తాతయ్య కథ!

0
2

[శ్రీ ఉషారం రచించిన ‘తాతయ్య కథ!’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]“ఏ[/dropcap]రా! మనవడా! బాగున్నావా?” సరిగ్గా అప్పుడే ఆటో దిగి ఇంట్లోకి వస్తున్న నన్ను చూసి మూగగా, సన్నటి నవ్వుతో భావ గర్భితంగా అడిగాడు తాతయ్య.

మాసిపోయిన జుట్టు, వెలసిపోయిన అంగీ, కాటికి కాళ్ళు చాపుకున్న శరీరం అయినా ఏదో ప్రశాంతత ముఖంలో కొట్టుకు వస్తున్న తాతయ్యను చూసి జాలి వేసింది. లేదు లేదు కన్నీళ్లు తిరిగాయి. ఎలాంటి తాత, ఎంత గొప్పగా బ్రతికిన తాత.. ఇలా అయిపోయాడేమిటి? మనసులోనే కుమిలిపోతూ

“బాగున్నాను తాతయ్య!.” గొంతు పెగల్లేదు కానీ మాట మనసులో అనుకుంది. అసలే రాత్రి అంతా ప్రయాణంలో అలసి ఎంతో బడలిక పైన వేసుకుని ఊళ్ళోకి దిగిన నాకు తాతయ్య వదనం చూసి మరింత నీరసం ఆవహించింది. అయినా గుండె దిటవు చేసుకుని నెమ్మదిగా కాలకృత్యాలు తీర్చుకుని, పక్కింటి వాళ్ళు ఇచ్చిన ఫలహారాలు తిని నెమ్మదిగా మా ఇంటి మండువాలో నేల మీద కూర్చుని తాతయ్యను పలకరించాను.

“ఏం తాతా.. సమయానికి మందులు వేయించుకోవడం లేదా, ఎవ్వరూ నిన్ను చూడటానికి రావడం లేదా? ఇలా అయిపోయావు ఏమిటి తాతయ్య?” అంటూ గద్గద స్వరంతో తాతయ్యని జాలిగా చూసాను. అసలు నా ప్రశ్న నాకే నవ్వు వచ్చింది.. అవును మరి చూడవలసిన మనవడిని నేనే భాధ్యత మరచి ఎప్పటికో ఏడాదికోమారు వచ్చి పలకరిస్తే , మరి ఏమీ కానివాళ్ళు ఎలా చూస్తారు? పిచ్చి ప్రశ్న వేసానని.. నాకూ తెలుసు.. అయినా పలకరించాలి కదా..

నా మాట విన్న తాతయ్య చిన్నగా జీవం లేని నవ్వు ఒక్కటి నవ్వి “నాకేం భేషుగ్గా ఉన్నాను. అయినా చెట్టంత మనవలు మీరంతా నాకు ఉన్నారు.. నాకేంటి దిగులు” అంటూ గొప్పలు పోయాడు. చూడటం లేదని తెలిసినా, భాధ్యతలు మరచి దూరంగా పారిపోయారని అర్థం అయినా, తన మనవల పరువు యెక్కడ పోతుందోనని గంభీరంగా నిజాన్ని దాచేస్తూ అబద్ధపు ధైర్యం ప్రదర్శించాడు.

“అదేంటి తాతయ్య.. నీ జవసత్వాలు ఉడిగాయి. నువ్వేం మామూలు పిల్లగాడివా.. శతాధిక వృద్ధుడివి, వృద్ధాప్యం కనిపిస్తోంది.. అయినా మా పట్ల లాలన, ప్రేమ ఏమీ తగ్గలేదు. నీ వారసులుగా మేము ఏమీ చేయడం లేదు కానీ.. నీ అభిమానం మాత్రం ఎక్కడా కొదువ లేదు.  నాకు తెలుసు తాతయ్య.. నీకు కొత్త బట్టలు కుట్టించి ఎన్నాళ్ళు అయిందో? సరైన వైద్యం చేయించి ఎన్ని ఏళ్ళు గడించిందో? పెళ్లిళ్లకు సంబరాలకు నిన్ను పిలవడమే మానేసాం. ఎక్కడో శుభకార్యం అయితే కనీసం నీకు కార్డు ముక్క కూడా పంపాలని ఆలోచన లేని వారసులం. చెట్టంత వారసులు ఉన్నారని నువ్వు సంబర పడుతున్నావు కానీ.. నిన్ను ఎంత నిరాదరణకు గురి చేస్తున్నామో? మాకు తెలియదా? నీకు అర్థం కాలేదా?

నన్ను మరచి పోయార్రా? అని తిట్టు తాతయ్య.. వీలు అయితే కొట్టు. ఇంత ప్రేమ చూపించకు, నాన్న పోయిన తర్వాత మనవలుగా నిన్ను పట్టించుకోవడం లేదని మాకు తెలుసు. ఏదో ఏడాదికో మారు చుట్టపు చూపుగా వస్తే వస్తున్నాం కానీ.. నీకు తగినంత ప్రాధాన్యం యెక్కడ ఇచ్చాం. రెక్కలు వచ్చిన పక్షులం.. సొంత గూడు కాదనుకుని ఎక్కడికో ఎగిరిపోయిన వలసజీవులం. అయినా మేము ఎప్పుడు వచ్చినా ఇంత ఆదరణ చూపించకు తాతయ్య.. భరించలేక పోతున్నాం” అంటూ ఎక్కిళ్ళు తన్నుకు వస్తున్న దుఃఖంలో నా మాట  పడిపోయింది.

ఒక్క చిరునవ్వు రువ్విన తాతయ్య నెమ్మదిగా నన్ను తన ఒడిలోకి తీసుకుని “ఒరేయ్.. ఎల్లకాలం అందరూ ఒక్కరులా ఉండరురా! కాలం తనే ప్రశ్న వేసి తానే సమాధానం రాసుకు వస్తుంది. నాకేం, బాగానే ఉన్నాను. అయినా ఎన్నాళ్ళు ఉంటాను చెప్పు. పడమటి ఒరుగుతున్న జీవితం నాది. ఉన్నంత కాలం మీ అందరి సరదాలు ఆనందాలు నావే. తాతా.. నీకు వందేళ్లు దాటాయి కదా.. ఇంకా బ్రతికే ఉన్నావా? అని అడిగే మనుషుల మధ్య నెట్టుకు వస్తున్నా. ఏదో ఇక కొద్ది కాలం. ఆ తరవాత నేను ఎవరు? మీరు ఎవరు? కాల ప్రవాహంలో కొట్టుకు పోవాల్సిందే. నా సమకాలీకులు అంతా ఎప్పుడో గతించారు. వాళ్ళ వారసులు ఇక్కడ ఎవ్వరూ లేరు. ఇక మనలాటి వాళ్ళకి వాళ్ల జ్ఞాపకాలే మిగిలాయి. అవీ ఎన్నాళ్ళు ఉంటాయి. తరం మారిపోతే స్మృతులు కూడా గతించి పోతాయి.” అంటూ భారంగా నిట్టూర్చాడు తాతయ్య.

“అదేంటి తాతయ్య.. వందేళ్లు ఆయుష్షు దాటితే మరి బ్రతకకూడదా? రేపు మాకే వందేళ్లు వయసు వస్తే చంపేస్తారా ఏమిటి? వృద్ధాప్యపు ఇబ్బందులు వస్తుంటే మాత్రలు కూడా ఖర్చు అనుకొని మందులు వేయటం మానివేసే వారసులం మరి. నాన్న ఉన్నంత కాలం నువ్వు ఎంత దర్జాగా ఉండేవాడివో? ఆయనతోనే నీ వైభవం వెళ్లి పోయింది. ఆయన లేని లోటు నిన్ను ఎంతగా అలుసు చేసిందో తెలుస్తూనే ఉంది. ఆయన ఉన్నప్పుడు నీ చుట్టూ జనం, సందడి, నీకు పలకరింపులు, సన్మానాలు, సత్కారాలు, ఇప్పుడు ఏముంది చెప్పు? ఎప్పుడు నువ్వు కాలం చేస్తావా? తన్నుకు పోదాం అనే ఆలోచనల గల మనుషులు మధ్య నీ ప్రస్తుత కాలం. ఎన్ని జీవితాలు నీ సంరక్షణలో గొప్పగా పెరిగాయో? ఎంత మంది నీ దగ్గర ఆశ్రయం పొంది ప్రగతి సాధించారో? అన్నీ జ్ఞాపకాలుగా మిగిలి పోయాయి. అలా సాధించిన జీవితాల్లో నీపై ఒక్కరికీ కృతజ్ఞతాభావం లేదు. ఎవ్వరో ఎందుకు? నన్నే చూడు.  యెంత కృతఘ్నుడినో. కాలమానాలు ప్రకారం ఉద్యోగ రీత్యా దూరం వెళ్ళినా నా బాధ్యత అంటూ ఒకటి ఉంటుందిగా? మరి నేను సక్రమంగా నిర్వర్తించడం లేదు.

నీ ఆలనాపాలనా చూడవలసిన నేను నీకు ఏమి ఖర్చు పెట్టినా అది వృథా అవుతుందేమోనని లెక్కలు వేస్తున్నాను. నా అలక్షం వల్లే కదా.. నీకు ఈ దీన స్థితి. నీ ఒడిలో చేసిన అల్లరి, నాన్నతో గడిపిన క్షణాలు, నీ ఇంటి గౌరవం అన్నీ మరచిపోయాను తాతయ్యా.

గత మెంతో కీర్తి గడించిన నిన్ను ఈనాడు ఇంత ఆదరణ లేకుండా చూస్తుంటే మరి నీకు కోపం రాలేదా తాతయ్య? ఆస్తులు పంచుకోవడానికి ముందుండే నాలాంటి మనవలు ఆప్యాయతలు పంచిన నిన్ను చూడవలసిన భాధ్యతలు విస్మరించి మసులుతుంటే నీకు ఉక్రోషం రాలేదా?” అంటూ ఇంకా ఏదో చెబుదామని  ఉన్నా.. మాటలు పెగలక మూగపోతే ఆగిపోయా.

పెద్ద నిట్టూర్పు విదిల్చిన తాతయ్య ఒక జీవం లేని నవ్వు విసురుతూ “అలా బాధపడకురా మనవడా. పొట్టకూటి కోసం వెళ్ళావు కానీ,ఇక్కడే  ఉంటే ఎలా సాగుతుంది జీవితం. అయినా ఇది నీ వల్లే జరిగిందని అనుకోకు. ఇప్పటి సమాజం అలా ఉంది. అందరికీ పుట్టి పెరిగిన ఊళ్లోనే ఉద్యోగాలు వచ్చి, పుట్టి పెరిగిన ఇంట్లోనే, తన వాళ్ళ మధ్యనే మసిలే అవకాశం ఇప్పుడు ఎవ్వరికీ లేదు. ఒక వేళ ఉన్నా ఆలోచన మారిన నేటి తరం నాలాంటి వాళ్ళని మోయడానికి పెంచి పోషించడానికి సిద్ధంగా లేరు. మమ్మల్ని అంటి పెట్టుకొని జాగ్రత్తగా చూడటానికి. ఇదివరకటిలాగ గంపెడు పిల్లలు లేరుగా? లింగ లిటుకు అనే సంసారం, ఊపిరి సలపని ఉద్యోగాలు, తమ సంతానం ఎదగాలి అనే ధోరణిలో మమ్మల్ని మరచిపోయారు. విచిత్రం ఏమిటంటే మా కథే వాళ్లకు భవిష్యత్‌లో అనుభవం లోకి వస్తుందన్నది మరచిపోతున్నారు. అయినా మీరంతా ఎక్కడో అక్కడ బాగుంటే మాకు సంతోషమే కదరా.” అంటూ తాతయ్య ఏవో ఉపశమన మాటలు అల్లుతుంటే. తాతయ్యతో  గడిపిన జ్ఞాపకాలు, అల్లరి చేసిన ఘటనలు, ఎన్నో మధుర సమయాలు అన్నీ కళ్ళ ముందు కదులాడుతుంటే, తన ఒడిలో మనసు చల్లబడిందేమో?  హాయిగా నిద్ర పట్టేసింది.

చాలా సేపటికి కానీ తెలివి రాలేదు. ఎన్నాళ్ళయ్యింది ఇంత ఆదమరచి నిద్ర పోయి..ఇంత ప్రశాంతత కలిగి. డబుల్ కాట్ మంచాలు, అంతరాయం రాని ఏసి గదులు, చిన్న శబ్దం కూడా రానివ్వని కిటికీలు, సువాసనలు గుబాళించే అత్తరులు.. ఇవి ఏమీ  ఇవ్వని ప్రశాంత నిద్ర.. బూజులు  పట్టిన మండువాలో, రణగొణ ధ్వనుల మధ్యలో, దుమ్ము పట్టిన నేలపై చింకి చాపలో జోల పాడింది.

తాతయ్య ముఖంలో ఊసులు అర్థం చేసుకుంటుంటే, ఆటలు పాటల బాల్యం మధురానుభూతులు చల్లగా మనసుని నెమ్మది పరుస్తుంటే స్వర్గం ఎక్కడో లేదు.. స్వర్గానికి దూరం అయ్యి.. కాదు చేసుకుని ఎక్కడో అభూత కల్పనల మధ్య మాయలో మన జీవితాలు సాగి పోతున్నాయని అర్థం అయ్యింది.

ఆయిన వాళ్ళు లేక, ఉన్న వాళ్ళు చూడక తాతయ్య లాంటి వాళ్ళు జ్ఞాపకాల మూలుగుల్లో కాలం  గడిపేస్తున్నారు. చివరి క్షణంకోసం ఎదురు చూస్తున్నారు. ఎలాగూ పడమరకి ఒరిగిన జీవితం కదా అని నాలాంటి మనవళ్ళు నిర్లక్షం చేసేస్తున్నారు. ఒక గొప్ప సజీవ జ్ఞాపకాన్ని మనకి మనమే దూరం పెట్టేస్తున్నాం.. కాల గమనంలో ఎవ్వరూ ఎల్లకాలం ఉండరు,  గతించి పోవాల్సిందే.. అది తాతయ్య అయినా, నేటి వారసుడు అయినా, రేపటి మనవడు ఐనా.. ఎవ్వరూ భూమ్మీద శాశ్వతం కాదు, కానీ జ్ఞాపకాలు, ప్రేమలు కట్టే కాలేవరకు శాశ్వతం. మరి నాలాంటి మనవళ్ళు ఎప్పుడు మారతారో? ఎప్పుడు అర్థం చేసుకుంటారో? అసలు మారతారా? బ్రతికి ఉన్నంత కాలం తాతయ్యను నిలబెట్టుకుంటారా?

తాతయ్యను చూసిన క్షణం నుండి నాలో సంఘర్షణ ఆగలేదు. ఎక్కడో మనసులో దాగి ఉన్న మమకారం ఉప్పెనలా పొంగి కలవరపెడుతోంది. అవును తాతయ్యను చూసుకోవాలి. ఉన్నంతకాలం జాగ్రత్త పరుచుకోవాలి. ఏదో చేయాలి. ఏదో చేయాలి.. అంటూ మనసంతా ఉక్కిరబిక్కిరైన ఆలోచనల్లో ఆటో ఎక్కి ఊరు వదలి వెళ్లిపోతుంటే దీనంగా తాతయ్య వీడుకోలు పలుకుతూ సాగనంపుతుంటే గిర్రున కళ్ళలో  నీళ్ళుతిరిగి కళ్లు మసకలు కమ్మాయి..

వీధి అంతా వారసుల నిరాదరణకు గురైన అనేక మంది తాతలు, ముత్తాతల ఆత్మలు నా చుట్టూ మూగి ఆశగా చూస్తుంటే నూటపద్నాలుగు ఏళ్ల మా తాతయ్య గర్వంగా నిట్టూర్చాడు.

వీడైనా మార్పు తేకపోతాడా? వారసత్వం అంటే ఆస్తులు పంచుకోవడమే కాదు ఆప్యాయతలు పెంచుకోవడం అన్నది నేటి తరాలకు చెప్పకపోతాడా? అని ఆశగా ఎదురుచూస్తూ. అవును.. కాలం వేసిన ప్రశ్నకు కాలమే సమాధానం ఇస్తుంది.. ఇది తథ్యం.

***

“ఒరేయి!.. అన్నయ్య.. మన ఊళ్ళో మన ఇల్లు సరైన ఆదరణ లేక సరిగ్గా చూడక పాడైపోతోందిరా? మనం అంతా కలసి ఏదో ఒకటి చేయాలి, ఇంకా కొన్నాళ్ళయినా బ్రతికించుకోవాలి” అని నేను చెబుతుంటే నూట పద్నాలుగు ఏళ్ల మా తాతయ్యను తలచుకుంటూ సాలోచనలో పడ్డారు మా ఇంటివారసులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here