[box type=’note’ fontsize=’16’] “ఆదర్శవాదం, సంస్కరణాభిలాష, బడుగు జీవుల ఆకలి ఆక్రందనలు, నిరుద్యోగుల జీవన పోరాటం ఈ జంట రచయితల కథల్లో కనిపిస్తాయి. వస్తువు ఒకటే అయినప్పటికీ వీటిని కథలుగా మలచడంలో ఇరువురు వేర్వేరు మార్గాలను అనుసరించారు” అని విశ్లేషిస్తున్నారు కె.పి. అశోక్‌కుమార్. [/box]
[dropcap]కొ[/dropcap]లిపాక మధుసూదనరావు, పబ్బరాజు గోపాలరావు గార్లను తెలంగాణ తొలి జంట రచయితలుగా గుర్తించవచ్చును. వీరు కలిసి కథలు రాశారు. విడివిడిగా కథలు రాశారు. వీరు రాసిన కథలను ‘లచ్చి నవ్వింది’ పేరిట 1959లో ఖమ్మంమెట్టు మిత్రమండలి వారు ప్రచురించారు.
మధురకవి బిరుదాంకితులైన కొలిపాక మధుసూదనరావు 7 డిసెంబరు 1936న ఖమ్మం దగ్గరి రఘునాథపాలెంలో జన్మించారు. సంస్కృతాంధ్ర భాషల్లో పాండిత్యం సంపాదించుకున్న వీరు, బాల్యం నుండే ప్రతిభావంతమైన అనేక గద్య, పద్య రచనలు చేసి కీర్తి గడించారు. వీరు “నెమలి వేణుగోపాల శతకం”, “శ్రీనివాస శతకము”లతో పాటు ఆదిశంకరాచార్యుల వారి “శివానందలహరి”కి అత్యద్భుతమైన పద్యానువాదం చేశారు. వీటన్నిటికంటే వీరి రచనలలో మకుటాయమానమైనది “రామాయణ పారిజాత కావ్య” రచన. వీటితో పాటు “హీరాలాల్ మోరియా జీవితం – సాహిత్యం” అనే సంకలానానికి సంపాదకుడిగా, 1976లో “తుణీరం” పేరుతో వెలువరించిన ఖమ్మం జిల్లా కవుల కవితా సంకలనానికి సహ-సంపాదకుడిగా వ్యవహరించారు. ఇంకా, “బృందావని”, “మంజీరాలు” అనే గేయ నాటికలు; “అంతర్వీక్ష” అనే వచన కావ్యం కూడా చెప్పుకోదగినవి.
పబ్బరాజు గోపాలరావు గారు 1928లో ఖమ్మం లోని మామిళ్ళగూడెంలో జన్మించారు. వీరు కథలే కాకుండా గేయాలు కూడా రాశారు. వీరు రాసిన అయిదు కథలతో పాటు కొలిపాక మధుసూదనరావు రాసిన మూడు కథలను కలిపి ‘లచ్చి నవ్వింది‘ పేరుతో సంకలనం వేశారు.
కొలిపాక మధుసూదనరావు కథలు:
వీరు రచించిన “తెగిపోయిన గాలిపటం”లో – పిల్లల పోట్లాటలలో ఒకడు ‘మీ నాన్న అసలు నాన్న కాడ’ని అవహేళన చేయడంతో బాలుడైన సూర్యపతి తట్టుకోలేకపోతాడు. ఇంటికి వచ్చిన సూర్యపతి జ్వరం తెచ్చుకోవడం, తన తండ్రిని సవతి తండ్రిగా భావించడం, అతడు చేసే పనులన్నీ వక్రంగా చూడడం మొదలుపెడతాడు. సూర్యపతి థర్డ్ ఫారం చదవడానికి తండ్రి ఏలురులో వున్న మామయ్య ఇంట్లో దిగబెడతాడు. ఒక రాత్రి మామయ్య ఇంట్లోంచి వెళుతున్న మహిళను వెంబడించగా, ఆమె తానెంతో అభిమానించే సరోజగా గుర్తించి దిగ్భ్రాంతి చెందుతాడు. వాడు దిగులుపడుతున్న విషయమేమిటో తెలుసుకుని సూర్యపతి అమ్మకు మొదటి భర్త చనిపొగా, రెండవ భర్తకు కలిగిన సూర్యపతి ఏడవ నెలలోనే పుట్టడం వలన, ఆ ఊళ్ళో వున్న అమ్మలక్కలు మొదటి భర్త కొడుకేనని గుసగుసలాడుకోవడం వుంది. అది నిజం కాదు. ఇప్పుడున్నతనే నీ తండ్రి అని సరోజ చెప్పినా వినిపించుకోడు. వాడు చెప్పకుండా వెళుతూ, “అక్కా! మంచివాళ్ళనుకున్న మీరంతా చెడిపోయారు. ఇక నాకెవరూ లేరు. నేను వెడుతున్నాను. ఎక్కడికో చెప్పను. నా సందేహాలకు సమాధానాలు దొరికాక, తిరిగి వస్తాను. అప్పటివరకు సెలవు” అని ఉత్తరం రాసి వెళ్ళిపోతాడు. తన ప్రవర్తనకు పశ్చాత్తాపపడిన సరోజ, వాడిని వెతుక్కుంటూ బయల్దేరడంతో కథ ముగుస్తుంది.
ప్రతి మనిషి జీవితంలో మరచిపోలేని కొన్ని సంఘటనలు, సన్నివేశాలు ఎదురవుతాయి. అందులో కొన్ని మధురస్మృతులుగా మిగిలిపోతాయి. మరికొన్నింటిని జీవన మార్గాన్ని నిర్దేశించిన సంఘటనలుగా మరిచిపోలేకపోతాం. అలా రచయిత చిన్నతనంలో జరిగిన ఒక సంఘటనను “చేసిన పాపం”గా తలచుకుంటారు. రచయిత చిన్నతనంలో అనగా పద్దెనిమిదేళ్ళ వయసులో బస్తీలో వున్న మామయ్య దగ్గర మెట్రిక్యులేషన్ చదువుతుండేవాడు. కొంతమంది రచయిత మిత్రులు కలిసి షావుకారు భద్రయ్య గారింట్లో ఒక గది అద్దెకు తీసుకుని వుండేవారు. షావుకారు కొడుకు చనిపోగా అతని విధవ కోడలు, భార్య ముగ్గురే ఆ ఇంట్లో వుండేవారు. యవ్వనప్రాయంలో వున్న షావుకారు కోడలు విధవలా కాకుండా ఎప్పుడూ అలంకరణలతో హుషారుగా వుండేది. చదివే అలవాటు వున్న రచయితతో స్నేహం కలవడం, అతను లైబ్రరీ నుండి పుస్తకాలు తెచ్చివ్వడం జరుగుతూ వుండేది. కుర్రాళ్ళతో అలా కలిసి వుండకూడదనీ, లోకులు చూస్తే బాగుండనీ షావుకారు కోడలిని హెచ్చరించడమే కాకుండా, రచయిత మామయ్య ఇంట్లో కూడా చెప్పి వస్తాడు. ఈ విషయం చెప్పి బాధపడిన కోడలిని రచయిత ఓదారుస్తాడు. కాని క్రమంగా ఆమె అలంకరణ, ఆమె తన పట్ల చూపే ప్రవర్తనను అతిగా ఊహించుకున్న రచయిత ఇంట్లో ఎవరూ లేని సమయంలో వెళ్ళి, కోడలుతో తన కోరికను వెళ్ళడిస్తాడు. ఆమె ఆగ్రహంతో విరుచుకుపడి, “నిన్ను తమ్ముడిగా భావించి నీతో స్నేహం చేసినందుకు, ఇంత నీచంగా ఆలోచిస్తావా” అని తిట్టి వెళ్ళగొడుతుంది. అమాయకుడైన తనను, ఆమెనే తన ప్రవర్తనతో లేనిపోని ఆశలు కల్పించిందని ఆలోచిస్తున్న రచయితకు, ఆమె నుండి ఉత్తరం వస్తుంది. అందులో తన ప్రవర్తన, మనస్తత్వాన్ని గురించి వివరించి అతనిలోని తప్పుడు ఆలోచనని ఖండిస్తుంది. చివరగా “నీవు నా వలెనే స్వేచ్ఛగా, ఆనందంగా, స్వతంత్ర్య వ్యక్తితాన్ని నిలబెట్టుకుని ప్రబలమవ్వాలని వుంది. ప్రపంచంలో బలహీనతలతో ఎన్నడూ బ్రతక్కూడదు తమ్ముడూ. లేకపోతే యంత్రాలమే అవుతాం” అని రాస్తుంది. ఆమెకు, ఆ ఊరికి దూరమైనా ఇప్పటికీ ఆమె రాసిన వుత్తరం రచయిత దగ్గర భద్రంగానే వుంది. ‘అక్క’ పేరితో గోలకొండ పత్రికలో 28-6-58 నాడు ప్రచురితమైన ఈ కథ ‘చేసిన పాపం’ పేరిట ఈ సంకలనంలో చేరింది.
‘లచ్చి నవ్వింది’ కథలో మిల్లు యంత్రంలో కాలు విరిగి మంచం పట్టిన నారాయణను పోషించడానికి అతని భార్య లక్ష్మి, యజమాని ఇంట్లో పనిమనిషిగా చేరుతుంది. భర్తని ఆరోగ్యవంతుడిగా చేయడానికి ఎంతో కష్టపడుతుంది. భర్తకి సీరియస్‌గా వుంటే, డాక్టరు డబ్బు లేందే లాభం లేదంటాడు. దాంతో యజమాని ఇంటికి వెళ్ళగా, ఇంట్లో అతని కొడుకు కొక్కడే ఉంటాడు. అంతకు ముందే ఆమె మీద కన్ను వేసిన వాడు ఆమెను లొంగదీసుకుని, పారిపోతాడు. వట్టి చేతులతో వచ్చిన లక్ష్మి కళ్ళ ముందే భర్త ప్రాణం విడుస్తాడు.
ఇందులో మొదటి కథ బాల్యంలో మనసుకి తాకిన శరాఘాతాన్ని వివరించగా, రెండవ కథ కౌమార ప్రాయంలో పొడసూపే యవ్వనోద్వేగాలను చిత్రీకరించింది. యవ్వనమదంతో ఒక అబల జీవితాన్ని నాశనం చేసిన మూడవ కథ శ్రమ దోపిడిని, లైంగిక దోపిడిని అన్యాపదేశంగా చిత్రీకరించింది.
పబ్బరాజు గోపాలరావు కథలు:
అవినీతిపరులు, స్వార్థపరులు అందలాలెక్కుతున్నారు. నీతి, న్యాయం అని పట్టుకు వేలాడేవాళ్ళంతా దారిద్ర్యంలో మగ్గిపోతున్నారని వగచే చిరుగ్యోగి గోపాల్ చాలీచాలని జీతంతో అతి కష్టంగా వెళ్ళదీస్తుంటాడు. అంతటి కష్టకాలంలో మధుసూదనం పనిచేసే డిపార్టుమెంటును ఎత్తివేయడంతో, తనే అతనికన్నా నయం అనుకోవడం ‘పరిస్థితుల ప్రభావం’ అనే చెప్పాలి. ‘పరిసరాలు’ కథలో సంవత్సరం తర్వాత రెండు రోజులు సెలవు పెట్టి మధు స్వగ్రామానికి బయలుదేరుతాడు. ఊరు, ఊరి పరిసరాలు, ఊరి మనుషుల ప్రేమలు-ఆప్యాయతలు ఒక వైపు; తమ ఇంటి సభ్యుల ప్రేమాభిమానాలు మరోవైపు. తన కుటుంబాన్నే అతి కష్టం మీద పోషించుకుంటున్న మధు ఇంట్లో వాళ్ళకు గానీ, ఊరికి గాని ఏమీ చేయలేని నిస్సహాయతలో తిరుగుముఖం పడతాడు.
రంగడు అనే ‘రిక్షావాలా’కు పొద్దుటి నుండి ఒక్క బాడుగ దొరక్క, తిండి లేక, సాయంత్రం దొరికిన అ ఒక్క బాడుగకు డబ్బులు దొరకగా పోగా, గిరాకితో చావు దెబ్బలు తినాల్సి వస్తుంది. జీవనాధారమైన రిక్షా విరుగుతుంది. సాయంత్రం కల్లా రిక్షాతో సహా కిరాయి పైకం ఇవ్వకపోతే సేట్‌జీ గుమాస్తాను పంపి పిలిపించుకుంటాడు. రిక్షా విరగ్గొట్టినందుకు యాభై రూపాయలు ఇవ్వాలనీ, అందుకుగాను రంగడికి వున్న ఆ ఒక్క పూరి గుడిసెను తాకట్టు పెట్టుకుంటాడు. రంగడు రాత్రింబవళ్ళు కష్టించాకా కిరాయి పోను, తనకు చెల్లెలుకు పొట్ట గడవడమే కష్టమైపోతుంది. నెల దాటుతుంది. ఒకరాత్రి రిక్షా ఎక్కిన ఒక వ్యాపారస్తుడు రిక్షాలో తన ముత్యాల సంచి మరచిపోతాడు. అది చూసిన రంగడు అతనికి ఎలా అందివ్వాలో తెలియక పత్రికాఫీసుకు పోయి ప్రకటన ఇస్తాడు. వ్యాపారి అది చూసి తన సంచి తీసుకుంటాడు. ఆ రిక్షావాడ్ని చూడబోయి, మొదట్లో తాను చితకబాదిన రిక్షావాడు అతనేనని గ్రహించి సిగ్గుపడతాడు. వ్యాపారస్తుడు వేయి రూపాయలు బహుమతిగా ఇచ్చి, రంగడిని తన భాగస్వామిగా చేర్చుకుంటాడు. దాంతో రంగడు వడ్డీతో సహా షావుకారుకు చెల్లించి తన గుడిసెను విడిపించుకుంటాడు. చెల్లికి మంచి సంబంధం కుదిర్చి పెళ్ళి చేస్తాడు. నీతి, నిజాయితీల వల్లనే మనిషి బాగుపడతాడని రచయిత ఈ కథ ద్వారా తెలియజేస్తాడు.
రెండేళ్ళ నుండి మధు ఎవరి కోసమో వెతుకుతూ పిచ్చివాడుగా మారిపోతాడు. సరియైన తిండి తిప్పలు లేక చిక్కిపోయి క్షయపీడితుడై ఆస్పత్రిలో చేరుతాడు. ఒకరోజు నైట్ డ్యూటీకి వచ్చిన కొత్త నర్సు శ్యామలను చూసి తన అన్వేషణ ఫలించిందని సంతోషపడతాడు. మధు శ్యామల ఇంటర్లో సహాధ్యాయులు. పరస్పరం ప్రేమించుకోవడంతో, అతడ్ని పెళ్లి చేసుకుంటానని శ్యామల తండ్రికి తెలియజేస్తుంది. తండ్రి నిరాకరించడంతో ఇంట్లోంచి వెళ్ళిపోయి, బొంబాయి చేరుకుని ఒక ఆస్పత్రిలో నర్సుగా చేరుతుంది. శ్యామల తండ్రి ఆస్తి పోగొట్టుకుని కుమార్తెను వెతుకుతూ బయలుదేరుతాడు. అతడికి ఫ్లూ వ్యాధి సోకగా ఆస్పత్రిలో చేరుతాడు. ఆసుపత్రిలో మధు, శ్యామలల సంభాషణ విని వాళ్లను గుర్తుపట్టడంతో అతని ‘అన్వేషణ’ కూడా ముగుస్తుంది.
’ఋణానుబంధం’ కథలో ఆసుపత్రిలో ఆడపిల్లను ప్రసవించిన అరుంధతి బలహీనతవల్ల చాలా రోజుల వరకు కోలుకోలేకపోతుంది. ప్రసవ సమయంలో తన మంచం పక్కన ఉన్న గొల్ల పడుచు కూడా ఆడపిల్లను ప్రసవించిందని, ఇరువురి పిల్లలను దూరంగా ఉయ్యాలలో ఉంచారని తెలుసుకుంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత తన కూతురు మారిపోయిందని అనుమానిస్తుంది. భర్త ఎంత నచ్చ చెప్పినా వినిపించుకోదు. మూడేళ్ల తర్వాత ఆ పాప డబుల్ టైఫాయిడ్ వచ్చి ఎంతో బాధపడి కన్నుమూస్తుంది. ఆ వియోగాన్ని తట్టుకోలేక మంచం ఎక్కిన అరుంధతిని ‘నీ కూతురు కాదన్న దానివి మరి ఇంత దిగులు ఎందుక’ని భర్త ప్రశ్నిస్తే ‘అనుమానించాను కానీ అది నా కూతురే. అందుకే ఈ దుఃఖం, ఋణానుబంధం తీరిపోయింద’ని ఏడుస్తుంది.
బస్తీలో కాపురం చాలీచాలని జీతం, సాగరంలా పరిణమించిన సంసారం, ముప్పయి సంవత్సరాలు కష్టించినా అంగుళం మేర మారని జీవిత గమనం గోపాలంను కలవరపరుస్తాయి. కథల పేరిట రాసే రాతలకు అనవసర ఖర్చు అని భార్య తిట్టిపోస్తుంది. అంతలో ఒక ప్రముఖ కథారచయిత దుర్భర దారిద్ర్యంలో కన్నుమూసిన వార్త విని రచయితలకు కూడా బ్రతికే మార్గం లేదనే గోపాలం ఆవేదన ‘కన్నీటి చుక్కలు’గా బయట పడుతుంది.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్లో కలపక నిజాం స్వాతంత్ర్యం ప్రకటించుకుంటాడు. దేశ ఐక్యత కోసం ప్రజాస్వామ్యం కోసం పోరాడే వారినందరిని అణచివేసే క్రమంలో సైన్యాన్ని దింపుతాడు. సంక్రాంతి రోజుల్లో జొన్నచేల్లో పిట్టలను తరిమివేస్తున్న మంగమ్మ విసిరిన రాయి ఆ ఊరిని చుట్టుముట్టబోతున్న సైనికులలో ఒకడికి తగులుతుంది. దాంతో వారు అది తమ మీద జరిగే దాడిగా భావించి ముందుకు రావడంతో తప్పించుకోవడానికి గత్యంతరం లేక వడిసెలతో రాళ్లు రువ్వుతునే మంగమ్మ తుపాకి గుండుకు చనిపోతుంది. ఇప్పటికీ ఆ జొన్నచేల్లో ఎవరూ లేకున్నా, పిట్టల్ని అదిలించే ‘మానవ కంఠధ్వని’, బరబరా తిరుగుతున్న వడిసెల ధ్వని వినిపిస్తూనే ఉంటుంది. అది వీరస్వర్గం అలంకరించిన మంగమ్మ చప్పుడే అని అక్కడి ప్రజలు నమ్ముతుంటారు. జానపదుల నమ్మకాలు, విశ్వాసాల ఆధారంగా ఈ కథ రూపొందింది. 1946 నాటి తెలంగాణను దృష్టిలో ఉంచుకొని రచయిత 1968లో రాసిన ఈ కథ విశాలాంధ్ర దినపత్రికలో 5.5.2002 నాడు ప్రచురింపబడింది. మీరు రాసిన ‘పరిస్థితుల ప్రభావం’ కథ 11 సెప్టెంబరు 1955 గోలకొండ పత్రికలో వచ్చింది. మిగతా ఐదు కథలు ‘లచ్చి నవ్వింది’ సంకలనంలో ఉన్నాయి.
ఆదర్శవాదం, సంస్కరణాభిలాష, బడుగు జీవుల ఆకలి ఆక్రందనలు, నిరుద్యోగుల జీవన పోరాటం ఈ జంట రచయితల కథల్లో కనిపిస్తాయి. వస్తువు ఒకటే అయినప్పటికీ వీటిని కథలుగా మలచడంలో ఇరువురు వేర్వేరు మార్గాలను అనుసరించారు. పబ్బరాజు గోపాలరావు గారు ఒకే వస్తువు యొక్క రెండు అంశాలను తీసుకొని కథా రచనకు ఉపక్రమించారు, కానీ కథలో ఆ రెండిటికీ సమన్వయం కుదర్చలేక చతికిలబడతారు. వీరి కథలలో వస్త్వైక్యం పూర్తిగా లోపించింది. మీరు 1955లో రాసిన మొదటి కథ ‘పరిస్థితుల ప్రభావం’తో మొదలుకొని 2002లో రాసిన ‘మానవ కంఠధ్వని’ వరకు అన్ని కథలలో అన్వయరాహిత్యం గందరగోళం కనబడుతుంది. వీరికంటే కొలిపాక మధుసూదనరావు గారి కథలు మరింత గాఢతను, చిక్కదనాన్ని పఠనీయతను కలిగి ఉన్నాయనే చెప్పాలి. పరస్పర విభిన్న శైలీ రీతులు కలిగిన వీరిరువురు కలిసి రాసిన పెద్ద కథ ‘మోగిన గంట’ను చూద్దాం.
కొలిపాక మధుసూదనరావుగారు 1959లో రాసిన ‘తెగిపోయిన గాలిపటం’ కథకు కొనసాగింపుగా పబ్బరాజు గోపాలరావు గారితో కలిసి ‘మోగిన గంట’ అనే కథను రాశారు. ఇందులో పిల్లల మధ్య పోట్లాటలో ఒకడు ‘తండ్రికి పుట్టని వెధవ’ అని సూర్యపతిని తిట్టడంతో సున్నితమనస్కుడైన సూర్యపతి తట్టుకోలేకపోతాడు. తనని ఎంతో ప్రేమగా చూసే అమ్మ తనను మోసం చేసిందనీ, ఈ నాన్న తన నాన్న కాదనే విషయాన్ని జీర్ణించుకోలేక పోతాడు. తనను ఎంతో ప్రేమగా చూసే సరోజక్క దగ్గర సాంత్వన పొందుదామని వెళ్లేసరికి ఆమె పై చదువుల కోసం బస్తీకి వెళ్లిందని తెలుస్తుంది. సూర్యపతిని థర్డ్ ఫారం చదవడం కోసం తండ్రి, ఏలూరులో ఉన్న మేనమామ ఇంట్లో దించుతాడు. ఒక రాత్రి మేనమామ ఇంట్లోంచి వెళుతున్న స్త్రీని వెంబడించి ఆమె సరోజక్క అనీ, ఆమె వ్యభిచారిణిగా మారిందని తెలుసుకుని భరించలేకపోతాడు. జీవితం మీద విరక్తి పుట్టి వీళ్ళందరికీ దూరంగా వెళ్లిపోవాలని కదులుతున్న రైల్లోకి ఎక్కేస్తాడు. సికింద్రాబాద్‌లో దిగిన సూర్యపతి ఆ జన సందోహాన్నీ, ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉండగా బూట్ పాలిష్ చేసే రాజు ఇస్తాడు. మురికివాడలో వాళ్ళ ఇంటిని వాళ్ళ పరిస్థితులను, తనను ఆప్యాయంగా ఆదరించిన రాజు అక్క భారతి పట్ల అభిమానాన్ని పెంచుకుంటాడు. ఒకరోజు రోడ్డు పక్కన ఆడుతున్న మూడుముక్కలాట గుంపును పోలీసులు చెదరగొడతారు. ఆ గుంపులో ఉన్న సూర్యపతి పోలీసులకు చిక్కకుండా పారిపోతూ సరళ అనే అమ్మాయి చెంత దాక్కుంటాడు. ఆమె సూర్యపతికి ధైర్యం చెప్పి ఆదరిస్తుంది. తాము నడిపే బాలల శరణాలయంలో చేర్చుకుంటుంది. బొమ్మలు నేర్చుకోవడంలో ఆసక్తి ఉందని గ్రహించి చిత్రలేఖన విభాగంలో చేర్చుకుంటుంది. అక్కడ సరోజ తాను సోదరుడిగా ఎంతో అభిమానించే సూర్యపతి తిరస్కారానికి కలత చెంది తన పాత జీవితానికి వీడ్కోలు చెప్పి సూర్యపతిని వెతుక్కుంటూ సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఉద్యోగ ప్రయత్నంలో సరోజ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుగా చేరి సేవ అంకితభావంతో పని చేస్తూ అందరి అభిమానాన్ని చూరగొంటుంది. ఆమె అంకితభావాన్ని గుర్తించి గౌరవించే డాక్టర్ రాధాకృష్ణ, అతని చెల్లెలు సరళ ఆహ్వానం మేరకు బాలల శరణాలయానికి హెల్త్ ఇన్‌స్పెక్షన్‌కి వెళుతుంది. అక్కడ ఆమెను గుర్తు పట్టిన సూర్యపతి ఆమెకు ఎదురుపడకుండా జాగ్రత్తపడతాడు. సూర్యపతి ఇప్పుడు అమాయకుడైన కుర్రవాడే కాకుండా అభివృద్ధిలోకి రానున్న ఒక చిత్రకారుడని రాజు, భారతి గుర్తిస్తారు. సరళ తమ శరణాలయంలో ఒక అపురూప బాల చిత్రకారుడు ఉన్నాడని చెప్పిన వివరాలను బట్టి అతడు సూర్యపతి అని గ్రహిస్తుంది. అతడిని వెతుక్కుంటూ వచ్చిన సరోజ తాను మారిపోయానని కొత్త జీవితం గడుపుతున్నానని చెప్పినా సూర్యపతి ఆమెను క్షమించలేకపోతాడు. తనను రక్షించమని బుద్ధుని చిత్రం ముందు మోకరిల్లిన సూర్యపతిని, అతని వెనకే సరోజని చూపిస్తూ ఈ నవల ముగుస్తుంది.
ఇందులో కథానాయకుడు సూర్యపతి పదేండ్ల బాలుడు. అయినా వాడు తన వయసుకు మించి ఆలోచించడం, వాడి ప్రవర్తన అంతా వింతగా ఉంటాయి. మొదటి భర్త చనిపోగా, రెండవ భర్తకు కలిగిన సూర్యపతి, ఏడవ నెలలోనే పుట్టడం వల్ల ఆ ఊర్లో ఉన్న అమ్మలక్కలు మొదటి భర్త కొడుకు అని గుసగుసలాడుకోవడం ఉంది. అది నిజం కాదు, ఇప్పుడున్నతనే నీ తండ్రి అని సరోజ చెప్పిన వినిపించుకోడు. అకారణంగా తల్లిదండ్రుల పట్ల ద్వేషాన్ని పెంచుకుంటాడు. చిన్న వయసులోనే పేకాట వంటి వ్యసనాలు అలవర్చుకున్న సూర్యపతి ఇతరుల పవిత్రత గురించి అంత చిన్న వయసులో అతిగా ఆలోచించి, ఇలు విడిచి రావడం అసంబద్ధంగా వుంది. సూర్యపతి ఆలోచనలు, భావాలు అన్నీ పెద్దవాళ్ళవే. చివరకు “మా నాన్న ఎవరన్న సందేహం తీర్చుకోబోతే ఆ సందేహం దూరం చేస్తుందనుకున్న సరోజ మరో కొత్త సమస్యను రేకొల్పింది. ఏమిటీ సమస్యలు? ఎందుకీ సందేహాలు? అసలు ఎవరికీ లేని అనుమానం నాకు మాత్రం ఎందుకు? ఆలోచించినంత వరకు ఈ లోకమంతా సమస్యలే. భగవాన్! ఈ మాయాజాలం నుంచి నన్ను రక్షించు” అని చిత్రపటం ముందు సాగిలబడడంతో ఈ పెద్ద కథ ముగుస్తుంది. అవాస్తవికత అతి నాటకీయత కలగలిసిన ఈ పెద్ద కథ ఇప్పటికీ ఆసక్తిగా చదివిన చేయడం విశేషం. ఈ పెద్దకథను నవల మాదిరిగా విడిగా పుస్తకం వేయడం, అది పాఠకాదరణ పొందడం కూడా జరిగిపోయింది.
(తాటికొండాల నరసింహారావుగారికి కృతజ్ఞతలతో)