Site icon Sanchika

టేషన్ మాస్టర్

[dropcap]అ[/dropcap]వి నేను స్కూల్లో టీచరుగా చేరిన కొత్త రోజులు. అనూహ్యంగా మా హెడ్ మాస్టరు ఆరో తరగతికి ఇంగ్లీషు బోధించమని ఆర్డరు వేయడంతో హతాశుడనయ్యాను.

అసలే నాకు లెక్చరర్ ఉద్యోగం రాలేదని కుతకుతగా ఉంది. ఇంగ్లీషులో ఎం.ఎ. చేసిన నేను రెండు మార్కుల దూరంలో సెకండు క్లాసు మిస్సయ్యాను. థర్డు క్లాసుతో సరిపెట్టుకోమని ఓ సర్టిఫికేటు నా ముఖాన కొట్టారు. యూనివర్శిటి వాళ్ళు. దాంతో లెక్చరరు ఉద్యోగం ఆమడ దూరం పారిపోయింది.

పొట్టకూటికి ఏదో ఒకటిలే అని బతకలేక బడిపంతులన్నట్లు ట్రైనింగయి ఓ ప్రైవేటు ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఇమిడిపోయాను.

ఎంత చెడ్డా ఎం.ఎ. డిగ్రీ హోల్డరుని కదా, నా చదువుకి తగ్గట్టుగా పదో తరగతికి వెయ్యాలి కదా. అలాంటిది నన్నో అమాయకుడిలా భావించి ‘నీ లెవలుకి ఇది చాల్లే’ అన్నట్టు అట్టడుగు క్లాసైన ఆరో తరగతికి వేయడమేమిటి? ఉడుకుమోతుతనంతో పాటు ప్రధానోపాధ్యాయుడి మీద కోపం కూడా వచ్చింది. కాని అప్పటికేం చేయలేక పేదవాడి కోపం పెదవికి చేటన్నట్టు ఆరో తరగతి వైపు నడిచాను.

క్లాసుకెళ్ళగానే నా ఇంగ్లీషు ప్రతాపమంతా పిల్లలమీద చూపించాను. పిల్లలంతా గట్టుమీద పడ్డ చేపల్లా ఏమీ అర్థంకాక తెల్లబోతూ బిక్కమొహాలు వేసుకుని చూస్తుండిపోయారు. అత్తమీద కోపం దుత్తమీద అన్నట్టు ప్రధానోపాధ్యాయుడి మీద కోపం అభం శుభం ఎరుగని విద్యార్థుల మీద చూపడం ఎంతవరకు సబబు అని వెంటనే పశ్చాత్తాపపడి వాళ్ళ లెవలుకి దిగి పాఠం చెప్పడం మొదలుపెట్టాను. వాళ్ళతో సరదాగా మాటాడుతూ, చిన్న చిన్న పదాలతో పాఠం చెప్పడం ప్రారంభించాను. కొంతమంది పిల్లలకైతే అక్షరాలు కూడా రావని తెలిసి నేర్పడం మొదలుపెట్టాను. విద్యార్థుల లేత బుగ్గల మీద చిరునవ్వులు మెరిశాయి. ప్రధానోపాధ్యాయుడి మీద ఏర్పడ్డ నా అకారణ కోపం కూడా మెల్లగా చల్లారింది.

స్కూల్లో చేరి ఇంకా మూడు నెలలు కూడా కాలేదు. ఇంతలో పిడుగులాంటి వార్త. స్కూల్లో పర్యవేక్షణ నిమిత్తం స్కూళ్ళ ఇనస్పెక్టరు వస్తున్నాడట. గుండె గుభేలుమంది. ఇనస్పెక్షనులో పాఠాలు ఎలా చెబుతానో ఏమో? అసలే క్లాసులో మొద్దుపిల్లలు ఎక్కువ. అసలే పరాయిభాష. తెలుగే సరిగా రాని పసిపిల్లలకు ఇంగ్లీషు ఎలా పట్టుబడుతుంది? వెళుతూ వెళుతూ ఇంగ్లీషువాడు మన నెత్తిన వాడి భాష రుద్ది మరీ పోయాడని కసిగా వాడి భాషలోనే తిట్టుకున్నాను.

ఇనస్పెక్షను ఎదుర్కోడం ఇదే ప్రథమం కాబట్టి ప్రధానోపాధ్యాయుడితో చర్చించాను. ఏం ఫరవాలేదనీ, ధైర్యంగా వుండమని కొన్ని సూచనలు చేశారు. కొన్ని చిట్కాలు కూడా చెప్పారు.

ఇనస్పెక్షను రోజు రానే వచ్చింది. ఉపాధ్యాయులందర్నీ ఇనస్పెక్టరుగారికి పరిచయం చేశారు మా ప్రధానోపాధ్యాయుడు. ఏమనుకున్నాడో ఏమో “ముందు ఇతని క్లాసు చూద్దాం పదండి” నన్ను చూపిస్తూ అన్నాడు ఇనస్పెక్టరు. పై ప్రాణాలు పైకే పోయాయి నాకు. కాళ్ళలో వణుకు స్పష్టంగా తెలుస్తోంది. అయినా తప్పదు కదా. వారం పదిరోజుల పాటు పాఠం ప్రిపేరయ్యాను. లెసను ప్లాను రాశాను. అయినా ఏదో భయం.

పాఠం చెప్పడం ప్రారంభించాను. తెలివైన విద్యార్థులను ఎంపిక చేసి వాళ్ళ చేత చదివించాను. వాళ్ళనే ప్రశ్నలు వేశాను. టకటకా జవాబులు చెప్పేస్తున్నారు.

హమ్మయ్య! అని కాస్త ఊపిరి తీసుకునే సమయంలో నన్ను ఆగమని సంజ్ఞలు చేశాడు ఇనస్పెక్టరు. ఆయన తెలివైనవాడు, అనుభవజ్ఞుడు. ఆయన ముందు నా తెలివెంత? ఆయన అనుభవమంత లేదు నా వయసు. తెలివైన వాళ్లని మాత్రమే ప్రశ్నలు వేస్తున్నానని పసిగట్టేశాడు. ఒకరిద్దరు విద్యార్ధులను లేపి పాఠం చదవమన్నాడు. తర్వాత మరో కుర్రాడ్ని లేపాడు. పాఠంలో స్టేషన్ అనే పదం వచ్చింది. వాడు సరిగ్గా చదవలేకపోయాడు. ‘టేషన్’ అన్నాడు. క్లాసంతా గొల్లున నవ్వారు. ఇనస్పెక్టరు గారే రెండుసార్లు ఉచ్చరించి మళ్ళీ చదవమన్నారు. అయినా వాడు ‘టేషన్’ వదల్లేదు.

నాకేసి గుర్రుగా చూశాడు ఇనస్పెక్టరు. ఎమ్.ఎ చదివావు ఇలాగేనా చెప్పేది అన్నట్టు చూశాడు. ఇందులో నా తప్పేముందో నాకర్థం కాలేదు. తను రెండుసార్లు ఉచ్చరించినా వాడు తప్పుగానే చదివాడు కదా. పూర్తిగా నా తప్పే అయినట్టు సోడాబుడ్డి కళ్ళద్దాలలోంచి కొరకొరా చూసి విసవిసా వెళ్ళిపోయాడు. ఆ వెనుకే ప్రధానోపాధ్యాయుడు కూడా గుడ్లెర్రచేస్తూ నిష్క్రమించాడు.

నాకేం చేయాలో పాలుపోలేదు. అయిపోయింది నా పని. బ్యాడ్ రిమార్క్ రాసేస్తాడు. ఉద్యోగం ఊడ్డం ఖాయం. నాకు ముచ్చెమటలు పోసేశాయి. నెత్తిమీద చేతులు పెట్టుకుని కుర్చీలో కూలబడ్డాను. ఒకటే తలనొప్పి. ఎక్కడినుంచో రేడియో ప్రకటన ఒకటి గాలి ద్వారా వచ్చి నా చెవిని సోకింది. వెంటనే జేబులోంచి శారిడాన్ మాత్ర తీసి గొంతులో వేసి మింగాను. ఇంతలో బెల్ కొట్టారు. క్లాసులోంచి బయటపడ్డాను. ఆ రకంగా ఇనస్పెక్షను ముచ్చట తీరింది.

రెండురోజుల నుంచి కామేశం అనే విద్యార్థి డల్‍గా వుండటం గమనించాను. వాణ్ని దగ్గరకు పిలిచి “ఏరా అలా వున్నావు?” అని అడిగాను అనునయంగా.

“ఇనస్పెక్టరు గారు వచ్చినప్పుడు అందరూ నన్ను చూసి నవ్వేరు కదండి” మళ్ళీ ఏడుపు మొహం పెట్టాడు కామేశం. అప్పుడు నాకో విషయం గుర్తుకొచ్చింది. మా తాతయ్య ‘స్కూలు’ అనేమాట సరిగ్గా పలుకలేకపోయేవాడు. “ఒరేయ్ ‘ఇస్కూలు’కి టైమైంది లేవరా” అంటూ నన్ను లేపుతూండేవాడు. ఆ విషయం గుర్తొచ్చి కామేశాన్ని సముదాయిస్తూ ఇలా అన్నాను. “ఒరేయ్ కామేశం! నువ్వు ఆ ఒక్కమాటే కదా సరిగా పలకలేకపోతున్నావు. కొందరు కొన్ని అక్షరాలు సరిగ్గా పలకలేరు. అంతమాత్రం చేత నువ్వు బాధపడక్కర్లేదు. కొన్నాళ్ళుపోతే అదే సర్దుకుంటుంది. బాగా చదువుకో. మంచి ఉద్యోగం వస్తుంది”

ఇనస్పెక్షను రిపోర్టు వచ్చింది. నా అదృష్టం కొద్ది బ్యాడ్ రిమార్కు రాయలేదు. మనసులోనే ఇనస్పెక్టరు గారికి కృతజ్ఞతలు తెలుపుకున్నాను.

***

రిటైరై రెండేళ్ళయింది. ఓ రోజు మా అమ్మాయివాళ్ళ అత్తవారి ఊరు వెళదామని రైలెక్కాను. అదో పల్లెటూరు. గంటన్నర ప్రయాణం.

పచ్చటి పొలాలు చీల్చుకుంటూ రైలు దూసుకుపోతోంది. కిటికీ లోంచి పైరుగాలి వంటికి ఆహ్లాదకరంగా తగులుతోంది. రైలు లయబద్ధంగా ఊగుతూ గమ్యాన్ని చేరుకుందుకు ఉబలాటపడుతోంది.

ఇంతలో నేను దిగవలసిన స్టేషను వచ్చేసింది. పల్లెటూరు వేగంతో ఎక్కేవాళ్ళు, దిగేవాళ్ళు తక్కువ. ఎక్కువసేపు ఆగదు బండి. గబగబా దిగాను. గేటు దగ్గరకు చేరుకుని జేబులోంచి టికెట్ తీసి టికెట్లు కలెక్ట్ చేస్తున్న వ్యక్తి చేతిలో పెట్టాను. అతను నా చేతిని వదలకుండా “ఇలా రండి’ అంటూ చేయి పట్టుకుని స్టేషను మాస్టరు వుండే గదిలోకి తీసుకువెళ్ళారు. కంగారుపడుతూ యాంత్రికంగా అతనితో వెళ్ళాను. ఇదేమిటి ఇలా లాక్కెడుతున్నాడు? నాకేమీ అర్థం కాలేదు.

“కూర్చోండి సార్” కుర్చీ చూపించాడు. సందేహిస్తూ కూర్చున్నాను. నేనేదో అడుగుదామని పెదవి విప్పేలోపు “మీరు చలమయ్య మాస్టారు కదూ?” అన్నాడు.

“అవును” కాస్త స్థిమితపడ్డాను.

“నేను మీ శిష్యుణ్నండి, మాకు ఇంగ్లీషు చెప్పేవారు. ఇక్కడ ‘టేషను’ మాస్టరుగా పనిచేస్తున్నాను. గుర్తున్నానా సార్” పెదవుల మీద చిరునవ్వు.

నాలో సంభ్రమాశ్చర్యాలు.

“మీరు… నువ్వు కామేశానివా?” నా మాటలు తడబడుతున్నాయి. “అవును సార్. ఆ రోజు మీరు చెప్పిన ధైర్యవచనాలే నన్నింత వాణ్ని చేశాయి. నాలో ఆత్మన్యూనతా భావం పోయింది. మీ రుణం ఎప్పటికీ మర్చిపోలేను” కాళ్ళకు నమస్కారం చేయడానికి వంగుతున్న కామేశాన్ని లేపి హృదయానికి హత్తుకున్నాను.

Exit mobile version