Site icon Sanchika

చదవదగ్గ మహనీయ వ్యక్తుల పరిచయాలు – తేజోమూర్తులు

[box type=’note’ fontsize=’16’] “చదవదగ్గ మహనీయ వ్యక్తుల పరిచయాలతో కూర్చిన పుస్తకమిది” అంటూ ప్రముఖ కవయిత్రి/రచయిత్రి డా. సి.హెచ్.భవానీ దేవి వెలువరించిన ‘తేజోమూర్తులు’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు అల్లూరి గౌరీలక్ష్మి. [/box]

[dropcap]స్వ[/dropcap]యంగా యాభై పుస్తకాలను రచించిన ప్రముఖ కవయిత్రి/రచయిత్రి డా. సి. భవానీ దేవి గారు, నాలుగున్నర దశాబ్దాల తన సాహితీ రచనా యాత్రలో భాగంగా ఆమె ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా కొంత మంది ప్రముఖులను ప్రత్యక్షంగా ఇంటర్వ్యూలు చేశారు. వాటిని “తేజోమూర్తులు” పుస్తకంగా ఇటీవల తీసుకు వచ్చారు.

వివిధ రంగాల్లో విజయం సాధించిన వ్యక్తులు, వ్యక్తిగతంగా మనసు విప్పి ఇతరులతో పంచుకున్న వారి అనుభవాల విశేషాలపట్ల అందరికీ ఆసక్తి ఉంటుంది. వారు పుట్టి పెరిగిన ప్రాంతం, వారి ఖాతాలో పడిన విజయాలు, వారి జీవిత క్రమం, ఎక్కిన మెట్లూ, వారి కృషి లాంటి ఇతర ప్రత్యేక విషయాలు చదివేవారికి ఉత్సాహం కలిగిస్తాయి. భవానీ దేవి గారు 1980 – 1995 మధ్య కాలంలో వివిధ మాస పక్ష పత్రికల కోసం (వనిత, స్వాతి మాస పత్రిక, అంధ్ర ప్రభ మొ.) స్వయంగా చేసిన పరిచయాలను ఒక హారంలా గుచ్చి గ్రంథస్థం చేసి తన అభిమాన మహానటి సావిత్రి గారికి అంకితం చేసారు.

ఈ పుస్తకంలో సాహిత్య, సినిమా రంగాల్లో కీర్తి గడించిన ప్రఖ్యాత కవులు, రచయితలు, సినీ హీరోలూ, హీరోయిన్లూ, హాస్య నటీనటులు మొదలైన తేజోమూర్తులు సాధించిన గెలుపుల వివరాలున్నాయి. సుదీర్ఘమైన ముఖాముఖీలు కాకుండా సరళంగా ఉన్న ఈ ఇంటర్వ్యూలు క్లుప్తంగా కూడా ఉండడం వల్ల, చదివేటప్పుడు పాఠకులు విసుగు చెందకుండా ఆహ్లాదాన్ని పొందుతారు.

ముందుగా విద్వత్కవయిత్రి, కళా ప్రపూర్ణ, సాహితీ రుద్రమ శ్రీమతి ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ గారి ఇంటర్వ్యూ ఉన్నది. ఈమె తెలుగు సంస్కృత భాషల్లో ప్రావీణ్యాన్ని సంపాదించి అనేక గ్రంథాలు రాసారు. ఆంధ్ర కవయిత్రులు, అఖిలభారత రచయిత్రులు (1961-62లో దేశమంతటా పర్యటించి రాసిన గ్రంథం) ఈమె రచనలలో ప్రఖ్యాతమైనవి. చిన్నతనంలోనే స్వాతంత్ర్య ఉద్యమంలో పాలు పంచుకున్నారు. విద్యావంతులైన స్త్రీల సంఖ్య చాలా తక్కువ ఉన్న రోజులనుండి వారి శాతం నెమ్మదిగా పెరిగి బాల్యవివాహాలవంటి మూఢాచారాలు నుండి బయటపడిన క్రమం ప్రత్యక్షంగా చూసిన ఆమె ఆ విషయమై సంతోషం వ్యక్తం చేసారు. రచనలు కాలక్షేపానికి కాక, వాస్తవ దృక్పధంతో ఉంటూ ధనాశ, స్వార్ధం లేకుండా సామాజిక శ్రేయస్సుకు ఉపయోగపడాలని ఆమె చెప్పారు.

“నేనొక పూలమొక్క కడ నిల్చి” అంటూ సుందర సుకుమార కవితలల్లిన సుకవి కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. విశ్వజనీనమైన కరుణశ్రీ కావ్యం వీరిని నూతన యుగ ప్రవక్తగా నిలిపింది. వీరి కవితా ఖండికల్ని పాడి మరింత ప్రాచుర్యం కల్పించిన వారు ఘంటసాల. ఉదయశ్రీ, విజయశ్రీ లాంటి విఖ్యాత గ్రంథాలతో పాటు బాలబాలికల కోసం ఎన్నో పుస్తకాలు, రేడియో నాటకాలు, సంగీత నాటకాలు, వ్యాసాలు రాసారు శాస్త్రి గారు. వీరి పుష్పవిలాపం, కుంతీకుమారి ప్రసిద్ధి కెక్కినవి, ఇవి ఇంగ్లీషులోకి, హిందీలోకి కూడా అనువదించబడ్డాయి. కవిత్వం అనేది మహా తపస్సు అది విశ్వానికి క్షేమం కలిగించాలని సందేశం ఇచ్చారు అనేక సన్మానాలు, అవార్డులు పొందిన పాపయ్య శాస్త్రి గారు.

అనేక అవార్డులు, బహుమానాల్ని పొందిన జగమెరిగిన మధుర కథకులు మధురాంతకం రాజారామ్ గారు. కధా వస్తువులు తోటి మానవులకి ఇబ్బంది కలగకుండా జెనరలైజ్ చెయ్యడం మంచిదని రచయితలకు సూచన చేసిన వీరు రాసిన కథలన్నీ పాఠకుల మనసులో చెరగని ముద్ర వేసేవే. అనేక కథలు ఇతర భాషల్లోకి అనువదించబడ్డాయి. జీవన వేదనకు పరితృప్తిగా తాము నమ్మిన సత్యాన్ని నిర్భీతిగా రాసిన గోపీచంద్ వంటి వారి స్మారక అవార్డు అందుకోవడం పట్ల సంతృప్తి వ్యక్తం చేసారు మంచికథల మధురాంతకం గారు.

ఇరవై ఐదుకి పైగా కావ్యాలు రాసి ‘మైఖేల్ మధుసూదన్ దత్’ పేరిట జాతీయ అవార్డుతో బాటు అనేక అవార్డులూ, బిరుదులూ అందుకున్న కవి, విమర్శకులు, పాటల రచయిత, వక్త అయిన డా. ఆచార్య తిరుమల గారు సంస్కృతం, హిందీ, ఇంగ్లీష్ భాషలలో ప్రావీణ్యత సంపాదించిన వారు. గొప్ప మానవతా వాది. ఆయన తన మనసులో భావాల్ని పంచుకుంటూ రచన ఉపదేశాత్మకంగా, ప్రజాహితముగా ఉండాలని చెప్పారు.

ప్రేమ్ నగర్, చక్రభమణం లాంటి అద్భుత నవలలు రాసిన అరికెపూడి కోడూరి కౌసల్యాదేవి గారు మాదిరెడ్డి సులోచన అవార్డు అందుకున్న సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సామజిక స్పృహతో సమస్యలు చర్చించి పరిష్కారం చూపే రచనలు రావాలన్నారు. 40 నవలలూ 100 వంద కథలూ రచించిన ఈమె గృహలక్ష్మి స్వర్ణకంకణం సాహిత్య అకాడమీ బెస్ట్ రైటర్ అవార్డుతో బాటు ఇంకా అనేక అవార్డులు పొందారు.

తాను నటించే పాత్రలకు జీవం పోస్తూ క్యారెక్టర్ నటుడుగా పేరెన్నిక గన్న నటులు, మహామంత్రి తిమ్మరుసు వంటి గొప్ప చిత్రంలో నటించిన గుమ్మడి గారు భవానీ గారితో తన మనసులో మాటల్ని పంచుకున్నారు.

హాస్యనటనకు పుట్టిల్లు వంటి పద్మశ్రీ అల్లు రామలింగయ్య గారు 40 సంవత్సరాలు తిరుగులేని హాస్య నటులుగా పేరు గాంచారు. ఆయన జీవితపు లోతులు చూసిన తాత్వికునిగా తన ఆలోచనలు పంచుకున్నారు.

అభినేత్రి కాంచనమాల అవార్డు తీసుకున్న సమయంలో పద్మశ్రీ బి.సరోజాదేవి గారితో మాట్లాడారు భవానీ. హిందీ తెలుగు సినిమాలలో హీరోయిన్‌గా నటించిన, 160 చిత్రాల ఈ అందాల నటి గారి మాతృభాష కన్నడం అట.

ఇంకా వెండితెర రాకుమారి శ్రీమతి కృష్ణకుమారి, మధుర గాయని జిక్కి, కళాప్రపూర్ణ కాంతారావు గారు, ప్రముఖ హాస్యనటి శ్రీమతి రమాప్రభలు ఈ తేజోమూర్తుల సంకలనంలో రికార్డు చేయ బడిన వారిలో ఉన్నారు.

స్వర్గీయ రమణా రెడ్డి అవార్డు అందుకున్న సందర్భంగా, వెయ్యి సినిమాల్లో నటించిన ప్రముఖ కమెడియన్ శ్రీ నగేష్ గారు “విజయం ఆకర్షణని పెంచితే అపజయం అమూల్య పాఠం నేర్పుతుంది” అంటూ తన మదిలోని మాటను చెప్పారాయన.

స్వయంకృషితో జీవితంలో ఉన్నత శిఖరాలధిరోహించిన ఈ ప్రముఖు లందరి పరిచయాలు చదవడం పాఠకులకి స్ఫూర్తిదాయకం, ఇంకా ఆనందదాయకం కూడా. ఈ పుస్తకం లో మాట్లాడిన వారంతా గొప్ప కీర్తి ప్రతిష్టలు గడించినవారే. ఆసక్తి గలవారందరూ చదవదగ్గ మహనీయ వ్యక్తుల పరిచయాలతో కూర్చిన పుస్తకమిది.

***

తేజోమూర్తులు
డా. సిహెచ్. భవానీదేవి
పుటలు: 70,
వెల: ₹ 70/-
ప్రతులకు: హిమబిందు పబ్లికేషన్స్,
102, గగన్ మహల్ అపార్ట్‌మెంట్స్,
దోమలగూడ, హైదరాబాద్ – 500029.
ఫోన్:9866847000
drcbhavanidevi@gmail.com

Exit mobile version