తాతయ్యా కథ చెప్పవా…

0
2

[box type=’note’ fontsize=’16’] కావలి సాహిత్య సంస్థ నిర్వహించిన పోటీలో బహుమతి గెలుచుకున్న స్థానిక రెడ్‌ఫీల్డ్స్ హైస్కూల్ 10వ తరగతి విద్యార్థిని ఆర్.శ్రీజ వ్రాసిన కథ “తాతయ్యా కథ చెప్పవా…“. బాల/యువ రచయితలను ప్రోత్సహించే పథకంలో భాగంగా ఈ కథను అందిస్తున్నాము. [/box]

[dropcap]ఒ[/dropcap]క నిండు పౌర్ణమి రోజున చంద్రుని వెలుగుతో, తారలతో అందంగా ఉన్న ఆకాశాన్ని చూస్తూ సోమయ్యా, అతని మనవరాలు సంధ్యా పడుకునిన్నారు. సంధ్యకి తాతయ్య కథ చెప్పందే నిద్రపట్టదు. ఆ రోజు కథ చెప్పే సమయం రానే వచ్చింది. “తాతయ్యా నాకు ఈ సారి ఏదైనా కొత్త కథ కావాలి” అని సంధ్య అడిగింది. సోమయ్య ఆలోచించి కథ చెప్పడం మొదలు పెట్టాడు.

***

ఎన్నో ఏళ్ళ కిందట మందపల్లి అనే గ్రామం ఉండేది. ఆ గ్రామం కట్టుబాటులు, సాంప్రదాయాలు, ఆచారాలు, వినడానికి చాలా కొత్తగా ఉంటాయి. ఆ ఊరులో అందిరికి ఒక నమ్మకం. అది ఏమిటంటే ఆ ఊరులో ఎవరైనా ఆ ఊరు నియమాలను దాటితే ఆ ఊరు దేవత బలి తీసుకుంటుంది. ఆ ఊరు నియమాలు, ఆచారాలు అన్నీ ఆ ఊరి పెద్దలు నిర్ణయిస్తారు. అవి అన్నీ వాళ్ళకి ఇంకా బాగా డబ్బు ఉన్న వాళ్ళకి మాత్రమే అనుకూలంగా ఉంటాయి. ఆ ఊరి ప్రజలు ఎంతో కష్టపడేవారు. ఎవరైనా ఎదిరించాలంటే దేవత చంపేస్తుంది అని భయం. కొంతమంది ధైర్యం చేసి అడిగారు, కాని ఆ మరుసటి రోజు ఎవ్వరూ లేరు. ఇలా జరుగుతుండగా అందరూ దీనికి అలవాటు అయిపోయారు. ఆ ఊరిలో ఒక పాఠశాల ఉండేది. అక్కడ జరిగిన విషయానికి మన ఊరి భవిష్యత్తే మారిపోతుంది.

“అరే పిల్లలూ అరవద్దు, నిశబ్దంగా ఉండండి” అని ఉపాధ్యాయురాలు పిల్లలకి చెబుతూ ఉంటుంది. ఆమె పేరు సీత. ఆమె ఆరోజు 7వ తరగతి పిల్లలకి పాఠం చెబుతున్నది. ఈ తరగతిలో అందరూ మంచి పిల్లలే కాని 5 మంది తుంటరి పిల్లలు ఉన్నారు. కానీ వాళ్ళంటేనే సీతకి ఇష్టం. ప్రతి ఒక్కరూ ఈ ఐదుగురి పిల్లల్ని తిడుతూ ఉంటారు. కానీ సీతా నీకు వీళ్ళు ఎందుకు ఇష్టం అని ఎవరైనా అడిగితే ఒక చిన్న నవ్వు నవ్వేది. రాజు, కృష్ణ, గోపి, లక్ష్మి, స్వాతి అనేవి ఆ ఐదుగురు పిల్లల పేర్లు. ఆ రోజు పాఠశాలలో రోజూలాగే మళ్ళీ అల్లర్లు మొదలు పెట్టారు. సీత ప్రతీసారి వాళ్ళు ఏమి చేసినా చిన్నగా నచ్చ చెప్పేది, కాని ఆ రోజు తిట్టడంతో ఐదుగురూ చాలా బాధపడ్డారు. అలా పాఠశాల ముగిసింది. పిల్లలు ఐదుగురూ ఇంటికి వెళ్తూ వెళ్తూ రాజు ఇలా అన్నాడు “ప్రతి ఒక్కరు మన అల్లర్లనే చూస్తారు దాని వెనక ఉన్న మన ధైర్యాన్ని ఎవ్వరూ పట్టించుకోరు.”

‘అవును నాకు అసలు నచ్చడం లేదు’ అని లక్ష్మి అంటుంది. అప్పటి దాకా బాధగా ఉన్న గోపి ఒక్కసారిగా చిరునవ్వు నవ్వి ‘నాకు ఓ ఉపాయం తట్టింది’ అని చెప్పాడు. అప్పుడు అందరూ ఆసక్తిగా విన్నారు.

“ఆ ఉపాయం ఏమిటంటే మనం ఉంటే గ్రామం మందపల్లి, మన పక్క గ్రామం రామాపురం. ఈ రెండింటి మధ్య ఓ పాడు బడ్డ బంగ్లా ఉంది కదా, అందులోకి వెళ్ళడానికి ఊర్లో అందరూ భయపడతారు. మనం కాని అక్కడ ఒక్క రాత్రి ఉన్నట్టైతే మన ధైర్యం అందరికి తెలుస్తుంది” అన్నాడు.

“కాని మనం అక్కడ ఉన్నామని అందరికీ ఎలా తెలుస్తుంది?” అని కృష్ణ అడుగుతాడు.

“మనం ఊరు దాటి వెళ్తేనే ఆ బంగ్లాని చేరుకుంటాం, రాణీ వాళ్ళ ఇల్లు మన ఊరి చివరిలోనే కదా, మనం కాని తన కంట పడ్డామంటే చాలు, తనే అందరికి చెబుతుంది” అని అనుకుని ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళారు.

రాత్రి లోపల అందరూ సిద్ధమయి బంగ్లాకి బయలుదేరారు. అనుకున్నట్టుగానే రాణి కంట పడి ఆ బంగ్లా దగ్గరికి వెళ్ళారు. బంగ్లాని బయట నుండి చూడగానే ఒక్కొక్కరి గుండెల్లో రైళ్ళు పరిగెత్తాయి, కాని బయటకి ధైర్యంగా ఉన్నట్టు నటించారు. అది ఎన్నో ఏళ్ళ కిందటిది కావడంతో చూడడానికి ఎంతో భయంకరంగా ఉన్నది. లోపలికి వెళ్ళి తలుపు తెరవగానే రకరకాల పురుగులు పక్షులు బయటికి వస్తాయి. వీళ్ళు కొంచెం ధైర్యస్థులు కావడంతో దీనికి భయపడలేదు. లోపలికి వెళ్ళగానే వాళ్ళు ఊహించిన దానికి వ్యతిరేకంగా ఉంది. వాళ్లు అది చీకటిగా, బూజు పట్టి వింతగా ఉంటుంది అని అనుకుంటే దాన్ని ఎవరో వాడుకుంటే ఎలాగ ఉంటుందో అలాగ ఉన్నది. చేతబడి క్షుద్రపూజ, మనుష్యుల్ని బలి ఇచ్చే స్థలం ఇలాంటివి అన్నీ జరిగే స్థలం లాగ ఉంది. ఇది చూడగానే ఊర్లో జరిగేవి గుర్తుకు వచ్చాయి. వాళ్ళకి కూడా అలాగే జరుగుతుందని భయపడ్డారు. వీళ్ళకి అలాగే జరగకుండా తప్పించుకోవాలని చాలా ప్రయత్నం చేసారు. కానీ బయటకు వెళ్ళే దారి మర్చిపోవడంతో బయటకి రాలేకపోయారు. అంతలోపల ఎవరో లోపలికి వస్తారు. చీకట్లో వాళ్ళు ఎవరో అర్థం కాదు, చివరికి చూస్తే వాళ్ళు ఊరి పెద్దలు. వేగంగా లోపలికి వెళ్ళి దాక్కుంటారు.

ముందుగా వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారో అర్థం కాదు. బయట నుండి ఒకడిని లాక్కొని వచ్చి చంపేస్తారు. అప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది ఊర్లో జరిగేదానికంతా వీళ్ళే కారణం. దేవుడు, దెయ్యం అని మోసాలు చేసారని తెల్సిపోతుంది. అక్కడ నుండి తప్పించుకునే ప్రయత్నంలో వారి కంటపడ్డారు. వాళ్ళని కూడా చంపుదామని వాళ్ళని పట్టకుంటారు. ఆ పిల్లల్ని ఎలాగో చంపేస్తున్నామని వాళ్ళు చేసిన అక్రమాలు అన్నీ చెప్పేస్తారు. ఈ లోపల పొద్దున అవుతుంది. రాణీ వీళ్లు ఇంకా రాలేదని దిగులు పడుతుంటుంది. వెంటనే ఊరందరీ దగ్గరికి వెళ్ళి ఇది చెప్పేసి అందర్నీ ఆ బంగ్లా దగ్గరికి తీసుకువెళ్తుంది. వాళ్లు వెళ్ళడానికి ముందు బయపడతారు. ఆ ఐదుగురు పిల్లలు భయంతో అరవడం మొదలు పెడతారు. ఆ అరుపులు వినగానే అందరూ లోపలికి పరిగెడతారు. ఊరి పెద్దల్ని అక్కడ చూసి ఆశ్చర్యపోతారు. ఈ ఐదుగురు జరిగిందంతా అందరికి చెబుతారు. అందర్లోనూ ఆ మూడ నమ్మకాలు భయాలు పోయి ధైర్యం వచ్చింది. వెంటనే వాళ్ళని ఊరి నుండి గెంటేస్తారు. ఆ తరువాత వాళ్ళని అందరూ మెచ్చుకుంటారు. సీత అప్పుడు ఇలా చెప్పింది “ఇందుకే నాకు వీళ్ళంటే ఇష్టం, మీరు వాళ్ళు చేసే అల్లర్ని చూసారు, నేను దాని వెనుక ఉన్న ధైర్యాన్ని చూసాను.” ఈ ఐదుగురు ఎంతో సంతోషంగా ఉంటారు. అప్పటి నుండి అల్లర్లు మానేసి పద్దతిగా బుద్దిగా చదువుకుంటారు.

***

సోమయ్య కథ అంతా చెప్పేసి నీతి కూడా చెబుతాడు. అది ఏమిటంటే ఎలాంటి ఆపదలోనైనా ధైర్యంగా ఎదుర్కోవాలి. సంధ్యకి ఈ కథ చాలా బాగా నచ్చింది. ఆ నిండు జాబిలిని చూస్తూ సంతోషంగా పడుకుంది.

ఆర్.శ్రీజ

10వ తరగతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here