత్యపు గోల?”

“తెలుగు సాహిత్యంలో ఎంత గొప్పతనం ఉందో నీకేం తెలుసే పిచ్చిమొహమా. పద్యాలు, నాటకాలు, కథలు నవలలు ఆహా అది చెపితే కాదు చదివితేనే తనివితీరుతుంది.”

“మీరలా కడుపు నింపుకోండి, నాకు ఆకలేస్తోంది”

“నా బాధ నీకు చెప్పిన అర్థం కాదులే”

***

“ఏమిట్రా దిగులుతో ఉన్నావని తెలిసింది. ఉద్యోగం అన్నాక రిటైర్మెంట్ లేకుండా ఎలా ఉంటుంది చెప్పు?”

“అది కాదురా నా బాధ, తెలుగు పండితుడిగా పని చేసినంత కాలం ఆనందంగా పనిచేసాను. విద్యార్థులకు తెలుగు సాహిత్య గొప్పతనాన్ని తెలియజేసాను. తీరా బయటికొచ్చి చూస్తే తెలుగు భాష అథఃపాతాళానికి వెళ్లిపోతోందిరా. వచ్చే తరం గురించి మనం ఆలోచించకపోతే కొంత కాలానికి తెలుగు సాహిత్యం చచ్చిపోతుందేమో అనిపిస్తుంది.”

“అదేమిట్రా అలాగంటావు, తెలుగు సాహిత్యాన్ని చదివేవారే లేరంటావా?”

“ఉన్నారు కాని ఎంతమంది. ఇప్పటి యువతరం అంతా ఫోన్లు టీవీలతోనే కాలం గడుపుతున్నారు. తెలుగు చదివేవాడే కానరావడం లేదు. ఒక్క పుస్తకం కొని దాన్ని తనివితీరా చదివేవాడున్నాడా. కొన్నాళ్లు కొన్నేళ్లు పోతే తెలుగు భాషే అంతర్ధానమవుతుందేమో అనిపిస్తుంది.”

“నిజమేలే ఇప్పుడంతా టెక్నాలజీ యుగం. తెలుగు సాహిత్యానికి పాత రోజులే స్వర్ణయుగం”.

“ఆ రోజుల్లో గొప్ప గొప్ప మహానుభావులు రాసిన తెలుగు కథలు చదవి మనం ఎంత ఉర్రూతలూగిపోయేవాళ్లం. అవన్నీ ఈ యువతరానికేం తెలుసురా. తెలుగు కథను జాడతీసిన గురజాడ వారు, అన్నంలో నెయ్యి వేసి కలిపి పెట్టినంత కమ్మగా వుండే శ్రీపాద వారి కథలు, విశ్వనాథ వారు, కరుణకుమార వారు, చింతా ధీక్షితులు గారు, కొడవటిగంటి వారు, బుచ్చిబాబు గారు, రావిశాస్త్రి గారు, చలం గారు ఇలా చెప్పుకుంటూపోతే మహానుభావులు ఎన్నెన్ని గొప్ప కథలు రాసారు. అందులో ఎంత జీవితం వుంది, ఎంత జ్ఞానం వుంది, ఎంత మార్మికత వుంది. ఇవన్ని ఈ యువతరం చదవకపోతే ఆ కథాసారమంతా ఏమైపోవాలి చెప్పు. కనీసం కూచొబెట్టి చెపుదామన్నా వినేవాడే లేడే. అంతా తొందర తొందర గజిబిజి గందరగోళం బతుకులు.”

“దానికి మనమేం చేయగలంరా, చూస్తూ వుండిపోవడం తప్ప?”

“అంతేనంటావా”

“అంతేరా”

“ఏం చేయలేమంటావా?”

“ఖచ్చితంగా ఏం చేయలేం రా..”

***

“అమ్మాయ్, ఏం చదువుతున్నాడే నీ కొడుకు?”

“నువ్వుండవే అమ్మాయ్, నేను చెప్తాను, ఆరవ తరగతటండి, అమెరికా ఇంగ్లీష్‌లో ఎంత బాగా మాట్లాడుతున్నాడో నా మనవడు, అమెరికాలో చదువంటే మాటలా చెప్పండి.”

“అమ్మాయ్, కాసైనా తెలుగు మాట్లాడ్డం నేర్పావా లేదా?”

“కొంచెం కొంచెంగా మాట్లాడతాడు నాన్నా, రాయడం మాత్రం అస్సలు రాదు, మా కమ్యూనిటిలో తెలుగు మాట్లాడేవారే లేరు నాన్నా.”

“అంత చక్కగా ధనా ధనా ఇంగ్లీష్ మాట్లాడుతుంటే అక్కరకు రాని తెలుగెందుకండి?”

“అబ్బా నువ్వుండవే నా ప్రాణాలు తోడేస్తున్నావు, ఏరా అబ్బాయ్, తెలుగు భాష మాట్లాడగలవా?”

“టెలుగు కొంచం కొంచం.. వచ్చు నకు..”

“అర్థమైందిరా మనవడా నీ తెలుగు పాండిత్యం, ఇప్పడు నాకు పనిపడింది.”

“ఏమండోయ్, వాడు సరదాగా గడుపుదామని ఇక్కడకు వచ్చాడు, మీ తెలుగు పాండిత్యాన్ని నా మనవడి మీద రుద్దకండి, కావాలంటే వాడున్నని రోజులు మంచి కథలు చెప్పండి.”

“అలాగే లేవే, నువ్వెళ్లి నీ పని చూసుకో..”

“ఏరా. కథలు వింటావా..”

“వాట్ ‘కథలు’ తాతగారు?”

“స్టోరీస్, తెలుగు స్టోరీస్”

“ఓ.. ఓకే.. ఓకే ఐ లవ్ స్టోరీస్”

“అయితే నాతో రా.. మనం బజారుకెళ్లి పుస్తకాలు కొనుక్కుందాం.”

***

“ఇవి తెలుగు అక్షరాలు, ఇవి తెలుగు గుణింతాలు, చెప్పు ఒకసారి”

“ఇవి టెలుగు అచ్చరలు.. ఇవి టెలుగు గుడింతలు”

“సరే. ఇది ‘అ’… ఇది ‘ఆ’.. ఈ పలక మీద ఇలాగే దిద్దు”

“అబ్బా.. కాస్త వాడిని ఆటలు ఆడుకోనివ్వండి, మీరు మీ తెలుగునూ”

“ఆడుకుంటాడు లేవోయ్, ముందు ఈ తెలుగు కాస్త నేర్చుకోని”

“యూ నో తెలుగు లిటరేచర్?”

“ఐ డోంట్ నో టాటగారు, బట్ ఐ నో లిటిల్ బిట్ టెలుగు”

“ఓకే, యూ మస్ట్ లెర్న్ తెలుగు లాంగ్వేజ్”

“వై టాటగారు?”

“తెలుగు ఈజ్ ఎ స్వీట్ అండ్ లవబుల్ లాంగ్వేజ్ మోర్ దెన్ ఇంగ్లీష్”

“ఓ.. ఓకే టాటగారు, ఐ విల్ లెర్న్ టెలుగు లాంగ్వేజ్”

“గుడ్”

“నాకు ఇంకా టెలుగు కథలు చెప్పండి టాటగారు”

“అయితే, ఈ అక్షరాలు బాగా చదువు, రీడ్ అండ్ రైట్ కేర్‌ఫుల్లీ, అప్పుడు తెలుగు కథలు చెప్తాను.”

“ఓకే డన్..”

***

“ఇది ఏమి పుస్తకం తాతగారు?”

“దార్లో పడ్డావురా మనవడా, తెలుగు బాగా నేర్చుకున్నావు. టాటగారు పోయి తాతగారు కొచ్చింది.”

“అవును తాతగారు”

“ఇది తెలుగు వ్యాకరణం పుస్తకం, ఈ వ్యాకరణం కొద్దిగా నేర్చుకున్నావనుకో, తెలుగు భాష గురించి ఇంకా బాగా అర్థం అవుతుంది.”

“ఏదో నాలుగు రోజులు ఉందామని పిల్లాడొస్తే, వాడినలా రాత్రి పగలు వదలకుండ తెలుగు తెలుగు అంటూ విసిగిస్తున్నారే. ఇంక వాడిని వదిలేయండి.”

“ఏరా మనవడా నీకెమైనా ఇబ్బందిగా వుందా?”

“నో తాతగారు. నేను తెలుగు బాగా నేర్చుకొని అమెరికాలో మాట్లాడతాను, అలాగే మంచి కథలు కూడా రాస్తాను అమ్మమ్మ.”

“సరిపోయింది, మీ కథల పిచ్చి వాడికి కూడా అంటిచ్చారా?”

“పిచ్చికాదోయ్, ప్రేమ, భాషపై మక్కువ”

“తాతగారు, ఇంకా నాకు మంచి మంచి కథలు చెప్పండి”

“కథలదేముందిరా, నువ్వు వినాలే గాని తెలుగులో మహా మహా గొప్ప కథలున్నాయి. అవన్ని చెప్తాను, అప్పుడు నువ్వె సొంతంగా మంచి కథ రాయొచ్చు”

“యస్.. యస్.. ఐ డూ తాతగారు ఐ డూ..”

“మరి వచ్చేవారం అమెరికా వెళ్లిపోతున్నారని మీ అమ్మ చెప్పింది, మరెలాగ నేర్చుకుంటావు తెలుగు?”

“నో ప్రాబ్లం తాతగారు, రోజూ నాకు ఫ్రీగా వున్న టైంలో ఆన్‌లైన్ లో చెప్పండి, నేర్చుకుంటాను.”

***

“పంతులు గారు మీకు ఉత్తరం వచ్చింది”

“ఏది..”

“ఇక్కడ సంతకం పెట్టండి”

“ఎవరు రాసారండి ఉత్తరం?”

“అమెరికా నుండి వచ్చినట్టుంది”

“అమ్మాయ్ చెప్పిందండి, మనవడు తాతకు ఉత్తరం రాసాడని.. చదవండి చదవండి”

“తాతగారికి, అమ్మమ్మ గారికి మీ మనవడి నమస్కారాలు,

ఇక్కడ మేము క్షేమము, అక్కడ మీరు బాగున్నారా, మీకు ఈమెయిల్స్ వాట్సాప్‌ల ద్వారా పంపిస్తే ఇష్టం ఉండదని ఇలా ఉత్తరం ద్వారా తెలియజేస్తున్నాను.

ఇక విషయంలోకి వస్తాను, మీరు నాకు నేర్పిన తెలుగు భాష వల్ల మా కమ్యూనిటీ పిల్లల్లో నేను పెద్ద నక్షత్రం అయ్యాను, అనగా పెద్ద స్టార్ అయ్యాను.

ఇంకో ముఖ్య విషయం ఏమనగా, నేను ఒక కథ రాసాను. దాన్ని మా అమెరికా తెలుగు సంఘాల్లో ప్రెజెంటు చేసాను. దానికి నాకు మొదటి బహుమతి ఇచ్చారు. కథ బాగుందని అందరు ప్రశంసించారు. అలాగే ఆ కథను ఇంగ్లీష్ లోకి మార్చి మా స్కూల్ డే ఫంక్షన్‌లో ప్రెజెంటు చేసాను. దానికి కూడా నాకొక బహామతి ఇచ్చారు. ఆ కథ మీకు పంపిస్తాను. ఇదంతా మీరు నాకు నేర్పిన తెలుగు భాష వల్ల సాధ్యమైంది. నాకు చాల ఆనందంగా వుంది తాతగారు. దీనికి అమ్మ నాన్న కూడా చాల సంతోషించారు.

ధన్యవాదాలు తాతగారు,

ఇట్లు

మీ మనవడు.”

Exit mobile version