Site icon Sanchika

తీన్ దేవియా..

“బ్రహ్మన్నా!.. నమస్కారం..” నవ్వుతూ వరండాలో ప్రవేశించాడు బలరామశాస్త్రి.

“రా.. రా.. బలరామా!.. రా!..” బ్రహ్మన్నగారి ఆహ్వానం..

బ్రహ్మన్న.. ఎదురుగా వున్న కుర్చీని చూపుతూ.. “కూర్చో బలరామా!..” చిరునవ్వుతో చెప్పాడు.

ఆ ఇరువురూ.. ఇరుగు పొరుగు వారు.. మంచి స్నేహం..

బ్రహ్మన్నగారికి ముగ్గురు కుమార్తెలు.. లలిత.. పద్మిని.. రాగిణి.

లలిత లాయర్.. పద్మిని డాక్టర్.. రాగిణి పోలీస్ ఇనస్పెక్టర్. రాగిణి వయస్సు ఇరవైమూడు, పద్మిని వయస్సు ఇరవై ఐదు.. లలిత వయస్సు ఇరవై ఏడు.. ముగ్గురికీ వివాహం కాలేదు. బ్రహ్మన్నగారికి వున్న సమస్య కుమార్తెల వివాహం కాకపోవడమే..

“బావా!..

“చెప్పు బలరాం!..’

“ఇది నేను మామూలుగా ఐదేళ్లనుంచి పాడే పాత పాటే..”

“పాడు.. వింటాను..” స్వచ్ఛమైన చిరునవ్వుతో చెప్పాడు బ్రహ్మన్న..

“బావా!.. నీవు నిజంగా చాలా గ్రేట్.. ముఖంలో ఎలాంటి బాధ లేకుండా ఎంత ఆనందంగా నవ్వుతున్నావయ్యా!.. నీకు నీవే సాటి..”

“ఈ పాత పొగడ్త నాకు వద్దు. విషయాన్ని చెప్పు!..’

“తప్పుగా అనుకోకూడదు సుమా!..”

“నీవు ఒప్పు చెబితే నేను తప్పుగా ఎలా అనుకొంటాను?..”

బలరామశాస్త్రి తల వేలాడేశాడు.. ఆలోచనలో పడ్డాడు.

‘విషయాన్ని బ్రహ్మన్నకు చెబితే ఎలా దాన్ని స్వీకరిస్తాడు.. ఏది ఏమైనా.. నేను వారి శ్రేయోభిలాషిని.. చూచినదాన్ని చూచినట్లుగానే వారికి చెప్పడం నా ధర్మం..’

బ్రహ్మన్న బలరామశాస్త్రి ముఖంలోకి చూచాడు..

“ఏమిటి బావా!.. దీర్ఘాలోచన!..”

బలరామశాస్త్రి తొట్రుపాటుతో.. “చెబుతున్నా!..”

“ఆ.. చెప్పు బావా!..”

“మన.. రాగిణి!.. ఈరోజు మఫ్టీలో వెళ్లిందా!..”

“అవును..”

“నేను చూచాను..”

“చూచి వుండవచ్చు.. ఆ పైన!..”

“రాగిణి ప్రక్కన ఓ అబ్బాయి..

“వీరాంజనేయులు..” బలరామశాస్త్రి పూర్తి చేయక ముందే.. నవ్వుతూ చెప్పేశాడు బ్రహ్మన్న..

“నీకు తెలుసా!..”

“ఆ.. అమ్మాయి చెప్పింది..”

“ఏం చెప్పింది?..”

“అతను తనని పెండ్లి చేసుకొంటానని చెప్పినట్లు చెప్పింది..”

“అంటే!..”

“లవ్!..” నవ్వాడు బ్రహ్మన్న.

“బావా!..”

“అడుగు..”

“రాగిణి నిర్ణయం.. నీకు సమ్మతమేనా?..”

“ఆ.. ఆయన పోలీస్.. ఈమె పోలీస్.. చూచేదానికి ఈడు జోడు బాగున్నారు. పైన ఆయన మన కులస్థుడే..”

“అంటే.. నీవు ఓకే చేశావన్న మాట..”

“నేను చేశాను.. కానీ రాగిణి చేయలేదు..”

“ఏంటీ?..” దీర్ఘం తీస్తూ ఆశ్చర్యంతో బ్రహ్మన్న ముఖంలోకి చూచాడు బలరామశాస్త్రి.

“అవును బావా!.. తన ఇద్దరు అక్కలకు వివాహం అయిన తర్వాతే.. తన వివాహం అని అతనితో చెప్పింది..”

“గుడ్.. వెరీగుడ్!.. రాగిణీ నిర్ణయం గ్రేట్ బావా!..” జేబులోంచి ఓ ఫొటోను తీసి..

“బావా!.. ఈ ఫొటోను చూడు..” బ్రహ్మన్నకు అందించాడు బలరామశాస్త్రి.

కొన్ని సెకండ్లు ఆ ఫొటోను చూచి బ్రహ్మన్న..

“లక్షణంగా వున్నాడు.. బావా!.. ఎవరీ అబ్బాయి.. ఏం చేస్తున్నాడు?..”

“లాయర్!..”

అదే సమయానికి డ్యూటీ ముగించుకొని రాగిణి వచ్చింది.

“వాట్ అంకుల్!.. ఎలా వున్నారు?..”

“అమ్మా!.. రాగిణీ!.. నేను బాగున్నాను.. నీవు తల్లీ ..” చిరునవ్వుతో అడిగాడు బలరామశాస్త్రి.

రాగిణి తండ్రి చేతిలోని ఫొటోను చూచింది.

“నాన్నా!.. ఎవరిదా ఫొటో?..”

“అమ్మా!.. దీన్ని బలరామ్ ఇచ్చాడు.. చూడు..” రాగిణికి అందించాడు బ్రహ్మన్న.

కొన్ని క్షణాలు చూచి..

“నాన్నా!.. ఇతను లాయర్.. సైకిల్‍పై కోర్టుకు వెళుతుంటాడు.”

బలరామశాస్త్రి ఆశ్చర్యంగా రాగిణి ముఖంలోకి చూచాడు.

“తల్లీ! ఈ అబ్బాయి నీకు తెలుసా!..”

“చూచాను.. కానీ మాట్లాడలేదు. మీరిద్దరూ చూస్తున్నారు కాబట్టి.. వివరాలు సేకరించి మీకు చెబుతాను..” ఫొటో తండ్రికి అందించి ఇంట్లోకి వెళ్లిపోయింది.

“బావా!..”

“చెప్పు..”

“మన రాగిణి.. అతని పుట్టుపూర్వోత్తరాలు తెలిసికొంటుంది. మనకు తగునా.. తగదా.. అనే విషయాన్ని తేల్చేస్తుంది..” నవ్వాడు బ్రహ్మన్న..

మిత్రుని ఆనందంలో బలరామశాస్త్రిగారు పాలుపంచుకొన్నారు.

***

రాఘవ.. కొత్త స్కూటర్‍పై వేగంగా సిగ్నల్ దాటబోయి.. సిగ్నల్ పడటంతోనే.. ఆగి స్కూటర‌‍ను వెనక్కు జరిపాడు. రోడ్డు మధ్యన వున్న పోలీస్ బూ‍త్‍లో వున్న రాగిణి రాఘవను చూచింది.

స్టేజీ దిగి.. అతన్ని సమీపించింది.

“ఏయ్.. మిస్టర్!.. స్కూటర్ క్రొత్తదా!..”

“అవునండి..”

“సిగ్నల్ చూచుకొని కదా తోలాల్సింది!..”

“చూచాను కాబట్టేగా.. ఆగానండీ!..”

“మీ పేరు!..”

“రాఘవరావు..”

“ఏం చేస్తుంటారు..”

“అది మీకు అవసరమా!..”

“పోలీస్.. అడిగిన దానికి జవాబు చెప్పండి!..”

“లాయర్!..”

“ఓహో! బాగా వాదిస్తారా!..” వ్యంగ్యంగా నవ్వుతూ అడిగింది.

“మీకేదైనా కేస్ వుందా!..” జేబులోంచి తన విజిటింగ్ కార్డు తీసి రాగిణికి అందించాడు. సిగ్నల్ క్లియర్ అయింది. గ్రీన్ లైట్ వెలిగింది.

“అవసరం అయితే ఆ అడ్రస్‍కు వచ్చి నన్ను కలవండి..” స్కూటర్‍పై రాకెట్‍లా ముందుకు దూసుకొని పోయాడు రాఘవ.

రాగిణి వెళుతున్న రాఘవను విచిత్రంగా చూచింది.

‘ఆ.. మనిషి అందగాడే కాకుండా.. మంచి మాటకారి.. పద్మిని అక్కయ్యకు తగిన జోడి. సాయంత్రం ఫొటోను అక్కయ్యకు చూపి.. తన నిర్ణయాన్ని తెలిసికోవాలి..’

‘అక్క డాక్టర్ కదా!.. ఒకవేళ తన తోటి కొలీగ్ ఏమైనా పరిచయం.. ప్రణయం.. సాగించిందో ఏమో అడగాలి..’ ఫోన్ చేసింది రాగిణి అక్క పద్మినికి..

“చిన్నీ.. పనిలో వున్నాను.. సాయంత్రం మాట్లాడుకొందాం..” ఫోన్ కట్చేసింది పద్మిని.

***

‘అమ్మా!..”

“ఏం నాన్నా!..”

“ఈ ఫొటోను చూడమ్మా!..”

పద్మిని ఫొటోను అందుకొంది.

“పేరు రాఘవ. లాయర్.. తల్లిదండ్రులకు అతను ఒక్కడే.. మన బలరామశాస్త్రికి బాగా తెలిసిన వారు. తండ్రిగారూ కూడ లాయరే. తల్లి హౌస్ వైఫ్. మంచి సంబంధం..”

“అబ్బాయిని గురించి రాగిణి చెప్పింది నాన్నా!..”

“ఏం చెప్పిందమ్మా!..”

“చాలా మంచివాడని చెప్పింది నాన్నా!..” హాల్లోకి వస్తూ రాగిణి చెప్పి నవ్వింది.

ఆమె మాటలకు ఇరువురూ నవ్వుకున్నారు.

బలరామశాస్త్రి వచ్చాడు. వారి చివరి మాటలను విన్నాడు.

“బావా!.. పద్మినికి రాఘవ నచ్చాడా!..” ఆత్రంగా అడిగాడు బలరామశాస్త్రి.

“ఇంకా లేదు. ఇంటర్వ్యూ చేయాలి!..” చిరునవ్వుతో చెప్పింది రాగిణి. బ్రహ్మన్న సోదరి విధవరాలు.. అందరికీ కాఫీలు అందించింది.

“అమ్మా! రాగిణీ!..”

“వాట్ అంకుల్!..”

“ఈ ఫొటోలో ఉన్న అబ్బాయిని ఎక్కడన్నా చూచావా?..”

ఆ ఇంట్లో రాగిణి మాట ఫైనల్ అని బలరామశాస్త్రికి తెలుసు. కారణం.. నిర్మొహమాటంగా.. సంకోచం లేకుండా నిజాన్ని ధర్మాన్ని బల్లగుద్దిచెప్పే మనస్తత్వం ఆమెది. ఎవరికీ భయపడదు. తనకు నచ్చిన పనిని చేసేదానికి ఎవరో.. ఏదో.. అనుకొంటారని వెనుకంజవేయదు. అలాంటి మనస్తత్వం కారణంగానే పట్టుబట్టి ఐ.సి.యస్. చదివింది.

తన చేతిలోని ఫొటోను బలరామశాస్త్రికి అందిస్తూ.. “వీరిని గురించి తెలియదు.. తెలిసికొంటాను.. మీకు తెలిసిన.. వివరాలు చెప్పండి..” అంది రాగిణి.

“అమ్మా!.. ఈయన ప్రొఫెసర్ రవీంద్ర.. వీరికి మీలాగే ముగ్గురు చెల్లెళ్లు. వారి ముగ్గురికీ వివాహాలు జరిపించి ప్రస్తుతానికి తాను వివాహం చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాడు. మనిషిది చాలా గొప్ప వ్యక్తిత్వం.. తండ్రి లేడు.. తల్లి వుంది.. అరవై సంవత్సరాలు.. లలితకు ఇది చక్కటి సంబంధం..” అంటూ తన చేతిలోని ఫొటోను బ్రహ్మన్న చేతికి అందించాడు..

సృష్టిలో అతి విలువైనది స్నేహం.. అభిమానం.. ఆ రెండు కుటుంబ సభ్యుల మధ్యన.. ఒకే కులం కాకపోయినా పరస్పరం ఎంతో ఆదరం.. అభిమానం..

బ్రహ్మన్నగారి భార్య విజయగారు రెండు సంవత్సరాల క్రిందట హృద్రోగంతో మరణించారు. వారి సోదరి రత్నమ్మ.. చిన్న వయస్సులోనే భర్త పోయిన కారణంగా ఆ యింట్లో వుండేది. విజయగారు గతించిన తర్వాత రత్నమ్మ ఆ ముగ్గురు పిల్లలకు తల్లితో సమానమనే చెప్పాలి.

బలరామశాస్త్రి.. పురోహితుడు.. రామాలయ పూజారి.. ఆ గ్రామంలోని వారందరి క్షేమం కోరేవాడు. వారి సతీమణి ఈశ్వరి.. వారికి సంతానం లేదు.. పక్కింటి స్నేహితుడు బ్రహ్మన్న పిల్లలనే తన పిల్లలుగా భావిస్తారు ఆ దంపతులు.. చదువులో బాగా చురుకు.. క్లాస్ ఫస్టు వస్తున్నారు ఆ ముగ్గురు అక్కచెల్లెళ్లు. ఆ కారణంగా వున్న భూమిలో ఒకటికి రెండు మార్లు కొంత అమ్మి ఆ ముగ్గురినీ వారి ఇష్టానుసారం చదివించాడు బ్రహ్మన్న.. ముగ్గురూ చదివి ప్రయోజకులైనారు.

ప్రస్తుతంలో వారికి వివాహాలు జరపాలి. మిత్రులు ఇరువురూ కలసి మాట్లాడుకొనేది, చేసేది ఆ ప్రయత్నమే. పెరిగి పెద్దవారై యుక్తాయుక్తాన్ని ఎరిగిన పిల్లలను బలవంతపరచి వారికి అయిష్టంగా వివాహాలు జరపడం బ్రహ్మన్నగారికి ఇష్టం లేదు. వచ్చిన సంబంధాలను గురించి పిల్లలతో చర్చించి వారి ఇష్టానుసారం చేస్తాడు బ్రహ్మన్న.. ఇంతవరకు వారికి ఏ సంబంధం నచ్చలేదు..

***

బలరామశాస్త్రి రాత్రి ఏడున్నరకు బ్రహ్మన్న ఇంటికి వచ్చాడు. “రా బావా!.. కూర్చో!..” అన్నాడు బ్రహ్మన్న.

పిల్లలు ముగ్గురూ శాస్త్రిగారి రాకకు ఎదురు చూస్తున్నారు. బలరామశాస్త్రి కూర్చున్నాడు. బ్రహ్మన్న ముఖంలోకి చూచాడు.

‘ఏమిటి బావా.. విషయం?..”

“బావా!.. మొగపెండ్లి వాళ్లు ఫోన్ చేసారు.. వారు వచ్చి పిల్లను చూచుకోవచ్చునా అని!.. దానికి నీ సమాధానం ఏమిటి?..” ముగ్గురూ వరండాలోకి వచ్చారు..

వారిని చూచి ఆశ్చర్యపోయాడు బలరామశాస్త్రి.. తేరుకొని చిరునవ్వుతో..

“అమ్మలూ!.. వచ్చారా!.. నేను చెప్పింది విన్నారుగా!.. మీ నిర్ణయం ఏమిటి తల్లీ!..” ప్రాథేయపూర్వకంగా అడిగాడు.

“ఎల్లుండి ఆదివారం.. ముగ్గురం ఇంట్లోనే వుంటాం.. ఉదయం ఎనిమిది గంటలకు ఒకరు.. రెండు గంటలకు రెండవ వారు.. సాయంత్రం ఆరున్నరకు మూడవ సంబంధం వారిని రమ్మనండి అంకుల్!..” నవ్వుతూ చెప్పింది రాగిణి.

“ఓకే.. అమ్మా!.. ఇది మీ ముగ్గురి నిర్ణయం కదా!..”

“అవును అంకుల్..” ముగ్గురూ ఏక కంఠంతో చెప్పారు. చిరునవ్వుతో లోనికి వెళ్లిపోయారు.

“బావా!..”

“చెప్పు బావా!..”

“నీవు చాలా అదృష్టవంతుడివయ్యా!..’

“ఏం.. ఎలా చెప్పగలవు?..” నవ్వుతూ అడిగాడు బ్రహ్మన్న..

“నీ బిడ్డలు ముగ్గురూ.. ఓకే మాట.. ఓకే బాట.. చిన్న వయస్సు నుండి చూస్తున్నాను..”

“అదంతా వాళ్ల అమ్మ పెంపకం!.. మమ్మల్ని వదిలేసి తాను వెళ్లిపోయింది..” విచారంగా భార్యను తలచుకొంటూ చెప్పాడు బ్రహ్మన్న.

“వారికి రాగిణి చెప్పిన ప్రకారమే తెలియచేస్తాను. ఈశ్వరిని ఉదయాన్నే పంపుతాను.. పిల్లలకు సాయంగా!..” కుర్చీలోంచి లేచాడు బలరామశాస్త్రి.

మిత్రులిరువురూ వీధివాకిటకు వచ్చారు. బలరామశాస్త్రి తన ఇంట్లోకి ప్రవేశించాడు.

***

ఈశ్వరి.. లలితను అందంగా అలంకరించింది. రత్నమ్మ ఫలహారం.. కాఫీ.. రెడీ చేసింది. ప్రొఫెసర్ రవీంద్ర.. వారి తల్లి ఉదయం ఏడూ యాభైకల్లా కార్లో వచ్చి దిగారు.

బ్రహ్మన్న బలరామశాస్త్రిలు సగౌరవంగా వారిని లోనికి ఆహ్వానించారు. తల్లి కొడుకు వచ్చి హాల్లో కూర్చున్నారు.

ఈశ్వరి వారికి టిఫిన్ అందించింది. వారు ఆరగించారు. లలిత ఆ ఇరువురికీ కాఫీ అందించింది. ప్రొఫెసర్ రవీంద్ర.. లలితను చూచాడు. అతని తల్లికి లలిత బాగా నచ్చింది. కాఫీ అందిస్తూ లలిత కూడా రవీంద్రను ఓరకంట చూచింది. ఆమె మనస్సుకూ తృప్తి.

లోనికి వెళ్లగానే.. పద్మిని, రాగిణీలు.. లలిత అభిప్రాయాన్ని అడిగారు. మర్మగర్భితంగా లలిత.. “నాన్నగారి ఇష్టమే నా యిష్టం..” చిరునవ్వుతో క్లుప్తంగా జవాబు చెప్పింది లలిత.

“అమ్మాయితో ఏమైనా మాట్లాడుతారా!..” అడిగాడు బ్రహ్మన్న..

అవునన్నట్టు తల ఆడించాడు రవీంద్ర..

“వెళ్లండి బాబూ!..” గది వైపుకు చేతిని చూపించాడు బ్రహ్మన్న.

రవీంద్ర లేచి గదిలోకి వెళ్లాడు.

గదిలో లలిత కూర్చొని వుంది. రవీంద్రను చూడటంతోనే లేచి నిలబడింది. రవీంద్ర గొంతు సవరించాడు.

లలిత అతని ముఖంలోకి చూచింది.

“నేను మీకు నచ్చానా!.. ” అడిగాడు రవీంద్ర.

“కూర్చోండి..”

రవీంద్ర కూర్చున్నాడు.. “నా ప్రశ్నకు మీ జవాబు?..” అడిగాడు.

“మీకు నేను నచ్చానా?..”

“ప్రశ్నకు ప్రశ్న జవాబు కాదుగా!..”

“రెండు ప్రశ్నలు ఒకటే అయినపుడు.. జవాబు ఒకటేగా!..”

“నాకు వున్నది తల్లి.. మీకు వున్నది తండ్రి.. నా దృష్టిలో ఇరువురూ ఒకటే!..”

సంతోషంగా నవ్వింది లలిత.

“థాంక్యూ.. చాలా ఆనందం..” నవ్వుతూ గదినుంచి బయటకు నడిచాడు రవీంద్ర.

***

సమయం.. మధ్యాహ్నం రెండు గంటలు..

పద్మిని పెండ్లికొడుకు వారి పరివారం రాక కోసం.. బ్రహ్మన్న.. బలరామశాస్త్రి.. ఎదురుచూస్తున్నారు. రాఘవ అడ్వకేట్.. వారి నాన్నగారు రామచంద్ర..

డెబ్బై అయిదేళ్ల ఆ రామచంద్ర సీనియర్ అడ్వకేట్ గారు.. స్కూటర్‍పై రావడాన్ని చూచిన వారంతా ఆశ్చర్యపోయారు. వారికి.. బ్రహ్మన్న.. బలరామశాస్త్రి నమస్కరించారు.

“ఆ.. స్వామీ! బలరామశాస్త్రి గారూ!.. మావాడు ఒక ముఖ్యమైన పనిమీద బయటికి వెళ్లాడు. పెళ్లిచూపులకు నేను వచ్చాను. మావాడు చెప్పిన మాట ప్రకారం!..” నవ్వాడు రామచంద్ర.

బ్రహ్మన్న.. ఆశ్చర్యంతో బలరామశాస్త్రి ముఖంలోకి చూచాడు.

ఈశ్వరి బలరామశాస్త్రిని పిలిచింది.

“ఏమిటండీ.. ఆయన పెండ్లి చూపులకు నేను వచ్చానంటున్నాడు!..” ఆశ్చర్యంతో అడిగింది.

వారి ముఖాల్లో కళావిహీనాన్ని చూచిన రామచంద్రగారు నవ్వుతూ.. “నేను నా కోడలిని చూడాలని వచ్చాను. నేను చూచి ఓకే చేస్తే నా కొడుక్కు ఓకే..” నవ్వుతూ చెప్పి కుర్చీలో కూర్చున్నాడు.

“నేను వెంటనే వెళ్లి పోవాలి.. క్లయింట్‍తో అపాయింట్మెంట్ వుంది.. కాఫీ కప్పును చేత పట్టుకొని నా కోడలిని రమ్మనండి.. ఆమెను చూచి.. కాపీ త్రాగి నేను వెళ్లిపోతాను..” అన్నాడు రామచంద్ర.

పద్మిని కాఫీ గ్లాసుతో వచ్చి నవ్వుతూ రామచంద్ర గారికి అందించింది.

“అమ్మా! నీవు డాక్టర్ కదూ..”

‘అవును..’ అన్నట్టు తల ఆడించింది పద్మిని.

“పేరేమిటమ్మా?..”

“పద్మినీ..”

కాఫీని ఆనందంగా త్రాగాడు రామచంద్ర. కుర్చీ నుంచి లేచి..

“బావగారూ!.. అమ్మాయి నాకు.. మావాడికి నచ్చింది.. ముహూర్తాలు పెట్టించండి.. వస్తాను..” వేగంగా వెళ్లి స్కూటరు ఎక్కి వెళ్లిపోయాడు రామచంద్ర.

అందరి వదనాల్లో.. ఆనందం.

“గొప్ప సంస్కారవంతుడు.. న్యాయవాదిగా చాలా మంచి పేరు..” ఆనందంగా చెప్పాడు బలరామశాస్త్రి. అందరూ ఆనందంగా నవ్వుకొన్నారు.

సాయంత్రం.. ఆరున్నర.. రాగిణి పెండ్లివారి రాక కోసం బలరామశాస్త్రి.. బ్రహ్మన్న.. వరండాలో ఎదురు చూస్తున్నారు..

సమయం.. ఎనిమిది..

ముగ్గురు అక్కా చెల్లిళ్లు వరండాలోకి వచ్చారు. వారి వెనకాలే ఈశ్వరి రత్నమ్మ వచ్చారు.

మగవారిరువురూ వారి వైపు చూచారు.

“మన రాగిణి ఏదో చెబుతుందట వినండి..” అంది ఈశ్వరి. ఆమె స్కూలు టీచర్.. వీరు ముగ్గురూ ఆమె దగ్గర చదువుకున్నవారే..

“అమ్మా రాగిణీ!.. చెప్పరా!.. నీ నిర్ణయం..”

“నాన్నా!.. మామయ్యా!.. మా ముగ్గురి వివాహాల కోసం మీరు చేసిన ప్రయత్నాలు.. విఫలాలు.. మీరు పడ్డ శ్రమ.. బాధ.. మా ముగ్గురికీ తెలుసు.”

“మామయ్యా!.. ప్రస్తుతం మీరు చేసిన ప్రయత్నం.. ఇరుపక్షాలకు సమ్మతం.. ముందు అక్కల ఇరువురి వివాహలకు ముహూర్తాలు నిర్ణయించండి.. ముగ్గురం ఒక్కసారి ఇంట్లోనుంచి వెళ్లిపోతే.. నాన్నగారు ఒంటరిగా బాధతో.. దిగులు పడిపోతారు. కాబట్టి నా వివాహం రెండు సంవత్సరాలు వాయిదా.. అంతవరకూ.. అరుగో.. వచ్చారు.. నా వీరాంజనేయులు గారు.. ఆయన అగుతారు. మేమిరువురము మాట్లాడుకొని ఈ నిర్ణయానికి వచ్చాము..” నవ్వుతూ చెప్పింది రాగిణి.

చిరునవ్వుతో డి.యస్.పి. వీరాంజనేయులు వరండాలోకి ప్రవేశించి పెద్దలకు నమస్కరించాడు. లోనికి వెళ్లి కాఫీ తెచ్చి అతనికి అందించింది రాగిణి.

“మీ అమ్మాయిల వివాహాల విషయంలో నావల్ల కాగలిగిన సాయం నేను చేస్తాను.. మామయ్యగారు..” చిరునవ్వుతో వినయంగా చెప్పాడు వీరాంజనేయులు.

లలిత.. పద్మిని.. ఈశ్వరి.. రత్నమ్మ.. వీరాంజనేయులు గారిని వింతగా చూచారు. వారందరినీ పరీక్షగా చూచి.. రాగిణీ ముఖంలోకి చూచి.. కన్నుగీటి.. చేతులు జోడించి అందరికీ నమస్కరించాడు.. వీరాంజనేయులు.

సమాప్తం

Exit mobile version