తథాస్తు దేవతలు

1
2

[అంబడిపూడి శ్యామసుందర రావు గారి ‘తథాస్తు దేవతలు’ అనే రచనని అందిస్తున్నాము.]

[dropcap]మ[/dropcap]నము మంచి చెడు మాట్లాడేటప్పుడు తథాస్తు దేవతలు ఉంటారు అని పెద్దలు హెచ్చరిస్తూ ఉంటారు. అంటే పదేపదే చెడు మాటలు మాట్లాడకూడదు అని పెద్దల ఉద్దేశం. ఈ తథాస్తు దేవతలు అలా చెడు మాట్లాడుతుంటే ఆ చెడు జరిగేటట్లు చూస్తారని పెద్దల భావన. ధర్మానికి విరుద్ధంగా ఉచ్చరించకూడని మాటలను పదేపదే అంటే దేవతలు వెంటనే తథాస్తు అనేస్తారు.

ఇంతకు ఈ తథాస్తు దేవతలు అంటే ఎవరు? వేదాలలో అనుమతి అనే ఒక దేవత ఉంది. యజ్ఞ యాగాది కార్యక్రమాలు ఆచరించేటప్పుడు ఈ దేవతను స్మరిస్తే వారికి కార్యసిద్ధి లభిస్తుందని యజ్ఞ ప్రకరణలో పేర్కొన్నారు. ఈ అనుమతి దేవతలనే వాడుకలో ‘తథాస్తు దేవతలు’ అంటారు. వీరి నివాస స్థానము సత్కర్మలు జరిగే పవిత్ర ప్రదేశాలే. త‌థ‌ అంటే అప్ర‌కారంగా అస్తు అంటే జ‌ర‌గాల్సిందే అని అర్థం. మ‌నిషి ఏదైనా అన‌రాని మాటను ప‌దే ప‌దే అంటే ‘త‌థాస్తు దేవ‌త‌లు’ వెంట‌నే త‌థాస్తు అంటారు. ‘త‌థాస్తు దేవతలు’ సాయంత్రం సంచరిస్తుంటారని అంటుంటారు. వీరు వాయు వేగంతో బంగారు రథం పై ప్రయాణిస్తూ ఉంటారు. అంతేకాకుండా వీళ్ళు తిరిగేటప్పుడు మనం ఏదైనా చెడు అనుకుంటే వెంటనే జరుగుతుంది. అంతేకాదు మన దగ్గర డబ్బు ఉన్న కూడా లేదు అంటే ఒకవేళ ‘త‌థాస్తు దేవతలు’ త‌థాస్తు అంటే నిజంగానే డబ్బు అస్సలు ఉండదట. అందుకే డబ్బు ఉన్న కూడా లేదు మాత్రం అనకండి. ఒకవేళ అంటే మాత్రం మీ దగ్గర డబ్బు లేకుండా పోతుంది. అలాగే మనము ఆరోగ్యంగా ఉన్నా ఒకవేళ లేదు అంటే నిజంగానే అనారోగ్యం కలుగుతుంది. అందుకే ఎప్పుడూ చెడు మాటలు మాట్లాడకండి ఒక వేళ ‘త‌థాస్తు దేవతలు’ వింటే త‌థాస్తు అంటే నిజంగానే జరిగిపోతాయి. కాబట్టి స్థితిగతుల గురించి అసత్యాలు, అవాస్తవాలు పలకడం మంచిది కాదు. ఒక విధంగా మన పెద్దలు మనలో పాజిటివ్ ఆలోచనలు ఉంచటానికి ఇలా చెప్పారు అని భావించవచ్చు

సూర్యుని కుమారులైన అశ్విని దేవతలే ఈ ‘తథాస్తు దేవతలు’. వీరు వైద్య శాస్త్రానికి అధిపతులు. అశ్విని కుమారులు ఒక చేత్తో ఆయుర్వేద గ్రంథాన్ని, మ‌రో చేత్తో అభ‌య హ‌స్తాన్ని చూపిస్తూ వేద మంత్రాల‌ను జ‌పిస్తూ తిరుగుతూ ఉంటారు. మ‌న గురించి మ‌నం ఏదైనా అనుకుంటే ‘త‌థాస్తు దేవ‌త‌లు’ వెంట‌నే త‌థాస్తు అంటార‌ని వారు ఎక్కువ‌గా సంధ్యా స‌మ‌యంలో అంటే సాయంత్రం స‌మయంలో తిరుగుతూ ఉంటార‌ని మన విశ్వాసము. సూర్యుని భార్య అయిన సంధ్యా దేవి సూర్యుని వేడిని భ‌రించ‌లేక గుర్రం రూపాన్ని దాల్చి కురు దేశం వెళ్తుంది. గుర్రం రూపంలో ఉన్న సంధ్యా దేవిని చూసి సూర్యుడు కూడా గుర్రం రూపాన్ని దాల్చి సంధ్యా దేవి ద‌గ్గ‌ర‌కు వెళ్తాడు. ఇలా వీరిద్ద‌రి క‌ల‌యిక వల్ల పుట్టిన వారే అశ్వినీ కుమారులు. వీరినే త‌థాస్తు దేవ‌త‌లని, దేవ‌తా వైద్యుల‌ని అంటారు.

మహాభారతంలో పాండురాజు భార్య మాద్రికి మంత్ర ప్రభావంతో నకుల, సహదేవులుగా అశ్విని దేవతలు జన్మించారు. అంతేకాదు ఆయుర్వేదాన్ని దక్ష ప్రజాపతి నుంచి అభ్యసించి ఇంద్రునికి నేర్పించారు. అశ్విని సోదరుల, సోదరి ఉష. ఆమె ప్రతిరోజూ వీరిని బ్రహ్మ ముహూర్తంలో మేల్కొల్పుతుంది. ఆ తర్వాత వారు తమ సోదరి ఉషను ముందు కూర్చోబెట్టుకుని రథాన్ని అధిరోహించి తూర్పు నుండి పడమరకు ప్రయాణిస్తారని పురాణ వర్ణన.

వైద్యుల గురించి మాట్లాడుకునేటప్పుడు హస్తవాసి అనే మాట వింటూ ఉంటాము. హస్తవాసి మంచిది అనే పేరుబడ్డ  వైద్యుడి దగ్గరకు వెళతారు అందరూ. వైద్యం చదివి వైద్యం చేస్తున్న కొంతమంది వైద్యులు తమ దగ్గరకు వచ్చే రోగుల అనారోగ్యం త్వరగా తగ్గాలని కోరుకుంటూ ఉంటారు. ఆ విధమైన మంచి ఆలోచనలు ఉన్న వైద్యులను ‘తథాస్తు దేవతలు’ తథాస్తు అని దీవిస్తారు. కాబట్టి వారికి హస్తవాసి బాగున్నా వైద్యులుగా పేరు వస్తుంది. చెడు విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. ఒకరికి చెడు జరగాలని కోరుకోవడం లేదా మనకు జరుగుతుందేమోనని భయపడటం వల్ల తథాస్తు దేవతల ప్రభావంతో అది ఫలిస్తుంది. మరిన్ని దుష్ఫలితాలు చోటు చేసుకోవడంతో ఇక్కట్లు పెరుగుతాయి. కాబట్టి మంచి కోరుకుంటే అందరికీ మంచి జరుగుతాయి. ‘తథాస్తు’.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here